[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]“యిం[/dropcap]కా ఎంత సేపు పడుకుంటావయ్యా.. చీకటి పడింది. లే” అని భార్య లేపడంతో ఆలోచనల్లోంచి బైటపడి కళ్ళు తెరిచాడు. అతని కళ్ళలోంచి ధారాపాతంగా కన్నీళ్ళు కారుతున్నాయి.
“నువ్వు నిద్రపోలేదా? ఏడుస్తున్నావెందుకు?” అంది.
“నిద్రెలా పడ్తుందే.. షామ్లీ జ్ఞాపకమొచ్చింది.. ఎన్ని భయంకరమైన జ్ఞాపకాలో.. షామ్లీ ఎలా ఉందో.. అసలు బతికుందో లేదో..” అన్నాడు.
పచ్చిగా ఉన్న ఆమె గుండెలోని గాయం కూడా సలపడంతో భర్తతో కలిసి ఆమె కూడా కన్నీటివాగులా మారింది.
***
వారం రోజుల తర్వాత కాల్పులు ఆగిపోయాయి. సహాయక శిబిరంలో తల దాచుకున్న వాళ్ళందరూ మూటాముల్లె సర్దుకుని యింటిముఖం పట్టారు. అందరి మనసుల్లో ఒక్కటే దిగులు.. యిళ్ళ దగ్గర వదిలొచ్చిన పశువులు వారం రోజులుగా తిండీ నీళ్ళు లేక ఏమైపోయాయో అని.. వూరి మధ్యలో పడ్డ బాంబులు ఎవరి కొంపల్ని కూల్చేశాయో అని…
ఫక్రుద్దీన్ మెల్లగా నడుస్తున్నాడు. రషీద్ మరణం అతన్ని బాగా కుంగదీసింది. ఎప్పుడూ నిటారుగా తల యెత్తుకుని నడిచే మనిషి ఈ వారం రోజుల్లోనే ఎనభై యేళ్ళ వృద్ధాప్యం పైనబడినట్టు ఒంగిపోయి నడుస్తున్నాడు. చంకల్లో బట్టల మూటలు మోస్తూ అతని వెనకే నడుస్తున్న ఫౌజియా, ఫర్హానాలు కదుల్తున్న దిగుళ్ళ మూటల్లా ఉన్నారు.
వూరు దగ్గరపడే కొద్దీ ఏదో కాలిన కమురు వాసన ముక్కుపుటాల్ని తాకసాగింది. ఫక్రుద్దీన్ భృకుటి ముడిపడింది. మాంసాన్ని నిప్పులమీద కాల్చేటపుడు వచ్చే వాసన అది.. ఫక్రుద్దీన్ నడక వేగాన్ని పెంచాడు. అతన్లో రకరకాల భయాలు.. మరికొంత ముందుకెళ్ళాక కళ్ళముందు భయంకరమైన దృశ్యం కన్పించింది. కూలిపోయిన యిళ్ళు… కాలి బూడిదైపోయిన యిళ్ళు…
ఫక్రుద్దీన్ తన యింటి వైపుకి పరుగెత్తాడు. వారం క్రితం మురిసిపోతూ చూసుకున్న తన యింటి స్థలంలో ధ్వంసమైన మట్టి గోడలు.. కాలిపోయిన సామగ్రి కన్పించి “యా అల్లా” అంటూ అక్కడే కుప్పలా కూలిపోయాడు. ఫౌజియా, ఫర్హానా తమ చంకల్లో ఉన్న బట్టల మూటల్ని అక్కడ పడేసి, మిగిలి ఉన్న మొండిగోడల లోపలికి పరుగెత్తారు. వంట సామగ్రి అంతా నల్లగా మాడిపోయింది. మిగతా సామానంతా కాలి బూడిదైపోయింది.
ఫర్హానా తన వస్తువులు దాచుకున్న చెక్క పెట్టె కోసం చుట్టూతా చూసింది. చిన్న పీటంత పరిమాణంలో ఉండే చెక్క పెట్టె..
దాన్లోనే ఆమె రిబ్బన్లు, జడ పిన్నులు, పౌడర్లు దాచుకునేది. ఆ యింట్లో తనకు చాలా యిష్టమైన వస్తువు అదే. దాన్ని ఎక్కడ పెట్టి వెళ్ళిందో అక్కడైతే లేదు. యిల్లంతా వెదికింది. బొగ్గుల మధ్య కాలిపోయిన పౌడర్ డబ్బాలాంటి వస్తువు కనిపించడంతో ఆమెకు కన్నీళ్ళు వచ్చేశాయి.
ఫక్రుద్దీన్ మెల్లగా లేచి శిథిలమైన తన యింట్లోకి నడిచాడు. తను ముఖ్యమైన పత్రాలన్నీ పెట్టిన ట్రంకు పెట్టెలోని పత్రాలు కాలిపోకుండా ఉంటే చాలని అల్లాను మనసులోనే వేడుకుంటూ దాని కోసం వెతికాడు. ఎవరో పెద్ద రాయితో కొట్టినట్టు చితికిపోయి నల్లగా మాడిపోయి ఉన్న ట్రంకు పెట్టె కన్పించగానే అతనికి ప్రాణం లేచొచ్చింది. అందులోనే ఫర్జానా నిఖా కోసం అవసరమైన డబ్బులు కూడా దాచిపెట్టాడు. పంట అమ్మిన డబ్బులు.. పాల వ్యాపారం వల్ల వచ్చిన డబ్బులు.. ఆత్రుతగా పెట్టె మూత తీసి చూశాడు. లోపలంతా కాగితాలు కాలిస్తే మిగిలే బూడిద తప్ప ఏమీ లేదు. “మనం నాశనమైపోయాం ఫౌజియా.. నా కూతురి నిఖా ఎలా చేయాలి? దాచుకున్న డబ్బులన్నీ కాలిపోయాయి. ఫర్హానా నశీబ్ కూడా వాటితో పాటే కాలి బూడిదైపోయింది ” అంటూ పెద్దగా ఏడ్చాడు. తన ఏడుపుని మర్చిపోయి అతన్ని ఓదార్చసాగింది ఫౌజియా.
కొద్దిసేపటి తర్వాత అతను నెమ్మదించాడు. “యిదంతా మన దురదృష్టం.. బార్డర్‌కి దగ్గరగా ఉన్న గ్రామాల్లో బతకడమంటేనే మన సమాధులు మనం తవ్వుకుని చావుకోసం ఎదురుచూడటం” అన్నాడు.
“అసలీ సరిహద్దుల గోలేమిటండీ.. ఈ భూమి అంతా ఒకటేగా.. అంతా అల్లా సృష్టేగా.. దీని మీద కంటికి కన్పించని లకీర్లు గీసి ఇది మన వతన్, మన దేశం… పక్కనున్నది వేరే దేశం అనడంలో అర్థమేమిటో నాకెప్పటికీ అర్థం కాదు. ఈ లకీర్లు గీసినందువల్లేగా గొడవలు, కొట్లాటలు.. యిళ్ళు కోల్పోయి, కళ్ళ ముందే పిల్లల్ని కోల్పోయి.. మనదీ ఒక బతుకేనా?” అంది.
“యుద్ధాలే లేకుండా ఉంటే ఎంత బావుంటుందో కదా.. పాకిస్తాన్ వాళ్ళు కొన్ని అడుగులు యిటుకి చొచ్చుకు రావడానికి కాల్పులు జరుపుతారు. మన సైనికులు వాళ్ళని నిలువరించడానికి ఎదురు కాల్పులు జరుపుతారు. మధ్యలో మన ప్రాణాలూ, మన పిల్లల ప్రాణాలూ బలౌతుంటాయి. ఎందుకీ తాపత్రయం? మనిషి చనిపోయాక అవసరమైన ఆరడుగుల నేల ఉంటే చాలదూ.. ఎందుకీ చంపుకోడాలు.. మనకెందుకీ కడుపుకోత?”
“నేను పాకిస్తాన్ సరిహద్దులోపల ఉన్నానా లేక హిందూస్తాన్ సరిహద్దులోపల ఉన్నానా అనే దానితో నాకేమీ సంబంధం లేదండి. ఎక్కడ ఉన్నా నాకు కావల్సింది ప్రశాంతంగా మన బతుకులు మనం బతకడం.. ఇలా ఇళ్ళూ వాకిళ్ళు గొట్టుకుని, రక్తసంబధీకుల్ని పోగొట్టుకుని ప్రతిక్షణం భయంతో బతికే బతుకు మనకొద్దండీ” ఫౌజియా ఏడుస్తూ అంది.
“అలాగని ఎక్కడికని వెళ్ళిపోగలం బేగం.. ఈ నెలలో పుట్టి పెరిగినవాళ్ళం.. ఈ నేలలోనే సమాధి కావాలి.”
“నేనూ అదే కోరుకుంటాను. కానీ అర్థాంతరంగా తుపాకి తూటాలకో బాంబులకో బలైపోయి నేను కానీ నా వాళ్ళు కానీ చావాలని కోరుకోను.”
“మన చేతుల్లో ఏముంది చెప్పు? తలకు కఫన్ గుడ్డని చుట్టుకుని కూచోవడం తప్ప ఏమీ చేయలేని అభాగ్యులం. బార్డర్లో నివసిస్తున్న అమాయక ప్రజల ప్రాణాలు కాపాడలేకపోయినా కనీసం ధ్వంసమైన యిళ్ళని మళ్ళా కట్టుకోడానికి ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందేమో చూడాలి” అన్నాడు ఫక్రుద్దీన్.
“మనం వచ్చే దారిలో కొన్ని గొడ్లు చనిపోయి కన్పించాయి గుర్తుందా నాన్నా.. వాటిక్కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది కదా” అంది ఫర్హానా,
తన కూతురు అలా అనగానే ఫౌజియాకు తను వదిలేసి వెళ్ళిన మున్నా గుర్తొచ్చాడు. “నా మున్నా ఏడండీ.. కన్పించలేదు కదూ. యింటి పక్క స్థలంలోనేగా వదిలెళ్ళాము” అంది కంగారుగా.
“ఔను కదా.. యిల్లంతా కాలిపోయిందన్న దిగుల్లో వాడి గురించి మర్చేపోయాను” అంటూ లేచి నిలబడ్డాడు.
కూలిపోయిన గోడల పక్కన మున్నా కోసం వెదికారు. కన్పించలేదు.
“బాంబుల శబ్దాలకు భయపడి నువ్వు మేత కోసం పిల్చుకెళ్ళే చెట్ల వైపుకి పారిపోయి ఉంటాడు. అక్కడ వెదుకుదాం పద. మన రెండు బర్రెగొడ్లని కూడా వెతుక్కోవాలిగా” అన్నాడు.
“మనం వెళ్ళేముందు బర్రెగొడ్లు మేత మేయడానికి వెళ్ళి తిరిగిరాలేదు కదా నాన్నా” అంది ఫర్హానా.
“నువ్వు యిక్కడే ఉండు. నేనూ అమ్మా వెళ్ళి వాటిని వెతికి పట్టుకొస్తాం” అంటూ ఇద్దరూ మొదట మున్నా కోసం చెట్ల వైపుకెళ్ళి వెతికారు. మున్నా కన్పించలేదు. బర్రెగొడ్లని వెతుక్కుంటూ పొలాల వైపుకు బయల్దేరారు.
ఇద్దరూ దారిలో ఏమీ మాట్లాడుకోలేదు. చుట్టుపక్కల వాతావరణమంతా శ్మశాన సదృశంగా ఉంది. బర్రెగొడ్లు గడ్డి మేసే చోట్లన్నీ వెదికారు. కన్పించలేదు. మరికొంత ముందుకెళ్ళారు. చెరువు పక్కనున్న చెట్ల కింద సేదతీరుతున్న తమ రెండు గొడ్లు కన్పించగానే ఫక్రుద్దీన్ ‘యా అల్లా.. వీటిని సురక్షితంగా ఉంచినందుకు నీకు లాఖ్ లాఖ్ షుక్రియా అదా చేస్తున్నాను’ అని మనసులో అనుకున్నాడు.
ఫౌజియా మనసంతా మున్నా మీదే ఉంది. “దిగులు పడకు … మన బర్రె గొడ్లు క్షేమంగా ఉన్నాయంటే తప్పకుండా మున్నా కూడా ఎక్కడో సహీ సలామత్ ఉండి ఉంటాడు. బాంబుల శబ్దాలకు గొడ్లు బెదిరి తమకలవాటైన చోటులో కాకుండా ఇక్కడికొచ్చి కూచున్నట్టే నీ మున్నా కూడా ఎక్కడో ఏ మొక్కల మధ్యనో దాక్కుని ఉంటాడు” అన్నాడు.
ఎంత దూరం వెళ్ళి వెతికినా మున్నా జాడ కన్పించలేదు. తిరిగి వూళ్లోకి వచ్చాక అన్ని సందులూ వెతికి చూశారు. యిళ్ళతోపాటు కాలిపోయిన గొడ్ల శరీరాల్లోంచి వస్తున్న దుర్గంధం తప్ప మున్నా ఆనవాలు దొరకలేదు. తిరిగి తిరిగి అలసిపోయి శిధిలమైన తమ యింటికి తిరిగొచ్చాక అనుమానమొచ్చి ఫౌజియా యింటి వెనక్కెళ్ళి చూసింది. విరిగిపడిపోయిన గోడ పక్కన కాలిపోయి నల్లటి ముద్దలా ఉన్న మున్నా శరీరం కన్పించగానే అమె మరోసారి కూలబడిపోయి గొల్లుమంది.
***
పాకిస్తాన్ బార్డర్‌కి దగ్గరగా ఉన్న హుందర్మో అనే గ్రామం..
ఉదయం పది గంటల సమయం. యింటి ముందు కూచుని సట్టిలోని చేపల్ని ఒకటొకటిగా తీసి, వాటి పొలుసులు పోయేలా రాతికేసి రుద్దుతోంది హసీనా.. చేపల కూర వండినపుడల్లా ఆమెకు తన అన్న ఫక్రుద్దీన్ గుర్తుకొస్తాడు. అన్నకు చేపల పులుసంటే మహా ఇష్టం. తన చిన్నప్పుడు వూళ్లో ఎవరూ చేపలు కొనేవాళ్ళు కాదు. రెండు పెద్ద చెరువులుండేవి. వాటిలో చేపలు సమృద్ధిగా ఉండేవి. మగపిల్లలు వాటిలో గాలాలు వేసి చేపలు పట్టుకొచ్చేవాళ్ళు. చాలా యిళ్ళలో సాయంత్రాలు చేపల కూరే ఉండేది.
ఫక్రుద్దీన్‌కి తన చెల్లెలంటే ప్రాణం.. అందులోనూ చిన్న చెల్లి హసీనా అంటే మరీ ముద్దు చేసేవాడు. వాళ్ళ మధ్య ఉన్న వయసు తేడా వల్ల కూడా ఆమెకు అన్నగా కంటే తండ్రిలాగానే చూసుకునేవాడు. ఎప్పుడూ ఎత్తుకునే తిప్పేవాడు.
“దానికి నడవడం వచ్చురా.. ఎత్తుకోనక్కరలేదు. వయసెంతనుకున్నావు.. ఎనిమిది నిండాయి” అని అమ్మ మందలిస్తున్నా “హసీనా నాకళ్ళకు ఎనిమిది నెలల పాపలానే కన్పిస్తుందమ్మా” అనేవాడు.
తనకు పదహారేళ్ళు నిండకుండానే పెళ్ళి చేశారు. పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోతుంటే అన్న ఎలా ఏడ్చాడో ఎప్పటికీ తను మర్చిపోలేదు.
(ఇంకా ఉంది)