[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]
31
[dropcap]నే[/dropcap]ను చేరినప్పుడు కురవి కర్షక సేవా సహకార సంఘంలో సుమారు 1500 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 4000కు చేరింది. అందుకు తగ్గట్టుగానే ఋణ వితరణ మూడింతలకు పెరిగింది. ఇక స్వల్పకాలిక, మధ్యకాలిక ఋణాల నిష్పత్తి 1:1కి చేరుకుంది. గ్రామాల్లో విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడూ, ‘మీకు అండగా మేమున్నాము’ అంటూ సహాయ కార్యక్రమాలు చేస్తూ, నష్ట నివారణ చర్యలు చేపడుతూ, గ్రామీణ ప్రజలకు సాంత్వన చేకూర్చి, వాళ్ళ మనోస్థైర్యాన్ని నిలబెట్టింది మా సంఘం.
రైతుల కవసరమైన క్షేత్ర సందర్శనలను, శిక్షణా కార్యక్రమాలను పేరొందిన సంస్థలలో నిర్వహించడం, వ్యవసాయాభివృద్ధి కోసం వివిధ విస్తరణ కార్యక్రమాలను చేపట్టడం, తద్వారా పంట దిగుబడులు ఇతోధికంగా పెరిగేట్లు చూడడం, గ్రామాల్లోనే మార్కెటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం, వెరసి, సంఘ పరిధిలోని గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో వుండేందుకు దోహదపడ్డాయి. అన్నింటికంటే అతి ముఖ్యమైన ఋణ వసూళ్ళ శాతం… ప్రతి సంవత్సరం 90 శాతం పైనే నమోదు అవుతుంది.
నేను చేరినప్పటికి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో వున్న కురవి కర్షక సేవా సహకార సంఘం, నేడు ప్రథమ స్థానంలో విరాజిల్లుతుంది.
ఇక నా వ్యక్తిగతంగా చూసుకుంటే, మొదట్లో మా రీజినల్ మేనేజర్ శ్రీ మాలకొండారెడ్డి గారు నాకు చెప్పినట్లు, ఈ సంఘంలో నా విధి నిర్వహణ నాకెంతో సంతృప్తి నిచ్చింది. మరెంతో జాబ్ శాటిస్‌ఫాక్షన్‌ని నాకు మిగిల్చింది.
పెద్దలు అనుభవంతో కూడిన ఆలోచనలతో చెప్పిన మాటలు… అబద్ధాలు అవుతాయా!… అవనే అవవు! కలకాలం నిజాలుగా నిలిచిపోతాయ్!!
32
ఆ రోజు పదోన్నతి కోసం నన్ను ఇంటర్వ్యూకి హైదరాబాద్ రమ్మని ఆంధ్రా బ్యాంకు హెడ్డాఫీసు నుండి లెటర్ అందింది. మరో వారం రోజుల్లో ఇంటర్వ్యూ. ఆంధ్రా బ్యాంకు జాతీయం చేయబడిన తరువాత, అధికారుల గ్రేడ్లు జాతీయ బ్యాంకులతో సమానం చేశారు. ఆ ప్రకారం చూస్తే ప్రస్తుత గ్రేడ్లు ఇలా వున్నాయ్…
అప్పుడు | ఇప్పుడు |
ఆఫీసర్ గ్రేడ్.3 | జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ 1 (జె.యమ్.1) |
ఆఫీసర్ గ్రేడ్.2 | మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ 2 (యమ్.యమ్.2) |
ఆఫీసర్ గ్రేడ్.1 | మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ 3 (యమ్.యమ్.3) |
అంటే… ఇప్పుడు నేను మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్.2 (యమ్.యమ్.2) నుంచి మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ 3 (యమ్.యమ్.3) ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూకి వెళుతున్నట్లు….
హైదరాబాదులో ఇంటర్వ్యూ జరిగింది. నాకు యమ్.యమ్.3 గా పదోన్నతి లభించింది. చాలా సంతోషించాను. ఇక బదిలీయే తరువాయి.
ఎక్కడికి బదిలీ అవుతుందా అని ఎదురుచూస్తున్న నాకు, మహబూబాబాద్ ఆంధ్రా బ్యాంకు బ్రాంచికి మేనేజరుగా పోస్టు చేసినట్లు ఆర్డర్ వచ్చింది. అప్పటి వరకు యమ్.యమ్.2 మేనేజరు స్థాయి బ్రాంచిగా వున్న మహబూబాబాద్, ఇప్పుడు యమ్.యమ్.3 మేనేజరు స్థాయీ బ్రాంచిగా అప్‍గ్రేడ్ అయినందున, నన్ను ఆ బ్రాంచికి యమ్.యమ్.3 మేనేజర్‍గా పోస్ట్ చేశారు. అంటే పదోన్నతి లభించినా నేను మహబూబాబాద్ లోనే కొనసాగాలి… ఎందుకిలా జరిగింది?… ఈ విషయం గురించి మరోలా ఆలోచించడం అనవసరం… అనిపించింది. ‘అంతయూ మన మంచికే’ అనుకుంటూ నన్ను నేను సంబాళించుకున్నాను.
33
ఉన్న ఊర్లోనే బదిలీ. పాత ఆఫీసు నుండి కొత్త ఆఫీసుకు దూరం కేవలం అరకిలోమీటరు మాత్రమే. మధ్యలో వుంటుంది మా ఇల్లు. దూరం తక్కువే గాని… అంతరం ఎక్కువే…
ఓ శుభ దినాన, ఓ శుభ ముహూర్తంలో, ఆంధ్రా బ్యాంకు మహబూబాబాద్ శాఖలో మేనేజర్‌గా జాయిన్ అయ్యాను.
గుమాస్తాగా గుంటూరు, ఒంగోలు శాఖల్లో; అధికారిగా రావులపాలెం శాఖలో పని చేసిన గత అనుభవం వుంది కాబట్టి మేనేజర్‌గా పనిచేయడంపై ఓ అవగాహన వుంది.
***
ఇక ఆఫీసు విషయానికొస్తే, ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం, ఒక పాత అద్దె భవనంలో వుంది. ఆంధ్రా బ్యాంకు శాఖ, బ్యాంకు కోసమే, స్ట్రాంగ్ రూమ్‌తో సహా, నిర్మింపబడిన ఒక కొత్త భవనంలో వుంది. సిబ్బంది విషయానికొస్తే, మేనేజర్ కాక మరో తొమ్మిది మంది వున్నారు. వారందరితో, నాకు ఇంతకు ముందు నుంచే పరిచయాలు వుండటం మూలాన, వారితో కలిసి పనిచేయడం నాకేమీ కొత్తగా అనిపించలేదు.
ఇక ఖాతాదారుల విషయానికొస్తే… అక్కడ ఎక్కువగా రైతులు, చేతిపనివృత్తుల వారు, చిరు వ్యాపారులు వుండేవారు. ఇక్కడ వారితో పాటు, పెద్ద వ్యాపారస్తులు, బడా పారిశ్రామికవేత్తలు వున్నారు. అక్కడ బాగా చదువుకున్నవారు చాలా తక్కువ. ఇక్కడ బాగా చదువుకున్నవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆడిటర్లు, ఉద్యోగస్తులు, అధికారులు ఎక్కువ.
ఇక, బ్యాంకు పరిధిలో వుండే గ్రామాల విషయానికొస్తే, పెద్దగా తేడా లేదు. అక్కడి గ్రామాలు, ఇక్కడి గ్రామాలు అన్నీ మహబూబాబాద్ తాలూకా లోవే… కాబట్టి, వాతావరణం, నైసర్గిక స్వరూపం, ప్రజల జీవన విధానాలు దాదాపు ఒకేలా వున్నాయి.
***
ఇంక బ్రాంచి విషయానికొస్తే, అటు హెడ్ ఆఫీసు, ఇటు రీజినల్ ఆఫీసు మార్గదర్శకంలో నడుస్తూ వుంటుంది. హెడ్ ఆఫీసు తయారు చేసి బ్రాంచి లోనే అందుబాటులో వుంచిన మాన్యువల్స్, రోజూ వారీ విడుదల చేసే సర్క్యులర్స్… బ్రాంచిని నడిపేందుకు పాటించవలసిన నియమ నిబంధనలను తెలియజేస్తాయి. వాటి ననుసరించే బ్రాంచిని నడిపించాలి.
ప్రతి సంవత్సరం ఆ బ్రాంచి ద్వారా జరగాల్సిన బిజినెస్, అంటే డిపాజిట్లు, అప్పులు, వసూళ్ళు,… వీటన్నింటికి లక్ష్యాలను ముందుగానే నిర్ణయిస్తారు. ఆ లక్ష్యాలను అధిగమించగలిగితే, ఆ బ్రాంచి, బ్రాంచి మేనేజరు, సిబ్బంది, అందరూ… బాగా పని చేసినట్లు లెక్క. ఇక నా దృష్టంతా, ఖాతాదారులకు విశిష్ట సేవలందిస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, నిర్ధారించబడిన లక్ష్యాలను అధిగమించడం పైనే ఉండాలి. అదే బ్రాంచి మేనేజరుగా నా విధి నిర్వహణకు కొలబద్ద.
***
ముఖ్యమైన ఖాతాదారులందరితో పరిచయాలు పెంచుకోవడంపై, గ్రామాలన్నీ తిరిగి రైతాంగంతో, ఇతర గ్రామీణ ప్రజలతో, స్థానిక ప్రజా ప్రతినిధులతో సంబంధాలు పెంపొందించుకోవడంపై, ఓ వారం రోజుల పాటు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, కృతకృత్యుడనయ్యాను. ఖాతాదారులతో సత్సంబంధాలు నెలకొల్పుకుని, సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉంటూ, బ్రాంచిలో ఓ సుహృద్భావ వాతావరణం సృష్టించగలిగాను. నిర్దేశించిన లక్ష్యాలను అవలీలగా అధిగమించేందుకు అనువైన పథక రచన చేసుకుని ముందుకు సాగుతున్నాను.
34
బదిలీపై వచ్చిన శ్రీ వి. సుబ్బారావు గారు మా బ్రాంచీలో సబ్ మేనేజర్‍గా నాతో పాటే జాయిన్ అయ్యారు. బ్రాంచిలో సబ్ మేనేజర్ పోస్టు చాలా కీలకమైనది. మేనేజర్ తరువాత ఎంతో ప్రాముఖ్యత వున్న పోస్టు సబ్ మేనేజరు పోస్టు. మేనేజర్ ఆఫీసు పనిపై బయటకి వెళ్ళినప్పుడు, తన క్యాబిన్‍లో ముఖ్యమైన పనిలో వున్నప్పుడు, సబ్ మేనేజర్ బ్రాంచిని సవ్యంగా నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు. అలాంటి పోస్టులో జాయిన్ అయిన సుబ్బారావు గారు మంచి తెలివైనవాడు, సమర్థుడు.
బ్రాంచిని పూర్తిగా అర్థం చేసుకున్న సుబ్బారావు గారు, ఓ రోజు నా క్యాబిన్ లోకి వచ్చి, నా ముందు కూర్చుని, నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు.
“సార్! బ్రాంచి పనితీరు బాగానే వుంది సార్! స్టాఫ్ అంతా మంచివాళ్లే…! సబ్ మేనేజర్‌గా మీకో విషయం చెప్పదలచుకున్నాను సార్! బ్రాంచి మేనేజ్‍మెంట్ విషయం నాకొదిలేయండి. బ్రాంచిలో ఎలాంటి సమస్యలు రాకుండా, ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నేను చూసుకుంటాను. మీరు డిపాజిట్లు పెంచడం, కొత్తగా అప్పులు ఇవ్వడం, ఇచ్చిన అప్పులు వసూళ్ళు చేయడం, బ్రాంచిని డెవెలప్ చేయడం చూసుకోండి. మనందరం కలిసికట్టుగా పని చేసి మన టార్గెట్లన్నీ రీచ్ అవుదాం సార్” అన్నాడు.
సుబ్బారావు గారి మాటలు నాలో ఉత్సాహాన్ని నింపాయి. ఉత్తేజాన్ని కలిగించాయి. ఒక మేనేజర్ తన విధులను, విజయవంతంగా నిర్వహించాలంటే, మంచి సిబ్బందితో పాటు, సుబ్బారావు గారులాంటి మంచి సబ్ మేనేజర్ కూడా చాలా అవసరం.
“సుబ్బారావు గారు! మీరిచ్చిన భరోసాతో నాకు కొండంత ధైర్యం వచ్చింది! యస్… మనందరం కలిసికట్టుగా నడుద్దాం! మన లక్ష్యాలను చేరుకొందాం! మన బ్రాంచిని అభివృద్ధి పథంలో నడుపుదాం! మీకు నా కృతజ్ఞతలు సుబ్బారావు గారు!” అంటూ నా సంతోషాన్ని వెలిబుచ్చాను.
తరువాత ఎవరిపనిలో వాళ్ళం నిమగ్నమయ్యాం.
35
మహబూబాబాద్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్… అనే ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ చురుగ్గా పని చేస్తుంది. ఆ సంస్థ స్లోగన్ ‘ఉయ్ సర్వ్’. అంటే ‘మేము సేవ చేస్తాము’ అని అర్థం. ఆ సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను అమలుపరుస్తూ, ఆపదలో వున్నవారిని ఆదుకుంటూ, నిరుపేదలకు, విద్య, వైద్య సౌకర్యాలను ఉచితంగా సమకూరుస్తుంది. సమాజంలో డబ్బున్నవాళ్ళు, పలుకుబడి వున్నవాళ్ళు, తోటి మానవులకు సహాయపడాలనుకునేవాళ్ళు, ‘మానవసేవయే మాధవ సేవ’ అని విశ్వసించేవాళ్ళు, ఆ సంస్థలో సభ్యులుగా వున్నారు. ప్రతి సభ్యుడు నెల,నెలా సభ్యత్వ రుసుము చెల్లించాల్సి వుంటుంది.
***
ఒకరోజు ఆంధ్రా బ్యాంకు సర్క్యులర్ ఒకటి, నా దృష్టికి వచ్చింది. దాని ప్రకారం, బ్రాంచి మేనేజర్లు, లోకల్‌గా వున్న లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాంటి అంతర్జాతీయ సేవాసంస్థలలో సభ్యులుగా చేరాలి. అందు కవసరమయే ఫీజులన్నింటిని బ్యాంకే భరాయిస్తుంది. క్లబ్‌లో చేరి, మిగతా సభ్యులతో పరిచయాలు పెంచుకుంటూ, సేవా కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలి. తద్వారా అందరితో సత్సబంధాలను పెంచుకుంటూ బ్యాంకు యొక్క పేరు ప్రతిష్ఠలు పెంపొందించేందుకు దోహదపడాలి.
కాకతాళీయంగా అదే రోజు మహబూబాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మా ఆఫీసుకు వచ్చి, నన్ను వాళ్ళ క్లబ్‍లో సభ్యుడిగా చేరమని కోరారు. ఎటూ ఆంధ్రా బ్యాంకు, మేనేజర్లకు అలాంటి సంస్థల్లో సభ్యులుగా చేరేందుకు అనుమతినిచ్చింది కాబట్టి, సభ్యుడిగా చేరాను.
స్వతహాగానే, సమాజ సేవా కార్యక్రమాలంటే ముందుండే నేను, నాకు ఇదొక మహదావకాశంగా బావించాను. తదుపరి, క్లబ్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, అనతికాలంలోనే మహబూబాబాద్ లయన్స్ క్లబ్‍లో నాదంటూ ఓ ముద్ర వేయగలిగాను.
(మళ్ళీ కలుద్దాం)