[dropcap]గో[/dropcap]ధూళి వేళ క్షణ-క్షణానికి నలుపురంగులోకి మునిగిపోతోంది. ఆకాశంలో అలుముకున్న ఎఱుపురంగు నెమ్మదిగా తుడిచిపెట్టుకు పోతోంది. అంధకారాన్ని చెరిపే ప్రయాసలో వెన్నెల చిరునవ్వు నవ్వేందుకు కష్టపడుతోంది. జనం తొందరపడుతున్నారు. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్న కొద్దీ వారి అడుగులు మరింత వడి-వడిగా పడుతున్నాయి. కొందరు బజారునుండి తిరిగివస్తూ ఉంటే, మరికొందరు ఆఫీసులనుండి, కొందరు సినిమాలనుండి, కొందరు దుకాణాల నుండి, కొందరు పొలాల నుండి, మరికొందరు మైదానాల నుండి ఇళ్లకు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఒకవంక కూలీల గుంపు నెత్తిన తట్టలు, చేతుల్లో గునపాలతో తమ-తమ ఇళ్లవైపు మరలుతూ ఉండగా మరోవంక మహిళలు సగం-సగం నింపుకున్న నీళ్ల బిందెలతోనే అడుగులు వడివడిగా వేసుకుంటూ పోతున్నారు. బాలలు-వృద్ధులు, యువకులు, స్త్రీలు పురుషులు అందరూ వేగంగా అడుగులు వేస్తూ ఇళ్లకు తిరుగుముఖం పడుతున్నారు. వారిని చూస్తే వేగంగా ఇళ్లకు చేరుకోవాలి, లేకపోతే మరింక చేరలేమేమో అన్న ధోరణి కనిపిస్తోంది. నాలుగు పక్కలా ఏదో భీతావహం అలుముకున్నట్లు, రాత్రి అనే నల్లటి రాక్షసుడి నుండి భయపడి పారిపోతున్నారేమో అనిపిస్తోంది.
చూడబోతే మనుషులు కూడా పశు-పక్ష్యాదులతో పోటీ పడుతున్నట్లు సాయంత్రం అయేసరికి వాటి లాగే తామూ తమ-తమ గూటికి చేరుకుని ఒదిగిపోవాలనుకుంటున్నట్లనిపిస్తోంది. రాత్రి అనే రాక్షసుడు వారిని చూసి – “ఓ మానవుడా! త్వరగా వెళ్లి మీ -మీ ఇళ్ల నాలుగు గోడల మధ్య తలదాచుకోండి, లేకపోతే మీకు మంచిది కాదు!” అని భయపెడుతున్నట్లనిపిస్తోంది. నాలుగు దిక్కులా ప్రతిధ్వనిస్తున్న పక్షుల కూతలు మానవ జగత్తంతటి ఆవేదననూ ప్రతిఫలిస్తున్నాయేమోననిపిస్తోంది. తమ రకరకాల అరుపులతో మానవుడి రోదనను వ్యాఖ్యానిస్తున్నవేమోనన్న భ్రమ కల్పిస్తున్నాయి.
కొద్దిరోజుల కిందటి వరకూ ఊరిలో ప్రజలు రాత్రి బాగా పొద్దుపోయేవరకూ కూడా హాయిగా బైట తిరిగేవారు. ఎండుటాకుల మంటలు వేసుకు వాటి చుట్టూ గుండ్రంగా కూర్చొనేవారు కూడా! అది చూస్తే మానవత్వం జీవించి ఉన్నట్లే అనిపించేది. కాని ఇప్పుడు మాత్రం ఒకరకమైన భయం వారిని ఆవహించింది. ఏమో ఏమనిషిలోని పాశవిక ప్రవృత్తి నిద్రలేచి ఎప్పుడు ఎవరిని దానికి బలిచేస్తుందో అన్న భయం అది! పశు ప్రపంచంలోనయితే ఆ విధమైన ఆపద ఎప్పుడూ పొంచే ఉంటుంది, అంతేకాదు అవి ఆ విధమయిన జీవితాన్ని జీవించే తీరాలి. కాని మనిషి? అతడు శ్రేష్ఠమైన జీవి. అతడు ఈ విధమైన పశుత్వం పైన విజయం సాధించే మానవుడనిపించుకున్నాడు. ఇప్పుడు తిరిగి అదే పాశవికతను ఎందుకు తలకు ఎత్తుకుంటున్నాడో?
తన స్వార్థానికి లోనైన ఒక వ్యక్తి ఒక మాట అనేసరికి, రెండు సముదాయాల మధ్య శతాబ్దాల నుండి వస్తున్న స్నేహం కాస్తా బీటలు వారి ఎందుకు వారిని ఒకరి రక్తం మరొకరు తాగాలనుకునేటంత మృగాలుగా మార్చింది? మతద్వేషమనే అగ్నిని మండించే ఎటువంటి ప్రయత్నమనుకోవాలి? అందులో కేవలం మండింది దీపశిఖే అయినా, దాని భగభగల వలన అందరి సుఖశాంతులు మండిపోతున్నాయి. పండిత శివశంకరశాస్త్రి, మౌల్వీ నిసాల్ సాహెబ్ ఇద్దరూ సాంప్రదాయిక సద్భావనా సెమినార్లలో కలిసి పాలుపంచుకునేవారు. స్వాగతోపన్యాసాలలో మతసహనం ఎప్పుడూ పాటిస్తామన్న ప్రమాణాలు చేసేవారు కాస్తా, ఈరోజు ఒకరంటే ఒకరు ఎందుకు కత్తులు దూసుకుంటున్నారు? అంతా మారిపోయి, తలకిందులవటానికి క్షణకాలం పట్టలేదు. అందుకే సంధ్యా సమయం అయ్యేసరికి ఆ గ్రామాన్ని నిశ్శబ్దం అనే దుప్పటి తనలోకి లాక్కోటానికి తెగ తాపత్రయపడుతున్నట్లనిపిస్తుంది. ఆ దుప్పటి ఎంత మందమైనదంటే ఎవరికీ ఏమీ వినిపించదు, కనిపించదు. ఆ దుప్పటిలో ఇప్పటివరకు తెలియకుండా ప్రస్తుతం ఇంటింటా తన ఉనికిని చాటుకుంటున్న నిశ్శబ్దం మాత్రం తన అలికిడిని తెలియజేస్తోంది. దాని నీడలో నిశ్శబ్దం కూర్చున్నా, ఈసారి మౌనంగా లేదు. ఏదో చెప్తోంది. రాబోయే ప్రతి తుఫానునూ ముందుగానే హెచ్చరించే యంత్రం అది. బహుశా అందుకే నలువైపులా ఒకవిధమైన తొందరపాటుతనం కానవస్తోంది.
ఇటువంటి భయంతో బిగుసుకున్న వాతావరణం ఆ ప్రదేశంలో ఇంతకుముందు ఎప్పుడూ ఎదురువలేదు. అక్కడా ఇక్కడా చెదురుమదురు సంఘటనలు జరిగినా ఈసారి మాత్రం మొత్తం సర్వనాశనం కావటానికి పరిస్థితులను కల్పిస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రతీసారీ పశుత్వం పైన మానవత్వం విజయం సాధిస్తూ వస్తుంది. కానీ ఈసారి సాధ్యం కాదని చెప్తున్నట్టనిపిస్తుంది. ఈసారయితే మానవ పశుత్వం నుండి ముందుకు మరో నాలుగు అడుగులు వేసి, పాశవిక పశుత్వంతో పోటీ పడాల్సివస్తోందనిపిస్తోంది. దాని ద్వారా మానవతను సమూలంగా నాశనం చేసే ఉద్దేశ్యమేమో!
ఈ విషయాలేవి తెలియని బాబుగారు మాత్రం ప్రతిరోజులాగే ఆనాడు కూడా మాధవసింహ్ గారి పూలతోటవైపు నడుచుకుంటూ పోతున్నారు. సాయంత్రం చీకట్లు కమ్ముకుంటున్నాయని గాని, రాబోయే దినాలలో ప్రజలు ఎటువంటి పరిస్థితులను చూడవలసివస్తుంది అన్న స్పృహే గాని ఆయనకు లేదనిపిస్తోంది. ధీర గంభీరుడైన ఆయన నడకలో కూడా గాంభీర్యం తొణికిసలాడుతోంది. ఆయనకు రోజూ నియమంగా షికారుకు వెళ్లటం అలవాటు. వానైనా, చలియైనా సరే మార్పేం ఉండదు. చాలా కొద్దిసార్లు మాత్రమే ఆయన ఈ నియమంలో సడలింపో, దినచర్యలో విశేషమయిన కారణాల వలన మార్పో కలిగే సన్నివేశం ఎదురవుతుంది.
అందరూ బాబూజీ అని వ్యవహరించే ఆయన పూర్తి పేరు శంకరనారాయణ ఝా! గ్రామంలో వయసులో పెద్దవారిలో ఒకరవటం వలన ఆయనను పేరు పెట్టి పిలిచే సాహసం ఎవరూ చేయరు. చెప్పాలంటే కొత్త తరం వారికి ఆయన పేరుకూడా తెలియదేమో! ఎవరో కొందరు పెద్దమనుషులకు మినహా తక్కిన వారెవరూ ఆయన పేరెరుగరు. ఆయన ఎప్పటినుండి సాయంత్రాలు ఇలా షికారుకు వెళ్లటం ఆరంభించారని అడిగితే జవాబు ఎవరికీ తెలియదు. అయితే ఆయన రోజూ నియమంగా నడకకు వెళ్తారని మాత్రం అందరికీ తెలుసు. ఆయన సమయపాలన ఎటువంటిదంటే ఆయనను చూసి ప్రజలు గడియారాలను సరిజూసుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటే ఝా గారిని ఈ నిశ్శబ్దం ఏమాత్రం భయ పెట్టలేదు. బహుశా అందుకేనేమో తన రోజువారీ నియమాన్ని తప్పించుకోవాలని ఆయన ప్రయత్నం చెయ్యలేదు.
కారణాలేవైనా సరే, ఈరోజు కూడా ఆయన తాబేలు లాంటి నడకతో ఇటు అటూ ఊగుతూ నడుచుకుంటూ పోతున్నారు. ఇంటినుండి మాధేసింగ్ తోటవరకూ దారి రోజులాగే విసుగ్గానే అనిపించింది. కాని పూలతోటలోకి కాలు పెట్టగానే మాత్రం ఆయన హృదయం పులకించిపోయింది. నాలుగువైపులా రంగురంగుల పూలు, కొన్ని పూర్తిగా, కొన్ని సగం సగం విచ్చుకున్నవి, కొన్ని మంచుబిందువుల కోసం ఎదురు చూస్తున్నట్లనిపిస్తున్నవి. పుష్పాలు రకాలు వింత సోయగాలు వెదజల్లుతున్నాయి. మెల్లమెల్లగా పరుచుకుంటున్న వెన్నెల, శీతలమైన కిరణాలను ఆ పుష్పాల పైన ప్రసరింపజేసి వాటి సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. అప్పుడప్పుడు అల్లరి మేఘపు తునకలు చంద్రుడిని కప్పేస్తూ దాగుడు మూతలు ఆడుతున్నాయి.
మేఘాలు వచ్చి చంద్రుడితో, వెన్నెలతో దాగుడుమూతలు ఆడుతున్నా, లేక వెన్నెలపరచుకున్నా, ఝా గారి ఆలోచనలను ఏమాత్రం కదలించలేవు. ఆయన ప్రతిరోజూ అలవాటుగా, విరిగిపోయి కూలటానికి సిద్ధంగా ఉన్నట్లనిపించే సిమెంటు కుర్చీపైన కూర్చుంటారు. అక్కడున్న సన్నజాజిపొదలు – తీగల ఆసరాతో ఎలాగో నిల్చున్న ఆ కుర్చీలో కూర్చోగానే ఆయన పాత జ్ఞాపకాల గొలుసులతో తనని తాను బంధించుకుంటూ గతంలోకి జారిపోతారు.
ఈ రోజు ఆయన మాట ఎవరూ వినొచ్చు – వినకపోవచ్చు. కాని ఒకనాడు ఆయన చెప్పినదే వేదంగా నడిచేది. అందరూ ఆయన వద్దనుండి ఎలాంటి సలహా అయినా తీసుకునేందుకు వచ్చేవారు. ఊర్లో ఎక్కడా ఏ రకమైన గొడవలు, పోట్లాటలు, దోపిడీలు జరిగినా వాటిని తీర్చటానికి ఆయననే శరణుజొచ్చేవారు. క్రిమినల్ కేసులను ఎంతో చక్కగా తీర్చడంలో ఆయనది తిరుగులేని నైపుణ్యం. ఎవరి ఇంటనయినా దొంగతనం జరిగితే వారికి తిరిగి అవసరమైన సదుపాయాలను సమకూర్చటానికి చందాలు వసూలు చేయటానికైనా ఆయన వెనకాడేవారు కాదు. కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, రిబ్బను కత్తిరించే బాధ్యతలు ఆయనవే! దసరా పూజల సందర్భంగా ఏర్పాటు అయే కుస్తీ పోటీలలో గెలిచినవారు ఆయన చేతులమీదుగా పురస్కారాలను అందుకోవటం ఎంతో ఆనందంగా, గౌరవంగా భావించేవారు. కాని ప్రస్తుతం అలాంటివేమీ జరగవు. ఈనాటి కుర్రకారు ఆయనను గడిచిన కాలంలో మర్చిపోయారు. ఆయన ఇచ్చే సలహాలను ఆచరించటం మాట పక్కకుంచి, వినటానికి కూడా సిద్ధంగా ఉండేవారు కాదు. అందుకే అప్పుడప్పుడూ ఆయన విసుగుతో చిరచిరలాడటమూ జరిగేది.
“హు! ఇంకా ప్రపంచాన్ని కళ్లు విప్పి సరిగ్గా చూడనైనా లేదు, అప్పుడే – ప్రపంచాన్ని నడిపేయాలని ఆతృత పడటం!”
“కాకపోతే మీరు భుజాలకెత్తుకుంటారా? మా భుజాలేమీ అంత బలహీనంగా లేవులెండి, మీలాంటి ముసలివారి సహాయం ఎదురు చూడటానికి!”
యువకుల నోటివెంట ఈమాట విన్న ఝా గారికి నోటివెంట మాట రానట్లవుతుంది. ఏమయింది ఈ యువతరానికి? నిజమే, కలియుగంలో మన సంస్కృతి సంస్కారాలన్నీ భ్రష్టుపట్టి పోతాయన్నమాట నిజం. సామాజిక సంప్రదాయాలు నాశనమవుతాయన్న నిజం ఇలాగే ఆరంభమవుతుందేమో ననిపిస్తుందాయనకు.
ఆయన ఆలోచిస్తూ – ఆలోచిస్తూ మహా భగభగలాడిపోతారు. తాడు – బొంగరం లేని ఈ నాటి వారికి, ‘తాదూర సందులేదు మెడకో డోలు’ అన్నట్లు తమకే దిక్కులేదు. ఇక ఇతరులకేం మేలు చెయ్యగలరన్న సత్యాన్ని బోధపర్చేవారెవ్వరు? ఏనాడూ ఏం చేసిన పాపాన పోరుగాని, ఊరును మాత్రం స్వర్గంగా మార్చేస్తామన్న పెద్ద పెద్ద కబుర్లు! ఒకచోట కుదురుగా ఉండలేరు. ఎవరికీ గోరంత సాయం చెయ్యలేరు, ఏదైనా పని తలకెత్తుకున్నా మధ్యలోనే విడిచి పెట్టెయ్యడం, టీవీలను, సినిమాలను ఆదర్శంగా తీసుకునే ఈ నిన్న-మొన్నటి చోకరాగాళ్లు స్వర్గాన్ని చేస్తారుట స్వర్గం! అవకాశం లభించినా ఒకరికొకరు గిచ్చుకోవటం – గిల్లుకోవటం మినహా ఏం చెయ్యలేని వీళ్ల మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి. అయినా ప్రజలు కూడా వీరిని ఇంతలా ఎలా నమ్మేస్తారో?
ఎప్పుడయితే ప్రజలు తన మాట వినటం మానేసారో, అప్పటి నుండి ఆయన వారినుండి దూరమవుతూ తనలో తనే మాట్లాడుకోవటం మొదలెట్టారు. ముసలితనపు లక్షణమనీ, అందుకే అలా తలా తోకా లేని మాటలు మాట్లాడుతున్నారని అందరూ భావిస్తారు. ఈ మాటలు వినీ – వినీ ఆయనకు విసుగొచ్చింది. అందుకే ఆయన ఇలాంటి మాటలను పట్టించుకోవటం మానేసి మౌనాన్నే ఆశ్రయించారు. బైటకు మౌనంగా – ఎంతో ప్రశాంతంగా కానవచ్చే ఝా గారిలో ఈనాటికీ ఇంకా ఎంతో చైతన్యం మిగిలే ఉంది. ఎవరైనా ఆయన మనసును చదవగలిగితే, కొద్ది సంవత్సరాల కిందటి ఝాగారేనని చక్కగా గ్రహించుకోగలరు.
ఆయనకు తెలుసు తను చెప్పే పూర్తి వ్యావహారికమైన సత్యాలు, తాత్త్వికపరమైన విషయాలు అర్థం చేసుకునే శక్తి ఊర్లోని పిల్లలకు ఎంతమాత్రం లేదని! శాస్త్ర జ్ఞానం ఎంతో ప్రగతిని సాధించిందని, తద్వారా ప్రజలకు ఎన్నో సదుపాయాలు సమకూరుతున్నాయన్న సత్యం ఆయనకు బాగా తెలుసు. కాని వేదాంతం కూడా శాస్త్రమే కదా! అటువంటప్పుడు ఒకదానికొకటి వ్యతిరేకించుకోవటమన్న ప్రశ్నే తలెత్తదు. నిజానికి ఆయన సైన్సును గాని, ప్రగతిని కాని ఎంతమాత్రం వ్యతిరేకించే వ్యక్తికారు. అయితే ప్రగతి పేరిట ముందుకు వేస్తున్న ప్రతి అడుగూ మనను వినాశనం వైపు తీసుకువెళోంది. అంతంవైపు కాలం సహజంగానే పరిగెడుతుంది. మనం సృష్టించబడ్డామంటే అంతమయి తీరాలి కూడా! నిజానికి ప్రతి సంఘటన ఈ ప్రకృతిలోనే పుట్టి, ఈ ప్రకృతిలోనే సమసిపోతుంది. ప్రతి వస్తువుకు ప్రకృతిపరంగా ఒక సరిహద్దు నిర్ణయించబడి ఉంటుంది. ఆ సరిహద్దుకు ఆ వస్తువుగాని, సంఘటన గాని చేరువవగానే, దానికి ముందుకు పోవటమనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఫలితంగా గమనం వ్యతిరేకదిశగా సాగుతుంది. అది ఒక స్థానం వద్ద స్తంభించలేదు, ఎందుకంటే సృష్టిలోని ప్రతి అంశమూ చలాయమానమూ, పరివర్తనకు లోనయేదే! ఈనాడు మనం ఏ స్థానానికయితే ఉన్నామో, అక్కడి నుండి ముందుకు సాగడం అన్నది అసాధ్యమనిపిస్తోందంటే మనం సరిహద్దులు చేరుకున్నామని అర్థం చేసుకోవాలి. క్షణ – క్షణం మనం ఆ బిందువుకు చేరువవుతున్నాం, దానికి అవతల పోలేము. అక్కడినుండి తిరిగి వెనక్కి రావాలి. అలాంటప్పుడు ఇదేం ప్రగతి? అందుకే ఆయన దృష్టిలో కలియుగం రావటం అంటే ఇదే, అమాటను ఒప్పుకోవటం లేదా ఒప్పుకోకపోవటం అన్నది మన ఇష్టం తప్ప, వాస్తవం మాత్రం కాదు.
ఆయన ఈ అభిప్రాయాలను ఈనాటి యువత ఒప్పుకునేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేదు. ఎందుకంటే ఈతరంలో అవేశమే హెచ్చు తప్ప ఆలోచన కాదు. ఝా గారి దృష్టిలో యువతరానికి కొత్త అన్నది ప్రతీది ఇష్టమే, అది సౌఖ్యవంతమయినది అవునా – కాదా అని చూడరు. ఇదే ఆయనకు చిరాకును కలిగించే అంశం కూడా! ఆయనకు ఆవేశం వస్తే, శాంతపరచటం చాలా కష్టం. పైబడుతున్న వయస్సు ఆయనను మొండివాడిగా తయారుచేస్తుంటే ఇందులో ఆయన దోషం ఉందని ఎలా అనుకోగలం?
ఒకసారి తన ప్రసంగంలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఆయన ఇలా అన్నారు – “ఈరోజు మొత్తం సమాజం, దేశమూ కూడా పతనం వైపు పయనిస్తోంది. పైపై తళుకు – బెళుకులు, పాశ్చాత్య దేశాల గుడ్డి అనుసరణ, అక్కర్లేని డాబు – దర్పాలను చూపించటం అనే దుర్గుణాలు యువతను లోలోపలే చెదలు పట్టినట్లు తినేసి మొత్తం డొల్ల చేసి పడేస్తున్నాయి.”
ఆయన ఏం చెయ్యలేరిప్పుడు. ఆయనను వినేదెవరు? ఈ రకం మనుషులు యథార్థాన్ని ఎదుర్కోలేరని ఆయన ఎంత పదే పదే చెప్తున్నా, ఏదో చాదస్తం అని ఆయనను వదిలించుకుంటారు. ఎవరూ తన మాటలు వినటం లేదని ఆయనకు అర్థమయి ఇప్పుడు పూర్తిగా మౌనాన్నే ఆశ్రయించారు. అంతమాత్రాన ఏదో ఆయనలో తర్కంతో ఆలోచించగలిగే శక్తి పోయిందనీ, సహాయం-సలహాలనిచ్చే శక్తి లేదని భావించరాదు. ఆయన పరిస్థితులతో రాజీ పడ్డారంతే! తనదైన రీతిలో కళ్లు విప్పార్చుకుని ఆశల శవయాత్ర సాగుతూ పోతుంటే చూస్తున్నారంతే! శాస్త్ర విజ్ఞానం ఎంత ముందుకు పోతూ ఉంటే ప్రజలు ఒకరకమైన విచిత్ర పరిస్థితులలో ఖైదు అయినట్లనిపిస్తున్నారు. అయితే జరగబోయే అంతాన్ని ఎవరూ ఆకపోతున్నారు. ఆయన మళ్లీ రాముని కాలం నాటి వాతావరణాన్ని ఊహించుకుంటారు. ఆయన పూలతోట సౌందర్యంతో తన ఆలోచనల అందాన్ని కలిపి చూసేటందుకు ప్రయత్నిస్తారు.
ఇటువంటి ఆలోచనలు ఆయనకు హాయిని కలిగిస్తాయి గనకే ఆయన ప్రతిరోజూ ఆ పూలతోటలోకి వచ్చి కూర్చుని తన ఆలోచనా ప్రపంచంలో విహరిస్తారు. మనసు నిండిపోయిందనిపించాక ఇంటికి తిరుగుముఖం పడతారు. ఇల్లు చేరుకున్నప్పటినుండి ఆయన మరునాటి సాయంత్రానికై ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, ఈ సాయంత్రం తరవాత ఆయనకు తిరిగి అలాంటి సాయంత్రం రాదని ఎంతమాత్రం ఆయన ఊహించుకోలేదు.
ఇంకా ఇంటి పరిసరాల్లోకి ఆయన అడుగు పెట్టారో లేదో ఒకేసారి ‘అల్లాహో – అక్బర్’ అని ‘హరహర మహాదేవ’ అనీ నినాదాలు పెద్దగా చెవుల్లో పడ్డాయి. ఆ ప్రాంతాల్లో మతకలహాలు చోటు చేసుకున్నాయి. వాళ్ల ఊరుక్కూడా ఆ జబ్బు పాకింది. జరిగిన ఊచకోత చూస్తే మనుషులు – పశువుల్లా మారిపోయారని తెలుస్తోంది. పాశవిక ప్రవృత్తి అనే నిప్పు కణికలు మానవతను పూర్తిగా మాడ్చి-మసి చేశాయి. ఎందరి ఇళ్లో పరశురామ ప్రీతి అయ్యాయి. పొలాలు – పైర్లు అగ్నికి దగ్ధమయ్యాయి. స్త్రీల మాన – మర్యాదలు మంటగలిసిపోయాయి. స్త్రీలు వయసులో పెద్ద-చిన్న అని లేకుండా అమ్మాయిలు – వృద్దురాళ్లు అని కూడా చూడక, విధవలు-పునస్త్రీలు, ఎక్కువజాతి తక్కువజాతి అన్న భేదం పాటించక, ఈ మతం వారా – ఆ మతం వారా అని చూడక అందర్నీ ఘోరంగా, పాశవికంగా అనుభవించారు. లూటీలు – దహనాలు, హత్యలు గ్రామాన్ని, గ్రామస్తుల జీవితాలని సమూలంగా మార్చిపడేశాయి. ఈ ఊచకోతల సునామీలో ఊళ్లకి ఊళ్లే తుడిచి పెట్టుకుపోయాయి.
ఝాగారు ఎంతో ప్రయత్నించారు, వారందరికీ బోధపరచాలనీ! కాని ఒక్కరైనా వింటేనా? పైపెచ్చు కోపగించుకున్నారు కూడా! అందరూ క్రోధంతో ఊగిపోతున్నారు తప్ప, అది ఎవరిపైన? ఎందుకు? ఎవరికి కోపమో మాత్రం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించటం లేదు. కాని ఈ అక్కరలేని కోపం ప్రభావం మాత్రం చాలా బలంగా పడటం వలన ఆయనకు ఎవరి మాటలపైనా నమ్మకమే లేకుండా పోయింది. ఈ అర్థం లేని కోపాన్ని తీర్చుకునే మార్గం ఏమిటన్న పిచ్చి ప్రతివారినీ పట్టి పీడిస్తోంది. అది ఎవరి మెడ మీద కత్తి పెట్టయినా కావచ్చు, తల్లో-చెల్లో ఏ స్త్రీ మానాన్ని దోచుకునయినా కావచ్చు. ఎవరి ఇల్లు తగలబెట్టి అయినా కావచ్చు. లేదా ఎవరి శరీరాంగాన్ని నరికి పడేసయినా కావొచ్చు – ఎలాగో అలా ఈ కోపాన్ని తీర్చుకోవాలంతే! ఆ తరవాత ఏం జరుగుతుంది? అన్న ప్రశ్న గురించి ఆలోచనే లేదు. ఇటువంటి లోతైన గాయాలు ఎన్నటికీ మానవు, కేవలం తగ్గినట్లు అనిపిస్తాయంతే! అవి మళ్లీ తయారవటానికి ఎక్కువ సమయమేమీ పట్టదు. ఇలాంటి స్థితిలో ఈ సంఘం ఏమవుతుంది? ఇందులో ఎవరుంటారు? అనుబంధాలే నశించిన వేళ అది అసలు సంఘం ఎలా అవుతుంది? ఎవరికీ ఈ స్పృహే లేదు. దీని గురించి ఆలోచించి, ఆందోళన పడి ఏమీ చెయ్యలేని నిస్సహాయులు. ఝా గారు కూడా వారిలో ఒకరు.
అయినప్పటికీ ధైర్యం కోల్పోని వ్యక్తిత్వం ఆయనది. ఆయన సహాయం చెయ్యటానికి శాయశక్తులా ప్రయత్నించారు. తనకు శక్తి ఉన్నంతవరకూ, చేయగలిగినంత సహాయం ఆయన చేస్తూనే ఉన్నారు. ఆయన ఈ సాహసమే ఆయనను ప్రమాదం నుండి దూరంగా ఉంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనిషి అన్నవాడికి ముందుకు వచ్చి సహాయపడ్డారు తప్ప, ఒక హిందువుకో లేక ముస్లిముకో కాదు. కొడుకు ఆయనను ఎన్నోసార్లు ఆపే ప్రయత్నం చేస్తే ఆయన ఇచ్చే జవాబు ఒకటే – ‘నావల్ల ఎవరికీ హాని జరగదు. అపాయం రాదు. అయినా నేనింకెంత కాలం బతుకుతాను? బతికినన్నాళ్లు ఇంకా బతకను కదా! ఏమో రేపటి సూర్యోదయమే నేను చూడకపోవచ్చు! ఈ అవమానాలతో నిండిన జీవితాన్ని గడపడం కన్న మృత్యువే మంచిదనిపిస్తోంది!’
జరుగుతున్న సంఘటనలను మౌనప్రేక్షకులలా చూస్తున్న యువత స్వార్థం ఆయననెప్పుడూ ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు. వారి మాటలు కోటలు దాటుతాయి తప్ప చేతలు శూన్యం అని! వారు తమ పెద్దలనే గౌరవించలేనప్పుడు, ఇతరులను ఏం గౌరవింది – ఆదరించగలరు? ఆయన ఈ ప్రాణంలేని సంఘం నుండి ఏమి ఆశించరు. ఆయనకు తన కర్తవ్య నిర్వహణలోనే నమ్మకం, దానికి ఆయన ప్రాధాన్యత!
వారం తిరగకుండానే అందరూ పలాయనం చిత్తగించటం మొదలయింది. కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తే, ఇంకొందరు ఏదో తెలియని భయంతో, మరి కొందరు తక్కినవారిని అనుసరిస్తూ, వెళ్లటం జరుగుతోంది. అన్నివైపులా అస్తవ్యస్తంగా తయారవుతోంది. మొత్తం పరిస్తితులన్నీ మారిపోతున్నాయి. నాటకం, నాటకంలో పాత్రలు, వాటిని చూసే ప్రేక్షకులు కూడా! ఏదీ ముందులా మిగలలేదు. కేవలం, ఝా గారి ఎప్పటిలా నడవటం, ఆలోచనల్లోకి జారిపోవటం అన్న ప్రక్రియలు తప్ప అన్నీ మారిపోయాయి.
ఝా గారికి ఇప్పుడు ఏదీ నిరూపించవలసిన అవసరం లేదు. పతనం ఆరంభమయిందని ఆయనకు తెలుసు. ప్రజలు తన మాట విన్నా – వినకపోయినా ఆయనకు మాత్రం తన మాట వినిపిస్తోంది.
ఈ రోజు చాలా రోజుల తరవాత ఆయన తన అలవాటును కొనసాగించగలిగారు. మాధోసింహ్ పూలతోట వైపు తాబేలులా ఊగుతూ – జోగుతున్నట్లు ఆయన నడక సాగించారు. అన్ని సాయంకాలాల మాదిరి ఈ నాటి సాయంత్రం విసుగ్గా అనిపించటం లేదు. విరిగిపోయిన ఇళ్ల శిథిలాలు, ఆహుతి అయిన పొలాల – పంటల బూడిద కుప్పలు, కొన్నిచోట్ల పొగతో కూడిన కాలిన చర్మాల దుర్వాసన, ఏదో తెలియని నిశ్శబ్దం, ఇంకా ఎన్నో ఇలాంటి సన్నివేశాలు చూడటానికి, బాధపడటానికీ కనిపిస్తున్నాయి. ఈరోజు ఎవరివీ ఉరుకులు – పరుగులు లేవు. అయినా అసలు ఊళ్లో మిగిలినది ఎంతమంది గనక? మధ్యలో కానవచ్చే క్రీడా మైదానం శూన్యంగా కనిపిస్తోంది. పిల్లలు క్రికెట్టు ఆటలోని ఆఖరి బంతి విసరటానికి ఆలస్యం చేస్తూ – చేస్తూ సాయంత్రం వరకూ అక్కడే నిల్చి ఉండేవారు. చీకట్లు ముసురుకుని, బంతి కనిపించనంత వరకూ వారు ఇంటివైపు మళ్లే ఆలోచనే చేసేవారు కాదు. ఝా గారికి మనసు పాపమనే ఊబిలో కూరుకుపోతున్నట్లనిపిస్తోంది. అయన ఏమీ క్రీస్తు కాదు, అయి ఉంటే ఏసుప్రభువులా, పైగంబర్, గాంధీలా గళాన్ని ఎత్తేవారేమో! అయితే గొంతెత్తినా ఎవరికి విరుద్ధంగా? ఇప్పుడు ఇంగీషువారి రాజ్యమూ లేదు, బానిసత్వపు సంకెళ్లూ లేవు. మనం స్వతంత్రులమయాం. ఇక ఎవరిని నిందించగలం?
అక్కడుండే సిమెంటు కుర్చీ విరిగిపోయింది. ఝా గారికి కూర్చోటానికి జాగా వెతుక్కోవాలి. ఆ తోటలో ఇక విరిగిన కొమ్మలు, ఇక్కడా – అక్కడా పరుచుకున్న ఆకులే మిగిలాయి. ఆయన కొన్ని ఆకులను ఒకచోట కుప్పలా చేసుకుని వాటి పైన కూర్చున్నారు. బాగా సుపరిచితమైన సుగంధమేదో ఆయనను వశపరచుకుంది. చంద్రుడు – మబ్బుల మధ్య పూర్వంలాగే దోబూచులు సాగుతున్నాయి. కొన్ని విచ్చుకున్నవి, మరికొన్ని సగం – సగం విచ్చుకుంటున్న పుష్పాల మధ్యపడి ఉన్న కొన్ని వాడిన పూలు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లనిపిస్తున్నాయి. ఝాగారు వాటి భావాలను విని అర్థం చేసుకునే ప్రయత్నంలో తన జ్ఞాపకాల కిటికీలను తీసి, వాటిల్లో మునిగిపోయారు.
ఒక్కసారి బలంగా వీచిన గాలి, ఆయన ఆలోచనల గొలుసులను తెంపి పడేసింది. నాలుగు దిక్కులా వ్యాపించిన తీవ్రమైన వెలుగు ఆయనను ఆశ్చర్యపరచింది. తన ఎదురుగా ఉన్నది నిజమో – భ్రమో ఆయనకు అర్ధం కావటం లేదు. ఎన్నోసార్లు బలంగా ఆయన తన కళ్లు గట్టిగా నలుపుకుంటూ మరీ మళ్లీ-మళ్లీ చూసినా, దృశ్యం ఏ మాత్రం మారలేదు. అంతా యథాపూర్వంగా ఉంది. ఒకవంక ఏసుక్రీస్తు, మరోవంక మహ్మదు ప్రవక్త – వారి మధ్యలో మర్యాదా పురుషోత్తముడయిన శ్రీరాముడు నిల్చున్నాడు. వారి శరీరాలనుండి వెలువడుతున్న దివ్యమైన ప్రకాశ కిరణాల వలన బాహ్యంగా ఉన్న ప్రతి వస్తువూ ప్రకాశవంతమవుతోంది. అన్ని దిక్కులలో మిగిలిన పూలకొమ్మలు వంగి – వంగి ఆ మహాపురుషులకు అభివాదం చేస్తున్నాయి. ఝా గారు లేచి, ముందుకు వెళ్లారు. ఆయన ముందుకు వంగి, దాదాపు శిరసును నేలకు తాకించి ఆ దివ్యపురుషులకు నమస్కరించారు. నమస్కరించటమనది. దాదాపు మరిచిపోయినట్లే, కళ్లు అలా మూసుకుని నమస్కరించి కళ్లు తెరిచి తల ఎత్తి చూస్తే తిరిగి ఆశ్చర్యపోవటం జరిగింది. అంతా పూర్వంలాగే ఉంది.
ఆయన ధన్యుడయ్యారు. ఒత్తిగిల్లి అక్కడే భూమిమీద ఒరిగారు. ఆయన ‘ఇదే కదా జీవితమంటే! క్షణ క్షణానికీ మారుతూ ఉంటుంది!’ అనుకున్నారు. పరివర్తన, మార్పు అనేవే జీవితం యొక్క మరో స్వరూపం! ఆయన ఇంకోసారి ఒత్తిగిల్లే ప్రయత్నించారు. కాని వశంకాలేదు. ఆయనకు తన చైతన్యం లోపిస్తున్న అనుభూతి కలుగుతోంది. పక్షుల కిలకిలారావాలు క్షీణమవుతున్నాయి. ఆఖరి క్షణాల్లో బాధను సహించాలన్న భావంతో ఆయన సన్నగా నవ్వేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన తను స్వర్గానికి వెళ్తానని ఆశిస్తున్నారు, నరకంలో తన కాలాన్ని ఎలాగా గడిపేశారు కదా!
~
హిందీ మూలం: విశ్వజిత్ ‘సపన్’
తెలుగు: డా. సుమన్‌లత రుద్రావజ్ఝల