[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]ఒ[/dropcap]క్కసారి కళ్ళు మూసుకున్నాడు. గతానికి కళ్ళెక్కువంటారు. ఇప్పుడు అదే అవుతోంది.
ఆ రోజు, బాగా గుర్తు, తేదీ, వారంతో సహా అన్నీ బాగా గుర్తు.
నలభై మూడేళ్ళ క్రితం, నవంబరు నెల, ఎనిమిదో తారీఖు, బుధవారం, ఉదయం, ఆరుగంటలకి, ఆ రోజు జరిగిన వేట, శివరామ్ ప్రవర్తన, తన భార్య కావేరి, ఆనాటి సంఘటనలు, ఒకదాని వెనకాల మరొకటి అన్నీ అస్పష్టంగా కంటి ముందు మెదిలాయి.
మళ్ళీ ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు, సందేహాలు. నిజం తెలుస్తుందా. నిజాన్ని చెప్తాడా!
మెల్లిగా లగేజిని లాక్కెళ్ళి శివరామ్ ఉన్నకుర్చీల దగ్గరికెళ్లి, కుర్చీలో కూచోడానికి ప్రయత్నిస్తున్నట్లుగా, నటించాడు.
శివరామ్ కళ్ళెత్తి చూసాడు. వెంటనే పేపరు చదవడంలో ఉండిపోయాడు. అంటే గుర్తు పట్టలేదు శివరామ్. తనని ఎందుకు గుర్తు పట్టలేదు? అయినా ఎలా గుర్తు పడ్తాడు. తన జుట్టు పూర్తిగా ఊడిపోయింది. కళ్ళద్దాలు కూడా మారాయి. ముసలితనం తెలుస్తోంది. ఓ డెబ్భైఏళ్ళ దాటిన మనిషి ఎలా ఉంటాడో తను అలాగే ఉన్నాడు.
మరి తను శివరామ్‌ని గుర్తు పట్టాడు కదా, ఎలా గుర్తు పట్టాడు?
శివరామ్‌ని తను మర్చి పోలేదు కాబట్టి, శివరామ్ రూపం తను రోజూకి ఓసారి అయినా కళ్ళ ముందుకి తెచ్చుకుంటూ ఇన్నేళ్ళూ గడిపాడు కాబట్టి. అందుకే వెంటనే గుర్తు పట్టాడు.
“హైదరాబాదుకి వెళ్తున్నారా!” అంటూ మాట కలిపాడు.
“అవును.”
“హైదరాబాదులో ఉంటారా”
“లేదు. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి.” అని పేపరులోకి తల దూర్చాడు. మాటలు పొడిగించలేదు.
నిజంగానే తనని గుర్తు పట్టలేదు.
“అలాగా, మరి మీరు ఈ ఫ్లైటు దిగిన వెంటనే విజయవాడకి ఫ్లైటుందా.”
“వెంటనే అయితే లేదు, కాని నేను టాక్సీలో వెళ్ళాలని అనుకుంటున్నాను.”
గుర్తు పట్టలేదు..
“నేను కూడా హైద్రాబాదే. మనం హైద్రాబాదు చేరెసరికి పది దాటుతుంది. లగేజ్ చూసుకుని బయటికి వచ్చేసరికి మరో గంటో, రెండు గంటలో, ఎంతో పడుతుంది. బయటికి వచ్చిన వెంటనే టాక్సీ దొరకడం కష్టమే. ఎందుకంటే ఒక్కసారిగా ఐదు ఫ్లైట్లు వచ్చే టైము. అందులో మూడు ఆరబ్ దేశాలవి. నన్నడిగితే నాతో వచ్చేయండి. ఈ రాత్రి మాఇంట్లో ఉండి రేపు మిమ్మల్ని నేను విజయవాడ పంపిస్తాను. ఏం అంటారు?”
“మీకెందుకు లెండి, నేను ఏదో చూసుకుంటాను” అన్నాడు, కాని ఆ మనిషి నీకెందుకన్నట్లు చూసాడు. ఆ వెంటనే చూపులో కలవరం, కంగారు కనిపెట్టాడు బ్రహ్మాజీ.
ఈ మనిషిని ఎక్కడో చూసినట్లుంది అని అనుకుంటున్నాడా!
“మా ఇల్లు ఇబ్బందిగా ఉంటుందని అనిపిస్తే, మాకు ఓ గెస్ట్ హౌస్ మాసబ్ టాంక్‌లో ఉంది. మీరక్కడ ఉండండి. లేకపోతే మా ఎస్టేట్ లోనే గెస్ట్ హౌస్ ఉంది. అందులో రూములున్నాయి, కావాలంటే అక్కడైనా ఉండచ్చు. ఫ్రీగా ఉండచ్చు, ఏ ఇబ్బంది ఉండదు.”
“అక్కర్లేదండి.” అన్నాడు కాస్త అనుమానంగా.
తనెవరో చెప్పుకునే సమయం వచ్చింది, అని అనుకున్నాడు
అది కనిపెట్టిన బ్రహ్మాజీ తన విజిటింగ్ కార్డు తీసి కాస్త ముందుకి వంగి అతనికి అందించాడు.
అతను అందుకుని దాన్నిచూస్తూన్నప్పుడు తన గురించి చెప్పాడు.
“నా పేరు బ్రహ్మాజీ, నేను గోల్కొండ దగ్గరున్న రోమా ఎస్టేట్స్‌లో ఉంటాను.”
గబుక్కున తల ఎత్తి నోరు తెరిచి చూసాడు. ఆ కళ్ళల్లో ఆశ్చర్యం.
“నువ్వు, బ్రహ్మాజీయా! గుర్తు పట్టలేదు. నేనే నీదగ్గరికి వద్దామని బయల్దేరాను.”
బ్రహ్మాజీ ఆశ్చర్యపోయాడు.
తన దగ్గరికి వద్దామని బయల్దేరాడా! మరి ఇందాకా విజయవాడ అని అన్నాడే! మరో అబద్ధం.
మాట ఎందుకు మార్చాడు? తన దగ్గరికి వస్తున్నాని ఎలా అంటున్నాడు?
తన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ఇంకా ఏం మిగిలి ఉందని వద్దామనుకున్నాడు?
తను రమ్మని ఆహ్వానించాడని ఇలా అంటున్నాడా! తను కనపడక పోతే వచ్చేవాడు కాదా! అనుమానమే.
అబద్ధమో కాదో, కారణాలు ఏదైనా ఇంటికి వస్తానన్నాడు.
శంషాబాదులో దిగగానే, సీతమ్మకి చెప్పాలి, శివరామ్ వస్తున్నాడు, అతని గది నలభై మూడేళ్ళ ఏళ్ళ క్రితం ఎలా ఉందో అలాగే ఉంచాలని. ఎందులోనూ లోటు రాకూడదని చెప్పాలి.
‘మా ఇంటికే రావాలని అనుకున్నావా, నమ్మాలని లేదు, కాని నమ్ముతున్నాను’ అని మనసులో అనుకున్నాడు.
“అయితే సరే, లగేజి తీసుకుని బయటికి వచ్చాక కలుద్దాము. నాకు కారు వస్తుంది. పైగా ఇక్కడి నుంచి మా ఎస్టేటు దగ్గరవుతుంది. నా నంబరు విజిటింగ్ కార్డులో ఉంది. నిజంగా నువ్వు రావాలని అనుకుంటే ఫ్లైటు దిగిన వెంటనే కాల్ చెయ్యి. మనం కలిసి వెళదాం. నీ మాటల్లో నిజం ఎంతో నాకు తెలియాలి కదా.”
శివరామ్ ఏం మాట్లాడకుండా ఆ కార్డుని తన వాలెట్‌లో ఉంచుకున్నాడు.
అంతలోనే వీల్ చెయిర్ అబ్బాయి వచ్చి, అటూ ఇటూ బ్రహ్మాజీ కోసం చూసాడు. అది చూసిన బ్రహ్మాజీ వెళ్ళి పోయాడు.
ఫ్లైటులో ఇద్దరి సీట్లు చేరో మూల. మాట్లాడుకునే అవకాశం లేక పోయింది. శంషాబాదులో దిగగానే కన్వేయర్ బెల్ట్ దగ్గర శివరామ్‌ని చూసాడు. కాని పట్టించుకోలేదు. ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు.
బయటికి వచ్చాక శివరామ్ ఫోన్ చేసాడు.
అంటే నిజంగానే తన ఇంటికి వద్దామనుకున్నాడన్న మాట వెంటనే సీతమ్మకి ఫోన్ చేసాడు. ఏం చెయ్యాలో చెప్పాడు.
దార్లో ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. అడగకుండానే శివరామ్ చెప్పాడు తను లండన్‌లో ఉంటున్నానని. తను చేస్తున్న వ్యాపారం గురించి. తన జీవితం గురించి.
బ్రహ్మాజీ ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడాలనిపించలేదు. పైగా డ్రైవర్ ఉన్నాడు. అతని ముందు మాట్లాడడం ఇష్టం లేదు.
తమ ఎస్టేట్ లో ఉన్న గెస్ట్ హౌస్‌కి దగ్గర కారుని ఆపించాడు. తను కూడా దిగాడు.
“ఈ గెస్ట్ హౌస్ నీకు తెలుసు. దీనిని నువ్వుండగానే కట్టించాము. ఇందులో రెస్ట్ తీసుకో. ఒకప్పుడు అందులో ఓ గది నీది అని నేనన్నాను. ఇప్పుడు కూడా ఆ గది నీదే. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే సీతమ్మ ఉంచింది. రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుందాం.” అని కారు వైపు తిరిగి, తలుపు తెరవబోయినవాడు ఆగి పోయాడు.
“భోజనం పళ్ళూ, పాలూ, లేకపోతే మజ్జిగ ఏదైనా పంపించమంటావా,”
“ఏం వద్దు, ప్లేన్‌లో తిన్నాం కదా, అంతగా అనిపిస్తే బిస్కట్లున్నాయి.”
డ్రైవర్ సాయంతో కారులో వెనకాల ఉన్న తన సామాను తీసుకుంటున్నాడు.
శివరామ్ ఇంట్లోకి వెళ్లాక, బ్రహ్మాజీ తన బంగ్లాకి వెళ్ళాడు.
అతని కోసమే ఎదురుచూస్తున్నట్లుగా, ముందున్న దివాన్ ఖానాలో ఓ కుర్చీలో కునికి పాట్లు పడుతూ కూచుంది సీతమ్మ.
“ప్రయాణం బాగా జరిగిందా, బాబు మనవలు బావున్నారా! “
అన్నిటికి తల ఊపి, తన గదిలోకి వెళ్ళడానికి మెట్ల వైపు నడిచాడు.
సీతమ్మ వెంటనే వంటింటి వైపు నడిచింది.
సీతమ్మ మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చింది. ఆమెకి తెలుసు, మామూలుగానే పది దాటిందంటే తను ఏం తినడు, మజ్జిగ మాత్రమే తీసుకుంటాడని. ఇప్పుడు ఒంటిగంట అయింది.
మజ్జిగ గ్లాసుని అందుకున్నాడు.
“ఆగు సీతమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. ఫోన్ చేసి నీకు చెప్పాను కదా, శివరామ్‌ని తీసుకొస్తున్నానని, తీసుకొచ్చాను, నాతో కూడా వచ్చాడు, ఇప్పుడు మన గెస్ట్ హౌస్‌లో దింపి వచ్చాను. అక్కడ ఉన్నాడు. రేపు వస్తాడు.”
సీతమ్మకి శివరామ్ బాగా గుర్తున్నాడు. ఎన్నో ఏళ్ళు ఈ ఇంట్లో ఉన్నాడు. శివరామ్, బ్రహ్మాజీ ఇద్దరూ కూడా అన్నదమ్ముల్లా మసిలేవారు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. వీళ్ళ ఎస్టేట్ లోనే పనిచేసేవాడు. ఈ ఇంట్లోనే ఉండేవాడు.
ఎప్పుడైనా వాళ్ళ ఊరు వెళ్ళేవాడు. వెంటనే వచ్చేవాడు. తండ్రి దగ్గర ఎక్కువ ఉండడానికి ఇష్టపడేవాడు కాదని అనిపించేది. తరవాత మాటల్లో తెలిసింది, తల్లి లేదని, సవిత్తల్లి మూలంగా అక్కడ ఉండడం లేదని. అతని ఇంటి సంగతులు విన్నాకా శివరామ్ అంటే జాలి వేసింది. బ్రహ్మాజీని ఎంత ప్రేమగా చూసుకుందో శివరామ్‌ని కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. భోంచేసేప్పుడు కొసరి కొసరి వడ్డించేది, అటువంటిది, ఎందుకో తెలీదు కాని, ఒకనాడు హటాత్తుగా ఇక్కడి నుంచి వెళ్ళి పోయాడు. అప్పటినుంచి, బ్రహ్మాజీ చాలా బాధ పడుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఆ మనిషి కనపడగానే బ్రహ్మాజీలో ఆందోళన ఇంకా ఎక్కువవుతుంది. జాగ్రత్తగా ఉండమని చెప్పాలి.
“ఇప్పుడు ఆ శివరామ్ వచ్చాడు, పాతవన్ని ఆలోచించకు. పైగా అన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చావు, అలిసిపోయి ఉన్నావు. మనసులో దేని గురించి టెన్షన్ పెట్టుకోకు. టెన్షన్ వచ్చినప్పుడు నీ కాళ్ళు, చేతులూ చల్లబడకుండా చూసుకో. తల చల్లబడాలి. ప్రశాంతంగా ఉండు. అదొక్కటే ఇప్పుడు నీకు కావలసిన సూత్రం. రాత్రి నిద్రపోడానికి ప్రయత్నించు. కలత నిద్ర ఈ వయసులో గుండెకి అసలు మంచిది కాదు. మజ్జిగ తాగి పడుకోడానికి ప్రయత్నించు.” అంటూ నెమ్మదిగా చెప్పింది.
సీతమ్మ మాటలు మనసుని చల్లపరిచాయి. మామూలుగా అయిపోయాడు.
(సశేషం)