[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా చౌడేపల్లి లోని మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం గురించి, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం, చౌడేపల్లి
ఈ ఆలయం పుంగనూరు నుండి 15 కి.మీ.ల దూరంలో వున్నది. పూర్వం ఈ గ్రామానికి చిక్కరాయపురమని, చౌడపురి అని పేర్లు వుండేవి. ఆలయం 120 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవు గల్గిన విశాలమైన ప్రహరీ లోపల నిర్మించబడింది. ఆలయంలో అభీష్టద మృత్యుంజయేశ్వర, ప్రసన్న పార్వతీదేవి పూజలందుకుంటున్నారు.
ఈ ఆలయం ప్రహరీ సుమారు 18 అడుగుల ఎత్తు వుంటుంది. ప్రహరీ గోడ పది అడుగుల ఎత్తు వరకు భారీ శిలతో నిర్మితమై ఆ పై భాగము సున్నముతో కట్టబడి అనేక దేవతల, వారి వాహనముల రూపములు జీవమున్నవా అన్నంత అందంగా చెక్కారు. ప్రహరీ గోడ మూలలందు పై భాగమున 15 అడుగుల ఎత్తు కలశములో నారికేళ, పుష్ప, తాంబూలాదులున్నట్లుగానూ, వాటి కిరువైపులా నంది ప్రతిమలు చెక్కబడివి. ఉపాలయముల శిఖర భాగమున ఇరువైపుల గంగాదేవి శిరస్సుల శిల్పాలు చెక్కారు.
ఇంకా ఈ ప్రహరీకి నాలుగు వైపులా కుడ్య శిల్పములు, దేవతలు, ఈశ్వర లింగము చెక్కబడినవి. ప్రహరీ సుమారు 18 అడుగుల ఎత్తు వుంది. అంతే ఎత్తున ఉత్తర, దక్షిణ, పడమర దిక్కులందు మధ్య భాగములందు ఉపాలయములు నిర్మించి వీరభద్ర, భద్రకాళి, నవ గ్రహాలయములు, సుబ్రహ్మణ్యస్వామి, కళ్యాణమండపము అద్భుతముగా నిర్మించారు.
ప్రధాన ఆలయమునకెదురుగా నాలుగు కాళ్ళ మండపంలో నందీశ్వర ప్రతిమ వున్నది. ఆలయ గోపురం చక్కటి చిత్రకళా నిర్మాణంతో వున్నది. గాలిగోపురం సుమారు 100 అడుగుల ఎత్తు, ధ్వజ స్తంభం 60 అడుగుల ఎత్తుకు పైగా భారీ శిలతో మలచబడి వుంది. ఆలయమంతా రాతి బండలు పరచి వుంది. ఆలయ నిర్మాణమే ఒక అద్భుత రీతిలో జరిగి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయాన్ని దర్శించి శివునికి మొక్కితే తమ అభీష్టం నెరవేరుతుందని భక్తుల నమ్మిక.
స్ధల పురాణం
ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయానికి విశిష్టమైన చరిత్ర వుంది. 17వ శతాబ్దంలో రాచరికపు వ్యవస్ధ కనుమరుగవుతూ భూస్వామ్య వ్యవస్ధ వేళ్ళూనుకోవడంతోబాటు, ఆంగ్లేయులు భారత దేశంలో బలపడుతున్న రోజులవి. పుంగనూరు ప్రాంతానికి జమీందారు ఇమ్మడి చిక్కరాయలు. ఈయనకు వేసవి విడిది ఆవులపల్లి, దుర్గాల అడవులు. ఒకనాటి రాత్రి దుర్గాల విడిదిలో వుండగా రాయలవారి కలలో పరమశివుడు ప్రత్యక్షమై, “నాయనా, నీ విడిది భవనానికి సమీపంలో వున్న కొలనులో నా విగ్రహాలు వున్నాయి. వాటిని వెలికి తీయించి ఆలయం నిర్మించు” అని ఆనతిచ్చి అదృశ్యమయ్యాడు. ప్రొద్దున్న రాయలు ఆ విగ్రహాలు తీయించి తన రాజధాని, పుంగనూరుకు బయలు దేరాడు. సాయంకాలమయ్యేసరికి రాయలవారి ప్రయాణానికి అంతరాయం ఏర్పడి అర్ధాంతరంగా ఒక చోట బస చేశారు. ఆనుక్షణం శివుడి మీద ఆలోచనల్తో మునిగి పోయిన చిక్కరాయలకు రాత్రి మళ్ళీ శివుడు దర్శనమిచ్చాడు. నువ్వు ప్రయాణం ఆపిన స్ధలమే బాగుంది. నాకిక్కడే శాశ్వతమయిన ఆలయం నిర్మించు అని ఆజ్ఞ జారీ చేశాడు. దిగ్గుమని పైకి లేచిన చిక్కరాయలు చుట్టూ తేరిపార చూశాడు. చుట్టూ చెట్లు, గుట్టలు, చౌడు భూమితో ఆ ప్రాంతం నివాస యోగ్యంగా కనిపించలేదు. కానీ ప్రభు ఆనతి జవదాటలేనిది. శివ లింగము, విగ్రహాలు దించిన చోటే ఆలయ నిర్మాణానికి పునాదులు తవ్వించాడు. వేలాదిమంది కూలీలను, శిల్పులను రప్పించి ఆలయ నిర్మాణం మొదలు పెట్టించాడు. ఇదంతా జరిగింది క్రీ.శ. 1753 సంవత్సరంలో అంటారు.
ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో చిక్కరాయలుకి ఒక విచిత్రమయమన జబ్బు చేసింది. ఎందరో వైద్యులు పరీక్షించి ఎన్నో చికిత్సలు చేశారు. కానీ నెమ్మదించలేదు. ఈశ్వరుడి ఆలయం పూర్తయ్యేవరకైనా తాను బతుకుతానని అనుకోలేదు. స్వామివారిని స్మరించి, స్వామీ ఆలయ నిర్మాణం పూర్తయ్యేంత వరకైనా నా దేహంలో ప్రాణాలు నిలుపు అని వేడుకున్నాడు. అప్పటినుంచి జమీందారు ద్విగుణీకరించిన ఉత్సాహంతో ఆలయ నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించసాగాడు. గర్భగుడి ముందు నిలపడానికి అరవై అడుగుల ఎత్తయిన ధ్వజస్తంభం మలిచారు. కాని మహాన్నతమైన ఈ స్తంభాన్ని నిలపగలగిన ప్రజ్ఞ ఎవ్వరికీ లేకపోయింది. మానవ శక్తి సామర్ధ్యాలు ఆ దైవ కార్యాన్ని నెరవేర్చలేక పోయాయి. వందలాదిమంది పట్టి పైకెత్తినా ధ్వజస్తంభం లేవలేదు. ఏనుగుల ద్వారా ప్రయత్నించారు. కానీ అది అసాధ్యమయింది. రోజులు, వారాలు గడిచాయి. చిక్కరాయల మనోభీష్టం నెరవేరలేదు. తనకు అసాధ్యమయిన పనిన ఆదేశించి తనను చేతగానివాడిగా శివుడు చేశాడని చింతా క్రాంతుడయిన చిక్కరాయలు తన సంస్ధానానికి తిరిగి పోసాగాడు. ఆలయంనుండి కొంత దూరం వెళ్ళేసరికి రాయలకు ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు రాయల్ని ఆపి దొరా, అటు చూడు.. అని ధ్వజస్తంభం విషయం అతనికి చెప్పాడు. తిరిగి చూసిన జమీందారుకు అర్ధమయింది. శివుడే స్వయంగా తన ధ్వజస్తంభాన్ని తానే నిలబెట్టుకుని ఆ సంగతి బ్రాహ్మణుని రూపంలో చెప్పిపోయాడని. బ్రాహ్మణుడు కనిపించిన చోట గుడికి కిలో మీటరు దూరాన చిక్కరాయలు నాలుగ్గాళ్ళ మండపం నిర్మించి ఒక కొలను తవ్వించారు. ఆలయం పూర్తయింది. రాయల మనోభీష్టం నెరవేరింది. చిక్కరాయలుకి మధ్యలో ఆసన్నమయిన మృత్యువు స్వామి అనుగ్రహంతో దూరమైంది. ప్రతిష్ఠ గావించిన శివుడు శ్రీమదభీష్ట మృత్యుంజయేశ్వరుడయ్యాడు.
ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుగారు తన అవసాన దశలో ఇక్కడికి వచ్చి వారం రోజులు వుండి మృంత్యుంజయేశ్వరుని పూజించి, అనేక కానుకలిచ్చి వెళ్ళారుట.
ఈ ఆలయం పూజారిగారు శ్రీ రాజాస్వామి సెల్ నెంబరు 08581256357.
శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, చౌడేపల్లి
మృంత్యుంజయేశ్వరాలయానికి చాలా కొద్ది దూరంలో వున్నది ఈ ఆలయం. దీని నిర్మాతలు ఏకిల దొరలు అని చెబుతారు. విశాలమైన ప్రాంగణంలో వున్న ఈ ఆలయం అసంపూర్తిగానే వుంది. గాలి గోపురం అత్యంత సుందరంగా నిర్మింపబడినా, అసంపూర్తిగా వున్నది. ముస్లిముల దండయాత్రలో భయపడి పోయిన శిల్పులు సమీపంలోని రఘుపతినాయుని గుట్టలో శిల్పములు చెక్కుతూ పారిపోవటంవల్ల ఆ పని అసంపూర్తిగా వదిలివేయబడిందని కొందరంటే, హైదరాలీ దండయాత్రలో కూల్చబడిందని తాళపత్రంలో వున్నదని కొందరు చెబుతారు.
ప్రధాన ఆలయం ముఖమంటపము 16 స్తంభాలపై అత్యంత రమణీయంగా నిర్మించారు. శిల్పులు ప్రతి స్తంభాన్ని నాలుగు దిక్కుల్ని నాలుగేసి సమభాగములు చేసి 16 భాగములుగా రూపొందించి 16 శిల్ప చిత్రములు చెక్కి చూపరులను అబ్బురపరిచారు. మధ్యలో 6 కప్ప స్తంభాలను రెండేసి స్తంభాలుగా అంటే ప్రధాన స్తంభంలో మధ్యలో పిల్ల స్తంభం చెక్కిన తీరు అమోఘమైనది. గర్భగుడి 20 అడుగుల వెడల్పు అంతే పొడవు గల్గి గొప్పరాజ గోపురం నిర్మించారు. వేణుగోపాలస్వామి ఇక్కడి ప్రధాన దైవము. ఆవరణలో నైరుతి భాగాన నాంచారమ్మ ఆలయం వుంది. పూజలు లేవు. ఇవి శిథిలాలయాలు.
(శ్రీ బత్తనపల్లి మునిరత్నం రెడ్డి గారి కౌండిన్య క్షేత్రాలు ఆధారంగా)
చిన్న ఊరు అవటంవల్ల మంచి హోటల్ సదుపాయం లేదు. కనబడ్డ ఒక డిక్కీ హోటల్‌లో భోజనం చేసి అక్కడనుండి బయల్దేరాము.