[dropcap]గె[/dropcap]లవలేమని గమనించుకొని
సాగిస్తోన్న పోరాటానికి స్వస్తి చెప్పి
చీకటితో సంధి చేసుకున్న కళ్ళు
రాత్రంతా కలల కౌగిళ్ళలో సేదదీరాయి
శుభోదయం పలికిన వెలుతురువైపు
ఓ చిరునవ్వును విసిరేసి
చూపుల గాలంతో
బుల్లి బుల్లి చేపల్లాంటి దృశ్యాలనూ…
దృక్కుల వలతో
సన్నివేశాల మత్స్యరాజాలనూ…
పట్టి మస్తిష్కం పేటికలో వేయసాగాయి
కాలాంతకురాలు ఆ మేధస్సు
అడిగినదే తడవుగా
ఇపుడు వేసినవీ విసిరినవే కాదు
ఎక్కడో ఎప్పుడో వేసిన దాచిన
చిత్రపటాలనూ … దృశ్యమాలికలనూ
మనసు మహల్లలోని వెండితెరపై
ఇసుమంతా తేడాలేకుండా
ఇన్నీ అన్నీ సార్లనికాదు
ఎన్నెన్ని సార్లయినా
ఏమాత్రం గజిబిజిగాకుండా
విసుగూ విరామం లేకుండా
నిరంతరంగా ప్రదర్శిస్తూనే ఉంటుంది
గతంలోనివే అయినా
ఇపుడు గమనిస్తున్నవే అయినా
ప్రదర్శింపబడుతోన్న
చిత్రాల దృశ్యాల ప్రమేయంతో
మనసు ఏ మీటలు నొక్కుతుందో
ఏ సంకేతాల శరాలు సంధిస్తుందో
శరీరం స్పందనల నెలవవుతుంది
అనుభూతుల కొలువవుతుంది
నవ్వుతుందీ … ఏడుస్తుందీ
అరుస్తుందీ … కరుస్తుందీ
పోరాటానికి సయ్యంటుంది
ఆరాటంగా ఆర్ద్రమవుతుంది
మత్తెక్కి మెత్తగా తూలుతుంది
కైపెక్కి కౌగిళ్ళ తీరానికి పరుగుతీస్తుంది
అప్పుడప్పుడు
చడీచప్పుడు లేని శాంతమందిరాన
ధ్యాన నిమగ్నమౌతుంది
మొత్తంగా
నవరసాల నావపై
రసస్థానాలు మార్చుకుంటూ
నిరంతర ప్రయాణంచేస్తూ ఉంటుంది
ఆహా…
వెలుతురుతో జోడీకట్టిన కళ్ళు
ఎన్ని కళలు చూపిస్తున్నాయో…?
మేధనూ మనసునూ ఓ ఆటాడిస్తూ
ఎన్నెన్ని కథలు నడిపిస్తున్నాయో…?
గమనించారా!!
ఎంత మాయదారివో ఈ కళ్ళు..!!