లోకల్ క్లాసిక్స్ – 53: తారతమ్యాల గ్లోబల్ మాయాబజార్

0
3

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా మణికందన్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘కాక ముట్టై’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘కాక ముట్టై’ (తమిళం)

[dropcap]త[/dropcap]మిళ సమాంతర సినిమాల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. వ్యాపార సినిమాలతో బాటు తమిళంలో సమాంతర సినిమాలు నిత్యం వెలువడుతూనే వుంటాయి. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తూంటాయి. 2016లో వెట్రి మారన్ ‘విసారనైకి’కి దర్శకత్వం వహించి దేశ విదేశాల్లో పేరు గడించాడు. కానీ దీనికి పూర్వం 2015 లో ‘కాక ముట్టై’కి నిర్మాతగా వ్యవహరించి అంతే పేరు ప్రతిష్ఠలూ పొందాడు. కాకపోతే దీనికి సహ నిర్మాతగా హీరో ధనుష్ వున్నాడు. ధనుష్, వెట్రి మారన్‌ల అండదండలతో కెమెరా మాన్ మణికందన్ దర్శకుడుగా మారి, బాలల చలన చిత్రం ‘కాకముట్టై’ తీసి అంతర్లీనంగా గ్లోబలైజేషన్ స్వరూపాన్ని తేటతెల్లం చేశాడు. ‘కాకముట్టై’ (కాకి గుడ్డు)ని ఇద్దరు పేద పిల్లల గ్లోబల్ కోరికల కథగా తీశాడు. ఇదెలా వుందో చూద్దాం….

కథ

ఆ పిల్లలవి చెన్నై మహానగరంలో మురికివాడల జీవితాలు. తల్లి (ఐశ్వర్యా రాజేష్) జైల్లో వున్న భర్తని విడిపించే ప్రయత్నాల్లో వుంటుంది. ఇంకో పక్క వంట పాత్రల కార్ఖానాలో పని చేస్తూ వుంటుంది. సంపాదన చాలక పిల్లల్ని చదువు మాన్పించేసింది. మురికి వాడకి పేరు లేదు, పిల్లలకీ పేర్లు లేవు. పెద్దోడు (విగ్నేష్) పెద్ద కాకి గుడ్డు అయితే, చిన్నోడు (రమేశ్) చిన్న కాకిగుడ్డు. ఇంట్లోంచి జేబులో అన్నం వేసుకుని చెట్టు దగ్గరి కెళ్ళడం, అక్కడ కాకుల దృష్టి మరల్చి అన్నం పెట్టి , చెట్టెక్కి గూట్లో కాకి గుడ్లు తినేయడం. తినేసి రైలు కట్ట వారగా వెళ్ళి, గూడ్సు రైలు పడేసుకుంటూ పోయిన బొగ్గులేరుకుని, అమ్మి డబ్బులు తెచ్చి ఇంట్లో ఇవ్వడం – ఇదీ నిత్య కార్యక్రమం.

ఇంటికి కాపలాగా నానమ్మ వుంటుంది. ఈ కాకి గుడ్లకి ఎప్పుడూ ఏవో కోరికలుంటాయి. ఏదో వొకటి కొనిమ్మని పోరుతూ వుంటారు. బొమ్మ వాచీలు, బొమ్మ సెల్ ఫోన్ లాంటివి కొనిపించుకుని సరదాలు తీర్చుకుంటూ వుంటారు. టీవీ కూడా కావాలని గొడవ. ప్రభుత్వం తమకి ఓటేసి గెలిపిస్తే కలర్ టీవీ ఇస్తామని ఓట్లేయించుకుని ఇంకా టీవీ ఇవ్వలేదు. ఆ టీవీ సాధిస్తుంది తల్లి. దాంతో కూడా సరదా తీర్చుకుంటారు. ఇంతలో దగ్గర్లో ఒక పిజ్జా షాప్ ప్రారంభమవుతుంది. దాని యాడ్ టీవీలో చూసి పిజ్జా కావాలని గొడవపడతారు. తల్లి, నానమ్మ అది మనం తినేది కాదని కోప్పడ్డంతో వెళ్ళి పిజ్జా షాప్ దగ్గర ఆరా తీస్తారు. ఒక పిజ్జా రూ 299/- అని చెప్పి వెళ్ళగొడతాడు సెక్యూరిటీ గార్డు.

ఆ పిజ్జా డబ్బు సంపాదించడానికి బొగ్గులమ్మిన డబ్బు ఇంట్లో ఇవ్వకుండా దాయడం మొదలెడతారు. కానీ ఇలా మురికి బట్టలతో వెళ్తే డబ్బులున్నా సెక్యూరిటీ గార్డు వెళ్ళగొడతాడని, ముందు సిటీ సెంటర్ మాల్‌లో ఎలాగో ప్రవేశం సంపాదించి డ్రెస్సులు కొనుక్కుంటారు. ఆ డ్రెస్సులు వేసుకుని, సరిపడా డబ్బులతో పిజ్జా తినడానికి వెళ్తే – వీళ్ళ మొహాలు చూసి ఈ సారి మేనేజర్ కొట్టి వెళ్ళగొడతాడు. ఘోరమైన అవమానమై పోతుంది…

ఇప్పుడేం చేశారు? ఈ అవమానాన్ని ఎలా భరించారు? ఇంకే పరిణామాలు సంభవించి పిజ్జా తినాలన్న కోరిక నెరవేరింది? తీరా తిన్నాక ఏమనిపించింది?…ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

గ్లోబలైజేషన్‌తో ప్రపంచమొక కుగ్రామ మైందన్నారు గానీ ఆ కుగ్రామంలో పేద -ధనిక విభజన అలాగే వుంది. పేదవాడి చేతిలో డబ్బున్నా వాడు గ్లోబలైజేషన్లో భాగం కాలేడు. మాల్స్‌కి వెళ్ళలేడు, రెస్టారెంట్స్‌కి వెళ్ళలేడు. మహా అయితే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడగలడు. అతడి అవతారమే ఇతర చోట్ల ప్రవేశం కల్పించదు. ఇల్యూమినాటీ చేతిలో గ్లోబలైజేషన్ అర్థం పేదల్ని భాగస్వాముల్ని చేయడం కాదు, మధ్యతరగతిని ధనికగా తరగతిగా మార్చి పిండుకోవడం. తిరిగి మధ్య తరగతికి నెట్టేయడం. పెద్ద పెద్ద కంపెనీల్లో లక్షల జీతాలతో ఉద్యోగాలిస్తారు. దాంతో పెద్ద పెద్ద బ్రాండ్లతో ఎరవేసి ఈఎంఐ బానిసలుగా మార్చేస్తారు. పెద్ద పెద్ద బ్యాంకులు, అంతర్జాతీయ బ్రాండ్ల వ్యాపారాలూ ఇల్యూమినాటీ చేతిలోనే వుంటాయి. ఇక్కడ పేదవాళ్ళకి చోటులేదు. గ్లోబలైజేషన్‌తో అన్నివర్గాలూ ఆర్థికంగా లాభపడుతున్నాయన్నది నిజమే కావచ్చు, ఇది గొప్ప సామ్యవాదంలా అన్పించవచ్చు. కానీ పేదవాడికి ఈ సామ్యవాదంలో అవమానమే తప్ప, ప్రవేశం లేదు, భాగస్వామ్యం లేదు. ఈ వాస్తవాన్నిని చెప్పకుండానే చెప్పే కథ ఇది. ఇందుకేనేమో ఈ విభజనని టార్గెట్ చేసి, సామాన్యుల సెగ్మంట్‌లో డీ మార్ట్ సూపర్ మార్కెట్లు దేశంలో వెలుస్తున్నాయి.

ఇంతకీ గ్లోబలైజేషన్ ఉత్పత్తులేమిటి? అవి నిజంగా ఎంతవరకు అవసరం? చివరికె లాగో పిజ్జా తినే కోరిక నెరవేర్చుకున్న పిల్లలకి- ఈ ముక్కలు నోట్లో పెట్టుకోగానే, నానమ్మ వేసే బియ్యప్పిండి అట్టే బ్రహ్మాండమన్పిస్తుంది!

నటనలు – సాంకేతికాలు

విగ్నేష్, రమేష్ పిల్లలిద్దరూ వృత్తి బాలనటులు కారు, మురికివాడల పిల్లలే. కొత్తవాళ్ళనే బెరుకు లేనట్టు అత్యంత సహజంగా నటించారు. భావాలు పలికించడంలో ఆరి తేరారు. ఆశ నిరాశాల భావాలు పలికించడంలో రమేష్ ఇంకా ఆరితేరాడు. ఇద్దరికీ జాతీయ ఉత్తమ బాలనటుల అవార్డులు లభించాయి. తల్లిగా నటించిన ఐశ్వర్యా రాజేష్‌కీ ఉత్తమ నటి అవార్డు లభించింది. ఉత్తమ బాలల చలన చిత్రంగా మొత్తం మూడు అంతర్జాతీయ అవార్డులు, ఏడు వివిధ దేశీయ అవార్డులూ లభించాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం నిర్వహించాడు. సంగీతం అతి పొదుపుగా వుంటుంది. అలాగే తక్కువ సంభాషణ లుంటాయి. కథని బొమ్మలు, దృశ్యం చెప్పాలి గానీ శబ్దం కాదన్నది దర్శకుడు, ఛాయాగ్రాహకుడు మణికందన్ విధానం. అలాగే ఏదైనా సామాజిక వ్యాఖ్య వుంటే అది పరోక్షంగా వుండాలనీ, అదేమిటో ప్రేక్షకులు మాటల్లో చెప్పలేకపోయినా వాళ్ళ సుప్త చేతనావస్థకి తెలుస్తూనే వుంటుందని అంటాడు. ఆ పరోక్షంగా చెప్పిన అంశం గ్లోబలజేషన్‌లో వర్గ తారతమ్యాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here