[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]
[dropcap]నా[/dropcap] ప్రయాణము ఇలాగే సాగాలన్న ఫ్లాను ఎప్పుడూ వుండదు. ఎలా కుదిరితే అలా వెడతాను. ఇప్పుడూ అదే పద్ధతి. నేను రిషికేష్‌కు చేరుకోవటానికి డెహ్రాడునుకు హైద్రాబాదు నించి ఇండిగో వారి విమానములో ప్రయాణించాను. డెహ్రాడూను చేరే సరికి సాయంత్రం 6 గంటలు దాటింది. అక్కడ్నుంచి రిషికేష్ జియ్యరు మఠముకు 45 నిముషాలు పట్టింది. ఎయిర్‌పోర్టు ట్యాక్సీలో రిషికేష్ చేరాను. మఠము మేనేజరుకు ముందుగా ఫోను చేసి వున్నాను కాబట్టి ఆయన నా కోసము ఒక గది వుంచారు. ఆ రాత్రికి అక్కడే వున్నాను. రిషికేషులో ఎన్నో మఠాలు, హోటల్స్ కూడా వున్నాయి (మేము మన స్వామి వారి మఠమంటే మా పుట్టిల్లు అన్నంత సౌకర్యంగా ఫీలవుతాము కాబట్టి మఠానికే వెడతాము).
ఆనాటి రాత్రి కుండపోత వాన.
మరురోజు నేను గంగా నదికి నా వందనములు సమర్పించి ఉదయమే బయలుదేరాను.
వాన కారణమున మేనేజరు గారు బదిరి బయలుదేరటం రిస్కు అన్నారు. నేను చూద్దాములెమ్మని బయలుదేరాను. నాకు ఆయన జాగ్రత్తలు చెప్పి టాక్సీ ఎక్కించారు. రిషికేష్ నుంచి బస్సులు వుంటాయి. గ్రూపుగా వెళ్ళేవారికి ఒక సొంత టాక్సీ తీసుకోవటం చాలా సౌకర్యవంతముగా వుంటుంది. నాకు బస్సు వెత్తుకొని ఎక్కే వోపిక లేదు. అందునా మఠానికి ఎదురుగా ట్రావల్స్ అతను వీళ్ళకు బాగా తెలిసిన అతడే. అందుకే ఒక్కదానైనా బయలుదేరాను, టాక్సీ లోనే. నాకు ఒక జీపు టైపు బండి పంపారు ఆయన. ఎక్కడా మట్టిలో ఇరుక్కుపోకూడదని. ఏ ఇబ్బంది లేకుండా అందమైన ఆ హిమాలయ పర్వతాలలో ఆ రోజంతా నా ప్రయాణం సాగింది. రిషికేషు నుంచి అలకనంద జన్మస్థానం వరకూ వదలకుండా కొండల మీదుగా, లోయలలో ఆ దారి సాగుతుంది. దారి పొడగునా గంగ ప్రక్కనే గలగల మంటూ తోడుంటుంది.
అద్భుతమైన పంచ ప్రయాగలు – దేవ ప్రయాగ, నంద ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, విష్ణు ప్రయాగలు మళ్ళీ దర్శన మిచ్చాయి. ధారా దేవికి సంతోషముగా నమస్కరించాను.
ఆ సౌందర్యం కన్నులతో చూసి, హృదయంలో నింపుకొని మురిసిపోతూ సాగాను. నాకు వర్ణించలేమనిపించింది చూస్తుంటే. కేవలం కాళిదాసు కానీ పెద్దన్న కాని కొంత న్యాయం చెయ్యగలరు. మధ్యలో శ్రీనగరు చాలా పెద్ద వూరు. అక్కడ మెడికల్ క్యాంపసు చాలా విశాలమైనది. అక్కడే గంగ మీద తెహ్రీ డ్యాము కట్టారు. పర్వత ప్రాంతపు పంటలను కూడా దారి పొడవునా చూడవచ్చు.
చూసేకొద్ది చూడాలనిపించే అందం హిమాలయముల సొంతం. ఎంత చూసినా తనివి తీరని, కొంత మిగిలిపోయే వైనమది. చుట్టూ హరితము. వానల వల్ల ఎక్కడికక్కడ జలజల జలపాతాలు. రోడ్డుకు ప్రక్కగా గలగల గంగమ్మ.
కొండ పైన సాగుతున్నా, లోయలో నైనా ఆపుకోలేని అతిశయించిన ఆ సౌందర్యం మనకు బాహ్య స్పృహను కోల్పోయేలా చేస్తుంది. మత్తునిస్తుంది. పరమాత్మ అద్భుత చిత్రకళా నైపుణ్యము తెలుస్తుంది.
మనసు ఆనందముతో దిగంతాలను స్పర్శిస్తూ సాగుతుంది. హృదయము శుద్ధి పొంది మనము బదిరిలో ప్రవేశింప అర్హులమవుతాము.
అలా నేను ఆనాటి సాయంత్రపు సంద్యా సమయాన పవిత్ర అలకనంద, రిషిగంగాల, విష్ణు ప్రయాగ సంగమాన శ్రీ మహావిష్ణువు నారాయణునిగా వెలసిన బదిరికా వనంలో ప్రవేశించాను. బదిరి ప్రవేశమే సర్వపాపహరము. నా సాధన మరో మెట్టు ఎక్కనుంది. నమోః నారాయణాయ నమః.
“నారాయణ నీ నామమెగతి యిక
కొర్కెలు నాకు కొనసాగుటకు॥
పైపై ముందట భవజలధి
దాపు వెనక చింతా జలధి
చాపలము నడుమ సంసార జలధి
తేపయేది యిది తెగనీదుటకు॥
నారాయణ నీ నామమెగతి యిక॥” అన్నమయ్య కీర్తన…
~
బదిరిలో ప్రవేశించిన మనస్సు నారాయణ నామములో మునిగినది…..
పద్మాసనములో నున్న పద్మనాభుడు,
చిలిపి కన్నులతో చూచు అల్లరి కృష్ణుడు।
భక్తజనులకు జపమాల చేతికిచ్చు జడధారి,
క్రీడావనిని తపోభూమిగా మార్చిన ముని పుంగముడు।
ప్రథమపాదము మోపిన చరణపాదుడు,
నరునకు మంత్రాలని ఉపదేశించిన గురుమూర్తి।
నన్ను అనుగ్రహించి అనుమతించాడు నారాయణడు బదిరి లోనికి!!
~
నేను బదిరి చేరగానే రాఘవ స్వామి ఎంతో ఆదరముగా స్వాగతించాడు. ఆయన నారాయణ మంత్రదీక్షలో వున్నాడట. ముఖములో వెలుగులు ప్రస్ఫుటముగా కనపడినాయి (ప్రతి సంవత్సరము ఎనిమిది లక్షల నారాయణ మంత్రము నలబైరోజులలో చేస్తారు). నన్ను ముందు దూళీ దర్శనానికి తీసుకుపోయాడు ఆ అర్చకస్వామి. దేవాలయానికి మఠానికీ దూరము అట్టే లేదు, కానీ కొండ పైకి పోవాలి. నాకు మొదటి రోజు ఊపిరి పీల్చటము కష్టమైయ్యింది. నెమ్మదిగా వెళ్ళి దర్శనము చేసుకువచ్చాను.
బదిరిలో స్వామి ఆశ్రమము విశాలమైనది. ఇద్దరు పూజారులు, ఒక వంటస్వామి, మేనేజరు, ఒక కేరుటేకరు కాక ముగ్గురు స్త్రీలు అక్కడి పైపై పనులు చేస్తూ వుండేవారు. నన్ను ఎంతో ఆదరముగా చూశారు నే వున్నన్ని రోజులు.
ఉదయమే టీ ఇచ్చేవారు. బాలభోగముగా పెరుమాళ్ళుకు పెట్టిన ప్రసాదము తొమ్మిదింటికి టిఫినుగా పంచేవారు. మధ్యహ్నము పూర్తి భోజనము. సాయంత్రము టిఫెను వచ్చిన భక్తులకు పెట్టేవారు. ఇందులో మార్పు వుండదు. ఏకాదశి నాడు అంతా ఉపవాసమున్నా, అన్నదానము జరిగేది. బదిరిలో తెలుగు భోజనము కేవలము ఈ ఆశ్రమములో మాత్రమే దొరుకుతుంది.
మాకు సాయంత్రము చపాతీలు పెట్టేవారు. కారణము చలి ప్రదేశములో నాకు అరగదని. కానీ నేను మధ్యాహ్నము తప్ప తినటము మానేసా, వెళ్ళిన మూడోనాటి నుంచి. వారి ప్రేమకు నేనివ్వగలగినదేముంటుంది. పరమాత్మ నా యందు కరుణతో నా సాధనకు అక్కడ వుంచాడు. నేను తిరిగిన ప్రదేశాలలో, నేను వున్న ప్రదేశాలలో సాధనా పరంగా కానీ, సౌకర్యపరంగా కాని బదిరి ఉత్తమోత్తము. నేను అక్కడ వున్న సమయములో నా సంతోషము మరువలేను. అంతటి హాయినిచ్చినది నాకు మళ్ళీ మరో ప్రదేశము లేదు.
ఆశ్రమములో అన్నదానము జరిగేది ప్రతిరోజూ. ఉదయము తొమ్మిదికి సాధుసంతుకు భోజనము పెట్టేవారు. బదిరిలో చాలా చోట్ల ఈ అన్నదానము జరుగుతుంది. అక్కడి సాధువులు అన్నదానము మీదనే ఆధారపడి బ్రతుకుతారు.
నా మీద ఆశ్రమ ఇన్‌చార్జు కానీ, ఆ మాతృమూర్తులు కానీ చాలా కరుణగా, గౌరవముగా వుండేవారు. నేను ఉదయము లేచి నా క్రియా సాధన చేసుకొని, స్నానాదులు పూర్తి చేసి వెళ్ళి టీ త్రాగేదాన్ని. తరువాత సప్తశతి పారాయణము. అది అయ్యాక మధ్యహ్నపు భోజనము.
తదనంతరము మూడింటికి గుడికి వెళ్ళేదాన్ని. గుడిలో మూడు గంటలకు మూలవిరాఠైన నారాయణి ముందర మనము కూర్చోవచ్చు. రెండు గంటల పాటు మనలను లేపరు. ఐదుకు లేపేస్తారు. అప్పుడు బయట వున్న మండపాలలో జపం చేసుకోవచ్చు. ఆ వాతావరణములో చిన్న చలితో పాటు పూర్తి దైవత్వము నిండి వుండేది. ప్రతివారు పరమ భక్తిగా, పరమాత్మ యందు చాలా గౌరవముగా వుండేవారు.
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం‖
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్‖
దేవాలయము మన దక్షిణభారత దృష్టితో చూస్తే చిన్నదే, బయటకు రంగులతో చాలా హుందాగా వుండేది. రాణి అహల్య ఆ దేవాలయాన్ని కట్టించిదని విన్నాను. ఆ సమయములో చాలా మంది సాధకులే వుండేవారు. టూరిస్టుల టైము కాదది. చాలా మంచి కాలము బదిరిలో వున్న సమయము.
(సశేషం)