జీవన వంచితులు

0
3

[dropcap]ఆ[/dropcap] రోజు ఆదివారం, భగ-భగ మండే ఎండన
నగరంలో ఓ కూడలి దగ్గర టీ కొట్టు పక్కన
మూసివున్న దుఖానాల మెట్లపై
దిగాలుగా కాదు దీనంగా కూడా కాదు
బక్క పల్చటి శరీరం – నలభై దాటిన వయసు
ఆరడుగుల పైనేమో – జీర్ణ వస్త్రాల్లో
వేడెక్కిన తార్రోడ్డు నుండి పాదాలను కాపాడే చెప్పులు సైతం కరువై
తర తరాల లేమికి అలవాటు పడి, జీర్ణించుకున్న తాత్వికతో
బ్రతుకు గురించి విస్తుపోతూ, నేడూ -రేపెలా గడుస్తుందో అర్థం కాక
జీవన రోదనాన్ని అదిమి పెట్టిన అరవిరయని చిరు నగవుతో
అదొక నిస్సహాయ నిర్వేద అస్థిమిత స్థితి
చూసే వాళ్లకు మనసుంటే అతని దయనీయ పరిస్థితి హృదిని తాకుతుంది

ఎప్పుడు తిన్నాడో కూడా తెలియదు
ఆకలి తీరే మార్గం లేక పోతే కనీసం చేయి చాచి
అడగాలనే చొరవ -ధైర్యం కూడా కరువై
ఎవరు వీరు – బ్రతక లేని వాళ్లా ? బ్రతక నేర్వని వాళ్లా ?
శతాబ్దాల వారసత్వపు దారిద్య్రపు గుది బండను యింకా మోసేవారా ?
నిరక్ష్య రాస్యత – సమాజపు దోపిడీలకు ఇంకెంత కాలం బలౌతూనే ఉంటారు ?
తిన్నావా అని ఆ మనిషిని అడిగీతే, లేదని తలూపాడు
రా తిందాం అంటే, లేచి నాతో నడిచాడు
పక్కనే ఉన్న వీధి టిఫిన్ సెంటరుకు తీసుకెళ్లి
పూరీ తింటావా అంటే , ఇడ్లీ కావాలన్నాడు
బహుశా పూరీ ఖరీదెక్కువనుకున్నాడో, లేదా నూనె తన వంటికి పడదేమో
ఇడ్లీ ఇంటికి పట్టుకెళ్తా, వడ యిక్కడ తింటా లెమ్మన్నాడు
మిగిలిన చిల్లర నోట్లు , నా కన్నా తనకెక్కువసర మనిపించి అతని చేతిలో ఉంచా
బహుశా మేమిద్దరం మళ్లీ కలవక పోవచ్ఛు
అతని పేరు కూడా అడగలేదు -ఇది కంటి తుడుపు చర్య అని భావించినా
నాకు కంట్లో నీళ్లు తెప్పించిన సంఘటన

ఒకరా – ఇద్దరా ? లక్షలు – కోట్లు
తెలుసుకునే జ్ఞానం – అవకాశం లేక, ధాటీగా తెలియ చెప్పే వారు లేక
నిరాదరణ-నిర్ధనత విషవలయంలో కొట్టు-మిట్టాడుతూ
బ్రతుకు తెరువు కరువై – నిత్య కష్టాలే జీవన సత్యమని
జీవితంతో రాజీ పడ్డ ఋషులా ?
కొద్దో గొప్పో శ్రమశక్తి – నేర్పరితనం ఉన్నా
వాటికి తగ్గ మూల్యం చెల్లించే నాథులు లేక
స్థిర ఆదాయం ఎండమావై – ఈ యాంత్రీకరణ యుగంలో అవకాశాలు అడుగంటి
అడపా దడపా పని దొరికినా గడ్డు కాలానికి దాచుకునేంత రాబడీ – ఇంగితమూ లేక
జీవితం hand to mouth existence అయి
మరెన్ని దశాబ్దాలు-శతాబ్దాలు గడవాలి మనిషి జీవితం
కత్తి మీద సాము లాంటి స్థితి నుండి మెరుగుపడేందుకు
వేల యేళ్లు చరిత్ర కలిగిన మనిషి-నాగరికతలు, పాలనా విధానాలు
విస్ఫోటిస్తున్న జనాభా, లుప్తమైతున్న వనరులు
ప్రకృతి వైపరీత్యాలు, మత మౌఢ్యం-మహమ్మారులు విశ్వరూపమై
దోపిడీ చేస్తున్న విష-స్వార్థం, అర్భకుడే కదా అని ఉపేక్షిస్తే
గదిలో పిల్లిపై దాడి చేస్తే ఎలా తిరగబడుతుందో
అలాంటి స్థితి దరిదాపుల్లో లెక్కకు అందని జనాలు ప్రపంచమంతా
ఇది సమిష్టి వైఫల్యం – ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న

– రాబట్టాల్సిన సమాధానం
అవినీతి అధికార దాహాల కరాళ నృత్యంలో నిత్యం దగ్దమౌతున్న బ్రతుకులెన్నో
మనుషులుగా ఒకే పుట్టుక పుట్టి గాలి నీరు సమానంగా అనుభవిస్తూ ఉంటే
మరి కొందరి జీవికలు జీవితాంతం గల్లంతెదుకవుతున్నాయి
ప్రజా సేవ ముసుగులో ధనార్జనే ధ్యేయమై
రాజకీయపు వేలం పాటల్లో పడి పోతున్న విలువలు
వలువలు వదిలి నాయకులమనుకునే వారు చేస్తున్న ఓట్ల వ్యాపారం
కుల-మతాలు పదవులకు పరమ సోపానమై
ప్రజాస్వామ్యం కడుపు నింపని మేడి పండై మనల్ని పరిహసిస్తున్న నేపధ్యంలో
సంఘటిత కార్యాచరణకు నడుం కట్టాల్సింది నేడే
వర్గ వైషమ్యాలకు, వర్గ తారతమ్యాలకు చరమగీతం పాడాల్సిందే నేడే
రేపటి దాకా వేచి చూడటం యిక ఎంత మాత్రం తగదు
రానున్న తరాల దృష్టిలో అయినా మానవత్వమున్న మనుషులుగా ఎదుగుదాం|
మనిషి చరిత్రను చీకటి పుటల నుండి మహోజ్వల దిశగా మలుపు తిప్పుదాం !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here