యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-31: పుంగనూరు-3

0
3

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా పుంగనూరు లోని సుగుటూరు గంగమ్మ ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

సుగుటూరు గంగమ్మ

[dropcap]జా[/dropcap]తరలు అంతరించి పోతున్న ఈ కాలంలో ఇంకా వైభవంగా జరుగుతున్న సుగుటూరు గంగమ్మ జాతర గురించి, ఆవిడ గురించి చెప్తాను. అందరూ వెళ్ళి చూడలేక పోయినా ఎలా జరుగుతాయో తెలుసుకోవచ్చు కదా.

సుగుటూరు వంశీకులు పుంగనూరు వచ్చి జమీందార్లుగా స్ధిరపడినప్పుడు గంగమ్మ గుడిని నిర్మంచారు. వీళ్ళు సుగుటూరులో పాలెగాళ్ళుగా అడుగు పెట్టినపుడు మొదటగా గ్రామ పొలిమేరలోని గంగమ్మను పూజించి పాలన చేపట్టారు. అపుడు వారు ముస్కుకాపు పాలెగాళ్ళుగా విజయనగర రాజుల క్రింద శిస్తు వసూలు చేసేవారు. రాజ్య భాగ పరిష్కారం తర్వాత పుంగనూరుకు కేంద్రమును మార్చిన తర్వాత నమ్మిన గంగాదేవిని కూడా తమవెంట తీసుకు వచ్చారు. పట్టణ నడిబొడ్డులో వున్న సుగుటూరు గంగమ్మ జమీందార్ల కుల దేవత.

ఈ జమీందార్ల గురించి ఒక కథ ప్రచారంలో వుంది. సుగుటూరు నుండి వచ్చినపుడు ఈ వంశీకులు తమతోపాటు గంగమ్మను కూడా తెచ్చారు. అక్కడ వ్యవసాయం చేస్తూ పాలెగాళ్ళగా వుండేవారు.. అందులో ఆదాయం రాక, రాజులకు భూమి శిస్తు కూడా చెల్లించలేని దుర్దశలో వున్నప్పుడు, జమీందార్ల పూర్వీకులు ఒకరు ఒక రోజు పొలం వద్ద నిద్రిస్తుండగా ఒక నాగుపాము పడగపట్టి నీడనివ్వడం గమనించిన ఇమ్మడి ముమ్మడి అనే తోటి వ్యక్తి తమ యజమానికి తెలిపారు.

ఈ విషయం జ్యోతిష్కులతో సంప్రదించగా వారు మీకు రాజ యోగం వుందని, అపారమైన ధనము సంక్రమిస్తుందని తెలియజేశారుట. వారి జ్యోతిష్యం కొన్ని రోజులలోనే నిజమైంది. ఆ సమీపంలోని కొండపాదం వద్ద గోప్యంగా వున్న రత్నాల నిధి లభించడమే గాక, పూజలు చేసిన పాద పీఠం కూడా వారికి కన్పించింది. ఆ పీఠాన్ని సమీపించేసరికి అతను నిద్రావస్తలో పడిపోయాడు. ఆ నిద్రావస్తలో ఆ పాదపీఠం ఒక శక్తి స్వరూపిణి అయిన గంగమ్మ దేవతదని, ఈ దేవతను ఇలవేల్పుగా భావించమని కల కనడంతో ఇది దైవానుగ్రహం అని భావించి పూజా కార్యక్రమాలు జరిపించారని ప్రతీతి. అమ్మవారి అనుగ్రహంతో వారు జమీందార్లు అయిన తరువాత ఆ పాదపీఠాన్ని తరలించుకొని వస్తుండగా ప్రస్తుతం గుడి వున్న చోట రథం ఇరుసు విరిగి పోవడంతో అక్కడే అమ్మవారి గుడి నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా జాతరలు జరుగుతూనే వున్నాయి. ఈ గంగజాతర ప్రతి ఏడు ఉగాది పండుగకు ముందు నిర్వహిస్తారు. వారం రోజులు ముందుగానే తొలిచాటింపు, మలి చాటింపులతో నగరమంతా తెలియజేస్తారు.

ఇప్పటికినీ పుంగనూరు సమీపంలోని వంద గ్రామాల వాళ్ళు ఈ పండుగను ఘనంగా చేసుకుని ఉగాది పండుగను నామ మాత్రంగా ముగిస్తారు. జమీందారు వంశీకులు కలశ ప్రతిష్ఠ, శాంతి పూజ గావించి అమ్మవారి విగ్రహాన్ని పూజించి గుడిలో ప్రతిష్ఠిస్తారు. ఈ జాతరలో మూడు రోజులపాటు కర్నాటక, తమిళనాడు తదితర ప్రాంతాలకు చెందిన వేలాదిమంది భక్తులు పాల్గొని అమ్మవారిని సేవిస్తారు. బెల్లం పానకం, పసుపునీరు, మజ్జిగలు కుండలలో నింపుకొని గెరిగలు నెత్తిన పెట్టుకుని మట్టికుండలపై ఒకటి రెండు మూరల ఎత్తు వరకు వేపాకు, పుష్పాలంకరణలతో మొక్కుబడులు చెల్లించుకుంటారు. స్త్రీలు, స్త్రీల వేషంలో పురుషులు (గంగ వేషాలు) గడ్డం మీసాలతో గెరిగలతో మొక్కులు తీర్చుకుంటారు. జంతు బలులకు ఈ జాతర ప్రసిధ్ధి. వేల సంఖ్యలో జరుగుతాయి. లక్షల సంఖ్యలో కొబ్బరి కాయలు కొడతారు. కొందరు భక్తులు తమ గ్రామాలనుండి కాలి నడకన బ్యాండు మేళములతో వేడుకగా వచ్చి, గరిగె మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా 50 వేల గరిగె భక్తులు వివిధ అలంకారాలతో అమ్మవారి గుడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

భక్తులు గంగాదేవికి మొక్కుబడుల రూపంలో కానుకల రూపంలో బంగారు, వెండి ఆభరణాలు, నోట్ల హారాలు, డబ్బు సమర్పిస్తారు. జమీందార్లు తాము నమ్మే గంగమ్మ పేరిట ఘనంగా జాతర నిర్వహించడం వందలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం. జాతర సందర్భంగా 50 లక్షలకు పైగా ప్రజలు గంగమ్మని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.

ఈ పండుగ సందర్భంగా శక్తి దేవాలయాలలో దర్శనం వుండగా, శైవ, వైష్ణవాలయాలు తాళం వేయబడి వుంటాయి. ఈ రోజు పట్టణంలోనికి రవాణా వాహనాలు అనుమతించరు. గంగపండుగ పేరుతో పట్నంలో జరిగే వ్యాపారం 50 కోట్ల రూపాయల పైమాటే. ప్రజల దృష్టిలో పడేందుకు పట్నం నిండుగా భవనాలు కనుపించని రీతిలో తమ ఫోటోలతో ఫ్లక్సీ బోర్డులు నింపేస్తారు.

పట్టణంలో ఎనిమిది మూలల్లో ఎనిమిది గంగమ్మలున్నారు నడిబొడ్డి గంగమ్మ కాక. శిరస్సు ఉరేగింపు పట్నంలోని ఎనిమిది మూలల్లో అష్ట గంగమ్మలను పలకరిస్తూ సాగుతుంది. తరతరాలుగా నిరాఘాటంగా జరిగే ఈ ఉత్సవానికి బ్రిటిషు ప్రతినిధులు సహితం హాజరై అమ్మవారికి పూజా ద్రవ్యములు, కానుకలు అందించారుట. కుల మతాలతో నిమిత్తం లేని పండుగ ఈ పుంగనూరు గంగ జాతర.

ఈ జాతర పుంగనూరు పట్టణం మరియు చుట్టుపట్ల వంద గ్రామాల ప్రజల పండగ. అయితే జమీందారీ వారసులే ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. పట్టణ పెద్దలు నిర్వహించే ఈ అద్భుతమైన పండుగలో పూర్వం నుంచి సంబంధ బాంధవ్యాలున్న పనిపాట్ల వాళ్ళు వందలాది మంది వున్నారు. పండుగలో భాగంగా వారివారి పనుల్ని వారు సక్రమంగా నిర్వహించి రివాజులు పొందుతారు.

సాయంకాలం 6 గంటలకు ఇక్కడనుండి బయల్దేరి దాదాపు 80 కి.మీ.ల దూరంలో వున్న చిత్తూరు నివాసానికి చేరాము. ఈ రోజు పర్యటన సమాప్తం. రేపటి సంగతి వచ్చేవారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here