జ్ఞాపకాల పందిరి-56

43
3

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నమ్మకం అలాంటిది..!!

[dropcap]న[/dropcap]మ్మకం అనేది మనిషి జీవితంలో మహా గొప్ప అంశం. ఇది నమ్మేవారి మీద, నమ్మకం వుంచుకున్నవారిమీద ఆధారపడి ఉంటుంది. సహాయం చేసేటప్పుడు, సహాయం పొందేటప్పుడు ఈ ‘నమ్మకం’ అనే పదానికి గొప్ప విలువ, అర్థం కనిపిస్తాయి. కొందరు, ఎదుటివారు ఎలాంటి వారైనా వారిని నమ్మడానికి తటపటాయిస్తుంటారు. ఓ పట్టాన నమ్మరు. ప్రతి చిన్న విషయమూ వీరికి అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ నమ్మకపోవడం అనేది చాలా పెద్ద సమస్యే! ఏ కొద్దీ విషయాల్లోగానీ, వీరు జీవితంలో విజయాలను సాధించలేరు.

అలాగే నమ్మడం, గుడ్డిగా నమ్మడం అనేవి కూడా ఒక్కోసారి వ్యతిరేక ఫలితాలు ఇవ్వవచ్చు. కానీ, ఒక పని గురించి, దానికి సంబంధించిన వ్యక్తిని సహాయం అర్థించబోయినప్పుడు, తప్పక ఆ వ్యక్తిని నమ్మకంతో నమ్మక తప్పదు. నమ్మకం వున్నప్పుడే రంగంలోనికి దిగాలి. మనం ఎన్నుకునే వ్యక్తి కూడా నమ్మదగ్గ వ్యక్తి అయినప్పుడే మనం ముందుకు అడుగులు వెయ్యాలి. ఇలా నమ్మకాన్ని వమ్ము చేసేవారు బహు తక్కువ. తెలియని వ్యక్తుల విషయంలో, ఒక అంచనాకు రావడం కష్టమే!

అయితే, నమ్మిన వారు అంతా మోసపోకుండా ఉంటున్నారా? అంటే దానికి కూడా అవును అని చెప్పలేము. అందుచేత మనిషిని నమ్మడం అనేది మామూలు విషయం కాదు. కొందరు, ఎవరెన్ని చెప్పినా, తాము నమ్మకం పెట్టుకున్న వ్యక్తులను నూటికి నూరుశాతం నమ్ముతారు. వారి సూచనలే పాటిస్తారు. వారు చెప్పినట్టే వింటారు. తమను నమ్మిన వారిని మోసం చేయడం అనేది బహు తక్కువ, అసలు ఉండకపోవచ్చు కూడా! ఇలాంటి అనుభవం ఒకటి ముఖ్యమైన జ్ఞాపకంగా నా మదిలో ఎప్పుడు మెదులుతూనే ఉంటుంది. అది ఇక్కడ ప్రస్తావించడం సమంజసమే అని నా నమ్మకం.

నేను 1982లో, ప్రభుత్వ ఉద్యోగిగా మొదటి పాదం అప్పట్లో వరంగల్ జిల్లాలోని, తాలూకా కేంద్రం అయిన మహబూబాబాద్ (ఇప్పుడు ఇది జిల్లా అయింది)లో పెట్టాను. పూర్తిగా కొత్త మనుష్యులు, కొత్త వాతావరణం. అక్కడికి తగ్గట్టుగా నా జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. స్థానికులతో ఒక్కొక్కరితో పరిచయాలు ఏర్పడుతున్నాయి. స్థానిక ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వైద్యమిత్రుల పరిచయాలు, పత్రికా ప్రతినిధులూ, లాయర్లూ, ఇలా నా అవసరాన్ని బట్టి, వారికి నా అవసరాన్ని బట్టి, ఒక్కొక్కరితో పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఇదే వరుసలో నా సామాజిక వర్గానికి చెందిన దాసరి రాములు నన్ను వెతుక్కుంటూ వచ్చి పరిచయం చేసుకున్నాడు. నేను మహబూబాబాద్‌లో ఉన్నంత కాలం, అతను నాకు ఎంతో సహాయకారిగా ఉండేవాడు. విద్యారంగానికి సంబంధించి, చంద్రయ్య గారు, నారాయణ, చంద్రదేవ్ వంటి వారు, వ్యాపారస్తులకు సంబంధించి ఎం. నాగేశ్వర రావు (నాగేంద్ర – బుక్స్), టైపిస్ట్ రవీందర్, లాయర్ గోపాలరావు, చలపతిరావు, కేశవరావు గారు, సూర్యనారాయణ వంటివారు దగ్గరైనారు.

ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమైన వ్యక్తి, స్వాతంత్ర సమర యోధులు, తులారాం ప్రాజెక్టు కోసం ఉద్యమం చేసిన మహానుభావుడు, శ్రీ బి. ఎన్. గుప్తా గారు ఒకరోజు వచ్చి తన్ను తాను పరిచయం చేసుకున్నారు. ఆయన్ను చూస్తే నిజమైన అసలు సిసలు స్వాతంత్ర సమరయోధుడు అనిపిస్తుంది. ఆయనకు మొత్తం పళ్ళు లేనందువల్ల, కట్టుడు పళ్ళు కట్టించుకుని అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి వచ్చారు. ఆయన దవడల పరిస్థితి అప్పటికే అనుకూలంగా లేకపోవడం వల్ల, ఆయనకు పళ్ళు కట్టే అదృష్టం నాకు దక్కలేదు. అలా అని ఆయన నా దగ్గరకు రావడం మానలేదు. తరచుగా వచ్చి నా దగ్గర కాసేపు కూర్చుని, అదీ ఇదీ మాట్లాడి వెళుతుండేవారు. అలా, నా మీద ఆయనకు, ఆయన మీద నాకు మంచి గురి ఏర్పడింది. నన్ను చాలా బాగా గౌరవించేవారు. ఒకసారి ఆయన పుట్టిన రోజుకు, మరో స్వాతంత్ర్య సమరయోధులు, మొదటి అధికారభాషా సంఘం చైర్మన్, సత్తెనపల్లికి ప్రాతినిధ్యం వహించిన పెద్దలు స్వర్గీయ వావిలాల గోపాలకృష్ణయ్య గారు వచ్చినప్పుడు, నన్ను కూడా ప్రత్యేకంగా ఆ కార్యక్రమానికి ఆహ్వానించిన సహృదయులు శ్రీ గుప్తా గారు. గుప్తాగారికి, ప్రాంతీయంగా అన్ని వర్గాల ప్రజలనుండి మంచి గౌరవ మర్యాదలు లభించేవి. ప్రజల కోసం -ప్రజల మనిషిగా ఆయనకు మంచి గుర్తింపు ఉండేది.

స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ బి.ఎన్.గుప్త గారు, మహబూబాబాద్.

ఒక రోజు నేను ఆసుపత్రిలో డ్యూటీలో వుండగా, శ్రీ బి. ఎన్. గుప్తా గారు వారి రెండవ కుమారుడు, అడ్వకేట్ శ్రీ రవీంద్రగుప్తా, మనుమడు చి. అనీల్ గుప్తా కట్టకట్టుకుని నా దగ్గరకు వచ్చారు. దంత వైద్యం కోసం వచ్చారేమో అనుకున్నాను. తరువాత వారి సంభాషణలను బట్టి విషయం అదికాదని తేలిపోయింది. పిల్లలు – చదువులు అన్న విషయం చర్చకు వచ్చింది.

ఉన్నట్టుండి, శ్రీ గుప్తా గారు, మనవడిని అనీల్ గుప్తాను పరిచయం చేస్తూ “డాక్టర్ గారూ.. వీడు నా మనవడు. వీడు ఈ సంవత్సరం ఇంటర్మీడియెట్ పాసై, ఎంసెట్ రాసాడు. వీడిని డాక్టర్ చేయాలన్నది మా కోరిక” అన్నారు.

“సంతోషం సార్.. తప్పకుండా చేయండి” అన్నాను.

“ఎంట్రన్స్‌లో సీటు వస్తుందని, వీడికీ మాకూ కూడా నమ్మకం లేదు” అన్నారు, నవ్వుతూ.

“అదేంటి అలా అంటున్నారు” అన్నాను, ఆశ్చర్యంగా.

“ఉన్నమాట అంటున్నాను డాక్టర్ గారూ! అంత మంచి రాంక్ మావాడికి వచ్చే అవకాశం లేదు. కానీ వాడిని డాక్టర్ చేయాలి. ప్రైవేట్ కాలేజీలో చదివిద్దాం అనుకుంటున్నాము. అందుకే మీ సలహా కోసం వచ్చాము” అన్నారు.

“నేనేమి సలహా ఇవ్వగలను సర్?” అన్నాను, నవ్వుతూ.

“ఇవ్వగలరు.. మీమీద మాకు అంత నమ్మకం వుంది,అందుకే వచ్చాము, మీ సలహా తూ.చ. తప్పకుండా పాటిస్తాం” అన్నారు.

నా మీద అంత నమ్మకం పెట్టుకుని వచ్చిన వారిని నిరుత్సాహ పరచడం సబబు కానేకాదు, అందుచేత, ఎం.బి.బి.ఎస్. గురించి, అది ఎన్ని సంవత్సరాలు చదవాలి, అందులోని సాధక బాధకాలు, సమాజంలో వారికి, లభించే గౌరవం, ప్రజానీకానికి సేవచేసే అదృష్టం వంటి విషయాలు చాలా విపులంగా చెప్పాను. అలాగే డెంటల్ (బి.డి.ఎస్) గురించి కూడా విశదీకరించి చెప్పాను.

“మరి ఏ కోర్సు చేయించమంటారు?” అని అడిగారు పెద్దలు గుప్తా గారు.

“ఏదైనా ఫరవాలేదు. మీ ఇష్టం, అబ్బాయి అభిరుచి” అన్నాను.

“మేము నిర్ణయం చేసుకోలేకనేకదా, మీ దగ్గరకి వచ్చాము. మీరే ఫైనల్ చేయండి” అన్నారు.

“అయితే బి.డి.ఎస్. చేయించండి. జీవితంలో త్వరగా స్థిరపడతాడు, ప్రస్తుతం, పి.జి. చేయకపోయినా, డెంటల్‌కు మంచి అవకాశాలు వున్నాయి, తనకు ఓపిక ఉంటే తర్వాత ఉన్నత చదువులకు వెళతాడు” అని చెప్పాను. నా సలహా వారికి నచ్చింది. నా వివరణకు వాళ్ళు ముగ్గురూ చాలా సంతోషించారు.

“చాలా ధన్యవాదాలు డాక్టరు గారు” అని చెప్పి వెళ్లిపోయారు.

నేను చెప్పినట్టుగానే, నా సలహా తూ.చ. తప్పకుండా పాటించారు. అనీల్ గుప్తా, చెన్నైలో ఒక దంత వైద్య కళాశాలలో సీటు సంపాదించాడు. కాలం గిర్రున తిరిగి, అనీల్ గుప్తా కాస్తా, డా. అనీల్ గుప్తా అయ్యాడు. అతను బి.డి.ఎస్. పూర్తి చేసుకుని వచ్చి, నన్ను కలుసుకుని, నాకు పాదాభివందనం చేయడం నేను ఎప్పటికీ మరచిపోలేను. నిజానికి ఇవి నాకు ఇష్టం ఉండదు,కానీ అనీల్ తృప్తి కోసం ఏమీ అనలేక పోయాను.

డా.అనీల్ గుప్త. భువనగిరి, మహబూబాబాద్.

ఆ కుటుంభం ఇప్పటికీ నాతో కృతజ్ఞతా భావంతో మెలగడం వారి ప్రత్యేక వ్యక్తిత్వానికి నిదర్శనం. అనీల్ చదువు పూర్తి చేసుకుని మహబూబాబాద్ చేరుకునేసరికి, నాకు జనగాం బదిలీ అయింది. అప్పుడు నా క్లినిక్ కన్యకా పరమేశ్వరీ కాంప్లెక్స్‌లో ఉండేది. తర్వాత డా. అనీల్ అందులో క్లినిక్ పెట్టి నన్ను ఆహ్వానించి, నా చేత ప్రారంభం చేయించడం నా మీద వారికున్న అభిమానానికి తార్కాణం. స్థానిక వైద్యుడు కాబట్టి చాలా తొందరగానే క్లినిక్ క్లిక్ అయింది.

డాక్టర్. అనీల్ గుప్త అత్యాధునిక దంత వైద్యశాల, మహబూబాబాద్.
కుటుంబ సమేతంగా రచయితను సన్మానిస్తున్న డా. అనీల్ గుప్త

కొన్ని సంవత్సరాల తర్వాత డా. అనీల్ గుప్తా, ఎవరూ ఊహించని రీతిలో క్లినిక్ స్వంతంగా కట్టుకుని మంచి సేవలు అందించడమే కాదు, ‘గ్రహణం –మొర్రె’ వంటి సమస్యలకు పిల్లలకు ఉచిత వైద్యం (శస్త్ర చికిత్సలు) చేయించడం ద్వారా మంచి పేరు తెచ్చుకుని, వార్తల్లో వ్యక్తి అయినాడు. మహబూబాబాద్ ప్రముఖుల్లో ఒకడిగా కీర్తింపబడుతున్నాడు. ఇది నేను మరచిపోలేని అనుభవం.

ఆసుపత్రి సిబ్బంది సమక్షంలో…

నమ్మకం మీద నమ్మకం కుదిరితే ఎలా ఉంటుందో అర్థమైన సంఘటన. ఈ రోజున బి. ఎన్. గుప్తా గారు లేరు, కానీ ఆయన మనవడికి చూపించిన మార్గం చిరస్థాయిగా నిలిచిపోతుంది. డా. అనీల్ గుప్తా అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళల్లో నేనూ ఒకడిని! అతను సంపాదనతో పాటు, ప్రజాసేవలో మరింత చురుగ్గా పోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here