[dropcap]ఇ[/dropcap]ది సత్యజిత్ రాయ్ శతజయంతి సంవత్సరం. ఈసందర్భంగా సత్యజిత్‌రే ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా అతని సినిమాలద్వారా సత్యజిత్‌రే తో ఏర్పడిన అనుబంధాన్ని స్మరిస్తున్నారు వీబీ సౌమ్య.
****
అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రాయ్ శతజయంతి సందర్భంగా అని ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే ఎన్నెన్నో జ్ఞాపకాలు వడివడిగా ముసురుకున్నాయి. ఇపుడున్న పరిస్థితుల్లో ఆలోచనలు మరోవైపుకి మరల్చడానికి ఆయన రచనలు, సినిమాలు, వీటిపైన నా అభిప్రాయాలు, ఇక వీటిలో కొన్నింటికి నేను చేసిన అనువాదాలు, వీటి గురించి ఓసారి ఈ సందర్భంగా తల్చుకుంటున్నా.
అనువాదాలు
పాతికేళ్ళు కూడా నిండనపుడు అదోరకం వెర్రిలో తెగ అనువాదాలు చేశాను సత్యజిత్ రాయ్ రచనలు నేను (వీటిలో కొన్ని ఇల్లీగల్ – అనుమతి లేకుండా చేసినవి. సిగ్గేం లేదు నాకు – అజ్ఞానంలో లక్ష చేస్తాం!). తల్చుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పుడు – నేనేనా ఇంత ఆసక్తి చూపెట్టి ఇవన్నీ టకటకా ఓ రెండు మూడేళ్ళ కాలంలో చేసింది? అని.
నాకు గుర్తున్నంతవరకు మొట్టమొదట చేసినవి 2007లో సత్యజిత్ రాయ్ కథలు – ప్రజాకళ పత్రికకి అసూర్యంపస్య పేరుతో మూడు కథలు అనువాదం చేశాను. ఇప్పుడా పత్రిక లేదు. ఆ కథలు అలా కొట్టుకుపోయాయి.
“Making Movies” అని బెంగాలీ పిల్లల పత్రిక “సందేశ్” కోసం సత్యజిత్ రాయ్ కొన్ని వ్యాసాలు రాసారు. ఈ వ్యాసలు ఏడు పుస్తకంగా వచ్చాయి (ఆంగ్లంలో). వీటిని 2008 లో నవతరంగం వెబ్సైటు కోసం తెలుగులోకి అనువదించాను. పిల్లలకోసం రాసినందుకేమో, భలే ఉంటాయి.. హెవీ డ్యూటీ స్టఫ్ అసలు ఉండదు. నాకు చాలా నచ్చిన వ్యాసాలివి.
“Our films, their films” సినిమా వ్యాసాలకి నేను చేసిన అనువాదం (2008-2009 I guess) 2011లో నవతరంగం బృందం పుణ్యమా అని పుస్తకంగా కూడా వచ్చింది. (ఈ పుస్తకానికి నేను నిడదవోలు మాలతి గారిని అడిగి రాయించుకుని పుస్తకంలో పెట్టించలేకపోయిన ముందుమాట పుస్తకం.నెట్ లో ఇక్కడ చదవొచ్చు).
పుస్తకాలు
బాల్యం నుండీ ఇప్పటిదాకా గ్యాపు లేకుండా ఆకట్టుకున్న రచయితలెవ్వరూ లేరు నాకు. అందుకు కారణం రచయితలు అన్ని వయసుల చదువరులకీ నచ్చే రకరకాలు రాయకపోవడం కాబోలు. నాకు గుర్తున్నంతవరకూ దీనికి ఎక్సెప్షన్ సత్యజిత్ రాయ్. అవును. ఆయనే. నేను ఆయన్ని గురించి మొదట తెల్సుకున్నది చిన్నప్పుడు చదివిన “ఫతిక్ చంద్” పిల్లల నవల అనువాదంతో. బహుశా 94-95 కాలంలో అయ్యుండొచ్చు. తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చదువుతున్నపుడు తగిలాడు చిన్న కథలతో. ఏమున్నాయండి కథలు అసలు. ఇప్పటికీ తల్చుకుంటే అద్భుతం అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఓ రెండు మూడేళ్ళ గ్యాప్ తో ఈయన పిల్లలకోసం రాసిన ఫెలూదా డిటెక్టివ్ నవలలు, ప్రొఫెసర్ షొంకు నవలలు మొత్తం సెట్టు సెట్టు చదివా. తర్వాత తీరిగ్గా సినిమా వ్యాసాలూ అవీ చదవడం మొదలెట్టా. అలా అన్ని వయసుల వాళ్ళకీ, వాళ్ళక్కావల్సినట్లు రాయగలడు అని అర్థమైంది నాకు. ఇలా చదవగానే అలా దాన్ని గురించి రాసుకునే అలవాటు ఉండేది అప్పట్లో (ఇప్పటికీ పూర్తిగా పోలేదు). అందువల్ల బ్లాగులోనూ, మధ్య మధ్య వెబ్ పత్రికలలో నూ కొన్ని వ్యాసాలు రాసుకున్నాను. అవి:
- రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు – 2007. అప్పటిదాకా బ్లాగులో పుస్తకాల గురించి ఆంగ్లంలో రాసుకున్నవే కొంచెం సమ్మరైజ్ చేస్తూ తెలుగులో రాసుకున్నా. దీన్ని గురించి ఓ చిన్న గొడవైంది అప్పట్లో. తెలుగు సాహితీ లోకం అంటే టెక్ లోకం కాదు (టెకీలే సంపాదకులుగా, రచయితలుగా తారసపడినా సరే) అని నాకింకా తెలీని అమాయకత్వం. ఇపుడైతే నా స్పందన వేరుగా ఉండేదేమో.
- 20 short stories by Satyajit Ray
- Adventures of Professor Shonku
- Complete Adventures of Feluda
- Deep Focus – Reflections on Cinema (తెలుగులో, పుస్తకం.నెట్ లో రాసుకున్నది)
Muse India అన్న వెబ్ పత్రికలో ఒకటి “The best of Satyajit Ray” పుస్తకం పై రాసిన వ్యాసం 2006 లో వచ్చింది.
సినిమాలు:
పుస్తకాలతో పోలిస్తే ఈయన సినిమాలు నేను చూసినవి సంఖ్యా పరంగా ఎక్కువే కానీ పుస్తకాలు దాదాపు ఆంగ్లంలో వచ్చినవన్నీ చదివేశా అనుకుంటా. సినిమాలు అలా కాదు. జనమంతా మెచ్చే పథేర్ పాంచాలి త్రయం నన్నంత ఆకట్టుకోలేదంటే మీరంతా కొట్టకూడదు మరి. అప్పటికే నవలలు చదివాను అనుకుంటాను – అదో కారణం కావొచ్చు. అయితే, ఆయన తీసిన సినిమాలు నేను బాగానే చూశాను. వాటి గురించి అప్పటి బాదరాబందీ లేని కాలంలో నా అభిప్రాయాలు కూడా బ్లాగులోనో (in English), నవతరంగం వెబ్సైటులోనో (in Telugu) వివరంగానే రాసుకున్నాను.
Rabindranath Tagore (documentary)
Goopy Gyne Bagha Byne
Sikkim (documentary)
Pikoo (short film)
Sukumar Ray (documentary)
Ganashatru
Shakha Proshakha (on both of these, together)
Agantuk
చిత్రమేమిటంటే, వీటిలో నాకు అన్నింటికంటే నచ్చిన సినిమాలు అయిన ఆగంతుక్, Goopy gyne… గురించి నేనేం రాసుకున్నట్లు లేను. అద్భుతమే అవి రెండూ. నా మరో ఆల్టైం ఫేవరెట్: హిరాక్ రాజర్ దేశ. ఈయనేదో బీదరికం చూపెట్టే సినిమాలు తీస్తారు అనడం పరమ పెద్ద అపోహ. ఈయన ఇంటెలెక్చువల్ అన్నది మాత్రం నిజమే.
ఇప్పటికీ ఆ పేరు వింటే అదో పూనకం వస్తుంది నాకు. ఇలా శతజయంతి సందర్భంగా ఇవన్నీ చూస్తూ ఉంటే కొన్ని మళ్ళీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇక సత్యజిత్ రాయ్ గురించి ఇతరులు రాసినవి నేను చదివినవి చాలా చాలా తక్కువ. అక్కడక్కడా అనుకోకుండా కనబడ్డవే అన్నీ (రోజర్ ఎబర్ట్, అకిరా కురసోవా వంటి వారు అన్నవి వగైరా). దీనివల్ల ఈ నా అభిప్రాయాలు వగైరా అచ్చంగా నావిగానే, నా అజ్ఞానంతోనే ఉండిపోయాయి ఏమో. అవన్నీ వెదుక్కు చదవడానికి సమయం వచ్చిందేమో నాకు ఇప్పుడిక. 100 reasons to love Ray తో మొదలైంది ఈ దశ. ఇప్పుడీ శతజయంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి సత్యజిత్ రాయ్ తో నా అనుబంధాన్ని పునశ్చరణ చేసుకుంటూంటే కలిగే అనుభూతి అనిర్వచనీయం.