[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]
శ్రీ కొవ్వలి నాగేశ్వరరావు గారితో ముఖాముఖి:
[dropcap]ర[/dropcap]చయిత్రి: కొవ్వలి గారికి మీరెంతమంది సంతానం? మీ కుటుంబ విశేషాలు వివరించండి.
కొ.నా.: మా కుటుంబంలో బాల మరణాలు ఉండేవి. కనుకనే మా తల్లిదండ్రులకు మొత్తం 10 మంది సంతానం కలిగినా, మేము నలుగురు మాత్రమే మిగిలాము. ఉన్న వాళ్ళలో నేను పెద్దవాడిని (72 సం.లు). నా పేరు నాగేశ్వరరావు. నా భార్య పేరు గాయత్రి. ‘ఊర కరణం’ గారి ఆడపడుచు. ఎం.ఆర్.ఎఫ్.లో 26 సం. సైంటిఫిక్ ఆఫీసర్‌గా పనిచేసి, తర్వాత చిన్నాచితక వ్యాపారాలు చేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నాను. నాకు ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడు వివాహము చేసుకొని వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు. అతనికి ఇద్దరు మగ పిల్లలు. చిన్న కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా అమెరికాలో స్థిరపడ్డాడు. అతనికి ఇద్దరు మగ పిల్లలు. నా తమ్ముడు కొవ్వలి లక్ష్మీనారాయణ 66 సం. కెనరా బ్యాంక్‌లో పనిచేసి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేసినాడు. అతనికి ముగ్గురు మగ పిల్లలు. మా పెద్ద చెల్లెలు రాజ్యలక్ష్మి. భర్త మానాప్రగడ విజయ్ కుమార్. ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు ఒక కూతురు. ఇద్దరికీ వివాహం అయినది. ఆమె భర్త హైదరాబాదులో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌గా పనిచేసి ఇటీవల స్వర్గస్తులైనారు. మా చిన్న చెల్లెలు నడింపల్లి రత్నలత. ముగ్గురు పిల్లలు. ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు. ఆడపిల్లలకు వివాహమైనది. వీరు గుంటూరు వాస్తవ్యులు అలనాటి సుప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుడైన నడింపల్లి నరసింహారావు గారి మనవడు సాయి గారు ఆమె భర్త. అతను ఇటీవల స్వర్గస్తులైనారు.
1940 మా నాన్నగారితో వివాహమైన నాటి నుంచి మా అమ్మగారు లక్ష్మీదేవి గారు అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి ఎంతో గౌరవ మర్యాదలను తెచ్చారు. ఆ రోజులలోనే హిందీలో విశారద పాస్ అయ్యి, హిందీ ఉపాధ్యాయులుగా పని చేశారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని 1973లో పరమపదించినారు. మా నాన్నగారు కేవలం సాహిత్య సేవని నమ్ముకున్న కృషీవలుడు. అభిమానవంతులు. సాహిత్య కర్షకుడిగా మొక్కవోని ధైర్యంతో పేదరికాన్ని కూడా లెక్కచేయక ధైర్యంగా సంసార సాగరాన్ని దాటి తరించిన ధన్యజీవి. చిన్నప్పుడు మాకు, ముఖ్యంగా పెద్దకొడుకు నైన నాకు ఇంగ్లీషు నేర్పించిన గురువు ఆయన. ఈరోజు సంఘంలో నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నాను అంటే అది ఆయన చలవే. మా అమ్మగారు తెలుగు లెక్కలు ఇంగ్లీషు నేర్పి డైరెక్ట్‌గా ఐదవ తరగతిలో చేర్పించింది. చిన్నప్పటి నుంచి రామాయణ భారత భాగవతాలలోని ఎన్నో కథలను చెప్పి నన్ను దైవమార్గములో నడిపించిన దేవత. మొట్టమొదట రామ నామ మహిమను చెప్పి, అలాంటి మహాత్ముల చరిత్రలు చెప్పి,అతి చిన్న వయసులోనే దైవం వైపు తిప్పిన ఆమె నాకు మరో గురువు. అందరికంటే నా పైన ప్రత్యేక ప్రేమ ఉండేది. మా నాయన గారు ఎన్ని ఇబ్బందులు అయినా నాకు ట్యూషన్ పెట్టించి చదివించారు. ప్రతి పరీక్షకూ విద్యార్థిగా మారిపోయేవారు. నన్ను ఎంతో ప్రేమతో ‘నాగా’ అని పిలిచేవారు. మా స్కూల్‌కి వచ్చి ఆయన ఫీజు కట్టేవారు. నా గురించి తెలుసుకునేవారు. మా నాన్న మా స్కూల్‌కి వస్తే ఆ రోజు నాకు పండగ. మా ఇంట్లో బాల మరణాల వల్ల మా అమ్మ ఎప్పుడు విరక్తిగా ఉండేది. పండగలు చేసేది కాదు. కానీ మా నాన్నగారు మాకు ఏ లోపం రాకుండా ఆనాటికి ఎక్కడనుండో డబ్బు పుట్టించి, కొత్త బట్టలు కుట్టించి, ఆయనే స్వయంగా పిండివంటలు చేసి మాకు పెట్టేవారు. అదే ఆయనకు తృప్తి. నేను కూడా మా నాయనకు సహాయం చేసేవాడిని. 1950లో మద్రాసులో టీ నగర్ దగ్గర స్థలం కొని ఇల్లు కట్టారు. అందులో ఎన్నో కూరగాయలు పండించేవారు. వారు నాటిన మామిడి మొక్కలు పెద్ద వృక్షాలై మాకు ఈనాటికీ మామిడిపళ్లని ఇస్తున్నాయి. అది మా తల్లిదండ్రుల గుర్తులు. ఈనాటికీ మా నాయన ‘కొవ్వలి’ పేరు చెబితే మమ్ములను ఆదరిస్తున్నారు. గౌరవిస్తున్నారు. ఈ సమాజంలో అటువంటి వారి గర్భాన జన్మించటం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. నాకు ఆయన చేత ఉపనయనం చేయించుకునే భాగ్యం కలిగింది. మా తల్లిదండ్రుల చేతుల మీదుగానే నా వివాహం అయింది. ఆయన పెద్ద మనమడిని చూసుకున్నారు. మురిసిపోయారు.
అటువంటి తల్లి తండ్రి లేని లోటుని ప్రతిక్షణం నేను అనుభవిస్తున్నా, వారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందనే నమ్మకంతో బ్రతుకుతున్నాను. “అంతములేని ఈ భువనమంతయు పురాతన పాంథశాల…. సుఖించి చనిరెటకో!” అని ఒక మహా కవి అన్నట్లు వారు ఏ లోకంలో ఉన్న ఎక్కడ ఉన్నా నా హృదయంలో కడవరకు వారిరువురూ ఉంటారు. వారి కొరకు నేను ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలను, ఒక కన్నీటి ధార తప్ప.
రచయిత్రి: మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం కుమారులుగా మీరు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ?
కొ.నా.: మా నాన్నగారు 1975లో కీర్తిశేషులయ్యారు. వారు చనిపోయేనాటికి ‘కవి భీమన్న’ అన్న నవలను వ్రాసి , దాక్షారామం వెళ్ళి, అక్కడే పరమపదించారు.
తర్వాత మేము ఎమెస్కో వారిని కోరగా వారు సహృదయంతో ఆ నవలను ప్రచురించారు (ఇటీవల వల్లూరు శివప్రసాద్, అమరావతి పబ్లికేషన్ వారు పునర్ముద్రించారు). వారి అభిమానులైన వేదగిరి రాంబాబు గారు, ద్విభాష్యం రాజేశ్వరరావు గారు, మలయవాసిని గారు, వంటి ఎందరో విమర్శకులు, రచయితలు ప్రతి సంవత్సరం మా నాన్నగారి జన్మదినం నాడు జూలై 1న తారీకున మా నాన్నగారి గురించి ప్రముఖ పత్రికలలో వ్యాసాలు వ్రాసి తమ అభిమానాన్ని చాటుకునేవారు. శ్రీ మద్దాలి రఘురాం గారు కూడ వీరాభిమాని. వారు వారితో కలిసి సుమారు 25 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం హైదరాబాదులో వారి జన్మ దినాన్ని ఘనంగా జరుపుతున్నారు. సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తున్నారు. ప్రముఖులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, మాలతీ చందూర్ గారు, పార్వతీశం గారు, కుటుంబరావు గారు, భువన చంద్ర గారు, రామారావు గారు, మలయవాసిని గారు గొల్లపూడి మారుతీరావు గారు మొదలైన ఎందరో ప్రముఖులు ప్రతి సంవత్సరం సభలకు హాజరై కొవ్వలి వారి ప్రతిభను, వారి సాహిత్య సేవ గుర్తుకు తెచ్చుకొని ఈనాటి తరానికి తెలియజేస్తున్నారు. శ్రీ మద్దాలి రఘురామ్ కొవ్వలి జయంతిని పురస్కరించుకొని కేంద్ర సాహిత్య అకాడమీ వారి చేత హైదరాబాదులో రవీంద్రభారతిలో ఒకరోజు పూర్తిగా సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆచార్య ఎన్.గోపి గారు అధ్యక్షత వహించారు. నాటి సభకు ప్రముఖులు అనేక మంది దాదాపు 20 మంది ఆ రోజు వారి మీద పరిశోధన పత్రాలను సమర్పించారు. గత రెండు సంవత్సరాలుగా ఈ కరోనా కల్లోలం వలన సభలు నిర్వహించలేక పోయాం. అంతేకాక ప్రతి సంవత్సరం ఉత్తమ నవలా రచయితలకు విమర్శలకు కొవ్వలి పురస్కారాన్ని అందజేస్తున్నాం. వారిలో రావి కొండల రావు గారు, అంపశయ్య నవీన్ గారు, భువన చంద్ర గారు వంటి వారు ఉన్నారు. ఇటీవల 15 సంవత్సరాల కాలంలో సుమారుగా 100 నవలను వివిధ ప్రచురణకర్తలు పునర్ముద్రణ చేయించారు ఎమెస్కో, విశాలాంధ్ర, అమరావతి పబ్లికేషన్స్ వారు.
ఆనాడు లక్షలాది పాఠకులను ఉర్రూతలూగించిన “జగజ్జాణ” 25 భాగాలను ప్రస్తుతం ప్రఖ్యాత సాహితీవేత్త, విమర్శకురాలు అయిన డాక్టర్ సుశీలమ్మ గారు సరళంగా సంక్షిప్తంగా ఈనాటి తరం వారికి అర్థమయ్యేటట్లు సంచిక వెబ్ మ్యాగజైన్‌లో రాస్తున్నారు. కొవ్వలి వారు చేసిన అపూర్వ సాహితీ కృషి, వెయ్యి నవలల పైగా రాసిన కొవ్వలి గురించి ఈ తరం వారికి తెలియజేయాలన్న ఏకైక లక్ష్యంతో ఒక తపస్సుగా అహరహం నిస్వార్ధంగా, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా శ్రమిస్తూ, దాదాపు 60 సంవత్సరాల క్రితం వచ్చిన జగజ్జాణను గత తొమ్మిది నెలలుగా రాస్తున్నారు. ఇంతవరకు ఎవరూ ఇటువంటి ప్రక్రియను ప్రారంభించలేదని అనుకుంటాను. ఎవరూ కూడా ఇలాంటి ప్రయోగాన్ని చేయలేదు. ఈ నాటి పాఠకులు 25 భాగాలు, ఓపికగా 1250 పేజీలు చదవలేరు. మరి జగజ్జాణని గురించి ఎలా తెలపాలి! అనేక మంది దర్శకులు జగజ్జాణని “హేరి పోటర్” రాసిన రచనలకు ఏమాత్రం తీసిపోదని, అంతకన్నా ఎక్కువగా ఉంటాయని అంటారు. కనీసం మన తెలుగు పాఠకులకు విసుగు ఎత్తకుండా వారం వారం పాఠకులను ఆత్రంగా ఎదురు చూసేలా ఆసక్తిని పెంచుతూ, కొవ్వలి మరో అవతారం ఎత్తినారా అన్నట్టుగా రాస్తున్న డాక్టర్ సుశీల గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అభినందనలు. అసలు కథ రాయడానికి ఉంది. కానీ సంక్షిప్తంగా రాయటమే చాలా కష్టం. అటువంటి బృహత్కార్యాన్ని ధైర్యంగా చేపట్టి, దూషణ భూషణలు సమభావంతో స్వీకరిస్తూ, సాహితీ లోకంలో ముందుకు సాగిపోతున్న సుశీల గారికి ఆ సర్వేశ్వరుడు, ఆ సరస్వతీ మాత ఆమెకు, ఆమె ఉద్యమానికి అండగా ఉంటారనీ, ఆమె సాహితీ రంగంలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. ఆమెకు ఆ శ్రీనివాసుడు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
రచయిత్రి: తెలుగు సాహిత్య చరిత్రలో కొవ్వలి వారి పేరు శాశ్వతంగా నిలిచి ఉండేలా మీ భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తారా!
కొ.నా.: కొన్ని కోట్ల మంది పాఠకులను సృష్టించిన కొవ్వలి ఒక్క చెత్తో 1001 నవలలు రాసి చరిత్ర సృష్టించారు. ఒక ఇచ్చి పాఠకులను కనువిప్పు కలిగించిన బాల్య వివాహం రద్దు, ధనిక పేద మధ్య తేడాలు ఉండకూడదని, సర్వసమానత్వం కొరకు తన నవల ద్వారా చాటిచెప్పిన కొవ్వలి, ఆ రోజులలో దేవదాసీల పేరుతో దేవాలయాల అధికారులు చేసే అకృత్యాలన్ని వివరించి…. ఒకటేమిటి అనేక అనేక సమస్యలను, రుగ్మతలను కల్మషాలను నిర్భయంగా చాటి చెప్పిన ఒక సంఘసంస్కర్త. అటువంటి మహనీయునికి జన్మించడం ఎన్ని జన్మల పుణ్యమో. అటువంటి మేము ఎంత చేసినా తక్కువే, అయినా మా తృప్తి కోసం ఈ క్రింద తెలిపిన కార్యక్రమాలను చేయాలనుకుంటున్నాం.
- కొవ్వలి నవలలు వీలైనంతవరకు పునర్ముద్రించడం. ఇప్పటికి దాదాపు 100 నవలలు చేశాం. కొవ్వలి గురించి ఒక డాక్యుమెంటరీ ఫిలిం తయారుచేయడం. కథలు పేరుతో కొన్ని కథలను తయారు చేసి మీడియా ద్వారా రిలీజ్ చేయటం. కొన్ని ముఖ్యమైన పుస్తకాలను హిందీలో తర్జుమా చేయడం.
- కొవ్వలి ట్రస్ట్ స్థాపించి కొవ్వలి చేసిన సాహిత్య కృషిని ముందు తరం వారికి చెప్పడం.
- ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ నవలా రచయిత సత్కరించడం.
- సాహిత్య అకాడమీ, మద్రాసు విశ్వవిద్యాలయం మరియు ఇతర విశ్వవిద్యాలయాల్లో కొవ్వలి గురించి సెమినార్లు పెట్టించటం.
- కొవ్వలి పేరుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే – కొంతైనా ఆయన ఋణం తీర్చుకున్న వారం అవుతామని, ఆ దైవం మాకు అండగా ఉంటాడని, నమ్ముతున్నాం.
ముఖ్యంగా ఈనాటి విమర్శకులు, చరిత్రకారులు ఈ ప్రయత్నాలకి తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము.
రచయిత్రి: ధన్యవాదాలండి. కొవ్వలి వారి గురించి సాహిత్య ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు మీరు చెప్పారు.
మీ తమ్ముడు, కొవ్వలి వారి రెండవ కుమారుడు కొవ్వలి లక్ష్మీనారాయణ గారు ఏఏ విషయాలు చెప్తారో చూద్దాం.
( కొవ్వలి లక్ష్మీనారాయణ గారితో ముఖాముఖి తరువాయి భాగంలో…)