[box type=’note’ fontsize=’16’] సినిమా రంగంలో సుప్రసిద్ధ కవి నీరజ్ గారి అనుభవాలపై హిందీలో డా. ప్రేమ్‍కుమార్ రచించిన వ్యాసాన్ని తెలుగులో అనువదించి అందిస్తున్నారు డా. టి.సి. వసంత. [/box]
[dropcap]ఒ[/dropcap]క యువకుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నాడని తెలుస్తోంది. నీరజ్‌గారు మూలుగుతూ అడిగారు – “ఆయన ఏమన్నారు”. రెండు మూడు సార్లు ఇదే ప్రశ్న అడిగారు. “మీ దగ్గర నుండి లెటర్ తెమ్మన్నారు.” అని అతడు సమాధానం చెప్పాడు. “నీవు బి.ఎ. చేసావు కదూ! అక్కడ ఏం పని చేస్తావు?” “నేను వెల్డింగ్ పని చేస్తాను.” “మరి క్లర్క్ కోసం ఎందుకు ఇట్లా థర్డ్ గ్రేడ్ అప్లికేషన్ రాసావు. మరో అప్లికేషన్ రాసి రేపు తీసుకురా! అన్ని సర్టిఫికేట్లు తీసుకురా. అప్లికేషన్‌కి అటాచ్ చేయాలి.” అని చెప్పారు. ఆ యువకుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు. “ప్రతీ చోటా ఏదో ఒక బాధ. ఇవాళ నా ఆరోగ్యం అంతగా బాగా లేదు. ఈ మధ్య అసలు ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నాను. రాత్రి నిద్ర లేదు. సరే ఇవాళ వదిలేద్దాం. టీ తాగండి. టిఫిన్ తీసుకోండి.” అని అంటూ పెద్దగా ములుగడం మొదలు పెట్టారు.
జ్యోతిష్కం గురించి చెప్పడం మొదలు పెట్టారు – ‘భృగుమహర్షి, నేను జ్యోతిష్కం ద్వారా ప్రతి వ్యక్తి జీవితంలోని రహస్యాలను బయట పెట్టగలను’ అని అన్నాడు. గణపతి ‘నీవు అన్ని రహస్యాల గురించి చెప్పగలవు, మృత్యు రహస్యాన్ని మాత్రం చెప్పగలవా?’ అని అడిగాడు.
మాటి మాటికి నీరజ్ లేస్తున్నారు. కూర్చుంటున్నారు. ములుగుతున్నారు. కాలి నెప్పి విషయం వచ్చింది. మందు గురించి చెప్పడం మొదలు పెట్టారు. “ఇప్పుడే అడ్రస్ చెబుతాను మీరు తెప్పించుకోండి.” అన్నాను. “సింగ్ సింగ్ వచ్చాక నేనో 100 రూపాయలు ఇచ్చి తెప్పించుకుంటాను.” అన్నారు. అటు-ఇటూ వెతికారు. ఒక డైరీలో అడ్రస్ దొరికింది. “రాసుకోండి అరిహంత్ రసాయన్ కుస్తా. సంజీవ్ జైన్ మెయిన్ బజార్, నధూముఖీయా దుకాణాలలో, మంగళూరు, హరిద్వార్ ఫోన్ 247656. ఒక్కొక్క పొట్లం 3 రూపాయలు. ఫోన్ చేసి చూస్తాను” అంటూ నెంబర్ డయల్ చేసారు. “అవుటాఫ్ సర్వీస్” అని జవాబు వచ్చింది. పక్కన ఉన్న బాగ్‍ని తీసారు. అందులోంచి ఒక కాగితాన్ని తీసారు. రెండో నంబర్‌కి ఫోన్ చేసారు. అవుటాఫ్ కవరేజ్ అని జవాబు వచ్చింది. “అంతా ఇంతే…” కోపంగా అన్నారు. బ్యాగ్‌లో మళ్ళీ వెతకడం మొదలు పెట్టారు. సింగ్ – సింగ్ అన్న ఒక మాట గుర్తుకు వస్తోంది. ‘అబ్బ ఇందులో ఎంత నింపారో. ఇది ఒక మాయాజాలపు పెట్టె’ అని. ఆయన మళ్ళీ ఫోను చేసారు. మళ్ళీ కోపానికి వచ్చారు. “కళ్ళు కూడా మసక బారాయి. స్పష్టంగా కనిపించవు. రెండో కంటికి ఆపరేషన్ కూడా చేయించుకున్నాను…. కాని… లహరి నంబర్ ఎంత?” గాంధీ ఐ హస్పిటల్ నంబరు తనని తనే అడుగుతున్నారు, మళ్ళీ నంబరు కోసం వెతుకుతున్నారు డైరీలో… మొబైల్ నంబరు కలిపారు, కలిసింది… “హలో… నమస్కార్… అరె భాయీ! రెండో కన్ను కూడా కనిపించకుండా పోతుందేమో. ఇవాళ ఇంట్లోనే ఉంటాను. ఆ… ఆ… చూపెట్టు.” అన్నారు.
ఒక మధ్యవయస్కుడు చేతులు జోడిస్తూ నిల్చున్నాడు. తను సీవర్ టాక్స్ తీసుకొడానికి వచ్చానని చెప్పాడు. అతడిని కుర్చీలో కూర్చోమని చెప్పి ఆయన లోపలి గదిలోకి వెళ్ళిపోయారు. చిన్న చిన్న టిన్ను డబ్బాలను తీసుకుని బయటకి వచ్చారు. వెతికి వెతికి పదిహేన్నేళ్ళ కిందటి ఒక బిల్ జమ చేసిన రసీదు తీసారు. వచ్చిన అతడిని మున్సిపాలిటీలో పని చేసే ద్వివేదీ ఫోన్ నంబరు అడిగారు. గంట మోగుతునే ఉంది. కాని ఎవరు ఎత్తలేదు. కాసేపయ్యాక ద్వివేదీ ఫోను చేసారు. చెప్పారు. “పదిహేను సంవత్సరాల బిల్‌ని పంపిచడం భావ్యమేనా!” అని నీరజ్ అన్నారు. వచ్చిన వ్యక్తి తను చిరు ఉద్యోగినని, తప్పని పరిస్థితిలో వచ్చానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతకు క్రితం తనకు నొప్పిగా ఉందన్న సంగతి మరిచిపోయారు. మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు- “53,55 మధ్యలో నేను నిరుద్యోగిని. గడ్డురోజులు. నేను ఆ సమయంలో దేశం నలుమూలలు జరిగే కవి సమ్మేళనాలకు వెళ్ళేవాడిని. నా పేరు నలు దిశలా మారుమ్రోగింది. ప్రొఫెషనల్ జెలసీ కారణంగా నా మీద పలవలు-చిలవలుగా ఏవేవో కథలు చెప్పడం మొదలు పెట్టారు. అవును, తాగుడు విషయంలో, ఆడవాళ్ళ విషయంలో లేనిపోని వన్నీ కల్పించి చెప్పారు. అసలు నేను ఎప్పుడూ ఏదీ దాచలేదు. అంతా బాహాటంగా చెప్పాను. నిజం చెప్పాను. నాకు ఉదరరోగం ఉంది. బ్లడ్ ప్రషర్ ఉంది. నేను గ్లాసులో నీళ్ళతో పాటు కొంచెం డ్రింక్ కలుపుకుని మధ్య మధ్యలో తాగేవాడిని. దీని వలన నా కంఠం కూడా కొంత బాగయ్యేది. అసలు నేను చదివే తీరులోనే ఎంతో ఆకర్షణ ఉంది. కరుణ, బాధ నా కవితల్లో కేంద్ర బిందువులు. అసలు ఈ రెండిటి కలయిక వలన సంవేదన ద్విగుణీకృతం అవుతుంది. ముఖ్యంగా స్త్రీలలో సంవేదన ఎక్కువగా ఉంటుంది. స్త్రీ మనస్సు కోమలంగా ఉంటుంది. అందువలన ఈ భావోద్వేగం ప్రభావం వాళ్ళ పై ఎక్కువగా పడుతుంది. అందుకే యువతులు నా వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యే వాళ్ళు. 1951లో కలకత్తాలో జైమినీ బరువా సినిమా హాలులో నా కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆయన నా రచన ‘ప్రాణ్ గీత్’ని పబ్లిష్ చేసారు. “ఎవరి చేతిలో ఈ పుస్తకం ఉంటుందో వాళ్ళకే హాలులోకి ప్రవేశం” అని ఆయన ఒక షరుతు పెట్టారు. పదకొండు వందల ప్రతులు ప్రచురించారు. పుస్తకాలు అమ్ముడు పోడానికి ఆయన ఈ పథకాన్ని వేసారు. ఆ ప్రతులన్నీ అయిపోయాయి. మళ్ళీ 15 రోజుల తరువాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ‘ప్రాణ్ గీత్ – భాగం 2’ ని ప్రచురించారు. సర్టిఫికెట్ల అనుసారంగా నా జన్మదినాన్ని 1960, ఫిబ్రవరి 8న చేసారు. బొంబాయిలో కార్యక్రమం అయింది. రామ్ రబి మనోహర్ గారు, ఇండ్రస్టలియస్ట్ శ్రేయాన్శ్ ప్రసాద్ జైన్ గారి సహయంతో ఏర్పాటు చేసారు. బిర్లా మాతృశ్రీ సభాగారంలో ఈ కార్యక్రమం జరిగింది. అప్పటి తత్కాలీన ముఖ్యమంత్రి వై.వి. చౌహాన్ అతిథిగా వచ్చారు. బాగా సక్సెస్ అయింది. ఆయన 5 వేలు ఇచ్చారు.
ఆ సభలో శ్రోతలలో ఆర్.చంద్రా కూడా ఉన్నారు. ఆయన గీతాలను విన్నారు. తన కొత్త సినిమాకి గీతాలు రాయమని అడిగారు. గీతాలు రాయడానికి నేను రాలేను, నేను రాసిన గీతాలలో మీకు నచ్చినవి, ఫిట్ అవుతే తీసుకోండి అని చెప్పాను. నా గీతం ‘కారవాఁ గుజర్ గయా’ చాలా ప్రసిద్ధి చెందింది. అగ్రిమెంట్ అయింది. నేను ఇంతకు ముందు రాసిన కవితలను వాళ్లు తీసుకున్నారు. ‘కారవాఁ గుజర్ గయా’ ముహమ్మద్ రఫీ పాడారు. ఆ పాట మన దేశంలోనే కాదు బయట కూడా మారుమ్రోగిపోయింది. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో రావడానికి కారణం ఆర్.సి చంద్ర గారే. ఈ పాట వలన చంద్రశేఖర్, దేవానంద్, రాజకపూర్, రాజేంద్ర భాటియా, ఆత్మారామ్, గురదత్‌లతో పరిచయం పెరిగింది. లతా, రఫీ, మన్నాడే, హేమంత్ కుమార్, ముకేష్, మహేంద్ర కపూర్, కిషోర్, ఆషాభోస్లే, సుమన్ కళ్యాణ్‌పుర్, మొదలైన వాళ్ళను కలవగలిగాను. ఈ నాటికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. రాజేంద్ర భాటియా కోసం రాసిన గీతం వెనక ఒక కథ ఉంది. శంకర్ – జైకిషన్ జంటగా ఉండేవారు. కాని వాళ్ళు వేరు వేరుగా పని చేసేవాళ్ళు. శైలేంద్ర కాలం చెందాక, శంకర్ కోసం నేను రాసేవాడిని. జైకిషన్ కోసం హస్రత్ జయ్‍పురి. జైకిషన్ ఎంతో నెమ్మదస్తుడు. శంకర్‌కి తలబిరుసుతనం ఎక్కువ. అమర్యాదస్తుడు. నా పాట ఒకటి రికార్డ్ కాబోతోంది. శంకర్ రికార్డ్ చేయబోతున్నారు. ఇంతలో మరో గీత్‌కార్ ఆయన వెనక పడ్డాడు. రాజేంద్ర భాటియా నన్ను తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు. “ఈ పాట బాగా లేదు. రికార్డు చెయ్యను. నా ట్యూన్‌లో మీరో పాట రాయండి” అని అన్నారు. నేను ఏ గీతం అయితే రికార్డు చేస్తున్నారో ఆ కాగితాన్ని చింపేసాను. రాజేంద్ర హాస్యం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ‘ఈయన రోగం కుదిరేలా మంచి పాట రాయండి’ అని అన్నారు. ‘నేను రాసాక మీరు చూడండి. నీవు ఏది కావాలంటే నేను అది ఇస్తాను.’ నేను రెండో రోజు గీతం రాసాను. “లిఖే జో ఖత్ తుఝే… వో తేరీ యాద్ మే హజారోం రంగకే”. నేను పైకి వెళ్ళలేదు. భాటియా పైకి వెళ్ళాడు. ‘భాటియా నేను కిందే కూర్చుంటాను. నీవు పైకి వెళ్ళు’. ట్యూన్ కట్టి చూపాడు. కిందకి వచ్చాడు. ‘అబ్బా ఏం గీతం రాసావు అని శంకర్ అన్నాడు’. నేను ఇదే వినాలని అనుకుంటున్నాను. నన్ను పైకి పిలిచారు. భాటియా కిందకి వచ్చాక అన్నాడు “నీకేం కావాలి చెప్పు” అని. ‘నీ దగ్గర కారు ఉంది. తాళం చెవి నాకు ఇవ్వు’. ఆయన కీ ఇచ్చాడు. చాలా రోజుల దాకా నా దగ్గరే ఉంది. అందులోనే నేను బొంబాయికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని.
ఇట్లాంటిదే శంకర్‌తో మరో సంఘటన జరిగింది. నేను రాజ్ కపూర్ సినిమా ‘మేరా నామ్ జోకర్’ కోసం ‘ఏ భాయ్ జర దేఖ్ కే చలో’ పాట రాసాను. రాజ్ కపూర్ రికార్డ్ చేయించడానికి శంకర్ దగ్గరికి వెళ్ళారు. ట్యూన్ కట్టమని అడిగారు. ఇది ఛందముక్త కవిత. అందుకే ఆయన ట్యూన్ కట్టలేకపోయారు. ఆ సమయంలో ఎక్కువగా గీతాలు, ఖవ్వాలీలు, దోహాలు, భజన్లు గజళ్ళు ఎక్కువగా పాడేవాళ్ళు. ఛంద్ ముక్త కవితకు ట్యూన్ కట్టే వాళ్ళు కాదు. “ఇదీ ఒక గీతమా, మకుటం లేదు. ఇది 6 పైసలు కూడా చేయదు.” అని ఆయన అన్నారు. రాజ్ కపూర్ నన్ను ట్యూన్ కట్టమన్నారు. ఈ కవితకు ట్యూన్, కాన్స్‌ప్ట్, ఫిలాసఫీ, అంతా నాదే. అది రికార్డు కాగానే ఇండస్ట్రీ అంతా ఆశ్చర్యపోయింది. ‘ఇండస్ట్రీలో ఇట్లాంటి కవిత ఇంత మటుకు తయారు కాలేదు. మ్యూజిక్ చేసినందుకు మూడు లక్షలకి బదులు పది లక్షలు తీసుకోవాలి నువ్వు’ అని శంకర్ అన్నారు. నాకు కావాల్సింది రెండు మూడు వేలు. అసలు అక్కడ గీతాలు రాసిన వాళ్ళకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వరు. పాట పాడేవాళ్ళకు, సంగీతకారుడికి, డైరక్టర్‌కి మాత్రమే ప్రాముఖ్యత. మొట్ట మొదట్లో రికార్డుల పైన గీత్‍కార్ల పేరు కూడా ఉండేది కాదు. సాహిర్ దీని కోసం చాలా పోట్లాడారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతటా సంగీతం హిట్ అయింది అని రాస్తారు. గీతం హిట్ అయింది అని ఎవరు చెప్పరు. సంగీతానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు శబ్దాలకి కూడా ఇవ్వాలి. మంచి మంచి పదాలు పడితేనే గీతానికి సౌందర్యం వస్తుంది. ఏదైనా గీతం ప్రసిద్ధి చెందిందంటే సంగీతం, గాయకుడు, శబ్దసౌందర్యం మూడింటికి ప్రాముఖ్యత ఉంటుంది.
ఒకసారి ఒక కవి సమ్మేళనంలో దేవానంద్ కలిసారు. నా కవిత విని ‘నీరజ్ ఐ లైక్ దిస్ లాంగ్వేజ్. మనం కలిసి పని చేద్దాం’ అని, ‘ప్రేమ్ పూజారి అనే సినిమా తీస్తున్నాన’ని ప్రకటన చేసారు. నేను స్క్రీన్ మీద చదివాను. దేవానంద్‌కి ఆయన చెప్పిన విషయాన్ని ఉత్తరం ద్వారా గుర్తు చేసాను. వారం తరువాత ఆయన నుండి ఉత్తరం వచ్చింది. నాకు ఒక వెయ్యి రూపాయలు పంపించారు. ఎన్ని రోజులు సెలవలు తీసుకున్నావని అడిగారు. ఆరు రోజులు అని చెప్పాను. నీకు ఫ్లైట్‌కి రిజర్వేషన్ చెయించాను. నేను ఎస్.డి.బర్మన్‌కి నీ పేరు చెప్పాను. నాకు నీరజ్ ఎవరో తెలియదు. నా ట్యూన్ ని అనుసరించి రాయగలడా! అని అడిగారు. ఆయన ట్యూన్ వినిపించినా గాభరా పడకు. మేం ఆయన ఇంటికి వెళ్ళాం. ట్యూన్‌లో మొదటి పదం రంగీలా అని ఉండాలి అని ఆయన చెప్పారు. గీతంలో చిన్న చిన్న మాటలు ఉండాలి. గుల్, బుల్, బుల్, షము – పర్వానా, షరాబ్, కబాబ్, అక్కరలేదు. నేను రాత్రి కూర్చుని గీతం రాసాను. “రంగీలా రే తేరే రంగ్ మే యుం రంగా హై మేరా మన్, న బుఝే హై కిసి జల్ సే యే జలన్”. దేవానంద్ విని ముగ్ధులై పోయారు. బర్మన్ దాదా, భాభీ (వారి భార్య) ఒక బెంగాలి యువకుడు ఉన్నాడు అతడు, అందరు విన్నారు. ఎస్.డి బర్మన్ విని ముగ్ధులైపోయారు. ఒక్కొక్క మాట ముత్యమే. గీతం పుర్తయ్యాక ‘వెళ్దాం నీరజ్’ అని అన్నారు. ‘మీరు వెళ్ళండి, నీరజ్ నా దగ్గర కూర్చుంటాడు’ అన్నారు బర్మన్. దేవ్ సాహెబ్ చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారు. ‘నీరజ్ నిన్ను ఏదో విధంగా వదిలించికోవాలని నీకు ఈ గీతం ఇచ్చాను. కాని నీవు నన్ను ముగ్ధుడని చేసావు. రాత్రి నాతో కలిసి భోజనం చెయ్యి’ అని దాదా అన్నారు. దేవ్ సాహెబ్‌కి ఈ విషయం చెప్పనప్పుడు ఆయన ఎంతో సంతోషించారు.
ఆ తరువాత నేను రెండు నెలలు సెలవు తీసుకున్నాను. అక్కడ ఒక హోటల్‌లో ఉండటం మొదలు పెట్టాను. ఎస్.డి బర్మన్ కారు నా దగ్గరికి సరిగ్గా తొమ్మిది గంటలకు వచ్చేది. నేనూ, ఆయన కూర్చుని కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త ట్యూన్ల కోసం వెతికేవాళ్ళం. నిజానికి ఎస్.డి. బర్మన్ లాంటి సంగీతకారుడు మరొకరు ఫిల్మ్ ఇండస్ట్రీలో దొరకరు. ఆయన పబ్లిసిటీకి దూరంగా ఉండేవారు. 24 గంటలు కేవలం సంగీత సాధన చేసేవారు. కొత్త కొత్త మాటలను వాడేవారు. ఆ గీతాలన్నిప్రసిద్ధి చెందాయి. తమన్నా, రబ్బా, ఇష్క్, మొహబ్బత్, దీవానా, పరవానా, రాహత్, తనహాయి, ఏభై పదాలతో పాట సమాప్తం అవుతుంది. మదిర, మధుర్, గీతాంజలి, రజనీగంధా, మూలా మే ధాగా లాంటి పదాలతో ప్రయోగాలు చేసారు. ఒక గీతంలో చరణం ముందు వస్తుంది. ఆరు చరణాల తరువాత మకుటం వస్తుంది – “ఫూలోంకి రంగ్ సే, దిల్ కి కలమ్ సే తుఝ్ కో లిఖీ రోజ్ పాతీ…” ఆయన ఒక గీతంలో నజ్మ కూడా రాసారు. “దిల్ ఆజ్ షాయర్ హై, గమ్ ఆజ్ నగమా హై… గైరోం కే షేరోం కో సున్‌నే వాలే ఇస్ తరఫ్ భీ హో కరమ్….” ఇందులో మకుటం లేదు. ఇద ఒక పూర్తి నజ్మ. ఆయన ఒక గొప్ప ప్రయోగం చేసారు. ఆందులో మకుటంలోనే సంగీతంలోని నాలుగు ప్రకారాలు ఉన్నాయి. మొదటి పంక్తిలో లోక్ గీత్, రెండో పంక్తి క్లాసికల్, మూడో పంక్తి పాప్, నాలుగో ఖవ్వాలి – “హమ్ పర్ ధూల్ డాలో, కహా కహా లగాలో, కాంటోకి డగరియా జిందగానీహై, తమ్ జో ముస్కురాదో రాజధాని హై… హమ్ సె ఉధార్ లేలో మస్తీ…” ఈ విధంగా కొత్త కొత్త స్టైల్స్‌లో ప్రయోగాలు చేసారు. మళ్ళీ ఎవరు ఈ విధంగా చేయలేదు. “ఏ భాయి జరా దేఖ్ కె చలో…” స్వరకల్పన అయ్యాక రాజ్ కపూర్ మహఫిల్‌లో పాడేవారు. ఈ ప్రయోగం తరువాత లక్ష్మీకాంత ప్యారేలాల్ చేసారు. “అచ్చాతో హమ్ చల్ తే హైం, ఫిర్ కబ్ మిలోగే జబ్ తుమ్ కహేగా…”
ఫోన్ మ్రోగింది. అటు వైపు నుండి ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. నీరజ్ గారు కంఠంలో మార్పు వచ్చింది. ఇట్లా మరెవరితోనూ మాట్లాడటం నేను వినలేదు. నమ్రతగా… తీయ తీయగా… మెల్లి మెల్లిగా… “అవును బాబూ వెళ్ళలేదు… ఆ ఊళ్ళో ఉన్నాను. మరి అక్కడ కరెంటు ఉంటుందా, ఏమో వెళ్ళలేదు. ఆ ఉంటాను. నిన్ను కలవడానికి 24, 25 వ తేదీలు. నామినీ నీ పేరే ఉంది నీవు లేకుండా పని జరగదు. డబ్బులు తీసుకోవాలిగా!” అన్నారు. బహుశ అటువైపు నుండి వారి కొడుకు మాట్లాడుతున్నాడు.
~