అవినీతి రాజకీయ అంతం చూపిన సినిమా ‘హరిశ్చంద్రుడు’

0
3

[dropcap]మే[/dropcap] 20 న కరోనాతో మరణించిన తెలుగు ఫిల్మ్ నిర్మాత, దర్శకుడు యు. విశ్వేశ్వరరావు గారు కమర్షియల్ సినిమా రాజ్యం ఏలుతున్న రోజుల్లో తాను నమ్ముకున్న ఆదర్శాల కనుగుణంగా సినిమాలు తీసారు. అలా సినిమాలు తీయడానికే ఒక సంస్థను స్థాపించారు. అదే విశ్వశాంతి నిర్మాణ సంస్థ. విశ్వశాంతి అన్న పేరు మీద తీసిన చిత్రాలలో సామాజిక స్పృహకు పెద్ద పీట వేస్తూ చాలా మంచి చిత్రాలు వచ్చాయి. కాని మంచి చిత్రాలను చూసే ప్రేక్షకులు తెలుగులో ఎప్పుడూ తక్కువే. అందువలనే మంచి చిత్రాలెన్నో కొంత మంది కష్టపడి ఇష్టపడి తీసినా నేడు అవి మరుగున పడిపోయాయి. ఆ కారణం తోనే వీరి సినిమాలు చాలా వరకు ఇప్పుడు లభ్యం అవట్లేదు ఏ ప్లాట్‌ఫార్మ్‌ల మీద కూడా. యూట్యూబ్‌లో రెండు మూడూ సినిమాలు మాత్రం మిగిలాయి. అలా చూసిన సినిమా ‘హరిశ్చంద్రుడు’. ఈ సినిమా ఆ రోజుల్లో ఆడిందో లేదో తెలీదు కాని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా తీసిన చిత్రం ఇది. రాజకీయ నాయకులు దేశాన్ని ఎంతగా కలుషితం చేస్తున్నారో చెప్పిన చక్కని చిత్రం. ఎన్నో వందల మందికి అన్యాయం చేసి ఆఖరికి వారు కుక్క చావు చావడం తప్ప తమకోసం కన్నీరు చిందించే ఒక్క వ్యక్తినీ సంపాదించుకోలేని ఒంటరి బ్రతుకులు వారివి. అటువంటి ఒక రాజకీయ నాయకుని జీవితాన్ని చూపించిన చక్కని చిత్రం ‘హరిశ్చంద్రుడు’. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి పేరు తెలుసుకుందాం అని ప్రయత్నించినా ఎక్కడా లభించలేదు. యూ ట్యూబ్‌లో నేను చూసిన సినిమా ప్రింట్‌లో టైటిల్స్ ముందు కొంత కట్ అయిన కారణంగా వారి పేరు తెలుసుకోలేకపోయాను. ఆయన మరే సినిమాలో కూడా నాకు కనిపించలేదు. స్టేజీ నటుడు అయి ఉండవచ్చని పించింది.

పరమేశ్వరరావు ఒక రాజకీయ నాయకుడు. అతనికి భార్య ఒక కూతురు. అతనో స్త్రీ లోలుడు. భార్యకు ఆ సంగతి తెలిసి మనోవ్యథతో నిత్యం అనారోగ్యంతో బాధ పడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో పనిమనిషి మాణిక్యం. ఇంట్లో పనులన్నీ చక్క బెట్టుకుంటూ పరమేశ్వరరావు కూతురు విజ్జీని కంటికి రెప్పలా కాపుడుకుంటూ నిత్యం అనారోగ్యంతో బాధపడే అమ్మగారికి అన్నీ తానే అయి కష్టించి పని చేసే నిజాయితీ గల పేదరాలు మాణీక్యం. అదే ఇంట్లో తోట పని చేసే గోపాలాన్ని ఈమె పెళ్ళి చేసుకుంటుంది. ఇద్దరూ పనీ పాటలతో ఆ ఇంట్లో గడుపుతుంటారు. పరమేశ్వరరావుకి నిత్యం స్త్రీ సాంగత్యం అవసరం. భార్య వద్దకు మాత్రం వెళ్ళడు. ఒకే ఇంట్లో ఉంటున్నా భార్యకు అతను కనపడడు కూడా. వావి వరసలు లేని కామ కలాపాలలో పరమేశ్వరరావు మునిగి తేలుతుంటాడు. సంగమేశ్వరరావు అనే తన మిత్రుడి కూతురుని కూడా వదలడు అతను. సంగమేశ్వరరావు కూడా తన రాజకీయ ఎదుగుదల కోసం స్వయంగా కూతురును తీసుకుని వచ్చి పరమేశ్వరరావు ఇంట రాత్రుల్లు వదిలి వెళుతూ ఉంటాడు. రాజకీయ ఎదుగుదల కోసం ఎంత నీచంగా పదవీ కాంక్షతో నాయకులు ప్రవర్తిస్తారో ఈ సినిమాలో పదునైన సంభాషణలతో చూపిస్తారు దర్శకులు.

హరిశ్చంద్రయ్య అనే మరో నిజాయితీ పరుడైన నాయకుడు మరో ముఖ్య పాత్ర. ఇతను పరమేశ్వరరావుకు బంధువు కూడా. అతనికి ఒక కొడుకు, కూతురు. అతని కొడుకుకు తన బిడ్డ విజయనిచ్చి పెళ్ళి చేయాలని పరమేశ్వరరావు భార్య అనుకుంటుంది. తాను మరణిస్తే తన కూతురు జీవితం అన్యాయమవుతుందని ఆమె బెంగ. అందుకే కూతురు పెద్దమనిషి అయిన వెంటనే హరిశ్చంద్రయ్య కొడుకుతో ప్రధానం జరిపిస్తుంది. హరిశ్చంద్రయ్య కూతురు పరమేశ్వరరావు కూతురు విజ్జీతో పాటు కలిసే పెరుగుతుంది.

మరోసారి ఎలక్షన్లు వస్తాయి. పరమేశ్వరరావు మోసాలు తెలిసి కొందరు యువకులు అతని నిజరూపాన్ని బైటపెట్టి అతనికి విరుద్ధంగా కాన్వాసింగ్ మొదలెడతారు. అప్పటికే హరిశ్చంద్రయ్యకు పరమేశ్వరరావు అవినీతి రాజకీయం గురించి చాలా సంగతులు తెలుస్తాయి. తన బంధువు అయినా సమాజానికి అతను చేస్తున్న హాని భరించలేక, నీతివంతుడైన హరిశ్చంద్రయ్య పరమేశ్వరరావుకు విరుద్దంగా మరో నిజాయితీపరుడిని గెలిపించడానికి అతని పక్షాన, పరమేశ్వరరావుకు విరుద్ధంగా కాన్వాసింగ్ చేస్తాడు. పరమేశ్వరరావుకి ఇది పెద్ద దెబ్బ. దేనికి లొంగని హరిశ్చంద్రరావు అంటే అతనికి కోపం. ఈ లోపల పరమేశ్వరరావు భార్య అనారోగ్య కారణాలతో మరణిస్తుంది.

భార్య చనిపోయాక విజయకు తోడుగా ఆమె దుఖానికి ఉపశమనం కలిగించడానికి రాత్రుల్లు మాణిక్యం ఆమె గదిలో పడుకుంటుంది. ఆమె మీద కన్నేసిన పరమేశ్వరరావు ఆమెపై అత్యాచారం చేస్తాడు. ప్రతి రోజు ఆ నరకం భరించలేక భర్త గోపాలానికి చెప్పుకోలేక మాణిక్యం నలిగిపోతూ ఉంటుంది. గోపాలానికి ఈ విషయం చివరకు తెలుస్తుంది. కోపంతో పరమేశ్వరరవుని హత్య చేయాలనుకుంటాడు. కాని అది గ్రహించిన పరమేశ్వరరావు అతన్నీ చంపేస్తాడు. భర్తను కోల్పోయి ఏ అండ లేని మాణిక్యం పూర్తిగా ఒంటరిదవుతుంది. గోపాలం హత్య విషయం కోర్టు వరకు వెళ్ళినా పరమేశ్వరరావుకు ఆ హత్యకు ఏం సంబంధం లేదని నిర్ధారిస్తుంది కోర్ట్.

రాజకీయంగా హరిశ్చంద్రయ్య మరో వర్గానికి ప్రచారం చేస్తున్నాడని తన ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి కొందరి ఫైనాషియర్ల వద్ద డబ్బు అప్పు తీసుకుంటాడు పరమేశ్వరరావు. హరిశ్చంద్రయ్యను కొనాలని ప్రయత్నించినా అతను అమ్ముడు పోడు. బంధుత్వానికి దేశసేవకు లంకె పెట్టడు. అందుకని విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి తన గెలుపు కోసం చాలా కష్టపడతాడు పరమేశ్వరరావు. తన దారికి అడ్డు వస్తున్నాడని హరిశ్చంద్రయ్య ఇల్లు కాల్చేస్తాడు. హరిశ్చంద్రయ్య కూతురు అందులో కాలి చనిపోతుంది. భార్యకు చాలా గాయాలవుతాయి. తన పదవి కోసం ఎందరో యువ నాయకులను హత్య చేయిస్తాడు పరమేశ్వరరావు. ఈ రాజకీయ గొడవలలో పరమేశ్వరరావుతో తల పడలేక ఆస్తి పోగొట్టుకుని విరక్తితో హరిశ్చంద్రయ్య ఎలక్ట్రిక్ శ్మశానం నిర్వాహకుడిగా పని చేస్తూ ఉంటాడు. అక్కడ ఈ రాజకీయాలకు బలి అయి వచ్చే శవాలలో పరమేశ్వరరావు పాపం కనిపిస్తూ ఉంటుంది. మనుష్యులకు దూరంగా భంధుత్వాలు, ప్రేమలపై విరక్తితో కాటికాపరిగా మారిన హరిశ్చంద్రయ్య హరిశ్చంద్రుడుగా మారతాడు. అక్కడికే అతని కొడుకు శవం వస్తుంది. పరమేశ్వరరావుతో తలపడి అతని కొడుకు కూడా మరణిస్తాడు. పరమేశ్వరరావు కూతురు ఒంటరిదయి మనోవ్యథతో అంతకు ముందే మరణిస్తుంది. ఆమె మరణం కూడా పరమేశ్వరరావును కదిలించదు. ఆమె శవానికి కూడా హరిశ్చంద్రుడే అంతక్రియలు నిర్వహిస్తాడు.

పరమేశ్వరరావు రాజీకయ జీవితం కూడా మెల్లగా ముగుస్తుంది. అతను ఎలక్షన్లలో ఓడిపోతాడు. అప్పులకు ఆస్తి అంతా కరిగిపోతుంది. మాణిక్యాన్ని తాను తీసుకున్న అప్పుకు బదులుగా తార్చాలనుకుంటాడు. అయితే ఆమె ఎదురు తిరుగుతుంది. పార్టీ ఫండు మింగేసాడని అతన్నిపార్టీ నుండి బహిష్కరిస్తారు. అతనికి అప్పు ఇచ్చిన వారు ఆస్తి స్వాధీన పరుచుకుంటారు. చివరికి అతనికి మాణిక్యమే గతి అవుతుంది. ఆమె అతనికి కట్టుబడే ఉంటుంది. అతన్ని తీసుకుని తన పాత పూరింటికి వెళుతుంది. అక్కడే అతను మరణిస్తాడు. అతని శవాన్ని కాల్చడానికి డబ్బు లేక తెలిసిన వారింటికి వెళ్ళి సహాయం చేయమని ఆమె వేడుకుంటుంది. పరమేశ్వరరావు బ్రతికి ఉన్న రోజుల్లో అతని వల్ల నష్టపోయిన వారే అంతా. ఎవరికీ అతని చావు పట్ల దుఃఖం లేదు. ఆఖరికి హరిశ్చంద్రుడు వద్దకు మాణిక్యం వచ్చినప్పుడు ఆ దుష్టుడి శవానికి అక్కడ అంతక్రియలు నిర్వహించరాదని కొందరు గొడవ చేస్తే చివరకు మాణిక్యం ఒక్కతే హరిశ్చంద్రుడి సహయంతో అ శవాన్ని తాటాకులపై పడుకోబెట్టి లాక్కుంటూ సముద్రంలోకి పారవేయిస్తుంది. తిమింగలాల వంటి ఇటువంటి రాజకీయ నాయకులు చివరకు తిమింగలాలకు ఆహరం అవడమే వారికి సరైన శిక్ష అనే మాటతో సినిమా ముగుస్తుంది.

ఈ సినిమాలో పరమేశ్వరరావు పాత్ర వేసిన నటుడు పేరు నేను తెలుసుకోలేకపోయాను. అతని భార్యగా దేవిక, హరిశ్చంద్రుడుగా ప్రభాకర్ రెడ్డి, అతని భార్యగా సావిత్రి, మాణిక్యంగా జయచిత్ర నటించారు. సావిత్రి చివరి రోజులలో చేసిన సినిమా ఇది. కొన్ని సీన్లలో ఆవిడ డబ్బింగ్ కూడా ఎవరో చెప్పినట్లు అనిపించింది. సావిత్రి చాలా బలహీనంగా ఉండి ఆమెను అలా చూడడం బాధనిపించింది. జయచిత్ర ఈ సినిమాలో మొద్దు మొగుడా అనే ఒక పాటను కూడా పాడింది. హరిశ్చంద్రయ్యను హరిశ్చంద్రుడు అనే ఒక కాటి కాపరి స్థితికి తీసుకురావడం అవసరమా అనిపించినా, మనిషి జీవిన ప్రస్థానాన్ని కాటి కాపరి దృష్టి నుంచి చూపించే ప్రయత్నం దర్శకులు చేసారేమో అనిపించింది. 1980లో వచ్చిన ఈ సినిమాకి కథను యు. విశ్వేశ్వరరావు గారే సమకూర్చుకున్నారు. ఆ సంవత్సరం ఈ సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ బహుమతి లభించింది.

ఎంతమంది సతీమతల్లుల కన్నీటి ధారలు నింపుకున్నదో కదా ఈ రుద్రభూమి
ఇచ్చోటనే….ఇచ్చోటనే….!!
సత్కవీంద్రుని కమ్మని కలము
నిప్పులలోన కరిగిపోయే
ఇచ్చోటనే భూములేలు రాజన్యుల
అధికార ముద్రికల్ అంతరించే
ఇచ్చోటనే…!!
లేత ఇల్లాలి…నల్లపూసల చౌరు
గంగలో కలిసిపోయే
ఇచ్చోటనే…!
ఎట్టి పేరెన్నికల్ చిత్ర లేఖకుని కుంచేయు నశించే
ఇది పిశాచులతో…
నిటాలేక్షణుండు…నిటాలేక్షణుండు…
గజ్జ కదిలించి ఆడు రంగస్థలంబు
ఇది మరణదూతా…
మరణదూత…దీక్షణమవు దుష్టులలయ
అవని పాలించు బస్మసిమ్హాసనంబు

ఈ పద్యాన్ని ఆధారం చేసుకుని అల్లుకున్న కథ ఇది అని అనిపించింది సినిమా చూస్తున్నంత సేపు. అందుకే కథ శ్మశానంతోనే మొదలెట్టారు దర్శకులు. అందరూ చేరే ఆ ఆఖరి ప్రదేశంలో కూడా చోటు సంపాదించుకోలేనంత హీనమైన బ్రతుకులు బ్రతుకుతున్న రాజకీయ నాయకులు చివరకు సముద్రంలో తిమింగలాల పరం అవడం అన్న పాయింట్‌తో ప్రస్తుత రాజకీయ నాయకులపై ఆలోచించే ప్రజలకున్న కోపాన్ని చూపించే ప్రయత్నం ఈ సినిమాలో జరిగింది. ఏదో ఒక రోజు అందరూ కలిసేది మట్టిలోనే అని తెలిసి మనిషి ఎంత అహంకారంగా బ్రతుకుతాడు. ఎన్ని దుర్మార్గాలు చేస్తాడు. అసలు అన్ని చేసి ఏం సాధిస్తాడు. పోయేటప్పుడూ ఏం తీసుకెళతాడు. ఈ చిన్న విషయం శ్మశానంలో తప్ప ఎక్కడా మనకు గుర్తుకు రాదు, అర్థం కాదు. అందుకే ఆధునిక హరిశ్చంద్రుడి కథ ద్వారా మరో సారి ఆ సత్యాన్నే చెప్పే ప్రయత్నం చేసిన సినిమా ఇది. ఈ సినిమాకు సంభాషణలే బలం. తెలుగులో మంచి చిత్రాలను పెద్దగా ఆదరణ ఉండదు. మన వద్ద పారెలల్ సినిమా అంతగా రాణించదు. ఇది తెలిసీ కూడా జీవితానికి అతి దగ్గరగా ఉండి ప్రేక్షకులను రంజింపచేయడానికి మాత్రమే కాకుండా ఆలోచింపచేయడానికి కష్టపడి సినిమాలు తీసే దర్శకులను మనం గుర్తుకు పెట్టూకోవాలి. తమ ఆశయాలను, ఆలోచనలను మార్కెట్‌కు కుదవ పెట్టకుండా తమలాగే మిగిలిపోవడానికి మనిషికి చాలా నైతిక బలం కావాలి. అది ఉన్న విశ్వేశ్వరరావు లాంటి దర్శకులను సినిమా అనే మాధ్యమాన్ని ఒక కళారూపంగా చూడాలనుకునే ప్రతి సినీ ప్రేమికుడు గుర్తించుకోవాలి. హరిశ్చంద్రుడు అనే సినిమాను అందుకోసమే చూడాలి. ఇది యూ ట్యూబ్‌లో అనుకోకుండా దొరికింది. ఎన్నాళ్ళక్కడ ఉంటుందో తెలీదు కాబట్టీ చూడాలనుకునే వారు చూసెయ్యండి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here