ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-1

1
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

దుబాయ్ ఏర్పోర్ట్‌లో, వీల్ చెయిర్‌లో కూచుని బెల్టు పెట్టకోడానికి ప్రయత్నిస్తున్నాడు బ్రహ్మాజీ, అది చూసి గబగబా ఆ మనిషి వచ్చాడు.

“నా పేరు రిజ్వాన్, మీకు సాయం చేయడానికి పంపారు.” అంటూ బెల్టు పెట్టుకోడంలో సాయం చేసి, రెండు కాళ్ళ మధ్య బ్రహ్మాజీ లగేజిని ఉంచాడు.

“ఎక్కడికి వెళ్తున్నారు, ఇండియా?”

“అవును. హైదరాబాదు”

“కంఫర్టబుల్‌గా కూచున్నారా! కాళ్ళు సరిగా పెట్టుకున్నారా! ఇంక వెళ్దామా,” అంటూ తోయడం మొదలు పెట్టాడు రిజ్వాన్.

వెళ్తూంటే ఆ అబ్బాయి గురించి, ఎన్నో వివరాలు అడిగాడు బ్రహ్మాజీ.

పాపం డబ్బుకోసం ఎన్నో దాటి, ఎన్నింటినో వెనక్కి తోసి, కుటుంబాన్ని, స్వదేశాన్ని వదులుకుని ఇక్కడికి వచ్చాడు. ఎంత సంపాదిస్తాడో పాపం, మరి వచ్చేది సరిపోతుందా!

ఇలా కుర్చీల్లో కూచున్న వాళ్ళు ఇచ్చేది ఎంత?

దాన్ని ఎన్నింటికి వాడుతాడు? ఇంటికి ఎంత పంపిస్తాడు? జాలి పడ్డాడు.

దిగే ముందు ఏదైనా ఇవ్వాలి. తన దగ్గర లోకల్ కరెన్సీ లేదు. డాలర్లున్నాయి. ఏ డినామినేషన్స్ ఉన్నాయో చూసి ఇవ్వాలి.

చక్రాల కుర్చీలో ఠీవీగా కూచుని, అటూ ఇటూ చూస్తున్న బ్రహ్మాజీకి కొడుకు గుర్తొచ్చాడు. వాడి మాటలు గుర్తొచ్చాయి.

“నాన్న గారూ, మీరు గేటు వరకూ నడవ లేరు. పైగా గేటు చాలా దూరంలో ఉంటుంది. వీల్ చెయిర్ బెస్ట్. ఈ నడక, మెట్రో లో ఎక్కి, మరో టర్మినల్ , అక్కడ ఎస్కలేటర్ లో వెళ్ళడం, లైన్లో నుంచోడం, మీరు ఈ వయసులో చేయడం కష్టం.

ఈ వీల్ చెయిర్ మీకు సుఖంగా ఉంటుంది. మీరు అన్నిచోట్లా క్యూలో నుంచోనక్కర్లేదు. అటెండెంట్‌కి మీ పాస్పోర్ట్, టిక్కెట్టు ఇస్తే అన్నీ తనే చూసుకుంటాడు. అన్నిచోట్లా ముందుకెల్ళి అన్నితనే చేసుకొస్తాడు. సెక్యూరిటీ కూడా తొందరగానే చేయిస్తాడు.”

ఈ కష్టాలుండ కూడదనే హైద్రాబాదుకి టిక్కెట్టు కొంటున్నప్పుడే ముందే వీల్ చెయిర్ కావాలని ప్రతీక్ పెట్టానని అన్నాడు

ఈ ప్రయాణం మొదటిసారి కాదు, కాని, ప్రయాణం చేస్తున్న ప్రతీసారి, ప్రతీక్ ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు, ఇలాగే అరేంజ్ చేస్తూంటాడు.

వీల్ చెయిర్‌ని షాపులు ముందు నుంచి తీసుకెళ్లి, రెండు సార్లు లిఫ్ట్ లో తీసుకెళ్ళి, మెట్రోలో ఎక్కించి మరో టర్మినల్‌కి, మళ్ళీ ఓ పది నిమిషాలు తోసి, ఆఖరికి ఎమిరేట్స్ కౌంటర్ దగ్గర దింపగానే ఆ అబ్బాయి చేతిలో రెండు ఐదు డాలర్ల కాయితాలు ఉంచి, ఎవరూ చూడకుండా వెంటనే చేతిని మూసాడు.

తనదైన రీతిలో ధన్యవాదాలు తెలిపాడు.

ఎక్కడైనా ఖాళీ కుర్చీ కనబడుతుందేమోనని రిజ్వాన్ చూసాడు.

 “కుర్చీలు ఖాళీ లేవు, మీరు ఈ వీల్ చెయిర్ లోనే కూచోండి. ఏదైనా కావాలంటే చెప్పండి, తీసుకొస్తాను.” అంటూ కాళ్ల మధ్య ఉన్న బాగ్‌ని పక్కకి ఉంచి, చూసుకోమని చెప్పాడు.

“ఏమీ అక్కర్లేదు. నువ్వెళ్ళు.”

“ఫ్లైట్ వచ్చే టైముకి, మళ్ళీ వస్తాను” అని చెప్పి వీల్ చెయిర్ తోసిన రిజ్వాన్ వెళ్ళాడు.

ఆ రిజ్వాన్ రాక పోయినా పరవాలేదు. ఎదురుగా లిఫ్ట్ ఉంది. ఈ లిఫ్ట్‌లో దిగగానే, ఓ పది అడుగులు వేయగానే ఏరోబ్రిడ్జి. అక్కడి నుంచి మెల్లిగా నడుస్తూ వెళ్ళచ్చు, విమానం లోపలికి వెళ్ళచ్చు అని అనుకున్నాడు. ఆ మాత్రం నడక ఉండాలి. ఆ ఎక్సర్‌సైజ్ చెయ్యగలడు.

కాని ప్రాక్టికల్‌గా కష్టం. నత్తలా నడుస్తూ వెళ్తుంటే మిగిలిన వాళ్ళు తనని దాటుకుంటూ విమానంలోకి వెళ్తారు. వాళ్ళంతా వాళ్ళ బాగులు, లగేజి పైన పెట్టుకోడం కోసం నుంచుంటారు. అలా అడ్డుగా ఉన్న వాళ్ళందరిని తప్పించుకుంటూ ముందుకి వెళ్ళడం కష్టం.

నడవడానికి రాక, నుంచోడానికి లేక ఇలాంటి అన్ని ఆటంకాలని దాటుకుని తన సీట్లో కూచోడం చాలా కష్టం. అందుకే వీల్ చెయిర్ లోనే వెళ్ళడం మంచిది. అందరికి తెలుసు. వీల్ చెయిర్ వాళ్ళని ముందు లోపలికి పంపిస్తారని.

వీల్ చెయిర్ లోంచి దిగకుండా, తన బాగ్‌ని, లాగి కాళ్ళ పక్కగా ఉంచుకున్నాడు. ఖాళీ కుర్చీ ఏదైనా కనిపిస్తుందేమో అని కోసం అటూ ఇటూ చూసాడు బ్రహ్మాజీ. దూరంగా ఒకటి కనిపించింది. అక్కడి కెళ్ళి కూచుంటే లిఫ్ట్ దూరం అవుతుంది. అయినా ఇక్కడ పరవాలేదు. బాగానే ఉంది. ఇక్కడి నుంచి బయట వరసగా ఆగి ఉన్న విమానాలు, ఏరోబ్రిడ్జ్ దగ్గర ఉన్న విమానాలు కనిపిస్తున్నాయి.

బయట చూసినంత సేపు చూసి, దృష్టిని లోపలికి సారించాడు. ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాటలు చక్కగా వినిపిస్తున్నాయి. వాళ్ళంతా అమెరికాలో ఎక్కి, దుబాయ్‌లో దిగి, హైద్రాబాదు వెళ్ళే ఫ్లైటు కోసం ఎదురు చూస్తున్నారని వాళ్ళ మాటలని బట్టి అనుకున్నాడు.

తను కూడా అలాగే అమెరికా నుంచి రావలసిన వాడే. ప్రతీక్ శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇల్లు కొన్నాడని వచ్చాడు. దుబాయ్‌లో తమ బిజినెస్ పార్టనర్ రోహిత్ రమ్మని పిలిస్తే వారం రోజుల క్రితం దుబాయ్ వచ్చాడు. దుబాయ్ అబూదాబీ అంతా తిప్పి తనని ఏర్పోర్ట్ లో దింపి వెళ్ళాడు రోహిత్.

కుర్చీల్లో కూచున్న వాళ్ళని వరసగా యథాలాపంగా చూస్తూన్న బ్రహ్మాజీ ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు

అవునా కాదా అని చాలా సేపు తర్జన భర్జన పడ్డాడు. మరోసారి చూసాడు.

లేత గచ్చగాయ రంగు సూటు వేసుకున్న ఆ మనిషి తనకు బాగా తెలిసున్న మనిషి.

అవును. అతను శివరామ్. తనతో కలిసి చదువుకున్నాడు. ఓ ఇరవై ఏళ్ళు తన ఇంట్లో ఉన్న మనిషి, తన క్లాస్‌మేట్. తనకు బాగా నచ్చిన మనిషి, తనకు బాగా దగ్గరగా వచ్చిన మనిషి,

కాని, నలభై మూడేళ్ళ క్రితం చెప్పకుండా ఎలా వెళ్ళి పోయాడో అది ఓ రహస్యంగా ఉండిపోడానికి కారణం అయిన మనిషి, ఇప్పుడు ఈ ఏర్పోర్ట్‌లో తనకి ఎదురుగా ఉన్నాడు. అంతా శివరామ్‌లా ఉన్నాడు.

కాని ఇతను శివరామ్ అవునా కాదా అన్న అనుమానం ఏం లేదు. అతను శివరామే. అదే మొహం. కూచున్న విధానం ఆ మనిషి శివరాం అని చెప్తోంది

ఆ సూదిలాంటి ముక్కు. పలచటి పెదవులు, మనిషి ఇంకా రంగు తేలాడు. సగం ఊడిపోగా మిగిలిన కాస్త తెల్ల జుట్టు. సందేహం లేదు శివరామ్. కాని అలా అని తను మాత్రమే అనుకోకూడదు. అవును. నేను శివరామ్‌ని, అని శివరామ్ నోటి నుంచి కూడా రావాలి.

వెళ్లి పలకరిస్తే గుర్తు పడతాడా!

ఎప్పుడో నలభై మూడేళ్ళ క్రితం విడిపోయిన శివరామ్, కాదు మాట మాత్రంగా కూడా చెప్పకుండా ఓ మోసగాడిలా వెళ్ళిపోయిన శివరామ్, ఇప్పుడు ఏం జరగనట్లు మామూలుగా మాట్లాడుతాడా, నటిస్తాడా! లేకపోతే గుర్తు పట్టనట్లుంటాడా!

ఈ మనిషి శివరామ్ కాకపోతే, ఉహుఁ అలా కాకూడదు. అలా అనుకోవాలని లేదు. మనిషిని పోలిన మనిషి ఉండచ్చు. శివరామ్‌లా ఉన్న మరో మనిషి కావచ్చు. కాని ఇంత పోలికలతోనా. కాని ఇతను కచ్చితంగా శివరామ్ అవాలి. తనలో కలిగిన అనుమానాలకి, సందేహాలకి, జవాబులు చెప్పాల్సిన మనిషి.

దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, చూద్దాం. ఏం జరిగితే అది. తన అనుమానం తీరుతుంది. శివరామ్ అయితే. అయితే ఏంటి… శివరామ్ అవాలి.

ఇన్ని ఏళ్ళ తరవాత కనిపించాడు.

ఈ నలభై మూడేళ్ళల్లో ఎన్నోసార్లు అనుకున్నాడు, శివరామ్ కనపడితే అనుమానాలు నివృత్తి చేసుకోవాలి, సందేహాలు తీర్చుకోవాలి, అందుకోసం ప్రశ్నలు తయారు చేసుకున్నాడు. కొన్ని ప్రశ్నలు అడగాలి, వాటి జవాబులు కావాలి, తెలుసుకోవాలి.

అప్పుడు కనపడితే చంపాలన్నంత కోపం ఉంది. కాని, అప్పుడున్నంత ఆవేశం, కోపం, పగ, ఇప్పుడు అంత లేదు. లేకపోయినా సరే, అడగాలి. ఆ ఉద్రేకాలకి ఆనాడు ఉన్న బలం ఇప్పుడు శరీరానికి లేదు.

ఇన్ని ఏళ్ళల్లో తనతో పాటూ పెరిగిన అనుమానాలు, సందేహాలు తీర్చుకోవాలి.

ఎందుకలా చేసావ్, ఎందుకు వెళ్ళిపోయావ్ నాకు సమాధానాలు కావాలి అని అడగాలి. వెళ్లిపోయిన వాడు ఎందుకంత రహస్యంగా ఉండిపోయాడు.

ఎన్నో ఏళ్ళుగా ఉన్నరహస్యం, ఇప్పుడు శివరామ్ ద్వారా బయట పడాలి.

ఈ నలభై మూడేళ్ళూ వీటి గురించి ఆలోచించి, ఆలోచించి గుండె బరువెక్కిన రోజులున్నాయి. నిద్ర పోని రాత్రుళ్ళున్నాయి. అన్నం తినని రోజులున్నాయి.

కాని ఇప్పుడు కనిపించి మళ్ళీ గుండెల్లో బరువు పెంచుతున్నాడు. ఇప్పుడు ఈ బరువు. దానిపైన జ్ఞాపకాల బరువు.

ఈ రెండు బరువుల్ని తను ఈ వయసులో మోయగలడా!

ఈ బరువు తగ్గాలంటే, శివరామ్ నిజాలని చెప్పాలి, నిజాలని ఎక్కడ చెప్పించాలి, ఇక్కడ ఏర్పోర్ట్‌లో తను అడగడం కష్టం. అందుకని తన ఇంటికి తీసుకెళ్తే. రమ్మంటే వస్తాడా!

ఇప్పుడు ఈ శివరామ్ తన లాగే హైదరాబాదు వెళ్తున్నాడు. శంషాబాద్‌లో దిగాకా, తనతో తీసుకెళ్ళి ఈ రాత్రికి తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి మెల్లిగా అడగల్సినవి అడిగితే! ఇది కరెక్ట్.

అంతే. మళ్ళీ ఇలాంటి అవకాశం మరోసారి రాక పోవచ్చు. ఈ అవకాశం వదులుకోకూడదు.

టైము చూసాడు. రెండు అవుతోంది. ఫ్లైటుకి ఎక్కువ టైము లేదు, వెంటనే వెళ్ళి అడగాలి. నువ్వు ఓ అరవై ఏళ్ళ క్రితం గోల్కొండ దగ్గర్లో ఉన్న రోమా ఎస్టేట్స్ లో ఉన్నావా అని.

ఆ వచ్చే జవాబుని బట్టి ఆ వెంటనే తెలిసిపోతుంది, అసలు ఆ మనిషి శివరామ్ అవునా కాదా అని. అది తేలాకా ముందుకి ప్రొసీడ్ అవచ్చు. అది ముందర తేలాలి.

శివరామ్ అయితే…

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here