[box type=’note’ fontsize=’16’] ‘నా బాల్యం కతలు’ అంటూ తన చిన్ననాటి ముచ్చట్లను అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ. [/box]
10. జోతిసామి ఆశీర్‌వాదం
[dropcap]మా[/dropcap] పెద్దీదికి ఎగవన జోతిసామి ఈది అని, ఒక ఈది ఉండాది (ఒకప్పుడు దాని పేరు బలిజ ఈది). ఆడ తెలుగోళ్లు ఎక్కువ. ఊహూ… ఆ ఈది ఈదంతా తెలుగోళ్లే. వోళ్లకు జోతిసామి అంటే మహా బత్తి, నమ్మకం. ఆ సామిని దేముడులాగా కొలుసుకునేటోళ్లు. ఆ సామిని నేను గూడా ఒగటి రెండుసార్లు మా తాతతో కలిసి దర్శినం జేసుకోనుండాను.
ఆ ఈదికి సివర్న, రైల్ గేటుకు దెగ్గర్లోనే జోతిసామి ఆశ్రమం ఉండాది. ఆ ఆశ్రమంలోనే సామి ఉండేవోడు.
సామి తెల్లటి పొడుగాటి గెడ్డంతో, సిరునవ్వుతో, ప్రెసాంతమైన ముఖంతో బత్తులకు దర్శనం ఇచ్చేటోడు. మెత్తని గొంతుతో బత్తులతో మాట్లాడేటోడు. సామి ఒంటి మీద ఒక్క గోచీ తప్ప ఇంకేమీ ఉండేది కాదు.
శుబ దినాల్లో, పండగ దినాల్లో ఆశ్రమంలో సామికి పూజలూ, అభిసేకాలు జరిగేటివి.
ఆ సమయాల్లో మా తాతోళ్లు ఆడికి పొయ్ మేళం వాయించేటోళ్లు.
మా తాత నాసరం, మా శంకరమామ డోలు, మా తాత దగ్గర నాసరం నేర్సుకునే దయానందం తాళం… ఇంగొకడు శ్రుతి….. ఇట్టా నలుగురు మేళగాళ్లు పొయ్ మేళం వాయించి వొచ్చేటోళ్లు. మేళం వాయించినందుకు వోళ్లకు మంచి దచ్చిణ ఇచ్చేటోడు సామి. దచ్చిణతోపాటు ఆకూవొక్కా, అంటిపండ్లూ, ప్రెసాదమూ ఇచ్చి మర్యాద జేసి పంపించేటోడు.
ఒగరోజు సాయంత్రం మా సావాసగాళ్లతో కలిసి రెడ్డిగుంట కాడ నేను బిళ్లాంగోడు ఆట ఆడతా ఉండాను. ఆట మాంచి రసపట్టులో ఉండాది. ఆటలో నేను బాగా లీనమైపోయి ఉండా.
అప్పుడొచ్చె మా పెద్దక్క. “రేయ్ బాలా… తాత పిలస్తా ఉండాడు, రా!…” అని పిలిచింది.
నేను ఇనిపించుకోలేదు. మళ్లా పిలిచింది. “దేనికంటా…?” అంటిని ఆట మద్దెలో పిలస్తా ఉండాడన్న కోపంతో.
“ఏమో తెలీదు రారా అంటా ఉంటే…” అనింది కోపంగా. “దేనికో కనుక్కోక్కా…” అంటిని సూపుల్ని ఆటమీదే పెట్టి.
“నువ్వు ముందు రా వాయ్ ఇంటికి…” అనే కొందికి ఆటను మద్దెలోనే వొదిలేసి ఇంటికి పోక తప్పింది కాదు.
పరుగెత్తుకొచ్చి “దేనికి తాతా పిలస్తా ఉండావు?” అని మా తాతను అడిగితిని.
ఆ పాటికే మా తాత మూతి, కాళ్లూ సేతులూ కడుక్కోని, గుడ్డలు మార్చుకోని తయారుగా ఉండాడు.
“రేయ్, పెళ్లోకి బొయ్యి కాళ్లూ సేతులూ కడుక్కోని రాబో…” అన్నాడు.
బయట ఏడికో పోబోతామనుకుని…”యాడికి తాతా…” అంటిని.
“జోతిసామి గుడికాడికి…” (ఆ ఆశ్రమాన్నే గుడి అనేటోళ్లం). “ఎందుకూ?…” అని అడిగితిని మళ్లా.
“వీడు సెప్పింది సెయ్యకనే, అన్నీ ప్రెశ్నిస్తా ఉంటాడు. పోరా, పొయ్ గబాల్న రెడీ అయ్ రాబో.” అన్నాడు ఇసుగ్గా.
ఇంగ అడిగితే తాతకు కోపం వొస్తాదనుకుని, పెళ్లోకి బొయ్యి గబగబా మూతీ, కాళ్లూ సేతులూ కడుక్కుని తయారైపోతిని.
మా తాత నాసరాన్ని భుజానికి తగిలించుకుంటా… “మనవడా, ఆ డోలును ఎత్తుకోరా…” అన్నాడు.
“నేనా?…” అన్నాను అనుమానంగా. “ఔను, నువ్వే ఎత్తుకో?…” అన్నాడు స్థిరంగా.
“మేళానికేనా తాతా?…” అడిగితిని. “ఆ, ఔను!” బదులిచ్చినాడు మా తాత.
“డోలు ఎవురు వాయించబోతున్నారు తాతా?”అని మళ్లా అడిగినా. “నువ్వే రా మనవడా?” అన్నాడు తాత నవ్వతా.
“పో తాతా… నాకు డోలు వాయించటం రాదు. నేను రాను పో…” అన్నాను దాన్ని ఎత్తుకోకనే.
“ఇప్పుడే జోతిసామి నుండి పిలుపొచ్చె. ఏదో శుభదినంలాగా ఉండాది. సూస్తే మనోళ్లు ఎవరూ కనిపించలే. అందరూ మేళాలకు పొయ్యినట్టుండారు. పోకపోతే సామి బాధపడతాడు. పొయ్ మనిద్దరమే అట్ట వాయించి ఇటొచ్చేద్దాం పద.” అన్నాడు. “నాకు డోలు వాయించటం రాదు కదా తాతా…” అంటిని మళ్లా.
“నీకు రాదని నాకు తెలియదా రా. అయినా తప్పదు. నీకు నేను లగువు జెప్పిస్తా కదా, ముందు ఈన్నిండి పద.” అంటా మా తాత డోలును బలింతంగా నా ఈపుమీదికి ఎక్కించినాడు.
మా పెద్దమ్మను మాకు ఎదురు రమ్మని సెప్పి, మేము గుడికాడికి బయలుదేరితిమి. “మనవడా, ఇందులో కష్టమేమీ లేదురా! ఎడమసేతిలో కట్టె పట్టుకో, కుడి సేతి ఏళ్లకి రింగులేసుకో. కట్టితో డుం డుం డుం అని మూడుమార్లు కొట్టి, టక టక టక టక టక టక అని బొటనేలితోపాటు నాలుగేళ్లూ మార్చి మార్చి ఆరుసార్లు వాయించు. మళ్లా కట్టితో మూడుమార్లు… ఏళ్లతో ఆరుసార్లు… ఇంతేరా! ఆరతి ఇచ్చేప్పుడు లేదా ఎవురైనా గెట్టిమేళం… గెట్టి మేళం అని అరిసినప్పుడు నేను స్పీడుగా నాసరం వాయిస్తా. నువ్వు రెండు సేతుల్తోటీ ఒకేసారి గెట్టిగా డోలును వాయించాల, అంతే! నువ్వు డోలు వాయించేసినట్టే.” అన్నాడు మా తాత ఎంతో సులబంగా.
ఏం జరగబోతిందో ఏమోనని నాకు మణుసులో బయ్యిం పట్టుకునింది.
గుడికాడికి పొయ్యేకొందికి మా కోసరం ఆడ అందరూ ఆత్రంగా ఎదురుసూస్తా ఉండారు.
నేలమీంద గోడకానుకుని కూసుని తాత నాసరం బయిటికి తీసి దానికి ఆకు బిగించి పీ…పీ… అనగానే అక్కడుండేవోళ్లకు పోయిన పాణం తిరిగొచ్చె. నేను డోలుకుండే గుడ్డతీసి, కుడి సేతి ఏళ్లకు రింగులు ఏసుకుని ఎడమసేత్తో కట్టిని పట్టుకుంటిని.
మా తాత నాసరం వాయించటం మొదలుపెట్టె. లగువు సెప్పిచ్చినాడు కదా మా తాత, నేను దాన్ని అందుకుంటిని… డుం డుం డుం… టక టక టక టక టక టక…. అంతే! అదే వాటం!!
డోలునుంచి ఏదో శబ్దం వొస్తా ఉండేకొందికి నాకూ మాంచి ఉసారొచ్చేసింది.
మా తాత మాత్తరం ఏదో కీర్తనలు వాయిస్తా ఉండాడు. నేను మాత్రం అదే… ఆ లగువే. నన్ను అనుసరించి తాళం గీళం లేకనే తాత వాయిస్తా ఉండాడు. అది ఎంత కష్టమో నాకూ తెలస్తా ఉండాది. కానీ మా తాత పెద్ద విద్వాంసుడు కాబట్టి దాన్ని సమాళిస్తా ఉండాడు.
ఎవురో గెట్టిమేళం… గెట్టిమేళం… అన్నట్టుగా కుడి సెయ్యిని పైకెత్తి సూపుడు వేలిని ఆడించినారు. అంతే! రొండు సేతుల్తోటి డమ డమ డమ డమ అంటా గెట్టిగా డోలును వాయించేస్తిని.
పవుర్నమి పూజ అయిపోయింది. అనాక ఆరతి ఇచ్చిరి. అందరికీ ప్రెసాదం పెట్టిరి. మాకూ ఇచ్చిరి. సక్కిరి పొంగిలి చానా బాగుండాది. మా తాత కొంచెం తిని మిగతాది నాకే ఇచ్చేసే. దాన్ని నేను లాగించేస్తిని.
ఎవురో సామి పిలస్తా ఉండారని సెప్పిరి. దచిణ ఇచ్చేందుకే అనుకుని తాత ఎలబారె. నేనూ తాత ఎనకనే పోతిని.
సామి కుడికాలిని ఎనక్కి మడిసి ప్రశాంతంగా కూసోనుండాడు. తాత సామి దగ్గరికి పోయి నమస్కారం పెట్టె.
తాంబూలంలో దుడ్డు పెట్టి ఇస్తూ… “ఏం ఎంకటసామీ… సంతోసమే కదా…” అన్నాడు. “సంతోసం సామీ…” అన్నాడు బదులుగా మా తాత. “వీడెవడూ, నీ మనవడా?” అన్నాడు సామి నాకల్లా జూస్తా.
“అవును సామీ… ఒగడే మనవడు.” అంటా నన్ను సామి కాళ్లకు నమస్కారం పెట్టమన్నాడు మా తాత.
సామి పాదాలకు నేను నమస్కరిస్తితిని. సేతులు రొండూ జోడించి అట్నే నిలబడిని.
నా వినయ విదేయతలు సూసి, సెయ్యి సాచి నన్ను దగ్గరికి రమ్మని పిలిసినాడు సామి. దెగ్గిరికి పోతే నన్ను తన ముందర కూసోబెట్టుకున్నాడు. “ఏం సదవతా ఉండావ్?” అని అడిగినాడు సామి.
“ఏడో తరగతి.” అంటా బదులిస్తిని.
“యాడ….” అని మళ్లీ సామి అడిగె. “సిత్తూరులో…” అని సిన్నగా బదులిస్తిని.
“ఇంగ్లీషు సదవను వొచ్చా?…” అని అడిగినాడు నన్ను ఎగాదిగా జూస్తా. “వొచ్చు సామీ…” అన్నాను ధైర్నంగా.
“అయితే ఇందా, దీన్ని సదువూ…” అని ఆయన పక్కనుండే ఇంగ్లీసు పేపర్ని నా సేతికిచ్చి, దాంట్లో ఒక పేరాను సూపించి దాన్ని సదవమన్నాడు. నేను గడగడమని పేపర్ను జూస్తా ఇంగ్లీసును తప్పుల్లేకుండా సదివేసినాను.
సామి సిర్నవ్వు నవ్వతా “బేష్… బాగా సదివినావ్!” అని నా తలమీంద సెయ్యిపెట్టి “ఇంగా బాగా సదువుకో. ప్రయోజకుడవుతావు.” అని ఆశీర్వదించినాడు.
మా తాత వైపుకు తిరిగి, “నీ మనవడు సదువులో సురుగ్గా ఉండాడు. ఇంగ్లీసు తప్పుల్లేకుండా సదివేసినాడు. బాగా పైకొస్తాడు…” అని సెప్పి, “దీర్ఘాయుస్మాన్ బవ…” అని నన్ను ఆశీర్వదించినాడు.
ఆడ నుంచి బయటికొచ్చి ఇంటికి ఎలబారితిమి. “మనవడా, ఈ దినం నాకెంత సంతోసంగా ఉండాదో సెప్పలేను రా. మేళగాళ్లు లేరని నిన్ను పిలసకపోకుండా ఉండింటే నీకిట్టా సామి ఆశీర్‌వాదం దొరికుండేదే గాదు. నువ్వు చానా అదృష్టమంతుడివిరా మనవడా…” అని ఇంటికొచ్చేంత వరకూ నన్నూ, నా అదురుస్టాన్ని పొగడతానే వున్నాడు మా తాత.
ఆనాడు ఆ జోతిసామి ఆశీర్వాద బలమేమో నేను డిగ్రీ వరకూ సదువుకుని, టీచరుగా ఇప్పుడొక ప్రవేటు ఇస్కూల్లోని పిలకాయలకి పాటాలు జెప్తా ఉండా. అంతా జోతిసామి దయ!
(మళ్ళీ కలుద్దాం)