[dropcap]కాం[/dropcap]తమ్మ బాగా ధనవంతురాలు. ఆమెకు జాలి, కరుణ తక్కువ! నా అనే వాళ్ళు ఎవరూ ఆమెకు లేరు.
ఆమె దగ్గర ఇద్దరు పనివాళ్ళు ఆమె నస భరించలేక వెళ్ళి పోయారు. తనకు వంట పని, ఇంటిపని చేసే పనివాళ్ళు కావాలని కొందరికి చెప్పింది. కాంతమ్మ నోటి దురుసు తెలిసినవారు ఎవరినీ ఆమెకు పనిమనుషులుగా పంపలేదు.
కానీ, ఈ విషయం ఒక పేద రైతుకు తెలిసింది. తన కూతురు స్వాతిని కాంతమ్మ వద్దకు తీసుక వచ్చి”అమ్మా, నా బిడ్డ స్వాతి మంచి పనిమంతురాలు, నా వద్ద డబ్బు లేకపోవడం వలన ఎక్కువ చదివించలేక పోయాను, రెండో తరగతి వరకు మాత్రమే చదివింది. అయినా దానికి రామాయణ, భారత కథలు, బోలెడు వేమన పద్యాలు తెలుసు. నా పొలానికి డబ్బు అవసరం అందుకే మీ దగ్గర పనికి పెడుతున్నాను. దయచేసి దానికి నెలకు మూడువేలు ఇవ్వండి, అది మిమ్మల్ని తల్లిని చూసుకున్నట్లు చూసుకుంటుంది” అని చెప్పాడు రైతు.
ఇద్దరు పనివాళ్ళను పెట్టుకుంటే చెరొక రెండు వేలు ఇచ్చినా నాలుగు వేలు అవుతుంది. ఈ పిల్లకు మూడువేలు ఇచ్చినా ఒక వెయ్యి ఆదా అవుతుంది, ఇంట్లోనే ఉంటుంది కనుక అన్ని పనులు చెప్పి చేయించుకోవచ్చు” అనీ బాగా ఆలోచించి స్వాతిని పనిలో పెట్టుకుంది.
ఆ విధంగా స్వాతి వంటపని, ఇంటి పని, తోట పని బద్దకం లేకుండా వేకువ జామునే లేచి చేయసాగింది. స్వాతి పనితనం మెచ్చుకుని మరిన్ని పనులు పురమాయించసాగింది కాంతమ్మ.
ఒకరోజు కాంతమ్మ స్వాతిని టీ కాచి అల్మైరాలో ఉన్న మంచి నగిషీల పింగాణీ జగ్గులో పోసుకొని పెరడులోకి తీసుక రమ్మనమని చెప్పింది. స్వాతి చక్కని టీ పెట్టి అల్మైరాలో ఎత్తులో ఉన్న పింగాణీ జగ్గు తీయడంలో చేయి జారి కింద పడి ముక్కలు అయిపోయింది! ఈ హఠాత్పరిణామానికి స్వాతి భయపడిపోయింది.
జగ్గు పగిలిన శబ్దం విని కాంతమ్మ పరుగెత్తుకొచ్చి పగిలిన జగ్గు చూసి స్వాతిని నానా తిట్లు తిట్టి, ఈ విధంగా చెప్పింది. “అది ఇరవై ఏళ్ళ క్రితం ఒక పింగాణీ పాత్రలు చేసే కళాకారుడి వద్ద చేయించాను. నాకు ఎంతో ఇష్టమయిన జగ్గు అది. అటువంటి దానిని పగుల కొట్టావు. నీవు ఆ పగిలిన పింగాణీ ముక్కలను తీసుకుని మూడు మైళ్ళ దూరంలో ఉన్న పింగాణీపురానికి వెళ్ళి ఆ కళాకారుడికి చూపించి అటువంటిదే చేయించి తీసుకరా, దానికి డబ్బులు ఇస్తాను. కానీ నీ జీతంలో ఆ డబ్బు నేను తీసుకుంటాను అర్థం అయిందా?” అని కర్కశంగా చెప్పింది.
పాపం స్వాతి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఏనాడు తన తల్లి గానీ తండ్రి గానీ తిట్టలేదు. కానీ, ఈ రోజు జరిగిన పొరపాటుకు ఈమె చేత తిట్లు తినడం ఎంతో బాధ అనిపించింది.
అయినా కాంతమ్మ ఇచ్చిన డబ్బు, పగిలిన జగ్గు ముక్కలు తీసుకుని పింగాణీపురానికి బయలుదేరింది స్వాతి. అలా కొంత దూరం వెళ్ళే సరికి ఒక చిట్టడివి వచ్చింది, స్వాతి భయంతో అలానే వెళ్ళసాగింది. మరికొంత దూరం వెళ్ళే సరికి అక్కడ చిన్న కుటీరం కనబడింది. దాని ముందు ఒక పెద్దాయన తెల్లటి గడ్డంతో ముఖ వర్చస్సుతో కూర్చుని ఉన్నాడు. అడవిలో స్వాతి వంటరిగా వెళ్ళటం చూసి అయన ఆశ్చర్య పోయాడు.
“తల్లీ, నీవు ఎక్కడికి వంటరిగా వెళుతున్నావు?ఈ దారిలో నీకు ఏం పని?” అని అడిగాడు.
పగిలిన పింగాణీ పెంకులు చూపించి జరిగిన విషయం అంతా చెప్పింది,అటువంటి జగ్గు తెచ్చేందుకు పింగాణీ పురం పోతున్నట్టు చెప్పింది.
ఆ పెద్దాయనకు కొన్ని శక్తులు ఉన్నాయి.ఆ శక్తులతో ఎవరికైనా కష్టాలు ఉంటే వారికి మేలు చేసే పనులు చేస్తుంటాడు!
“అమ్మా,నీవు భయపడకు నాదగ్గర అటువంటి పింగాణీ జగ్గు ఉంది,అది తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు.ఇక నీవు అంతదూరం పింగాణీ పురానికి వెళ్ళనవసరం లేదు”అని స్వాతిని దీవించి కుటీరంలోకి వెళ్ళి అచ్చం స్వాతి చేతిలో పగిలి పోయిన జగ్గు లాటి జగ్గునే తెచ్చి ఇచ్చాడు. స్వాతి డబ్బు ఇవ్వబోయింది.ఆ పెద్దాయన చిరునవ్వుతో ఆడబ్బు తిరస్కరించి,ఆ డబ్బును తిరిగి కాంతమ్మకు ఇవ్వమని చెప్పాడు.
స్వాతి కృతజ్ఞతతో ఆయన కాళ్ళకు నమస్కరించి, పింగాణీ పాత్ర, డబ్బు తీసుక వెళ్ళి కాంతమ్మకు ఇచ్చి దారిలో తను కలసిన పెద్దాయనను గురిచి ఆయన మంచి తనాన్ని గురించి చెప్పింది.తన డబ్బు ఖర్చు కాకుండా ,పింగాణీ జగ్గును తెచ్చినందుకు కాంతమ్మ ఆశ్చర్య పోయింది!
మరలా జాగ్రత్తగా టీ పెట్టమని చెప్పింది.
స్వాతి మరలా చక్కటి టీ పెట్టి ఆ జగ్గులో పోసి పెరడులో ఉన్న కాంతమ్మకు ఇచ్చింది. కాంతమ్మ ఆ టీ తాగితే అది ఇదివరకు తాను తాగిన టీ లాగ లేదు, మహారుచిగా ఉంది! ఆ రుచికి కాంతమ్మ ఆశ్చర్యపోయింది. ఓ గంట తరువాత వెళ్ళి కాంతమ్మ టీ జగ్గు మూత తీసి చూసింది, దాని నిండా వేడి టీ నిండుగా ఉంది! కాంతమ్మ ఆశ్చర్యపోయి, స్వాతిని పిలచి, “అప్పుడే టీ చేశావా?” అని అడిగింది.
“లేదమ్మా,మీకు టీ ఇచ్చాను, అయిపోయింది, మరలా చేయలేదు” చెప్పింది స్వాతి.
జగ్గులో ఉన్న టీ చూసి స్వాతి కూడా ఆశ్చర్యపోయింది.
“ఏమిటీ మహత్యం?” అనుకుంటూ కాంతమ్మ మరలా టీ త్రాగింది. జగ్గులోకి చూస్తే మరలా టీ నిండుగా ఉంది!
అలా టీ మరగించకుండానే ఆ జగ్గులో టీ ఊరుతూనే ఉంది!
ఎవరో మహిమాన్వితుడు ఈ అద్భుత జగ్గు ఇచ్చాడు. దీనిలో తరగని టీ వస్తున్నది. అన్నం వండే పాత్ర పాడు చేసి స్వాతికి ఇచ్చి ఆ పెద్దాయన వద్దకు వెళ్ళి మంచి అన్నం పాత్ర తెప్పిస్తే ఇక అన్నానికి కొదవ ఉండదు కదా! అనే దుష్ట ఆలోచన చేసింది కాంతమ్మ.
రెండో రోజు అన్నం వండే పాత్రను పెద్ద రాయితో పగులగొట్టి స్వాతికి ఇచ్చి అటువంటి పాత్రనే ఆ పెద్దాయనను అడిగి తెమ్మంది. కాంతమ్మ చేసిన పనికి స్వాతి చాలా బాధపడింది. మోసంతో అలా సులభంగా అన్నం సంపాదించడం పాపం అని స్వాతి ఆలోచించింది. అయినా, తన యజమాని చెప్పింది కనుక ఆ గిన్నెను తీసుకుని ఆ పెద్దాయన వద్దకు వెళ్ళింది. అమాయకమైన స్వాతి జరిగిన అసలు సంగతి చెప్పింది. ఆయన ఆ పగిలిన గిన్నెను చూస్తూనే కాంతమ్మ అత్యాశని, మోసాన్ని గ్రహించాడు. అయినా పెద్దాయన తన కుటీరంలోకి వెళ్ళి అటువంటి గిన్నె తెచ్చి ఇచ్చాడు.
ఆయన కాళ్ళకు నమస్కరించి, గిన్నెను తీసుకుని ఇంటికి వెళ్ళి, ఆ గిన్నెలో అన్నం వండింది, మంచి సాంబారు కూడా వండింది. కాంతమ్మ ఇక ఆగలేక అన్నం వడ్డించుకుని సాంబారు అన్నం కలుపుకుని, స్వాతిని కూడా భోంచేయమని చెప్పింది. స్వాతి కూడా వడ్డించుకుంది. కాంతమ్మ ఆవురావురుమని సాంబారు అన్నం నోట్లో పెట్టుకుంది. అంతే కాంతమ్మ కెవ్వుమని కేక వేసింది! ఆ అన్నం అమిత చేదుగా ఉంది! ఆ చేదు భరించలేక కాంతమ్మ అన్నం పారవేసింది. కానీ స్వాతి మటుకు అన్నం రుచిగా ఉందంటూ హాయిగా తినింది. కాంతమ్మ ఆశ్చర్య పోయి పక్కింటి మంగమ్మను పిలచి సాంబారు అన్నం పెట్టింది.
“అబ్బా మహా రుచిగా ఉందమ్మా, స్వాతి లాటి వంటపిల్ల దొరకటం నీ అదృష్టం”చెప్పింది మంగమ్మ.
ఆ రాత్రికి వండిన అన్నంకూడా కాంతమ్మ తినలేక పోయింది. ఈ సారి పింగాణీ జగ్గులోని టీ కూడా చేదుగా ఉంది. తనకు మాత్రమే ఈ విధంగా జరుగుతోంది అంటే, తన మోసాన్ని ఆ మహిమాన్వితుడు గ్రహించినట్లు కాంతమ్మ తెలుసుకుంది.
వెంటనే స్వాతిని వెంట పెట్టుకుని అడవిలోని ఆ పెద్దాయనను కలసి ఆయన కాళ్ళ మీద పడి తన అత్యాశను గురించి చెప్పి తనను క్షమించమని వేడుకుంది.
చిరునవ్వుతో పెద్దాయన ఈ విధంగా చెప్పాడు, “చూడు తల్లీ, మనకు డబ్బున్నంత మాత్రాన ఫని మనుషుల్ని, తోటి వారిని చులకనగా చూడకూడదు, వాళ్ళూ మనుషులే. అందరినీ గౌరవంగా చూడాలి, చేసిన పనులకు తగిన డబ్బు ఇవ్వాలి. వారిని మాటలతో బాధ పెట్టకూడదు, పని మనుషుల్ని మన ఇంట్లో వారిలాగే చూసుకోవాలి. అది తెలుసుకో, ఇక మీదట స్వాతినే కాదు, మీ వీధి లోని వారిని కూడా గౌరవంగా చూసి మంచి పేరు తెచ్చుకో. నీవు మారుతున్నావు కాబట్టి ఇక మీదట నీకు అన్నం రుచిగానే ఉంటుంది” అని తన చెంబులోని నీళ్ళను కాంతమ్మ మీద చల్లి, ఆశీర్వదించి పంపాడు. ఆ రోజు నుండి స్వాతిని తన సొంత కూతురిలా చూసుకోసాగింది కాంతమ్మ, అదిగాక తన వీధిలో ఉన్న ఉపాధ్యాయుడి వద్దకు చదువుకోమని పంపసాగింది.
ఆ విధంగా స్వాతి ఉన్నత చదువు చదివి ప్రయోజకురాలయింది. వీధిలో అందరూ కాంతమ్మను మెచ్చుకోసాగారు.