రామం భజే శ్యామలం-40

0
3

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]ఉ[/dropcap]త్తరకాండ లేకుండా పూర్వరామాయణం సంపూర్ణం కాదా? చాలా దశాబ్దాలుగా పండితుల మధ్య నలుగుతున్న ప్రశ్న. దీనికి ఎవరికి వారు తమ తమ కోణాల్లో వ్యాఖ్యానాలు చేశారు. తమ తమ వాదనలకు అనుకూలంగా రామాయణాన్ని అనువర్తింపజేసుకొన్నారు. ఇందుకోసం కొన్ని కొన్ని ఉదాహరణలు, తార్కాణాలు చూపించుకుంటూ వచ్చారు. వాటిలో ఒకటి గాయత్రీ రామాయణం. రామాయణాన్ని 24 వేల శ్లోకాలలో వాల్మీకి రచించాడని, ప్రతి వెయ్యవ శ్లోకం గాయత్రి మంత్రంలోని ఒక్కో శ్లోకాన్ని ప్రతిబింబిస్తున్నదని.. ఇందులో 24వ శ్లోకం మినహా మిగతా 23 శ్లోకాలు పూర్వరామాయణంలోనే ఉన్నాయి. 24వ శ్లోకం కూడా కేవలం సీతకు లవకుశులు పుట్టారని మాత్రమే ఉన్నది. సదరు 24వ శ్లోకం తరువాత అవతార పరిసమాప్తి దాకా దాదాపు రెండువేల శ్లోకాలు ఉంటాయి. కాబట్టి.. ఇంతకుముందు వ్యాసంలో చెప్పినట్టు ప్రతి వెయ్యో శ్లోకం.. అన్న సూత్రం కానీ.. 24 వేల శ్లోకాలు మాత్రమేనని కానీ లెక్కలు వేయడం సమంజసం కాదు. గాయత్రి మంత్రాక్షరాలతో కూడిన రామాయణ శ్లోకాలు సంపూర్ణ రామాయణాన్ని సమగ్రంగా వ్యాఖ్యానిస్తున్నాయన్నది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహానికి ఆస్కారం లేదు. దీనికి మరో రకమైన ఇంటర్‌ప్రిటెషన్ ఇవ్వడం సరికాదు. ఈ విధంగానే పలురకాల అంశాపై చర్చలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. విష్ణుమూర్తి రాముడిగా అవతరించాడు కదా.. అవతారం జరిగినప్పుడు అవతార పరిసమాప్తితో ఆయన కథ సంపూర్ణం కావాలి. అవతార పరిసమాప్తి ఉత్తరకాండలో ఉన్నది కాబట్టి ఉత్తరకాండ పూర్వ రామాయణానికి కొనసాగింపేనని ఒక అభిప్రాయం. నారాయణుడి దశావతారాలలో రాముడు ఏడో అవతారం. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ అవతారాలు ముందుగా వచ్చినవి. వీటిలో పరశురాముడు రాముడికి కొద్దిగా ముందుకాలంవాడు. రాముడి కాలం దాకా ఉండి తన బాధ్యతను అతనికి అప్పగించి వెళ్లాడు. మిగతా ఐదు అవతారాలు లక్ష్యాన్ని సాధించి వెళ్లిపోయినవే. ఆయా దుష్టులను శిక్షించి, ధర్మాన్ని రక్షించి ముగిసిపోయిన అవతారాలే ఇవన్నీనూ. శ్రీరామచంద్రుడు ఒక్కడే పూర్ణమానవుడిగా.. పూర్తి మనిషిగా.. ఒక జీవితకాలం గడిపినవాడు. రామచంద్రుడిని కేవల మానవుడిగా కాకుండా అవతారమూర్తిగా భావించినట్లయితే.. ఆయన అవతార లక్ష్యం రావణ వధ. ఈ మాట మనకు బాలకాండలోనే విస్పష్టంగా కనిపిస్తుంది. రావణవధ తర్వాత రామరాజ్యస్థాపనతో ఆయన లక్ష్యం పూర్తయింది. బాలకాండలో.. 15వ సర్గలో ‘మీరందరూ భయమును విడిచిపెట్టుడు. మీకు క్షేమము కలుగును. మీ హితము కొరకై నేను క్రూరుడును, దురాత్ముడును, దేవతలకు, ఋషులకు భయము కలిగించు వాడును అగు రావణుని.. వాని పుత్ర, పౌత్ర, అమాత్య, మిత్ర, జ్ఞాతి, బాంధవులను యుద్ధమునందు సంహరించి, పదకొండువేల సంవత్సరాలు మర్త్య లోకములో నివసించి ఈ భూమిని పాలింపగలను (27,28) అని నారాయణుడు అభయమిచ్చాడు. అందుకు మునులు.. ‘గొప్ప పౌరుషము కలవాడును, లోకములను ఏడ్పించువాడును అగు ఆ రావణుని సైన్య బాందవ సహితముగా చంపి, చాలాకాలముపాటు ఏ చింతలు లేనివాడవై దేవేంద్రునిచే రక్షింపబడినదియు, దోషములు కాని, పాపములు కాని లేనిదియు అగు స్వర్గలోకమునకు తిరిగిరమ్ము (33) అని అన్నారు. ఇది రాముడి జన్మకు ముందు నారాయణుడి అవతారానికి సంబంధించిన అంశం. ఇక్కడ ఆయన అవతార లక్ష్యం రావణ వధ మాత్రమే. అంతకుమించి మరేమీ లేదు. ఇది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రత్యేకంగా అవతార పరిసమాప్తి గురించి ఇక్కడ కొద్దిమాత్రం కూడా ప్రస్తావించలేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ‘బుద్ధిమంతుడగు విష్ణుదేవుడు దేవతలకు ఈ విధముగా వరములిచ్చి.. మనుష్యలోకములో అవతరించుటకు తగిన స్థానమును గూర్చి ఆలోచించెను. పద్మపు రేకులవంటి నేత్రములు గల ఆ విష్ణువు తనను నాలుగు విధములుగా చేసి దశరథుని తండ్రిగా చేసికొనుటకు ఇష్టపడెను.’ బాలకాండ 15వ సర్గ 29 నుంచి 31 శ్లోకాలలో చెప్పిన మాటలివి. మనం ఇంతకాలం కథల్లో, నాటకాల్లో, బాపు సినిమాల్లో చూసినట్టు శంఖం, చక్రం, ఆదిశేషువు.. రాముడి తమ్ములుగా పుట్టారని అనుకొంటూ వస్తున్నాం. కానీ.. వాల్మీకి రామాయణంలో నారాయణుడు తనను తాను నాలుగు విధములుగా చేసుకొన్నాడట. ఇప్పటివరకు ఏ ఒక్క పండితుడూ.. పెద్దవారు.. విజ్ఞులు ఈ విషయాన్ని మనకు ఎందుకు చెప్పలేదు? ఆశ్చర్యమేస్తుంది.

పోనీ అశ్వమేధం సందర్భాన్నే ప్రామాణికంగా తీసుకొన్నట్టయితే.. యుద్ధకాండ చివరలో రావణ వధ తర్వాత రామరాజ్యస్థాపన కూడా జరిగిపోయింది. ఆ తర్వాత వాల్మీకి చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసిందే. చూడండి.

‘దశ వర్ష సహస్రాణి
దశ వర్ష శతానిచ
రామో రాజ్యం ఉపాసిత్వా
బ్రహ్మలోకం ప్రయశ్యతి’

పదకొండు వేల సంవత్సరాలు రాముడు రాజ్యాన్ని పాలించి, బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. ఇది ఈ శ్లోకానికి అర్థం. అశ్వమేధం సమయంలో విష్ణుమూర్తి చెప్పిన లక్ష్యానికి.. యుద్ధకాండలో వాల్మీకి చేసిన ముగింపు సంపూర్ణమైంది. అంటే రాముడు అవతారపురుషుడైనప్పుడు ఆయన అవతార పరిసమాప్తి కూడా ఈ శ్లోకంతోనే సంపూర్ణమైంది. అలాంటప్పుడు ఉత్తరకాండలో మళ్లీ ప్రత్యేకంగా అవతార పరిసమాప్తి గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది. అందుకోసం యముడు రాముడి దగ్గరకు రావడం.. నువ్వు విష్ణుమూర్తివని ఆయనకు గుర్తుచేసి.. అవతార పరిసమాప్తి గావించడం దేనికి? ఏ విధంగా చూసినా సమంజసంగా అనిపించడంలేదు. బాలకాండలోని అశ్వమేధయాగం సన్నివేశంలో తప్ప రామచంద్రమూర్తి ఎక్కడా కూడా తాను అవతారమూర్తినని చెప్పుకోలేదు. మిరాకిల్స్ ప్రదర్శించలేదు. పరిపూర్ణ మానవుడిగానే వ్యవహరించాడు. మనిషి ధర్మమే నాదని విస్పష్టంగా తేల్చి చెప్పాడు.

పూర్వ రామాయణానికి ఉత్తరకాండ ఆవశ్యకతను సమర్థిస్తూ వినిపించిన మరో అభిప్రాయం దుష్టశిక్షణ, ధర్మ రక్షణ. పూర్వ రామాయణంలో దుష్ట శిక్షణ జరిగిందని, ఉత్తర రామాయణానికి వచ్చేసరికి ధర్మ రక్షణ జరిగిందని.. ఇతిహాస లక్షణం ఇలాగే ఉంటుందని అందువల్ల ఉత్తర రామాయణాన్ని.. పూర్వ రామాయణంతో విడదీసిచూడలేమని పెద్దలు కొందరు అభిప్రాయం వ్యక్తంచేశారు. నాకు తెలిసినంతవరకు దుష్టశిక్షణ, ధర్మ రక్షణ అన్నవి రెండూ సమాంతరంగా సాగేవి. దుష్ట శిక్షణ చేయడం అంటేనే ధర్మ రక్షణ జరగడమని అర్థం. రామాయణం మొదటి నుంచి కూడా ఈ రెండూ జరుగుతూనే వస్తున్నవి. తాటక సంహారం, యాగరక్షణ, మారీచ సుబాహులను జయించడం, అహల్య.. అనంతర కాలంలో జనపదాల్లో ఖరదూషణాది రాక్షస సహారం.. ఇలా రావణ వధదాకా కంటిన్యూగా దుష్టశిక్షణతో పాటు శిష్ట రక్షణ కూడా కొనసాగుతూ వచ్చింది. వనవాసంలో రావణుడి గవర్నర్లు ఖరదూషణులను రాముడు హతమార్చిన తర్వాత ఆయన పరాక్రమాన్ని స్వయంగా చూసిన సీతాదేవి.. ఆనందంతో వచ్చి ఆయన్ను గట్టిగా కౌగిలించుకొని సంతోషం వ్యక్తంచేసింది.

తమ్ దృష్ట్వా శత్రు హన్తారమ్, మహర్షీణాం సుఖావహమ్
బభూవ హృష్టా వైదేహీ భర్తారమ్ పరిషస్వజే

భూమికి భారంగా మారిన ఈ దుష్టులైన శత్రువులను సంహరించి.. మహర్షులకు, ప్రజలకు సుఖం కలిగించావని ఆమె ఎంతో సంతోషించింది. ఇంతకంటే శిష్టరక్షణ ఇంకేం కావాలి? ఉత్తరకాండలో ధర్మరక్షణ అన్నది ఎక్కడా కనిపించదు. అదంతా పూర్వ చరిత్రను చెప్పడానికే ఎక్కువగా ఉద్దేశించింది. అంతేతప్ప ధర్మరక్షణ అన్న సన్నివేశాలు ఒక్కటికూడా కనిపించదు. శంబూకవధ కూడా ధర్మరక్షణగా భావించలేము. రాముడి జీవిత లక్ష్యాలలో దుష్టశిక్షణ అన్నది రావణ, కుంభకర్ణాదుల వధతోనూ సంపూర్ణమైంది. రావణుడి వధతోనే భూమ్మీద ధర్మ స్థాపన జరిగిపోయింది. లంకలో విభీషణుడి పట్టాభిషేకం, అంతకుముందే కిష్కింధలో సుగ్రీవుడి పట్టాభిషేకం. అయోధ్యకు చేరుకున్న తర్వాత సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం దిగ్విజయంగా జరిగిపోయాయి. పూర్ణపురుషులు, మంచివాళ్లు.. ధర్మపరులు రాజ్యాధిపత్యం స్వీకరించడమే ధర్మసంస్థాపన. అంతా శుభంగా జరిగిపోయింది. యుద్ధకాండలోని 128వ సర్గ ఒకసారి చదవండి. ‘వానరులలోని పెద్ద వాళ్లందరూ, వానర శ్రేష్టులూ కూడా వస్త్రములు, రామునిచే భూషణములు బహూకరింపబడి తగువిధముగా సత్కరింపబడిరి. పిమ్మట శత్రుసంహారకుడైన రాముడు ఆలోచించి, మైందద్వివిదులకు, నీలునకు సమస్తమైన కోరదగు వస్తువులను ఇచ్చెను. రాముడు విభీషణుణ్ణి, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి, ప్రధానులైన వారందరినీ కోరదగిన వస్తువులు, పుష్కలమైన రత్నములనిచ్చి తగువిధముగా సన్మానించెను. వాళ్లందరూ చాలా సంతోషించిన మనస్సులతో వచ్చినట్లుగానే తిరిగి వారి వారి స్థానములకు వెళ్లిరి. మహాత్ములైన వానర శ్రేష్ఠులందరూ రామునకు నమస్కరించి, అతని అనుజ్ఞ పొంది కిష్కింధకు వెళ్లిరి. వానరరాజైన సుగ్రీవుడు రామపట్టాభిషేక మెత్సవము చూచి, రాముని సన్మానము పొంది కిష్కింధాపురమును ప్రవేశించెను. తన కులధనమును పొంది రాక్షసరాజైన ధర్మాత్ముడు, గొప్ప కీర్తికలవాడు అయిన విభీషణుడు కూడ రాక్షస శ్రేష్ఠులతో కలసి లంకకు వెళ్లెను.’ యుద్ధకాండలోని 128 వ సర్గ, 84 నుంచి 90 శ్లోకాల సారాంశమిది. దుష్టశిక్షణ ముగిసింది. ధర్మరక్షణ జరిగింది. ఈ మహాయుద్ధంలో తనకు సహాయం చేసిన వారందరినీ రాముడు పేరుపేరునా సత్కరించాడు. లెక్కలేనన్ని కానుకలు అందించాడు. సంతోషంగా వారందరూ తమ తమ స్థానాలకు తిరిగి వెళ్లిపోయారు. లంకలో రావణ వధానంతరం మిగిలిన రాక్షస శ్రేష్ఠులను కూడా రాముడు సత్కరించాడు. వాళ్లంతా ధర్మావలంబులయ్యారు. ఇంతకంటే ధర్మరక్షణం ఇంకేమున్నది? ఉత్తరకాండలో ధర్మరక్షణ చేశారనడానికి ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా కనిపించదు కదా.. మరి పూర్వ రామాయణానికి ఉత్తరకాండ ఏ విధంగా అతుకుతుంది? పోనీ.. పట్టాభిషేకం అనంతరం రామరాజ్యం ఎలా ఉన్నది? ఎందుకు ఇన్ని వేల లక్షల తరాలపాటు ఆదర్శంగా కొనసాగుతూ వచ్చిందని చెప్పిందా అంటే అదీలేదు. రామరాజ్యం ఎట్లా ఉన్నదో, ఎలా కొనసాగిందో ప్రజలు రాముడి పాలనలో ఎలా ఉన్నారో.. యుద్ధకాండలోని 128వ సర్గలోనే 90 నుంచి 102 శ్లోకాల వరకు సవివరంగా, రామరాజ్యాన్ని కండ్లకు కట్టినట్టుగా వర్ణించారు. ఇక ఉత్తరకాండలో ప్రత్యేకంగా చెప్పిందేమున్నది? రాముడి రాజ్యంలో లోపాలున్నాయని చెప్పడానికి సృష్టించబడిందే ఉత్తరరామాయణం. రామరాజ్యంలో ధర్మం తప్పుతున్నారని, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని.. తమ్ములు ఆడినమాట తప్పుతున్నారని చెప్పడమే లక్ష్యంగా సాగిందే తప్ప మరొకటి కానేకాదు.

ఇతిహాస లక్షణాలను ప్రస్తావిస్తూ.. నాయక, ప్రతినాయకుల చరిత్ర చెప్పడం అవసరమన్నది మరో అభిప్రాయం. దీని ప్రకారం కథానాయకుడైన రాముడి చరిత్ర పూర్వ రామాయణంలోనూ.. ప్రతినాయకుడైన రావణుడి చరిత్ర ఉత్తర రామాయణంలోనూ ఉన్నది. అందువల్ల ఇతిహాసం పరిపూర్ణం కావాలంటే.. ప్రతినాయకుడి చరిత్ర కూడా తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఉత్తరకాండ ఆవశ్యకత పూర్వ రామాయణానికి ఉన్నది అని ఆ అభిప్రాయ సారాంశం. ఈ సిద్ధాంతం ఎంతవరకు సరైనదో నాకైతే తెలియదు. కావచ్చేమో. కానీ, రావణుడి గురించిన చరిత్ర పూర్వ రామాయణంలో ఎక్కడలేదు కనుక.. కొత్తగా ఉండాలి? బాలకాండలో రాముడు పుట్టడానికి ముందునుంచే.. దశరథుడి అశ్వమేథయాగం దగ్గరినుంచే రావణుడి చరిత్రను వాల్మీకి వర్ణించుకొంటూ వచ్చాడు. అరణ్యకాండలో శూర్ఫణఖ, మారీచుడు, కిష్కింధకాండలో సంపాతి.. ఇలా అనేక సందర్భాల్లో.. పలు పలు విధాలుగా అనేక పాత్రల ద్వారా రాముడితోపాటు రావణుడి చరిత్ర, గొప్పతనము, క్రూరత్వము సమాంతరంగా చర్చించుకొంటూనే చర్చిస్తూనే వచ్చారు. మన తెలుగు సినిమాల్లో మాదిరిగా విలన్లను తక్కువచేయడం.. హీరోను మాత్రం ఎలివేట్ చేయడం వంటి సన్నివేశాలు మనకు రామాయణంలో మచ్చుకు కూడా కనిపించవు. మారీచుడు ఎంత గొప్పవాడో వాల్మీకి చెప్పాడు. ఖరుడు, దూషణుడు, ప్రహస్తుడు, మేఘనాథుడు, వాలి, జంబుమాలి, ధూమ్రాక్షుడు.. ఇలా ఒక్కో రాక్షసుడి పరాక్రమాన్ని, వీరత్వాన్ని వర్ణించిన తీరు అద్భుతం. ఉత్తరకాండలో రావణుడి చరిత్ర అంటే.. పుట్టుక, ఎదుగుదల మినహా.. మిగతా అన్ని కథలూ కొన్ని ఉపాఖ్యానాల సమాహారంగానే కనిపిస్తుంది. అంతేతప్ప పూర్వరామాయణంలో రావణ చరిత్ర లేదనడం సరికాదు. రామాయణంలో ఉత్తరకాండను సమర్థించే అభిప్రాయాలలో మరొక వ్యక్తమైనది.. సీత అవతార సమాప్తి. ఆమె భూమిలో అవతరించింది.. తిరిగి భూమిలోకే వెళ్లిపోయింది.. సీతాదేవి భూమిలోకి వెళ్లింది ఉత్తరకాండలోనే కాబట్టి.. పూర్వరామాయణంతో లంకె కరెక్టేనని అభిప్రాయం. వాల్మీకి రామాయణంలో మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటి అంటే.. రామాయణంలో రాముడు మినహా సీతాదేవి అవతరించిందని ఎక్కడా వాల్మీకి రాయలేదు. చెప్పలేదు. మిథిల రాజు జనకుడికి భూమిలో దొరికింది సీత. అంతే తప్ప ఆమె అవతరించిందని వాల్మీకి పేర్కొనలేదు. రాముడిని మాత్రమే విష్ణువుగా భావించాడు. అశ్వమేథం సమయంలో విష్ణువు రాముడిగా అవతరించాడని రాశాడే తప్ప సీతాదేవి అవతరించిందని చెప్పలేదు. అవతరించడమనే మాటే సరైనది కానప్పుడు.. ఇక అవతార పరిసమాప్తి అన్న మాటకు అర్థమేమున్నది? సీతాదేవి రామాయణ కావ్యనాయిక. ఇంకా చెప్పాలంటే రామాయణ కర్త. రావణ వధను సంకల్పించింది ఆమే. రాముడి ద్వారా చేయించింది కూడా ఆమే.. ఆమె సంకల్పమాత్రం చేతనే సమస్త రామాయణ గాథ ఆవిష్కారమైంది. భూమ్మీద దుష్టశిక్షణ జరిగింది. సీతాయాశ్చరితం మహత్ అన్నదే రామాయణం మరోపేరు. రామాయణంలో సీతాదేవి ప్రాధాన్యం ఏమిటి? ఎలా సాగిందన్నది తరువాతి వ్యాసాల్లో విపులంగా చర్చించుకోవచ్చు. ఇక్కడ ఉత్తరకాండను ఏదోవిధంగా వాల్మీకికి ఆపాదించడానికి ఇలా పలు కారణాలు, వ్యాఖ్యానాలు వెతుక్కోవడం.. చెప్పడం సమంజసం కాదేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here