[box type=’note’ fontsize=’16’] కాబినెట్ మినిష్టర్‌గా… సుప్రసిద్ధ కవి నీరజ్ గారి అనుభవాలపై హిందీలో డా. ప్రేమ్‍కుమార్ రచించిన వ్యాసాన్ని తెలుగులో అనువదించి అందిస్తున్నారు డా. టి.సి. వసంత. [/box]
[dropcap]మ[/dropcap]ధ్యాహ్నంకి ముందు నీరజ్‌గారి ఇంటికి ఎప్పుడైనా వెళ్ళండి, వారు ఏదో ఒక పని చేస్తూ మనకి కనిపిస్తూ ఉంటారు. వార్తాపత్రికలు, వారపత్రికలు చదువుతూ ఉంటారు, లేకపోతే ఏవో లెక్కలు చేస్తూ ఉంటారు. ఒక వేళ ఇట్లా చేయకపోతే అక్కడ ఉన్న వస్తువులను అటు ఇటు సర్దుతూ, లేకపోతే తన ఫైళ్ళల్లో ఏవో కాగితాలను వెతుకతూ ఉంటారు. అదీ కాకపోతే వారి దగ్గర ఎవరో ఒకరు కూర్చుని ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే సింగ్ – సింగ్ పిల్లవాడిని ఆడించే నెపంతో తను ఆడుతూ ఉంటారు.
ఆ రోజు నేను వెళ్ళినప్పుడు, అరచేతి పైన గడ్డం అనించి కుడి మోకాలు పై కుడి చేయి ఆనించి మొబైల్ మీద వేళ్ళతో కొడుతూ, ఏవో ఆట ఆడుతున్నట్లుగా ఆడుకుంటున్నారు. కాదు, ముఖం పైన ఒక ఆటగాడి హావభావాలు లేవు. విసుగు-కోపం వ్యక్తం అవుతున్నాయి – “చూడు… ఫోన్‌లో డేట్, టైమ్ తప్పు వస్తున్నాయి” అన్నారు. లేదు అన్నా మాట వినగానే కొంచెం కోపం ఎక్కువయింది.- “ఇవాళ సింగ్-సింగ్ లేడు. అతడు లేకపోతే అసలు ఏ పని జరగదు. నేను అసహాయుడిని. ఆ నీరజ్ (ఇతడు ఆలీఘడ్ నివాసి. అనుభూతి కే ఫూల్ అన్న పత్రికకి సంపాదకుడిగా ఉండేవారు. అతడు చనిపోయాడు.) ని డాక్టర్‌కి చూపించడానికి తీసుకువెళ్ళాడు. అసలు డాక్టర్ ఏం చెప్పగలుగుతాడు. అసలు కాంపాస్ ఎట్లా వచ్చిందో, పాపం నీరజ్ చిన్నవాడు. లివర్లో స్వెల్లింగ్ వచ్చింది” అని అంటూ తల వైపు ఉన్న చిన్న బాగ్‌ని తీసారు. నాకు నిన్న సింగ్ – సింగ్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మరకలపై రాయడానికి షేవింగ్ క్రీమ్ అడిగాను. సింగ్-సింగ్ క్రీమ్ తీసుకు రాకుండా “బాబా బాగ్‌లో ఉంది. అడిగితే తీసి ఇస్తారు” అని అన్నారు. ఇప్పుడు ఆయన చార్జర్‌ని తీసారు. చార్జ్ పెట్టడానికి సింగ్-సింగ్ భార్యని పిలిచారు. అమ్మా చార్జింగ్ పెట్టమ్మా – అంటూ ఏవేవో తీస్తున్నారు, పెడుతున్నారు.
ఇవాళ నేననుకున్నాను దేనితో మొదలు పెట్టను? అసలు ఏ విషయం గురించి అడిగినా ఆయన ప్రవాహంలా చెప్పుకోపోతూనే ఉంటారు. విషయం ఎన్ని మలుపులు తిరిగినా, ఆయన ఎంత విశ్లేషణ చేసినా అసలు బోర్ కొట్టదు. ఏదో ఒకటి చెప్పేందుకే చెబుతున్నారులే అని అనిపించదు. చెప్పిన ప్రతి దాంట్లో ఎంతో విలువ ఉంటుంది. అర్థం ఉంటుంది. ములాయమ్‌సింహ్ యాదవ్ గురించి చెప్పడం మొదలు పెట్టారు.
“ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయమ్‌సింహ్ యాదవ్‌గారు గడ్డు రోజుల్లో నేను పడ్డ కష్టాలు – కడగండ్లన్ని చూసారు. ఆయన చేసిన సంఘర్షణను నేను చూసాను. ఆయన జీవితంలోని ఆటుపోట్లు, ఎగుడు-దిగుడులని నేనూ చూసాను. అందుకే సహజంగా మా ఇద్దరి మధ్య స్నేహ సంబంధం పెరిగింది. వారు నాకు ‘యష్ బారతీ’, ‘పద్మశ్రీ’ ‘పద్మభూషణ్’ చివరికి ‘కాబినెట్ మినిస్టర్’ పదవిని ఇచ్చి నన్నెంతో గౌరవించారు. ప్రేమను పంచారు. ఆయన ఎప్పుడు నన్ను తన కుటుంబ సభ్యుడగానే చూసారు. కాబినెట్ మినిష్టర్ హోదా దొరికినప్పటికీ వారు ఎప్పుడు తన అధికారాన్ని నా మీద చూపలేదు. బహుశ ఏ ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున కవులను-కళాకారులను గౌరవించి ఉండి ఉండరు. 2006లో నాకు కాబినెట్ మినిష్టర్ స్టేటస్ లభించింది. మార్చ్ 20న ప్రొద్దున్న ములాంయ్‌సింహ్‌గారు ఫోన్ చేసారు. “మీకు నేను ఒక మంచి బహుమతిని ఇవ్వదలుచుకున్నాను. ఉత్తర్ ప్రదేశ్ భాషా సంస్థాన్‌కి కార్యకారి అధ్యక్షుడిగా మీకు కాబినెట్ మినిష్టర్ స్టేటస్‌ని కలుగుచేస్తున్నాను.” అన్నారు. “మీ ఫోన్ నుండి నాకు ముందే సూచన వచ్చింది” అని నేనన్నాను. “ఎవరు చెప్పారు?” అని ఆయన అడిగారు. “శ్రీ శివపాల్ యాదవ్” అని నేను చెప్పాను. “నేను ఒక దెబ్బ వేస్తాను” అని నవ్వుతూ అన్నారు. “ఇప్పుడిక అంతా మీరే చూసుకోండి” అని నేనన్నాను. నేను మార్చ్ 23న పొద్దున్న అక్కడ భాషా సంస్థాన్‌కి వెళ్ళాను. సంస్థానంలో 3 గదులు ఉన్నాయి. ఒక ఆఫీసు గది, ఒక లైబ్రరీ, మరో గది. లైబ్రరీకి వెళ్ళాను. పుస్తకాల సర్ది ఉన్నాయి. ఒక కుర్చీ ఉంది. ఒక అమ్మాయి పుస్తకాలను ఆటు ఇటు సర్దుతోంది. ఆ సమయంలో ఇద్దరు అమ్మాయిలు డైలీ చార్జీల మీద పనిచేస్తున్నారు. ఒకరు డైలీ ఛార్జీల మీద మరొకరు నెలసరి జీతం మీద. ఇంకా కొందరు ఉన్నారు. అక్కడి స్థితి చూసి నేను చాలా బాధపడ్డాను. అందులోను చిందరవందరగా పడి ఉన్న పుస్తకాలను చూసి మరీ బాధ పడ్డాను. ఈ నలుగురు కాకుండా ఆలీ సిద్ధికీ అనే వ్యక్తి కూడా పని చేస్తున్నాడు. అతడు ఉర్దూ అకాడమీలో పార్ట్ టైమ్ 1500 రూపాయల జీతం మీద పని చేస్తున్నాడు. నాకు ఉండటానికి ఎటువంటి సదుపాయం లేదు. ఇందిరా బిల్డింగ్‌లో ఏడో అంతస్థులో, అక్కడే మా ఆఫీసు ఉంది, దాని వెనకాల ఒక గెస్ట్‌హౌస్ ఉంది, అందులో ఒక ఎ.సి రూమ్‌ని బుక్ చేసాను. నాకు గౌరవ వేతనం నెలకు 5 వేలు వచ్చేది. 5 వేలు ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్, రాష్ట్రంలో పర్యటించడానికి ప్రతీ రోజు 600 రూపాయలు ఇచ్చేవాళ్ళు. రాష్ట్రం బయట పర్యటిస్తే 700 రూపాయలు దొరికేవి.
ఇంటి కోసం నేను వెతకడం మొదలు పెట్టాను. మొట్టమొదట నెహ్రు ప్లేస్‌లో ఒక ఇల్లు చూపెట్టారు. నాకు అంతగా నచ్చలేదు. తరువాత రాజ్‌భవన్‌కాలనీ మొదటి అంతస్థులో 5 వై. 28 ఛాంబర్ ఇల్లు ఖాళీ ఉందని తెలిసింది. అది కనక నాకు నచ్చితే ఖాయం చేస్తానన్నారు. నేను వెళ్ళి చూసాను. నాకు నచ్చింది. లోపల రెండు గదులు ఉన్నాయి. ఒకటి బయట పెద్ద డ్రాయింగ్‌రూమ్. మూడు బాత్‌రూమ్‌లు. ఏమైనా గవర్నమెంటులో ఏ పని అయినా తొందరగా కాదు. అందరికి తెలిసిందే. నాకు మూడు నెలలు పట్టింది ఆ ఇంటిని బాగు చేయించడానికి. ఏ.సి, ఫ్రిజ్, గీజర్, ఒక వంటామె, ఇరవై నాలుగు గంటలలు ఒక నౌకరు అన్ని సదుపాయాలు లభించాయి, రెండు నెలలు తరువాత కాబినెట్ మినిస్టర్ స్టేటస్‌కి తగ్గట్లుగా ఆఫీసు తయారయింది. నేను ఎప్పుడైనా ఏ నగరానికైనా వెళ్ళేటప్పుడు, అక్కడి డి.ఎమ్, ఎస్.ఎస్.పి కి ముందుగానే ఫాక్స్ ద్వారా నా ఆగమనం గురించి చెప్పాలి. నేను మొదటిసారి ఆలీఘఢ్ వెళ్ళినప్పుడు నన్ను తీసుకు వెళ్ళడానికి ఎర్ర లైట్ ఉన్న ఒక కారు ఉంది. పోలీసులు వెంట ఉన్నారు. నేను ఆ అంబాసిడర్‌లో వచ్చినప్పుడు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. లక్నోలో నాకిచ్చిన కారు మొదట రాజు ఖైయ్యు దగ్గర ఉండేది. డ్రైవర్ నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను.
అక్కడ ఉన్న ఇద్దరమ్మాయిలు ఆరు నెలల క్రితం వాళ్ళిద్దరిని పర్మనెంట్ చేయాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు. డైలీ వేజ్‌స్ పైన పని చేసే అంజు సింహ్‌కి ఆమె దగ్గర అర్హత ఉంటే పర్మనెంట్ చేయిస్తానని నేను చెప్పాను. ఆ అమ్మాయి బి.ఎ, ఎల్.ఎల్.బి. రెండో అమ్మాయి అకౌటెంట్ కావాలని కోరుకుంటోంది. ఆ అమ్మాయి ఆఫీసు అనుభవం తనకు ఉంది అని అబద్ధం చెప్పింది. కాని ఆమెకు ఎక్స్‌పీరియన్స్ లేదు. అంటే అర్హత లేదు. అయినా ఈమె తోటి అమ్మాయి పర్మనెంట్ అయితే ఈమెకి ఏదో ఒకటి చేద్దామని నేను అనుకున్నాను. కాంట్రాక్ బేసిస్ మీద అపాయింట్ చేద్దామని అనుకున్నాను. తరువాత ఆమెను పర్మనెంట్ చేయడం ఈజీ అవుతుంది. ఆమె ఆఫీసు పని కూడా నేర్చుకుంటుంది అని నేననుకున్నాను. కాని ఆమె ఇట్లా చేస్తే తన ఏడు సంవత్సరాల పని కౌంట్ కాదని, వ్యర్థం అయిపోతుందని అని నిరాకరించింది. డబ్బుల లెక్కలు అకౌటెంట్ చేతిలో ఉంటాయని ఆమె అకౌటెంట్ కావాలని కోరుకుంటోంది. “ఇంతకు ముందు నీవు ఏం చేసేదానివి” అని నేననడిగాను. “లాటరీ నడిపేదాన్ని” అంటే జూదం ఆడేది. అందుకే ఆమెకు ధనం ముఖ్యం. ఎట్టి పరిస్థితులలోను ఆ అమ్మాయి అకౌటెంట్ కావాలనే కోరుకుంది. ఆమెకు అర్హత లేదు కాబట్టి ఆ పోస్ట్ ఇవ్వలేనని ఎన్నో సార్లు చెప్పాను. అర్థం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాను. ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. పైగా హైకోర్టులో తనకు అవమానం జరిగిందంటూ కేసు వేసింది. కాని కేసు ఓడిపోయింది. మళ్ళీ రివిజన్ చేయించింది. మళ్ళీ ఓడిపోయింది. ఆమెకు అనుభవం లేదు అయినా అబద్దం చెప్పింది. అందుకనే ఓడిపోయింది. అదే సమయంలో ఒక రీసర్చ్ ఆఫీసరు ఫోస్టు ఖాళీగా ఉంది. ఒక అమ్మాయిని ఆ పోస్టుపైన 12500 రూపాలయకు జీతం పైన ఆపాయింట్ చేసాను. అందువలన ఆమె ఇంకా కోపం పెంచుకుంది. ఆకాశరామన్న పేరున తనకు అన్యాయం జరిగిందంటూ ఉత్తరాలు టైప్ చేసి పంపించేది. ‘నాకు అన్యాయం చేసి ఆమెకు ఉద్యోగం ఎట్లా ఇచ్చారు?’ అని ఆమె యూనియన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మంత్రితో పాటు కొందరు నా దగ్గరికి వచ్చారు. నేను అన్ని కాగితాలని ఇచ్చాను. నేను ఎంతో తెలియ చెప్పాను. కాని ఆమె వినలేదు. టెలిఫోన్‌ని దురుపయోగం చేసేది. దాన్ని నేను లాక్ చేయించాను. అల్‌మారాలోంచి రిజిస్టర్ తీసి హాజరు లేకపోయినా హజరు అయినట్టు సైన్ చేసేది. అకౌంటెంట్ అని పక్కన రాసేది. దాన్ని జిరాక్స్ తీయించింది. నాకు వ్యతిరేకంగా, సంస్థానానికి వ్యతిరేకంగా మహిళా ఆయోగ్‌కి కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ కూడా ఆమెకు చుక్కెదురయింది. రాజ్య మంత్రి దగ్గరికి వెళ్ళింది. ఆయన లెటర్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. తను కేసును గెలిచినట్లుగా ప్రతీ చోట చెప్పుకుంది. తరువాత పోలీసు స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్ రాయించింది. మానసికంగా తనను వేధిస్తున్నానని రాసింది. నేను అక్కడ లేనప్పుడ సబ్‌ఇన్‌స్పెక్టర్ వచ్చాడు. ఆయనకి ఫైళ్ళు చూపించారు. విరుద్ధంగా తప్పుడు రిపోర్ట్ రాయించినందుకు నిన్నే లాకప్‌లో పడేస్తాం అంటూ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆ అమ్మాయిని బెదిరించాడు. “అసలు ఇక్కడ ఈమెను డ్యూటీలో నుండి తొలగించినప్పుడు మాటి మాటికి ఆఫీసుకు ఎందుకు వస్తుంది, ఎందుకు గొడవ చేస్తుంది?” అని నేను స్టాఫ్‌తో అన్నాను. ఆమెకు వ్యతిరేకంగా ఎఫ్.ఐ.ఆర్ రాసారు. ఆమె ఒకసారి “నేను నీరజ్ ఇంటి ముందు బట్టలను చింపేసుకుని నిల్చుంటాను, మీడియాని పిలుస్తాను, నా పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించాడు అని చెబుతాను” అని స్టాఫ్‌తో చెప్పింది. నిజానికి ఇటువంటి దుష్ట స్త్రీని నేను ఇంత వరకు చూడలేదు. నేను రిజైన్ చేసి వెనక్కి వచ్చేసాను. నిజానికి నేను అట్లా చేయడం ఎంతగానో మంచిది అయింది. లేకపోతే లేనిపోనివన్నీ కల్పించి నన్ను కేసులో ఇరికించేది.
నేను దాదాపు ఒక సంవత్సరం పని చేసాను. ఎంత పని చేయాలనుకున్నానో అంతగా పని చేయలేకపోయాను. ఆ సమయంలో 45 రోజులు సెలవు తీసుకుని అకౌటెంట్ హజ్ యాత్రకు వెళ్ళాడు. 60 రోజులు డైరెక్టర్ సెలవు తీసుకున్నాడు. ఎవరికో ఒకరికి జబ్బు, ఎవరో ఒకరు చనిపోవడం. విదేశీయాత్రలు… శనివారం ఆదివారాలను తీసేస్తే, మిగిలిన సమయంలో మూడు పెద్ద కార్యక్రమాలను చేసాను – ఒకటి భోజపురి, అవధి, ఉర్దూ, హిందీ భాషలు కలిపి ఒక పెద్ద కార్యక్రమం జరిపాను. కవి సమ్మేళనం ఏర్పాటు చేసాను. సఫలీకృతం అయింది. పేరు పొందిన నృత్యాంగన శోభానా నారాయణ ప్రోగ్రాం పెట్టించాను. ఆమె ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ కూడా. ప్రోగ్రాం పెద్ద ఎత్తున జరిగింది. ‘ఢిల్లీ మషాయిరాకీ ఆఖరీ షమా’ అన్న పేరన జరిగింది. దీనిని ‘తమ్ సీలీ ముషాయిరా’ అని అంటారు. బహదుర్ షా జాఫర్ దర్బార్‌లో ఆ సమయంలో ఉన్న షాయర్లు వాళ్ళ వాళ్ళ వస్త్రధారణ చేసుకుని షేర్ షాయరీ చెబుతారు. బహదుర్ షా రోల్‌ని నేను చేసాను. “ఐదు నిముషాలైనా వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించమని నేను ములాయామ్‌సింహ్‌ని ప్రార్ధించాను.” “నేను ప్రారంభం చేసి వెళ్ళిపోతాను, కాని నేను ఎక్కువ సేపు కూర్చోలేను, నడం నొప్పి బాగా ఉంది” అని ఆయన చెప్పారు. “మీరు కూర్చోకండి, తెరను పై కెత్తి, ఆరంభించి వెళ్ళండి” అని నేను చెప్పాను. తెర ఎత్తిగానే ఆ దృశ్యం చూసి ఆయన స్థబ్దులైయ్యారు. ‘రాజ దర్బార్’ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అంతే చెప్పులు విప్పేసి కూర్చున్నారు. దాదాపు రెండు గంటలు కూర్చున్నారు. ఉర్దూ వార్తాపత్రికలు ఎంతో ప్రశంసించాయి. ఇది నా టైమ్‌లో చేసిన పెద్ద కార్యక్రమం. ఇప్పటికీ అందరు ‘రాజ దర్బార్’ ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఆ సంస్థ కోసం ఎంతో చేయాలని ప్రయత్నిం చేసాను. ఎంతో కష్టపడ్డాను. అసలు ఆ సంస్థ ఒక విధంగా మృతప్రాయమే అని చెప్పాలి. దానిని మళ్ళీ నిలబెట్టాలనుకున్నాను. కొంత వరకు సఫలీకృతడయ్యాను. కాని మినిస్టరీలో ఫైళ్ళు కదలవు, అంతా ఆలస్యమే, కార్యచరణ వాళ్ళ ఇష్టప్రకారం జరుగుతుంది. అందుకే అనుకున్నంతగా పని చేయలేకపోయాను. ఎంతో కష్టం మీద ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చాను. మీరే చూస్తున్నారుగా ఇప్పటి వరకు సంస్థ పునరుద్ధరణ, నవీకరణ ఎంత మాత్రం జరిగిందో! కార్యకారణీ మీటింగులు కూడా జరగడం లేదు. లైబ్రెరియన్, క్యాటలాగర్, ఫుల్ టైమ్ ఎకౌంటెంట్ పదవులు ఇప్పటిదాకా అట్లాగే ఖాళీగా ఉన్నాయి. లైబ్రరీ అనాథావస్థలో ఉంది. దాదాపు ఇరవై అయిదు వేల పుస్తకాలు ఉన్నాయి. చాలా వరకు నేల మీద అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. వాటిని పెట్టడానికి రాక్‌లు కూడా లేవు. పుస్తకాల దొంగతనం జరుగుతోంది. రెండున్నర వేల జీతంతో రిటైర్ అయిన ఒక వృద్ధుడికి ఉద్యోగం ఇచ్చారు. ఆయన పుస్తకాలను దొంగిలించాడు. ఒక సారి రీసెర్చ్ అధికారి ఆయనను పట్టుకున్నాడు. ఆ ముసలాయనను జైలుకు పంపలేం కదా! చివరకి కొంత డబ్బు కట్టమన్నారు. “జరిగిందేదో జరిగింది, ఈ ముసలితనంలో ఆయనకి ఈ మచ్చ ఎందుకు? భావ్యం కాదు” అని డైరెక్టర్ అన్నారు. నేను గవర్నమెంటులో పని చేసాను. కాని చాలా బాధపడ్డాను. ఇంతకు ముందు జిల్లా సూచనాధికారిగా పని చేసాను. అప్పుడు ఇట్లాంటి అవకతవకలను చూసాను. అసలు ప్రతీ చోట గవర్నమెంటు ఇట్లాగే ఉంటుందేమోనని అనిపిస్తుంది. ఫైళ్ళ విషయంలో త్వరగా పని పూర్తిచేయాలి అని ముఖ్యమంత్రి ఆదేశం వస్తూనే ఉంటుంది. అయినా ఏ పని త్వరగా పూర్తి కాదు. నేనసలు కనీసం స్వీట్స్ కూడా అడగలేదు. కాని ఏం చేస్తాం అంతే…. నీతీ నిజాయితీలు ఇక్కడ పనికి రావు.
కాబినెట్ మినిస్టర్‌ని కనుక ఒక గన్నర్ నా వెంట ఉండాలి. కాని నాకు శత్రువులు ఎవరు ఉంటారు? నన్ను చంపేవాళ్ళు ఎవరు అని, అసలు గవర్నమెంటుకి ఖర్చెందుకు దండగ అని నేను గన్నర్‌ని పెట్టుకోలేదు. ఆలీఘడ్ వెళ్ళేటప్పుడు వెహికిల్‌ని, సెక్యూరిటీ గార్డ్‌ని పిలవాలి. మొట్టమొదటిసారి ఇదంతా ఏర్పాటైయ్యాక నేను డ్రైవర్‌ని అడిగాను “స్టేషన్ నుండి ఇంటి దాకా వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది?” “మీరు అరకిలో మీటర్ వెళ్ళినా, నాలుగైదు మీటర్లు వెళ్ళినా చార్జీ రెండొందల కిలోమీటర్లకే వేస్తారు. 9 రూపాయలు కిలోమీటర్‌కి, అంటే రెండు వేల రూపాయలు దాకా అవుతాయి.” డ్రైవర్ చెప్పాడు. నేను అలీఘడ్ నుండి బయటకి మేరఠ్, ముజఫర్ నగర్, ఢిల్లీ వెళ్ళాలంటే బయట నుండి వెహికల్ తెప్పించాలి. అలీఘడ్‌లో మూడు వి.ఐ.పి. వెహికల్స్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ దొరకకపోతే బరేలీ, సీతాపూర్ లేకపోతే మరి ఇంకెక్కడి నుంచైనా తెప్పించుకోవాల్సి వచ్చేది. అసలు ఇటువంటి కంఫర్ట్స్ ఎక్కవ దొరుకుతాయి. ఈ ఖర్చంతా ప్రజలు ఇచ్చే సొమ్మే కదా! నేను కారులో చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళగలుగుతాను. నాకు ఈ ఖర్చు విషయం తెలిసాక, ఆలీఘఢ్ వచ్చాక వెహికల్‌ని తెప్పించడం మానేసాను. అందరు నన్ను మూర్ఖుడిగా చూసారు. అయినా ఇదంతా దుబారా ఖర్చని నేను మానేసాను.
మాయావతి అధికారంలోకి రాగానే నేను రిజైన్ చేసాను. మూలాయమ్‌సింహ్‌కి పంపించాను. ఉత్తరప్రదేశ్ హిందీ సంస్థాన్‌కి శ్రీ సోమ్‌ఠాకూర్ ఉపాధ్యాక్షుడుగా ఉండేవారు. ఆయన “ఎందుకు రిజైన్ చేస్తున్నారు? గవర్నర్ అపాయింట్‌మెంటు చేసారు. ములాయమ్‌సింహ్ ప్రాతినిధిత్వం అప్పుడు వహించాను ఇప్పుడు మాయావతికి” అంటూ అందరూ ఎంత చెప్పినా వినలేదు. రిజైన్ చెయ్యలేదు. చివరికి ఆయనని తీసేసారు. అతడు చేసిన ఈ పని వలన ఆయనకే కాదు మొత్తం సాహిత్య-జగత్తుకి అవమానం జరిగింది. పరువు- ప్రతిష్ఠలకు దెబ్బ తగిలింది.
నేను చెప్పినట్లు పదవీవ్యామోహం తగదు. ఇది ఎంతో ప్రమాదకరమైనది. ప్రాప్తించిన సౌకర్యాలు లేకుండా పోతే ఆ వ్యక్తి మళ్ళీ రాజకీయల వైపు మొగ్గు చూపుతాడు. ఇప్పుడు నేను ఎప్పుడైనా లక్నో వెళ్తే ఎవరో ఒక స్నేహితుడికి ఫోన్ చేస్తాను. ఆ వ్యక్తి కారు తీసుకుని వస్తాడు. గెస్ట్‌హౌస్‌లో రిజర్వేషన్ చేయిస్తాడు. రిక్షాలో వెళ్తుంటే ఎవరైనా చూసినా ఒక రకంగా అగౌరవమే కదా అని అనిపిస్తుంది. నా దగ్గర పని చేసిన ధీర్ సింహ్ “సాబ్ మీరు చింతించకండి, మీరు ఫోన్‌లో ఎప్పుడు వస్తున్నారో చెప్పండి. నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను” అని ఒక రోజు అన్నాడు. అతడు ఖాళీగా ఉంటే అతడే వస్తాడు, గెస్ట్‌హౌస్ బుక్ చేస్తాడు, అతడు ఖాళీ లేకపోతే మరెవరినైనా పంపిస్తాడు. అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నేను ఎప్పుడు అతడికి కృతజ్ఞతుడినే. ఇది వరకు గెస్ట్‌హౌస్‌కి కిరాయి కట్టల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం కట్టాలి. ఇప్పటికీ అక్కడి వాళ్ళందరు నాకెంతో గౌరవం ఇస్తారు. అంటే నా నడత వాళ్ళకి ఎంతో నచ్చిందన్నమాట.
నాకు గవర్నమెంటులో పెద్ద పదవి లభిస్తుందని నాకు ముందే తెలుసు. నాకు జ్యోతిష్య శాస్త్రంలో కొంత జ్ఞానం ఉంది. నవమేష దశ వచ్చినప్పుడు మార్పు వస్తుంది. నవమేష్ స్థాయి నివాసం నుండి షడాష్టక్ యోగం కలుగుతుంది. అటల్‌బిహారీ గారి స్థానపరివర్తన నవమేష్ దశలోనే జరిగింది. మొదట పైదాకా, మళ్ళీ కిందికి వచ్చేసారు. లోక్‌సభ ఎలక్షన్లలో చాలామంది భవిష్యవాణి తప్పయింది. కాని టైమ్ అండ్ ఆస్ట్రాలజీ పేరున వచ్చే జ్యోతిష్య శాస్త్ర ఇంగ్లీషు పత్రికలో పడ్డ భవిష్యవాణి నిజం అయింది. ‘నైదర్ అటల్ నార్ సోనియా, ఎడాక్ హర్స్ మే లీడ్ ఇండియా’. జ్యోతిష్యంలో సత్యం ఉంది అని నా నమ్మకం. దీని అర్థం తెలుసుకోలేని వాళ్ళు జ్యోతిష్యన్ని కొట్టిపడేస్తారు అది వేరే విషయం – బ్రహ్మండీయ సంగీత్ – మ్యూజిక్ ఆఫ్ ద కాస్మాస్ పేరే జ్యోతిష్యం. నేను ఇట్లా రాసాను – “ జ్యోతిష్ లయ బ్రహ్మండ్ కీ, బహుతీ సరితా సమాన్, ఉర్గమ పర్ అధ్యాత్మ్ హై, సంగమ్, పర్ విజ్ఞాన్” (బ్రహ్మాండం లయయే జ్యోతిష్యం. ప్రవహించే సరితతో సమానం. ఉద్గమం ఆధ్యాత్మికం. సంగమ్ విజ్ఞానం).
~