ది గ్రిమ్ ఎస్కేప్

0
3

[box type=’note’ fontsize=’16’] Tafadzwa Mahachi రాసిన ‘The Grim Escape’ అనే కథని తెలుగులో అందిస్తున్నారు అత్తలూరి విజయలక్ష్మి. [/box]

[dropcap]ఆ[/dropcap]రోజు రోజూ కన్నా త్వరగా గడిచింది. సంధ్యా సమయపు చల్లని గాలి అనుకోని అతిథిలా వచ్చి పలకరించింది. వెన్నులో నుంచి చలి ఒళ్ళంతా పాకి, నా వేళ్ళు అర్థరైటిస్ వచ్చినట్టు వణకసాగాయి. వేరుశనగ పప్పు ఒలిచి సంచీలు నింపుతున్నాను. నా కిచ్చిన టార్గెట్ వంద సంచీలు. ఇప్పటికి ఎనభై ఐదు సంచీలు మాత్రమే నింపాను. ఇంకా పదిహేను మిగిలి ఉన్నాయి. ఇదివరకు నేను రాత్రంతా పని చేయగలిగేదాన్ని నా కోటా పూర్తి చేయడానికి. నా కాఫీ బ్రౌన్ జాకెట్ నా దగ్గర ఉంది. అది నా తండ్రి నుంచి వారసత్వంగా పొందాను. కాకపొతే ఆయన మరణించిన తరవాతే నేనా జాకెట్ తీసుకోడానికి అనుమతి ఉంది. అది నన్ను అనేక చల్లని పగళ్ళు, రాత్రులు కాపాడింది.

“త్వరగా కానివ్వండి సోమరిపోతులారా, నేనిక్కడ రాత్రంతా ఉండలేను..” ఫోర్మన్ కిజితో (Kizito) హెచ్చరించాడు. అతని పదునైన ఆ మాటలు నన్ను ఉద్దేశించే అని నాకు తెలుసు. ఎందుకంటే నాతోపాటు పనిచేస్తున్న మిగతావాళ్ళు అందరూ చాలా కరకు తేలిన పురుషులు. వారంతా చిన్నప్పటి నుంచి పొలాల్లో పెరిగారు.. ఒకరిని ఒకరు బాగా ఎరుగుదురు. వాళ్ళకి ఫోర్‌మన్‌ని పొగడి ఎలా తమకి అనుకూలంగా మార్చుకుని పని ఎగ్గొట్టాలో తెలుసు. మధ్యాహ్నం లోపలే పని పూర్తి చేసుకుని ఇవాళ బోలెడు పని చేసాము ఇంక చాలు అని సంతృప్తి చెందే మనుషులు వాళ్ళు. మిగతా సమయం చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుని ఆనందిస్తారు. కబుర్లు చెప్పుకుంటూ, మహు, స్కుడ్ వంటి పానీయాలు తాగుతూ ఫార్మ్ లోపలి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు ఎవరి భార్య? ఎవరితో ఎవరున్నారు? వంటి అనేక విషయాలు.. అవన్నీ వినడానికి అసహ్యంగా ఉండే విషయాలు. నన్ను హెచ్చరించిన వ్యక్తి వైపు తలెత్తి చూసాను. కాలు సగం వరకు గం బూట్స్ ధరించి ఉన్నాడు. నల్లని అతని పెదవుల నుంచి సిగరెట్ ఆఖరి దమ్ము పీల్చి వచ్చినట్టు అతని నుంచి వాసన వస్తోంది. నా భావాలని బలపరుస్తూ అతను సిగరెట్ పీకను కింద పడేసి బూటు కాలితో నలిపేశాడు. అతన్ని, అతని నవ్వునీ చూస్తుంటే నాకు భయం కలిగింది.. ఆ నవ్వులో స్వచ్ఛత లేదు… అసూయ కనిపిస్తోంది.

“దాదాపు అయిపొయింది” సంచీ నింపుతూ అన్నాను. బహుశా నేను అతనికి ఒకటో, రెండో కాయిన్స్ ఇచ్చి ఉంటే ఆనందించేవాడేమో!

కానీ ఎక్కడి నుంచి తీసుకురాను! వాస్తవానికి నేను నగరానికి వెళ్లి జీవించడానికి కావలసిన డబ్బు పోగు చేసుకుంటున్నాను. నా బస్ చార్జీలు, రూమ్ అద్దె, రెండు నెలల పాటన్నా ఉండడానికి తిండి – వీటికోసం నేను ఇంకా కనీసం ఒక నెల రోజులన్నా ఫార్మ్‌లో పని చేయాలి. ఇదంతా మొదటి నుంచీ నా ప్రణాళిక.

మా అమ్మ కొద్ది నెలల క్రితం చనిపోయింది. మా మావయ్యలు ఎవరూ కూడా నేను ఒక మనిషిని అని గుర్తించలేదు. వాళ్ళు నేను పుట్టిన దగ్గరనుంచి ఏనాడూ నన్ను ప్రేమించలేదు.. ఎప్పుడూ వాళ్ళు నా మీద వ్యతిరేక భావన కలిగి ఉన్నారు. మా అమ్మ చెవా కుటుంబానికి చెందినది. ఆమె మాస్వింగో (Masvingo) స్కూల్‌కి వెళ్ళినప్పుడు మా నాన్న న్యావోని (Nyawo) హస్టింగ్స్‌లో కలిసింది.

మా నాన్న వాళ్ళు నరమాంసం తినే జాతి అని, చెవా జాతికి చెందిన తన కూతురుని ఒక మంత్రగాడి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయనని మా అమ్మమ్మ అభ్యంతరం తెలిపింది. అప్పటికే నేను మా అమ్మ గర్భంలో ఉన్నాను. మా అమ్మ, నాన్న కుటుంబసభ్యుల అనుమతి లేకుండానే వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు. నా జన్మ యక్షిణిల శాపం ఫలం అనిపించేది… ఇది నిజం.. ఎందుకంటే నేను తప్పటడుగులు వేస్తున్నప్పుడే మా నాన్న ఒక ప్రమాదంలో మరణించాడు. ప్రతిరోజూ రాత్రి కన్నీళ్లు గుండెల్ని తడిపేస్తుండగా మా అమ్మ ఈ చరిత్ర కథలుగా చెబుతూ ఉండేది. ముందు ఈ కథ చెప్పాక వేరే కథలు చెప్పేది.. అవన్నీ నాకు పీడకలలుగా వస్తుండేవి. ఆఖరికి అమ్మపాలు కూడా నాకు శాపమే అయాయి.. ఎందుకంటే అమ్మకి అప్పటికే కేన్సర్ వచ్చింది. శాపగ్రస్తుడిని అయిన నన్ను వదిలి మా అమ్మ అస్తమించింది.

నిజానికి న్యావోస్ (Nyavos) వాళ్ళు మంత్రగత్తెలు, మంత్రగాళ్ళు అయి ఉంటే నా రాత సరిగా ఉండేది. కానీ, ఆ విషయంలో కూడా నాకు అన్యాయమే జరిగింది. కనీసం మా మావయ్యలు నేను తిన్న ప్లేట్‌లో భోజనం చేసేవాళ్ళేమో, నన్ను కుష్టు రోగిగా చూడకుండా. నన్ను ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించారు. వాళ్ళు తినగా మిగిలిన అవశేషాలు పెట్టేవాళ్ళు, కుక్కకు పెట్టినట్టు. దౌర్భాగ్యుడు, కురూపి, డోఫా ఇవన్నీ నాకు వాళ్ళు పెట్టిన పేర్లు.. జీవితం పారేసిన నిమ్మచెక్క కనక అయితే, దాని నుంచి నిమ్మరసం తయారు చేయమని మా అమ్మ చెప్పింది.. నేనింకా రెసిపీ నేర్చుకోవాలి. మా అమ్మ నాకు మిగిల్చినది ఒక నోట్… అందులో ఇలా రాసి ఉంది. “నీ జీవనాన్ని ఫార్మ్స్‌లో వెతుక్కో…”

ఒక వేసవి ఉదయం ఆమె న్యాయాల అడవిలో ఒక అగ్ని ఏర్పాటు చేసింది. అక్కడ నుంచి తిరిగి వస్తూ నేను ఒక చెడువార్త విన్నాను. ఒక వేటగాడు ఆ చెడువార్త తీసుకుని వచ్చాడు. తను చూసిన ఒక భయానక దృశ్యం గురించి చెప్పాడు. అది మా అమ్మ నిర్జీవంగా నేల మీద పడి ఉండడం చూసాడు.. ఆమెని సంప్రదాయబద్ధంగా సమాధి చేయడానికి తీసుకుని వచ్చాడు. వదనం పూర్తిగా మారిపోయింది. కేవలం ఆమె ఒంటి మీద ఉన్న దుస్తుల ద్వారా మాత్రమే ఆమెని గుర్తించ గలిగాము. అదే రోజు ఆమెని దహనం చేసారు.

నా శాపాలు మరికొన్ని పెరిగాయి. ప్రతిరోజూ ఆమె సమాధి వద్ద కూర్చునే వాడిని. అది మా గుడిసెకి ఐదు అడుగుల దూరంలో ఉండేది. ఆమె రహస్యంగా చెబుతున్న ఎన్నో కబుర్లు గాలులు మోసుకుని వచ్చేవి. ఆమె పాడిన జోలపాటలు వినిపిస్తూ ఉండేవి. కొన్ని సార్లు ఆమె నాకు కొన్ని విలువైన సలహాలు ఇస్తూ ఉండేది. కొన్ని సార్లు విధి నా మీద ప్రయోగించిన ట్రిక్స్ నుంచి కొత్త విషయాలు నేనే నేర్చుకోడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. అప్పుడు నా వయసు పన్నెండు సంవత్సరాలు కానీ జీవితం సుదీర్ఘంగా సాగినట్టు అనిపించేది. నా రాత ఎలా ఉంది… నా గమ్యం ఏమిటి అనే ప్రశ్న వెంటాడేది.. నాకు మరణం ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థించే వాడిని. అమ్మని చేరాలని నా సమాధి నేనే తవ్వుకున్నాను.. మా అమ్మ సమాధి పక్కన. తరవాత అర్థమైంది మరణం అనేది జీవించాలి అనుకునే వాళ్లకి మాత్రమే లభిస్తుంది.

చీకటి పడుతోంది.. కిజితో (Kizito) సంతోషంగా లేడు. మేము రోజంతా కష్టపడి నింపిన వేరు శెనగల సంచులు సేకరించడానికి రావాల్సిన ట్రాక్టర్ ఎందుకు రాలేదో అది ఎక్కడ ఉందో తెలుసుకోడానికి వాకీ టాకీ వద్దకు వెళ్ళాడు. ఇది నన్ను అనుమతించడానికి మరో కోణం. మరో గంటలో వస్తానని డ్రైవర్ అనుమతి కోరాడు. అది చాలు పూర్తి కావడానికి అనుకున్నాను.. నా తోటి వర్కర్స్ ఒకొక్కరే కిజితో వద్దకు వెళ్ళారు.. వాళ్ళని పరీక్షించి పంపిస్తున్నాడు. నాకు తెలుసు నేనెప్పుడూ చివరే ఉంటాను. నేను ట్రాక్టర్ కోసం తప్పనిసరిగా వేచి ఉండాలి.. ఎందుకంటే నన్ను ఫార్మ్ హౌస్ దగ్గర దింపేస్తే అక్కడి నుంచి ఐదు కిలో మీటర్లు నేను నడవాలి. ఇది నాకు సహనంగా ఉండేందుకు దోహద పడింది.

“యంగ్ మాన్” కిజితో పచ్చని పళ్ళు కనిపించేలా చూస్తూ చెప్పసాగాడు. “ఈ ప్రదేశం మీ కోసం కాదు..” నా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు “నువ్వు సిటీకి వెళ్ళు.. ఈ వారం అక్కడ మంచి ఆఫర్స్ ఉన్నాయి. కనీసం నీ శక్తిని ఉపయోగించగలుగుతావు. ఇక్కడి వాళ్ళు కష్టపడి పని చేస్తారు.. అక్కడ వాళ్ళు తెలివిగా పని చేస్తారు…” చివరిగా తను చెప్పాల్సిన మాట చెప్పాడు.

నేను అధిగమించలేని పరిస్థితి ఎదుర్కోడానికి సిద్ధమై బులావాయో అనే నగరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నాకు గత్యంతరం లేదు. నేను అక్కడికి వెళ్ళడానికి ఎంతో కష్టపడి డబ్బు దాచుకున్నాను. ఇంక నన్నేది ఇంకా ఆపలేదు. నా బట్టలన్నీ ప్లాస్టిక్ షాపింగ్ బాగ్‌లో సర్దుకున్నాను. ఫార్మ్ నుంచి రెండు టీ షర్టు పొందడానికి చేసిన ప్రయత్నం ఫలించింది. రెండు కూడా కొత్తగా బాగున్నాయి రెండిటి మీద వేరుశెనగ పప్పుల ప్రకటన ఉంది. మా పిన్నమ్మ గత ఏడాది క్రిస్మస్ ఫ్లోర్ బాగుతో కుట్టించిన రెండు క్రిస్మాస్ పాంట్‌లు కూడా తీసుకున్నాను. నది దగ్గరకు వెళ్లి సుబ్బరంగా కాళ్ళు బ్రష్‌తో తోమి కడుక్కున్నాను. నేను నిష్క్రమిస్తున్న రోజు. నాకది పండగరోజు, సిటీలో జీవించడానికి అక్కడి భాష నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాను. జోడియాక్ రేడియో స్టేషన్‌లో భాష నేర్పించడానికి మంచి డిజెలు ఉన్నారు. నాకు తెలిసిన భాషలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి నా మీద మంచి అభిప్రాయం కలిగించాలని అనుకున్నాను. ఆకాశ హర్మ్యాలు నిర్మించుకుంటూ గడపద్దని, కష్టపడాలని నాకు నేను ప్రమాణం చేసుకున్నాను. మా అమ్మ దాచిన కొన్ని కాగితాలు కనిపించాయి. అందులో ఉత్తరాలు ఉన్నాయి, అవి చదివాను. అవి మా అమ్మకు నాన్నకు మధ్య నడిచిన ప్రేమ లేఖలు. కొన్ని ఇప్పటికీ కొత్తగా ఉన్నాయి. గులాబీ రంగు కాగితం ఒకటి కనిపించింది. అది కొత్తగా, మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంది. అది కూడా చదివాను, ఒక దగ్గర ఆగిపోయాను. ఆ అక్షరాలు నాకు సంబంధించినవిగా అనిపించాయి. ‘త్వరలో మనం మళ్ళీ కలుద్దాం’ అని ఉంది. ఆ పదం నాకు తెలియని కొత్త విషయాన్ని చెప్పినట్టు అనిపించింది. నాకు తెలియని కొత్త బంధం ఏదో ఉందని నా మనసుకి అనిపిస్తోంది. ఒకవేళ ఈ పదాలు నాన్న డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు రాసి ఉంటే ఆయన తన కుటుంబాన్ని తిరిగి పొందుతానని ఎలా అనుకుంటాడు. బహుశా ఆ గులాబీరంగు కాగితం హాస్పిటల్ నుంచి రాసి ఉంటాడు. ఎందుకలా రాశాడు? తిరిగి జీవిస్తానని అనుకున్నాడా! అదే అనుకుని ఉంటే త్వరగా అనే పదానికి న్యాయం చేసి ఉండేవాడు కదా..

కానీ ఆ చేతి రాతలో చనిపోతున్నప్పుడు కనిపించే బాధ, దుఖం ఆవేదన కనిపించలేదు…. జరిగిన ప్రమాదం ఆయన గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. మా అమ్మ అకాల మరణం మా నాన్న కోరిక అయి ఉంటుందా.. అదే నిజమైతే నేను కూడా త్వరలో మరణించబోతున్నాను. ఎందుకంటే నేను లేకుండా వాళ్ళ కుటుంబం పరిపూర్ణం కాదు కదా! కుతూహలంగా ఆ లెటర్‌ని బ్యాగ్‌లో పెట్టుకున్నాను. నాకు మరణం రాసి పెట్టి ఉందా! ఈ ప్రశ్నకి నిశ్చయమైన సమాధానం మాత్రమే రావాలి. మా తల్లి తండ్రుల మరణం రహస్యం అయితే నేను దానికి అతీతుడిని కాను.. నేను చనిపోయి నా కుటుంబాన్ని కలుసుకోవచ్చు..

నా జీవితం నాశనం అవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నేనెందుకు దురదృష్టవంతుడిని అయాను, నా మావయ్యలు ఎందుకు నేను శాపగ్రస్తుడిని అన్నారు అనే వాస్తవాలను వివరిస్తుంది. ఒకవేళ వాళ్ళ కరెక్ట్ అయితే న్యావోస్ చెడ్డవాళ్ళు అయి ఉంటారు.. మరి మా అమ్మ ఎలా నాగరికురాలు అయింది. బహుశా చదువు ఆమె కళ్ళు తెరిపించి ఉండచ్చు కానీ శాపగ్రస్తురాలిని చేసింది.. ఆమె వాళ్ళ తల్లితండ్రుల మాట విని ఉండాల్సింది.

మా నాన్న మాంత్రికుడు అయినా మమ్మల్ని సందిగ్ధంలో వదిలేసాడు. ఆయన కుటుంబం మాత్రం మాజికల్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. మాకున్న కొన్ని నమ్మకాలతో శత్రువుని కొట్టి అతనిలో జ్ఞానాన్ని కలిగించగలమా! సుడిగాలి సృష్టించి పొరుగువాళ్ళ పంట దొంగిలించవచ్చు.. చనిపోయి కూడా అదృష్టాన్ని నిర్ణయించవచ్చు.

మన దేవుళ్ళు బలహీనులు.. ఇదంతా పవిత్రమైన గుళ్లని నిర్మించే ముందు నిర్ణయించాలి. ఇదంతా సాధ్యమే.. అనుకుని ఈ మార్గం మనం ఇష్టపడ్డాము. భయం అనేది తప్పనిసరి. అది మనలను పిరికి వాళ్ళుగా నిలబెట్టింది. ప్రశ్నలు ఉదయించే ముందు సమాధానాలు ఎదురుచూస్తూనే ఉంటాయి.

చదువు రీజనింగ్‌ని చంపేసింది. మన ఆలోచనా ధోరణిని మార్చింది, మన సృజనాత్మకతని చంపేసింది. మన దగ్గర చాలా సమాధానాలు లభిస్తున్నప్పుడు చదువు దారి తప్పకుండా మంచి దారి చూపించింది. నమ్మకాన్ని ఒక కొలబద్దతో భాగించుకుంటే కొలతలకు అందనిది భక్తి హీనం అవుతుంది. ఆ విధంగానే విద్య విముక్తికి బానిసలను చేసింది. ఒకరిని హింసించడంలో ఆనందం పొందాము. ఏదైనా తెలుసుకోవడం బోరింగ్. Nyavo… మా నాన్న తన ప్రేమికురాలిని ఇలాంటి మాటలతో ప్రోత్సహించాడు అని అనిపిస్తోంది నాకు. మనం చెప్పే విషయంలో అర్థం ఉంటే అది మానవత్వం … లేకపోతే అర్థం లేకపోవడం..

గొర్రె వంధ్యశాలకు వెళ్ళడం లాగా నేను ముందుకు వెళ్ళే సాహసం చేశాను. నా గదిలో నుంచి బయటకు వెళ్ళే ముందు మొదటి సారిగా ప్రార్థించాను. దీపం బలహీనంగా వెలుగుతోంది. బయట చీకటిగా ఉంది. నా చిన్ని గుడిసె నన్ను బలవంతంగా తోసింది. సోమవారం ఉదయం బయలుదేరి శుక్రవారం తిరిగి వచ్చే బస్సు ఒకటి ఉంది. దాన్ని పట్టుకోడానికి బయలుదేరాను. అది మిస్ అయితే వారం మొత్తం ఎదురు చూడాలి అని గుర్తు చేసుకుని బయలుదేరాను. ఇంతలో నా గుడిసె తలుపు సందుల్లోంచి ఒక బలిష్టుడైన వ్యక్తి తలుపు తట్టడం కనిపించింది. ఒక గంభీరమైన స్వరం నన్ను పేరుతో పిలిచింది. ఆ స్వరం ఎవరిదో నాకు చిరపరిచితం, కానీ నమ్మలేకపోయాను. అది కిజితో స్వరం. తలుపు వెనకాల అతను.. అతని వెనక చీకటి. “నీకు తోడుగా ఉండడానికి వచ్చాను” అన్నాడు. “నువ్వు ఈ చీకట్లో ఉండడానికి నీకు ధైర్యం లేదు.. గాడ్ ఫాదర్‌లా నటించడానికి నిర్ణయించుకున్నాను” అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను ఎందుకింత శ్రద్ధ నా మీద.. “నేను ఫార్మ్‌లో నీతో చాలా కఠినంగా ఉంటాను. అందుకే నువ్వు సిటీకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నావని తెలుసు.. అందుకే” అంటూ అతని ప్యాంటు జేబులో నుంచి ఒక కవర్ పైకి తీసాడు. అది తీసుకో అన్నట్టు సంజ్ఞ చేసాడు. తీసుకున్నాను. ఏది ఏమైనా అప్పటికప్పుడు అది ఓపెన్ చేయద్దని నిర్ణయించుకున్నాను.

కొంత సమయం తరవాత నేను బులావాయో ప్రయాణం అయాను. బాగా అలసిపోవడంతో ప్రయాణంలో బాగా నిద్రపోయాను. ఎలా నిద్రపోయాను? ముందు, ముందు ఏం జరుగుతుందో అన్న భయం కలుగుతోంది. నా వెనకాల పాంట్ పాకెట్ బరువుగా అనిపించింది… కిజితో ఇచ్చిన ఎన్వెలప్.. ఆ సర్ప్రైజ్ ఏమిటో తెలుసుకోడానికి ఇదే సమయం… ఆశ్చర్యం అది 500 క్వచ (kwacha) నోట్.. ఒక సింగల్ ప్లేట్ సద్దా కొనడానికి సరిపోతుంది. అది కాక ఒక ఇంటి అడ్రస్ రాసి ఉన్న కాగితం.. కిజితో నాకు ఈ వివరాలు ఇస్తాడని ఎలా ఊహిస్తాను.. బహుశా నేను అతను ఇచ్చిన డబ్బుతో, ఆ అడ్రెస్‌లో ఇల్లు తీసుకోవాలి అని కాబోలు. ఆరు గంటల ప్రయాణం తరవాత నేను మచింగో విలేజ్ నుంచి బులావాయో చేరాను. నేను ఊహించిన దానికి విరుద్ధంగా బస్సు డిపో గోలగా ఉంది. మినీ బస్సు డ్రైవర్లు చాలా నిర్లక్ష్యంగా నడిపిస్తున్నారు. అమ్మకందార్లు గొర్రెలను సజీవంగా తీసుకువచ్చి మార్కెట్‌లో అమ్ముతున్నారు.. వాటి మీద దోమలు లయబద్ధంగా సంగీతం పాడుతూ ముసురుకుంటూ పరిసరాల్లో తిరుగుతున్నాయి. అమ్మకందార్లు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు వాటిని తోలకుండా. అవి కూడా కాలుష్యం వ్యాప్తి చేయాలా వద్దా అని అయోమయంలో ఉన్నట్టు తిరుగుతున్నాయి.

ముగ్గురు వేరే, వేరు వ్యక్తులను ఏరియా 10 టెర్మినస్‌కి వెళ్ళడానికి దారి అడుగుతూ వెళ్ళాను. ముగ్గురూ ఒకే దారి చూపించారు. జనాన్ని తోసుకుంటూ, తొక్కుకుంటూ ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘిస్తూ పరిగెత్తాల్సి వచ్చింది. చివరికి నేను చేరవలసిన గమ్యం చేరుస్తుంది అని నమ్మి చిలుము పట్టిన ఒక మినీ బస్సు ఎక్కాను. కొంతసేపటికి “ఇదే నీ స్టాప్” అన్నాడు ఒక యువకుడు. కండక్టర్ గట్టిగా అరిచాడు బస్సు ఆగగానే. నేను ఆ మురికి బస్సు నుంచి దూకాను. ఆశ్చర్యం! ఎదురుగా మా అమ్మ కనిపించింది. ఆమె పక్కన మా నాన్న కూడా. బహుశా ఆ సమయంలో నిద్రపోయి ఉంటే నిజంగా చచ్చిపోయేవాడిని.. చనిపోయి ఉంటే ఈ భూమ్మీద ఎలా ఉంటాను.

***

పారిపోవాలనుకున్న ప్రణాళిక విజయవంతం అయింది. కిజితో కూడా మా తండ్రి వైపు నుంచి నాకు బంధువే.. అతను మా అమ్మ మరణానికి ఒక పెద్ద మనిషి ముసుగువేసుకున్న వేటగాడు. అతను నన్ను గమనిస్తూ నేను నిష్క్రమించడాన్ని వేడుక చేసుకున్నాడు. నా చుట్టూ మిస్టరీ ఉంది అది ఏమిటో నాకు తెలియదు. ఆ ఉత్తరంలో రాసినట్టు మా కుటుంబం కలిసింది. మాలో ఎవరూ మరణించలేదు. ప్రేమకున్న శక్తి మరణానికి లేదు.. బ్రెస్ట్ కాన్సర్ అనేది పారిపోడానికి వేసిన ప్లాన్. ఇక్కడి నుంచి ఇంకో ఎపిసోడ్ మొదలు అవుతుంది.

న్యావోస్ మాంత్రికులు కాదు… అసలు మాజిక్ అనేది లేదు… మన కళ్ళు దేన్నీ చూడాలని అనుకుంటాయో అదే చూస్తాయి.

***

మూలం: Tafadzwa Mahachi

తెలుగు: అత్తలూరి విజయలక్ష్మి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here