రెండు ఆకాశాల మధ్య-15

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ప్పటికింకా దేశ విభజన జరగలేదు. భారతదేశం ఆంగ్లేయుల పాలనలోనే ఉంది. తన పెళ్ళయిన ఓ ఏడాది తర్వాతే అఖండ భారతదేశం రెండుగా విడిపోయింది.

తనకు హుందర్మో గ్రామం నుంచి పెళ్ళి సంబంధం వచ్చినపుడు, అన్న తీవ్రంగా వ్యతిరేకించాడు.

“హుందర్మో గురించి మీకు తెలియదు నాన్నా.. నేను రెండు మూడుసార్లు వెళ్ళాను. ఎత్తయిన కొండల మధ్యలో ఉండే చిన్న వూరు.. హసీనా సుఖపడలేదు” అన్నాడు.

“యిల్లు కొండ మీదుందా అడవి మధ్యలో ఉందా అనేది ముఖ్యం కాదురా. అబ్బాయి ఎలాంటి వాడనేదే ముఖ్యం. నేనా కుర్రవాడి గురించి ముస్లిం పెద్దల్తో మాట్లాడాను. చాలా బుద్ధిమంతుడని చెప్పారు. ఐదు పూటలా నమాజ్ చదువుతాడు. పెద్దలంటే గౌరవం.. కష్టపడి పొలం పండించుకుంటున్నాడు. అంతకన్నా ఏం కావాలి?” అన్నాడు నాన్న.

“ఐనా అసలింత చిన్న వయసులో హసీనాకి పెళ్ళేమిటి నాన్నా.. అదింకా చిన్న పిల్ల” అన్నాడు అన్న.

అది వినగానే అమ్మానాన్నా యిద్దరూ నవ్వారు. “నీ కళ్ళకు అది ఎప్పుడూ చిన్న పిల్లలానే కన్పిస్తూ ఉంటుందిరా. ఇప్పుడెంత వయసనుకున్నావు? పదిహేనేళ్ళు నిండి పదహారు నడుస్తోంది. నీ ఇద్దరు చెల్లెళ్ళకు పధ్నాలుగేళ్ళు నిండకుండానే నిఖాలు చేసి పంపించాం. హసీనా పెళ్ళికే ఓ యేడాది ఆలస్యమైందని నేనూ నాన్నా దిగులు పడ్తుంటే నువ్వేమిట్రా” అంది అమ్మ.

కాపురానికొచ్చిన కొత్తలో తనకీ వూరు అస్సలు నచ్చేది కాదు. ఎటుచూసినా కొండలు.. రాళ్ళూ రప్పలు.. పచ్చదనంతో అలరారే జోరాఫాం గుర్తొచ్చేది. అబ్బాజాన్ చెప్పినట్లే తన భర్త షరీఫ్ చాలా మంచివాడు. నెమ్మదిగా, చిన్నపిల్లల్తో మాట్లాడుతున్నంత ప్రేమగా, మృదువుగా మాట్లాడతాడు. రోజులు హాయిగా గడిచి పోయాయి. పేదరికం వల్ల తనూ తన భర్తా శారీరక శ్రమ పడ్డారు కానీ మానసికంగా ఎప్పుడూ కష్టపడలేదు. నలుగురు పిల్లలు.. ముగ్గురమ్మాయిలు ఒకబ్బాయి… మీ అమ్మ పోలిక అంటాడు షరీఫ్.

పుట్టిల్లు గుర్తొచ్చినపుడల్లా పిల్లల్ని పిల్చుకుని జోరాఫాం వెళ్ళేది. తన అన్నకు తను గుర్తొస్తే చాలు వూళ్లో పండించిన కూరగాయలు సంచిలో వేసుకుని “బాగా గుర్తొచ్చావు హసీనా.. వచ్చేశాను” అంటూ నవ్వేవాడు.

పందొమ్మిది వందల నలభై యేడు జులైలోనే వూహాగానాలు మొదలయ్యాయి. దేశం రెండుగా చీలిపోతుందని తెలుసు..

కానీ ఎక్కడ నుంచి ఆ విభజన రేఖ పోతుందనే విషయం మీద ఎన్ని అపోహలో.. జోరాఫాం కూడా పాకిస్తాన్‌లో భాగమౌతుందని కొందరంటే, తమ వూరు కూడా హిందూస్తాన్‌లో కలిసిపోతుందని కొందరు…

హిందూస్తాన్లోనో పాకిస్తాన్లోనో తమ వూళ్ళు కలవడం వల్ల వచ్చే లాభం, కలవకపోతే వచ్చే నష్టం ఏమిటో మొదట ఆమెకు అర్థం కాలేదు. అదే విషయం తన భర్త షరీఫ్‌ని అడిగింది.

“దేశం రెండుగా విడిపోయాక సరిహద్దు రేఖ వెంబడి ముళ్ళ కంచె వేస్తారని పెద్ద వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ సిపాయీల గస్తీ కూడా ఉంటుంది. అటువాళ్ళు యిటు యిటువాళ్ళు అటు వెళ్ళడానికి వీలుండదు” అన్నాడు.

“దానివల్ల మనకేం నష్టం?” అని అడిగింది.

“నీలా జోరాఫాం నుంచి యిక్కడికి కాపురానికి వచ్చినట్టే, యిక్కడి ఆడపిల్లలు చుట్టుపక్కలనున్న ఏదో వూరికి కాపురానికి వెళ్ళి ఉంటారుగా… బంధువుల మధ్య రాకపోకలు యిప్పటివరకూ సజావుగా జరుగుతున్నాయి. పొరపాటున సరిహద్దు రేఖ ఈ వూళ్ళ మధ్యలోంచి పోవటం జరిగితే మనం ఓ దేశంలో మన బంధువులు మరో దేశంలో ఉండిపోతాం.. మధ్యలో అడ్డుగా ముళ్ళ కంచె..”

అప్పటికీ ఆమెకు సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియలేదు.

“యింత అమాయకురాలివైతే ఎలా” అంటూ తన భర్త మందలించాడు. “ఒకవేళ మీ వూరు జోరాఫాం హిందూస్తాన్‌లో ఉండిపోయి మన వూరు పాకిస్తాన్‌లో భాగమైందనుకో. అప్పుడు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళలేవు… మీ అన్న మనింటికి రాలేడు.”

“సిపాయీ భయ్యాల్ని బతిమాలుకుంటే పంపించరా” అంది.

షరీఫ్ పెద్దగా నవ్వాడు. “బతిమాలుకున్నా పంపరు.. కాళ్ళు పట్టుకున్నా పంపరు. ఎవరైనా దొంగచాటుగా దాటడానికి ప్రయత్నిస్తే తుపాకీతో కాల్చేస్తారు” అన్నాడు.

“మరి మా పుట్టింటికి వెళ్ళాలంటే వేరే దారే లేదా?”

“ఏమో నాకూ తెలియదు. వేచి చూడటం తప్ప మనం చేసేదేముంది?”

తనకు చాలా భయమేసింది. అలా జరిగితే తన అన్నను కల్చుకోవడం యిక కలగా మిగిలిపోవాల్సిందేనా? ఆమెకు వెంటనే మరో ఆలోచన వచ్చింది. తన అన్నను చూడాలనుకుంటే యింత కష్టపడాల్సిన పనేం ఉంది? కంచెకు అటువైపు అన్న నిలబడ్డాడు. యిటువైపు తనుంటుంది. యిద్దరూ ఒకర్నొకరు చూసుకోవచ్చు.. మాట్లాడుకోవచ్చు…

అదే మాట తన భర్తతో అంటే అతను కూడా కొన్ని క్షణాలు ఆలోచించాక “అలా చేయవచ్చనుకుంటా.. మిలట్రీ వాళ్ళు ఒప్పుకుంటే చాలు..” అని కొంత విరామం తర్వాత “ముళ్ళ కంచె బదులు ఎత్తయిన గోడ కట్టొచ్చేమో అని కూడా అనుకుంటున్నారు. అలా జరిగితే అటువైపున్న మనుషులు మనకు కనపడరు.. వినపడరు” అన్నాడు.

ఆ మాట వినగానే తన గుండెల్లో రాయి పడింది. అమ్మో.. అలా జరిగితే ఏమైనా ఉందా.. తను తన పుట్టింటికి వెళ్ళకుండా, అన్నను చూడకుండా ఉండగలదా? తన అన్న ఉండగలడా?

అందుకే నమాజ్ చదివిన ప్రతిసారీ అల్లాకు దువా చేసేది “నా పుట్టిల్లు నా మెట్టినిల్లు ఒకే దేశంలో ఉండేలా అనుగ్రహించు” అని.

అల్లా తన మొర ఆలకించినట్టు లేదు. ఏది జరక్కూడదని కోరుకుందో అదే జరిగింది. జోరాఫాం హిందుస్తాన్‌కి, తమ వూరు పాకిస్తాన్‌కి పంచబడ్డాయి. రెండు వూళ్ళ మధ్య సరిహద్దు రేఖ గీయబడింది. అది సరిహద్దు రేఖలా అన్పించలేదు… రెండు వూళ్ళ మధ్య కత్తులు వరసగా పేర్చినట్టు అన్పించింది.

తన పుట్టింటినుంచి రాకపోకలు బంద్ అయ్యాయి. ఎపుడో ఓసారి వచ్చే కార్డు ముక్కలో “హసీనా బహెన్.. ఎలా ఉన్నావు? చాలా గుర్తొస్తున్నావు తెలుసా? నిన్న కలలో కూడా కన్పించావు. నిన్ను చూడాలని ఎంత కోరిగ్గా ఉందో తెలుసా? చనిపోయేలోపల నిన్ను ఒక్కసారైనా చూసే అదృష్టం ప్రసాదించమని అల్లాను వేడుకుంటున్నా” అంటూ ఫక్రుద్దీన్ తన మీద ఉన్న ప్రేమనంతా ఉర్దూ అక్షరాల్లో నింపేస్తుంటాడు. అవి చదువుకుని కొన్ని రోజులపాటు తను తన అన్నని తల్చుకుని కన్నీరు కారుస్తూ ఉంటుంది.

ఆమెకు వెంటనే ఓ విషయం గుర్తుకొచ్చింది. అన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చాలా రోజులైంది. అన్న ఎలా ఉన్నాడో ఏమిటో? ఆరోగ్యం బాగోలేక రాయలేదేమో… రషీద్ ఎలా ఉన్నాడో.. ఫర్హానా ఎలా ఉందో.. పెళ్ళి సంబంధం కుదిరినట్టు మూడు నెలల క్రితం రాశాడు. నిఖా ఎప్పుడు పెట్టుకునేది తెలియబరుస్తానన్నాడు. ఎందుకో మరి ఆ తర్వాత ఉత్తరాలు లేవు. నిఖా పక్కా అయి ఉంటే అన్న తెలియబర్చకుండా ఉండడు.

ఒక్కసారిగా ఆమెను నిస్సత్తువ ఆవహించింది. ఒకవేళ నిఖా ఫలానా రోజున అని రాసినా తను వెళ్ళగలిగేదా.. లేదు. అంత చుట్టూ తిరిగి వెళ్ళడానికి అవసరమైన డబ్బులు తమ దగ్గర లేవు. షరీఫ్ రోజంతా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకున్నా రెండు పూటలా గోధుమ రొట్టెలో జొన్న రొట్టెలో పిల్లలకు వండిపెట్టే అదృష్టం కూడా ఒక్కోసారి ఉండటం లేదు. అన్న కూతురికి పెళ్ళవుతుందని సంతోషపడటం తప్ప ఆ వేడుకలో పాలు పంచుకునే భాగ్యం తనకు లేదు.

అప్పుడే పొలం నుంచి వచ్చిన షరీఫ్ భార్య తన రాకను గమనించకుండా పరధ్యానంగా ఉండటం చూసి “ఏమాలోచిస్తున్నావు? నేనొచ్చి చాలా సేపయింది తెలుసా?” అన్నాడు నిష్ఠూరంగా.

హసీనా తల తిప్పి తన భర్తవైపు చూసి, “మాఫ్ కరనా.. మనసెందుకో దిగులుగా ఉండి మీరొచ్చిన విషయం గమనించలేదు” అంది.

“ఎందుకూ దిగులు? మీ అన్న గురించేనా?”

“ఔను. అన్న ఆరోగ్యం ఎలా ఉందో ఏమిటో.. ఫర్హానా నిఖా గురించిన కబురు కూడా ఏమీ లేదు.”

“మీ అన్న నీకు చెప్పకుండా తన కూతురి పెళ్ళి చేయడు. తారీఖు యింకా నిర్ణయించుకుని ఉండరు. ఏవో పని వత్తిడుల వల్ల ఉత్తరం రాయడం ఆలస్యమై ఉంటుంది. అంతే తప్ప ఆయన ఆరోగ్యానికేం ఢోకా లేదు.. మనిషి గెడకర్రలా దిట్టంగా ఉంటాడుగా” అంటూ నవ్వాడు.

ఆమె చేపల్ని కడగడం పూర్తి చేసి, వాటితో పులుసు వండటంలో నిమగ్నమైపోయింది.

జొహర్ నమాజ్ వేళ కావడంతో హసీనాకు చెప్పి షరీఫ్ బయల్దేరాడు. హుందర్మోలో మసీదు లేదు. నమాజ్ చేయడానికి ఆ వూళ్లోని ముస్లింలందరూ పక్కనే ఉన్న బ్రోల్మో గ్రామంలోని ‘షేక్ అలీ’ మసీదుకి వెళ్ళాల్సిందే. హుందర్మో నుంచి బ్రోల్మో గామం దాదాపు రెండు మైళ్ళ దూరంలో ఉంటుంది.

షరీఫ్‌కు బ్రోల్మో గ్రామమంటే చాలా యిష్టం. అతనికే కాదు హుందర్మో గ్రామంలోని చాలామందికి ఆ వూరితో విడదీయరాని అనుబంధం ఉంది. మగపిల్లలు చదువుకోడానికి ఆ వూళ్లో ఉన్న బడికే వెళ్ళాలి. షరీఫ్ కూడా అదే స్కూల్లో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువు సాగలేదు. కానీ నమాజ్ చేయడానికి షేక్ అలీ మసీదుకెళ్ళటం మాత్రం మానుకోలేదు.

అతనికి బ్రోల్మోలో చాలామంది స్నేహితులున్నారు. బంధువులు కూడా ఉన్నారు. ఈ రెండు గ్రామాల్లో ఉన్న యువతీ యువకుల మధ్య పెళ్ళిళ్ళు తరచూ జరుగుతుంటాయి. షరీఫ్ పెద్దక్క జైనాబీని కూడా ఆ వూళ్లోని తమీజుద్దీన్‌కిచ్చి నిఖా చేశారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here