ప్రేమించే మనసా… ద్వేషించకే!-22

0
4

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“మ[/dropcap]మ్మీ ప్రేమలో కామం ఉండకూడదన్నావు! ప్రేమలో అనురాగం… ఒకరి మీద ఒకరికి సంపూర్ణ అధికారం ఉండాలన్నదే నా అభిప్రాయం. అసలు మా యిద్దరి అభిప్రాయాలు ఒకటి అవునో కాకుండా మూడు ముళ్ల బంధంతో ముడి పెట్టడం నాకు యిష్టం లేదు మమ్మీ!”

“ఈజ్ ధేర్ ఎనీ ఫాల్స్ ఇన్ మై స్టేట్‌మెంట్” అని ఆవేశంగా అడుగుతున్న సునీత వైపు చూసి… తనలోంచి తన ప్రేగు తెంచుకొని పుట్టిన బిడ్డలో ఎంత చక్కటి ఆలోచనా శక్తి అని ఒక్క నిముషం ఆశ్చర్యపోయింది.

తనకే ఆ ఆలోచన వుంటే అంత తొందరగా కన్నవాళ్లను బాధకు గురి చేసి గుమ్మం దాటేదా?

“మమ్మీ చెప్పు మమ్మీ… నా అభిప్రాయంతో నువ్వు ఏకీభవించలేవా?” అని గుచ్చి గుచ్చి అడుగుతున్న సునీతతో….

“లేదు సునీతా! నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను సంతోషంగా” అంది.

“థాంక్స్ మమ్మీ… థ్యాంక్యూ వెరీమచ్ మమ్మీ” అని…. “ఇంతదాకా చెప్పావే నువ్వు ఆ గుమ్మం దాటినాక డాడీ తన తప్పును తెలుసుకోలేదా?… నువ్వు… నువ్వు… ఎలా ఇంత ఉన్నత స్థానంలో ఇంత ఐశ్వర్యంతో ఉన్నావ్! తాతయ్య, అమ్మమ్మ మనసు మార్చుకున్నారా?” అని ఆసక్తిగా అడుగుతున్న సునీత వైపు చూసి చెప్పటం మొదలు పెట్టింది.

“గుమ్మం దాటిన నేను… ఎక్కడికి వెళ్ళాలో… ఏం చెయాలో తెలియనిదానిలా ఒక్క నిముషం రోడ్డు మీద నిలబడిపోయాను. నేను వెళితే ఎంతో మంది తెలిసినవాళ్లు… ఆశ్రయం యిచ్చేవాళ్లు వున్నారు. కాని ఎవరి దగ్గరికి ఈ స్థితిలో వెళ్లటం ఇష్టం లేక అలాగే కొన్ని క్షణాలు నిలబడ్డాను.

అపుడు నాకు గుర్తొచ్చింది. మా కాలేజీ తాలుకా వర్కింగ్ హాస్టల్ ఉంది. అక్కడికీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అక్కడ నాకు తెలిసిన మేడమ్‌లు ఇద్దరు ముగ్గురు వున్నారు. అంతదాక ఎందుకు ఆ హస్టల్ నడుపుతున్న వాళ్లకి డాడీ బాగా తెలుసు. నన్ను ఎంతో సాదరంగా ఆహ్వనించారు. మా ప్రేమ గురించి కూడా అక్కడ వున్న యిద్దరు ముగ్గురికి తెలుసు. జరగకూడదనిదే ఏదో జరిగిందని వాళ్లు నేను అక్కడకు వెళ్లటంతో గ్రహించారు. కాని విద్యావంతులు, సంస్కారవంతులయిన వాళ్లు ఆ ప్రసక్తే తీసుకురాలేదు. కొద్ది రోజులయిన తర్వాత నాకు తెలిసింది – ఒక కూతురు పోయి ఒక కూతురు గడప దాటడంతో నలుగురిలో మొహం ఎత్తుకోలేక అమెరికాలో వున్న తమ్ముడి దగ్గరకు డాడీ వెళ్లిపోయారట. డాడీ మొదటి నుండి కులం గోత్రం అంటూ పట్టుకు వేలాడేవారు, కాని ఇంత ప్రాముఖ్యత యిస్తారనుకోలేదు… దేనికీలోటు లేకుండా మమ్మీని భగవంతుడు పుట్టించినా తీరని దుఃఖం కూతుళ్లు కల్గించడంతో, మమ్మీ మంచం పట్టి చనిపోయిందిట. మమ్మీ పోయిందని తెలిసి దుఃఖం ఆగలేదు. మమ్మీ పోవడానికి కారణం నేనే! ఒక కూతురు పోయినా నాలో సమతను చూసుకొని… నా కోసం అయినా జీవితం మోయటానికి నిశ్చయించుకున్న మమ్మీ గుండె మీద మరో సమ్మెట పోటు వేసినట్లు నేను గుమ్మం దాటాను. ఏ తల్లి కన్న బిడ్డల ద్వారా పొందని బాధను కల్గించాము. అమ్మ పోయిందని తెలిసిన వెంటనే నేను నా మనసులో ఒకే ఒక్క మాట అనుకున్నాను ‘అమ్మ నన్ను క్షమించు. మరు జన్మ అంటూ వుంటే నీ కడుపున పుట్టి ఋణం తీర్చుకుంటాను’ అని.

నెలలు నిండి బంగారు ఛాయలో అందంతో మెరిసిపోతూ నీవు ఈ భూమి మీద పడ్డావ్! నిజం చెప్పాలంటే నిన్ను చూసిన మరుక్షణం నుండి… నీ పనులతో నిన్ను లాలించి నిన్ను హృదయానికి చేర్చుకుంటున్నా… నీ బోసి నవ్వులు చూస్తున్నా నాకు ఈ ప్రపంచంమే కనిపించేది కాదు.

నీకు అపుడు సంవత్సరం అనుకుంటాను.

నేను కాలేజీలో డిమాన్‌స్ట్రేటర్‌గా పని చేస్తున్నాను. నిన్ను తాయారమ్మకి అప్పగించి నేను చెప్పులో కాలు పెడుతున్నాను.

వాకింగ్ స్టిక్ పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ప్రపంచంలో వున్న బాధలన్నీ నా స్వంతం అన్నట్లు వున్న విచార రేఖలు అలుముకున్న ముఖంతో… డాడీ వచ్చారు.

ఒక్క నిముషం ఆయనను చూసి గుండె ఆగిపోయిన దానిలా ఊపిరి తీయటం మరచి చూసాను.

ఇంచు మించు రెండేళ్లలో ఎంత మారిపోయారు?

యాభై ఏళ్లు వచ్చినా ధృఢంగా బలంగా శరీరపుష్టితో ఆరోగ్యంతో కనబడే డాడీ చిక్కి పోయి పూర్తిగా వృద్ధాప్యంకి చిహ్నంగా నడుం వంగి దవడలు పీక్కుపోయి శరీరం ముడతలు పడి వున్న డాడీని చూసిన నాకు పాత సంఘటనలు మచ్చుకైనా గుర్తుకురాక పోవటంతో రక్త సంబంధమైన ఆప్యాయతతో ‘డాడీ నన్ను క్షమించటానకి వచ్చావా’ అని పరుగున వెళ్లి ఆయన హృదయం మీద వాలి పోయాను.

ఇక బాధను మరీ భరించలేని వాడిలా ‘అమ్మా సుజీ! అమ్మను నా మొండి పట్టుదలకు బలి చేసానమ్మా! అమ్మ ఇక లేదమ్మా! నేను… నేను… మిగిలి ఉన్నానమ్మా… కులం గోత్రం లేని వాళ్లని, మన కులం కాని వాళ్లని కూతుళ్లు ఎంచుకున్నారని ఆగ్రహావేశంతో మిమ్మలను కాదన్నానమ్మా! దేని కోసం అనుకున్నాం? ఈ సంఘం కాకుల్లా పొడుచుకుతింటుందో ఏమో అని కాని…. కాని… నేను ఎంత అవివేకంగా ఆలోచించానో తరువాత గాని తెలిసి రాలేదేమ్మా! నేను ఈ స్థితిలో వున్నానంటే… మీ అమ్మపోయిందంటే ఈ సంఘం వచ్చి మమ్ములను ఆదుకుందామ్మా? ఆ జ్ఞానం అపుడే వుంటే మన జీవితాలు మరోరకంగా వుండేవమ్మా! ప్చ్! అంతా అయిపోయిందమ్మా! తలచుకొన్న కొద్దీ బాధ తప్ప ఫలితం లేదమ్మా. ఈ చివరి రోజులో నన్ను… నన్ను నీ దగ్గర ఉండనివ్వవూ’ అని చంటి పిల్లాడిలా జాలిగా… అడుగుతుంటే కళ్లెత్తి ధైర్యంగా ఆయన కళ్లలోకి చూడలేకపోయాను.

పులిలాగా గంభీరంగా ఉండే… డాడీయేనా ఇలా మాట్లాడుతున్నారు. పరిస్థితుల ప్రాబల్యానికి మనిషి ఎలా లొంగిపోతాడు. ఆయన ఇలా కావడానికి కారణం నేను కారణం కదూ? ఆలోచన రావటమే తడువుగా ‘డాడీ నన్ను క్షమించండి డాడీ. ఆ భగవంతుడు కనిపించినా ఇంత సంతోషం కలుగదు. నేను చేసిన పాపానికే యిలాగైనా మీ ఋణం తీర్చుకోని డాడీ!’ అన్నాను.

నేను ఏ అష్ట ఐశ్వర్యాలు, మేడలు మిద్దెలు అక్కర్లేదు అనుకున్నానో అవి… నా దరి చేరాయి.

ఇదే జీవితసత్యమమో అనిపిచింది!

నా మనసు మాత్రం వేటిని దరి చేరనివ్వదు… ‘నేను… ఉద్యోగం చేస్తున్నాను. ఇంత ఐశ్వర్యం వుంది నువ్వు ఉద్యోగం చేయటం దేనికమ్మా’ అని డాడీ ఒకసారి అడిగారు.

ఏం చెప్పాలో చప్పున తెలియక ‘కాలం వెళ్లదీయడానికే డాడీ’ అన్నాను. రెండు మూడు సార్లు సుదర్శన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘జరిగింది మర్చిపో అమ్మా! నేను వెళ్లి మాట్లాడతాను’ అన్నారు.

‘నా మనసు ఏనాడో రాయి అయిపోయింది డాడీ! సుదర్శన్ ప్రవర్తనతో నాలో నిండి ఉన్న ప్రేమ ఇంకిపోయింది. ఇంకా అతను దేనికి డాడీ. నేను… నేనైనా మీకు కావాలనుకుంటో ఇంకెపుడు సుదర్శన్ మాట ఎత్త వద్దు డాడీ’ అన్నాను. అంతే డాడీ యెంకెపుడు అతని విషయాం ఎత్తలేదు. ఏమూలనో ఆయన మనసులో నా జీవితం ఇలా అయిపోయినందుకు బాధపడుతున్న నీ చిన్నారి చేష్టలు, నీ వచ్చీ రాని మాటలను చూసి మరచిపోయారనే చెప్పాలి.

ఒకసారి సుదర్శన్ నా దగ్గరకొచ్చాడు.. అల్లంత దూరం నుంచే చూసాను… మనిషి మాత్రం చాలా నీరసించిపోయాడు. నిజం చెప్పాలంటే నేను సుదర్శన్ కాదన్నపుడు మనిషి మంచం పట్టి ఎలా నీరసించిపోయాడో అలానే అయ్యాడు. ఆడదాని స్వతసిద్ధమైన బలహీనత వలన ఏమో! నా మనసు సుదర్శన్‌ని క్షమిస్తే అని ఆరాటపడింది.

ఛీ… ఛీ… ఎంత బలహీనమైన మనసు వనితకు భగవంతుడిచ్చాడు. మా ప్రేమను మించినది ప్రపంచంలో మరొకటి లేదని కన్న తల్లిదండ్రులను… అన్ని వదులుకొని గుమ్మం దాటితే ఆ ప్రేమ తన మనసుని ముక్కులు ముక్కలు చేసిన తరువాత ఇంకా ఆ ప్రేమ తన మనసులోకి బలవంతంగా రానివ్వడమా?

నెవర్! వీల్లేదు!… ఆ ప్రేమను గాని, ఆ మనిషిని గాని దరిదాపులకు రానివ్వకూడదు… అని నిశ్చయించుకున్నాను. తరువాత నీకు మూడు సంవత్సరాలపుడు అనుకుంటాను, డాడీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆయన ఇక బ్రతకననుకున్నారామో! నన్ను పిలిచి చేతిలో చేయి వేసుకొని ఇలా అన్నారు.

‘అమ్మా! సుజీ! ఒకనాడు నేను సంపాదించిన ఆస్తిని చూసి నా ఇద్దరి కూతుళ్లుకు మంచి హోదాలో ఉన్న ఉన్నతులకు ఇచ్చి పెళ్లి చేసి… వాళ్లు… ఇద్దరు కాపురాలు చేసుకుంటువుంటే ఆహా నా కూతుళ్లు ఎంత దర్జాగా వున్నారు అని గర్వంగా అనుకోవాలి అనుకున్నాను. కాని నేను అనుకున్నవన్నీ తారుమారయ్యాయి. కనీసం నువ్వైనా ఈ ఆస్తిని అనుభవిస్తావనుకుంటే ఉద్యోగం లేనిదే సాగదన్నట్లు చేస్తున్నావే! నీ మనసు ఎంత దెబ్బ తిందో నాకు తెలుసు. నువ్వు అనుభవించలేని ఆస్తిని కనీసం నా మనుమరాలికి పెళ్లిలో పసుపు కుంకుమ క్రింద ఇవ్వు’ అన్నారు” చెప్పింది సుజాత.

“మమ్మీ! ఇన్నాళ్లు నీ వెనుక యింత కథ వున్నా ఎంత గంభీరంగా వున్నావు… గతాన్ని వెలుపలికి తీయించినందుకు నన్ను క్షమించు మమ్మీ” అంది సునీత.

***

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here