[dropcap]ను[/dropcap]వ్వు తీసిన పాపిడి విరబూసిన వరిమడి
ముంగురుల మునిసీకటిలో సేసినాది దోపిడి
నీ నుదుటి బొట్టు తొలిపొద్దే పొడిసినట్టు
కనుబొమ్మల నడుమ సూరీడే మెరిసినట్టు
సొగసాటి కాటుకా కనురెప్పల మాటుగా
విడిసేటి బాణాలే ననుదాకే సూటిగా
నీ లేడి కన్నులు చెప్పెన్నెన్నో చిన్నెలు
నను సూసీ సూడని నీ తీరు తెన్నులు
మెరిసేటి ముక్కుపుడక మురుసినాది కనుక
నీడల్లే నా మనసు తిరిగినాది నీ యెనక
నీ నవ్వుల పెదవులు సిందినాయి మధువులు
తియ తియ్యని నా కవితలే అందుకున్న రుజువులు
నీ బుగ్గన సొట్టలే నవ్వి తేనె బుట్టలే
నా నెత్తిన పెట్టగా నామతికేమీ తట్టలే
నీ చెవులకాడి దుద్దులు నేర్వమన్న బుద్ధులు
నా పెదవిచాటు ముద్దులు ఓర్వలేని హద్దులు
సన్న సన్నాని నీ మెడే సేసినాది గడబిడే
నే కట్టే పసుపు తాడు తలుసుకొని సందడే
నిండుగ కప్పిన నీ పైట పాడిందిలే ఓ పాట
గుండెల సప్పుడులో నను దాచిందనే మాట
జడల జడల నీ జుట్టు సూపించే కనికట్టు
పగలు కూడ చిమ్మ చీకటే ననిపించినట్టు
నీ తలన పెట్టిన పూవులు సార్ధకతకి తావులు
ఓ పూటకి పుట్టినా బతుకు అర్ధమైన జీవులు
నాజూకు నీ నడుము వొయ్యారాల మడుగు
ఊగేటి నీ బిందెలో తూగేటి నీటినడుగు
నిన్ను చుట్టించే చీరా ఆట పట్టించే మనసారా
కన్నుకుట్టించే భాగ్యంతో పుట్టిందే నేనురా
నీ కాలి పారాణి తెలిపిందే నా రాణి
నువ్వు నడిచే నేలంతా పండే మాగాణి
ఎన్నెన్నో భావాలు చిట్టి గుండె లోతుల్లో
ఎన్నని రాయాలి ఒట్టి చేతి రాతల్లో
ఉబికొచ్చే ప్రేమని దాచలేను కనుకా
నినుమెచ్చే గానమై పలికాను సిలకా
ఇన్నేసి ఇసయాలు యెరిగిన నా మనసు
నీ ముందు మూగదేనని నీకేటి తెలుసు
నా మూగ మనసు.. నీకేటి తెలుసు.. ?