ఆచార్యదేవోభవ-20

0
3

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

సాహితీ ‘నరసింహం’:

[dropcap]ఆం[/dropcap]ధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో పని చేసిన తొలితరం సాహితీవేత్తలలో కాకర్ల వెంకటరామనరసింహం అగ్రగణ్యులు. ఆయన తెలుగు శాఖాధ్యక్షులుగా 1963-74 మధ్య వ్యవహరించారు. ఎందరో తెలుగు ఆచార్యులను ఆ దశాబ్దులలో తీర్చిదిద్దారు.

దేశిక వరేణ్యులైన నరసింహం 1914 అక్టోబరు 25న విజయనగరం జిల్లా కురుపాంలో జన్మించారు. విద్యాభ్యాసం పార్వతీపురం, విజయనగరం, విశాఖలలో పూర్తి చేశారు. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం వీరికి గురువులు. 1940లో తెలుగు ఎం.ఏ. చేశారు. మదరాసు విశ్వవిద్యాలయంలో తొలి తెలుగు పి.హెచ్.డి. చిలుకూరు నారాయణరావు కాగా, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో తొలి పరిశోధక విద్యార్థి రామనరసింహం. 1945లో పి.హెచ్.డి. పట్టా పొంది రెండేళ్ళు విజయనగరంలో ట్యూటర్‌గా పని చేశారు. 1947లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా చేరి 1961 వరకు పాఠాలు చెప్పారు. 1961-64 మధ్య రీడరు. 1964-74 మధ్య ప్రొఫెసరు. శాఖాధిపత్యం 1963 నుండి రిటైరయ్యేవరకు లభించింది.

ఆయన ఉత్తమ ఉపాధ్యాయులు. చక్కటి పరిశోధకులు. కవిగా – సుజాత, ఉషోరాగాలు ప్రచురించారు. పరిశోధనాత్మకంగా ప్రచురించిన గ్రంథాలు:

  1. ఆంధ్ర ప్రబంధము – అవతరణ వికాసములు
  2. దక్షిణాంధ్ర వాఙ్మయ చరిత్ర
  3. ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి
  4. ఆధునికాంధ్ర కవితా సమీక్షలు
  5. సాహిత్య దర్శనం
  6. కనకాభిషేకం – నవల
  7. రఘునాథరాయలు – నవల
  8. అరిస్టాటిల్ – ప్రాచీన భారతీయాలంకారికులు

రామనరసింహం వద్ద 18 మంది పి.హెచ్.డి.లు పొందారు. పర్యవేక్షకులుగా వారికి మార్గదర్శనం చేశారు. పదవీ విరమణాంతరం యు.జి.సి. పరిశోధకులుగా సంస్కృత శాఖలో పని చేశారు. తెలుగు శాఖ స్వర్ణోత్సవాల సందర్భంగా వీరిని సన్మానించారు. ‘భారతం-ధర్మాద్వైతం’ అనే గ్రంథాన్ని మోపిదేవి కృష్ణస్వామి తమ గురువైన రామనరసింహానికి అంకితం ఇచ్చారు.

ఒక సెమినార్‍లో శ్రీ దాశరథి గారితో రచయిత

చిలుకూరి వారి మాటల్లో:

చిలుకూరి సుబ్రమణ్యశాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో పని చేశారు. వారు రామనరసింహం గురించి ఇలా పలికారు:

“ఆచార్య కాకర్ల వేంకట రామనరసింహం గారు బహుముఖీనమైన ప్రజ్ఞాపాటవాలు గలిగిన వ్యక్తి. విద్య వలన వినయం – అన్నది వీరి యెడల సార్థకం. ఏమీ తెలియని వ్యక్తిలాగానే కనిపించి అనేక విషయాలలో తలస్పర్శమైన పాండిత్యం కలిగి వుండటం పండిత మండలంలో అరుదైన విషయం. సర్వసాధారణంగా మౌనంగా కనబడే మాష్టారు సరస వచనులనీ, మహావక్త అనీ వారితో ఏ మాత్రం పరిచయమున్నా అర్థమయ్యే విషయం.

గంభీరంగా కనబడే నరసింహం గారు హాస్యప్రియులని వారితో మాట్లాడితే గాని, తెలియదు. నవ్యనవనీత సమానమైన వ్యక్తిత్వాన్ని బాహ్యాకారం పూర్తిగా కప్పివేస్తుంది వీరి దగ్గర. దైహికంగా మూర్తీభవించిన అలసత్వంగా కనబడతారు. కాని ఉరుకులు, పరుగులూ వేసే మనసు వీరిది. వీరి నిర్ణిద్రమైన మనసు కొన్ని విషయాలలో మాత్రమే చైతన్యవంతమైనది. అత్యంత పరిచయమైన లౌకిక విషయాలు కూడా మనస్సులోని మరపు తెరల్లోకి జారుకుంటాయి. కానీ, విద్యావిషయాలలో మరపు లెరుగని మనీషి నరసింహం గారు. వీరి ఏకసంథాగ్రాహి అని అనేకులకు తెలియదు. వీరిది highly sensitive memory.

పెద్దల యెడల గౌరవం, సమానుల యెడల ఆదరం, పిన్నల యెడ వాత్యల్యం ముప్పేటగొని, మూర్తీభవించిన వ్యక్తి మేష్టారు.

……

మాస్టారుది నిర్లిప్తమైన మనస్సు. ఆవేశం వచ్చినపుడు అది తాలోత్తాలం. కానీ, అది క్షణికం. ఎప్పుడో గాని వారిలో ఆవేశం కానరాదు. మాస్టారు వల్ల మేలు పొందినవాళ్ళే తమ చేతుల్లో వున్నా తన కొడుకు విషయంలో ఉదారత చూపలేకపోయారే అని భార్య సహజంగా బాధపడితే, ‘ఎందుకు బాధపడతావే వెర్రిదానా! మనకు చేతనైనది మనం చేశాం. వాళ్ళకి చేతనైనది వారు చేశారు’ అని సర్ది చెప్పేశారు. మేస్టారు గారిది కోరకుండానే మేలు చేసే స్వభావం. వారిని కోరడం కేవలం మన లౌల్యానికి తార్కాణం. ఇటువంటి ఉపాధ్యాయునికి శిష్యుడు కావడం, సన్నిహితుడు కావడం ఒక గొప్ప అదృష్ట విశేషం” – అంటారు చిలుకూరి సుబ్రమణ్యశాస్త్రి.

అనంతపురంలో రచయితకి సన్మానం

నరసింహం గారి రచనలు:

నరసింహం గారి రచనలలో ‘తెలుగు సాహిత్య విమర్శ దర్శనం’ ప్రసిద్ధం. ఇందులో భక్తి కవిత్వం, స్మృతి కావ్యాలు, నవ్య కవులు, – తాత్విక దృష్టి, ఉమార్ ఖయ్యాం తత్వం, కాల్పనిక కవులు- పల్లీజన జీవితం, నవ్యాంధ్ర పంచ కావ్యాలు, అభ్యుదయ కవిత్వం – మార్క్స్‌వాదం, మార్క్స్‌వాదాలు – ఇతర అభ్యుదయ కవులు, అభ్యుదయ కవిత్వం – మానవతా వాదం, దిగంబర కవులు – అస్తిత్వవాదం, ప్రతీకవాదం, అధివాస్తవికత, నవ్యకవిత్వం – ఛందోరీతులు అనే అంశాలను క్షుణ్ణంగా చర్చించారు.

1996లో ‘అద్వైత సుధా’ అనే పేరుతో ఒక గ్రంథం ప్రచురించారు. పాశ్చాత్య ప్రపంచంలో వివ్లవాన్ని తెచ్చిన రెనెడెకార్ట్ ప్రమాణ మీమాంసపై ఫ్రెంచి భాషలో రాసిన ‘ప్రమాణ పద్ధతిపై ప్రసంగం’ అనే గ్రథాన్ని నరసింహం అనువదించారు. ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి కూడా ఈ అనువాదంలో పాలుపంచుకున్నారు. పదవీ విరమణాంతరం ‘ఆధ్యాత్మిక పద మంజూష’ అనే నిఘంఘువు తయారు చేశారు.

పాండురంగ మహత్యం, వసుచరిత్ర గ్రంథాలకు పీఠికలు వ్రాశారు. ఆకాశవాణి విశాఖపట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసంగాలు చేశారు. విశ్వనాథ సత్యనారాయనకు జ్ఞానపీఠ వచ్చినప్పుడు వీరు చేసిన రేడియో ప్రసంగం సాహిత్య విలువలతో కూడినది. అంతే కాదు, శివభారతం, సౌందరనందం, రాగ ప్రతాప సింహ చరిత్ర గ్రంథాలపై చేసిన రేడియో ప్రసంగాలు శ్రోతలనాకట్టుకొన్నాయి.

1989లో అనారోగ్యానికి లోనయ్యారు. అప్పటికి ఆయన వయస్సు 75 సంవత్సరాలు. 1991 మే 21న తుదిశ్వాస విడిచారు.

వీరి రచనల్లో ఆధునికాంద్ర కవితా సమీక్ష చెప్పుకోదగింది. 1985లో ఇది ప్రచురింపబడింది. ఆధునిక సాహిత్యం గూర్చి విపులంగా ఇందులో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి దీనికి లభించింది. ఆధునిక సాహిత్యంపై ప్రభావం చూపిన అనేక సిద్ధాంతాలను గురించిన వివేచన, విశ్లేషణ రచయిత చేశారు. వివిధ వాదాల గూర్చి చర్చించారు.

శ్రీ పుట్టపర్తి వారి, శ్రీ సి. నారాయణరెడ్డి గారి సమక్షంలో ప్రసంగిస్తున్న రచయిత

వీరి పరిశోధనా గ్రంథం – ‘ఆంధ్ర ప్రబంధము – అవతరణ వికాసములు’. ఇందులో 28 ప్రకరణములు. ఈ పరిశోధనా కాలంలో నరసింహం తంజావూరు ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీలో పని చేశారు. అందువలన విశేషానుభవం లభించింది. ఈ గ్రంథం చదివితే ప్రబంధాల గూర్చి సాకల్యమైన అవగాహన కలుగుతుంది. ఈ గ్రంథాన్ని పి. యల్. నారాయణ చొరవతో 1965లో ప్రచురించారు. అంటే గ్రంథం వెలుగు చూడడానికి 20 ఏళ్ళు పట్టింది. ఇది ఇప్పటికీ ప్రమాణిక గ్రంథం.

మరో అరుదైన గ్రంథం – దక్షిణాంధ్ర వాఙ్మయ చరిత్ర. తంజావూరు లైబ్రరీ పరిశోధనలు దీనికి వూతమిచ్చాయి. ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలు సమీక్షించారు.

(1). చారిత్రక విషయాలు  (2). రఘునాథ రాయలు (3). విజయ రాఘవుడు – కావ్య సమీక్ష  (4). విజయ రాఘవుని ఆస్థాన కవులు.

దక్షిణాంధ్ర యుగ సాహిత్యానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథమిది.

నరసింహం సంస్కృతాంధ్ర భాషలలో సవ్యసాచి. వీరు వివిధ పత్రికలలో ప్రచురించిన వ్యాసాలను ఆంధ్ర విశ్వకళాపరిషత్ వారు 1971లో ‘సాహితీ సమీక్ష’ అనే పేర గ్రంథంగా వెలువరించారు. ఇందులో శ్రీనాథుని కాశీఖండంపై 6 వ్యాసాలున్నాయి. గురజాడ పూర్ణమ్మ, లవణరాజు కల, తిక్కన భారతం – నాటకీయత-పాత్ర చిత్రణ, పెద్దన – తిమ్మన్నలు – అనే అంశాలపై వ్యాసాలున్నాయి.

1975లో ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి వెలువరించారు. ప్రత్యేకించి ఆంధ్రుల చరిత్రకు – సాంస్కృతిక చరిత్రకు గల సంబంధాలు చర్చించారు. ఆంద్ర రాజ వంశాల నుండి ఆంధ్ర ప్రదేశ్ అవతరణ (1956 నవంబరు) వరకు అనేకాంశాలు ప్రస్తావించారు. విశ్వవిద్యాలయాలలో అప్పటివరకు తెలుగు, తత్త్వశాస్త్రం, సంస్కృతం, మానవశాస్త్రం, చరిత్ర విభాగం, హిందీలలో వచ్చిన పరిశోధనల వివరాలు ఇందులో చేర్చారు.

సాహిత్య దర్శనం 1979లో వెలువడి సాహిత్య పరిశోధకులకు కరదీపిక అయింది. ప్రాచ్య పాశ్చాత్య సిద్ధాంతాలను ఇందులో సాకల్యంగా చర్చించారు. ప్రత్యేకించి విమర్శ గురించి వివరించారు. ఇతర ప్రస్తావిత అంశాలు:

(1). కావ్య నిర్వచనాలు (2). కావ్య హేతువులు (3). కావ్యాత్మ – వివిధ సంప్రదాయాలు (4). కవిత్వం – ఛందస్సు (5). లలిత కళలు (6). రస సిద్ధాంతం (7). ధ్వని సిద్ధాంతం (8). నాటకం (9). ట్రాజెడీ (10). కామెడీ (11). ఏకాంకిక (12). నవల – ప్రాశస్త్యం (13). కథానికలు – ఇందులో విస్తరించబడ్డాయి.

ఈ విధంగా ప్రామాణికమైన పరిశోధనా గ్రంథాలు వెలువరించిన ఆచార్య కాకర్ల వెంకటరామనరసింహం ప్రాతః స్మరణీయులు. వీరి పర్యవేక్షణలో ఎక్కిరాల కృష్ణమాచార్య – తెనాలి రామకృష్ణ కావ్యపరిశీలనం పై పరిశోధన చేసి 1966లో పి.హెచ్.డి. పట్టా పొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here