[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]
[dropcap]సో[/dropcap]మర్సెట్ మామ్ శైలిని చాలా మంది తరువాతి తరం నవలాకారులు ఇష్టపడ్డారు, అనుకరించే ప్రయత్నం చేసారు. వీరి నవలన్నిటిలో అందరూ గొప్పదని చెప్పుకున్న నవల OF HUMAN BONDAGE. కాని ఒక సందర్భంలో వారు తన నవలలన్నిటీలోకల్లా తనకు బాగా ఇష్టమైనది CAKES AND ALE అని చెప్పుకున్నారు. ఈ నవల కథ గురించి చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. చాలా వరకు మామ్ తన జీవితంలో తన చుట్టూ తాను పరిశీలించిన జీవితాలనే తన నవలలో కథావస్తువుగా ఎంచుకున్నారు. అందుకనే వీరి నవలలో వచ్చే పాత్రలన్నీ కల్పితాలు కావని ఇప్పటికీ అందరూ చెప్పుకుంటారు. ఈ కారణంగానే మామ్‌ని ఇష్టపడని వారు అప్పట్లో చాలా మంది సాహిత్యకారుల్లో ఉండేవారు. ఏదో ఒక పాత్రలో తమ జీవితపు రహస్యాల్ని ఆయన బైటపెట్టేవారని వారందరి ఆరోపణ. దానికి తగ్గట్టూగానే CAKES AND ALE నవలలో ముఖ్య పాత్రలు హ్యు వాల్పోల్, థామస్ హార్డీలుల జీవితల ఆధారంగా మలచబడ్డాయి అని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. ఇప్పటికీ అదే నిజం అని చెప్తారు ఇంగ్లీష్ సాహిత్యం పై రీసర్చ్ చేసిన వారంతా.
ఈ నవలను మామ్ 1930లో రాసారు. ఇందులో ముఖ్య పాత్రలుగా కనిపించే అల్రొయ్ కియర్ పాత్ర హ్యూ వాల్పోల్ ది అని అలాగే ఎడ్వార్డ్ డ్రిఫ్ఫీల్డ్ అనే రచయిత పాత్ర థామస్ హార్డిది అని చెప్తారు విశ్లేషకులు. ఈ నవలలో కూడా ఆ పాత్రలు రచయితలు. మామ్ ఈ పోలిక అవాస్తవం అని కొట్టిపడేసినా ఈ పుస్తకం ప్రస్తావన వచ్చిన ప్రతీ సారి అందరూ థామస్ హార్డీ ప్రస్తవనే తీసుకువస్తారు.
ఈ నవలలో కథ చెప్తున్నది విలియమ్ ఆషెన్డెన్. అతను కూడా రచయితే. అతని వద్దకు వస్తాడు అల్రోయ్ కియర్ అనే మరో ప్రఖ్యాత రచయిత. ఆల్రోయ్ కియర్ లౌక్యుడు. సాహిత్య ప్రపంచంలో తన స్థానాన్ని చాలా తెలివిగా, ఆలోచనతో నిర్మించుకున్న వ్యక్తి. అల్రొయ్‌ని ఎడ్వార్డ్ డ్రిఫీల్ద్ భార్య తన భర్త జీవిత కథ రాయమని అడుగుతుంది. అది ఒక రచయితగా నిలబడడానికి తన్కొచ్చిన గొప్ప అవకాశం అనుకుని ఆ పనికి పూనుకుంటాడు ఆల్రోయ్. డ్రిఫీల్డ్ ఒక పెద్ద నవలాకారుడు. అతని మొదటి భార్య పేరు రోస్. ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయాక అతను మరో వివాహం చేసుకున్నాడు. ఆషెన్డేన్ డ్రిఫీల్డ్ తో కొంత కాలం కలిసి గడిపాడని, అతని అంతరంగం బాగా తెలిసిన వాడని అల్రొయ్ కనుక్కుంటాడు. ఆ సమయంలో డ్రిఫీల్డ్ తన మొదటి భార్య రోస్‌తో కలిసి ఉన్నాడు. రోస్ గురించి చాలా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె ఎందరితోనో తిరిగేదని, చాలా మందితో ఆమెకు సంబంధాలుండేవనీ ప్రచారంలో ఉంది. అందులో వాస్తవాలు ఎంత, డ్రిఫీల్డ్ రోస్ అనుబంధం ఎలా ఉండేదీ తెలుసుకోవాలన్నది ఆల్రోయ్ ఆలోచన. ఆ నిజాల కోసం అతను అషెన్డెన్‌ని కలుసుకుని డ్రిఫీల్డ్ తో అతని పరిచయం ఆ పుర్వపు రోజుల గురించి చెప్పమని అడుగుతాడు.
ఆషెన్డెన్ అప్పుడు మరో సారి రోస్, డ్రిఫీల్డ్ లతో తన పరిచయాన్ని గుర్తుచేస్తుకుంటాడు. వారితో సమయం గడిపినప్పుడు అతను ప్రపంచ జ్ఞానం లేని ఒక యువకుడు. రోస్ చాలా స్వేచ్చా భావాలున్న స్త్రీ. జీవితం పట్ల చాలా ప్రేమ, మనుష్యులను లోతుగా పరిశిలీంచడం ఆమె నైజం. ఆమె శారీరకంగా పెట్టుకున్న సంబంధాల గురించి ఆ రోజులలోనే అందరూ చెప్పుకునేవారు. ఒక్క మగవాడికే కట్టుబడి ఉండే స్త్రీగా ఆమె జీవించలేదు. అయితే ఆమెతో సంపర్కం పెట్టుకున్న ప్రతి వారు కూడా ఒక అపూర్వమైన స్నేహాన్ని పొందారు, అనుభవించారు. తృప్తి పడ్డారు. ఆమెతో ఉన్నప్పుడే డ్రిప్ఫీల్డ్ కూడా నిజమైన సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాడు. ఆషెన్డేన్ కూడా ఆమె ప్రియులలో ఒకడు. వారి దగ్గర నుండి వెళ్ళిపోయిన తరువాత తన జీవితంలో సమాజాన్ని పరిశిలిస్తూ, నీతి పట్ల మనుష్యుల ఆలోచనలు, ఆ పేరు మీద వారు జీవించే అబద్దపు జీవితాన్ని పరిశిలించిన తరువాత, రచయితగా ఎదిగిన తరువాత అతనికి రోస్ ఒక అపురూపమైన వ్యక్తి అని ఇప్పుడు అనిపిస్తుంది. నీతిమంతులు అనుకున్న వ్యక్తులలో దుర్మార్గం, మోసపూరిత వైఖరి అతనికి అర్థం అయి నీతివంతుల నీతి సూక్తులు ఇప్పుడు ఏవగింపు కలిగిస్తున్నాయి. రోస్ తోనే అతను నిజమైన ప్రేమానుభవం సంపాదించుకున్నాని అతను అర్థం చేసుకుంటాడు. ఆమె భర్తను వదిలేసి తన పాత్ర ప్రియుడితో వెళ్ళిపోయినపుడు అతను చాలా బాధపడతాడు.
తరువాత డ్రిఫీల్ద్ సొసైటిలో తనకు తోడ్పాటిచ్చే ఒక వ్యక్తి సంరక్షణలోకి వెళతాడు. అప్పుడే రచయితగా గొప్ప పేరు సంపాదించుకుంటాడు. తరువాత తనకు నర్సుగా పని చేసిన స్త్రీని రెండో వివాహం చేసుకుంటాడు. ఆమె అతని జీవిత స్థాయిని పెంచడానికి కష్టపడుతుంది. సమాజంలో అతని స్థాయిని పెంచడానికి ఆ వివాహం పనికి వస్తుంది. అతని జీవితాన్ని నియంత్రిస్తూ సమాజంలో అతనికో గౌరవప్రదమైన స్థానం రావడానికి ఆమె చేయవలసినదంతా చేస్తుంది. కాని డ్రిఫీల్డ్ తన జీవిత కాలంలో గొప్ప నవలన్నీ కూడా రోస్ పక్కన ఉన్నపుడే రాసాడు. సొసైటి మనిషిలా జీవించిన అతని రెండవ భార్య జీవితంలోని స్థాయిని పెంచగలిగిందే కాని రచయితగా అతని స్థాయి ఆ తరువాత తగ్గిందనే చెప్పవచ్చు. ఆమెతో జీవిస్తూ సాధారణ వ్యక్తిగా జీవించలేకపోతున్నానని అతను నిత్యం బాధపడేవాడు. జీవితంలో అన్నీ కోల్పోయిన వ్యక్తిగానే అతను ఆఖరి రోజుల్లో జీవించాడు.
అషెన్డేన్ తరువాత సమాజంలోని నీతి నియమాలు, మనసుతో ఎప్పుడూ ఒకే తాటి మీద నిలబడలేవని అర్థం చేసుకుంటాడు. చనిపోయిందని అందరూ నిర్దారించుకున్న రోస్‌ను అతను ఒకసారి కలుసుకుంటాడు. ఆమె జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించిందని, తన జీవిత విధానం పట్ల ఆమెకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని తెలుసుకుంటాడు. ఆమె తాను ప్రేమించిన వారందరికీ నిస్వార్థంగా ప్రేమను పంచిపెట్టిందని, దాని పట్ల ఆమెకెన్నడు దుఃఖం లేదని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. తన మార్గం అనైతికం అని అన్న సమాజం గురించి కూడా ఆమె ఎన్నడూ పెద్దగా ఆలోచించలేదు.
మనిషి నీతి అనైతికత గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఆఖరికి అతను కోరుకునేది నిస్వార్థంగా తనను ప్రేమించి తన కోసం ఏదైనా చేయగలిగే ఒక వ్యక్తి ప్రేమని. అది ఏ దారిలో వచ్చినా అది ఆ వ్యక్తికి చాలా అపురూపమైన మర్చిపోలేని అనుభవం. ఆ అనుభవాన్ని రోస్ తన వద్దకు వచ్చిన పురుషులకు అందించింది. అందుకే రోస్‌తో జీవితంలో కొంత సమయం గడిపిన వారెవ్వరూ ఆమెను మర్చిపోలేకపోయారు.
నవల చివర్లో రోస్‌కి సంబంధించి ఒక సంఘటనను ఆషెన్డెన్ చెబుతాడు. దాన్ని డ్రిఫీల్డ్ తన నవలలో కూడా ఉదహరిస్తాడు. డ్రిఫీల్ద్ రోస్‌ల ఏకైక బిడ్డ మరణిస్తాడు. మరుసటి రోజు ఆ బిడ్డ అంతక్రియలనగా రోస్ ఆ రాత్రి మరో వ్యక్తితో గడపడానికి వెళుతుంది. ఆ మరుసటి రోజు ప్రొద్దున తన భర్తతో పాటు ఆ బిడ్డను సమాధి చేయడానికి శ్మశానానికి వెళుతుంది. ఇది నైతికతకు కట్టుపడి ఉండే సమాజానికి ఎప్పటికీ అర్థం కాని చర్య. కాని అంతటి నీతి మాలిన రోస్ వల్లనే చాలా మంది ఆనందాన్ని అనుభవించారు. ప్రేమను రుచి చూసారు. నీతి, ఆనందం, సంతోషం, ఇవి కలిసి ఉండలేవు. ప్రతి వ్యక్తికి తమదైన నీతి ఉంటుంది. దానికి కట్టుబడే వారు జీవిస్తారు. రోస్ లాంటి వ్యక్తులు మనకు అర్థం కారు. వారిని మనం తప్పుడు వ్యక్తులంటాం. వారి చర్యలను తప్పులంటాం. అయితే ఇది ఇక్కడితో ఆగదు. అటువంటి వారి స్త్రీల నుండి లభించే ప్రేమ కోసం అర్రులు చాచే మగవారు కూడా ఎక్కువమందే. వారికి కావలసిన ఆనందం ఇటువంటి స్త్రీల వద్దే దొరుకుతుందని ఆశపడతారు. నీతిలో లేని ఆనందం, సుఖం అవినీతిలో ఉంటుంది, దాన్ని అనుభవించాలని దొంగ దారులు వెతుక్కున్న వారందరూ తిరిగి ఆ అనందం ఇచ్చిన వ్యక్తులనే అవినీతి పరులని ముద్ర వేసి తమ నీతిని చాటుకుంటారు. వీళ్ళూ దొంగ దారుల్లో ఆనందిస్తారు, సమాజంలో తమ స్థానాన్ని సుస్థిరపరుచుకుంటారు. అలాంటి వారే నీతి గురించి ఎక్కువ ఉపన్యాసాలు కూడా ఇస్తారు.
CAKES AND ALE లో రోస్ పాత్ర తనకెంతో ఇష్టమైన పాత్ర అని చెప్పుకున్నారు మామ్ చాలా సార్లు. షేక్స్పియర్ TWELFTH NIGHT లో మొదటి సారి cakes and ale అన్న expression ని వాడారు. “Better beans and bacon in peace than Cakes and ale in fear” అనే వాక్యం ఐసోప్ గ్రీక్ కథలలో కూడా కనిపిస్తుంది. తెలుగులో పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీరు తాగడం మంచిది అన్న సామెతలా ఇది ప్రయోగిస్తారు. CAKES AND ALE అంటే సామాన్యులకు అందుబాటులో లోని సౌకర్యాలు అనుకోవచ్చు. వాటి కోసం మనుష్యులు పడే తపన వెనుక నీతి అనే సూత్రాలను ఎలా ఉపయోగించుకుంటారు. జీవితమంతా నీటీ కోసం కాదు పాల కోసం ప్రాకులాడుతూ నీటి గొప్పతనాన్ని పైకి చెప్పుకునే సమాజం మనది. రోస్ అనే పాత్ర సమజంలో నీతి లేని ఒక స్త్రీ. కాని ఆమె పొందు కోసం కష్టపడి, ఇష్టపడే నీతిమంతులే చుట్టు ఉన్నవారంతా. సమాజంలో ఈ ద్వంద్వ వైఖరి మద్య తాననుకున్న పంథాన జీవించిన రోస్ అంటే తనకు చాలా ఇష్టం అని బాహటంగా చెప్పుకున్నారు మామ్.