[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
ప్రపౌత్ర శకునేస్తస్య భూపతేః ప్రపిత్రువ్యజః।
అథా వహదశోఖ్యః సత్యసధో వసుంధరామ్॥
యః శాంత కృజినో రాజా ప్రపన్నో జిన శాశనమ్।
శుష్కలేత్ర వితస్తాత్రౌ తస్తార స్తూప మండలైః॥
(కల్హణ రాజతరంగిణి-I, 101, 102)
[dropcap]క[/dropcap]ల్హణుడు రాజుల పరంపరను ప్రాచీన గ్రంథాల నుండి గ్రహించి రాజతరంగిణిలో పొందుపరచాడు. ఆ పరంపరలో రాజు అశోకుడి పేరు కూడా వస్తుంది. అశోకుడు శకుని మనుమడు. జిన శాసనాన్ని స్వీకరించినవాడు. పాపాల నుండి విముక్తి పొందినవాడు. అతడు శుష్కలేత్ర, వితస్తాత్ర లతో పాటు పలు స్తూపాలను కట్టించినవాడు. ఆయన వితస్తాత్ర నగరంలో నిర్మించిన ధర్మారణ్య విహారంలోని చైత్యం ఎంత పెద్దది అంటే దాన్ని చివరకంటా చూడడం మానవ కన్నుకు సాధ్యం కాదు. ఇంకా ఆయన శ్రీనగరం నిర్మించాడు. దేశంలో మ్లేచ్ఛుల ఆగడాలు పెచ్చు మీరటంతో తపస్సు చేసి భూతేశ్వరుడి వరం వల్ల, మ్లేచ్ఛులను తరిమివేసే శక్తి గల పుత్రుడు జలౌకసుడిని పొందాడు.
అశోకుడి గురించి ఉన్నది ఇంత మాత్రమే. మామూలుగా ఈ వివరాలు చూస్తే మనకు పరిచయమైన మౌర్య అశోకుడికి, ఈ అశోకుడికి పేరు తప్ప మరే విషయంలోను పోలికలు కనబడవు. తండ్రి, తాతలు వేరు. పుత్రుడు వేరు. కట్టించిన కట్టడాలు వేరు. రాజ్యం చేసిన ప్రాంతం వేరు. ముఖ్యంగా రాజ్యకాలం పూర్తిగా వేరు.
కల్హణుడు ఇచ్చిన రాజుల జాబితాలో అశోకుడు 48వ వాడు. అశోకుడి గురించిన వివరాలు కల్హణుడికి శ్రీ ఛవిల్లకారుడి పుస్తకం నుంచి లభించాయి.
అశోకా ధభిమన్యో ర్యేప్రోక్తాః పంచమహీభుజః।
తేద్వా పంచాశతో మధ్యా దేవ లబ్ధాః పురాతనైః॥
(కల్హణ రాజతరంగిణి-I, 20)
అశోకుడు, అభిమన్యుడు గురించిన వివరాలను ప్రాచీన గ్రంథాలనుంచి సేకరించాను అని స్పష్టం చేశాడు కల్హణుడు. రాజతరంగిణిలోనే మనకు పరిచయమైన మరో రాజు కనిష్కుడు. కనిష్కుడు 51వ రాజు. కల్హణుడి ప్రకారం రెండవ గోనందుడు రాజ్యం చేసిన కాలం క్రీ.పూ. 3138. మూడవ గోనందుడి కాలం క్రీ.పూ. 1182. ఈ ఇద్దరు రాజుల నడుమ 48 రాజులున్నారు. వీరెవరెవరు ఎంతెంత కాలం రాజ్యం చేశారో తెలియదు. ఇలాంటి పరిస్థితులలో ఈ 48 రాజుల మొత్తం పాలనా కాలన్ని, రాజుల సంఖ్యతో భాగించి, ఒక రాజు పాలనా కాలం ‘ఇది’ అని సగటుగా నిర్ణయిస్తారు. ఇది ఆధునిక చరిత్రకారులు పాటించే ప్రామాణిక పద్ధతి. కోట వేంకటాచలం గారు కూడా ఈ పద్ధతిని పాటించి అశోకుడి పాలనా కాలాన్ని నిర్ణయించారు.
మొదటి గోనందుడికి, మూడవ గోనందుడికి నడుమ 3138 – 1182=1956 సంవత్సరాల కాలంలో 48 రాజులు పాలించారు. అంటే ఈ 48 రాజులు ఒక రాజు సగటున దాదాపుగా 40.8 సంవత్సరాలు పాలించినట్టు భావించాల్సి ఉంటుంది. ఈ లెక్కన అశోకుడి పాలనా కాలం క్రీ.పూ. 1448 నుండి 1400 వరకూ ఉండవచ్చని అంచనా. అంటే రాజతరంగిణిలో కనిపించే అశోకుడు క్రీ.పూ. 15వ శతాబ్దికి చెందినవాడు. అంటే, ఏ రకంగా చూసినా, ఈ అశోకుడు మగధను క్రీ.పూ. 272 నుంచి 230 వరకూ పాలించిన అశోకుడు ఒకటి కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఒక్క పేరు విషయంలో తప్ప, ఇంకే విషయంలోనూ ఇద్దరికీ ఎలాంటి పోలికలు లేవు.
అశోకుడిపై విస్తృతంగా పరిశోధించి, ‘Ashoka, The Search for India’s Lost Emperor’ అన్న పుస్తకం రాసిన చార్లెస్ అలెన్ “ఆధునిక భారతంలో అశోకుడు అన్న పేరు పెట్టుకోవటం అలవాటయింది కానీ ప్రాచీన కాలంలో భారతదేశంలో అశోకుడు అన్న పేరు ఎవరూ పెట్టుకోలేదు” అని రాశాడు. ఆయనకు సీతాదేవి అశోక వృక్షం క్రింద ఉన్నదని తెలియదు. కశ్మీరులో క్రీ.పూ. 15వ శతాబ్దంలో అశోకుడు అన్న రాజు పాలించాడని తెలియదు. ఆయన పుస్తకంలో ‘రాజతరంగిణి’ ప్రసక్తే లేదు. కానీ పాశ్చాత్య చరిత్రకారులు ‘కల్హణుడి రాజతరంగిణిలో మొదటి మూడు భాగాలు చరిత్రగా పరిగణించటం కుదరద’ని తీర్మానించి క్రీ.పూ. 15వ శతాబ్దపు అశోకుడిని క్రీ.పూ. 3వ శతాబ్దం నాటి అశోకుడితో కలిపేశారు. పాశ్చాత్య చరిత్ర రచయితల తీర్మానాలతో భారతీయ చరిత్రకారులు ఏకీభవించకపోయినప్పటికీ, అధికారం ఆంగ్లేయులది కావటం, మనపై మనకున్న న్యూనతా భావాల వల్ల కశ్మీరు అశోకుడు, మౌర్య అశోకుడు ఒకటేనన్నది ‘ప్రామాణికం’ అయింది. క్రీ.పూ. 15వ శతాబ్దం, క్రీ.పూ. 3వ శతాబ్దంతో కలిసిపోయింది. ఈ 12 శతాబ్దాల వదిలేసిన చరిత్రను సమన్వయం చేయటం కోసం కల్హణుడి రచనలో చారిత్రక అంశాలు ప్రామాణికం కావని ‘దోషి’గా కల్హణుడిని, తద్వారా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, శాస్త్రాలన్నిటినీ కటకటాల్లో నిలబెట్టి అణచివేశారు. దీనికి తోడు ‘డిగ్రీ’లు లేని పాండిత్యానికి విలువలేని కాలం కావటం, మన శాస్త్ర విజ్ఞానం అంటే మనకున్న చులకన అభిప్రాయంతో ప్రాచీన భారతీయ గ్రంథాల ఆధారంగా ప్రామాణికంగా చరిత్రను నిర్మించినవారు అవహేళనకు, అవమానాలకు గురయ్యారు. వారి రచనలు ప్రామాణికం కాకుండా పోయాయి [కోట వేంకటాచలం గారి పరిశోధనను ప్రామాణికంగా తీసుకుని కస్తూరి మురళీకృష్ణ ‘కల్హణ కశ్మీర రాజతరంగిణి కథల’లో అశోకుడు క్రీ.పూ. 15వ శతాబ్దం నాటి వాడు అని రాస్తే డెట్రయిట్ (ఇ)ల్లిటరసీ క్లబ్బు లోని తెలివైన అ(కు)పండిత విమర్శకులంతా ఏకగ్రీవంగా ఆ పుస్తకం పనికిరానిదని, అరక్షణంలో తీర్మానించేసి, తమ విదేశీ భావదాస్య విధేయతను, స్వదేశీ శాస్త్ర పాండిత్య రాహిత్యాన్ని గొప్పగా ప్రదర్శించుకుని కాలర్లెగరేశారు. ఈ పనికిరాని (దుర)భిప్రాయాన్ని ఓ నెట్ సాహిత్య పేజీ విమర్శగా భావించి ప్రచురించి తమ (అ)జ్ఞానాన్ని చాటుకుంది. పేజీ నిర్వహించగలగటం తప్ప పరిజ్ఞానం అర్హతగా లేని వారంతా ఎడిటర్లయి సాహిత్య సేవ చేసేస్తూ సాహిత్య పెద్దలయిపోతే సాహిత్యానికి ఏ గతి పడుతుందో తెలియటానికి ఇది చక్కటి ఉదాహరణ].
పాశ్చాత్య చరిత్రకారులు భారతీయ చరిత్ర ప్రాచీనతను ఆమోదించేందుకు ఇష్టపడలేదు. వారికి భారతీయ చరిత్రలోని ప్రాచీనత్వం వేల, కోట్ల సంవత్సరాల లెక్కలు అర్థరహితంగా కనిపించాయి. అబద్ధపు కథలుగా తోచాయి. కల్పిత గాథలుగా అనిపించాయి. వాటిని ఆమోదించి భారతీయ శాస్త్ర ప్రామాణికతను ఒప్పుకునే కన్నా వాటిని తిరస్కరించి తమ తెలివిని ప్రామాణికంగా నిలపటంపైనే వారు దృష్టి పెట్టారు. మేధాపరంగా అధికులయి కూడా మానసికంగా బానిసలయిన భారతీయ అకడెమీషియన్లు కూడా భారతీయ విజ్ఞానం అంతా ‘పనికిరానిద’ని నిర్ధారించటంతో కేవలం పేరులో మాత్రమే సామ్యం ఉన్న దురదృష్టానికి కశ్మీరు అశోకుడు తన అస్తిత్వాన్ని కోల్పోయాడు. భారతదేశ చరిత్రలో 1200 సంవత్సరాలు అదృశ్యమయిపోయాయి. ఈ అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు విశ్వనాథ సత్యనారాయణ ‘హిస్టారికల్ ఫాంటసీ’ రచన శైలిలో ‘పురాణవైర గ్రంథమాల’, కశ్మీర రాజవంశ నవలు, నేపాళ రాజవంశ రచనలు రచించారు.
కల్హణుడు రాజతరంగిణి రచన కోసం పడ్డ శ్రమ మామూలు కాదు. ఒకడే ఒక శక్తి అయి ఈనాటి చరిత్రకారులు, అకాడమీషియన్లు, ప్రభుత్వ గ్రాంట్లు, అసిస్టెంట్ల సమూహాలు, కూలీలు ఉన్నా చేయలేని పనిని సాధించాడు. శాసనాలు పరిశీలించాడు. ప్రాచీన పత్రాలను సేకరించాడు. గ్రంథాలు పరిశీలించాడు. కశ్మీరులోని ప్రతి చారిత్రక స్థలాన్ని అధ్యయనం చేశాడు. సేకరించిన సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టు రాశాడు. ఆయన ఏ రాజునూ ఆశ్రయించలేదు. ఒక సృజనాత్మక కవిగా, దేశభక్తుడిగా, కశ్మీరు ప్రేమిగా, సనాతన ధర్మానురక్తుడిగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడు.
కానీ మౌర్య అశోకుడే కశ్మీరు అశోకుడు అని నిర్ధారించేయాలన్న తపనతో పాశ్చాత్య చరిత్రకారులకు భారతీయ చరిత్రకారులు సమర్థన తెలిపి, కల్హణుడి లెక్కలే తప్పు పొమ్మన్నారు.
“The doubt has been caused by the system of chronology followed by Kalhana, according to which Ashoka has been placed at 1182 BC. Ashoka’s date is fortunately one of the most authenticated in early Indian history falling in the middle of the third century BC and if we credence to Kalhana’s chronological calculations, we should have to place him 900 years before time.” (Culture and Political History of Kashmir, Volume 1. By P. N. K. Bamzai).
కశ్మీరు అశోకుడు, మగధ అశోకుడు వేర్వేరు అని అంగీకరిస్తే, కశ్మీరు అశోకుడు భారతీయ లెక్కల ప్రకారం 15వ శతాబ్దంవాడనో, లేక, పాశ్చాత్యులకు అర్ధమయినా ఒప్పుకోని లెక్కలప్రకారం 12వ శతాబ్దంవాడనో ఒప్పుకోవాల్సివుంటుంది. అది ఒప్పుకుంటే, అశోకుడు బుద్ధుడి అనుయాయి కాబట్టి, బుద్ధుడు క్రీ.పూ. ఆరవ శతాబ్దం నాటివాడు కాదు, 15వ శతాబ్దం కన్నా ముందనో, కనీసం 12వ శతాబ్దం కన్నా ముందరివాడనో భావించాల్సివుంటుంది. అలా భావిస్తే మొత్తం అంతవరకూ నిర్ధారించిన లెక్కలన్నీ తారుమారవుతాయి. కాబట్టి, తమ లెక్కలు తప్పని ఒప్పుకుని మళ్ళీ కొత్తలెక్కలేసేబదులు, అంటే పొడుగు మనిషికి సరిపోయే మంచం తెచ్చేబదులు, మనిషి కాళ్ళు నరకి మంచానికి తగ్గట్టు కుదించటమే సులభం అన్నట్టు, వారి లెక్కలకు తగ్గట్టు ఇద్దరు అశోకులూ ఒకరే అనేస్తే సమస్యవుండదు అనుకున్నారు. అదే నిర్ధారించారు. రాజు ఏదంటే అదే నిజం. అసలు నిజంతో ఎవరికి పని?.
వ్యక్తి పుట్టిన సమయం, స్థలం ఆధారంగా జాతకం రచించటం కాక, వ్యక్తి భవిష్యత్తు నిర్ణయించి దానికి తగ్గట్టు గ్రహస్థితిగతులను అమర్చినట్టు, ముందుగా కశ్మీరు అశోకుడు మగధ అశోకుడే అని నిర్ణయించి, దానికి తగ్గట్టు కశ్మీరు రాజుల చరిత్రను అమర్చారన్న మాట. భారతదేశ చరిత్రలో ఒకే పేరున్న రాజులు ఉన్న ఉదాహరణలు బోలెడు. కశ్మీరు చరిత్రలోనే గోనందులు ప్రాచీన కాలంలోనే ముగ్గురున్నారు. దామోదరులు ఇద్దరున్నారు. మనం వారిని గుర్తించేందుకు మొదటి గోనందుడు, రెండవ గోనందుడు అంటున్నాం. కానీ, రాజతరంగిణిలో అందరినీ గోనందుడు అన్నాడు కల్‌హణుడు. కానీ అశోకుడి పేరున్న రాజు మాత్రం ఒక్కడే, వారిద్దరి నడుమ 1200 సంవత్సరాలు తేడా ఉన్నా! వారి తాతల పేర్లు వేరే, తల్లిదండ్రుల పేర్లు వేరే. వారి పాలనాకాలం వేరే. అదృష్టం, కల్హణుడు కశ్మీరు అశోకుడి భార్యల పేర్లు ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే, మౌర్య అశోకుడు కశ్మీరు వెళ్ళి తాతను, తల్లిదండ్రులను, కొడుకునే కాదు భార్యలను కూడా మార్చేసుకున్నాడని తీర్మానించేవారు మన సృజనాత్మక చరిత్రకారులు.
మౌర్య అశోకుడు, కశ్మీర అశోకుడు ఒకరేననటానికి చరిత్రకారులు చూపే కారణాలు ‘మీది తెనాలి, మాది తెనాలే’ అన్నట్టుంటాయి. అశోకుడి సామ్రాజ్యం గాంధారం, బెలూచిస్తానం వరకూ విస్తరించి ఉంది కాబట్టి, కశ్మీరు కూడా అశోకుడి సామ్రాజ్యంలో భాగమే. కశ్మీరంలో అశోకుడు చాలా కాలం ఉండి ఉంటాడు కాబట్టి ఇతర ప్రాంతాలలో నిర్మించినట్టే విహారాలు, చైత్యాలు నిర్మించాడు. బౌద్ధమతం కశ్మీరంలో ప్రవేశపెట్టి, విస్తరింపజేశాడు. కాబట్టి కశ్మీర అశోకుడు మౌర్య అశోకుడు ఒకడే అని నిర్ధారించేశారు.
మౌర్య అశోకుడి సామ్రాజ్యంలో గాంధారం, బెలూచిస్తానం ఉండి ఉండవచ్చు. కానీ కశ్మీరం ఆరంభం నుంచి, మొఘలులు 16వ శతాబ్దంలో కశ్మీరుపై అధికారం సాధించేవరకు స్వతంత్ర రాజ్యంగానే నిలిచింది. ఎవరికీ సామంత రాజ్యంగా లేదు. గాంధార రాజులతో సరిహద్దు స్పష్టంగా నిర్ణయించుకుని వారిని గీత దాటనీయలేదు. చెంఘీజ్ ఖాన్‌ను సైతం కశ్మీరులో అడుగుపెట్టనివ్వలేదు. కాబట్టి మగధకు చెందిన మౌర్య అశోకుడు కశ్మీరుపై అధికారం సాధించాడన్నది నమ్మశక్యం కాని విషయం. ఒకవేళ మౌర్య అశోకుడే కశ్మీరు వచ్చి ఉంటే చరిత్ర రచనలో మగధ నుండి వచ్చిన అశోకుడు అని ఉండేది తప్ప ‘శకుని మనుమడు అశోకుడు’ అని ఉండేది కాదు. ఒకవేళ అశోకుడు కశ్మీరుకు వచ్చి బౌద్ధం స్వీకరించి ఉంటే (అశోకుడు ‘జిన శాసనం’ స్వీకరించాడని కల్హణుడు రాశాడు) మగధలో అశోకుడు బౌద్ధం స్వీకరించటం కుదరదు. ‘జిన శాసనం’ను బౌద్ధంగా భావించినా, ‘జిన శాసనం’ స్వీకరించిన అశోకుడు, మ్లేచ్ఛులను తరిమేవాడి కోసం శివుడిని ప్రార్థించి జలౌకసుడిని పుత్రుడిగా పొందడం ఆ జలౌకసుడు బౌద్ధాన్ని అణిచివేయటం వంటివి చూస్తే ఏ కోశానా కశ్మీరు అశోకుడు మౌర్య అశోకుడు కాడని స్పష్టంగా తెలుస్తుంది. మౌర్య అశోకుడి కొడుకు ఏం చేశాడో చరిత్రలో అందరికీ తెలుసు. కశ్మీరు అశోకుడి కొడుకు జలౌకసుడు ఏం చేశాడో రాజతరంగిణి చెబుతుంది. అదీగాక అశోకుడు ఏయే కాలంలో ఎక్కడెక్కడ పర్యటించాడో చరిత్రలో వివరాలు లభించాయి. ఆ పర్యటనల్లో కశ్మీరు ప్రసక్తి లేదు. ఆయన అడుగుపెట్టిన చోటల్లా శాసనాలు వేయించాడు. ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. కశ్మీరులో మాత్రం విహారాలు కట్టించాడు, చైత్యం నిర్మించాడు. శ్రీనగరం నిర్మింపజేశాడు. ఇవన్నీ పర్యటనలలో చేయటం సాధ్యం కాదు కాటట్టి కల్హణుడిపై గౌరవంతో, భారతీయ శాస్త్రాలపై విశ్వాసంతో, పూర్వీకులపై నమ్మకంతో, మనకు కనిపిస్తున్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, కశ్మీరు అశోకుడు క్రీ.పూ. వాడని, మౌర్య అశోకుడు వేరని భావిస్తూ, కశ్మీర అశోకుడు శివుడిని ప్రార్థించడం వల్ల మ్లేచ్ఛులను తరిమివేసేందుకు శివానుగ్రహం వల్ల జన్మించిన జలౌకసుడి అద్భుతమైన జీవితం గురించి కల్హణుడు ఏం రాశాడో తెలుసుకునేందుకు ముందుకు సాగాల్సి ఉంటుంది.
తత్కాల ప్రబల ప్రౌద్ధ బౌద్ధవాది సమూహజిత్।
అవధూతో ధవత్సద్ధస్తస్య జ్ఞానోపదేశ కృతమ్॥
(కల్హణ రాజతరంగిణి-I, 112)
కశ్మీర రాజు జలౌకసుడికి ఒక అవధూత సిద్ధుడు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన ఆ కాలంలో గర్వంతో విర్రవీగే శక్తిమంతులైన బౌద్ధసంఘాలను తన వాదంతో ఓడించాడు.
ఇదీ మౌర్య అశోకుడిగా భావిస్తున్న కశ్మీర అశోకుడి పుత్రుడు సాధించిన ఘనకార్యాలలో మొదటిది.
(ఇంకా ఉంది)