సంభాషణం: డా. పత్రి లక్ష్మీ నరసింహ ప్రసాద్ అంతరంగ ఆవిష్కరణ-2

11
4

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం సాహిత్య సాంసృతిక కళానిధి డా. పత్రి లక్ష్మీ నరసింహ ప్రసాద్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూలో రెండవ, చివరి భాగం ఇది. [/box]

~~

మీ విషయంలో రచనా వ్యాసంగం ఎప్పుడు ఎలా మొదలైంది? చాలామంది రచయితలు కథ/నవల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మీరు మాత్రం చాలా నాటికలు/నాటకాలు రాశారు. మీరు ఇలా ఎంచుకోవడం వెనుక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా?

♣ నేను తెలుగు సాహిత్యం లోని సుప్రసిద్ధ రచయితల రచనలు చదువుతూనే నా విద్యాభ్యాసం సాగించాను. వీరందరి ప్రభావం నన్ను కూడా వ్రాయడానికి ప్రేరణ కలిగించింది. నిజానికి నేను ఇంచుమించుగా తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియాల్లోనూ వ్రాసాను. మహా భారతం, అన్నమయ్య పరిశోధానాంశాలు కాబట్టి సాహిత్య విమర్శ వ్యాసాలు చాలా సాహిత్య పత్రికల్లో వ్రాసాను. అది ప్రధానంగా నా గురువు ఆచార్య డా. జి.వి.సుబ్రహ్మణ్యం గారి ప్రభావం. తెలుగు సాహిత్యంలో హాస్యం మీద ఆసక్తి చేత హాస్యంపై చాలా వ్రాసాను.

నాకు శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ, బాపు సాహిత్యం మహా ప్రాణం. వీరి ప్రభావంతో హాస్య నాటికలు వ్రాసాను. చిలకమర్తి, కందుకూరి వారి వారి ప్రహసనాలు ఇంచు మించుగా చిన్న నాటికల్లా అనిపిస్తాయి. ఇవి కూడా నాకు హాస్య నాటికలకి, కథలకి ప్రేరణ. ఆకాశవాణి ప్రేరణ తోనే శ్రవ్య దృశ్య నాటకాలు వ్రాసాను. రంగస్థలంపై కూడా నా నాటకాలు ప్రదర్శించారు.

నాకు కర్ణాటక సంగీతమంటే చిన్నప్పటి నుండి కూడా చాలా ఇష్టం. నేను వ్రాసిన సాహిత్య ప్రక్రియల్లో అలస్యంగా వ్రాసినవి కీర్తనలు, పాటలు. నవరసాల్లోనూ వ్రాసాను. జానపద ప్రణయ భక్తి వేదాంత తాత్త్విక  భావాలతో. పాటలు 200కి పైగా వ్రాసాను. నా పాటలు 3 CD ల్లో వచ్చాయి.

మొదటి CD శ్రీ కరి కూర్మనాథంగారి సంగీత దర్శకత్వంలో శ్రీమతి శోభాలక్ష్మి యామిని కూర్మనాథం గారు పాడారు. రెండవ CD కృష్ణం వందే జగద్గురుమ్ అనే పేరుతో శ్రీ శంభు ప్రసాద్ గారి సంగీత దర్శకత్వంలో ఆవిష్కరించ బడినాయి. శ్రీమతి నిష్మ, సాహితీ, శంభు ప్రసాద్ పాడారు. 3వ CD నా గోదాదేవి పాసురాల CD. నేను గోదాదేవి తమిళ పాసురాలకి తెలుగు పాటలు 30 వ్రాసాను. వీటిని శ్రీమతి ఎం.యశోధర గారు 30 రాగాల్లో స్వరపరచి పాడారు. అవిడే స్వయంగా రెండు లక్షలు వ్యయం చేసి ఈ 30 పాటలను రెండు DVD లుగా ఆవిష్కరించారు.

నేను కూచిపూడి నృత్య నాటికలు కూడా వ్రాసాను. నేను వ్రాసిన ఎన్నో పాటలకు కూచిపూడి నృత్యాలు చేశారు. ముఖ్యంగా నేను వ్రాసిన అష్ట లక్ష్మీ నరసింహ కళ్యాణం నృత్య నాటిక శ్రీమతి కుప్పా పద్మజ ఎన్నో సార్లు రంగస్థలం పై ప్రదర్శించారు. దీనిని ఎన్నో సార్లు యాదగిరి, SVBC మొదలైన TV చానళ్ళు ప్రసారం చేసాయి. ఇవే గాక. GEMINI, E TV, Gemini NEWS CHANNEL బాపు, ముళ్ళపూడి పై నన్ను ఇంటర్వ్యూ చేసాయి. బాపుపై ప్రత్యేక కార్యక్రమం చేసాను. యాదగిరి ఛానెల్ నా రచనలపై ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది.

విజయవాడలో ఒక మహిళా సదస్సులో

మీరు ప్రఖ్యాత చిత్రకారులు, సినీ దర్శకులు శ్రీ బాపు గారితో చాలా సన్నిహితంగా మెలిగారు. ఆయనతో మీకున్న అనుభవాలు చెప్పండి.

♣ బాపు గారితో వ్యక్తిగత పరిచయం, సాన్నిహిత్యం కలగడం నా అదృష్టం. ఆయనతో తొలిసారి మాట్లాడటం కూడా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. నేను మద్రాస్ ఆకాశవాణి కేంద్రం నుండి ఒకసారి ఘంటసాలపై ‘స్వరంలో అభినయాత్మకత’ అనే ఒక ప్రత్యేక జనరంజని కార్యక్రమం సమర్పించాను. దీనిని మద్రాస్‌లో బాపు గారు విని వరంగల్‌కి నాకు కాల్ చేశారు. మా అవిడ ఫోన్ ఎత్తింది.

“నమస్కారం అమ్మా, ప్రసాద్ గారు ఉన్నారా” అని వారు అడిగారు.

“మీరు ఎవరండి?” అని మా ఆవిడ అడిగింది.

“నా పేరు బాపు” అన్నారు.

“మీరు ఏ ఉరు..” అని నసిగింది మా ఆవిడ.

“మద్రాస్ తల్లీ! నేను తెల్ల కాగితాలు ఎదురుగా ఉంటే బొమ్మలు వేస్తుంటాను. మీ లాంటి వాళ్ళు డబ్బులిస్తే సినిమాలు తీస్తుంటాను” అన్నారు బాపు నవ్వుతూ.

“అమ్మో. మీరా. బాపు గారా, నమస్కారం. ఈయన స్నానం చేస్తుంటారు.. ఏవండీ” అని మా ఆవిడ పెద్ద  కేక పెట్టింది..

“ఆయన తీరికగా ఉండే టైం చెప్పండి. నేనే మళ్లీ కాల్ చేస్తా” అన్నారు బాపు. 

ఇంతటి వినయశీలి బాపు గారు. ఈ తొలి పరిచయం ఒక దశాబ్ద సాన్నిహిత్యానికి దారి తీసింది.

నేను మద్రాసు వెళ్ళాను. బాపు గారు తన దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి, నటుల గురించి వివరించారు. ముళ్ళపూడి వెంకట రమణ బాపులు ఒక  ద్వంద్వ సమాసం. రచన స్క్రీన్‌ప్లే దర్శకత్వం ఎలా సాగాయో నాతో ఎంతో వివరంగా చెబుతూ పంచుకున్నారు. ముఖ్యంగా నా అన్నమయ్య పరిశోధనకు వారు TITLE చిత్రం వేసి ఇచ్చిన చిత్రం అపూర్వం. ప్రతి అధ్యాయానికి ఒక చిత్రం ఇచ్చారు. నా పరిశోధన గ్రంథంలో కూడా నా గురించి ఆశీర్వచన పూర్వకంగా బాపు రమణలు వ్రాసారు. నా పాటలు చాలా వాటికి ఆయన చిత్రాలు గీసి ఇచ్చారు. నా రచనలకి కూడా వారు చిత్రాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతి ఇతర పత్రికల్లో శ్రీరామనవమికి, శ్రీ కృష్ణ జన్మాష్టమికి ముద్రించబడ్డాయి. నా కోసం తొలిసారిగా వారు శ్రీ లక్ష్మీ హయగ్రీవుడి చిత్రం వేసి ఇచ్చారు. ఇది నేను నా అన్నమయ్య గ్రంథంలో ముద్రించాను.

బాపు రమణల చమత్కారం, వారి విడదీయలేని ఒక అనుబంధం అద్భుతం. ఒకరోజు వారి ఇంటి నుండి బయటికి వస్తుంటే రమణ గారు బయటికి నాతో వచ్చారు. బాపు లోపల ఉన్నారు.  వెళ్లబోతుండగా.. రమణ గారు “ప్రసాద్ గారు! S.P. బాలసుబ్రమణ్యం గారు ఈ పుస్తకం బాపు బొమ్మలతో వేసారు చూసారా!” అన్నారు. “చూడలేదండీ” అన్నాను. ‘లీలా జనార్దనం’ అనే పుస్తకం అది.

ముళ్ళపూడి గారు దాని మీద నా పేరు రాసి, ఒక్క క్షణం ఆగి, తన పేరు రాయబోయి ఆగి ఇద్దరి పేర్లు బాపు రమణ అని సంతకం చేసారు…లోపలనుండి బాపు వచ్చారు..

“ఏమిటి ఇస్తున్నావ్ ప్రసాద్ గారికి..” అన్నారు. చూపించారు రమణ. బాపు గారు నవ్వి, ఇలా వ్రాసారు ఆ పుస్తకం మీద – ‘authorized forgery. Attested’ – బాపు. అని సంతకం  చేసారు. అది వారి విడదీయలేని అనుబంధం.

నన్ను Gemini news channel ఒక  శ్రీరామ నవమికి బాపు రామాయణాల మీద ఒక పరిశోధకుడిగా ఇంటర్వ్యూ చేసింది.  బాపు గారి హృదయాన్ని అవిష్కరించినందుకు ఆయన ఎంతో మెచ్చుకున్నారు.

వరంగల్లు లోని  పోతన విజ్ఞాన పీఠానికి శ్రీ G.S. మాధవరావు గారి కోరితే నేను భాగవత సంబంధితంగా బాపు బొమ్మలు తీసుకు వచ్చి ఇక్కడ బాపు చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేసాను. ఆనాటి జిల్లా కలెక్టర్  శ్రీ ప్రభాకర రెడ్డి గారు ఎంతో ఆసక్తితో వాటిని వ్యాఖ్యానం చేయించుకుని విన్నారు. ఇది నాకు లభించిన ఒక భగవత్కార్యం. రామాయణ మహాకావ్యం ~  బాపు రమణల సినిమా రామాయణాల మీద నేను వ్రాసిన ఒక గ్రంథానికి కలహంస పురస్కారం లభించింది.

బాపు గారు ప్రత్యేకించి వారి సినిమాల్లో బాపు బొమ్మగా కీర్తి పొందిన హీరోయిన్ల గురించి చెప్పారు. నేను అసలు తెలుగు అమ్మాయి బాపు బొమ్మగా వారి సూచనలతో బాపు నాయికా ప్రస్థానం అనే గ్రంథం వ్రాస్తున్నాను. త్వరలో అది పాఠకులకి అందుతుంది. ఇది నా మహాభాగ్యం.

అంతర్జాతీయ యోగా దినోత్సవం, హైదరాబాద్

మీ ఉద్యోగ జీవితం, ఆచార్య చందా కాంతయ్య గారి జీవితంపై పరిశోధనాత్మక జీవిత చరిత్ర గురించి వివారిస్తారా?

♣ ఆచార్య చందా కాంతయ్య శ్రేష్ఠి గారు తెలంగాణ లోనే ఒక నవయుగ వైతాళికుడు. నేను లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైర్ అయిన విద్యాసంస్థ అది. నిజాం కాలంలో విద్యారంగంలో తెలుగు కొడిగట్టిన దీపంలా ఉన్నవేళ 1944లో లక్షల రూపాయలు దానం చేసి ఒక విద్యాసంస్థ స్థాపించాడు. ఈనాడు అది ఆంధ్ర విద్యాభివర్ధనీ సంస్థలుగా అవతరించి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా ప్లాటినం జుబిలి జరుపుకుంది.

వరంగల్‌లో ఆ విద్యాసంస్థ స్థాపనలో నగరం లోని ప్రముఖులంతా ఆయనకు కార్యాలోచనలో తోడై నిలిచారు. శ్రీ కాళోజీ నారాయణ రావు గారు, కాళోజీ రామేశ్వర రావు గారు, శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారు, శ్రీ భూపతి కృష్ణ మూర్తి గారు ఇంకా ప్రముఖులు ఆయనకు సహకరించారు.

ఆచార్య చందా కాంతయ్య శ్రేష్ఠి గారు సమాజాన్ని తనతో నడిపించారు. ఆయనని దానకర్ణుడిగా ఆభివర్ణించారు. CKM Govt Maternity Hospital ఆయన పేరు మీద వెలసిందంటే ఆది ఒక విశేషం. నిజాం ఆయనని మెచ్చి ‘దర్జే అవ్వల్’ అనే బిరుదుతో సత్కరించింది. విద్యా ఆధ్యాత్మిక సాంస్కృతిక భక్తి వేదాంత జ్ఞానం కార్యక్రమాలతో ఆయన తెలంగాణనే ప్రభావితం చేశారు.

నేను శ్రీ చందా కాంతయ్య గారి జీవిత చరిత్ర వ్రాయడం నా భాగ్యం. తెలంగాణలో శ్రీ కాళోజీ నారాయణ రావు, కాళోజీ రామేశ్వర రావు, శ్రీ వేణు మాధవ్ గారి నుండి ఆనాటి పుర ప్రముఖుల్ని, కాంతయ్య గారి సమకాలికులని కలిసి కాంతయ్య గారి జీవిత చరిత్ర వ్రాసాను. ఒక విధంగా చెప్పాలంటే ఆనాటి వరంగల్లు చరిత్ర వ్రాస్తే వారి జీవిత చరిత్ర అవుతుంది. వారి జీవిత చరిత్ర వ్రాస్తే వరంగల్లు చరిత్ర అవుతుంది.

మహాత్మా గాంధీ, టంగుటూరి ప్రకాశం గారు వంటి మహా ప్రముఖుల్ని వారు కలిసిన ఘట్టాలు నుండి, నిజాం కాంతయ్య గారిని “ఏం కావాలో కోరుకో?” అంటే, నిజాం కళ్ళల్లోకి చూస్తూ “..నాకేం ఇవ్వగలవు, ఏమిచ్చినా ఆ పై వాడే ఇవ్వాలి” అనే ఘట్టాల దాకా వారి జీవిత చరిత్రని ఇంచుమించుగా ఒక నవలికలా వ్రాసాను. దీనిని 3 సార్లు సవరించి 3 Editions గా ఆంధ్ర విద్యాభివర్ధనీ సంస్థ ముద్రించింది. తెలుగు సాహిత్యంలో నేను వ్రాసిన మరొక ప్రక్రియ ఇది. నాకు ఆ మహానుభావుడి జీవిత దర్శనంతో పాటు సామాజిక దర్శనం కూడా కలిగింది. ఇదొక సుకృతం.

శ్రీ పి.వి.ఆర్.కె ప్రసాద్, డా. పత్రి. గారు ప్రిన్సిపాల్ గా ఉండగా.. ఏ.వి.వి.కళాశాలలో

స్వయంగాను, కుటుంబ పరంగాను మీరు మీ చుట్టు సాహిత్య సాంస్కృతిక ఆధాత్మిక వాతావరణం సృష్టించుకున్నారు కదా, దీని ప్రభావం మీ మీద పడిందా?

♣ మా ఇంట్లో నా చిన్నప్పటి నుండీ నా తండ్రి గారి ప్రభావం వల్ల సాహిత్య ఆధ్యాత్మిక వాతావరణమే ఉండేది. మేనమామలు, చుట్టాలు, బంధువులు అందరు సంగీత ప్రియులు, సంగీత కళాకారులు. దీనితో కుటుంబ వాతావరణం అంతా ఈ కళా నిలయంగా ఉండేది. మా మామగారు టి. ఎ. రామారావు గారు స్వయంగా సంగీత విద్వాంసులు, గాయకులూ. నేను ప్రత్యేకంగా ఈ వాతావరణాన్ని సృష్టించింది ఏదీ లేదు. కాకపోతే ఆ వాతావరణంలో భిన్న స్థాయిల్లో నా రచనలు సృష్టించాను. మా శ్రీమతి పత్రి నాగలక్ష్మి కూడా సంగీత ప్రియురాలు.

గుంటూరులో అధ్యయన శిబిరం

మా పెళ్లి చూపులు కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో జరగడం ఒక విశేషం. నేను అప్పటికే అన్నమయ్య పై Ph.D చేస్తున్నాను. పెళ్లి చూపుల సాయంత్రం ఒక బహిరంగ సభలో ముందు వరసలో మా ఆవిడా కూచుంది. నేను ఉపన్యాసకుడిని. నేను మాట్లాడబోయే అంశమే బహుశా మా పెళ్లిని నిర్ణయించి ఉంటుంది. నా ఉపన్యాసం విన్న తరువాత కూడా ఆవిడకి నేను నచ్చాను, అదే విశేషం. ఆ ఉపన్యాసం ప్రధాన అంశం ‘కర్మ సిద్ధాంతం – ప్రారబ్ధ కర్మ’. నా ఉపన్యాసం విన్న తరువాత మా ఆవిడ ఏమనుకున్నదో నాకు ఇప్పటికీ తెలియదు. అదో దేవ రహస్యం.

సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాల్లో నా విజయాలన్నిటికీ ఆవిడే కారణం. పిల్లలు కూడా నా ప్రతి రచన ఆస్వాదిస్తూ ఉంటారు. జీవితం, కుటుంబం అంతా కళాత్మకమే.

ప్రస్తుతం మీ ధ్యాస పూర్తిగా ఆధ్యాత్మికం వైపు మళ్లినట్టుగా అగుపిస్తుంది. దీనికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా?

♣ ఆధ్యాత్మిక జీవితం, లౌకిక జీవితం రెండు వేరు వేరు అనే విషయాన్ని మొదట్లో నేను గుర్తించలేదు. దీనికి కారణం మా నాన్నగారు పత్రి గోపాల కృష్ణా రావు జీవించిన జీవిత శైలి. నా జీవితంలో నేను సాధించిన ప్రతి విజయంలో ఆయన ఉన్నారు.

ఒక జ్ఞాని, తపస్వి, పండితుడు, వేదాంతి, ఆధ్యాత్మిక తత్త్వవేత్త, ఆంగ్ల సాహిత్య పరిశోధకుడు, విమర్శకుడు, కళాశాల ప్రిన్సిపాల్, సంపాదకుడు. తెలుగు ఇంగ్లీష్ సాహిత్యాలతో పాటు భారతీయ తత్త్వశాస్త్రాన్ని చదివారు, దివ్యజ్ఞాన సమాజానికి జీవితాన్ని అంకితం చేశారు శ్రీ పత్రి గోపాల కృష్ణా రావు గారు.

కృష్ణశాస్త్రి, షెల్లీ, ముళ్ళపూడి బాపు, శ్రీశ్రీ  సాహిత్యాన్ని ప్రతి రోజు ఇంట్లో నా బాల్యంలోనే పరిచయం చేసి రసజ్ఞతని నా హృదయంలో నింపేశారు. ఒక కళని ఎలా ఆస్వాదించాలో, మాయా బజార్ సినిమా నుండి కూచిపూడి నృత్యాల దాకా; బాపు హాస్యం నుండి అన్నమయ్య సంకీర్తనల దాకా నాతో ఒక స్నేహితుడిలా పంచుకున్నారు విషయ విశ్లేషణతో విమర్శని, వివేకంతో. అధ్యాత్మిక సాహిత్య సమాలోచనాన్ని గురువుగా నాకు బోధించారు.

క్రికెట్, సినిమాలు, చదరంగం, నాటకాలు, జీవితం లోని నా ప్రతి ఒక్క విజయంలో పాలు పంచుకున్నారు.  మహాభారతం పైన M.Phil డిగ్రీకి, తాళ్ళపాక అన్నమాచార్యు లపై నా Ph.D.కి వారే ప్రత్యక్ష కారకులు. నా బాల్యం నుండి ఆయన వెళ్లిపోయే వరకు, నా ప్రతి ఒక్క ముఖ్య స్నేహితుడికి ఆయనతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. నా స్నేహాల పరిమళంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఆయన మార్గదర్శకత్వంలో 12 సంవత్సరాలు నేను దివ్యజ్ఞాన దీపిక అనే దివ్యజ్ఞాన సమాజ పత్రికకి సంపాదకుడిగా పని చేసాను.

నాన్నగారు నా అధ్యాత్మిక సాహిత్య రచనకి ముందుండి ప్రేరణ ప్రోత్సాహాలతో నడిపించారు. నన్ను దివ్యజ్ఞాన సమాజంలో కర్మ సిద్ధాంతంపై రచయితని చేశారు. అనువాద కళని ఆయన నాకు పరిచయం చేసారు. ఆధ్యాత్మిక గ్రంథ రచనలతో పాటు ఇంగ్లీషు నుండి తెలుగు లోకి అనువాదాలు ప్రారంభం చేశాను. ప్రధానంగా కర్మ, పునర్జన్మ, మరణానంతర స్థితి అంశాలుగా ఈ అనువాదాలు చేశాను. 16 దివ్యజ్ఞాన గ్రంధాల రచన అనువాదాలతో పాటు ‘కర్మ పునర్జన్మ’, ‘మరణానంతర స్థితి’ ఆడియో CDలు నా చేత రూపొందిప చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా 28 భాషల్లో అనువాదం అయిన జిడ్డు కృష్ణమూర్తి గారి AT THE FEET OF THE MASTER గ్రంథాన్ని, నేను 29వ భాష అయిన తెలుగులో ‘పరమ గురు చరణ సన్నిధి’ పేరుతో అనువాదం చేసే భాగ్యం వారే కల్పించారు.

డా. పత్రి. గారు రాసిన పుస్తకాల లో కొన్ని

మీ రచనల గురించి వివరిస్తారా?

నా రచనలు:

  1. తాళ్ళపాక అన్నమాచార్యుల శృంగార సంకీర్తనల్లో రసవృత్తి – వాక్య లయ.. తిరుమల తిరుపతి దేవస్థానం పరిశోధన విభాగం సిద్ధాంత గ్రంధం Ph.D.
  2. తెలుగు సాహిత్యంలో హాస్యం… ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ.
  3. అష్ట లక్ష్మీ నరసింహ కళ్యాణం – కూచిపూడి నృత్య నాటిక.
  4. జగన్నాథ చరితం.. – పూరీ జగన్నాథుడిపై నాటకం.
  5. ఆచార్య చందా కాంతయ్య శ్రేష్ఠి జీవిత తత్త్వ దర్శనం (జీవిత చరిత్ర)
  6. సంకీర్తనామృతం – తాళ్ళపాక అన్నమాచార్యులపై నాటకం.
  7. శ్రీ వెంకటేశు మంత్రం – తాళ్ళపాక అన్నమాచార్యుల జీవిత కథా నాటకం.
  8. సింహా దర్శనం – తాళ్ళపాక అన్నమాచార్యుల జీవిత కథా నాటకం
  9. రాధా గోపాలం – శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి కథలకి ఆకాశవాణి నాటకం.
  10. హనుమద్ రామాయణ శతకం.
  11. కృష్ణం వందే జగద్గురుమ్ – సంగీత రూపకం
  12. శ్రీ వేంకటేశ్వర లీలా విలాసం – కూచిపూడి నృత్య నాటిక
  13. గ్రహ బలం – హాస్య నాటిక
  14. అన్నమయ్య సంకీర్తన సుధా స్రవంతి. బొమ్మలతో 25 వారాలు ఉదయం వార పత్రికలో ప్రచురణ.
  15. ఉట్టి కొట్టేనమ్మ కృష్ణుడు ఉట్టి కొట్టేనే, బాపు బొమ్మలతో ఆంధ్రజ్యోతి ప్రచురణ.
  16. అన్నమయ్య సంకీర్తనల్లో స్త్రీ ప్ర వృత్తి విశ్లేషణ పరిశోధన వ్యాసం, వాగ్మయి. తెలుగు విశ్వ విద్యాలయం.
  17. మరణానంతర స్థితి
  18. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి మొదలైన వారపత్రికల్లో 50కి పైగా వ్యాసాలు, కధలు కవితలు నాటికలు. బాపు బాలి బొమ్మలు
  19. గోదాదేవి పాసురాలకు తెలుగు పాటలు 30
  20. నవ దుర్గలపై పాటలు
  21. సుందరకాండ హనుమ శీ రామ గుణ గానం. 7 పాటలు
  22. అన్నమయ్య సంకీర్తనల్లో అష్ట విధ నాయికలు – కూచిపూడి నృత్య రూపకం.
  23. దీపావళి – కూచిపూడి నృత్య నాటిక.
భరత్ TV. లో. అన్నమయ్య జయంతి ఉత్సవాల సందర్భంగా డా. పత్రి. గారి ఉపన్యాసం

నా అనువాద సాహిత్యం:

  1. దివ్యజ్ఞాన బోధామృతం
  2. దివ్యజ్ఞానోద్దేపిత జీవితం.. మూలం డా. అనీ బీసెంట్ (THEOSOPHIC LIFE).
  3. దివ్యజ్ఞాన ప్రబోధిని. మూలం C.W. లెడ్ బెటర్ A TEXT BOOK OF THEOSOPHY.
  4. కర్మాధ్యయనం. మూలం డా. అనీ బీసెంట్ A STUDY IN KARMA.
  5. సూక్ష్మ శరీరం.. ఏ. ఇ. పావెల్. THE ETHERIC DOUBLE.
  6. కామ శరీరం… ఏ. ఇ. పావెల్. THE ASTRAL BODY.
  7. శిష్య ప్రస్థానంలో గురు బోధామృతం S.S.వర్మ -THE TEACHINGS ON DISCIPLESHIP.
  8. విశిష్ట అష్టాంగ మార్గం. మూలం డా.అనీ బిసెంట్.. C.W.లెడ్ బీటర్ – THE NOBLE EIGHT FOLD PATH.
  9. దృశ్య అదృశ్య మానవుడు.. మూలం. C.W.లెడ్ బీటర్. MAN VISIBLE AND INVISIBLE.
  10. పరమ గురు చరణ సన్నిధి. శ్రీ జిడ్డు కృష్ణ మూర్తి ప్రపంచానికి అందించిన తొలి గ్రంధం. COMMENTARY. డా. అనీ బిసెంట్. C.W.లెడ్ బీటర్ – AT THE FEET OF THE MASTER TALKS ON THE PATH OF OCCULTISM. VOL..1.
  11. ప్రశ్నోత్తరాల్లో దివ్యజ్ఞానం.. మూలం P.పావ్రి. THE THEOSOPHY EXPLAINED IN QUESTIONS AND ANSWERS.
  12. కుండలిని…మూలం. G.S. ఆరండెల్. KUNDALINI.
  13. సాంత్వనం..మరణానంతర స్థితి.మూలం C.W.లెడ్ బీటర్ TO THOSE WHO MOURN.
  14. కర్మ పునర్జన్మ… మరణానంతర స్థితి.. రెండు AUDIO CDలు.
  15. గాయపడిన హృదయం కవితా సంకలనం, హిందీ మూలం.. Prof. చంద్ర మౌళీ సింగ్
  16. ఎన్ని యుద్ధాలు నవల. మూలం.శ్రీ కమలేశ్వర్. కిత్ నే పాకిస్తాన్.. బి.దయావంతితో సంయుక్త అనువాదం.

నా తండ్రి నా మొండితనాన్ని, అల్లరిని, పొగరుని, సోమరిపోతు గుణాన్ని, కొన్ని సందర్భాల్లో, అవినయాన్ని సహించి క్షమించి ఆశీర్వదించి నడిపించారు. కష్టం శ్రమ పోరాటం కృషి అంతా వారిది… కీర్తి విజయం ఫలం నాది.

తిరుమల లో. శ్రీ పి.వి ఆర్ కె ప్రసాద్ గారు నాద నీరాజనంలో డా. పత్రి. గారి అష్ట లక్ష్మీ నరసింహ కల్యాణం వీక్షిస్తూ

మీ అవార్డులు, సన్మానాల గురించి చెప్పండి.

♣ నేను దేశవ్యాప్తంగా తిరిగి ఆధ్యాత్మిక భక్తి సంగీత నృత్య సాహిత్య రంగాల్లో ఉపన్యాసాలు ఇవ్వడంతో పాటు, ఇతర శ్రవ్య దృశ్య ప్రక్రియల్లో రచనలు చేయడం వల్ల వందల సన్మానాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాకా, ప్రాంతీయ రాష్ట్రీయ జాతీయ స్థాయిలో జరిగాయి. మా ఆంధ్ర విద్యాభి వర్ధనీ సంస్థ నా సేవలకి 3 సార్లు సన్మానించింది. ఉత్తమ ప్రిన్సిపాల్‌గా రాష్ట్ర ప్రభుత్వం నుండి అవార్డ్ తీసుకున్నాను.

గౌ. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నుంచి జన్మభూమి స్వర్ణ పతకం పొందాను. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ద్వారా సాహిత్య కౌస్తుభ అవార్డ్ పొందాను. ఈ సన్మానాలు సరస్వతీ ప్రసాదాలు.

మనవరాలు త్రిసామ పత్రి తో న్యూయార్క్

నేటి యువ రచయిత్రులకు, రచయితలకు సాహిత్య పరంగా మీరు అందించే సలహాలు సూచనలు.

♣ నా జీవితంలో నేను ఒక కవి, రచయిత, అనువాదకుడు, పత్రికా సంపాదకుడు, నాటకకర్తగా ఉంటూ, సంగీత సాహిత్య నృత్య ప్రక్రియల్లో మీడియాల్లో రచనలు చేశాను. ఉపన్యాసకుడు, యాంకర్, లెక్చరర్, ప్రిన్సిపాల్‌గా అనేక రంగాల్లో నా బాధ్యతలు నిర్వహించాను.

ఈ రంగాలన్నింటి లోను కొదో గొప్పో విజయం పొందడానికి ప్రధాన కారణం సాహిత్యం చదవడం. మన అనుభూతులు, మనోభావాలు ఇతరులతో పంచుకోవాలంటే ఉత్తమ సాహిత్యం చదవాలి. ప్రాచీన సాహిత్యమైనా ఆధునికమైన ఏ ప్రక్రియలు మీరు ఇష్టపడినా, ముందు సాహిత్యం చదవాలి. అది గొప్ప ప్రేరణ. చైతన్యం, వికాసం, ఆలోచనా శక్తితో పాటు భాష మీద కూడా మంచి పట్టు వస్తుంది. సమాజానికి ఒక దిశ, దర్శనాన్ని యువతరం ఇవ్వగలుగుతుందని నా నమ్మకం.

గాయని యశోధర, మిత్ర గురువర్యులు డా. మృణాళిని గార్ల తో డా.పి.ఎల్. ఎన్

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here