[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
అథాశోక కులోత్పన్నో యద్దాన్యాభిజనోద్భవః।
భూమి దామోదరో నామ జుగోప జగతీపతిః॥
(కల్హణ రాజతరంగిణి 1.153)
[dropcap]జ[/dropcap]లౌకుడి తరువాత దామోదరుడు రాజయ్యాడు. ఈ దామోదరుడు, అశోకుడి వంశానికి చెందినవాడో, లేక, ఏ ఇతర వంశానికి చెందినవాడో తెలియదు. అతడు కశ్మీరాధిపతి అయ్యాడు, అని స్పష్టంగా రాసాడు కల్హణుడు. ఇది రాజతరంగిణి రచనలో కల్హణుడి నిజాయితీని, నిబద్ధతను స్పష్టం చేస్తుంది. తెలిసింది తెలిసినట్టు రాశాడు. ఎంత తెలుసో అంతే, తెలిసినట్టు రాశాడు. జలౌకుడి తరువాత దామోదరుడు రాజయ్యాడు అని రాశాడు. దామోదరుడు అశోకుడి వంశం వాడో, లేక, ఇతర వంశం వాడో తెలియదు అనీ రాశాడు. దీన్ని బట్టి చూస్తే, అశోకుడు మగధ నుంచి వచ్చి కశ్మీరంపై ఆధిపత్యం సాధించి ఉంటే, ఆ విషయం కూడా రాసి ఉండేవాడు. అశోకుడు ఎక్కడి నుంచో కశ్మీరం రావటం, బౌద్ధం ప్రచారం చేసి, ఆరామాలు కట్టించి, శ్రీనగరం నిర్మాణం చేసి వెళ్ళిపోవటం అన్నది ఏ రకంగానూ సమంజసం అనిపించదు. నిజం అనిపించదు. ఎక్కడి నుంచో వచ్చి వెళ్ళిపోయేవాడే అయితే తొంభయి నాలుగు లక్షల రాతి ఇళ్ళ నగరం నిర్మించాల్సిన అవసరం లేనే లేదు. అదీ గాక అశోకుడు శాసనాలు వేయించాడు కానీ కొత్త నగరాలు నిర్మించినట్టు ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి కశ్మీర అశోకుడికి, మౌర్య అశోకుడికి ఎలాంటి సంబంధం లేదని, వీరిద్దరూ పేరు విషయంలో తప్ప ఇంక ఏ విషయంలో కూడా ఎలాంటి సంబంధం లేని వారని నిర్మొహమాటంగా నమ్మవచ్చు.
అశోకుడి తరువాత రాజయిన జలౌకుడిపై బౌద్ధులు దుష్టశక్తిని ప్రయోగించిన విషయం వల్ల స్పష్టంగా తెలిసేదేమిటంటే, కశ్మీరంలో నిలదొక్కుకునేందుకు బౌద్ధులు చేసిన ప్రయత్నాలు ఫలించక వారు చివరికి కుతంత్ర ప్రయోగాలకు పాల్పడ్డారనేది. ఇది వారిని ప్రజలకు మరింత దూరం చేసే విషయం. బోధిసత్వుడు అయినా, తంత్ర ప్రయోగం అయినా ‘మహాయాన’ బౌద్ధానికి చెందిన అంశాలు. ‘హీనయానం’గా పేరున్న బౌద్ధంలో బుద్ధుడిని దైవంగా భావించటం లేదు. మౌర్య అశోకుడు అవలంబించినది హీనయానం . కశ్మీర అశోకుడు జిన శాసనం స్వీకరించాడు. ఇంతకన్నా వేరే వివరాలు లేవు. మహాయాన బౌద్ధులు కశ్మీరంలో ఆదరణ లభించక మ్లేచ్ఛులతో చేతులు కలిపి ఉండాలి. అది ప్రజలకు బౌద్ధాన్ని మరింత దూరం చేసి ఉంటుంది. రాజుకి వారంటే క్రోధాన్ని కలిగించి ఉంటుంది. అందుకని, ఆరామంలో గంటలు మ్రోగించటం వల్ల నిద్రాభంగం అయిందన్న వంకతో ఆరామాలను కూల్చి ఉంటాడు. దాంతో రాజుపై బౌద్ధులు దుష్టశక్తి ప్రయోగం చేసి ఉంటారు. ఇది కశ్మీరంలో బౌద్ధం అడుగుపెట్టటం వల్ల నాగులు, భారతీయ ధర్మానుయాయులకు ఏర్పడిన ప్రమాదం, బౌద్ధంలోని అంతర్గత కలహాలు, కశ్మీరీయులంతా ఏకమై బౌద్ధాన్ని వ్యతిరేకించటం వంటి సంఘర్షణను సూచిస్తుంది. రాజతరంగిణి రచనలో కల్హణుడి ప్రధాన ఉద్దేశం రాజుల చరిత్రను, పరంపరను ప్రదర్శించటం తప్ప, కశ్మీరు సాంఘిక జీవనాన్ని ప్రదర్శించటం కాదు. సామాజిక జీవితంలో చెలరేగిన అల్లకల్లోలాలు, అశాంతులు ప్రదర్శించటం కాదు. కేవలం తన కథకు ఎంత అవసరమో, అంత మటుకే సామాజిక జీవనాన్ని ప్రదర్శించాడు కల్హణుడు రాజతరంగిణిలో. ఆయన ప్రదర్శించిన కథ ఆధారంగా ఆనాటి సామాజిక జీవితాన్ని ఊహించాల్సి ఉంటుంది. ఇది గమనించకుండా పలువురు విశ్లేషకులు కల్హణుడికి ‘సామాజిక స్పృహ’ లేదని విమర్శించారు. ఇప్పటికీ విమర్శిస్తున్నారు. భారతీయ కావ్యాలను విశ్లేషించే సమయంలో ప్రతి ఒక్కరూ సర్వజ్ఞాన సంపన్నులై, ఓ పీఠంపై కూర్చుని తీర్మానాలు చేస్తారు. కల్హణ రాజతరంగిణి విషయంలో ఇది మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కశ్మీరంలో బౌద్ధుల సంఘర్షణలను, రాజతరంగిణిలో కల్హణుడు పరోక్షంగా ప్రదర్శించిన బౌద్ధుల హింసాత్మక చరిత్రను, చరిత్ర నిర్మాతలు కట్టుకథలని కొట్టేసి పూడ్చి పెట్టారు. బౌద్ధం అహింసను బోధించిన అద్భుతమైన ‘మతం’ అని, కుటిల భారతీయ ధర్మానుయాయులు, అసూయతో బౌద్ధాన్ని నాశనం చేశారని, తరిమికొట్టారని వంకర భాష్యాలిస్తూ, భారతీయ చరిత్రను ‘విషం’తో నింపేశారు. అసలు చరిత్రను కట్టుకథలన్నారు [జలౌకుడి అద్భుతమైన జీవితాన్ని కస్తూరి మురళీకృష్ణ ‘కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు’ లోని ‘జలౌక మహారాజు అద్భుత జీవితం’ (పేజీ నెం.45) ప్రదర్శిస్తుంది].
జలౌకుడి గురించిన గాథలో మరో ఆసక్తికరమైన అంశం 151వ శ్లోకంలో కనిపిస్తుంది. ‘జ్యేష్ఠరుద్రుడి’కి జలౌకుడు వందల సంఖ్యలో నృత్యగత్తెలను అర్పిస్తాడు. వారు సంతోషంతో పాడుతూ, నృత్యాలు చేస్తూ దైవ సేవకు అంకితమవుతారు. ఈ శ్లోకం, ప్రాచీన కాలంలో, క్రీ.పూ. 10-11వ శతాబ్దం నాటికే కశ్మీరంలో నృత్యాంగనలను దైవాంకితం చేసే వ్యవస్థ ఉన్నదని నిరూపిస్తుంది. ఈ వ్యవస్థ అత్యంత పవిత్రము అయినదే కాదు, దైవానికి అంకితమైన మహిళలు అత్యంత శక్తిమంతులని, వారు తమ శక్తితో రాజకీయాలను సైతం ప్రభావితం చేసేవారని, కశ్మీర రాజులు వారి మాటలకు విలువిచ్చేవారనీ రాజతరంగిణి లోని ఇతర తరంగాలలోని కథల ద్వార తెలుస్తుంది. కానీ మనం ప్రస్తుతం ఆమోదిస్తున్న చరిత్ర ప్రకారం ‘ఆమ్రపాలి’ చరిత్రలో మనకు తెలిసిన తొలి ‘నగర వధువు’. ‘The Position of Women in Hindu Civilization’ అన్న పుస్తకంలో ఎ.ఎస్. అల్టేకర్ – “The custom of association of dancing girls with temples is unknown to Jataka literature. It is not mentioned by Greek writers, and the Arthasastra which describes in detail the life of Ganik, is silent about it” అని రాశాడు. మందిరాలలో నాట్య నిపుణులైన మహిళలు ఉండే వ్యవస్థ క్రీ.శ.3వ శతాబ్దంలో ప్రారంభమయిందని తీర్మానించారు. జాతక కథలు క్రీ.పూ. 3వ శతాబ్దం నుండి క్రీ.శ.3వ శతాబ్దం నడుమ రాసినవిగా భావిస్తారు. కానీ కల్హణుడు అనేక ప్రాచీన గ్రంథాలను పరిశీలించి రాసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోరు, విస్మరిస్తారు. ఎందుకంటే, కల్హణుడు రాసిన దాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మొత్తం భారతదేశ చరిత్రను తిరగ రాయాల్సి ఉంటుంది. అలెగ్జాండర్ దండయాత్ర కేంద్రంగా ఏర్పాటు చేసిన భారతదేశ చరిత్రను వదిలేసి మహాభారత యుద్ధం ఆధారంగా భారతదేశ చరిత్రను రాయాల్సి ఉంటుంది. మన దృక్కోణంలో మన చరిత్రను పునః రచించాల్సి ఉంటుంది.
సహి కారయితుమ్ యక్షైర్యతత్ స్మ స్వమండలే।
దీర్ఘానశ్మమయాన్సేతూం స్తోయ విప్లవ శావ్యయేత్॥
(కల్హణ రాజతరంగిణి 1.159)
యక్షుల సహాయంతో దామోదరుడు కశ్మీరాన్ని వరదలు ముంచెత్తకుండా అడ్డుకట్టలు కట్టించాలని ప్రయత్నించాడు.
దామోదరుడు కశ్మీరంలో నదీజలాలకు ఆనకట్టలు కట్టి నీళ్ళు మళ్ళించాడు. ప్రజలకు ఎంతో మేలు చేశాడు. కశ్మీరానికి వరదలు రాకుండా అడ్డుకట్టలు కట్టించాలని ప్రయత్నించాడు. రాజు రోజూ వితస్త నదిలో స్నానం చేశాడు. ఓ రోజు బ్రాహ్మణులు రాజు స్నానం చేయటానికి వెళ్తుంటే, ఆహారం ఇవ్వమని అభర్థించారు. స్నానం చేయందే ఆహారం ఇవ్వనన్నాడు రాజు. దాంతో వారు ‘పాము’గా మారమని రాజును శపించారు. ఒక్కరోజులో రామాయణం మొత్తం వింటే శాపవిమోచనం అవుతుందనీ చెప్పారు. కానీ అలా జరగకపోవటంతో దామోదరుడు సర్పమై పోయాడు. ఈనాటికీ ఆయన దామోదర సూదంలో తిరుగుతున్నాడని ప్రజలు నమ్ముతారని కల్హణుడు వ్యాఖ్యానించాడు (చూ. ‘కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు’, ‘దామోదర సర్పం’, పేజీ నెం.16).
దామోదరుడి తరువాత హుష్క, జుష్క, కనిష్కులు అనే తురుష్కులు రాజులయ్యారు. వీళ్ళు తమ తమ పేర్ల మీద నగరాలు నిర్మించారు. అయితే, వీరు తురుష్క రాజులు. వీరు ఎలా అధికారానికి వచ్చారు? వీరెవరు? అన్న విషయాలు కల్హణుడికి తెలియవు. రాయలేదు. అయితే వీరు ఆరామాలు నిర్మించారు. వీరి పాలనా కాలంలో కశ్మీరంలో బౌద్ధం విస్తరించింది. బౌద్ధులు కూడా క్షుద్ర తంత్ర వదిలి జనజీవితంలో భాగమయ్యారు. ఈ కాలంలో బౌద్ధులు దుష్ట శక్తుల ఆధారంగా కాకుండా పరివ్రాజకత్వం ద్వారా, ధర్మజీవనం ద్వారా ప్రజలను ఆకర్షించారు. బుద్ధుడి నిర్వాణం తరువాత 150 ఏళ్ళు గడిచాయి అప్పటికి. ఈ కాలంలో ఒక అతి గొప్పవాడు, దివ్యుడయిన బోధిసత్వుడు కశ్మీరంలో ఉండేవాడు. అతడు ‘శడర్హాద్వన’లో నివసించే నాగార్జునుడు!
బోధిసత్త్వశ్చ దేశేస్మిన్నేతో భూమీశ్వరో భవత్।
సచ నాగార్జునః శ్రీమాన్షడర్వధ్విన సంశ్రయీ॥
(కల్హణ రాజతరంగిణి 1.171)
జలౌకుడి కాలంలో దుష్టశక్తులను ప్రయోగించిన బౌద్ధులకూ, హుష్క, జుష్క, కనిష్కుల కాలంలో సర్వం పరిత్యజించి, శాంతి బోధనలు చేస్తూ ప్రజలను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తున్న బౌద్ధులకు నడుమ ఎంతో తేడా ఉంది. దామోదరుడు సర్పమై పోవటంతో సరైన వారసుడు లేక రాజ్యం అల్లకల్లోలమై ఉంటుంది. ఆ సమయంలో తుర్కీస్థానం నుంచి వచ్చి కశ్మీరులో ఉన్న తురుష్క వీరులు రాజ్యాధికారం చేపట్టి ఉంటారు. ఈ తురుష్క వీరులు తమ ‘మతం’ కాక బౌద్ధాన్ని రాజ్యంలో విస్తరింప చేయటం గమనార్హం. బౌద్ధులను మ్లేచ్ఛులుగా భావించటం వెనుక వారు తురుష్కులతో చేతులు కలపటం ఉంది. కాబట్టి కశ్మీరులో తురుష్కులు బౌద్ధం స్వీకరించి ఉంటారని ఊహించవచ్చు. అయితే వీరు స్వీకరించిన బౌద్ధం దుష్ట శక్తులను ఆహ్వానించే బౌద్ధం కాక, శిష్ట ప్రవర్తనతో ‘అర్హత’ సాధించాలని ప్రయత్నించే ‘మాధ్యమిక వాద’ బౌద్ధం అయి ఉండవచ్చనుకోవచ్చు. ఈ ఆలోచనకు కశ్మీరులో ‘శడర్హాద్వనం’ వద్ద నివసిస్తున్న మాధ్యమికవాది ‘నాగార్జునుడు’ బలం చేకూరుస్తాడు.
కశ్మీరులో అశ్వఘోషుడు ‘బుద్ధ చరిత’ రాశాడు. ఇది కనిష్కుడు కశ్మీరులో రాజ్యం చేస్తున్న కాలంలో రాశాడని అంచనా. ఎందుకంటే, కనిష్కుడు యుద్ధం చేసి గెలుపొందిన రాజ్యం నుంచి అశ్వఘోషుడిని కశ్మీరు తీసుకువచ్చాడు. అశ్వఘోషుడు సాంప్రదాయక బౌద్ధుడు. క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఇలాంటి వారిని కశ్మీరుకు రప్పించటం వల్ల కశ్మీరు బౌద్ధ స్వరూపాన్ని బౌద్ధ ధర్మానుయాయులైన తురుష్కులు రూపాంతరం చెందించారు. కశ్మీరులో బౌద్ధం రూపాంతరం చెందటం వెనుక మహాయాన బౌద్ధం లోని చీలికలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి.
మహాయాన బౌద్ధం విజ్ఞానవాదం, యోగాచార సిద్ధాంతాల ఆధారంగా రెండుగా చీలింది. వీటి నుంచి నాగార్జునుడి మాధ్యమిక వాదం ఉద్భవించింది. నాగార్జునుడి మాధ్యమిక వాదం ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, అది కశ్మీరు పొలిమేరలు దాటి దేశమంతా విస్తరించింది. ‘నాగార్జున కొండ’ (శ్రీపర్వతం) వద్ద విలసిల్లిన బౌద్ధంలో నాగార్జుదికి అంకితమిచ్చిన కట్టడాలు, నాగార్జుని విగ్రహం వంటివి ఇందుకు చక్కని ఉదాహరణలు. శ్రీలంక నుండి బౌద్ధ మత ప్రచారకులై భారత్ వచ్చిన శ్రమణులు నాగార్జున కొండ నుంచి దేశమంతా విస్తరించినట్టు శాసనాలు లభించాయి. ఇలా విస్తరించిన శ్రమణులలో కొందరు కశ్మీరం కూడా వచ్చి చేరారు. ఇక్కడి నుంచి శ్రమణులు గాంధారం, చీనా దేశాలకు కూడా ప్రయాణమయ్యారు. బౌద్ధం ఇలా రూపాంతరం చెందటం, కశ్మీరు ప్రజలు బౌద్ధాన్ని పెద్ద ఎత్తున స్వీకరించటానికి దారితీసి ఉంటుంది. కశ్మీరులో రెండేళ్ళపాటు ఉండి బౌద్ధాన్ని అధ్యయనం చేసిన హుయాన్ చాంగ్ (క్రీ.శ.7వ శతాబ్దం) కశ్మీరులోని బౌద్ధుల క్రమశిక్షణను, పరివ్రాజకత్వాన్ని, బౌద్ధం పట్ల విశ్వాసాన్ని విపులంగా వర్ణించాడు.
ఇక్కడ మళ్ళీ కల్హణుడు రాజతరంగిణిలో ప్రదర్శించిన కాలానికి, పాశ్చాత్యులు తీర్మానించిన కాలానికి నడుమ తేడా వస్తుంది. ప్రస్తుతం అందరూ ఆమోదిస్తున్న దాని ప్రకారం నాగార్జునుడు క్రీ.శ. ఒకటవ శతాబ్దం నుండి మూడవ శతాబ్దం నడుమ జీవించి ఉండవచ్చని భావిస్తున్నారు. కానీ రాజతరంగిణి ఆధారంగా తీసుకుంటే, హుష్క, జుష్క, కనిష్కులు కశ్మీరును సంయుక్తంగా క్రీ.పూ.1294 -1234 నడుమ పాలించారు (Chronology of Kashmir – Reconstructed by Kota Venkatachalam, Page No.94). అంటే నాగార్జునుడు కూడా క్రీ.పూ. 13వ శతాబ్దానికి చెందిన వాడయితే, బుద్ధుడు అంతకు ముందే జన్మించి ఉండాలి. మళ్ళీ మనం ఏర్పరుచుకున్న చరిత్రకూ, కల్హణుడు ప్రదర్శిస్తున్న చరిత్రకూ నడుమ తేడా వస్తుంది. కల్హణుడి తేదీలు సరైనవిగా భావిస్తే, కశ్మీరు చరిత్రనే కాదు, నాగార్జునుడితో ముడిపడి ఉన్న దేశంలోని ఇతర ప్రాంతాల చరిత్రను కూడా తదనుగుణంగా పునర్నిర్మించాల్సి ఉంటుంది.
(ఇంకా ఉంది)