ప్రేమించే మనసా… ద్వేషించకే!-23

0
4

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]గ[/dropcap]దిలో చీకటి అలుముకోవటంతో ‘టైమ్’ బుక్ చదువుతున్న సుధీర్, వాలు కుర్చీలోంచి లేచి లైట్ స్విచ్ వేసి వెనుతిరిగినంతలో తలుపు మీద టిక్ టిక్‌మని ఎవరో వేలితో కొడుతున్నట్లు కావటంతో తలుపు తీసాడు.

ఎదురుగా సునీత చిన్న సైజు వి.ఐ.పి. బాక్సుతో నిలబడి వుంది. చెదిరిన తలతో… ఏడ్చి ఉబ్బి బుగ్గల మీద ఏర్పడిన చారలతో…. దుఃఖాన్ని మునిపంటితో నొక్కుతూ ఉన్న సునీతను చూడగానే సుధీర్‌కి కంగారు కలిగింది.

“సునీ! ఏమిటిలాగున్నావ్? ఏమయింది? మీ అమ్మగారు ఏమైనా అన్నారా? ప్లీజ్ చెప్పవూ?” అని చేతిలో పెట్టి అందుకొని ఆత్రుతగా అడిగాడు సుధీర్!

ఒక్క క్షణం కళ్లెత్తి చూసింది సునీత.

“నన్ను లోపలికి రానిస్తావా సుధీర్” అంది.

కంగారుగా “సారీ సునీతా. రా లోపలకి… అలా అడుగుతావేం… ఈ రోజు నా గుమ్మంలోనికి నువ్వు వచ్చావ్ కాని, నా హృదయంలో ఎపుడో ప్రవేశించావు. కమాన్ వచ్చి కూర్చో. నువ్వేం చెప్పొద్దు… జరిగింది త్రవ్వుకోవటం అనవసరం! రేప్రొద్దున్నే వెళ్ళి… ఎక్కడికనుకున్నావ్? దుర్గ గుడికి… దండలు మార్టుకొని ఇంటికి వచ్చేద్దాం” అన్నాడు.

కనురెప్పలు వాల్చడం మరిచిపోయి, ఊపిరి తీసుకోవటం ఆపి ఒక్క నిముషం సుధీర్ వంక కళ్లు త్రిప్పుతూ ఆశ్చర్యంగా చూసింది. “వండర్‌ఫుల్ ఐడియా సుధీర్!… ఇంత బ్రహ్మాండమైన ఐడియా ఇంత అర్జెంటుగా వస్తుందని కలలో కూడా అనుకోలేదు” అని పకపకా నవ్వేసింది సునీత.

సునీత నవ్వటం చూసి సుధీర్ ముఖం చిన్నబోయింది. “ఏమిటి సునీతా! నువ్వు చెప్పేది, మన వివాహా విషయంలోనే గదా, ఘర్షణ పడి వచ్చేశావు… అటువంటప్పుడు మనం వివాహం చేసుకుంటే…” సుధీర్ మాట పూర్తి కాకుండానే అందుకుంది సునీత!

“నిజమే సుధీర్ నువ్వు చెప్పింది బాగుంది గాని నేను చెప్పేది శ్రద్ధగా విను… నేను కలలో అనుకోలేదు మమ్మీ మనసు అంత పాషాణం అని… అంతే గాదు అనుకూడని మాటలు ఎన్ని అంది. పోనీ ఆవేశంలో తన కూతురు ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటుంన్నందుకు అంటే ఫర్వాలేదు… నా కళ్ల ఎదుటే లాయరును పిలిపించి, తన తననంతరం ఆస్తి విద్యాసంస్థలకి, ఆర్ఫన్ హోమ్స్‌కి చెందేటట్లు వ్రాయించింది. ఛీ!… మమ్మీ ఎంతో ఉన్నతురాలు అనుకొని తన చేతుల మీదగానే మన వివాహం చేస్తుంది అనుకున్నాను. సుధీర్ మమ్మీ యింకా ఏమందో తెలుసా? ఈ ప్రేమా! గీమా! పెళ్లియినాక మోజు తీరినాక ఉండదట. ఆస్తిలో చిల్లిగవ్వ రాదని తెలిసిన మరుక్షణం నువ్వు… నా మొఖం చూడవట… అంతేకాదు… తను యిలాంటి ప్రేమ కథలు ఎన్నో చదివింది… కళ్ళారా చూసింది… నా మాట విను… అంతా అయిపోయినాక బాధపడితే లాభం లేదు అంది… నువ్వు… నన్ను… కాదని వెళ్లినా గాలి రాని… ఇంట్లో… నాలుగు రకాలు పెడితేగాని భోజనం చేయని నువ్వు ఒక రకం కూరతో; మెత్తటి షిఫాను చీరలు కట్టే నువ్వు వాయిలు చీరలతో కాలం గడుపలేవు. బాగా ఆలోచించుకో… ఆలోచించుకొని మనసు మార్చుకొని… అతన్ని మరచి పోయాను అని వచ్చావో ఫారిన్ రిటర్నడ్‌ని చేస్తాను. A.C బంగ్లాలో… మెత్తటి ఫోం… యీలా నన్ను మాటలతో చిత్ర వథ చేసింది.” చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పసాగింది.

ఒక్కసారే సుధీర్‌లో కోపోద్రేకాలు చోటు చేసుకున్నాయ్! “సునీతా ప్లీజ్ యింకేం చెప్పకు… ధనంలో పుట్టి…. ధనంలో పెరిగిన మీ అమ్మగార్కి…. ధనం గురించే బాగా తెలుసు కాని మనుషుల గురించి తెలియదు. ఎనీ వే లీవిట్ సునీత! కాని ఒక్క విషయంలో మీ అమ్మగారిని అభినందించాలి…. నోటితో ఎన్ని మాటలన్నా మన ప్రేమని శంకించినా, నిన్ను మాత్రం నాకు దూరం చేయలేదు” అన్నాడు.

ఇంకా సునీత వెక్కి వెక్కి ఏడుస్తుంది.

“సునీతా! ప్లీజ్! అలా బాధ పడకు…లే… లేచి ముఖం కడుక్కొని స్నానం చేసిరా… క్యారియర్ తెచ్చుకున్నాను నా గురించి. ఫ్రూట్స్ వున్నాయి. సద్దుకొని తినేద్దాం, నీ ముఖం ఎలా వాడిపోయిందో తెలుసా?” బుజ్జగింపుగా అడుగుతున్న సుధీర్ వైపు కళ్లు తుడుచుకొని చూసింది.

సుధీర్ కళ్లలో ప్రేమ కొట్టవచ్చినట్లు కనపడకపోయినా మొఖంలో బాధ తాలూకా చిహ్నాలు చూసిన సునీత… “సుధీర్, స్నానం చేసి రెస్టు తీసుకుంటాను గాని… నేను తీసుకున్న నిర్ణయం విని పిచ్చిగా ఆలోచిస్తున్నాను అని నవ్వుకుంటావో, ఏం అనుకుంటావో నీ ఇష్టం… మా మమ్మీ వాదన… మన ప్రేమను గడ్డి పరక కన్నా తక్కువగా చేసి మాట్లాడటం చూసి నాకు… నేను ఈ నిర్ణయానికి వచ్చాను. మన ప్రేమ పవిత్రతను నిరూపించటానికి… అంతే కాదు మూణ్ణెళ్ళయిన నిలబడదు, తర్వాత విచారించి లాభం లేదు అన్న మాటకే ఈ నిర్ణయానికి వచ్చాను. తొందరపడి వివాహం చేసుకోకుండా కనీసం మూణ్ణెళ్లు ప్రేమికులా కాకుండా ఫ్రెండ్సులా కలిసి మెలిసి తిరుగుదాం” అంది. “మన ప్రేమలో తొందరపాటుకి అదే సెక్స్‌కి ప్రాధాన్యత లేదని జీవితాంతం తోడు నీడ కావడానికి మన యిరువురి అభిప్రాయాలు సరిపోవటంతో… ఒకరి మీద ఒకరికి సంపూర్ణమైన ప్రేమ తరంగాలు ఏర్పడటం వలనే వివాహం చేసుకోటానికి నిశ్చయించుకున్నాం గాని మమ్మీ అన్నట్లు మోజులో ఇద్దరం ఒకటి కావాలనుకోలేదని మా మమ్మీకే కాదు… ఈ సంఘంకి… మనలాంటి ప్రేమికులకు ఆదర్శంగా నిలబడాలని అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితిలో మన యిద్దరి మధ్య సెక్స్‌కి తావివ్వకూడదు. అలాంటిది ఏమైనా జరిగిందో మన ప్రేమికులం కాదు కాముకులం అవుతాం. అంతే కాదు నీ త్రోవ నీది నా త్రోవ నాది.”

“రెండోది పురుషుడన్న ఆధిక్యత చూపకూడదు. అలా అని గాజులు తొడుక్కోమనడం లేదు… స్త్రీ చేయవలసిన కర్తవ్యం ఏమిటో నాకు తెలుసు… కొంతమంది మగవాళ్లు మగ పుట్టుక పుట్టామని అనవసరమైన ఆధిక్యతను భార్యల మీద చూపెడుతుంటారు. అటువంటి వాళ్లంటే ఎలర్జీ.”

“మూడోది నా వలన పైసా ఆస్తి మా మమ్మీ దగ్గర్నుండి రాదు. ఈ మూడు నెలల్లో నా వలన పైసా ఆస్తి వచ్చేది లేదని… నువ్వు  ఈలోగా ఆలోచించుకొని… నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడకపోయినా సంతోషంగానే ఒప్పుకుంటాను. కారణం నీ వలన నేను మోసపోకూడదు. అది నాకు కావలసింది. అందుకే మనం ఫ్రెండ్స్‌లా వుందాం” అన్నది.

ఒక్కక్క వేలు మడిచి చెప్పుకుపోతున్న సునీత వైపు చూసి రెండు చేతులతో చెప్పట్లు కొడుతూ నవ్వసాగాడు.

అలా పిచ్చెత్తినట్లు పడి పడి నవ్వుతున్న సుధీర్‌ను చూస్తుంటే తను పెట్టిన షరతులు చూసి భయపడ్డాడనుకున్న సునీత, సుధీర్ తత్వం ఏమిటో అర్థం కాక చూడసాగింది.

“ఏమిటి సుధీర్‌, నీ నవ్వు” అంది కోపంగా.

“నీ షరతులు చూస్తుంటే స్వతఃసిద్ధంగా నీకు గల్గిన అభిప్రాయాల్లా అనిపించడం లేదు… ఈ మధ్య తెగ నవలలు చదవి వుంటావే! మహా తల్లి ఏ రచయిత్రి ఏ నవల్లో వ్రాసింది ఈ షరతులు, ఆవిడ చాలా కష్టపడి వ్రాసింది పాఠకుల కోసం… కాని నువ్వు అనవసరంగా వంట పట్టించుకున్నావ్” అన్నాడు.

ఒక్క నిముషం కోపంతో ముక్కుపుటాలు ఎగరసాగాయి సునీతకు. కోపంతో “ప్లీజ్ సుధీర్ టెక్ ఇట్ సీరియస్” అంది.

“మైగాడ్ ఈ షరతులన్నీ నేను భరించవలసిందేనా? తప్పదా” అన్నాడు.

సునీత తను అంత సీరియస్‌గా చెబుతుంటే, ఈ షరతులు భరించవలసిందేనా అని సుధీర్ అడగడంతో తన ప్రేమలో ఏదో అపశృతి పలుకుతున్నట్లనిపించింది సునీతకు.

“సుధీర్! బాగా విను నేను చెప్పేది, నేను పెట్టిన షరతుల్లో ఏది నువ్వు తప్పినా ఒక వేళ నేను తప్పినా మనం విడి….”

“స్టాప్ సునీతా! నీకు ఎంత తేలికగా వుందో గాని ఆ పదం నేను వినలేకపోతున్నాను. మూడు నెలలు పరీక్షిస్తాను అంటున్నావు. జీవితాంతం పరీక్షించినా అభ్యంతరం లేదు. సరే స్నానం చేసిరా… ప్లీజ్….” అన్నాడు.

***

“అబ్బా!… మై గాడ్ నోటిలో పెట్టుకుంటే వాంతి వస్తుంది. పెసరట్టు ఇలానేనా వుండేది? నాకు వద్దు సుధీర్” అని ప్లేటు ప్రక్కకు త్రోసింది.

“ప్లీజ్ సునీత! ఈ ఒక్కరోజుకు తినవూ!” అని సునీత చేయి పట్టుకున్నవాడు చేతి వంక చూసాడు. లేత తమలపాకుల్లా అందంగా సుకుమారంగా మెరిసిపోతున్న వేళ్ళ వంక ఒక్క నిముషం చూసి… అలానే చటుక్కున చేయి ఎత్తి వేళ్ల మీద ముద్దు పెట్టాడు..

అంతే! సునీత శరీరం అంతా ఏదో తెలియని మధురానుభూతితో నిండిపోయింది. మరుక్షణం తీక్షణంగా కళ్లు పెద్దవి చేసి సుధీర్ వైపు చూసి “మాట తప్పుతున్నావ్! మనం అనుకున్నదేమిటి?” అంది కోపం నటిస్తూ.

తల మీద గట్టిగా కొట్టుకుని “ప్లీజ్ సునీతా ఈ ఒక్క చిన్న పొరపాటును క్షమించవూ…” అని “ఇట్ ఈజ్ డ్యూ టు లస్ట్ అని ఫ్రెండ్సు అయిన వాళ్లు యిలా ఆప్యాయంగా అనుకోరా” అన్నాడు.

కంగారుగా భయంభయంగా అడుగుతున్న సుదీర్ వైపు, చూస్తుంటే నవ్వాగలేదు సునీతకు.

 “యు ఆర్ కరెక్ట్! ఫ్రెండ్స్ అయినా వాళ్లు అందులోకి బోయ్, గరల్ ఫ్రెండ్సు ఇలానే అనుకుంటారు గదూ?” అంది.

సునీత నిజంగా అంటుందో… ఎగతాళిగా అంటుందో అర్థం కాక తెల్ల ముఖం పెట్టి చూసాడు.

“ఫ్రెండ్ చేతులు ముద్దు పెట్టుకుంటారట. ఇంకా నయం” అని నవ్వుతూ… “ఈ ఒక్క సారి క్షమిస్తున్నాను” అంది నాటక ఫక్కీలో.

పకపకా నవ్వేశాడు సుధీర్.

“ఏం మహానుభావా నీ హోటల్ భోజనానికి నమస్కారం చేసి ఏదో వండుకుంటున్నామా! ఆ చేత్తోనే టిఫిన్ కూడా వండేసుకుందాం… హోటల్ నుండి తెచ్చే టిఫిన్ మా యింట్లో కుక్క కూడా తినదు.”

ఒక్క క్షణం సుధీర్ ముఖం చిన్నబోయింది. సునీత అలా అన్నందుకు కాదు. పాపం సునీత, రోజూ ఈ టిఫిను ఎలా తింటుందా అని… ఆలోచన రావడమే! “అలాగే సునీతా… రేపటి నుండి” అన్నాడు.

రాత్రి ఎనిమిది గంటల సమయం. టేబుల్ మీద ఫ్యాను కిర్రు కిర్రు అంటూ గాలి ఎక్కువ లేకపోయిన శబ్దం మాత్రం చేస్తూ తిరగుతుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here