[dropcap]కొ[/dropcap]న్ని సినిమాలకు కాలదోషం పట్టదు. రెండు మూడు తరాలు మారినా కూడా అంటే దాదాపు అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం తీసిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. సమాజానికి ఉపయుక్తమైన సందేశాలతో స్ఫూర్తిని కలిగించే శక్తిని కూడా కలిగి ఉంటాయి. వాటినే క్లాసిక్స్ అంటాం. వాటిల్లో కథా, సమస్యలూ అప్పటి కాలానికే కాక ఇప్పటికీ సందర్భశుద్ధి కలిగి ఉంటాయి. ఈ క్లాసిక్ సినిమాల్లో కేవలం గొప్ప కథే కాకుండా, నటీనటుల నటన, సాంకేతిక సహాయం, కథను స్క్రీన్ మీద ప్రెజెంట్ చెయ్యడంలో దర్శకుని పనితనం అన్నీ ఉన్నత స్థాయిలో ఉన్నట్టు గమనిస్తాం. అందుకే ఆ సినిమాలని ఇప్పటికీ జనం గుర్తు పెట్టుకుని చూస్తూ ఉంటారు.
శుద్ధ క్లాసిక్స్ అనగానే, బోలెడన్ని ఆదర్శాలతో ప్రేక్షకులకు విసుగు కలిగించి ఫెయిల్ అయిన సినిమాలనే సాధారణ అవగాహన అబద్ధం కాదు. అలా డాక్యుమెంటరీల్లాగ తీసిన సినిమాలు కూడా మనకు తెలుసు. కానీ ఈ రచయిత, కొన్ని నియమాలకూ, ఆదర్శలకూ కట్టుబడి నిజాయితీగా నిర్మించి ఆర్థికంగా కూడా లాభాలు గడించి కమర్షియల్ హిట్ క్లాసిక్స్‌గా నిలిచిన ముప్పై తొమ్మిది సినిమాలను ఎన్నుకుని విశ్లేషిస్తూ మనముందుంచారు.
ఈ పుస్తకం ప్రత్యేకించి ఒక వర్గం వారికి అత్యంత సహాయకారి మరియు ఆనందకారి. కారణం ఆంధ్ర ప్రదేశ్‌లో హిందీ భాష బాగా తెలిసిన వారి శాతం చాలా తక్కువ. ఇష్టం, అభిమానం,హిందీ నేర్చుకోవాలనే తపన ఉన్న వారి శాతం ఎక్కువ. పూర్తిగా అర్థం కాకపోయినా మక్కువతో హిందీ సినిమాలు చూస్తారు. కథలపై, కథనాలపై హీరో హీరోయిన్‌లపై ఆరాధన, ఇంకా చెప్పాలంటే ఆ భాష యొక్క అందం, పాటల ఆకర్షణ అలాంటివి. హిందీ సినిమాది జాతీయ స్థాయి కాబట్టి నటీనటుల నటన, సినిమా నిర్మాణం కూడా ఉన్నత స్థానంలో ఉండడం వారికి ఒక ప్రత్యేకమైన గౌరవాన్నీ, ఇష్టాన్నీ కలిగిస్తుంది. ఒకసారి వారికి హిందీ సినిమాలు చూడడం అలవాటైతే ఆ సినిమాలనే తెలుగులో రీమేక్ చేసినపుడు వాటిని చూడలేకపోతారు. ఒక ఫ్లేవర్ మిస్ అయ్యిందని భావిస్తారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో, మా చిన్నప్పుడు మాకు గ్రామాల్లో ఆరోతరగతి నుండీ హిందీ అక్షరాలు నేర్పించేవారు. టెన్త్ క్లాస్‌లో మిగిలిన సబ్జెక్టుల్లో పాస్ మార్క్ ముప్పైఅయిదు అయితే హిందీలో ఇరవై మాత్రమే. హిందీ మాకు కొరుకుడుపడేది కాదు. హిందీ టీచర్లు ఎక్కువగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ప్రాథమిక, మధ్యమ మొదలైన హిందీ భాషా పరీక్షలు పాసయిన స్త్రీలే ఉండేవారు. వాళ్ళూ మమ్మల్ని హిందీ విషయంలో పెద్దగా ఎంకరేజ్ చేసేవారు కాదు. టెన్త్ ఫలితాలు బావుండాలని హెడ్ మాష్టారితో సహా, టీచర్లంతా మమ్మల్ని లెక్కలూ, ఇంగ్లీష్ సబ్జక్ట్‌ల్లో రుద్దడానికి ఎక్కువ సమయం కేటాయించేవారు. హిందీ సబ్జక్ట్ చదువు, తూ.తూ. మంత్రంగా ఉండేది. ఏవో కొన్నిముఖ్యమైన ప్రశ్నలూ, జవాబులూ, కొన్ని పద్యాలూ, మరికొన్ని ఎస్సేలూ ముక్కున పట్టి లాగించేసి ఎలాగోలా పాస్ అయిపోయేవాళ్ళం.
కాలేజీకి వెళ్ళాక అప్పుడప్పుడూ మా గ్రామ థియేటర్లలోకి హిందీ సినిమాలు వచ్చేవి. వచ్చే ప్రతీ సినిమా చూసే అలవాటుతో అవి కూడా చూసే వాళ్ళం. పాటలు నచ్చేవి. టూకీగా కథ అర్థం అయ్యేది. సంభాషణలు ఏమీ తెలిసేవి కావు. ఒకసారి మేం టెన్త్‌లో ఉండగా ‘షోలే’ సినిమా చూసాం. కథా, మాటలూ బాగా అర్థం అయ్యాయి. ‘ఇంకేం మనకి హిందీ వచ్చన్న మాట’ అనేస్కుని పొంగిపోయి, ‘మా’ అనే ధర్మేంద్ర సినిమాకి పోలోమని వెళ్లిపోయాం. ఆ సినిమాలో ‘మా’ అనే మాట తప్ప మరో మాట అర్థమైతే ఒట్టు. అప్పుడు మేం బాగా, తీవ్రంగా దుఃఖించవలసివచ్చింది. అయినా ఆశ వదలక దొరికిన హిందీ సినిమానల్లా చూస్తూ వచ్చాము. కొన్నిహిందీ సినిమాల్లో సంభాషణలు సరళ భాషలో ఉంటే మరి కొన్నిటిలో కాస్త క్లిష్ట భాషలో ఉంటాయి.
అప్పట్లో హిట్ అయిన హిందీ గ్రామఫోన్ రికార్డులు ఫంక్షన్లలో వేసేవారు. ఆ పదాల ఉచ్చారణ అందరికీ తెలీదు కాబట్టి కొందరు దయామయులు ఆ బాణీకి తెలుగు పాటలు రాసేవారు. అవి మేం పాడుకునేవాళ్ళం. హిందీ తెలుసుకోవాలన్న ఉత్సాహం అలా ఉండేది. హిందీ సినిమా చూసినప్పుడల్లా ఎవరైనా పక్కన కూర్చుని అర్థం చెబితే బావుండును అని ఆశ పడేవాళ్ళం. ఆ తర్వాత ఉద్యోగంలో చేరాక, హిందీ మాట్లాడే సహోద్యోగులతో పనిచేస్తూ, హిందీ డిక్షనరీ కొనుక్కుని అర్థాలు చూసుకుంటూ ఒక నోట్స్‌లో రాసుకుంటూ కాస్త భాషావగాహన పెంచుకున్నాం. మాలాంటి వారికి ఈ రచయిత రాసిన పుస్తకం కలిగించిన ఆనందం అంతా ఇంతా కాదు.
ఈ బుక్‌లో సమీక్షించిన సినిమాలన్నీ దాదాపుగా హిట్లే. ప్రతి ఒక్క సినిమానూ తదేక ధ్యానంతో, కూలంకషంగా పరిపూర్ణంగా చర్చించారు. ఇక విశ్లేషణ సంపూర్ణ స్థాయిలో ఉంది. సినిమా నిర్మాణ నేపథ్యంతో మొదలు పెట్టి, కథ, నిర్మాత, దర్శకుడు, సంభాషణలు, పాటల్లో సాహిత్యం, సంగీతం, గాయనీగాయకులు, హీరో హీరోయిన్లూ, కెమెరా పనితనం వరకూ సమగ్రంగా వివరించారు రచయిత. అంతే కాక చరిత్రలో ఆ సినిమా ఏ స్థాయిలో నిలబడిందో కూడా చెప్పారు. కథను గురించిన చర్చ, సామాజిక స్పృహతో ఒక నిబద్ధతతో తీసిన ఇటువంటి సినిమాలలోని అనేక సంగతులు గురించి కూడా ఇందులో ఉన్నాయి. ఇటువంటి క్లాసిక్ సినిమాలలోని అంతస్సారం పట్టుకోవడం అనేది హిందీ భాష తెలిసిన వారికి కూడా కష్టమే. చదివిన వాళ్ళకి ఆయా చిత్రాలపై పూర్తి పరిజ్ఞానం, అవగాహన కలిగించే ఇతర వివరాలు పాఠకుడికి బోనస్ అనుకోవచ్చు.
ఈ పుస్తకంలో ఉన్న సినిమాలన్నీ దేనికదే ప్రత్యేకత కలిగినవి. గొప్ప అభిరుచీ, కమిట్మెంట్ కలిగిన దర్శకనిర్మాతలు నిర్మించినవి. సమాజంపట్ల బాధ్యతతో ఆదర్శ భావాలతో తీసిన చిత్రాలే తప్ప లాభాల కోసం తీసినవి కావు. అన్నీ క్లాసిక్ సినిమాలై ఉండి కూడా వ్యాపారపరంగా విజయం సాధించినవన్నమాట. ఈ ముప్పై తొమ్మిది సినిమాల్లో చాలావాటిని చాలా మంది చూసే ఉంటారు. ఈ సినిమాలేవీ సరదా, కాలక్షేపం మూవీలు కావు. అందుకే వాటి నేపథ్యం గురించి తెలుసుకోవడం హిందీ వచ్చినప్పటికీ అందరికీ నచ్చే సంగతే. ఈ బుక్ అందించిన వివరాలతో ఆ సినిమాలన్నీ మరోసారి చూడగలిగితే అవి మరింత లోతుగా మనకి అర్థం అయ్యే అవకాశం ఉంది.
షికస్త్, రుస్తుం సోహ్రాబ్, యహూది, జునూన్, ప్యాసా, నవరంగ్, గైడ్ లాంటి సినిమాలు ఇటువంటి విశ్లేషణాత్మక వివరాలు తెలీకుండా చూసి అర్థం చేసుకోవడం కష్టం. అటువంటి కథలకి ఈ పుస్తకం మేడ్ ఈజీ లాంటిది. ఈ సమీక్షలన్నీ పాలపిట్ట మాసపత్రికలో ప్రచురించబడినవి. రచయితే ముందుమాటలో చెప్పినట్టుగా ఇవన్నీ, కళాత్మకతనూ, సమాజం పట్ల బాధ్యతనూ బాలన్స్ చేస్తూ వ్యాపారపరంగా లాభాలు తెచ్చినవి. చాలా సినిమాలు ఫార్ములాకి భిన్నంగా ఆత్మసాక్షితో నిర్మించినవే.
మానసిక పరిణతి లేని స్త్రీ పురుషులు స్వేచ్ఛగా జీవిస్తూ, వారు స్నేహాన్నీ, ప్రేమనీ విభజన చేసుకోలేనపుడు కలిగే వికృతులను ఒక సూచనగా చెప్పే అందాజ్ సినిమా (1949లో వచ్చినది) పై మొదటి సమీక్ష ఉన్నది. ఇది డెబ్బైఏళ్ల క్రితం తీసినా ఇప్పుడు తీయవలసినంత సమకాలీన వస్తువు. ఇంకా ఇందులో హిట్ మూవీస్‌గా పేరుపడ్డ కభీకభీ, పాకీజా, తీస్ర్తీ మంజిల్, నయాదౌర్, చల్తీనా నామ్ గాడీ,మధుమతి వంటివి ఉన్నాయి.
ఇంకా ఈ సమీక్షా సంకలనంలో దయ్యాల సస్పెన్స్ సినిమాలకు ఆది సినిమా ‘మహల్’ ఉంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజలకు మన సంప్రదాయాలపై గౌరవాభిమానాలు పెంచే సదుద్దేశంతో అద్భుతమైన పాటలతో నిర్మించిన ‘బైజు బావరా’ ఉంది. నేటికీ బోల్డ్ అనిపించే కథాంశంతో తీసిన సినిమా ‘పతిత’, మంచి చెడుల మధ్య తేడా గ్రహించే విధంగా ఉండే ‘దాగ్’ ఉన్నాయి. గొప్ప విజనరీ అయిన మహబూబ్ ఖాన్ నిర్మించి, దర్శకత్వం వహించిన భారతీయ సినిమాలకి తలమానికమనదగ్గ ‘మదర్ ఇండియా’ ఉంది. మరో బోల్డ్ మూవీ ‘బొంబాయికా బాబు’ ఉంది. భారీ ఖర్చుతో, అక్బర్ కాలం నాటి గొప్పతనాన్నీ,అక్బర్ ధీరోదాత్తతను వివరిస్తూ తీసిన ‘మొఘల్- ఎ- ఆజమ్’, చిన్న బడ్జెట్‌తో తీసిన ‘దోస్తీ’, దేశభక్తీ, కళాత్మక విలువలున్న ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’ కూడా ఉన్నాయి.
హిందీ మూవీస్‌పై మక్కువ, ప్రేమ, ఆరాధన, ఇష్టం, ఉన్నవారెవరైనా ఈ పుస్తకాన్ని తమ షెల్ఫ్‌లో అపురూపంగా దాచుకోవచ్చు. ఒకో విశ్లేషణ చదివి ఆ తర్వాత పూర్తి అవగాహనతో ఆ సినిమా చూడడం అనేది మరింత ఆహ్లాదకరమైన అనుభవం అవుతుంది. ఏదో సబ్ టైటిల్స్‌తో కథ అర్థం చేసుకోవడం కాకుండా ఈ సినిమాల యొక్క ఆత్మను పట్టుకోవాలంటే ఈ విశ్లేషణలు అందరూ చదవాలి . అప్పుడు ప్రతిపదార్థం, తాత్పర్యం తెలుసుకున్న తర్వాత ఒక పద్యం విన్నప్పుడు కలిగిన సంతోషం కలుగుతుంది. చిత్రం యొక్క సంకల్పం, ఉపదేశం గ్రహించిన సంతృప్తి కలుగుతుంది.
ఇంత సవివరమైన సమీక్షలందించిన రచయితకు ధన్యవాదాలు తెలుపుతూ,ఇంకా ఇదే కోవకు చెందిన మరికొన్ని సినిమాల గురించి వివరిస్తూ మరొక పుస్తకం వారినుండి రావాలని కోరుకుందాం.
***
కమర్షియల్ క్లాసిక్స్
కస్తూరి మురళీకృష్ణ
వెల: ₹ 125/-
ప్రతులకు:సాహితి ప్రచురణలు
చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్,చుట్టుగుంట
విజయవాడ – 520 004.
ఫోన్:0866-2436642/43,8121098500
Email:sahithi.vja@gmail.com