[dropcap]”సా[/dropcap]ర్. మీతో మాట్లాడాలని ఓ అమ్మాయి వచ్చింది” హెడ్ కానిస్టేబుల్ గాయత్రి ఎ.ఎస్.పి. నిరంజన్ తో చెప్పింది.
“పంపించు” అన్నాడు నిరంజన్ తను చూస్తున్న ఫైలును మూసి ప్రక్కన పెడుతూ.
“నమస్తే సార్” అంటూ లోపలికి అడుగుపెట్టింది ఆ అమ్మాయి. ఆమె వయసు దాదాపు పాతికేళ్ళుంటాయి. తెల్లగా,అందంగా ఉంది. నల్లటి జీన్స్ ప్యాంట్ మీద లేత నీలిరంగు టీషర్ట్ ధరించి ఉంది.
“కూర్చోమ్మా” అంటూ కుర్చీ చూపించి ఆమె కూర్చున్నాక విషయం చెప్పమన్నట్టు ఆమె వైపు చూసాడు నిరంజన్.
“నిన్నరాత్రి ఒంటిగంటకు ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు” అంది ఆ అమ్మాయి. అలా అంటున్నప్పుడు ఆమె ముఖం కోపంతో ఎర్రబడటం గమనించాడు నిరంజన్.
“నీ పేరు, నీవు ఎక్కడ ఉంటున్నావు, ఈ సంఘటన ఎక్కడ జరిగింది మొదలైన వివరాలు చెప్పు” అని ఆమెని అడిగాడు.
“నా పేరు సంయుక్త. దిల్‌షుక్‌నగర్‌లో ఉంటున్నాను. నిన్న రాత్రి న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం అశోక్ నగర్ లోని రివర్ వ్యూ హోటల్ కెళ్ళాను. ఉదయం ఒంటిగంటకు తిరిగి వస్తూంటే హోటల్ ప్రక్కనున్న వీధిలో ఓ అబ్బాయి ఎదురొచ్చాడు. నా వెహికల్‌కి తన బైక్ అడ్డం పెట్టి, బైక్ దిగి నా దగ్గరకు వచ్చి…..” అంటూ ఆగిపోయింది.
“ఓకె ఓకె. నాకర్థమైంది. జరిగిన సంఘటనకు నేనూ విచారిస్తున్నాను. నీవు కంప్లైంట్ రాసి స్టేషన్‌లో ఇచ్చి వెళ్ళు. మేము ఎంక్వయిరీ చేస్తాం”అన్నాడు నిరంజన్.
“అంటే ఇప్పుడు ఎంక్వయిరీ చెయ్యరా?” సీరియస్‌గా చూస్తూ అడిగింది సంయుక్త.
నిరంజన్ ఆశ్చర్యంగా చూశాడు ఆమెవైపు.
“నాకు తెలుసు సార్. నేను కంప్లయింట్ ఇచ్చి వెళ్ళగానే మీరు దాన్ని చించి చెత్తబుట్టలో పడేస్తారు. ఎంక్వైరీ చేసినా ఆ పని చేసినవాడు ఏ మినిస్టర్ కొడుకో, ఎం.ఎల్.ఎ. బావమరిదో అయితే కేసు క్లోజ్ చేసేస్తారు”
“ఆ విషయం నీకెలా తెలుసు?” ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు నిరంజన్.
“మేము న్యూస్ పేపర్లు చదువుతుంటాం. న్యూస్ ఛానల్స్ చూస్తూంటాం” వ్యంగంగా అంది సంయుక్త
“అయితే డిసెంబర్ ముప్ఫైఒకటవ తేదీ రాత్రి నుండి జనవరి ఒకటో తేదీ ఉదయం వరకు గతంలో సిటీలో ఎలాంటి సంఘటనలు జరిగాయో నీవు టీవీలో చూడలేదా, న్యూస్ పేపర్స్‌లో చదవలేదా?
“అంటే అటువంటి చర్యలకు మీరు చట్టపరంగా అనుమతి ఇచ్చేశారా?”
“లేదు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికే మేము క్రొత్తసంవత్సరం వేడుకలు కుటుంబసభ్యులతో జరుపుకోకుండా రాత్రంతా రోడ్లమీదే తిరిగాము. అయితే నీవు కూడా నీ జాగ్రత్తలో ఉండాలి కదా?”
“నేను జాగ్రత్తగానే ఉన్నాను సార్. నేను వెళ్ళింది అడవిలోకి కాదు, సిటీ నడిబొడ్డున ఉన్న హోటల్‌కి, పోలీసులు పహారా కాస్తున్న ఏరియాకి. సంఘటన జరిగింది ఆ హోటల్‌కి కూతవేటు దూరంలోని ఓ వీధిలో”
“సరే. ఆ సంఘటన జరిగిన వెంటనే ఆ వ్యక్తిని ఫోటో తీయడంగాని, ముఖం గుర్తుపెట్టుకోవడం గాని చేశావా?”
“వాడు తలకి హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. అఫ్‌కోర్స్ నేనూ హెల్మెట్ పెట్టుకునే ఉన్నాను. హెల్మెట్ పెట్టుకోకుంటే మీ పోలీసులు చలాన్ రాస్తారు కదా” అంది సంయుక్త నవ్వుతూ.
“హెల్మెట్ పెట్టుకోమన్నది మా డిపార్ట్ మెంట్ రాబడి కోసం కాదు,మీ క్షేమం కోసం.”
“అఫ్ కోర్స్” అంటూ తలూపింది సంయుక్త
“పోనీ ఆ బైక్ నెంబర్ నోట్ చేసుకున్నావా? కనీసం చివరి నాలుగు అంకెలు” అని అడిగాడు నిరంజన్.
“లేదు సార్. ఆ షాక్‌లో నాకేం తోచలేదు. అవన్నీ సి.సి.కెమెరా ఫుటేజీల్లో మీకు దొరుకుతాయి కదా?”
“దొరుకుతాయి. నీవు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళు. నాలుగు రోజుల్లో మేము కాల్ చేస్తాము”
“అలాగే సార్” అంటూ లేచి నిలబడి “సార్. నాదో చిన్న అనుమానం” అంది సంయుక్త
ఏమిటన్నట్టు చూసాడు నిరంజన్.
“మీరు మగ పక్షపాతా” అని అడిగింది సంయుక్త
“కాదు. ఎందుకలా అడిగావు?”
“నేను వచ్చినప్పట్నుంచీ చూస్తున్నాను. మీరు పదే పదే నేను తప్పు చేసానని అంటున్నారే గాని దోషిని పట్టుకుని శిక్షిస్తానని మీరు అనలేదు. ఈ విషయంలో నేను చాలా నిరాశ చెందాను సార్” అంటూ బయటకు నడిచింది సంయుక్త
నిశ్చేష్టుడై ఆమె వెళ్ళిన వైపే చూస్తూండిపోయాడు నిరంజన్.
***
ఆరోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన నిరంజన్‌కి అతని భార్య నీలిమ, కుమార్తె శాలిని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
“రాహుల్ భోజనం చేసి వెళ్ళాడా?” భోజనం చేస్తూ భార్యను అడిగాడు నిరంజన్.
“ఆఁ చేసాడు. వెళ్ళేముందు మీ ఆశీర్వాదం తీసుకొవాలని మీకు కాల్ చేశాడు. మీ ఫోన్ బిజీ అని వచ్చిందట” అంది నీలిమ.
“అవును. సిటీలో గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చాలా సెక్యూరిటీ ఏర్పాటు చేశాము. అయినా ఎక్కడో ఒకచోట అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రోజంతా ఫోన్లతో కంప్లైంట్‌లతో బిజీ. అయితే ఇంటికి బయలుదేరేముందు వాడికి కాల్ చేసాను. నా ఆశీస్సులు అందజేసాను” అన్నాడు నిరంజన్.
“మీతో మాట్లాడితే వాడికి ఆనందం. మీ మాటలు వాడిని ఎంతో మోటివేట్ చేస్తాయట” అంది నీలిమ.
“నా మాటలు కొందరిని ఇరిటేట్ కూడా చేస్తాయి” అన్నడు నిరంజన్ సంయుక్తని తలచుకుంటూ.
“బాధ్యత తెలిసిన వాళ్ళకు మాత్రం మీ మాటలు అమృత గుళికల్లా ఉంటాయి నాన్నా” అంది శాలిని.
“ఇంతకీ మన కమ్యూనిటీ హాలులో న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరిగాయి?” అని శాలినిని అడిగాడు నిరంజన్.
“చాలా బాగా జరిగాయి నాన్నా. అన్ని ఫ్లాట్స్ నుంచి దాదాపు యాభైమంది హాజరయ్యారు. పాటలు, డ్యాన్సులు, మిమిక్రీ, గేమ్స్…. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేసారు” అంది శాలిని.
‘గుడ్” అంటూ సంయుక్త విషయం భార్యకి, కుమార్తెకి చెప్పి “క్రొత్త సంవత్సరం వేడుకలు ఇలా జరుపుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఆమ్మాయిలు అర్ధరాత్రి ఒంటరిగా హోటళ్ళకు వెళ్ళడం, ఆపదల్లో ఇరుక్కోవడం అవసరమా అనిపిస్తుంది” అన్నాడు నిరంజన్.
“ఎవరి టేస్ట్ వారిది. ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని మనం ఎలా చెప్పగలం? తమకిష్టమైన పద్దతిలో సెలబ్రేట్ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది” అంది నీలిమ.
“అందుకోసం రిస్క్ తీసుకోకూడదు కదా అమ్మా?” అంది శాలిని.
“రిస్క్ అని నువ్వంటావు. అడ్వెంచర్ అని మేమంటాము” అంది నీలిమ.
“ఆలోచన లేని అడ్వెంచర్ ప్రమాదకరం. సంయుక్త కేసే తీసుకో. తను ఒంటరిగా కాకుండా మరో నలుగురు స్నేహితురాళ్ళతో కలసి వచ్చి ఉంటే ఆ సంఘటన జరిగేది కాదు. ఆ మాత్రమైనా జాగ్రత్తలు తీసుకోవాలి కదా?” అంది శాలిని.
“జాగ్రత్త పడాలి కాని భయపడుతూ కూర్చోకూడదు. ఆంగ్లంలో ఓ కొటేషన్ ఉంది, ఓడ నౌకాశ్రయంలో ఉంటే సురక్షితంగా ఉంటుంది. కాని దానిని తయారు చేసింది అక్కడ ఊరికే ఉంచడానికి కాదు అని. మనిషి విషయంలో కూడా అంతే. ఏ సుఖాలూ సంతోషాలూ లేకుండా ఇంట్లో కూర్చుంటే ఆ జీవితానికి అర్థం లేదు” అంది నీలిమ.
“సుఖాలూ సంతోషాలూ లేకుండా జీవించాలని ఎవరూ కోరుకోరు. అన్నీ అనుభవిస్తూనే సందర్భానుసారంగా మన విజ్ఞతను ప్రదర్శించాలి. మన అతి ధైర్యంవల్లో, అతి తెలివివల్లో మనల్ని ప్రేమించేవాళ్ళకు మనస్తాపం మిగల్చకూడదు” అన్నాడు నిరంజన్.
“నా మనసులోని మాటను చెప్పారు నాన్నా. అమ్మా.. నేనొక ఉదాహరణ చెబుతాను. కొన్ని అడవుల్లో జంతువులను ఫ్రీగా తిరగనిస్తారు. వాటిని చూడటానికి వచ్చిన మనుషుల్ని మాత్రం క్లోజ్డ్ వెహికల్స్‌లో పంపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెహికల్ దిగవద్దని సూచనలూ, హెచ్చరికలూ ప్రతిచోటా కనిపిస్తూంటాయి. అయినా వెహికల్ దిగితే నష్టం ఎవరికి? మనుషులకేగా?” అంది శాలిని.
“అర్థరాత్రి ఆడపిల్లల్ని రోడ్లపైన తిరగవద్దని సిటీలో ఎక్కడా బోర్డులు పెట్టలేదే? అంత సెక్యూరిటీ పెట్టారంటే తిరగమనేగా అర్థం?” అంది నీలిమ నవ్వుతూ.
“నీ వాదన శాలిని నుంచీ, శాలిని వాదన నీనుంచీ నేను ఎక్స్పెక్ట్ చేసాను. నా ఊహ తారుమారయింది” అన్నాడు నిరంజన్ కూడా నవ్వుతూ.
“ప్రతి విషయాన్నీ రెండు కోణాల్లో విశ్లేషించినప్పుడే సమస్య పట్ల మనకు అవగాహన పెరుగుతుంది. అందుకే నేను సంయుక్త తరపున వకాల్తా పుచ్చుకున్నాను” అంది నీలిమ.
“గుడ్ జాబ్ అమ్మా” కుడిచేతి బొటనవేలిని పైకెత్తి చూపుతూ అంది శాలిని అభినందనపూర్వకంగా.
ఇంతలో తన సెల్ ఫోన్ రింగైతే వెళ్ళి కాల్ రిసీవ్ చేసుకున్నాడు నిరంజన్.
“సార్. నమస్తే. నేను గాయత్రిని”
“చెప్పమ్మా”
“సంయుక్తకి సంబంధించిన సి.సి.ఫుటేజీని చూశాము సార్. ఆ అమ్మయి చెప్పినట్లే ఇద్దరూ హెల్మెట్లు ధరించి ఉన్నారు. అందువల్ల ముఖాలు కనిపించడం లేదు. ఆ అబ్బాయి బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ బైక్ వెనక ఉన్న లైటు వెలుగులో స్పష్టంగా కనిపిస్తూంది సార్”
“ఆ బైక్ ఎవరిదో కనుక్కున్నారా?”
“కనుక్కున్నాం సార్” అంటూ గాయత్రి చెప్పింది విని స్థాణువులా నిలబడిపోయాడు నిరంజన్.
***
తన ఛాంబర్‌లో అడుగు పెట్టిన సంయుక్తని సీరియస్ గా చూసాడు నిరంజన్.
“ఏమిటి సార్ అంత సీరియస్‌గా చూస్తున్నారు?” అని అడిగింది సంయుక్త అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.
“నాలుగు రోజులాగి రమ్మంటే రెండురోజులకే వచ్చేశావుగా. అందుకని”
“పోనీ. ఇప్పుడు వెళ్ళిపోయి సంవత్సరం తర్వాత రమ్మంటారా సార్” వెటకారంగా అడిగింది సంయుక్త.
“అంత దూరం అక్కర్లేదు. ఈ శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు రా”
“నేరస్తుడు దొరికాడా సార్”
“అనుమానితుడు దొరికాడు”
“ఇంటరాగేషన్ చేశారా?” కుతూహలంగా అడిగింది.
“అతను ఊర్లో లేడు”
“లేడా లేక పంపేశారా?”
“ఎవరు. మేమా”
“మీరు కావొచ్చు లేదా అతని తల్లితండ్రులు కావొచ్చు”
“అతను ఐ.ఎ.ఎస్.ఫైనల్ ఇంటర్వ్యూ కోసం డిల్లీ వెళ్ళాడు. శుక్రవారం తిరిగొస్తాడు”
“వాడా? ఐ.ఎ.ఎస్సా?” అంటూ పగలబడి నవ్వి “వాడికంత సీన్ లేదు సార్. వాడు పరమ బేవార్స్ గాడు. వాడు డిగ్రీ కూడా పాసయి ఉండడు” అంది సంయుక్త.
కోపంతో నిరంజన్ కళ్ళు ఎర్రబడ్డాయి.
“వాడిని అంటే మీకెందుకు సార్ అంత కోపం? వాడెమైనా మీ కొడుకా అంతగా కోపంతో బిగుసుకుపోతున్నారు?”
“అవును. వాడు నా కొడుకే” అన్నాడు నిరంజన్.
***
“రాహుల్ అలా చేసాడంటే నేను నమ్మలేకపోతున్నానండీ. ఎక్కడో ఎదో పొరబాటు జరిగి ఉంటుంది” అంది నీలిమ నిరంజన్‌తో.
“నేను కూడా అదే అనుకుంటున్నాను. ఐతే పిల్లలు ఇంట్లో ప్రవర్తించినట్లే బయట కూడా ప్రవర్తిస్తారని మనం అనుకోకూడదు. వాడి స్నేహితులందరికీ పెళ్ళిళ్ళయిపోయాయి. కోరికలు బుసలు కొట్టే వయసులో వీడు ఉన్నాడు. ఒకవేళ వాడు మద్యం గనుక తీసుకుని ఉంటే మద్యం మత్తులో అలా ప్రవర్తించి ఉండవచ్చు. మద్యం యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని నశింపచేస్తుంది” అన్నాడు నిరంజన్.
“నాకు తెలిసి వాడు ఇంతవరకూ మద్యం ముట్టలేదు”
“అవును. నాకూ తెలుసు. కానీ వాడు మొహమాటస్తుడు. స్నేహితులు బలవంతం చేసి తాగించి ఉండవచ్చు. లేదా కూల్ డ్రింక్ అని అబద్దం చెప్పి ఉండొచ్చు. బాగున్నవాడిని చెడిపేవాళ్ళే ఎక్కువ ఈ రోజుల్లో”
“ఆ సి.సి.ఫుటేజీని మీరు చూసారా?”
‘చూశాను. అందులోని వ్యక్తి ఒడ్డూ పొడుగూ మన రాహుల్ శరీరాకృతికి సరిపోతూంది. పైగా వాడు తన బైక్‌ని ఇంతవరకూ తన స్నేహితులెవరికీ ఇవ్వలేదు. ఈ ఒక్కవిషయంలో తను మొహమాటపడడు. తన బైక్ అంటే అంత ఇష్టం వాడికి. అందుకే ఆ ఫుటేజీలో ఉన్నది వాడేనేమో అని నాకు అనుమానం వస్తూంది”
“వాడికి ఫోన్ చేసి అడిగేస్తే ఈ టెన్షన్ తగ్గుతుంది కదా?”
“ఒకవేళ వాడు కాకుంటే, ఆ విషయం మనం ఆ అమ్మాయికి చెబితే తను నమ్మదు. అందువల్ల అమ్మాయి ముందు ఇంటరాగేట్ చేసినట్లు నటించాలి. నటించడం నాకు చేతకాదు”
నిజమేనన్నట్లు తలూపింది నీలిమ.
“వాడి తల్లిగా ఓ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఒకరిని బాధపెట్టి సంతోషించే మనస్తత్వం కాదు వాడిది”
“నీ బిడ్డ మీద నీకున్న నమ్మకమే గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ వాడు దోషి అని నిరూపణ అయితే నన్ను ఏం చేయమంటావు? శిక్షించమంటావా లేదా వదిలేయమంటావా?”
“వాడు దోషి కాకుంటే వదిలెయ్యండి”
భార్యవైపు మెచ్చుకోలుగా చూసాడు నిరంజన్.
***
“మా అబ్బాయిని రైల్వేస్టేషన్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చేయమని చెప్పాను. నీవు అలా కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నట్లు నటించు. అతను రాగానే నీముందే విచారణ మొదలుపెడతాను” అన్నాడు నిరంజన్ సంయుక్తతో.
“స్టేషన్ నుంచి రమ్మన్నారా? ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయి రమ్మనకపోయారా?”
“అనుమానితుడు ఎక్కడ ఉంటే అక్కడికి వీలైనంత త్వరగా చేరుకొవడం మాకు అలవాటు. మా అబ్బాయి పారిపోడు కాబట్టి ఇక్కడికి రమ్మన్నాను”
“మీ అబ్బాయి అంటున్నారుగా… పోనీ వదిలేయండి సార్. అతనికి శిక్ష పడితే మీ ఆవిడ తట్టుకోలేరు”
“అతను దోషి అని ఋజువైతే శిక్షించమని వాళ్ళమ్మ కోరింది”
సంయుక్త మరేం మాట్లాడకుండా వెళ్ళి కుర్చీలో కూర్చుని న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంది.
పావుగంట తర్వాత ఓ యువకుడు వచ్చి నిరంజన్ ఎదురుగా నిలబడ్డాడు. తెల్లగా,పొడుగ్గా, అందంగా ఉన్నాడతను. తెల్లని చొక్కాపై నల్లటి ప్యాంట్ ధరించి టక్ చేసుకుని ఉన్నాడు. చేతిలో ఓ బ్రీఫ్ కేస్. అతని ముఖంలో అలసట, ఉత్సాహం రెండూ కనిపిస్తున్నాయి.
“హలో నాన్నా.. ఎలా ఉన్నారు?” అని నిరంజన్‌ని అడిగాడు.
కొడుకును చూడగానే నిరంజన్ ముఖం వికసించింది.
“హాయ్ రాహుల్. రా కూర్చో” అన్నాడు.
“స్టేషన్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేయమంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎనీ సర్ప్రైజ్ న్యూస్ నాన్నా?” అని అడిగాడు రాహుల్.
“చెబుతాను కూర్చో. ఇంటర్వ్యూ ఎలా చేసావు?”
“చాలా బాగా చేసాను నాన్నా”
“నా కొడుకు ఐ.ఎ.ఎస్. అని నేను గర్వంగా చెప్పుకోవచ్చా?”
“మీరు నా గురించి గర్వంగా చెప్పుకునే రోజుకోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను నాన్నా” ఆ మాట వినగానే సంయుక్త తనలో తాను నవ్వుకోవడం కనిపించిది నిరంజన్‌కి.
“ఓకె. ఆ ఇంటర్వ్యూ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను నిన్నుఇంటర్వ్యూ చేస్తాను. ఆర్ యు రెడీ?” అని అడిగాడు నిరంజన్.
“రెడీ” ఉత్సాహంగా ముందుకు వంగి అన్నాడు రాహుల్.
“డిసెంబర్ ముప్ఫైఒకటవ తేదీ రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావు?”
రాహుల్ ఒక్కక్షణం తెల్లబోయాడు. తర్వాత తేరుకుని “అశోక్ నగర్ లోని మా ఫ్రెండ్ క్రొత్తగా కొన్న అపార్ట్‌మెంట్లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో ఉన్నాను”అన్నాడు.
“మొత్తం ఎంతమంది ఉన్నారు పార్టీలో?”
“యాభై మంది”
“అమ్మాయిలు కూడా ఉన్నారా?”
“ఆ.. పది మంది”
“ఎలా సెలెబ్రేట్ చేసారు?”
“ఆడుతూ,పాడుతూ,తాగుతూ,తూలుతూ,కేరింతలు కొడుతూ…” అంటూ నవ్వాడు రాహుల్.
“నువ్వూ తాగావా?” సీరియస్ గా చూస్తూ అడిగాడు నిరంజన్.
“మీ నుంచి ఈ ప్రశ్న నేనెప్పుడూ ఊహించలేదు నాన్న” అన్నాడు రాహుల్.
“నిన్నిలా ఇంటరాగేషన్ చేస్తానని నేను కూడా ఊహించలేదు”
“ఇది ఇంటరాగేషనా? ఇంటర్వ్యూ కాదా?” ఆశ్చర్యంగా అంటూ చుట్టూ చూసాడు రాహుల్.
ఇద్దరు కానిస్టేబుళ్ళు అతని ఎడమ ప్రక్క ఉన్న కుర్చీల్లో కూర్చుని అతని వైపే చూస్తున్నారు. అంతవరకూ పేపర్ చదువుకుంటున్న అమ్మాయి ఇప్పుడు అతని వైపే ఆసక్తిగా చూస్తూంది.
“నువ్వు నా ప్రశ్నకు జవాబివ్వలేదు” కఠినంగా చూస్తూ అన్నాడు నిరంజన్.
“నేను తాగలేదు నాన్నా” మెల్లగా జవాబిచ్చాడు రాహుల్.
“ఐ.ఎ.ఎస్.పరీక్ష రాసినవాడివి అటువంటి వాతావరణంలోకి వెళ్ళడానికి నీకు మనసెలా ఒప్పింది?”
“వెళ్ళడం నాకూ ఇష్టం లేదు నాన్నా. విశ్వం అమెరికాలో సెటిల్ అవుతున్నాడు. తనిచ్చే చివరి పార్టీ యిదని, తప్పకుండా రమ్మని ఒత్తిడి చేస్తే వెళ్ళాను. అయితే నేను ఆ వాతావరణంలో ఇమడలేకపోయాను. పన్నెండు గంటలకు కేక్ కటింగ్ కాగానే పన్నెండున్నరకు ఇంటికి బయలుదేరాను”
ఆ మాట వినగానే నిరంజన్ ముఖం ఆందోళనతో నిండిపోవడం గమనించింది సంయుక్త .
“తర్వాత ఏం జరిగింది?” ఆత్రంగా అడిగాడు నిరంజన్.
“తీరా బయటకు వచ్చాక నాతోపాటు క్రిందికి వచ్చిన విశ్వం కజిన్ సందీప్ తను అర్జెంటుగా బయటికి వెళ్ళాలని, తన కారుకు అడ్డంగా మరో కారు పార్క్ అయి ఉందని, నా బైక్ తీసుకెళ్తానని అన్నాడు. నా బైక్ మరొకరికి ఇవ్వడం నాకిష్టం ఉండదు. అది మీకూ తెలుసు. అందుకే నేను అర్జెంట్‌గా ఇంటికి వెళ్ళాలని చెప్పాను. పార్టీలో ఒకరికి బీపీ ఎక్కువై పడిపోయాడని, టాబ్లెట్స్ తీసుకు రావాలని చెబితే కాదనలేక ఇచ్చాను. ఆతను తిరిగొచ్చాక తెలిసింది తను డ్రింక్స్ తీసుకురావడానికి వెళ్ళాడని, నాతో అబద్దం చెప్పి బైక్ తీసుకెళ్ళాడని. విశ్వం ముఖం చూసి అతన్ని ఏమనలేకపోయాను”
“తర్వాత నువ్వేం చేసావు?”
“అతనికి బైక్ కీస్, హెల్మెట్ ఇచ్చి, నేను మళ్ళీ పార్టీ జరుగుతున్న చోటికి వెళ్ళాను. అందరూ నన్ను పాటలు పాడమంటే రెండు కిషోర్ కుమార్ పాటలు పాడాను”
నిరంజన్ ముఖంలో రిలీఫ్ కనిపించింది సంయుక్తకు.
“నువ్వు ఆ సమయంలో అంటే దాదాపు ఒంటిగంటకు ఆ పార్టీలోనే ఉన్నావని చెప్పడానికి ఋజువులేమైనా ఉన్నాయా?”నిరంజన్ అడిగాడు.
“నేను పాడుతున్నప్పుడు నా మొబైల్ ఒకతనికి ఇచ్చి ఫోటోలు తియ్యమన్నాను. నా మొబైల్‌లో ఫోటోలతో పాటు అవి తీసిన సమయం కూడా రికార్డ్ అయి ఉంటుంది” అంటూ తన మొబైల్ లోని ఫోటోలను నిరంజన్‌కి చూపాడు రాహుల్.
ఆ ఫోటోలను నిశితంగా పరిశీలించిన నిరంజన్ “గుడ్. ఈ ఫోటోల్లొ సందీప్ ఫోటో ఉందా?” అని అడిగాడు.
“ఉండొచ్చు” అని మొబైల్ తీసుకుని, కాసేపు వెదకి, తర్వాత “ఇదిగో… ఇతనే” అంటూ ఓ ఫోటోను నిరంజన్ కి చూపాడు రాహుల్.
నిరంజన్ సైగ చేయడం చూసి సంయుక్త వారి దగ్గరికి వచ్చింది. నిరంజన్ ఆ ఫోటోని సంయుక్తకి చూపాడు.
ఫోటో చూసి “వీడా?” అంటూ ఆశ్చర్యంగా నోరు తెరచింది సంయుక్త
“ఇతను నీకు తెలుసా?” కుతూహలంగా అడిగాడు నిరంజన్.
“వీడు నా బాయ్ ఫ్రెండ్”
***
రాహుల్‌ని ఇంటికి పంపాక “సందీప్ మీద కేస్ బుక్ చెయ్యమంటావా?” అని సంయుక్తని అడిగాడు నిరంజన్.
“వద్దు సార్. కేసు పెడితే నేను వాడికి ఎదురుపడాల్సి ఉంటుంది. నాకు వాడి ముఖం చూడటం కూడా ఇష్టం లేదు” అంది సంయుక్త.
“నేరస్థుణ్ణి శిక్షించకుండా వదిలెయ్యడం కూడా తప్పే. అతన్ని సెల్ లో వేసి నాలుగు తగిలిస్తాము. అఫ్ కోర్స్ నీ పేరు బయటపెట్టం” అన్నాడు నిరంజన్.
“సార్. ఆ రోజు దోషిని పట్టుకుని శిక్షిస్తానని మీరు అననందుకు మిమ్మల్ని ‘మగ పక్షపాతి’ అన్నాను. ఈ రోజు నేను దొషిని వదిలెయ్యమంటే శిక్షిస్తానని మీరు అంటున్నారు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ మనసంతా ఆడపిల్లల క్షేమం పట్ల ఆందోళణ, జరుగుతున్న సంఘటనల పట్ల అసహనంతో నిండి ఉంది కాబట్టి మీరు నన్ను తప్పు పట్టారని నాకు ఇప్పుడు అర్థమైంది”
నిరంజన్ మౌనంగా తల పంకించాడు.
“ఓ దినపత్రికకు మీరిచ్చిన ఇంటర్వ్యూలో బాధితులు ఎవరైనా మిమ్మల్ని నేరుగా కలవవచ్చని చెప్పారు. అది నేను చదివి ఉండటంచేత ఆ సంఘటన జరిగిన తర్వాత నేరుగా మీదగ్గరికి వచ్చాను. మీరు కూడా నన్ను అక్కడికి ఇక్కడికి త్రిప్పకుండా కేసు మీరే డీల్ చేసారు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ మిమ్మల్ని అవమానించాను, అవహేళన చేసాను. మీరు అంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఎంతో సహనం ప్రదర్శించారు. అంత దూరం నుంచి వస్తున్న కొడుకును నేరుగా స్టేషన్‌కి పిలిపించి విచారించడం, కొడుకు దోషి అని నిరూపణ అయితే శిక్షించమని మీ శ్రీమతి చెప్పడం, తండ్రి గర్వించదగ్గ స్థాయికి తాను ఎదగాలని మీ అబ్బాయి ఆశించడం చూసి ఆశ్చర్యపోయాను. ఎంత ఆదర్శవంతమైన కుటుంబం సార్ మీది? మా అమ్మా నాన్నా పాతికేళ్ళుగా కలసి ఉంటున్నా కలసిమెలసి ఉండటం లేదు. వారి ఇగోలు, అహంకారాల మధ్య పెరిగిన నేను ఆ లక్షణాలనే పుణికిపుచ్చుకున్నాను. మంచి తల్లితండ్రులను ఎన్నుకునే అవకాశం పిల్లలకు లేదు, కానీ మంచి జీవిత భాగస్వామిని ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడా నేను తొందరపడ్డాను. ఏరి కోరి ఓ సంస్కారహీనుణ్ణీ ప్రేమించాను. ఇన్ని తప్పులు నేను చేసి మిమ్మల్ని తప్పు పట్టాను. నన్ను క్షమిస్తారా సార్?” అంది సంయుక్త.
“నీ బాష మారింది, నీ ఆలోచనా విధానం మారింది. నీ ప్రవర్తనను నీవే సమీక్షించుకుంటున్నావంటే మనిషిగా నీ ఎదుగుదల మొదలైనట్లే” అన్నాడు నిరంజన్.
“థాంక్యూ సార్. నా జీవితంలో మీ పరిచయం ఓ మంచి మలుపుగా నేను భావిస్తున్నాను. మనం కలిసింది మూడుసార్లే అయినా మీ నుంచి చాలా నేర్చుకున్నాను. మీ పొజిషన్లో ఉన్నవారు అంత సహనం చూపడం చాలా అరుదు. మీకు కోపం రాదా సార్?”
“వస్తుంది. కానీ నీ వయసున్న అమ్మాయిలపై కోపం రాదు ఎందుకంటే నాకు ఓ కూతురుంది. ఆమె నాతో మాట్లాడుతుంది, పోట్లాడుతుంది, కసురుతుంది, విసుర్లు వేస్తుంది. నువ్వు మాట్లాడుతూంటే నాకు మా అమ్మాయే కనిపించింది. అందుకే నాకు కోపం రాలేదు” అన్నాడు నిరంజన్ నవ్వుతూ.
సంయుక్త రెండు చేతులూ జోడించి నమస్కరించింది అతనికి.