[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం నవలా మహారాణి ఝాన్సీ కొప్పిశెట్టి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]
రచనా వ్యాసంగంలో ఒక సునామీలా నడివయసులో పైకెగసి, పత్రికల చుట్టూ తిరగకుండానే, రెండు అద్భుతమైన నవలలు, ఫేస్‌బుక్‌లో సీరియల్‌గా రచించి, వందల సంఖ్యలో పాఠకులకు పరిచయమై, ఎందరో రచయితల సమీక్షకుల మన్ననలు పొంది, గొప్ప పేరు తెచ్చుకున్న, ప్రతిభావంతురాలైన, చురుకైన రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గారు.
తెలుగు – ఆంగ్లభాషల్లో మంచి పట్టువున్న ఈ రచయిత్రి ‘గొంతువిప్పిన గువ్వ’ ధారావాహిక ద్వారా ‘సంచిక’ పాఠకులకు చిరపరిచితులే! ఝాన్సీ గారు, నవలలే కాదు, కవిత్వం, అర్థవంతమైన కథలు కూడా రాస్తున్నారు. పాఠకుల, విశ్లేషకుల ప్రశంశలు పొందుతున్నారు. కథలు త్వరలో పుస్తక రూపం దాల్చనున్నాయి.
హైదరాబాదు వాస్తవ్యురాలైన ఈ రచయిత్రి, ఆస్ట్రేలియా, అమెరికాలలో ఉన్న పిల్లలతో గడుపుతూ, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిగారిని చూసుకోవడానికి అప్పడప్పుడూ, తాను పుట్టి పెరిగిన భారతదేశం వస్తుంటారు. నిత్యం గృహ సంబంధమైన పనుల ఒత్తిడితో బిజీగా వున్నా, తనకు ఇష్టమయిన రచనా వ్యాసంగాన్ని కొనసాగించటం ఈ రచయిత్రి ప్రత్యేకత.
ప్రతిదానికి ‘సమయం ఉండడం లేదు’ అని చెప్పి తప్పించుకునే కొందరికి ఝాన్సీగారి జీవన శైలి, ఒక అనుచరణీయమైన ఉదాహరణ. తన రచనా వ్యాసంగం గురించి, ఝాన్సీ కొప్పిశెట్టి గారి అభిప్రాయాలు, ఆవిడ మాటల్లోనే చదువుదాం.
***
ప్రశ్న: నమస్కారం, ఝాన్సీ గారు.
జవాబు: నమస్కారం, డా.ప్రసాద్ గారూ.
ప్రశ్న: మీ కలంనుండి జాలువారే కవితలు, కథలు, నవలలు తెలుగు పాఠకులకు సుపరిచితాలే. ఈ మూడు ప్రక్రియల్లోనూ నవలా ప్రక్రియ ద్వారా మీరు అశేష పాఠక లోకాన్నీ ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు నవల పట్ల మీకు మక్కువ ఎట్లా ఏర్పడింది?
జవాబు: దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న సంఘటనను కథగా మలచవచ్చును. కాని నవల ఒక జీవితాన్ని ఆవిష్కరించగల అతి పెద్ద కాన్వాసు. కథలు రాయటం సుళువు. విస్తారమైన విషయం వుంటే తప్ప నవల రాయలేము. నవల చాలా కష్టసాధ్యమైన సాహిత్య ప్రక్రియ. నా అదృష్టం కొద్దీ నేను అతి దగ్గరగా చూసిన జీవితాలు నాకు నవలలు రాసే స్ఫూర్తిని, మక్కువను కూర్చాయి. ఆ స్ఫూర్తితోనే తక్కువ వ్యవధిలో రెండు నవలలు రాయగలిగాను.
ప్రశ్న: యుక్తవయసులో మీరు నవలలు బాగానే చదివి ఉంటారు. మీకు ఇష్టమైన నవలా రచయిత ఎవరు? ఎందుచేత?
జవాబు: అవును, నా హై స్కూల్ రోజుల్లోనే నేను విపరీతంగా నవలలు చదివేదానిని. వీరు, వారు అనే తారతమ్యాలు లేకుండా ప్రతీ నవల చదివేదానిని. యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, అరికెపూడి కౌసల్యా దేవి, తెన్నేటి లత, కొమ్మనాపల్లి గణపతిరావు, యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, చలం… ఇలా ఎవరి రచనలూ వదలలేదు. అయితే యద్దనపూడి సులోచనారాణిగారి నవలలను ఎక్కువగా ఇష్టపడి చదివేదానిని. ఇప్పుడు నా నవలలు చదివిన పాఠకులు నా శైలి యద్దనపూడి గారిని తలపిస్తుందని అన్నారు. నాకు తెలియకుండానే వారి ప్రభావం నా రచనల పైన వుందనుకుంటా.
ప్రశ్న: మీరు అందరిలా పత్రికలకు ప్రయత్నించకుండా సరాసరి ఫేస్‌బుక్‌లో సీరియల్ రాసి ప్రభంజనం సృష్టించారు. మీ ఈ సాహసం వెనుక నేపథ్యం వివరించండి.
జవాబు: ఇది సాహసమని నేననుకోను. బహూశా నాలో ఓర్పు, సహనం పాళ్ళు తక్కువేమో. నా రచనను పత్రికలకు పంపించి, ఎప్పుడెప్పుడు వేస్తారా, అసలు వేస్తారా లేదా అంటూ ఎదురుచూడటం కన్నా ఫేస్‌బుక్‌లో పెట్టటం వలన పాఠకుల సత్వర అభిప్రాయాలు, అభినందనలతో నాకు వెనువెంటనే సంతృప్తికర ఫలం దక్కుతుంది. అందుకే ఈ మాధ్యమాన్ని ఎన్నుకోవటం జరిగింది.
ప్రశ్న: మీరు రెండు నవలలు రాసి – రాశి కంటే వాసి గొప్పదని నిరూపించారు.ఇది మీకు ఎలా సాధ్యం అయింది?
జవాబు: నేను సాహిత్య ప్రస్థానం ప్రారంభించి దశాబ్దాలు దాటితే మీరు ఈ మాట అనాలి. నేను 2018లో రాయటం మొదలుపెట్టి మూడేళ్ళలో రెండు నవలలు, ఒక ఆత్మకథ, పదిహేను కథలు, యాభైకి పైగా కవితలు రాసాను. రాశికేమీ తక్కువ లేదు. కాకపోతే నవలలు రెండూ అచ్చవటం వలన వాసికెక్కాయి. ఇప్పుడు నా ఆత్మకథ, కథాసంపుటి ప్రచురణకు ముస్తాబవుతున్నాయి. ‘గొంతు విప్పిన గువ్వ’ పేరుతో ఇదే సంచికలో ధారావాహికంగా వెలువడి అశేష అభిమానుల ఆదరణను పొందిన నా ఆత్మకథను అదే పేరుతో త్వరలో పుస్తకంగా తెస్తున్నాను.
ప్రశ్న: మీరు ఉండేది ఆస్ట్రేలియాలో.. పుస్తక ప్రచురణ, పుస్తకావిష్కరణ హైదరాబాదులో. ఇది మీరు అంత సులభంగా ఎలా నిర్వహించగలిగారు?
జవాబు: మంచి ప్రశ్న. ఈ విధంగా మరోసారి నా హితులకు, స్నేహితులకు ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం కల్పించారు. నేను చేసుకున్న పుణ్యం, సహృదయ ఆత్మీయులు నాకు స్నేహితులుగా లభించటం. నా రెండు నవలలు పాలపిట్ట ప్రచురణలే. పాలపిట్ట ఎడిటర్ శ్రీ గుడిపాటి గారు నా నవలల ప్రచురణ విషయంలో ప్రత్యేక శ్రద్ధాసక్తులను చూపి నేను ఇండియాలో లేనప్పటికీ అనుకున్న సమయంలో అన్న ప్రకారంగా అద్భుతంగా నవలలను సిద్ధం చేసారు. వారికి సాహిత్యం పట్ల వున్న అభిమానాన్ని, నా రచనల పట్ల వున్న గౌరవాన్ని నేను ఎన్నటికీ మరువలేను. అలాగే కవిసంగమం రథసారధి కవి యాకూబ్ గారు నా తొలి నవల ఆవిష్కరణ సభను స్వయంగా పూనుకుని ఏర్పాట్లు చేసి విజయవంతంగా నిర్వహించారు. వారికి నేను ఆజన్మాంతమూ ఋణపడి వుంటాను. రెండో నవల ఆవిష్కరణ కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో జరిగింది. నా జీవితంలో అడుగడుగునా స్నేహితుల సహకారం, అభిమానుల ఆదరణ నాకు మానవతా విలువలను, మానవ సంబంధాల్లోని గొప్పతనాన్ని వెల్లడి చేస్తుంటాయి.
ప్రశ్న: ఎప్పుడో వదిలేసిన రచనా వ్యాసంగాన్ని మళ్ళీ ఇంతకాలానికి మొదలు పెట్టి అంత త్వరగా ఎలా పుంజుకోగలిగారు? దీని వెనుక రహస్యం ఏమిటి?
జవాబు: బహూశా స్వతహాగా సాహిత్యాభిలాష, రచనా నైపుణ్యం నా నరనరాల్లో జీర్ణించుకుపోయి నిద్రావస్థలో ఉండటంతో మేల్కోవటమే ఆలస్యంగా పరుగు అందుకుని వుంటుంది. నిజానికి నేను పదుగురి సాహిత్యం అధ్యయనం చేసింది లేదు.. చదివింది లేదు. ఇంకా చెప్పాలంటే తెలుగు భాషలో ఏమయినా చదివి కూడా అప్పటికి చాలా కాలమయింది. అయినప్పటికీ వెనువెంటనే పుంజుకోగలిగానంటే నాలో వున్న సాహిత్య జిజ్ఞాస, ఆ సరస్వతీదేవి కృప అనే చెప్పాలి.
ప్రశ్న: మీ మొదటి నవల ‘అనాచ్ఛాదిత కథ’ ఒక తల్లి ప్రధాన పాత్రగానూ, రెండో నవల ‘విరోధాభాస’ ఒక కూతురి జీవిత నేపథ్యంగానూ తీసుకుని రాసారు. ఒక స్త్రీగా మీరు ఈ అంశాలను ఎంచుకున్నారా? లేక ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా?
జవాబు: మొదటి నవల ‘అనాచ్ఛాదిత కథ’ మా అమ్మగారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని రచించినదే. భగవంతుని అద్భుత సృష్టి అయిన స్త్రీ, జీవితంలో అనేక పాత్రలను సునాయాసంగా పోషిస్తుంది. నేను దాదాపు రెండు నవలలలోనూ, మరి కొన్ని కథల్లోనూ తల్లిగా, ఆలిగా, తనయగా స్త్రీ గొప్పతనాన్ని చూపించే ప్రయత్నమే చేసాను. ఒక స్త్రీగానే నా రచనల ద్వారా స్త్రీ శక్తియుక్తులను వివరించే ప్రయత్నం చేస్తున్నాను.
ప్రశ్న: మీ నవలల్లో గానీ, కథల్లో గానీ, మీ రచనా విధానం, సంభాషణలు, పాఠకుడిని కట్టి పడేసేలా వుంటాయని చాలా మంది అంటుంటారు. దీని పైన మీ స్పందన ఏమిటి?
జవాబు: మాతృభాషపై పట్టు, మమకారం, ఎం.ఏ. తెలుగు అధ్యాపకుల భిక్ష, భగవంతుని కృప…
ప్రశ్న: మీ కథల్లో కవిత్వం పాళ్ళు ఎక్కువగా ఉంటుందని చాలామంది అభిప్రాయ పడుతుంటారు. వివరించండి.
జవాబు: కవిత్వం అంత గొప్పగా రాయలేని నా వచనం లయబద్దంగా వుండటం నా అదృష్టం. నా స్నేహితులు ఒకరు తరుచూ అంటుంటారు.. “నీ కవిత్వం కన్నా కథనంలో కవిత్వం బావుంటుంది. కథల పైనే ఎక్కువగా శ్రద్ధ వహించు..” అని. అందుచేతనే ఈ మధ్య కథలకే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నాను.
ప్రశ్న: విదేశాల్లో వుంటూ కూడా మాతృ భాష పైన గొప్ప మమకారం పెంచుకుని సాహిత్య సేవ చేస్తున్నారు. మరి మాతృభాష పరంగా ఆస్ట్రేలియాలో మీరు చేస్తున్న కృషి ఎలాంటిది?
జవాబు: నిజానికి ఆస్ట్రేలియాలో తెలుగు పత్రికల వివరాలు నాకు ఇంకా పూర్తిగా తెలియవు. ఈ మధ్యనే పరిచయమైన అచ్చులో వచ్చే ‘తెలుగు పలుకు’ మాస పత్రికలో గత ఆరు నెలలుగా దాదాపుగా ప్రతీ నెలా నా కవితలు అచ్చవుతున్నాయి. ఈ నెలలో నా కవితతో పాటు ‘ప్రయాణం’ శీర్షికతో నా తాస్మేనియా యాత్రా విశేషాలు కూడా వచ్చాయి.
ప్రశ్న: మీ సాహిత్య కృషికి సంబంధించి మీ పిల్లల స్పందన ఎలా ఉంటుంది?
జవాబు: పిల్లలు సాధించిన ఘన విజయాలకు తల్లిదండ్రులు గర్వించినట్టే, తల్లిదండ్రుల అచీవ్మెంట్స్‌కి పిల్లలు ఆనందిస్తారు. దురదృష్టం కొద్దీ మా అమ్మాయిలు తెలుగు సరిగ్గా చదవలేక పోయినా నా ప్రతి రచన గురించి స్నేహితులతో గర్వంగా చెప్పుకుంటుంటారు. నా తొలి నవలావిష్కరణలో మా చిన్నమ్మాయి, అల్లుడు ఎంతో గర్వంగా పాలుపంచుకున్నారు. వారిద్దరు దగ్గరుండి సభ ఏర్పాట్లను, అతిథి సత్కారాలను చూసుకుని నాకు మరువలేని మధుర స్మృతులను మిగిల్చారు. మా పెద్దమ్మాయి నేను ఏదయినా రాసుకునే వేళ ఎంత అత్యవసర పరిస్థితుల్లోనూ నన్ను డిస్టర్బ్ చేయక ఎంతో సహకరిస్తుంది. ఆఖరికి మనుమరాళ్లు కూడా నేను లాప్‍టాప్ తెరిస్తే నిశబ్దమైపోతారు.
ప్రశ్న: మీకు లభించిన అవార్డులు, సన్మానాల గురించి వివరించండి.
జవాబు: ప్రతిలిపిలో కొన్ని కథలకు, కవితలకు బహుమతులు, తొలి నవల అనాచ్ఛాదిత కథకు అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక సాహితీ పురస్కారం లభించాయి. నేను నా రచనలను పత్రికలకు పంపకుండా ఫేస్‌బుక్‌లో పెట్టటమూ, భౌతికంగా నేను ఇండియాలో లేకపోవటం వలన కొన్ని పురస్కారాలు, సన్మానాలు కోల్పోయానని నమ్మకంగా చెప్పగలను.
~
ఇన్ని విశేషాలు అందించిన మీకు సంచిక పత్రిక పక్షాన ధన్య వాదాలండి, ఝాన్సీ గారూ
సంచికకూ, మీకూ ధన్యవాదాలండీ, డాక్టర్ ప్రసాద్ గారూ.