[dropcap]నే[/dropcap]నిప్పుడు…..
రాజులకథలు కాదు
పేదలవ్యథలను చదువుతున్న
గంపనెత్తినెత్తుకుని
వీధి వీధి తిరిగే కూరలమ్మి
బతుకును చదువుతున్న
బస్టాప్ పక్కకు చింపులగోనెసంచీ పై కూర్చొని
తెగిన చెప్పులు అతికే ముసలమ్మ కు
ఎవరైనా దిక్కైయ్యారో లేదో గమస్తున్న
కోటీసెంటరునంటిపెట్టుకుని
జీవిస్తున్న వందలకుటుంబాల
కన్నీటి ప్రవాహానికి ఆనకట్ట వెతుకుతున్న
చార్మినార్ వీధులకిరువైపులా తోరణాలు కట్టినట్లు
నిత్యం కళకళలాడే గాజుల దుకాణాల కుటుంబాల
బతుకులు ఎలా అతుకుతున్నారో తెలుసుకుంటున్న
అంతస్తులమేడలకు ఇటుకలు పేర్చే వారి
కూలిన కూలీలు బతుకులను ఎలా
నిర్మించుకుంటున్నారో తెలుసుకుంటున్న…..
నాలుగిళ్ళల్లో పాచీపని చేసుకుని పొట్టపోసుకునే
అభాగ్యుల ఆకలిఘోషకు ముగింపును సరిచేస్తున్న
తెల్లారగట్లా కూడలిలో గుంపులుగా నిలబడి
దొరికిన పని చేసుకునే అడ్డాకూలీలకు
ఇప్పుడెలా గిట్టుబాటవుతుందో కనుక్కుంటున్న
మధ్యాహ్నం భోజన పథకం కింద రోజూ పౌష్టికాహారం తిని
నాలుగక్షరాలను వల్లెవేసే బంగారు బాలల కోసం
వారి తల్లిదండ్రులు ఏ పథకాలను తాకట్టు పెడుతున్నారో
ఆరాతీస్తున్న
అక్కడక్కడా పచ్చని చెట్లలా కరుణించిన దయగల
మహారాజులు చేస్తున్న సాయం
అసలైన పేదలకు అందుతున్నాయా అని శోధిస్తున్న
నేనిప్పుడు…
రాజుల కథలు కాదు నేటికాలంలో
జరుగుతున్న వ్యథాపూరిత బతుకు గాథలను
రేపటి తరాలకు కథలు కథలుగా
చెప్పాలని చరిత్ర రాస్తున్న
అదే ప్రపంచంలో బతుకుతున్న నేను
ఇంతకంటే ఏం చేయగలను….?
ఈ ఉపద్రవం నుండి ఎలా బయటపడాలోనని
ఆలోచించడం తప్ప…!!