రామం భజే శ్యామలం-42

0
3

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]సు[/dropcap]గ్రీవుడు తన వానరసేనను సీతాన్వేషణకు పంపించినప్పుడు.. మధ్యభారతాన్ని కేంద్రంగా చేసుకొని ఒక్కో దిక్కుకు ఒక్కో సైనిక బలగాన్ని పంపించాడు. దక్షిణ దిక్కుకు పంపించిన సైన్యానికి వాలి కుమారుడు అంగదుడు నాయకత్వం వహించాడు. దక్షిణ దిక్కుకు వెళ్లే సైన్యాన్ని వింధ్య పర్వతం నుంచి బయలుదేరి దక్షిణం వైపు వెళ్లాలని ఆదేశించాడు. ఈ టీమ్‌లో సుగ్రీవుడు అగ్ని కుమారుడైన నీలుడు, హనుమంతుడు, బ్రహ్మదేవుని కుమారుడు.. గొప్ప బలం కలవాడైన జాంబవంతుడు, సుత, శరారి, శరగుల్మ, గజ, గవాక్ష, గవయ, సుషేణ, వృషభ, మనింద, వివిధ, విజయ, గంధమాదనులు.. అగ్నిపుత్రులైన ఉల్కాముఖ, అనంగుడు వంటి వీరులున్నారు. ఈ సైన్యానికి మధ్యభారతం నుంచి దక్షిణం వైపు ఉన్న అనేకానేక ప్రదేశాల గురించి సుగ్రీవుడు సంపూర్ణంగా వివరించుకొంటూ వచ్చాడు. ముందుగా వింధ్య పర్వతము గురించి సుగ్రీవుడి వర్ణన మొదలైంది.

ఈ వింధ్య పర్వతము ఉత్తర దక్షిణ భారతాలకు వారధిగా ఉన్నది. ఇక్కడినుంచి ప్రపంచంలో దక్షిణ భూభాగాన్ని సుగ్రీవుడు వర్ణిస్తూపోయాడు. నదులు, పర్వతాలు, నగరాలు అన్నింటినీ డిస్కస్ చేశాడు. ఎక్కడికి వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లకూడదో చెప్పాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో వివరించాడు. కిష్కింధకాండలోని ఈ వర్ణన చదవండి.

‘అనేక శిఖరములు, వృక్షములు, లతలు గల వింధ్య పర్వతములు.. మహా సర్పములు నివసించు రమ్యమైన నర్మదానదిని, రమ్యమైన గోదావరి నదిని, కృష్ణవేణి, మహానదిని.. మహా సర్పములు నివసించు సుందరమైన వరదానదిని.. మేఖల దేశము, ఉత్కళ దేశము, దశార్ణ నగరములను అబ్రవంతి, అవంతి నగరములు అన్నింటినీ వెతుకుడు. విదర్భ, సృష్టిక, మాహిశక, మత్స్య, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశములను పర్వతములతోనూ, నదులతోనూ, గుహలతోనూ నిండిన దండకారణ్యమును, గోదావరి నదిని వీటన్నింటినీ అన్వేషించుడు. ధాతువులచేత అలంకరింపబడినవి, విచిత్రమైన శిఖరములు గలవి, శోభతో కూడినవి, పుష్పించి చిత్రవర్ణములుగా ఉన్న అరణ్యములు కలది అయిన మలయ పర్వతమునకు వెళ్లి అందమైన చందనవనములు గల ఆ మహా పర్వతమునందు వెతుకుడు. పిమ్మట మీకు అక్కడ నిర్మలమైన జలములతో నిండి అందముగా ఉన్న కావేరీ నది కనబడును. దానిలో అప్సర స్త్రీలు విహరించుచుందురు.’

ఇందులో నర్మద, గోదావరి, కృష్ణా, కావేరీ.. ఈ నదుల గురించి తెలియనిదెవరికి గనుక? సుగ్రీవుడు వింధ్య నుంచి కిందనున్న అంటార్కిటికా వరకు వివరించాడు. వీటిలో మహరాష్ర్ట లోని నేటి విదర్భ నుంచి కర్ణాటకలోని మహిశక, మధ్యప్రదేశ్‌లోని మత్స్య, నాటి కళింగమైన నేటి ఒడిశా, మన ఆంధ్ర, తమిళనాట చోళ, పాండ్య దేశాలు, కేరళలో మలయానిలం అన్నింటినీ వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మలయ పర్వతశ్రేణి పశ్చిమకనుమల్లో ఉన్నది. ఇందులో ఒకభాగాన్ని సహ్యాద్రిగా పిలుస్తారు. ఈ పర్వత ప్రాంతాలన్నీ కూడా గంధపు చెట్లకు, సుగంధ ద్రవ్యాల తోటలకు ప్రసిద్ధి. అందుకే వీటిని గంధర్వ పర్వతాలు అన్నారు.

ఇక నర్మదాతీరంనుంచి దక్షిణం వైపు చేసే ప్రయాణంలో ఉన్న ప్రదేశాలు.. వివరాలతోపాటు ఆగస్త్య తార గురించి సుగ్రీవుడు వర్ణించిన తీరు ఆశ్చర్యమేస్తుంది. ‘సుందరమైన మలయపర్వత శిఖరమునందు కూర్చున్న మునుశ్రేష్టులైన సూర్యుని వంటి కాంతివంతుడైన అగస్త్యుడు మీకు కనబడును. పిమ్మట ప్రసన్నుడైన ఆ మహాత్ముని అనుజ్ఞ పొంది మొసళ్లతో నిండిన తామ్రపర్ణి నదిని దాటి వెళ్లుడు. చిత్రములైన చందనవనములు ఆవరించి ఉన్న ద్వీపములు, ఉదకములు గల తామ్రపర్ణి నది యువతి అయిన స్త్రీ ప్రియుని చేరినట్లు సముద్రమును చేరుతున్నది. మీరు అక్కడికి వెళ్లి పాండ్యదేశపు కోటకు అమర్చిన బంగారు వికారమైన ముత్యములచేత, మణులచేత అలంకరింపబడిన దివ్యమైన తలుపును చూడగలరు. అటుపిమ్మట సముద్రమును సమీపించి చేయవలసిన కార్యమును నిర్ణయించుకొనుడు. అక్కడ అగస్త్యుడు సముద్రం మధ్యలో నిలిపిన సుందరమైన మహేంద్ర పర్వతము ఉన్నది. దాని చరియలు, వృక్షములు నానా వర్ణములలో ఉండును. బంగారు వికారమునైన ఆ పర్వతము మహా సముద్రములోనికి చొచ్చుకొని ఉన్నది. ఆ పర్వతము వికసించిన పుష్పములు గల అనేక విధములైన వృక్షములతోనూ, లతలతోనూ ప్రకాశించుచుండును. చాలా మనోహరము అయిన ఆ పర్వతముపై దేవతలు, ఋషులు, యక్షులు, అప్సర స్త్రీలు, సిద్ధులు, చారణులు నివసించుచుందురు. దేవేంద్రుడు ప్రతి పర్వమునందు ఆ పర్వతమునకు వచ్చుచుండును.’

ఇక్కడ దక్షిణం వైపు సీతాన్వేషణకు బయలుదేరిన వానరసైన్యం ముందుగా వింధ్య పర్వతశ్రేణులకు దిగువన నర్మదానదికి కిందుగా ప్రయాణం ప్రారంభించింది. ముందుగా చెప్పినట్టు భారతదేశం పశ్చిమ కనుమల్లో మలయ పర్వత శ్రేణులు కర్ణాటక లోని అరేబియా సముద్రతీరం వెంబడి గుజరాత్ తీరప్రాంతం చివరలో ప్రారంభమై.. మంగళూరు నుంచి కేరళ మీదుగా తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతంలో ముగుస్తున్నాయి. ఈ పర్వతశ్రేణుల్లో పర్యాటకం ఇవాళ్టికీ ఎంతో అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. వందల అడుగుల పొడవాటి చెట్లు, సుగంధ తోటలు, గంధపుచెట్లు, తీగలు, పూలతో ఇరవైనాలుగు గంటలపాటు సన్నసన్నగ కురిసే వర్షపు తుంపరలతో అపూర్వ అనుభవం కలుగుతుంది. మన కాలంలో వీరప్పన్ సంచరించిన సత్యమంగళం అడవులు ఈ పశ్చిమకనుమల్లోనే.. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ పశ్చిమకనుమల్లోనే అంబసముద్రం తాలూకాలోని పోతిగాయ్ హిల్స్‌పైన అగస్త్య శిఖరం దగ్గర తామ్రపర్ణి నది పుడుతున్నది. ఇది తిరునల్వేలి మీదుగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. తిరునల్వేలి జిల్లా దాని పక్కనే ఉన్న కన్యాకుమారి భారతదేశానికి ఇప్పుడున్న ఎండ్ పాయింట్. ఇక్కడే మహేంద్ర పర్వతం ఉన్నది. ఈ పర్వతం ఒకవైపు సముద్రం లోపలికి కలిసిపోతుంది. వెస్టర్న్ ఘాట్స్ నుంచి మహేంద్ర పర్వతం పైకి ఎక్కి కిందకు దిగితే సముద్రం కనిపిస్తుంది. (ఇప్పుడంటే వేరే వేరే మార్గాలున్నాయి లెండి) సుగ్రీవుడు చెప్పిన ప్రకారం ఈ పర్వతం ఎక్కి దిగితే సముద్రం కనిపిస్తుంది. ఈ శిఖరంపైకి ఎక్కి సముద్రం వైపు చూస్తే అగస్త్య తార కనిపిస్తుంది. దక్షిణాసియాకు చెందిన సిరియస్ అన్న నక్షత్రం పక్కనే క్యానపస్ నక్షత్రం ఉంటుంది. ఇది దక్షిణ భారతం నుంచి మాత్రమే కనిపిస్తుంది. ఇది పోల్‌స్టార్. ఈ క్యానపస్‌ను మనవాళ్లు అగస్త్య తార అని అంటారు. తూర్పువైపు తిరునల్వేలి, పశ్చిమంవైపు కొల్లాం.. దాని కింద తిరువనంతపురం ఉంటాయి. తిరునల్వేలి, కొల్లాంకు దక్షిణాన సముద్రంవైపు చూస్తేనే ఈ అగస్త్య తార కనిపిస్తుంది. దానిపైన ఉత్తరభారతం నుంచి ఎక్కడినుంచి చూసినా ఇది కనిపించదు. తిరువనంతపురం, కన్యాకుమారి నుంచి కూడా ఇది కనిపిస్తుంది. ఇది అప్పటి పోల్‌స్టార్. రెండో అతి ప్రకాశవంతమైన నక్షత్రమిది. సూర్యుడిలాగా ప్రకాశవంతంగా అగస్త్యుడు ఉన్నాడని చెప్పడం వెనుక ఈ అబ్బురపరిచే ప్రకాశమే కారణం. అందుకేనేమో.. అగస్త్యుడు దక్షిణ భారతానికి వెళ్లి అక్కడే సెటిలైపోయారని పురాణాల్లో చెప్తారు. ఇక్కడినుంచి సముద్రంపైన ఎగురుకుంటూ ఎలా వెళ్లాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వానరసైన్యానికి సుగ్రీవుడు సూచించాడు. ఈ మహేంద్ర గిరిపైనుంచే హనుమంతుడు సముద్రంమీదకు లంఘించాడు.

మహేంద్ర పర్వతం నుంచి సముద్రంపై ప్రయాణించాల్సిన దూరంలో మొదటి ద్వీపం రావణుడి రాజ్యమే. దీని గురించే సుగ్రీవుడు వానరసేనకు చెప్పాడు. ‘దాని అవతలి ఒడ్డున నూరు యోజనాల వైశాల్యముగల ద్వీపము ఉన్నది. ప్రకాశించుచున్న ఆ ద్వీపమునకు మానవులు వెళ్లజాలరు. ఆ ద్వీపమునందు మీరు వెతుకుడు. మీరు విశేషించి ఆ ద్వీపమునందు అన్ని విధముల అన్వేషించవలెను. రాక్షసరాజు, దేవేంద్రునితో సమానమైన కాంతికలవాడు, దురాత్ముడు.. చంపదగిన వాడు అయిన రావణుడు ఆ దేశమునందు నివసించుచుండును.’

మహేంద్రగిరి పర్వతంనుంచి సముద్రంమీద ఎగిరితే ముందుగా వచ్చే ద్వీపం లంక. దీన్ని రావణుడు ఏలుతున్నాడు. ఇక్కడ అన్ని వైపులా సీతను వెతకాలి అని సుగ్రీవుడు వానరులను ఆదేశించాడు. ఈ ద్వీపం చుట్టుకొలత అంటే తీరప్రాంతం నూరు యోజనాల విస్తీర్ణం ఉన్నదని కూడా సుగ్రీవుడు చెప్పాడు. అంటే 800 మైళ్లు.. 1200 కిలోమీటర్లు. శ్రీలంక ప్రస్తుత తీర ప్రాంతం 1340 కిలోమీటర్లు ఉన్నది. 830 మైళ్లు ఉన్నది. దాదాపుగా నూరు యోజనాలకు లెక్క సరిపోయింది. భారతదేశానికి శ్రీలంక మధ్యన సముద్రం లోతు మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే అంత ఎక్కువగా ఉండదు. చాలా తక్కువగా ఉంటుంది. శ్రీలంకకంటే కొంత ఎత్తులో భారతదేశం ఉంటుంది. ఎందుకంటే రామాయణకాలం నాటికి భూమిపై సముద్రమట్టం ఇప్పుడున్నదానికంటే.. దాదాపుగా 120 మీటర్ల నుంచి 140 మీటర్ల కిందకు ఉన్నది. భారత్‌‌ లంక మధ్యన సముద్రమట్టం సుమారు ఆరు నుంచి 13 మీటర్ల లోతే ఉన్నది. అందువల్లే సేతు నిర్మాణం రాముడికి తేలికగా పూర్తి అయి ఉండవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది మరొకటి ఉన్నది. రాముడు సేతువును తమిళనాడులోని రామేశ్వరం దగ్గరున్న ధనుష్కోడి వద్ద కట్టినట్టుగా చెప్పడంలో వాస్తవం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే రామచంద్రుడు.. సుగ్రీవుడు చెప్పిన మార్గంలో వానరసేన దక్షిణంవైపు ఏ మార్గంలోనైతే ప్రయాణించిందో అదే మార్గంలో సముద్రతీరానికి చేరుకున్నాడు.

యుద్ధకాండ నాలుగో సర్గలోని ఈ సన్నివేశం చదవండి. ‘పచ్చని శరీరములు గల ఆ వానరశ్రేష్ఠులతో నిండిన భూమి. పండిన వరిచేలతో నిండిన భూమివలెనుండెను. మహాబాహువైన రాముడు మహేంద్ర పర్వతమును చేరి వృక్షములచేత అలంకరించబడిన శిఖరమును ఎక్కి తాబేళ్లతోనూ, చేపలతోనూ వ్యాప్తమైన జలముతో వ్యాకులముగా ఉన్న సముద్రమును చూచెను. వారు సహ్య పర్వతమును, మలయ పర్వతమును దాటి క్రమముగా, భయంకరమైన ధ్వని గల సముద్రమును సమీపించిరి.’ ఈ మహేంద్ర పర్వతం దగ్గర ఉన్న సముద్రతీరం నుంచే రామచంద్రుడు తన సైన్యంచేత లంకకు సేతువు నిర్మించాడు. సేతు నిర్మాణం గురించి మరింత వివరంగా మరో వ్యాసంలో చర్చించుకొందాం.

లంక దాటిన తర్వాత సముద్ర మధ్యంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో సుగ్రీవుడు వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. తిరునల్వేలి తర్వాత వానరసేన మిగతా ప్రయాణమంతా సముద్రం మీదుగానే ఉన్నట్టు తెలుస్తుంది. వీటిలో అన్నింటి గురించి చెప్పలేకపోవచ్చేమో కానీ.. కొన్నింటి గురించి వివరించే ప్రయత్నం కొంతవరకు చేస్తా. సుగ్రీవుడు చెప్పిన వివరాలను ఒకసారి చూద్దాం. ‘ఆ దక్షిణ సముద్ర మధ్యమునందు, అంగారక అను ఒక రాక్షస స్త్రీ నివసించుచుండును. ఆమె నీడను బట్టి లాగి ప్రాణాలను భక్షించుచుండును. ఆయా దేశములను గూర్చి సంశయములను ఈ విధముగా తొలగించుకొని మీరు అమితమైన తేజస్సు గల రాముని భార్య కొరకు వెతకండి. ఆ ద్వీపమును దాటిన పిమ్మట నూరు యోజనముల సముద్రములో సిద్ధులకు, చారణులకు నివాసమైన పుష్పితకమను అందమైన పర్వతమున్నది. సముద్ర జలములోనున్న చంద్ర కిరణములతోనూ, సూర్య కిరణములతోనూ సమానమైన ఆ పర్వతము విశాలమైన శిఖరములతో ఆకాశమును ఒరయుచున్నట్లుండును. ఆ పర్వతముమీద ఒక శిఖరము బంగారు వికారమైనది. దాన్ని సూర్యుడు సేవించుచుండును. ఒక శిఖరము వెండిది. తెల్లగా ఉన్న ఆ శిఖరముపై చంద్రుడు నివసించుచుండును. కృతఘ్నులు కాని, క్రూరులు కానీ, నాస్తికులు కానీ ఆ పర్వతమును చూడజాలరు. ఓ వానరులారా! శిరస్సు వంచి ఆ పుష్పితక పర్వతమునకు నమస్కరించి దానిపై అన్వేషించుడు. ఎదిరింపశక్యము కాని ఆ పర్వతమును దాటి ముందుకు వెళ్లిన.. సూర్యవంతమను పర్వతము ఉన్నది.’ అని వివరించాడు.

లంక నుంచి దక్షిణ ధృవం దాదాపు పదకొండు వేల కిలోమీటర్ల దూరం ఉంటుందని అంచనా. ఈ మధ్య దూరంలో అనేక ద్వీపాలు, పర్వతాలు ఉంటాయి. ఇందులో దక్షిణ సముద్రంలో లంకాద్వీపమును దాటిన తరువాత నూరు యోజనముల సముద్రములో పుష్పితకమనే పర్వతమున్నది. ఇది ఇవాళ్టి మారిషస్‌లోని పీటర్ బోత్ పర్వతం. దీని శిఖరం ఆకాశాన్ని తాకుతున్నట్టే కనిపిస్తుంది. ఈ పర్వతానికి ఉన్న ఒక శిఖరంపైన సూర్య కిరణాలు సోకినప్పుడు బంగారు వర్ణంలో, మరో శిఖరం చంద్ర కిరణాలు సోకినప్పుడు వెండి వర్ణంలో కనిపిస్తుంది. ఈ పర్వత ప్రాంతం ఎప్పుడూ ఆకుపచ్చగా పంటపొలాలతో సుభిక్షంగా ఉంటుంది.

ఆ తరువాత సుగ్రీవుడు మరికొన్ని పర్వతాల గురించి ప్రస్తావించాడు. ‘ఆ సూర్యవత్పర్వతమును దాటిన తర్వాత సర్వ కామములను ఫలించు అన్ని కాలములందు మనోహరములైన వృక్షములతో కూడిన వైద్యుతమనే పర్వతము ఉన్నది. ఆ వైద్యుత పర్వతముపై లభించు శ్రేష్టములైన మూలములు, ఫలములు, ఉత్తమములైన మధువులను తాగి ముందుకు వెళ్లుడు. అక్కడ నేత్రములను మనస్సుకు ఆకర్షించు కుంజరమను పర్వతమున్నది. దానిమీదనే విశ్వకర్మ అగస్త్యుని గృహమును నిర్మించెను. దివ్యమైన ఆ అగస్త్యుని బంగారు గృహము అనేక విధములైన రత్నములచేత అలంకరింపబడినదై యోజనము వైశాల్యముతో పది యోజనముల ఎత్తు ఉన్నది. అక్కడ సర్పములకు నివాసమైన భోగవతి అను నగరము ఉన్నది. విశాలమైన వీధులతో నలువైపుల రక్షింపబడుతున్న దానిని ఎవ్వరూ ఎదిరింపజాలరు. తీక్షణమైన కోరలు, గొప్ప విషముగల భయంకరములైన సర్పములు దానిని రక్షించుచుండును. ఆ నగరంలో సర్పరాజు, చాలా భయంకరుడు అయిన వాసుకి నివసించుచుండును. ఆ భోగవతి నగరంలో అన్వేషించి దాని బయటకు వచ్చి, ఆ నగరమును ఆవరించి ఉన్న సమీప ప్రదేశములన్నింటినీ వెతకవలెను. ఆ దేశమును దాటిన పిమ్మట సకల రత్నములతో నిండి శోభితములైన వృషభమను మహా పర్వతము ఉన్నది. అది వృషభాకారంలో ఉండును. ఆ పర్వతము మీద గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము అను చందనము.. అగ్నితో సమానమైన కాంతి కల చందనము పుట్టును. ఆ చందనమును చూచి దానిని ఎన్నడునూ స్పృశించరాదు. భయంకరమైన ఆ వనమును రోహితులు అను గంధర్వులు రక్షించుచుందురు. ఆ వృషభ పర్వతము మీద సూర్యునితో సమానమైన కాంతికల శైలూషుడు, గ్రామణి, శిక్షుడు, శుకుడు, బభ్రువు అను ఐదుగురు గంధర్వ రాజులు నివసించుచుందురు. అది సూర్య చంద్రాగ్నులతో సమానమైన దేహములు గల పుణ్యాత్ములకు నివాసస్థానము.’

దక్షిణ అమెరికా తీర ప్రాంతానికి దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరంలో ట్రిస్టాన్ ద కన్హా అన్న ద్వీపం ఉన్నది. ఇది పూర్తిగా రిమోట్ ఐలాండ్. ఇక్కడ పెద్ద అగ్ని పర్వతం ఉన్నది. దీన్నే సూర్యవత్పర్వతమని భారతీయులు భావిస్తున్నారు. ఆఫ్రికాకు దక్షిణమెరికా తీర ప్రాంతానికి మధ్యన దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రంలో దాదాపు 968 మీటర్ల లోతులో వేల ఏండ్లనాడు మునిగిపోయిన పర్వతము ఉన్నది. ఇది దాదాపు 23 కిలోమీటర్ల పొడవు ఉన్నదని నాసా శాస్త్రవేత్తల అంచనా. దీనిపైన అనేకానేక ఔషధ మొక్కలు ఉన్నట్టుగా కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిమీద ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. రామాయణంలో చెప్పిన వైద్యుత పర్వతం బహుశా ఇదే కావచ్చేమో. ఇప్పటికైతే స్పష్టతలేదు. ఇక వృషభ పర్వతానికి సంబంధించిన వివరాలు ఇప్పటికైతే లభించలేదు. బ్రెజిల్ లోని సా పోలో నగరానికి 90 మైళ్ల దూరంలో ఇల్హా క్వాయ్‌మదా గ్రాండె అనే ద్వీపం ఉన్నది. ఇది పూర్తిగా పాములతో నిండి ఉంటుంది. ఇది అత్యంత భయంకరమైన విషపూరితమైన అనేక పాముల జాతులకు నిలయం. దీన్ని నాగలోకమని పిలుస్తారు. ఇదే భోగవతి నగరం.

ఈ విధంగా సుగ్రీవుడు భూమికి దక్షిణాన చివరి భాగం వరకు ఏమేమి ఉంటాయో చెపుకుంటూ వచ్చాడు. ‘దాని తర్వాత భూమి చివరి భాగమునందు స్వర్గమును సంపాదించిన పుణ్యాత్ములుందురు. దాని తర్వాత వచ్చు భయంకరమైన పితృలోకమునకు మీరు వెళ్లకూడదు. ఆ యముని రాజధాని భయంకరమైన చీకటిచేత ఆవరించబడి ఉండును. మీరు అంతవరకే వెతుకుటకు కానీ శక్యమగును. ప్రాణులెవరూ అది దాటి వెళ్లజాలరు. ఈ అన్ని ప్రదేశములను, ఇంకను అక్కడ కనపడిన ఇతర ప్రదేశములను వెదకి సీతజాడను తెలుసుకొని తిరిగి రండు.’ అని చెప్పాడు.

దక్షిణాన చిట్టచివరన ఉన్నది అంటార్కిటికా.. ఇక్కడ శీతోష్ణస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. దాదాపు ఆరునెలలు పగలుగానూ.. మరో ఆరు నెలలు చీకటిగానూ ఉంటుంది. భయంకరమైన జంతుజాతులు ఇక్కడ ఉంటాయి.. ఇక్కడికి వెళ్లి ఆ వాతావరణాన్ని, శీతోష్ణస్థితిని తట్టుకొని తిరిగిరావటం చాలా కష్టం. అంటార్కిటికా మధ్యభాగంలో ఉష్ణోగ్రత మైనస్ 89.6 డిగ్రీలు ఉంటుందంటేనే పరిస్థితిని ఊహించుకోవచ్చు. అందుకే అక్కడికి వెళ్లవద్దని అది యమస్థానమని సుగ్రీవుడు చెప్పాడు. క్రీస్తుశకం 1820 వరకు అంటార్కిటికా గురించి తెలియదని ఇవాళ అధికారికంగా చరిత్రకారులు చెప్తుంటారు. కానీ 1500 నాటికే దీని ఆనుపానులు బయటపడ్డాయి. పిరి రీస్ అనే జియాలజిస్టు.. అరబిక్ మ్యాప్ ఆఫ్ హింద్‌తోపాటు, అప్పటికి కొత్తగా వేసిన పోర్చుగీస్ మ్యాప్, సింధ్, హింద్, చిన్ మ్యాపులు, కొలంబస్ వేసిన మ్యాపు (ఇతను 1500 లోనే ఉన్నాడు) లను క్రోడీకరించి పూర్తిగా కచ్చితమైన, విశ్వసనీయమైన ఏడు సముద్రాలకు సంబంధించిన ఒక మ్యాప్‌ను తయారుచేశాడు.

ఈ మ్యాప్‌ను చూస్తే అంటార్కిటికా కనిపిస్తుంది. ఇది హింద్, సింధ్ మ్యాపుల్లో అప్పటికే స్పష్టంగా ఉన్నది. కాబట్టి.. అంటార్కిటికా అన్నది 1800 లోనే కనుగొన్నారన్నది కానేకాదు. దీని ప్రకారం ప్రపంచంలోని ఏడు సముద్రాలు (హిందూ, అరేబియా, బంగాళా, పసిఫిక్, అట్లాంటిక్, అర్కిటిక్, అంటార్కిటిక్).. అంటార్కిటిక్ మీది ప్రాంతంలో.. చుట్టుపక్కల కలిసిపోతాయి. ఈ సప్తసముద్రాలు కూడా ఒకదానిలో ఒకటి కలుసుకొంటూ వచ్చి చివరగా అంటార్కిటిక్ దగ్గర ఏకమవుతాయి. మనకు సప్త సముద్రాల భావన ఎప్పటినుంచో ఉన్నదే. జానపద గాధల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, శాసనాల్లో (వేయిస్తంభాల గుడి శాసనం) సప్తసముద్రాలు.. దాని ఆవల ఉన్న భూభాగం గురించిన చర్చ జరిగిందే. జానపదాల్లో రాజకుమారుడు సప్తసముద్రాలు దాటి చిలుకలో ప్రాణాన్ని పట్టుకురావడం చదువుకున్నదే. ఈ ప్రాంతం చాలా చాలా భయంకరమైన వాతావరణంలో ఉంటుంది. భూమి ఉపరితలంపైన మంచు కొండలు.. భూమిలోపల ఫైర్ లేయర్లు ఉంటాయి. అందుకే దీన్ని యమలోకం అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here