నా జీవన గమనంలో…!-20

66
5

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

20

[dropcap]చూ[/dropcap]స్తే అంతా బాగానే వుందనిపిస్తుంది. కానీ ఏదో వెలితి, ఏదో నిరాశ, ఏదో నిస్సత్తువ. ఇక్కడి వాతావరణం, ఇక్కడి పరిస్థితులు, చూడగా చూడగా ఏదోగా అనిపిస్తున్నాయ్! ఇక్కడ నేను నా విధులను సమర్థవంతంగా నిర్వహించగలనా! అనుమానమే! వేరే ఇంకెక్కడికైనా బదిలీ కొరకు ప్రయత్నం చేస్తే? నో… నో…! అది సరైన పద్ధతి కాదు. ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడే వుంటూ విధులను నిర్వర్తించడం నా కర్తవ్యం. వేరే చోటికి వెళ్ళినా అక్కడ ఇంతకంటే బాగుంటుందనే గ్యారంటీ ఏముంది?… ఏంటో… మరి… ఈ ఆలోచనలు… ఎటు దారితీస్తాయో… ఏమో! అర్థం కావడం లేదు… ప్రస్తుతానికి ఫ్యామిలీని గుంటూరులో వుంచి, మరికొద్ది రోజుల్లో ఇక్కడికి తెచ్చేందుకు నిర్ణయించుకున్నాను.

పనిలో ఏకాగ్రత కుదరడం లేదు. ఈ అసంతృప్తిని నాలోనే దాచుకోలేకపోయానో… ఏమో!… మా సిబ్బంది, కొంతమంది పాలకవర్గ సభ్యులు దాన్ని పసిగట్టగలిగారు. ఆఖరికి, విషయం అటు తిరిగి ఇటు తిరిగీ, వరంగల్‍లో వున్న మా రీజినల్ మేనేజర్ గారి దాకా వెళ్ళింది. ఒక రోజు వారి దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చింది. నన్ను వెంటనే వరంగల్ వచ్చి కలవమని ఆదేశించారు. మరుసటి రోజే వరంగల్ వెళ్ళి రీజినల్ మేనేజర్ శ్రీ జి. మాలకొండారెడ్డి గారిని కలిశాను. వారిని నేను ఇంతకు ముందే, 1980 ఫిబ్రవరి నెలలో ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకులో, నేను పాల్గొన్న సెమినార్ ముగింపు కార్యక్రమంలో చూశాను.

శ్రీ జి. మాలకొండారెడ్డి గారు, వరంగల్ రీజినల్ మేనేజర్

నన్ను చూడగానే రీజినల్ మేనేజర్ గారు… “ఆ! రావయ్యా! రా!… కూర్చో!… ఎలా వున్నావ్?” అని అడిగారు.

“బాగానే వున్నాను సార్!”

“ఏంటి?… నాకో విషయం తెలిసింది. అక్కడ పని చేయడానికి … ఏదో ఇబ్బంది పడుతున్నావట! నిజమేనా?”

“అదేం లేదు సార్!”

“నాకు తెలుసులేవయ్యా!… నీకో విషయం తెలుసా?… నిన్ను అక్కడ పోస్టింగ్ చేయించే ముందే… నీ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. నీకు గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేకమైన శ్రద్ధ వుందని నాకు తెలిసింది. ఆ తరువాత ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకులో నిన్ను చూశాను. ఆ రోజే, కురవి కర్షక సేవా సహకార సంఘానికి మేనేజింగ్ డైరక్టర్‌గా నువ్వు సరిగ్గా సరిపోతావనే నమ్మకం నాకు కలిగింది. అందుకే నిన్ను అక్కడికి నేనే బదిలీ చేయించాను.

అది చాలా బాగా నడుస్తున్న సంఘం. నువ్ నీ సహజ ధోరణిలో పని చేస్తే చాలు… అటు సంఘానికి… ఇటు నీకు… మంచి పేరు వస్తుంది. ఆ విషయంలో నాకే మాత్రం సందేహం లేదు…!

ఒక పని చేద్దాం! మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి… నువ్ అక్కడ కష్టమైనా ఒక ఆరు నెలలు పని చేయ్! అప్పుడు నీకే తెలుస్తుంది… అక్కడ నీకెంత బాగుంటుందో! ఎంత జాబ్ శాటిస్‌ఫాక్షన్ కలుగుతుందో!

ఒక వేళ, ఆరు నెలల తరువాత కూడా, నీకక్కడ పని చేయడం ఇష్టం లేకపోతే, సరాసరి నన్నొచ్చి కలువ్! నువ్ ఎక్కడికి కావాలంటే అక్కడికి, అప్పటికప్పుడే బదిలీ చేయించే పూచీ నాదీ…! ఏమంటావ్?”

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లుగా అనిపించాయి రీజినల్ మేనేజర్ గారి మృదు మధురమైన ఆ మాటలు. అంత వివరంగా చెప్పిన తరువాత కూడా… నా మనసు మార్చుకుని మహబూబాబాద్ లోనే కొనసాగుతూ ముందుకెళ్ళకపోతే… అంతకంటే పెద్ద తప్పిదం మరేదీ వుండదని నాకనిపించింది.

“సార్! నాకంతా అర్థమయింది సార్! మీరు నా మీద వుంచిన నమ్మకాన్ని, ఎట్టి పరిస్థితులలోనూ వమ్ము కానివ్వను సార్! నేనేంటో చేసి చూపిస్తాను సార్”

“దట్ షుడ్ బీ ద స్పిరిట్! గో ఎహెడ్! ఆల్ ది బెస్ట్ టు యూ!”

“థాంక్యూ సార్!”

తేలికపడిన మనసుతో క్యాబిన్ బయటికొచ్చాను. అక్కడే వున్న గ్రామీణాభివృద్ధి అధికారి, మా సంఘంలో ఆంధ్రా బ్యాంకు తరఫున ఓ డైరక్టర్ కూడా అయినటువంటి, నా మిత్రుడు రామచంద్రారెడ్డిని కలిశాను. కొంచెం సేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నాము. తిరిగి రాత్రికి మహబూబాబాద్ చేరుకున్నాను.

21

జాయినింగ్ టైమ్‍లో కాకినాడ నుండి సామాన్లు మహబూబాబాద్ చేర్చాను. మా అబ్బాయి చదువుకునే బ్లూ కాన్వెంట్‌లో టి.సి. కూడా తీసుకుని, ఫ్యామిలీ మహబూబాబాద్‍కు మార్చాను. అబ్బాయిని ఫాతిమా కాన్వెంట్‍లో, అమ్మాయిని మా ఇంటెదురుగానే వున్న గాదె రుక్మారెడ్డి మెమోరియల్ స్కూల్‍లో చేర్చించాము.

ఫీల్డ్ ఆఫీసర్లు వెంటరాగా, సంఘం యొక్క సొంత జీపులో సంఘ పరిధిలోని గ్రామాలకు వెళ్ళి, అక్కడి సంఘ సభ్యులను కలుసుకోవడం, పంట పొలాలను పరిశీలించడం మొదలుపెట్టాను. ముఖ్యంగా మారుమూల తండాలకు వెళ్ళి, అక్కడి లంబాడీలతో కలిసి మెలసి తిరుగుతూ, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా గమనించే అవకాశం నాకు దొరికింది. ఏ గ్రామాని కెళ్ళినా, ఏ తండాకు వెళ్ళినా, అక్కడి వారి ఆదరాభిమానాలు, ఆతిథ్యం నన్ను కట్టిపడేసేవి.

తండాలో కనిపించే సాధారణ దృశ్యం
తండావాసులతో చిన్న సమావేశం

గ్రామాల్లో ఇంతవరకు ఋణాలు పొందనివారు ఇంకా చాలామంది వున్నారు. వాళ్ళందర్నీ సంఘ సభ్యులుగా చేర్పించి, వాళ్ళకవసరమయే ఋణాలు ఇస్తూ, వాళ్ళందర్నీ అభివృద్ధి పథంలో నడిపిద్దామని మా ఫీల్డ్ ఆఫీసర్లకు చెప్పాను.

అక్కడి రైతులందరూ కష్టపడి పని చేస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఆసక్తి కనబరచడం నేను గమనించాను. అందుకే ప్రతి గ్రామం నుండి, తండా నుండి, ఎంపిక చేయబడిన రైతులను, శిక్షణ నిమిత్తం, ప్రభుత్వ రంగంలో నడిచే శిక్షణా సంస్థలకు పంపిద్దామని నిర్ణయించాము.

ఆ క్రమంలో మొదటిగా మహబూబాబాద్‍కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో వున్న మల్యాల గ్రామంలోని వ్యవసాయ పరిశోధనా సంస్థకు కొంతమంది రైతులను శిక్షణ నిమిత్తం, తీసుకొని వెళ్ళాము. ఆ సంస్థ ఇన్‌ఛార్జిగా వున్న శాస్త్రవేత్త పమిడి వెంకటేశ్వర్లు గారు, బాపట్ల వ్యవసాయ కళాశాలలో నా క్లాస్‌మేట్ కూడా. రైతులకు శిక్షణ నిమిత్తం తరగతులను నిర్వహించడమే కాకుండా ఆ సంస్థ భూముల్లో వివిధ పంటలపై, ముఖ్యంగా మిరప పంటపైన జరుగుతున్న పరిశోధనలను, ప్రత్యక్షంగా చూపిస్తూ, రైతుల సందేహాలన్నింటినీ నివృత్తి చేశారు వెంకటేశ్వర్లు గారు. రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై చక్కటి అవగాహనను పెంచుకోగలిగారు. ఆ పద్ధతులను తాము కూడా తమ తమ వ్యవసాయ భూముల్లో అవలంబిస్తూ, లాభసాటి వ్యవసాయం చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

మల్యాల వ్యవసాయ పరిశోధనా సంస్థ క్షేత్రంలో శ్రీ పమిడి వెంకటేశ్వర్లు గారితో మేమూ… మా రైతులు

మరికొంతమంది రైతులను హైదరాబాద్‍కు ఆవలి వైపున, పటాన్‌చెరువుకు సమీపంలో వున్న ‘ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ అరిడ్ ట్రాపిక్స్’ – ‘ఇక్రిశాట్’ అనే అంతర్జాతీయ పరిశోధనా సంస్థకు తీసుకొని వెళ్ళాము.

ఆ సంస్థ మెట్ట వ్యవసాయం అభివృద్ధి కొరకు నిరంతర పరిశోధనలు జరుపుతుంది. ముఖ్యంగా వర్షాభావంలో కూడా మెట్ట భూముల కనువైన హైబ్రీడ్ వెరైటీలను అభివృద్ధి చేస్తుంది ఆ సంస్థ. కంది, శనగ, వేరుశనగ, జొన్న, సజ్జ పంటల కోసం అధిక దిగుబడులిచ్చే వంగడాలను కనిపెడుతుంది ఆ సంస్థ. ఆ పంటలలో కొన్ని మన సంఘ పరిధిలోని గ్రామాల్లో కూడా సాగు చేయబడుతున్నాయి. అందుకే శాస్త్రజ్ఞులతో ముచ్చటిస్తూ, వారు చేస్తున్న పరిశోధనలను క్షేత్రస్థాయిలో చూస్తూ, చాలా ఉపయోగకరమైన విషయాలు తెలుసుకున్నారు మన రైతులు.

***

గుంటూరు లాం ఫారంలో, మిరప జి4 రకంపై పరిశోధనలు విజయవంతంగా ముగిసిన తరువాత, అక్కడి సీనియర్ శాస్త్రవేత్త, శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు, మల్యాల వ్యవసాయ పరిశోధనా సంస్థకు వస్తున్నారని ఆ సంస్థ ఇన్‌ఛార్జ్, నా క్లాస్‌మేట్ వెంకటేశ్వర్లు గారి ద్వారా తెలుసుకున్నాను. మల్యాల వచ్చినప్పుడు మా సంఘ పరిధిలోని గ్రామాల్లో పర్యటించడానికి ఒకటి రెండు రోజులు కేటాయించాలని శ్రీ సత్యనారాయణ రెడ్డి గారిని ఫోన్‍లో అభ్యర్థించాను. వారు నా ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు నేను బాపట్ల వ్యవసాయ కళాశాలలో చదువుకునే రోజుల్లో మా ప్రొఫెసర్‍గా వుండేవారు! ఎంతైనా గురుశిష్యుల అనుబంధం కదా! నేనడిగితే కాదంటారా!!

అనుకున్నట్టే శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు మా సంఘ పరిధిలోని గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులకు అనేక సలహాలను ఇచ్చారు. ముఖ్యంగా మిరప జి4 రకం విత్తనాలతో మిర్చి సాగు చేస్తే దిగుబడులను ఇతోధికంగా పెంచుకుంటూ అధిక లాభాలను సంపాదించవచ్చని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ తన పర్యటనను కొనసాగించారు. ఆ పర్యటనలో భాగంగా రైతులడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపికగా సమాధానాలు చెప్పారు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు. రైతులందరూ ఈ పర్యటనతో చాలా సంతోషించారు.

డా. ఎ. సత్యనారాయణ రెడ్డి గారు… మిరప పంట పరిశీలన
డా. ఎ. సత్యనారాయణ రెడ్డి గారితో రైతుల సమావేశం

వీలు కుదిరినప్పుడల్లా మరలా మన గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు. చివరిగా వారికి మేమంతా ఘనంగా వీడ్కోలు చెప్పాము.

22

1981 సంవత్సరం.

1981 సంవత్సరం మార్చి నెలలో రాజోలు గ్రామం, హర్యా తండాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 40 గుడిసెలు దాకా అగ్నికి ఆహుతి అయ్యాయి. కట్టు బట్టలతో, పిల్లా పాపలతో, ప్రాణాలతో బయటపడ్డారు నివాసితులందరూ. విషయం తెలిసిన వెంటనే, నేను, మా సిబ్బంది, కొంతమంది సంఘ పాలకవర్గ సభ్యులు హుటాహుటీన ఆ ప్రదేశానికి చేరుకున్నాము. అప్పటికే తండాలోని మిగతావారు గుమిగూడారు. అక్కడివారంతా జరిగిన నష్టానికి తట్టుకోలేక, ఏడుపులు, పెడబొబ్బలతో గుండెలు బాదుకుంటున్నారు. వారిని ఆ తరుణంలో ఓదార్చడం ఎవరి తరం కాలేదు. వెంటనే అందరం కలిసికట్టుగా సహాయక చర్యలు ప్రారంభించాము. కొద్ది సేపటికి ప్రభుత్వ సిబ్బంది కూడా అక్కడకు చేరుకుని మాతో చేతులు కలిపారు.

తక్షణ అవసరాల నిమిత్తం, సంఘం తరఫున బాధిత కుటుంబాలకు ఓ నెలకు సరిపడా బియ్యం, పప్పులు, మొదలైన వాటితో పాటు, వంట సామాగ్రిని కూడా అందించాము. వారందరికీ కావలసిన దుస్తులు కూడా ఏర్పాటు చేశాము.

మా సంఘ పాలకవర్గ సభ్యులు శ్రీ అమృతరెడ్డి గారి చేతుల మీదుగా అగ్నిప్రమాద బాధితులకు నూతన వస్త్రాల అందజేత
రచయిత ద్వారా అగ్నిప్రమాద బాధితులకు నూతన వస్త్రాల అందజేత

ఆ తరువాత బాధితుల వివరాలను సేకరించి, మహబూబాబాద్ రెవెన్యూ డివిజినల్ ఆఫీసరు గారి ద్వారా, వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి ఒక సమగ్ర నివేదికను పంపాము. ఇళ్ళు కోల్పోయిన వారందరికీ పునరావాసం పథకం క్రింద తిరిగి ఇళ్ళను నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం మంజూరు చేయవలసిందిగా కోరాము.

కొద్ది రోజుల తరువాత, బాధితులందరూ ప్రభుత్వ సహాయంతో తిరిగి ఇళ్ళు కట్టుకోగలిగారు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here