మూడు దేశాల సందర్శన – ఇగ్వాజు జలపాతం

0
3

[box type=’note’ fontsize=’16’] అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే సరిహద్దులలో జరిపిన పర్యటన, ఇగ్వాజు జలపాతం అందచందాల గురించి వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]

[dropcap]మే[/dropcap]ము 2008లో ఒకసారి 2014లో మరొకసారి అందమైన ఇగ్వాజు జలపాతం చూడడం జరిగినది. మేము హైదరాబాద్ నుండి ముంబాయి, పారిస్ మీదుగా బ్రెజిల్ వెళ్ళాము. మా వద్ద ట్రాన్సిట్ వీసాలు లేని కారణంగా పారిస్‌లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఎలాగో అధిగమించి బ్రెజిల్ చేరి మొదటిసారిగా బ్రెజిల్ మరియు అర్జెంటీనా సరిహద్దులలో ఉన్న జలపాతాలు మరియు రెండు దేశముల నేషనల్ పార్కులు సందర్శించడం జరిగినది. రెండవసారి అర్జెంటీనా మీదుగా అంటార్కిటికా వెళ్లే ప్రయాణంలో భాగంగా ఈ జలపాతములు చూడటం జరిగినది. ఈ జలపాతములు నదీ పరివాహక ప్రాంతము మమ్మలను రెండవసారి కూడా చూసే విధంగా పురికొల్పాయి. రెండవసారి వెళ్ళినప్పుడు అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే ఈ మూడు దేశముల సరిహద్దులను, అక్కడ జలపాతాల హొయలు, అందచందాలు అన్ని కూడా తనివితీరా చూడటం జరిగింది.

ఇగ్వాజు జలపాతం అర్జెంటీనా దేశంలో ఉంది. దీనిని రియోలో ఇగ్వాజు నది అంటారు. ఈ నది శాంటా కరోనా మరియు ఫరానా అనే దక్షిణ బ్రెజిల్ ప్రాంతంలో పయనించి ఇగ్వాజు అనే జలపాతంగా మారుతుంది. తర్వాత పరాగ్వేలో అంతమవుతుంది.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతంగా పేరుపొందినది. ఈ జలపాతం ఎగువ ఇగ్వాజు, దిగువ ఇగ్వాజు అనే రెండు భాగాలుగా విడగొట్ట బడుతుంది. ఈ ఇగ్వాజు నది Curitiba అనే ప్రాంతం నుండి ప్రారంభమవుతుంది, బ్రెజిల్ గుండా పయనిస్తుంది. అయినప్పటికీ ఈ నది యొక్క జలపాతాలు ఎక్కువగా అర్జెంటీనా వైపునే ఉన్నాయి. ఈ నదీ ప్రవాహం అర్జెంటీనా మరియు బ్రెజిల్ దేశాలకు సరిహద్దుగా ప్రవహిస్తుంది. చివరకు San Antonio నదిలో సంగమం జరుగుతుంది. ఇగ్వాజు అనే పేరు Guarani లేదా Turi అనే స్పానిష్ పదాల నుండి పుట్టినది. “ఇగుస్సూ” అనగా స్పానిష్ భాషలో “నీరు” అని అర్థము. ఉసాస్సు అనగా చాలా పెద్ద అర్ధమే ఉన్నది. Naipi అనే ఒక అందమైన యువతిని ఒక దేవత వివాహం చేసుకొనుటకు ఇష్టపడి సన్నాహములు చేసుకున్నది. కానీ ఆ యువతి ఆమె ప్రేమికుడైయిన Tarobaతో కానాన్‌కి పారిపోతుంది. అలా పారిపోయిన ఆ ఇరువురి ప్రేమికులను విడదీయడం శాశ్వతముగా పతనము చేయుటకు ఆ దేవత ఈ నదిని ముక్కలు ముక్కలుగా చేసి అనేక జలపాతాలు సృష్టిస్తుంది. చివరికి ఆ ప్రేమికులిరువురను ఆ జలపాతములలో పతనము చేస్తుంది. ఈ జలపాతం యొక్క ఉనికిని మొట్టమొదటిగా 1541వ సం.లో Conquistador Alvar Nunez Cabeza Vaca అనే ఒక యూరోపియన్ గుర్తించాడు.

ఈ నదిలో మొత్తము 300లకు పైగా జలపాతాలు ఉన్నాయి. అన్నిటికంటే పొడవైన జలపాతము 82 మీటర్లు (269 ft). ఈ ఇగ్వాజు నది సరాసరి నీటి ప్రవాహం ఒక సెకనుకు 62,010 క్యూబిక్ ఫీట్స్. ఈ ప్రవాహము నయాగరా జలపాతము ప్రవాహమునకు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. ఈ నది యొక్క దాదాపు సగం ప్రవాహము పొడవైన, ఇరుకైన, మరియు లోతైన జలపాతములుగా ఉంది. నీటి ప్రవాహమును బట్టి 150 నుండి 300 జలపాతముల వరకు 60 నుండి 82 మీ.(197 నుండి 269 అడుగులు) ఎత్తు నుండి నీరు పతనం అవుతున్నట్లు కిందకు దుమికి పడుతున్నట్లు మనకు దర్శనమిస్తాయి. ఈ నది యొక్క ఇరుకైన మరియు లోతైన ప్రవాహ భాగాన్ని “భూత కంఠము” (Devil’s Throat) అని పిలుస్తారు. (Garganta del Diablo in Spanish or Garganta do Diabo in Portuguese).) “భూత కంఠము” అని పిలవబడే కొంత మొత్తం ఈ నది యొక్క వెడల్పు 80 నుండి 90 మీటర్ల వరకు ఉంటుంది (260–300 ft.). లోతు 70 నుండి 80 మీటర్ల(230-260 ft.) వరకు ఉంటుంది. వరదలు వచ్చిన సందర్భంలో ఈ జలపాతములన్నీ ఒకే చోట కలిసిపోతాయి, ఇలా కరసిపోయిన పెద్ద జలపాతములను San Maritin, Adam and Eva, Penoni, Bergano అని కూడా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఇలా ఈ జలపాతములన్నియు ఒకే చోట కలిసిన కేంద్ర ప్రాంతము బ్రెజిల్, అర్జెంటీనా మరియు పరాగ్వే దేశములకు సరిహద్దుగా గుర్తించబడింది. కొన్ని పట్టణ ప్రాంతాలతో ఈ నదికి సంబంధం కలిగి ఉంది. బ్రెజిల్ దేశమునకు చెందిన Foz do Iguazu, అర్జెంటీనాకు చెందిన Puerto Iguazu, మరియు పరాగ్వేకు చెందిన Ciudad del Este అనే పట్టణములు ఈ ఇగ్వాజు నదితో సంబంధము కలిగి ఉన్నాయి. అక్కడ ఈ మూడు దేశముల యొక్క సరిహద్దులను కూడా ఒకే రోజులో ఒకసారి చూడదగిన విధంగా ఉంటుంది కావుననే సందర్శన నిమిత్తం ప్రసిద్ధిగాంచిన యాత్రాస్థలంగా ఇది పేరుగాంచినది.

ఇంత మనోహరమైన ప్రదేశమునకు చేరుకొనుటకు మూడు దేశాల నుండి కూడా ప్రయాణ సౌకర్యం కలదు. బ్రెజిల్ దేశమునకు చెందిన Foz do Iguazu పట్టణమునుండి, అర్జెంటీనా దేశమునకు చెందిన Puerto Iguazu పట్టణము నుండి మరియు పరాగ్వే దేశమునకు చెందిన Cidad Del Este పట్టణము నుండి కూడా ఈ ప్రాంతమునకు చేరుకోవచ్చును. ఈ మూడు దేశములు కూడా సందర్శకుల సౌకర్యార్థం వాణిజ్య విమాన సర్వీసులను కూడా నడుపుతున్నారు. ఈ జలపాతములు ఇగ్వాజు నేషనల్ పార్క్ అర్జెంటీనా, మరియు ఇగ్వాజు నేషనల్ పార్క్ బ్రెజిల్ అనే రెండు విభాగాలుగా విభజించబడింది. అవి ఈ రెండూ కూడా 1994 మరియు 1996 వ సంవత్సరములలో క్రమముగా యునెస్కో ప్రపంచ వారసత్వపు సంపదగా గుర్తింపు పొందినవి.

బ్రెజిల్ వైపు నుండి ఈ లోయ ప్రాంతంలో నడకదారి కూడా ఏర్పాటు చేయబడినది. ఈ నడకదారి దిగువ వరకు పొడిగించబడింది. బ్రెజిల్ వైపు నుండి ఆకాశమార్గంలో ఈ జలపాతం అందచందములు వీక్షించుటకు హెలికాప్టర్ సౌకర్యం కలదు. అంతేకాకుండా Foz do Iguazu ఎయిర్ పోర్ట్ నుండి టాక్సి మరియు బస్సు ద్వారా కూడా ఇగ్వాజు నేష్నల్ పార్క్ బ్రెజిల్ ప్రవేశ మార్గం వరకు చేరుకొనుటకు రవాణా సౌకర్యం కలదు. Foz do Iguazu పట్టణము నుండి నేషనల్ పార్కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ కొన్ని ప్రదేశములు సందర్శన నిమిత్తం తరచుగా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడినది. ఉల్లాసభరితమైన ఆహ్లాదకరమైన సందర్శన యాత్ర నిమిత్తము 72 మంది ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా గల double-decker బస్సులు కూడా ఉన్నాయి. మేము బ్రెజిల్ వైపు నుండి ఈ జలపాత సందర్శనకు ఏర్పాట్లు చేసుకున్నాము. మేము లైనులో బస్టాండ్‌లో నిలబడినప్పుడు ఒక అతను ఎంత ఓపికగా మీరు సందర్శన నిమిత్తం లైన్లో నిలబడి ఉన్నారని మమ్ములను అభినందించినాడు. మేము మరుసటి రోజు ఉదయం ప్రయాణమునకు టిక్కెట్లు తీసుకున్నాము ఉదయం బయలు దేరిన మేము బస్సులో వివిధ ప్రాంతాలను సందర్శించుకుంటూ సాయంత్రం 4:30 కు అర్జెంటీనా చేరుకున్నాము.

అర్జెంటీనా దేశము జలపాతపు పర్యావరణ రక్షణ దృష్టిలో ఉంచుకొని హెలికాప్టర్ సౌకర్యం నిషేధించింది. కానీ అటవీ మార్గం ద్వారా సందర్శకులను తీసుకువెళ్లడానికి తిరిగి తీసుకురావడానికి “రెయిన్ ఫారెస్ట్ ఎకోలాజికల్ ట్రైన్” సౌకర్యం ఏర్పాటు చేసినది. ఈ చిన్న రైలు మార్గము “భూత కంఠము” ప్రవేశ మార్గం వరకు ఉన్నది అర్జెంటినా వైపు San Martin ద్వీపము సందర్శనార్థం బోటు సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడినది. అంతేకాక అర్జెంటినా వైపు బోటు ద్వారా పయనించి జలపాతములను మరింత దగ్గరగా వీక్షించే అవకాశం కూడా కలదు. మేము అర్జెంటీనా చేరిన పిమ్మట అక్కడ ఒక హోటల్‌లో ఉన్నాము. అక్కడ ఒక ప్యాకేజీ తీసుకున్నాము. ఆ పాకేజీతో మేము అర్జెంటీనా, బ్రెజిల్ మరియు పరాగ్వే పర్యాటక ప్రదేశాలను ఆయాదేశముల సరిహద్దులను ఒకేరోజు సందర్శించడం జరిగినది. మేము గతంలో ఒక విహార యాత్ర చేసిన సమయంలో కూడా రెండు దేశాల సరిహద్దులను ఒకేరోజు సందర్శించినాము. జింబాబ్వే మరియు జాంబియా దేశముల సరిహద్దులను విక్టోరియా జలపాతం సందర్శన సమయంలో ఒకే రోజు ఒకేసారి ఆ రెండు దేశముల సరిహద్దులను సందర్శించినాము. ఇక్కడ మాకు పరాగ్వే దేశంలో ప్రవేశించడానికి వీసాలు లేక పోయినను ఒక బ్రిడ్జి మీదుగా ఆ వైపు వెళ్తే పరాగ్వే సరిహద్దు చేరుకోవచ్చును. ఇగ్వాజు జలపాతముల ప్రవాహము నయాగరా జలపాతము యెక్క ప్రవాహమునకు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటుంది. గతములో అక్కడ వలస రాజ్యాలలో వీటిని “శాంటా మారియా ఢై భూపుక్” అని పిలిచేవారు. ప్రస్తుతము దీనిని ఇగ్వాజు అని పిలుస్తున్నారు.

ఏది ఏమైనా జలపాతాలు బ్రెజిల్ వైపు ఎక్కువగా అందముగా ఉన్నాయి. దీన్ని స్పానిష్‌లో “కాటరాక్ట్ డెల్ ఇగ్వాగు” అని పోర్చుగీసులో “కాటరాక్ట్ ఢూ అయ్ ఇగ్వాగు” అని అంటుంటారు. పరాగ్వే సరిహద్దు చూస్తే ఎంతో అందమైన నది నదీ జలపాతములు అచటి అందమును ఎంత వర్ణించినా తక్కువే. జలపాతము చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.

మేము బస్సులో బ్రెజిల్ వెళ్లే దారిలో ఒక చోట భోజనానికి ఆగినప్పుడు అక్కడ ఒక షాప్‌లో ఆవు లేగ దూడ లేదా కోడెదూడ గిత్త లాంటి ఆకారంలో కప్పు లాగా ఒక పరికరం తయారు చేయబడి ఉంది. దాని లోపల అల్యూమినియంతో చేసిన గిన్నెను ఉంచి దానిలో కొన్ని తేయాకులు వేసి వేడినీటిని పోస్తున్నారు. ఆ గిన్నె ఎలా ఉందంటే జల్లెడలాగా సన్నని రంద్రములు ఉండి తేయాకులు క్రిందికి పడకుండా కేవలం ఆ ఆకు రసము మాత్రమే క్రిందికి దిగే విధంగా ఉంది. అంటే మనం ఉపయోగించే కాఫీ ఫిల్టర్ లాగా అనుకోవచ్చు. అలా దిగిన తేయాకు రసం ఒక పైపు ద్వారా పిలుస్తున్నారు ఈ పరికరం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఒకటి కొనుక్కుని వెంట తెచ్చుకున్నాను.

మేము రైలు బండి లోనూ మరియు ఓపెన్ టాప్ జీపులో మరియు అడవి గుండా చాలా దూరము కాలినడకన కూడా ప్రయాణించడం జరిగినది, అంతా రకరకాల వృక్షాలతో నిండి ఉంది. అక్కడ విశేషములు అన్ని కూడా మాకు వివరిస్తూ ఒక గైడ్ చాలా సహాయకారిగా ఉన్నాడు. మేము అక్కడ నుండి ఒక టాక్సీ ఏర్పాటు చేసుకుని పరాగ్వే వెళ్ళడం జరిగినది. సంతోషకరమైన విషయం ఏమంటే వీసాలు లేకపోయినప్పటికీ పరాగ్వే అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. యాత్రికులు తమ దేశం రావడం వారికి గర్వకారణముగాను ఆదాయ వనరుగాను భావిస్తున్నారు. అందువల్లనే చాలామంది యాత్రికులు వీసాలు సౌకర్యం లేనప్పటికీ కూడా ఒకరోజులో పరాగ్వే దేశము కూడా చూడటం జరుగుతుంది. మేము కూడా అదే రోజు చూడటానికి వీలైనది. మాకు అక్కడ జంగల్ క్యాంప్‌లో ఒక గుడారం ఇచ్చారు. ఆ గుడారంలో ఉన్నప్పుడు కలిగిన సంతోషం మాటలలో చెప్ప జాలానిది. పచ్చనైన దట్టమైన పచ్చిక బయళ్ళతో నిండి ఎన్నో రకాల వృక్షసంపదతో అలరారుతూ, పారే సెలయేళ్లు, జారే జలపాతాలు వాటి అందచందములు వర్ణనాతీతము. ఆ ప్రాంతము వదిలి రావాలనే అనిపించదు. గొప్ప అందమైన ప్రదేశం ఆ ప్రదేశం. ప్రపంచంలో నయాగరా జలపాతమే అందమైనదని అందరూ భావిస్తుంటారు. ఎక్కువగా అక్కడికి వెళ్తుంటారు. కానీ ఒకసారి అమెరికా నుండి వచ్చిన ఒక యాత్రికురాలు “ELEANOR ROOSEVELT” అనే ఆమె ఈ ఇగ్వాజు జలపాతముల అందచందములు చూసిన పిమ్మట “Oh my poor Nayagara” అన్నదట. దీనిని బట్టి ఇగ్వాజు జలపాతములు ఎంత అందంగా ఉన్నాయో మనం అర్థం చేసువచ్చు.

మాకు అర్జెంటీనా దేశంలో అనుకోని విధంగా ఒక సంఘటన జరిగింది. మేము అర్జెంటీనా నుండి అంటార్కిటికాకు వెళ్ళవలసి ఉంది. అందు నిమిత్తము మేము అర్జెంటీనా చేరుకున్నాము. అంటార్కిటికాకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా అర్జెంటీనా చేరుకోవాలి. అక్కడి నుండి మాత్రమే అంటార్కిటికాకు వెళ్ళగలము. అందువలన మేము అర్జెంటీనా వెళ్ళాము. కానీ ఇంకా మేము వెళ్ళేటందుకు మూడు రోజుల సమయం ఉంది ఈ మూడు రోజులు అర్జెంటీనాలో వివిధ ప్రదేశాలు చూద్దాము అనే నిర్ణయానికి వచ్చాము. మేము ఆ ప్రాంతంలో తిరుగుతూ పూలు పండ్లు మొదలైన దుకాణాలు ఉన్న ఒక ప్రాంతాన్ని చేరాము. అక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది. మా వద్ద కొన్ని జతల బట్టలు మేము వండుకున్న చిన్న టిఫిన్ డబ్బా ఉన్నాయి. సరే ఒక రోజు అలా అలా గడుపుదాము అనుకొని మేము ఒక ప్రాంతానికి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. కానీ ఆశ్చర్యకరంగా అక్కడ కూడా మనదేశంలో లాగా గ్రుడ్డివారు కుంటి వారు అవిటివారు భిక్షం అడుక్కుంటున్నారు. కానీ వారు చాలా నీటుగా ఉన్నారు. స్టైల్‌గా కూడా ఉన్నారు. మధ్యలో ఒక బట్ట పరచి పాటలు పాడుకుంటూ అడుక్కుంటున్నారు. దానం చేయాలనుకున్నవారు ఆ బట్ట మీద వేస్తున్నారు. నాకు మన దేశం గుర్తొచ్చింది. ఇక్కడ కూడా ఇలా అడుక్కోవడం జరుగుతుందని చాలా ఆశ్చర్యం వేసింది. మేము అలా ఆ రైలుబండిలో ప్రయాణం చేస్తూ ఉండగా మమ్మలను ఒక ప్రదేశము చాలా ఆకర్షించింది. అక్కడ ఒక చెరువు చెరువు చుట్టూ చక్కని పచ్చిక బయలు, చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంది. మేము ప్రయాణించడానికి అవసరమైన టికెట్ ఇంకా రెండు స్టేషన్ల అవుతల వరకు ఉన్నప్పటికీ మేము అక్కడే రైలు దిగిపోయాము. ఆ ప్రాంతము మమ్ములను అంత అమితంగా ఆకర్షించింది.

మేము అక్కడ రోజుకు వెయ్యి రూపాయలు చెల్లించే ప్రాతిపదికన ఒక ఇంట్లో పేయింగ్ గెస్ట్‌లుగా చేరాము. మూడు రోజులు అదే ఇంట్లో ఉంటూ ఆ ప్రాంతమంతా తిరిగి చూశాము. ఆ ఇంటి యజమాని ఒక రిటైర్డ్ మిలటరీ ఆఫీసరు. అతని ద్వారా అక్కడ ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలు, తెలుసుకున్నాము. అతను మా వారిని చాలా ఇష్టపడి అన్ని విషయములు కూలంకషంగా మాకు వివరించాడు. అతను మాతో మాట్లాడే సమయంలో మధ్య మధ్య ఒక చిన్న గ్లాసు పరికరమునకు బిగించి ఉన్నటువంటి హుక్కాలాంటి ఒక పైపును నోటిలో ఉంచుకొని పీలుస్తున్నారు. అది ఏమిటని మేము విచారించినప్పుడు అది “టీ” అని చెప్పారు. దానిని దక్షిణ అమెరికా ప్రజలు రోజంతా తాగుతూనే ఉంటారు. అక్కడ ఒక బ్రెడ్ కూడా ఇచ్చారు. అది కొంత లావుగా ఉంది. అక్కడ ప్రజలు ఈ బ్రెడ్ ఎక్కువగా తింటారు. మేము అక్కడ వారి అద్భుతమైన ఆతిథ్యంతో మూడు రోజులు ఉండి ఆ పరిసర ప్రాంతాల్లో అన్ని తిరిగి చూసాము. అత్యద్భుతమైన అతి సుందరమైన ఎన్నో ప్రదేశాలను ఆ పరిసర ప్రాంతాల్లో మేము చూడటం జరిగింది. అక్కడ మూడు రోజులు గడిపిన పిమ్మట వారికి వీడుకోలు పలికి తిరిగి అర్జెంటీనా చేరుకున్నాము.

ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతంగా పేరుగాంచిన “ఇగ్వాజు” జలపాతం దాని ప్రవాహపు ఉరవళ్ళు పరవళ్ళు చూసాము. మూడు దేశముల సరిహద్దులను ఒకే రోజు సందర్శించటము జరిగింది. ఒకేసారి విభిన్న సంస్కృతుల ప్రజలను వారి వేష భాషలను ఆహారపు అలవాట్లను చూసినాము, ఎన్నెన్నో అందాలు మా హృదయాలలో గూడుకట్టుకున్నాయి. ఎన్నో మరెన్నో మధురానుభూతులతో మా మనసులు ఉప్పొంగి పోయాయి. అంతటి మనోహర దృశ్యాలు మా హృదయంలో స్థిరంగా తిష్ట వేసుకున్నాయి. శ్రమతో కూడుకున్న ప్రయాణం అయినప్పటికీ ఆ శ్రమకు తగిన విధంగా ఎన్నో రెట్లు సంతోషం సంబరము మాకు దక్కింది అన్న తృప్తితో అర్జెంటినా నుండి అంటార్కిటికాకు పయనమైనాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here