[dropcap]ప్రా[/dropcap]సాదము అంటే కోవెల. ప్రసాదము అంటే భగవంతునికి సమర్పింపబడిన నివేదన. అన్నవరంలో శ్రీసత్యనారాయణస్వామివారి కోవెల (ప్రాసాదము) దర్శించినా, ప్రసాదము స్వీకరించినా కలిగే అలౌకికానుభూతి వర్ణించ లేనిది. మోక్షప్రాంచద్ఘన సౌధవీధికల సంచారము గావిస్తుంది. భక్తుడు సత్వప్రజ్ఞాధనుడవుతాడు.
ఫలములు, పుష్పములు, ఆకు లేక అలములు పాలు పయోబిందువులు, తులసీవల్లవములు… ఇవి పూజాద్రవ్యములుగ స్వామివారి అర్చనాభాగ్యమునకు నోచుకుంటున్నాయి. శ్రీవారిపాదస్పర్శను జన్మ సార్థకముగా మనకూ వాటితోబాటు అభేదముగ అర్చనాద్రవ్యానుభూతి పాదములు తాకిన రత్నగిరి కొండ నివాసనిర్మాల్య దైవానుగ్రహము లభించి పులకింపచేసే దివ్యప్రదేశము సత్యదేవుని కోవెల. అనంతలక్ష్మీసత్యవతీదేవి, శివలింగముల మధ్య స్వామివారి విగ్రహం ఉంది. సృష్టిస్థితిలయ త్రిమూర్తి సత్యస్వరూపముగ పానవట్టము బిందుస్థానముగ క్రిందిభాగాన ఏకశిలా స్తంభము త్రిపీఠాల బీజాక్షర సంపుటియంత్ర ప్రతిష్ఠ పూజలందుతోంది.
లోకంలో ప్రజలందరూ మోక్షమనే గమ్యమును వెదుకుతున్న బాటసారులు. మోక్షగామిగా స్వామి ప్రాసాదము చేరుకొనగలిగి అర్పింపగలిగితే బాటసారిగా ధన్యుడు. సత్యదేవుడు కామక్రోధములను చిత్తమునుండి దూరము చేస్తాడు. మన చిత్తములో స్వామి నిలిచిపోతున్నాడు. జీవితం నూరేళ్ళు. లెక్కవేసుకుంటే బాల్య, యవ్వన, కౌమార దశలు తెలియకుండానే డబ్బు యావ, సంసారక్షాంక్షలలో నిరర్థకమైపోయాయి. మోహలతికాబద్దాత్మకు మోక్షకాంక్ష గుర్తుకు రానీయదు. మనము కూడ స్వామివారికి అంకితసేవా బద్దులమవాలి. అందుచేత అర్చనాసామాగ్రి నర్పించగలిగే, వ్రతాది అర్చనలలో మనః సమర్పణ చేయాలి. ప్రసాద సమర్పణచేసి నిర్మాల్యమును శిరస్సున ధరించినా జన్మ ధన్యమైనట్లే అని నా భావన.
భూమి ఒక సత్రము. మానవులు జన్మ, పునర్జన్మలుగ పయనిస్తున్న బాటసారులు. విషయాధీన పుట్టుకలో చావు పుట్టుకలు ఎన్నిపొందామో తెలియదు. జన్మపరంపరలు గుర్తుకు రావు గనుకనే ఈ ప్రాపంచిక సౌఖ్యము హేయమనిపించడము లేదు. ఈ బాటసారిజన్మలకు ఆపన్నహస్తము సత్యదేవుడు.
పులుగుర్త వేంకటరామారావు అను శతకకవి ఈ విషయాన్ని చక్కగా చెప్పారు.
లోకుల్ నోటికి వచ్చినట్లనెదరాలున్ బిడ్డలెల్లప్డు జీ
కాకుంబొందెదరాత్మబాంధవవరులు కౌటిల్యమేపార వే
ళాకోళంబులు సేతురిన్నిటి మదిన్ లక్ష్యంబుగావింపకే
వీకన్ నిన్ను భజించు భక్తుడు దయాబ్దీ! సత్యనారాయణా!
కొండంతపత్రి సమర్పణ పూజకంటె భక్తితో కొండనెక్కవలెను. బ్రహ్మ యిచ్చిన అయుర్ధాయము నూరేళ్ళు మించనీయదు. అందులో ఏబదిలో….అర్ధాశాతి కామేచ్ఛలకు, తరుణావస్థ, మిగిలినది శిశుత్వము, కుమారత్వము హరించును. ముసలితనము బాధాలవాలము. నిను నా తల్లిగ, దండ్రిగ, గురునిగ, నిక్కంపు దైవముగా భావించానని పాలముంచినా నీటముంచినా నీదే భారమని భావించడమే సత్యదేవుని సన్నిధి. దర్శనము పుణ్యఫలము మరియు వ్రతాచరణము అభీష్టసిద్ధి నిస్తాయి. అంకితభావముగలవారికి కథలు వినదగ్గవి. మహిని కేవలము భగవంతుడొక్కడే మనకు స్నేహితుడని నమ్మమని ఆ కథల ఆ పరమార్థము పరిహాసముగ భావించే తప్పు చేయవద్దు.
సర్వజనాళికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని ప్రసాదించగల శక్తి శ్రీ సత్యదేవునిది. అందుచేతనే నివాసగృహములలో మనము బంధుమిత్రాదులను పిలుచుకుని స్వామివారి వ్రతము చేసి ధన్యులమవుతున్నాము. కాని ఆయన సన్నిధిని వ్రతము చేసినా లేదా దర్శించుకుని వచ్చినా భవరోగార్తిహరుడు అన్నవరం సత్యదేవుడు.
సత్యదేవుని ప్రాసాదము వీక్షించి తరించాలి. స్వామివారి ప్రాసాదములో స్వామికర్పణ చేసిన ప్రసాద మహిమ కూడ గొప్పది. ప్రసాదము అంటే భుజించదగినది. ప్ర అన్నది విశేషణము విశిష్టము అని అర్ధము. అందుచేతనే స్వామివారి తీర్ధప్రసాదము, లేదా, నిత్యాన్నదానప్రసాదము చాలాగొప్పవి. “సత్యనారాయణా! నీ ప్రాసాదము, నీ ప్రసాదమహిమ చాలాగొప్పవి. కట్టుబుట్టములు లేని కట్టెలవాడు వైభవమంది యిక్కట్టులు బాయుట నీ ప్రసాద మహిమ కథగా భావించేవారికి మాత్రము అర్థము కాదు.”
నీప్రాసాదము నీప్రసాదమెపుడేనిం గన్న, తిన్నన్ జనుం
డీప్రాపంచిక సౌఖ్యమంతయు గడున్ హేయంబుగా దోప మో
క్షప్రాంచద్ఘనసౌధవీధికలసంచారంబుగావించు స
త్వప్రజ్ఞాధనుడై నిరంతరమనంతాసత్యనారాయణా!