లోకల్ క్లాసిక్స్ – 55: కుల జీవి కథ

0
3

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా జాన్ అబ్రహాం దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘అగ్రహారతిల్ కుళతై’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘అగ్రహారతిల్ కుళతై’ (తమిళం)

[dropcap]సాం[/dropcap]ప్రదాయం, ఆచారాలు – వీటితో విభేదించడానికి అదే వర్గంలోంచి ముందుకొచ్చే ఒక అభ్యుదయవాది. ఈ ఏర్పాటుతో 1984లో కోడిరామకృష్ణ తీసిన ‘అదిగో అల్లదిగో’ ఇటీవలే యూట్యూబ్‌లో చూశాం. ఇందులో సాంప్రదాయ వాదాన్ని ఆధ్యాత్మిక వ్యాపకాలకి పరిమితం చేసుకోవాలే తప్ప, అంధ విశ్వాసంగా మార్చుకుంటే లేని పోని సామాజిక అనర్థాలకి సాంప్రదాయ వాదులు మూలమవుతారన్న హెచ్చరిక కన్పిస్తుంది. సాంప్రదాయ వాదుల అంధ విశ్వాసాల చుట్టూ చేరి మూఢ భక్తులు, మూఢ భక్తుల మనోభావాలతో ఆడుకుని అందలా లెక్కే రాజకీయ శక్తులు, రాజకీయ శక్తుల్ని మూఢ భక్తిలోకి లాగి బాముకునే దొంగ బాబాలు, మళ్ళీ ఆ దొంగ బాబాలకి నిలువు దోపిడీలిచ్చుకుంటూ సాష్టాంగపడే అదే జనాలూ… ఇలా వొక విషవలయాన్ని సృష్టించి పెట్టేస్తారన్న అర్థం వచ్చేలా కోడి రామకృష్ణ చిత్రీకరణ చేశారు. సాంప్రదాయ వాదం ఆధ్యాత్మికాన్ని దాటినప్పుడే హేతువాదం ప్రశ్నిస్తుంది. సాంప్రదాయ వాది పాత్రలో గుమ్మడి మానవ వాదాన్ని విస్మరిస్తే, హేతువాదియైన కొడుకు పాత్రలో చంద్రమోహన్ కనువిప్పు కల్గిస్తాడు. అయితే వాస్తవం ఇంత సులభంగా వుండదు. అటూ ఇటూ వాదులాటతో కంఠ శోషే తప్ప, సాంప్రదాయం – హేతువాదం వాస్తవంలో ఏదీ గెలవదు, ఓడిపోదు. యుగాలుగా తెగని పంచాయితీ చేతులు మారుతూ వుంటుంది. హేతువాద విజయమనేది ఒక ఓ కలగానే వుండిపోతుంది.

ఇలాటి కథా ఏర్పాటుతోనే, కలతోనే, మండే సూర్యుడు- కుంగే సూర్యుడులని చూపిస్తూ 1977లో మలయాళ దర్శకుడు జాన్ అబ్రహాం తమిళంలో ‘అగ్రహారతిల్ కుళతై’ (అగ్రహారంలో గార్దభం) తీశాడు. అంధ విశ్వాసాలు కాదు గానీ, మత వ్యవస్థలో వివక్ష గురించి చెప్పాడు. ఈ వివక్షకి వ్యతిరేకంగా మానవ వాదంతో అభ్యుదయం వైపు చూసే అదే వర్గపు పాత్రని నిలబెట్టాడు. ఈ ఏర్పాటుతో వచ్చే సినిమాలు మార్పు లోపలినుంచి జరగాలని ఆశిస్తూంటాయి – ‘శంకరాభరణం’ సహా.       

దర్శకుడు జాన్ అబ్రహాంలో చేగువెరా సాక్షిగా సినిమాలో మార్క్సిస్టు దృక్పథం కనిపించినా, తనది మానవ వాదమని చెప్పుకుంటాడు. తీసింది నాలుగే సినిమాలైనా ఎన్నదగ్గ దర్శకుల్లో ఒకడుగా నిలిచిపోయాడు. ‘అగ్రహారతిల్ కుళతై’ వివాదం సృష్టించినా, తమిళనాడులో నిషేధించినా, ఉత్తమ తమిళ చలన చిత్రం జాతీయ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. 

కథ 

అప్పటి మద్రాసు నగరంలో కొందరు ఆకతాయిలు ఓ గాడిదని వెంటాడి చంపేస్తారు. ప్రొఫెసర్ నారాయణ స్వామి (సంగీత దర్శకుడు ఎంబీ శ్రీనివాసన్) బ్రహ్మచారి. అతను ఓ క్రిస్టియన్ కాలేజీలో ఫిలాసఫీ బోధిస్తాడు. ఆ సాయంత్రం కాలేజీ నుంచి ఇంటి కొచ్చేసరికి ఇంటి ముందు గాడిద పిల్ల వుంటుంది. కొందరు పిల్లలు వచ్చి, దీని తల్లిని మధ్యాహ్నం కొందరు చంపేశారని చెప్తారు. నారాయణ స్వామి ఆ గాడిద పిల్లనే కొన్ని క్షణాలు సాలోచనగా చూసి, దాన్నెత్తుకుని ఇంట్లోకి తీసికెళ్తాడు.

ప్రొఫెసర్ గాడిద పిల్లని పెంచుకుంటున్నాడని కాలేజీలో ప్రాకిపోతుంది. విద్యార్ధులు ఆటలు పట్టిస్తారు. పోస్టర్లు అంటించి నారాయణ స్వామిని హేళన చేస్తారు. దీంతో ప్రిన్సిపాల్ నారాయణ స్వామిని మందలిస్తాడు. గాడిద పిల్లని వదిలించుకోమని హెచ్చరిస్తాడు. చేసేది లేక నారాయణస్వామి గాడిద పిల్లని బుట్టలో కప్పి, బస్సెక్కించుకుని వూరికి తీసికెళ్తాడు. వూళ్ళో బ్రాహ్మణులుంటున్న అగ్రహారంలోకి గాడిద పిల్లని తెచ్చేసరికి ఛీఛీ అనుకుంటారు. నారాయణ స్వామి గాడిద పిల్ల గురించి తల్లిదండ్రులకి చెప్తాడు. ఇది ప్రేమ కోసం తన దగ్గరికొచ్చిందనీ, కాదనలేక పోయాననీ అంటాడు.

గాడిద పిల్లని రెండ్రోజులు ఇంట్లోనే వుంచుకుని, పని మనిషి ఉమ (స్వాతి) కి అప్పగించి మద్రాసు వెళ్ళిపోతాడు. మూగదైన ఉమ గాడిద పిల్లని పెంచుకోవడం మొదలెడుతుంది. రెండు నెలల తర్వాత నారాయణ స్వామి తిరిగొస్తే, గాడిద పిల్లతో అగ్రహారంలో జరిగిన సంఘటనలు తెలుస్తాయి. ఏమిటా సంఘటనలు? వాటితో గాడిద పిల్లకేం సంబంధం? ఆ సంఘటనలతో బాటు, గుడిముందు మృతశిశువు పడుంటే గాడిద పిల్లెలా వూరికి అరిష్టమయింది? దాన్ని చంపేస్తే సంభవించిన పరిణామా లేమిటీ?… ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

వినుకొండ నాగరాజు రాసిన ‘ఊబిలో దున్న’ ప్రసిద్ధ నవల వుంది. ఇందులో ఊబిలో కూరుకుపోయిన దున్నని దాని శక్తిని దానికి తెలిసేలా చేసి, బయటడేసే రైతు అసాధారణ ప్రయత్నం ఇతివృత్తంగా వుంటుంది. రాజకీయ, పాలనా యంత్రాంగాల వల్ల సమాజమెలా ఊబిలో పడి కొట్టుకుంటోందో చెప్పడం రచయిత ఉద్దేశం. ఈ ఊబిలోంచి సమాజాన్ని ప్రజలే తమ ఆలోచనలతో బయట పడెయ్యాలన్న సందేశంతో. దున్నతో ఇది సమాజం గురించి. గాడిద పిల్ల తో అబ్రహాం కథ మతం గురించి. దున్నయినా, గాడిద పిల్లయినా నిర్లక్ష్యానికి గురయ్యే జంతువులు. గాడిద పిల్లయితే అంటరాని అధమజాతి జంతువు. ఇది కుల వివక్ష కథ.

ఫ్రాన్సులో రాబర్ట్ బ్రెసన్ అనే ప్రసిద్ధ దర్శకుడు వున్నాడు. ఈయన సినిమా కళని అనుసరించే, 1969లో మన మణికౌల్ ‘ఉస్కీరోటీ’ తీసి ఆర్ట్ సినిమా రెబల్ అయ్యాడు. మణికౌల్ దగ్గర జాన్ అబ్రహాం అసిస్టెంట్ గా పనిచేశాడు. అయితే 1966 లో బ్రెసన్ ‘ఆ హసద్ బల్తజార్’ అనే ఫ్రెంచి సినిమా గాడిద పి‌ల్లతో తీశాడు. ఈ గాడిద పిల్ల శ్రామిక జీవికి గుర్తు. అది సామాజిక కథ. జాన్ అబ్రహాం దీని స్ఫూర్తితో  ‘అగ్రహారతిల్ కుళతై’ తీశాడు. బ్రెసన్ కథతో ఏమాత్రం సంబంధం లేదు. కేవలం బ్రెసన్ కథలోని గాడిద పిల్లని మన సమాజంలో కుల జీవికి ప్రతీకగా తీసుకోవచ్చని భావించి, కుల మత కథగా చేశాడు. బ్రెసన్ ది కూడా సొంత కథ కాదు. డాస్టోవిస్కీ నవల ‘ది ఈడియెట్’ లోంచి కథా భాగాన్ని తీసుకుని కథ చేశాడు. అప్పటి డాస్టోవిస్కీ రష్యన్ గాడిద అంటే శ్రామిక జీవి గురించే కదా వుంటుంది.

అబ్రహాం గాడిద పిల్ల కుల జీవి. అది వచ్చి అగ్రహారంలో పడింది. మద్రాసులో వున్నప్పుడే నారాయణ స్వామి ఆవు పాలు తాగించి – ‘ఉపనయనం’ చేసి బడుగు కుల జీవిని కలుపుకునే తెగువ ప్రదర్శించాడు. అబ్రహాం కథా సృష్టిలోని గొప్పదనమేమిటంటే ఎక్కడా ప్రతిఘటనలుండవు, వాదోపవాదాలు వుండవు, ఉద్రేకాలుండవు. అగ్రహారవాసులు గాడిద పిల్లని దాని మానాన దాన్ని వుండనిస్తారు. వాళ్ళళ్ళో  కొందరే ఆ గాడిద పిల్ల నుపయోగించుకుని గిట్టని వాళ్ళ మీద కుయుక్తులు పన్నుతారు. అలా గాడిద పిల్ల చివరికి బలౌతుంది. దీన్ని ప్రొఫెసర్ నారాయణ స్వామి అడ్డుకోలేక పోయిన విషాదాంత ముగింపునిచ్చాడు అబ్రహాం.

కథా ప్రారంభం మండే సూర్యుడి మీద అగ్నిని స్తుతించే సుబ్రహ్మణ్య భారతి మహా ప్రకోప గేయంతో వుంటుంది. ముగింపు అదే గేయాన్నినారాయణ స్వామి పుస్తకంలో చదువుతూంటే వుంటుంది. పక్కనే చేగువెరా పుస్తక ముంటుంది. అగ్ని గేయంతో ఇళ్ళు భస్మీ పటలమవుతాయి. శిథిల దేవాలయ శకలాల మధ్య వున్న పీడితురాలు, మూగ పని మనిషి, ఉమని తీసుకుని సూర్యుడ్ని చూస్తూ వుంటాడు నారాయణ స్వామి. అది మండుతున్న సూర్యుడు కాదు. ఉదయిస్తున్న విప్లవ సూర్యుడూ కాదు. కుంగుతున్న మతవాద సూర్యుడు… అతను విప్లవాన్ని చూడడం లేదు, విప్లవంతో ఏం ఆశిస్తున్నాడో అది చూస్తున్నాడు.

తమిళ కవి, సంస్కరణ వాది సుబ్రహ్మణ్య భారతి గేయాన్ని సెర్చి చేసి ఆయన జీవితాన్ని చూస్తే, ఆయన జీవితాన్నే అబ్రహాం కథ చేశాడన్పిస్తుంది. భారతి కుల వ్యవస్థ వ్యతిరేకి కావడం, దళితుడికి ఉపనయనం చేసి బ్రాహ్మణుణ్ణి చేయడం వంటివి చూస్తే…

నటనలు – సాంకేతికాలు 

గాడిద పిల్లకి పెద్ద మార్కులు. తల వంచుకుని అది చేసిన బానిస ‘నటన’కి జోహార్లు చెప్పాల్సిందే. ఉపనయనం చేసిన నారాయణ స్వామి గాడిద పి‌ల్లకి పేరు కూడా పెడితే బావుణ్ణు. బ్రెసన్ సినిమాలో గాడిద పి‌ల్లకి బెల్తజార్ అని పేరు పెట్టాడు. ప్రొఫెసర్ నారాయణ స్వామిగా సంగీత దర్శకుడు ఎంబీ శ్రీనివాసన్ ది సాత్విక పాత్ర, సాత్విక నటన. ఎక్కువగా దీర్ఘాలోచనలో వుంటాడు. ఉపనయనంతో ప్రారంభించి, చేగువేరాకి ప్రయాణించే పాత్ర ప్రయాణంలో లోపించింది సంఘర్షణ. కథే సాత్విక కథై నప్పుడు పాత్రలూ ఇంతే. మూగ పని మనిషి పాత్రలో స్వాతి సరే, ఆమెకి భావోద్వాగాలున్నా భావ స్వచ్ఛకి అవకాశం లేకుండా అన్యాయానికి తల వంచడం. ఇతర పాత్రల్లో నటీ నటులు కూడా కొత్త వాళ్ళే. సాంకేతికంగా అబ్రహాం ఏమాత్రం ప్రతిభ చూపలేదు. తెలుపు నలుపులో చిత్రీకరణ నాణ్యత లేదు. తను అసిస్టెంట్‌గా పనిచేసిన మణికౌల్ విజువల్ సెన్సు గానీ, మణికౌల్‌కి గురువైన బ్రెసన్ అత్యున్నత నిర్మాణ విలువలు గానీ అబ్రహాం సాధించలేక పోయాడు. తెలుపు నలుపులో బ్రెసన్ ‘ఆ హసద్ బల్తజార్’ని కళ్ళప్పగించి చూడాల్సిందే. విషయపరంగా అబ్రహాం చూపిన మేధస్సుకి మాత్రం అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here