[dropcap]“రా[/dropcap]ముని అవతారం, రఘుకుల సోముని అవతారం”; “రామకథా ! శ్రీరామకథా, “రామకథను వినరయ్యా!”, —- ఈ పాటలను ఎన్నిసార్లు విన్నా, కన్నా “రామాయణ రమణీయం– రమణీయ రామాయణం” రామభక్తులను అలరించి మురిపిస్తుంది.
ఎన్నో రామాయణ గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. సంస్కృత రామాయణాన్ని తెలుగీకరించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల వ్రాసిన “మొల్ల రామాయణం” ఈ రామాయణాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది.
ఆతుకూరి మొల్ల కడప జిల్లా లోని గోపవరం గ్రామంలో జన్మించారు. వీరి జీవితకాలం గురించి వాదోపవాదాలున్నాయి.
ఏకామ్రనాథుని ప్రతాపచరిత్రలో వీరి ప్రస్తావన కనిపిస్తుంది. ‘ఆంధ్రభోజుడు’ శ్రీకృష్ణ దేవరాయల సమకాలీనురాలని చరిత్రకారులు తెలియజేశారు.
పీఠికలో ‘శ్రీ గౌరీశ వరప్రసాదలబ్ధననీ, గురుజంగ మార్చన వినోద, సూరిజనవినుత, నిత్యశైవాచార సంపన్న, కవితా చమత్కారి అయిన ఆతుకూరి కేసన సెట్టి తనయననీ, మొల్ల నామధేయ’ననీ చెప్పుకున్నారు.
“తొల్లిటి యిప్పటి సత్కవి
వల్లభులను రసిక వినుత వాగ్విభవ కళా
మల్లులఁ గవితారచనల
బల్లిదులైనట్టి ఘనులఁ భక్తిగ దలతున్”
అని పూర్వకవులు, పెద్దల పట్ల వినయ విధేయతలు గౌరవాభిమానములను భక్తి పూర్వకంగా పై పద్యంలో వెలయించారు.
వీరి మీద పోతన ప్రభావం కూడా కనిపిస్తుంది. ‘పలికెడిది భాగవతమట, పలికించెడువాడు రామభద్రుండట’ అని ఆయన చెప్పినట్లే – వీరు “చెప్పమని రామచంద్రుడు, చెప్పించిన పలుకు మీద జెప్పెదనే నెల్లప్పుడు నిహపర సాధన, మిప్పుణ్య చరిత్ర, తప్పులెంచకుడు కవుల్” అని కోరారు.
మొల్ల సంప్రదాయ విద్యను అభ్యసించ లేదు. భగవంతుని కృపా కటాక్షాల వలననే సహజ పాండిత్యము అబ్బిందని చెప్పేవారు.
“గావ్య సంపద క్రియలు నిఘంటువులును
గ్రామం వేవియు నెఱుగ్ర, విఖ్యాత గోప
వరపు శ్రీకంఠమల్లేశువరము చేత — నెఱిఁగ
గవిత్వంబు జెప్పగా నేర్చుకొంటి”
అని స్వయంగా చెప్పుకున్నారు.
పరిశోధనల అనంతరం వీరి జీవితకాలం 1440-1530 అని నిర్ణయించారు.
అయితే తన గ్రంథంలో అనేక మంది తెలుగు, సంస్కృత కవులను వీరు స్తుతించారు. వారి ప్రత్యేకతలను ప్రశంసించారు. కాబట్టి వీరికి సంస్కృతాంధ్రభాషలలో ప్రవేశం ఉందని చెప్పవచ్చు.
సంస్కృత రామాయణాన్ని తేట తెలుగులో పద్యకావ్యంగా మలచి మనకందించారు. కంద పద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల ‘కందరామాయణం’ అని పేరు పొందింది. కవయిత్రి మొల్ల వ్రాశారు కాబట్టి ‘మొల్ల రామాయణం’ అని ప్రాచుర్యం పొందింది.
చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం ప్రబంధయుగపు కవయిత్రి అని చెప్పవచ్చు. ప్రబంధకావ్య లక్షణాలలో ఒకటయిన వర్ణనలకు ఈ కావ్యంలో అత్యధిక ప్రాధాన్యత నిచ్చారీమె.
పద్యములు చదివేవారికి సులభంగా అర్థమయే రీతిగా ఉండాలని వీరి అభిప్రాయం. పొడి పొడిగా చెప్పడం కాదు. తెలుగు పలుకుబడులు, నుడులు, సామెతలు, చమత్కారాలతో కూడిన గద్య పద్యయులు చదువరులకు ఆహ్లాదాన్నిస్తాయని ఆవిడ ఉద్దేశం.
ఈ భావాన్ని “కందువ మాటలు సామెత లందముగా గూర్చి చెప్పనది తెలుగునకుం బొందై రుచియై వీనుల విందై మరి కానుపించు విబుధుల మదికిన్” పద్యంలో పొందు పరిచారు.
పాఠకుల మదిని అలరించే చమత్కారాలు పద్యాలలో కనిపించి తళుక్కుమని మెరిపిస్తాయి. పాఠకుల మనసు ఆనందడోలికలలో తేలియాడించే పద్యరచన వీరి సొంతం. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు పాటకులకు అర్థమయేరీతిలో పదాలుండాలని ఈమె అభిప్రాయం. అంత సరళపదాలుపయోగించాలని చెప్పడమే కాదు అనుసరించారు. ఉదాహరణకు ఈ దిగువ పద్యం –
“తేనె సోఁకనోరు తీయన యగురీతి
తోడ నర్థమెల్ల దోఁచకుండ
గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూగ చెవిటివారి ముచ్చటయగును”
తేలికగా అర్థం కాని పదాలుపయోగిస్తే అయోమయమై మూగ చెవిటి వారి ముచ్చట్లాడినట్లు ఉంటుందనే భావాన్ని ఎంతందంగా చెప్పారో?
“మేలిమి సంధ్యారాగము
వ్రాలిన చీకటియు గలిసి వరుణుని వంకన్
నీలము గెంపును నతికిన పోలిక జూపట్టే నట నభోమణి తలగన్”
పద్యములో సంధ్యాకాలపు అంబరాన్ని అద్భుతంగా వర్ణించారు. సాయం సంధ్య నీరెండ, చీకట్లు కలిసే సమయంలో ఆకాశం నీలాలు, కెంపులతో పొదిగినట్లు మిలమిలా మెరిసినట్లు – ఎంత చక్కని వర్ణన?
“ఏమృగంబును గన్నం నేణాక్షి గానవే
యని పెక్కు భంగుల నడిగి యడిగి
ఏపక్షి గనుగొన్న నెలనాగ గానవే
యని పెక్కు భంగుల నడిగి యడిగి”
పద్యములో ఒకే పదాన్ని రెండుసార్లు చమత్కారంగా ప్రయోగించారు. సీతాదేవిని వెతుకుతూ శ్రీరామచంద్రుడు కనబడిన పక్షిరాజులను, మృగాలను అడుగుతున్న ఈ పద్యం వంటి పద్యాలు మనకు మొల్ల రామాయణంలో చాలా కనిపిస్తాయి.
మొల్ల తన రామాయణ రచనలో ఇతర రామాయణాల నుండి కొన్ని ఘట్టాలను స్వీకరించారు. ‘ఆధ్యాత్మ రామాయణం’ నుండి గుహుని వృత్తాంతమును, పరశురాముడు రాముని అడ్డగించే సంఘటనను ‘భాస్కరరామాయణం’ నుండి తీసుకుని వ్రాశారు.
ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం, సంపుటి 2 లో) మొల్లరామాయణంలో గద్యపద్యాలు 871 అని వ్రాశారు. అయితే అప్పటికి లభ్యమయిన ప్రతులు సమగ్రం కాకపోవచ్చు అన్నారు.
అయితే నిడదవోలు మాలతిగారు మొత్తం ఆరు కాండలలో 880 గద్యపద్యాలున్నాయని చెప్పారు. వీటిలో గద్యములు 208 అని తెలియజేశారు.
వీటిలో కందపద్యాలు 250. అన్ని ఛందాలూ ఒక ఎత్తు. కందాల అందాలు ఒక ఎత్తు.
“దయ్యాలకు ముడి పెట్టెద”;
“గడి కండలు కోసి తినుడు”
వంటి నుడి కారాలను పద్యాలలో పేర్చిన తీరు “బంగారంలో మణులను అతికినట్లు చాల చక్కగా సంభాషణల్లో పొదిగి యియ్యడంలో మొల్ల అందెవేసిన చెయ్యి” అని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ప్రశంసించారు.
ఇంకా “మొల్ల ఇంత అలతి అలతి తెలుగు పదాలతో పాదానికి రెండుగా విరిగే చిన్నవాక్యాలతో, ఆ వాక్యాలతో పాటు రెండు రెండుపమానాలతో చిక్కని చిమ్మ చీకటిని కళ్ళ ఎదుట రూపు కట్టించిందని” అంటారు లక్ష్మీకాంతమ్మగారు.
మొల్ల తన రామాయణాన్ని రాజులకి అంకితమివ్వలేదు. శ్రీరామచంద్రునకే అంకితమిచ్చారు. శైవ భక్తురాలైనా శ్రీరామునే నమ్మి వారి చరిత్రను గ్రంథస్థం చేసి అమరులయ్యారు.
“మొల్లకి పూర్వం చాలమంది మగకవులు రామాయణాలు రాశారు కానీ ‘మొల్ల రామాయణం’ మాత్రమే కాలగర్భంలో కలిసి పోకుండా నిలిచింది” అన్నారు ఆరుద్ర.
“మొల్ల మహిళా హృదయమార్దవంతో మాతృహృదయ సౌమనస్యంతో రామాయణం వ్రాసి మానవాళిని తరింపజేయడానికి సంకల్పించింది కవయిత్రీమతల్లి మొల్లతల్లి” అని ఆప్యాయతానురాగాలతో ప్రశంసించారు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు.
వీరి జ్ఞాపకార్థం 2017 ఏప్రిల్ 26 వ తేదీన వీరి స్టాంపును 5 రూపాయల విలువతో విడుదల చేసింది భారత తపాలా శాఖ. స్టాంపు మీద చెట్టుకింద కూర్చుని ఎదురుగా ఉన్న వ్యాసపీఠం మీద తాళపత్ర గ్రంధాల పై గంటంతో వ్రాస్తున్న మొల్ల కనువిందు చేస్తారు.
***
Image Courtesy: Internet