[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]
[dropcap]మ[/dropcap]హాబల మహారాజు తాను నూరుగురు కన్యలను వివాహమాడి, మరునాడు సంహరించడానికి గల కఠోర సత్యాన్ని చెప్పసాగాడు…
“నాకు స్త్రీలంటే పూజ్య భావం ఉండేది. స్త్రీలను దేవతలుగా భావించి ఆరాధించేవాడిని. మొదట నేను పరిణయమాడిన అతిలోక సుందరి అయిన నా పట్టమహిషిని ఎంతగానో ప్రేమించాను. మా వివాహమైన నెలరోజుల తర్వాత ఒక నాటి రాత్రి మూడవ ఝామున నాకు హఠాత్తుగా మెలుకువ వచ్చింది. పాన్పు మీద పట్టమనిషి లేదు. నాకపరిమితమైన ఆశ్చర్యం కలిగింది, ఇంత రాత్రి ఆమె ఎక్కడికి వెళ్లి ఉంటుందా అని. పరిచారికలను అడగటం మంచిది కాదని మేల్కొని గమనిస్తూ ఉండగా, కాసేపటికే ఆమె మౌనంగా ఒక రహస్య మార్గము గుండా లోనికి రావడం గమనించాను. ఆ మరునాటి రాత్రి కూడా ఆమె అలాగే చక్కగా అలంకరించుకొని, ఫలహారాలను తీసుకొని మెల్లగా ద్వారాలు తెరుచుకుని బయటకు నడవడం గమనించి, ఆపుకోలేని ఆవేశంతో కరవాలము చేత ధరించి ఆమెకు తెలియకుండా అనుసరించాను. ఆమె కోట వెనుక భాగానికి పోయి ప్రహరీ గోడ ఎక్కి అవతలికి దూకింది. క్రమంగా కొన్నిమెట్ట ప్రాంతాలు దాటి, ఒక విశాలమైన మైదానం చేరింది. దానిని ఆనుకొని ఉన్న నగర స్మశాన భూమిని కూడా దాటి ఒక జీర్ణ కుటీరం లోనికి వెళ్ళింది. నేను వెనకవైపుకి వెళ్లి లోపలికి తొంగి చూశాను. ఒక చింకి చాపమీద వ్యక్తి పడుకొని ఉండటం కనిపించింది. పరిశీలనగా చూస్తే అతడు ఒక కుష్టురోగి. ఈమె ఫలహారాలు అతనికి తినిపిస్తున్నది. ‘ఏమిటి ఆలస్యం’ అని అతను ఆగ్రహిస్తున్నాడు. “రేపటి నుంచి మనకు ఏ భయమూ లేదు. గొప్ప విషాన్ని సంపాదించాను. ఆ మహారాజుని ఈ లోకం నుండి పైకి పంపే ఏర్పాటు చేశాను” అంటుండగా ఆవేశం ఆపుకోలేక ముందుకురికి ఒర నుంచి కరవాలాన్ని దూసి ఆమె శిరస్సును ఒక్క వేటుతో ఖండించాను. అతనిని కూడా చంపబోతుండగా ‘తొందర పడకు. కొంచెం ఆగు. నీవెవరవు” అన్నాడతను. “మహారాజును. ఈ పాతకి భర్తను” అన్నాను.
“మీకు వివాహమై నెల రోజులైంది. కానీ గత ఐదు సంవత్సరాలుగా ఆమె నా ప్రియురాలు. ఆమె తండ్రి అయిన మూర్తిమంత మహారాజు కొలువులో అశ్వపాలకునిగా చాలా కాలం పని చేసిన తర్వాత నా శరీరంలో కుష్టురోగం వచ్చినది. నేను చేసిన సేవలకుగాను మహారాజు నాకు ఒక్క కుటీరం ఏర్పరిచి ఇచ్చాడు. యుక్తవయస్కురాలైన, అవివాహితురాలైన అతని కుమార్తెతో నాకు అప్పుడే పరిచయం కలిగింది. ఆమె ఎందుకో మిక్కిలిగా నన్ను ప్రేమించినది. ఎల్లప్పుడు నా చుట్టూనే తిరుగుతుంది. నేనూ ఆమె ప్రేమను అంగీకరించాను” అన్నాడతను. ఇంకా వినలేక వానిని కూడా సంహరించి తిరిగి వచ్చాను. ఆ తుచ్ఛురాలు చేసిన వంచనకు శరీరం దహించుకు పోయి, స్త్రీలంటేనే ఏవగింపు కలిగింది. ఆ కసి తీర్చుకోవడానికి ఆ నాటి నుండి ఒక స్త్రీని వివాహం చేసుకోవటం, ఆ రాత్రి అనుభవించి, మర్నాటికి సంహరించటం అనే ప్రతిజ్ఞ పూనాను. ఇలా నూరుగురిని బలి చేశాను. రాగలత విషయంలో మాత్రం నీ ఈ కథ వల్ల ఆటంకం కలిగింది. ఈరోజుతో కథ పూర్తి అయింది కనుక ఆమెను నిరభ్యంతరంగా అనుభవించగలను” అన్నాడు.
“ఇంతకూ నువ్వు నా కంఠంలోని ఖడ్గ ఘాతా చిహ్నాన్ని గురించి చెబుతాను అన్నావు కదా” అన్నాడు మహారాజు.
“మహారాజా నేను ఇన్ని రోజులుగా మీకు వినిపించిన కథ కేవలం కల్పిత గాధ కాదు. జరిగినది జరిగినట్టుగా మా గురుదేవులు నాకు చెప్పారు. నేను మీకు చెప్పాను. నీవు పూర్వజన్మలో అమరావతి ప్రభువైన అమరనాథ్‌వి. ఆ జన్మలో ఆమె ప్రయోగించిన ఖడ్గ ప్రహారం ఈ జన్మలో సైతం నీ కంఠంలో చిహ్నంగా మీ జనన సమయం నుండి ఉన్నది” అంది చిలుక. “కథలోని మాధురీబేగం నాగరాణి గానూ, మనోరమ తారానాధ్‌లు హేమాంగి మైనాకులుగానూ, లాల్మియా గుండాఫకీర్ గానూ తిరిగి జన్మలెత్తి, తమ సహజ ప్రవృత్తులచే జనించిన కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జన్మ లోని అవంతి ఇప్పటి రాగలత” అంది చిలుక.
“అయితే అప్పుడు ఆమె ప్రియుడుగా ఉన్న మకరంద్ ఈ జన్మలో ఎక్కడున్నాడు?” చక్రవర్తి అడగగా “ఆ ఒక్క విషయం మాత్రం నన్ను అడగవద్దు. నేను చెప్పకూడదు” అన్నది చిలుక.
పంజరంలో నుండి చిలకను బయటకు తీసి పట్టుకుని “ఎందుకు చెప్పవు. చెప్పవలసినదే” అని కఠినంగా పలికాడు మహారాజు.
“క్రితం జన్మలో అవంతికి ప్రియుడుగా ఉన్న మకరంద్ ఈ జన్మలో రాగలతకు మనోహరుడై జయదేవ్‌గా, నీకు తెలియకుండా మీ అంతఃపురం లోనే ఉండి, ఆమెతో సమాగమమైన ఫలితంగా ఆమె ఇప్పుడు గర్భవతి అయినది సుమా” అని చెప్తుండగానే చిలుక క్రింద పడి కొట్టుకోవడం మొదలు పెట్టి ప్రాణాలు వదిలింది. రాగలత భరించలేని దుఖంతో చిలుక నెత్తిపట్టుకొని కన్నీరు కారుస్తూ ఉండగా –
“ఓసీ! రాగలతా! జగజ్జాణా! నాకు తెలియకుండా నా కన్నుగప్పి నా అంతపురం లోనే నీ ప్రియుని కూడుతున్నావా! తత్ఫలితంగా గర్భవతి కూడా అయినావా! నేనంత అల్పుడను పోయినాను” అని అవమానంతో కుంగిపోయి అంటుండగా ఒక అంతఃపుర పరిచారిక ప్రవేశించి “ప్రభూ, తమ దర్శనార్థం ఫకీరు వచ్చి వేచి ఉన్నాడు” అని చెప్పింది.
‘ప్రవేశపెట్టు’ అని ఆమెతో చెప్పి రాగలత వైపు తిరిగి “జాణలకు జాణవు, జగజ్జాణవు. నాకు లొంగక తగిన బుద్ధి చెప్పావు. నీ ప్రియుడైన అతను ఎక్కడున్నాడు ఇప్పుడు?” అని మహాబలుడు అడుగుతుండగా పరిచారికచే కొని రాబడిన ఫకీరు ప్రవేశించాడు.
“నీ వాగ్దానం ప్రకారం చిలుకను సమర్పించు మహారాజా” అన్నాడు.
రాగలత ధైర్యం తెచ్చుకొని “ప్రభూ, గాలిగుర్రం మీకు కానుకగా అర్పించిన తర్వాత మీరు వాగ్దానం ప్రకారం చిలుకను ప్రదానం చేయాలి కదా” అన్నది.
“దానికేం” అంటూ తోలు గాలి గుర్రంని బయటకు తీసాడు ఫకీరు.
“నేను పరీక్షించవచ్చునా” అన్నది.
ఫకీరు వెంటనే తన గాలి గుర్రమును బహిరంగ ప్రదేశానికి కొని వచ్చి నిలిపాడు. రాగాలత మహాబలులతో పాటు ఇంకా అనేక మంది ప్రముఖులు అక్కడ చేరారు. అందరూ తిలకిస్తుండగా రాగలత సమీపించి, దాన్ని చూస్తూ దానిపై ఎక్కి కూర్చుంది. మెల్లగా ఒక శీలను కదిలించటం, అది పైకి లేవటం, మరుక్షణం అంతరిక్షానికి ఎగిరిపోవటం జరిగిపోయింది. ఫకీరు తెల్లబోయాడు. చక్రవర్తి కంగారు పడ్డాడు. జగజ్జాణ చేసిన మోసం గ్రహించారు.
కనీసం చిలుక నైనా స్వాధీనం చేసుకోవాలని పకీరు అడుగగా, చిలుక చనిపోయిందని చెప్పి, దాని కళేబరాన్ని చూపాడు మహారాజు.
“ఆ పడతి జగజ్జాణ. ఇన్ని రోజులు నేను తనని కలవకుండా చిలుక చేత కథలు చెప్పించి, తనను కాపాడుకొంది. ఆ రాగలత జయదేవ్‌లకు ప్రతీకారం చేయక నేను బ్రతకలేను. వారు చేసిన ద్రోహానికి నా హృదయం భగ భగ మండిపోతుంది” అన్నాడు మహారాజు. వారు తనకీ శత్రువులే అనీ, తానూ తోడుగా వుంటానని ఫకీరు అన్నాడు.
అంతలో తనను కలవడానికి మురారి రాజ్యం నుండి రాయబారి వచ్చాడని తెలిసికొని రమ్మన్నాడు. “అంపాపురం రాజు జలదీప్ నన్ను ఎదిరించాడు, మహాబలరాజు తనకు సహాయం చేస్తాడని, కానీ అతనిచే సంహరింపబడిన నూరుగురు కన్యల తండ్రులు తమకు మద్దతు ఇస్తారని చెప్పాడు. మీకు నాతో వైరం మంచిది కాదు” అని నూర్జహాన్ వర్తమానం.
ఉడికిపోయాడు మహారాజు. ఫకీరు, ఫాలాక్షుడు కూడ వెంట వుంటామన్నారు.
కానీ చిన్నగా ప్రారంభమైన యుద్ధం తీవ్రతరమైంది. నూర్జహాన్ హతురాలైంది. తన రాజ్యం తాను తిరిగి సంపాదించుకొన్నాడు మైనాకుడు.
దేవాలయం చేరి, శివలింగం వెనుక ఉన్న తన అచేతన శరీరంలోకి ప్రవేశించాడు జయదేవ్. అక్కడ ఉన్న దుందుభి దంతనాధులు ‘పది మంచి పనులు పూర్తి అయ్యాయని, తాము శాపం విముక్తులమన్నామని’ చెప్పి తమ గురువులు శివస్వాముల దగ్గరకు వెళ్ళిపోయారు. తను ఇక్కడ వుంటానని ఊహించి, రాగాలత వస్తుందని ఎదురు చూస్తున్నంతలో- అతని స్పృహలో తల్లిదండ్రులు గోచరించారు. “మా అవసాన దశలో వస్తానని మాట ఇచ్చావు కదా నాయనా! ఆ సమయం వచ్చింది” అన్నారు.
వెంటనే బయలుదేరి వెళ్ళాడు జయదేవ్. దైవభక్తులైన వారు నామ జపంలో వుండి నాలుగు రోజులకు చనిపోయారు. వారి అంత్యక్రియలు పూర్తి చేసుకొని, దేవాలయం తిరిగి వచ్చేసరికి రాగలత లేదు. వచ్చి, తనకోసం వేచి వేచి వెళ్ళిపోయి వుంటుందని తెలిసి వెదకడానికి బయలు దేరాడు జయదేవ్.
గాలి గుర్రం మీద శివాలయం వచ్చిన రాగలత అక్కడ జయదేవ్ గానీ, అతని కళేబరం కానీ కానరాక, దుందుభి దంతనాధులు కూడా లేకపోవడంతో వారి నన్వేషిస్తూ తిరగసాగింది.
రోజులు, నెలలు గడిచిపోతున్నాయి. రాగలత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
(రాగలత, జయదేవ్ ఎలా కలుసుకొన్నారు? గూండా ఫకీర్ ఏమయ్యాడు?…. తరువాయి భాగంలో..!) (సశేషం)