[box type=’note’ fontsize=’16’] జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ గోపీనాథ్ మహంతి ఒడియా భాషలో రాసిన కథని తెలుగులో అనువదించి పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి చాగంటి తులసి. [/box]
[dropcap]తొ[/dropcap]మ్మిది అంతస్తుల హోటలులో ఎనిమిదో ఫ్లోరు గదిలో ఏకాంతంగా అతిమెత్తటి సోఫాలో కూచుని, తనలో ఏనాటి నుంచో పేరుకుపోయి ఉన్న తన ఆశల్నీ, విశ్వాసాలని తిరగతోడుకుంటున్నారు దధిసాహు!
“ఏమన్నా అనుగాని, దేశం బాగానే అభివృద్ధి చెందింది” ఆయన తనకి తాను తనలో తాను చెప్పుకుంటున్నారు.
వెనకాముందూ రెండూ చూసినవాడు దేశం పురోగమించిందని అంగీకరించకుండా ఎలా ఉంటాడు? గ్రామ గ్రామానికీ రోడ్లు పడ్డాయి. పడ్తున్నాయి. విద్యుత్తూ వచ్చింది. వస్తూ ఉంది. పూర్వపు గొఱ్ఱెల పాకల గుడిసె ఇప్పుడు మాంఛి ఇల్లు!! ఎన్నోచోట్ల మేడలు! ఎన్నెన్నో సదుపాయాలు సమకూరేయి. వ్యాపార వాణిజ్యాలు, పనిపాటలు, బతుకుతెరువుకి ఎన్నెన్నో కొత్త కొత్త దారులు! వ్యవసాయ పనుల్లోనూ ఎంతో పెరుగుదల! విద్యాప్రసారం కూడా నాలుగు దిశలా జరుగుతోంది. ఎన్నెన్నో కొత్త పట్నాలు వెలిశాయి. ఎంతెంత విశాలంగానో పెరిగిపోతున్నాయి. ఇంకా ఇంకా విస్తరిస్తున్నాయి. ఫ్యాక్టరీలు, యంత్రాంగారాలు అన్నిచోట్లా! అవీ విస్తరిస్తున్నాయి.
ఏది అభివృద్ధి చెందటం లేదూ! సర్వం నష్టం అయిపోతోందని గోలగగ్గోలూను!! మధ్య మధ్య ఇన్నిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి కదా. మరి దేశాన్ని ఎలా ఉద్ధరించాలో, ఏ దిశగా అని దిక్కూ తెన్నూ తోచదు. అయినప్పటికీ దేశం పురోగమిస్తోంది. నమ్మాలి. నమ్మితేనే మనసు స్థిమితపడుతుంది. కంగారు, ఆదుర్దాపడితే ఏమిటి లాభం!!
సాయంత్రం కాబోతుంది. ఓ సభలో పాల్గొనడానికి నిన్న సాయంత్రం విమానంలో ఇక్కడికి వచ్చేరు. మరో అరగంట తర్వాత సభాస్థలికి వెళ్ళాలి. మనసులో మనసులో అలవాటైన వక్తృత్వం ఆలోచనలతో నడుస్తోంది! ఎదట అసంఖ్యాక జనం ఉండి నిజంగానే వింటున్నారా అన్నట్టుగా మనసులోనే ఆయన ఉపన్యసిస్తున్నారు!!
ధరలు ముందుకన్నా చాలా చాలా పెరిగిపోయాయి. రూపాయి విలువ పడిపోయింది. నిజమే! అయితే ఇది కేవలం మన దేశంలోనేనా? ఇప్పుడు ప్రపంచమంతా ఇదే పరిస్థితి ఉందా? జనాభా ఎంత పెరిగిపోయిందీ? పెరిగిపోతూనే ఉంది. ఆ లెక్కని వస్తూత్పత్తి ఎక్కడ జరుగుతోందీ? ఇదేనా? ఇంతేనా కారణం?? వింటూ వుంటాం పూర్వం నేతులు తాగేవారని! పాలూ పెరుగూ పుష్కలంగా ఉండేవని! నిజమే! అయితే ఎవరింటట?? జమీందార్ల ఇంట! అని మరిచిపోకండి. తతిమా జనం గోచీపాతగాళ్లు అర్ధాకలితో బతికేవాళ్ళు. కడుపునిండా తిండికి, ఒంటినిండా గుడ్డకి వాళ్ళు నోచుకోలేదు. అయినా వాళ్ళు హంగామా గోలా చెయ్యరు. వాళ్ళకు అసలు ఆ ఆశ లేనే లేదు. అలాగ్గా ఆ బీదవాళ్ళని బీదవాళ్ళుగా ఏ ఆశాలేనివాళ్ళుగా, తగాదాలు తంటాలు లేకుండా నోరెత్తకుండా ఉండేటట్టు అన్ని విధాల మతవిశ్వాసాలూ, శాస్త్ర న్యాయ నియమాలు ఏర్పడ్డాయి. వాళ్ళు పెదవి విప్పరు! పాపం, అన్యాయం, అవినీతి అంటూ వాళ్ళ నోరు నొక్కేశారు.
ఇప్పుడా? ఎవడూ వాటిని వేటినీ అంగీకరించడానికి సిద్ధంగా లేడు!
ప్రతి ఒక్కడూ సర్వభోగభాగ్యాలనీ అనుభవించాలని అనుకుంటున్నాడు. ఎలా అయినా సరే ఎంతో డబ్బు కావాలి. ఎంతెంతో ధనం ఏ దారి తొక్కయినా సరే సంపాదించాలి. తప్పనిసరిగా పొందాలి. అవసరం మరి!! పూర్వం కన్నా జనం పెరిగారు. అవసరాలు పెరిగాయి. కొనేవాళ్ళు ఎన్నో రెట్లు పెరిగారు.
ఎవరినోట విన్నా అదేమాట! అవినీతి పెరిగిపోతోంది. అంతా స్వార్థమే! తమ స్వార్థం, తమ లాభం – లోభం – పక్కవాడిని పీడించడం, గొంతుక కోయడం – వంచన – మోసం. తమలాభం కోసం వ్యాపారస్థులు ఆహారపదార్థాల్లో విషాన్ని కలిపి అమ్ముతున్నారు. అన్నిటా కల్తీ. నల్లబజారు.
అయితే ఒక్కవిషయం ఏకాలంలో, ఏ యుగంలో మనిషి తన స్వార్థాన్నీ, లాభాన్నీ చూడకుండా ఉన్నాట్ట! ధనాన్ని, అధికారాన్ని, ప్రాపంచిక సౌఖ్యాల్ని కావాలనుకోకుండా ఉన్నాట్ట! మోసం, కపటం, శక్తియుక్తులతో, నక్కజిత్తుల మెలకువలతో వాటిని పొందడానికి, పొందినది చాలక ఇంకా ఇంకా పొందడానికి తన దారిలోని ముళ్ళూ, అడ్డంకులు ఏరి పారేయలేదట! మోసాలు, కపటాలు, చిక్కుల్లో పెట్టి, తన ఆధీనంలో ఉండేట్టు చేసుకుని, గాయపరిచి, చంపేసి తన ఆభివృద్ధికి చేసే ప్రయత్నం ఏ కాలంలో లేదట! ప్రతి కాలంలోనూ మనిషన్నవాడు ఉన్నంతవరకూ ఇది జరుగుతూనే వుంటుంది. అవతలవాడి బలం పెరిగి తను బలహీనమైనప్పుడు భయంవల్ల నోరుమూసుకుని పడి ఉండడం మనిషి స్వభావంగా అవుతుంది. అవతలవాడి పట్ల భయం పోయిందా తల ఎత్తుతాడు. ఆ తల ఇంకెవరి బరువునీ మొయ్యదు. అందుకనే ఇప్పుడు వీళ్ళందరూ భయం లేకుండా స్వంతంత్రులయ్యారు. అందరి నోరూ పెద్దదయింది. అసంతృప్తిని గట్టిగా అరిచి మరీ చెప్పగలుగుతున్నారు. పూర్వమూ ఇలాగే ఉన్నప్పటికీ అప్పుడు ఎవరూ నోరు విప్పడానికి సాహసించే వారు కాదు. వాళ్ళ మనసుని రకరకాల భయాలు. అందుకే క్రూరులు, దుర్మార్గులు అయిన రాజుల్ని కూడా ముఖస్తుతి గాళ్ళు భయంతోనే పొగుడుతూ, ఆకాశానికి ఎత్తి కీర్తిస్తూ కావ్యాలు రాసేరు. కాని ఆ పొగడ్తలూ, రాతలు నిజాలు కావు కద!!
తర్కయుక్తంగా సాగుతున్న తన ఆలోచనల్ని గట్టిగా నమ్ముతూ, తన విశ్వాసాలని బలపరుచుకుంటూ, ఆనందపడుతూ దధిసాహు కాస్త నెమ్మదించారు. జనం కళ్ళప్పగించి తన మొహాన్ని చూస్తున్నారా అన్నట్టు ఆగేరు!!
తిరిగి మనసులో ఉపన్యాసం మొదలయింది.
ప్రతిరోజూ, ప్రతికాలంలోనూ, ప్రతి విషయంలోనూ శక్తియుక్తులున్న మనిషి బలహీనుణ్ణి తొక్కేస్తూ ముందుకు వెళ్తూనే వున్నాడు. మరింత బలవంతుడవుతూనే ఉన్నాడు. ఎంతో కొంత దేన్నైతే అన్యాయం, అవినీతి, పాపం అంటున్నావో అది ప్రతి యుగంలోనూ ఉంది. ప్రతి యుగంలోనూ శక్తిమంతుడు గెలుస్తాడు. బలహీనుణ్ణి పీక్కుతింటాడు. శాసిస్తాడు. తన పుత్రపౌత్రాదుల కోసం డబ్బు కూడబెడతాడు. బలహీనులు వాణ్ణి ఎంత తిట్టి తిమ్మిపోసినా, చెడ్డవాడని కళంకితుడని మసిపూసినా వాడికేం కాదు. ఒక్క వెంట్రుక ముక్కన్నా వాడిది రాల్చలేరు!
ప్రపంచంలో బతకనేర్చిన మనిషి తన బతుకులో న్యాయం అనీ, నీతి అనీ, శాస్త్రం ధర్మం అలా చెప్పింది కనుక దాని ప్రకారం నడుచుకోవాలనీ ఎలాంటి అవరోధాలనీ పెట్టుకోలేదు. భవిష్యత్తులోనూ పెట్టుకోడు.
ఒకవేళ నువ్వుగాని వాటిని నమ్ముతూ, వాటిని అంగీకరిస్తూ నడుస్తావా, అయితే నీ బతుకింతే! ఇలాగే బతుకు! కొట్టుకోడాలు, తన్నుకోడాలు, దోపిడీలు, దోచుకోవడాలు, ఉన్న లోకంలో నువ్వు ఎందుకూ పనికిరాని చెత్తకింద మిగిలిపోతావ్! అందరిచేతా తాపులు తింటావ్. మెతుక్కి వాచిపోతావ్. క్రుంగి కృశించిపోతావ్! చస్తావ్!
అబ్బే, అబ్బబ్బే నాకది వద్దు! అనుకుంటావా??
వాళ్ళ సమాజంలో ఉన్నత పదవులు, ధన సంపత్తులు, సుఖ సంతోషాలు కావాలన్న కోరికగాని ఉందా దానికోసం వంకరపనులు చెయ్యాలి. అన్నిరకాల కానిపనుల్లో చెయ్యిపెట్టాలి. పుస్తకాల్లోని ఆదర్శాలు, ఉపదేశాలు, నిన్ను బంధించి చిక్కుల్లో ఉంచడానికే పెట్టేరు! బలహీనుల కోసం, వెనకపడ్డ వాళ్ళకోసం! ప్రతియుగంలోనూ ఇదే జరిగింది. జరుగుతోంది.
ఈ బలహీనులు రోజురోజుకీ దిగజారి దిగజారి చెప్పలేనంత దురవస్థలో పడతారు. అయితే పుస్తకాల్లోని మాటల్ని నమ్మి తమను తాము సాంత్వన పరుచుకుంటారు. మన దగ్గర ‘అది’ లేకపోతేయేం? ‘ఇది’ ఉంది అనుకుంటారు. అది లేనందుకు బాధెందుకు అనుకుంటూ ఈ జన్మలో కష్టాలు పడతారు. మా పేరు విన్నంతనే మాకు అందరూ జేజేలు పలుకుతారు. ప్రణామాలు చేస్తారు అనుకుంటారు. ఈ లోకంలో బాధపడితే పడ్డాం పై లోకంలో స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తాం అనుకుంటారు.
నిజం చెప్పాలంటే ఈ నీతి నియమాలు ఏ విధంగా మన బతుకుని మన ఉద్దేశాలని సఫలం అయేటట్టు చేస్తాయో ఏ గ్రంథంలోనూ రాయడం జరగలేదు. రాసి వుండాలి కద! అయితే వ్యవహారంలో మాత్రం ఇవే శాస్త్రం అయి కూర్చున్నాయి. సాధన చేస్తే సిద్ధి పొందుతారంటాయి!
ప్రాపంచిక అనుభవం వల్ల, సాధారణ జ్ఞానం వల్ల ప్రతి కాలంలోనూ సామాన్యజనం తమ దారి ఏదో తెలుసుకుని ఆ దారినే బతుకుతున్నారు. ఆ దారి ఏదో వాళ్ళకి బాగానే తెలుసు. ఈ కాలంలోనూ బుద్ధిమంతులు మంచీచెడ్డా లెక్క తెలిసిన మనుషులు అదే చేస్తున్నారు. హాయిగా బతుకుతున్నారు. అసమర్థులు, మూర్ఖులు, బలహీనులు బతుకులో ఓడిపోయి అంగోస్త్రం కట్టుకుని ఇంట్లో కూచుంటారు. శాస్త్రాలు వల్లిస్తారు. తావళాలు తిప్పుతారు!
తాము తప్ప మిగతావాళ్ళంతా అవినీతిపరులు అంటూ విమర్శించే వీళ్ళలో భోగభాగ్యాలు తమకు దొరికితే వద్దనుకునేవారు ఎంతమంది ఉంటారు? దొరికితే ఎవడు ఒదులుతాడు?
నేనేమన్నా తప్పుగా చెపుతున్నానా?
ఓహోహో! ఎంత భలే తర్కం నాది!! దధిసాహు తనని తాను మనసులో మెచ్చుకున్నాడు. ఇవన్నీ పచ్చినిజాలు. తన జీవితాన్నంతటినీ ఏకంచేసి చూస్తే కలిగిన అక్షరాలా పచ్చినిజమైన అనుభవసారం, అనుభూతీ.
ఓ మూల కుగ్రామంలో చిన్న గుడిసె, రెండు బీఘాల పొలం తన బాల్యం. నవ్వుతూ తుళ్ళుతూ, ఆకతాయి పనులు గొడవలు సమయం ఎలాగూ గడిచిందో ఎప్పుడు ఎలా మెట్రిక్ థర్డ్ డివిజన్‍తో పూర్తయిందో! ధైర్యసాహసాలు పెరిగాయి. తెలివితేటలు కూడా! ఈ కాలానికి పనికి వచ్చేటట్టు! అవకాశాల్ని ఎలా దొరకపుచ్చుకోవాలో అవే దారి చూపెట్టేయి. చెవిని ఇల్లు కట్టుకుని మరీ చెప్పేయి.
ఆ రోజుల్లో తనమీద అందరి అభిప్రాయం – ఈ కుర్రాడు ఆవారాగాడయ్యాడు. ఎందుకూ పనికిరాని కివాంచ(తీగ)లా పెరిగిపోయాడు. వాళ్ళ మాటలు విని ఆయన నవ్వేసేవారు! తన మనసు ఎటు లాగితే అటు నడిచారు. అందరి పనుల్లో తనే మీదపడి మరీ తలదూర్చి తిరగడం మొదలుపెట్టారు. ఆ ఇంటా ఈ ఇంటా కాదు, ప్రతి ఇంటా తానే! ఎందరెందరితోనో పరిచయాలు. ఊరూరా తిరగడం. మనుషుల్ని బోల్తా కొట్టించడం, బుట్టలో వేసుకోవడం, అందరూ వాడి పనితనం మాటతీరూ మెచ్చుకోడమే!
టవుటరీ! ఆనకట్ట దగ్గర కూలీల మీద అజమాయిషీ – కంట్రోలు దుకాణం పదిమందిని కూడదీసుకుని నాయకత్వం! ఒకరిని కొట్టడం ఒకరిని ఉద్ధరించడం! నానారకాల పనులు! తిమ్మిని బెమ్మి చెయ్యడం!! హోదా పెరిగింది! స్థాయి పెరిగింది. నిచ్చెనమెట్లు! మెట్టు మీంచి పైమెట్టు – పైమెట్టు మీంచి ఇంకా పైకి! ఎక్కుతూ ఎక్కుతూ – పైపైకి! ఎంత మీదకి లేచేడు! ఇప్పుడు? ఆయన పేరు ఎరగని వాడు లేడు! అడిగి చూడండి – దధిసాహు ఎలాంటి మనిషని ఎంత గొప్ప మనిషి! ఎంత తెలివైన వారు! ఎంత విచక్షణాబుద్ధి! పని జరగాలి అంటే ఆయన పూనుకోవాలి. ఆయనగాని లేకపోతే ఏ పనైనా జరుగుతుందా అసలు చెప్పండి! అంటారు!
దేశానికి వెన్నెముక!
మనిషంటే దధిసాహూవే!!
ఆయన తనకు తాను సర్టిఫికేటు ఇచ్చుకుని ఆనందపడ్డారు. వాచీ చూశారు. అబ్బే, ఇప్పుడే వెళ్ళకూడదు. పదిహేను నిమిషాలు ఆగి వెళ్ళాలి. పెద్దవాళ్లు ఆలస్యంగా వెళ్ళరు. నిజమే, అయితే ముందే వెళ్ళి కూచోరు! ఆయన కాలం ఎంతో విలువైనదని జనం తెలుసుకోవాలి.
తన మనసులో అనుకుంటున్న ఉపన్యాసం ఇంకా పూర్తికాలేదనీ, ఇంకా అనుకోవాలని జ్ఞాపకం వచ్చింది. మొత్తం అంతా పూర్తిగా అనుకోకపోతే మనస్సు స్థిమితంగా ఉండదు.
ఉపన్యాసం! ఉపన్యాసం! ఉపన్యాసం ఇవ్వడం అలవాటైపోయింది. ఖాళీగా కూర్చున్నా సరే మనసులో ఉపన్యాసం నడుస్తూనే ఉంటుంది. ఊపిరి పీలుస్తూ వదుల్తున్నట్టు ఉపన్యాసం వస్తూ వెళ్తూ ఉంటుంది. అవకాశం రాగానే బయటకి తన్నుకు వచ్చేస్తుంది.
ఉపన్యాసం చేసిన ఉపకారం ఏమన్నా చిన్నదా?? అబ్బో, మిత్రుల్లో ఆశనీ ఉత్సాహాన్నీ ఆనందాన్నీ పెంచుతుంది. శత్రువుల తర్కాల్ని ఖండిస్తుంది. వాళ్ళల్లో భయాన్ని పెంచుతుంది. శత్రువులు, మిత్రులు, తటస్థులు అందరి దగ్గరా విస్తరిస్తుంది. విలువైన వివేకవంతమైన విషయాలు! అమూల్యమైనదీ, అతిశ్రేష్ఠమైనదీ, ప్రయోజనకరమైనది ఉపన్యాసం!!
ఎంపికతో నేను మనసులో చెప్పుకున్న దాంట్లోంచి కొంత అందరి ఎదటా చెప్పినప్పుడు వాళ్ళంతా తమ తమ మనస్సుల్లోనైనా నా జ్ఞానాన్ని మెచ్చుకుంటారు. చిలవలు పలవలు చేసి వర్ణించి వాళ్ళు చెప్పుకోడానికి ఈ ఉపన్యాసం మౌలికమైన ఆలోచనతో దిశా నిర్దేశం చేస్తుంది! ఇదేమన్నా అల్పమైన విషయమా ఏం? ఏదో పెద్ద పైపై ఆడంబరం కోసం మాట్లాడే కృత్రిమమైన మాటలు కావు ఇవి!! మట్టిమనిషి చెప్పే మాటలు! అనుభవించి, అర్థం చేసుకున్న సామాన్యుడి బతుకునుండి ప్రాణం పోసుకున్న మాటలు!
మరో అంశం ఇంకా అనుకోవలసి ఉంది. చెప్పాల్సిన అంశం. ఈ మధ్య నేరారోపణ వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూడు, ప్రస్తుతం విశృంఖలత్వం, హింస, అశాంతి! దేనికీ రక్షణ లేదు. డబ్బూ ప్రాణం అన్నిటికీ అపాయమే! ఎప్పుడు ఏ ఆపద వచ్చి పడుతుందో అనుమానమే. ఎవరి వల్ల ఎవరి ద్వారా ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలీదు! ఇలాంటి వార్తలు వినబడుతున్నాయి. సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటివి పూర్వం ఎన్ని జరిగినా ఆ వార్తలు ఇప్పటిలాగ అందరికీ తెలిసేవి కావు. ఇప్పుడు వార్తలు చేరడానికి ఎన్నెన్నో రకాల సాధనాలు ఉన్నాయి. ఏదో ఎక్కడో చిన్నపాటి సంఘటన జరిగినా ఆ వెంటనే ప్రచారం అయిపోతుంది. వార్తాపత్రికలు పెద్దపెద్ద అక్షరాల శీర్షికలతో అచ్చేస్తున్నాయి. రైళ్ళు, మోటార్ల వల్ల దుర్ఘటనలు జరగవచ్చు. మెషీన్లతో పని చేస్తున్నప్పుడు ఎప్పుడో ఏదో సమయంలో ఏదన్నా అవొచ్చు. అలా అని గాభరాపడి కంగారుపడి అన్నిటిని వదిలేసి ఏ కొండ గుహల్లోనో తల దాచుకుంటామా? అడివిలో కందమూలాలు తింటూ బతుకుతామా? అక్కడ మాత్రం ప్రమాదాలు లేవా? తక్కువా ఏం? చింకి రగ్గుల్లో దూరి ముడుచుకుని పడుకుంటే యముడు వదిలేస్తాడా? అవును కద! సహనం అవసరం. ఈ కొత్త పరిస్థితులో ఎలా నడుచుకోవాలో జాగ్రత్తగా ఎలా అన్ని విధాలా కాపాడుకుంటూ ఉండాలో నేర్చుకుంటూ బతకాలి. ఆ బతికే విధానం దానంతటదే స్వాధీనంలోకి వస్తుంది. అసహనంతో ఏ కార్యమూ విజయవంతం అవదు. నిరీక్షించి చూడు, నీకే బోధపడుతుంది.
మనసులో అన్ని అంశాలు అనుకోవడం అయింది. ఇంక లేవనా? బయల్దేరనా? తను….తను…తను… తనకి ముప్పై తొమ్మిదేళ్ళు. జవసత్వాలు ఉన్నవాడు అయినా అనుభవజ్ఞులైన డాక్టర్లు మధ్య మధ్య పరీక్షిస్తూ ఉంటారు. ఇంకా మరింత దృఢంగా ఉండటానికి సలహాలు ఇస్తూ ఉంటారు. మరో నలభై ఏళ్ళు గడుస్తాయి.
ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికే ఎలాంటి స్థితి నుండి ఎలాంటి స్థితికి చేరుకుంది!! అన్నిటా వృద్ధి! వృద్ధే! ఏది ముట్టుకో, ముట్టుకున్నదంతా బంగారం అవుతోంది.
స్విచ్చి నొక్కితే కదా ఏ తలుపన్నా తెరుచుకుంటుంది!!
తన పిల్లల అదృష్టం అలాంటిది!! ఆత్మవిశ్వాసంతో దృఢంగా అడుగులు వేస్తూ బ్రీఫ్‍కేసు తీసుకుని దధిసాహు తలుపు వేపుకు నడిచారు. తిన్నగా అటు వెళ్ళకుండా గభాలున బాత్‍రూంలోకి వెళ్ళారు. వాష్‍బేసిన్ మీద గోడకి పెద్ద అద్దం. రెండోవేపు గోడకీ పెద్ద అద్దం! అద్దాల్లోకి కళ్ళప్పగించి చూశారు. అన్నివేపులా అద్దాలు. ఎదురుగా దధిసాహు! సమాంతరాలంగా ఉన్న అద్దాల్లో ఎంతమందో దధిసాహూలు!!
నల్లటి వొంటిమీద తెల్లటి చొక్కా, తెల్లటి పంచె, తెల్లటి శాలువా! ఎంత బాగున్నాయో! మనసయిందా, ఆయన ఫ్యాంటూ షర్టూ కూడా వేసుకుంటూ ఉంటారు. అవి పంచె చొక్కాల కన్నా చవకగా వస్తాయి! ఎక్కువరోజులు మన్నుతాయి. ఈ దేశంలో సంప్రదాయం తెలిసిన వాళ్ళకి అదీ తెలుసు. ఆరోగ్యంతో మిసమిసలాడుతున్న తన వొంటిమీద ఆ బట్టలూ చాలా బావుంటాయి. తీర్చిదిద్దినట్టు ఉన్న పెద్ద గుండ్రమొహం, వెడల్పు ఫ్రేము కళ్ళద్దాల లోంచి చూసే చిన్న చిన్న కళ్ళు మెరుస్తూ ఉంటాయి. మొహం కిందవేపు మృదుత్వం కాస్త తక్కువ. కాస్త ఉబికి ఉన్న ముక్కు. తలమీద వెంట్రుకలు రాలిపోవడంతో మరింత విశాలంగా వెడల్పుగా ఉన్న నుదురు, చెవుల పక్క కొద్దిగా పండు వెంట్రుకలు, మొత్తంగా మొహం గంభీరంగా, ప్రభావితం చేసేదిగా, గౌరవనీయుడైన పెద్దమనిషి అనిపిస్తుంది. ఈ మొహం అధికారం చలాయిస్తుంది. వెఱపునీ, భీతిని కలిగిస్తుంది. బెదిరిపోయేటట్టు చేస్తుంది. ఆకర్షించి వశపరుచుకుంటుంది కూడా!!
చిన్నగా నవ్వేరు! ఈ నవ్వు – ఈ ముఖకవళిక వినయానికి పర్యాయపదం. విడీవిడని పెదిమల మీద విరిసీ విరియని చిరునవ్వుని తగిలించుకుని మెడని కాస్త వొంచి!! ఆయనవేపు ఎంతోమంది దధిసాహులు చూస్తున్నారు! ఈ ముఖకవళిక అసంఖ్యాక జనానికి నమ్మకాన్ని కలిగిస్తుంది. ధీమాని ఇస్తుంది.
ఆయన బయటికి వచ్చారు. తాళంవేసి తాళంచెవి జేబులో పెట్టుకున్నారు. తివాసీ పరిచిన దీపాల వెలుగులో మెరిసిపోతున్న, ఎనిమిదో అంతస్థు వరండాల్లో ఒక్కొక్క అడుగు వేస్తూ లిఫ్టు దగ్గరికి వచ్చారు.
స్విచ్ వేశారు. పంజరం లాంటి లిఫ్టు. కిందనుంచి మీదకి వచ్చి ఎదురుగా ఆగింది. లోపలికి వెళ్ళారు. లిఫ్టు కిందికి దిగుతోంది.
చిన్న లిఫ్టు. లోపల ఎవరూ ఉండరు. ఏకాంతం. నాలుగువేపులా మూసుకుని ఉంది, కిందామీదా, కుడీ ఎడమా! దీపం వెలుగుతోంది. బిలబిలలాడుతూ, పరుగులు పెట్టే జనంతో నిండిన మహానగరంలో విలువైన మనుషులు ఏకాంతంగా ఇలాగా రాకపోకలు సాగిస్తారు. వాళ్ళు వద్దనుకుంటే వారి ఎదటికి ఎవరూ రారు. ఎవరైనా రావడం అసంభవం! వారి ఆలోచనలకీ చింతనకీ, స్వేచ్ఛకి వీటిలో వేటికీ ఆటంకం కలగడానికి వీలులేదు!
కింద ఆయనకోసం ఎదురుచూస్తూ పెద్ద ఎయిర్‍కండీషన్ కారు. గమ్యస్థానానికి తీసుకుని వెళ్తుంది.
తలుపు తెరుచుకుంటుంది.
ఆయన వచ్చారు! ఆయన వచ్చారు!! నమస్కారం! నమస్కారం!
పరిచితమైన దృశ్యం! మాటలు! ఆయన నోట కొన్ని పలుకులు! అవసరమైనవి, బహు మూల్యమైనవి. వాళ్ళు స్ఫూర్తిని పొందుతారు. విశ్వాసాన్ని పెంచుకొంటారు.
జరగబోయేది అంతా స్పష్టంగా కనబడుతోంది. లిఫ్టు కిందికి దిగుతోంది.
ఆకస్మాత్తుగా దీపం ఆరిపోయింది. లిఫ్టు ఆగిపోయింది. కిందికీ వెళ్ళటం లేదు. మీదకీ వెళ్ళటం లేదు. చీకట్లో తడుకుంటూ అన్ని స్విచ్చులూ వేసేరు. దీపం వెలగలేదు తలుపుల్ని లాగడానికి ప్రయత్నించారు. బలమంతా ప్రయోగించారు. లాభం లేదు. గట్టిగా కేకేసి పిలిచారు. అరిచారు. బలమంతా పెట్టి తలుపుల్ని కొడుతున్నారు. నుదుటన చెమట ఒళ్ళంతా చెమట, రుమాలు ఉంది అది మరిచిపోయి పై కండువాతో తుడుచుకుంటున్నారు. చెమటలు పట్టడం ఆగలేదు. గాభరా, కంగారూ ఎక్కువవుతున్నాయి. తల తిరుగుతోంది. గుండె దడదడలాడుతోంది. తడబడే అడుగులతో ఢాంమ్మని కింద కూలబడ్డారు. ఆయాసపడిపోతున్నారు. నోరు ఎండిపోతోంది.
ఏమైంది? ఏమిటిలా ఎందుకిలా అయిందదీ? ఎలా బయటపడతాను? ఈ చీకటి పంజరంలో నా చావు రాసి పెట్టి ఉందా? చావు మీద పడ్తోందా? లిఫ్టు విరిగి దఢాలున కింద పడిపోతుందా? ముక్కచెక్కలై గుండాపిండి అయిపోతుందా? బాధతో గిలగిల్లాడుతూ నా ప్రాణాలు పోతాయా! అయ్యో! ఎంత భయంకరం!
చావడం తప్పదు! ఎన్నెన్ని దుర్ఘటనల్లో ఎంతెంతమంది ఫటాఫట్ చచ్చిపోతున్నారో! రోడ్లమీద యాక్సిడెంట్లు, రైలు దుర్ఘటనలు, విమానాలు కూలిపోవడాలు, మిల్లుల్లో, కార్ఖానాల్లో, గనుల్లో ఇంటాబయటా! అబ్బబ్బా! ఎన్నెన్ని దృశ్యాలు! వార్తాపత్రికల్లో ఫొటోలు! మా బాగుంది ఈ యంత్రయుగం! ఏమిటి దీని పద్ధతి, దీని కధాకమామీషు! దీని సభ్యత తీరు! స్థిరత్వం లేదే! భద్రత లేదే! మనశ్శాంతి లేదే! నిశ్చింత బతుకు ఏదీ!
చివరికి వచ్చేసిందా? నిజంగా ఇదే ఆఖరి క్షణమా? చావు వచ్చేసిందా? ఈ చీకటి! ఈ ఒంటరితనం! ఈ శూన్యం!
ఓ దేవతల్లారా! సాధుపురుషుల్లారా! ఎక్కడున్నారు? భగవంతుడా? ఎక్కడ? మీరందరికి అందరూ ఎక్కడున్నారు? కాపాడండి! రక్షించండి! దయచూపండి! నన్ను ఉద్ధరించండి!
సులక్షణా! నువ్వెక్కడున్నావ్? బహుశా వడియాలు పెడుతూ ఉండి ఉంటావ్! ఇంట్లో పని తప్ప నీకెందులోనూ సరదాలేదు. నీచేత్తో నువ్వు ఇచ్చే తాంబూలం తినే యోగం ఇంకలేదు. అయ్యో! పిల్లలు! అందరూ కళ్ళముందు కనబడుతున్నారు! ఎక్కడున్నార్రా మీరంతా?
మహావేగంగా గతించిన కాలంలోని స్నేహబంధనాలన్నీ కళ్ళక్కడుతున్నాయి. అన్నీ కలగాపులగంగా కనపడుతూ మాయమైపోతున్నాయి.
నేను ఎవరికీ ఏమీ కాను. పనికిరానివాణ్ణి. పిరికివాణ్ణి. నా అదృష్టం పేడతో రాయబడ్డది! నేను ఓ పురుగుని! ఈగని! భగవంతుడా! నన్నిలాగే బతకనియ్యి! నాకింకేం వద్దు!
కన్నీళ్ళు ధారగా కారుతున్నాయి.
అంతా నిశ్శబ్దం. మౌనం.
ఆయనని బయటికి తీశారు. పూరాగా ఓ గంట తెలివి తప్పి ఆయన అక్కడ పడి ఉన్నారు.
రక్షించే పని ఏం తేలికైనది కాదు. పాడైపోయిన మెషీనుని రకరకాల సాధనాలతో, ఎంతో బుద్ధికౌశలం వినియోగించి కొద్ది కొద్దిగా నెమ్మదినెమ్మదిగా ఒదులు చేస్తూ ఒసులు చేస్తూ, ఎన్నో విధాల జాగ్రత్తలు తీసుకుంటూ కిందకి దించారు లిఫ్టుని!
డాక్టర్లు తతిమా శ్రేయాభిలాషులూ బయట ఎదురుచూస్తున్నారు.
ఒంటికి తెలివి వచ్చేక దధిసాహూ నోట వచ్చినమాట “నేనింటికి వెళ్ళిపోతా!”
ఆయనకి ఫోటోలు తీస్తున్నారు. పత్రికా విలేకర్లు ఎంతమందో నోట్ పుస్తకాలతో రాసుకోడానికి సిద్ధంగా ఉన్నారు. “ఏదన్నా స్టేట్‍మెంట్ ఇవ్వండి!” ఓ విలేఖరి అడిగాడు.
దధిసాహు అతనివేపు తేరిపారిచూస్తూ ఉండిపోయారు!
“ఇంటికి వెళ్తాను”
~ ~
ఒడియా : గోపీనాథ్ మహంతి
తెలుగు : చాగంటి తులసి