బహుముఖ ప్రజ్ఞాశాలి నూతన్ సమర్థ్ బహల్

12
3

[dropcap]4[/dropcap]-6-2021 తేదీ నూతన్ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ప్రముఖ బాలీవుడ్ సినిమా నటి, గాయని, కవయిత్రి, భజన్ల గాయని, అగ్ర కథానాయకులందరి సరసన నటించి, జీవించి, మెప్పించిన నటీమణి, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను పొందిన పద్మశ్రీ నూతన్ సమర్థ్ బహల్. వీరి కుటుంబం యావత్తు – తల్లిదండ్రులు, సోదరీసోదరులు, వారి పిల్లలు, స్వయాన నూతన్ కుమారుడు అందరూ సినీ ప్రపంచాన్ని సొంతం చేసుకున్నవారే! వీరి భర్త కూడా సినిమా నిర్మాణంలో పాల్గొన్నారు.

వీరు 1936 జూన్ 4వ తేదీన నాటి బొంబాయి ప్రెసిడెన్సీ నేటి మహారాష్ట్రలో జన్మించారు. తల్లిదండ్రులు శోభనా సమర్థ్, కుమారసేన్ సమర్థ్. వీరు మరాఠీ కుటుంబీకులు. తల్లిదండ్రులు సినిమా పరిశ్రమకు చెందినవారు.

నూతన్ పంచగని లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్‌లో చదివారు. తరువాత స్విట్జర్లాండ్ లోని లాచటెలైన్ స్కూల్లో చదివి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

వీరు బాలనటిగా నటించిన తొలి చిత్రం హమారా బేటి, ఈ చిత్రానికి దర్శకురాలు వీరి తల్లి శోభన సమర్థ్. 1940ల మధ్యలో నలదమయంతి సినిమాలో కూడా బాలనటిగా కన్పించారు.

స్విట్జర్లాండ్‌లో చదువు ముగించుకుని తిరిగి వచ్చాక సీమా, హీరో, బరీష్, పేయింగ్ గెస్ట్, కన్హయ్య, బందిని, యాద్గార్, కస్తూరి, పైసా మే పైసా, కర్మ, దిల్లీ కా థగ్, మిలన్, హమ్ లోగ్, నగీనా, సౌదాగర్ మొదలయిన సినిమాలలో నాయికగా, గుణచిత్రనటిగా పాత్రలను పోషించారు.

4 దశాబ్దాల సినీ జీవితంలో 70కి పైగా సినిమాలలో నటించి గొప్ప పేరు ప్రతిష్ఠలను సంపాదించారు. నవరసాల పాత్రలను అవలీలగా పోషించారు. కథానాయిక నుండి తల్లి పాత్రల వరకు అద్వితీయమైన నటన వీరి సొంతం.

1955లో ‘సీమా’ సినిమాలో పోషించిన అనాథ యువతి పాత్ర ఎనలేని పేరు తెచ్చింది. బలరాజ్ సహానితో పోటీపడి నటించిన ఈ చిత్రానికి మొదటిసారి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును పొందారు. ఈ చిత్రం లోని ‘తూ ప్యార్ కా సాగర్ హై’ పాట ఈనాటికీ ప్రేక్షక శ్రోతలను అలరిస్తూనే ఉంది.

వీరు భారత హిందీ సినీ చరిత్రలో పేరు పొందిన మహానటులు శ్రీయుతులు బలరాజ్ సహాని, అశోక్ కుమార్, రాజకపూర్, దేవానంద్, సునీల్ దత్, దిలీప్ కుమార్, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ మొదలయిన వారందరితోను నటించి ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్నారు. నటీమణులు సాధన, స్మితాపాటిల్ వీరిని రోల్ మోడల్‌గా ఆరాధించడం విశేషం.

“వీరిని మించిన నటీమణులు ముందు ముందు రావడం కష్టమని” సంజయ్ లీలా భన్సాలీ శ్లాఘించారు. మూడేళ్ళ బాల్యంలోనే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ‘కథక్’ నృత్యాన్ని నేర్చుకున్నారు.

మోడల్, సినిమానటి, గాయకురాలు, సంగీత దర్శకురాలిగా (భజన్స్)కి పనిచేశారు. 1980 తరువాత భజనలు వ్రాసి, స్వరరచన చేసి ఆలపించారు.

1965లో విడుదలయిన ‘ఖాన్‌దాన్’ సినిమాలో “తుంహి మేరే మందిర్ తుమ్హి మేరే పూజ” పాట లతాజీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందించింది.

వీరు సాంప్రదాయక దుస్తులకే ప్రాధాన్యతనిచ్చారు. అయితే 1958 లోనే ‘దిల్లీ కా థగ్’ సినిమాలో స్విమ్ సూట్ ధరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

1960లో ‘చబిలి’ సినిమా కోసం “ఆయే మేరే హమ్సఫర్ ” పాటను స్వయంగా వ్రాసి ఆలపించారు. ఈ విధంగా సినిమా పాటల రచయిత్రిగా, గాయనిగా చరిత్రను సృష్టించుకున్నారు.

1957లో సీమా, 1960లో సుజాత, 1964లో బందిని, 1968లో మిలన్, 1979లో తులసీ తేరే అంగన్‌రీ సినిమాలలోని నాయికా పాత్రల నటనకు వీరు ఫిల్మ్‌ఫేర్ అవార్డును పొందారు.

1978లో ‘మేరీజంగ్’ ఉత్తమ సహాయనటి పాత్రకు మరోసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. ఈ విధంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల స్వీకరణలో రికార్డు సృష్టించారు.

సంభాషణా చాతుర్యం కంటే ముఖ భావ వ్యక్తీకరణ అద్భుతమనే ప్రశంసలను అందుకున్నారు.

BEJA (Bengal Film Journalists Association) వారి అవార్డులను 1964లో ‘బందిని’, 1968లో ‘మిలన్’, 1974లో ‘సౌదాగర్’ సినిమాల్లోని నాయిక పాత్రలకు అందుకున్నారు.

1974లో భారత ప్రభుత్వం వారి చేత ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. 2011లో రెడిఫ్.కామ్ ‘ఆల్-టైమ్’ 3వ గొప్పనటిగా ఎంపికయ్యారు. 2010లో ఫిల్మ్‌ఫేర్ వారు నూతన్ నటనను ’80 ఐకానిక్ ఫెర్మామెన్స్’లో చేర్చి గౌరవించారు. 2013లో భారతీయ సినిమా శతవసంతాల సందర్భంగా వీరి నటన ప్రశంసించబడింది.

వీరి జీవిత చరిత్రను “నూతన్ అసెన్‌మి నాసేన్‌మి” అనే పేరుతో ‘లలితా తమ్హనే’ గ్రంథస్థం చేశారు.

బుల్లితెరని కూడా వీరు అలరించారు. ‘ముజ్రమ్ హజీర్ ‘ అనే సీరియల్ లో ‘కలిగంజ్ కి బహు’ గా నటించి బుల్లి తెర ప్రేక్షకుల నీరాజనాలను అందుకున్నారు.

వీరి కిష్టమైన సినిమా ‘బందిని’. ఆ పాత్రను తన నటనతో సుసంపన్నం చేశారు.

తన జీవితంలో ‘సంతోషంగా గడిపింది స్విట్జర్లాండ్‌లో ఉన్న కాలమే’ అని ముక్కుసూటిగా, నిర్భయంగా చెప్పగలిగిన ధైర్యం ఆమెది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఇటువంటి అనుభవం కలిగి ఉండడం అతిశయోక్తి కాదు.

1959లో లెఫ్టినెంట్ కమాండర్ రజనీష్ బహల్‌తో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు.

కుటుంబంతో సంతోషంగా ఉన్న సమయంలో రొమ్ము క్యాన్సర్ మహమ్మారి వీరిని సోకింది. 1991 ఫిబ్రవరి 21వ తేదీన బొంబాయి లోని బ్రీచ్‌కాండీ హాస్పిటల్‌లో మరణించారు.

వీరి జ్ఞాపకారం 2011 ఫిబ్రవరి 13వ తేదీన 5 రూపాయల విలువతో స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.

జూన్ 4 వ తేదిన వీరి జయంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here