[dropcap]ఎ[/dropcap]దిగిపోయాడు మనిషి,
తనను తాను మరచేంత
ఎత్తుకు ఎదిగిపోయాడు,
ఎదుగుదలే శ్వాసగా
పేరు ప్రతిష్ఠలే ఊపిరిగా,
ఎదిగిపోయాడు!!
పక్షిలా నింగిలోకి ఎగిరాడు,
చేపలా నీటిలో ఈదాడు,
నడచిన నేలనే మరచి ఎదిగిపోయాడు,
ప్రపంచమే తన గుప్పిట్లో
ఒదిగేలా ఎదిగాడు!!
అంతరిక్షాన్ని జయించి,
అంతరాత్మను మరచి,
అంతర్ముఖుడిగా,
ఎదిగిపోయాడు,
ఈ పెద్దమనిషి!!
పరదేశంలో ముక్కూ
మొహం తెలియని
వారితో చెలిమిచేసే
స్ధాయికి ఎదిగాడు,
ప్రక్కింటి మనిషిని
పట్టించుకోలేనంత
తీరుబడిలేని-
మనిషిగా మారాడు!!
సప్తసముద్రాల ఆవల
వారితో ఆప్తబంధం,
వెల్లు విరిసేలా,
సప్తపది నడచిన,
ఆలితో అల్లంతదూరం,
నడచేలా తనకు తాను ఎదిగిపోయాడు
మహా మనిషి!!
అంతంలేని చదువే
అసలైన విద్య అనే
ముసుగులో-
ఎన్నో పట్టాలు పట్టాడు,
ఒదుగులేని ఎదుగు
ఒక ఎదుగు కాదనే,
ధ్యాసనే మరచిమరీ,
ఎదుగుతూ, సాగుతున్నాడు,
ఈ విచిత్రమనిషి!!