[dropcap]అ[/dropcap]నువాద కథా సంకలనానికి ముందుగా కుదరవలసింది చక్కని శీర్షిక. అది పరేశ్ దోశీ గారి ఈ పుస్తకానికి చక్కగా అమరింది. సూర్యుడు, లేక చంద్రుడి చుట్టూ కనిపించే మేఘాల వలయాన్ని వరదగుడి అంటారు. ఇలా కనిపిస్తే వర్షం వస్తుందని నమ్ముతారు. చాలా అందంగా, అద్భుతంగా వుంటుందిది. పలు మేఘాలు కలసి మేఘాల వలయాన్ని ఏర్పాటు చేసినట్టే పలు విభిన్న భాషల కథలు కలిసి ఈ వరదగుడి అనువాద కథల సంకలనం రూపొందింది. ‘వరదగుడి’ అనే పేరు ఆసక్తి కలిగించడమే కాకుండా, కథాయానంలో ముందుకు సాగమని ప్రోత్సహిస్తుంది.
ఇందులో మొత్తం 51 అనువాద కథలున్నాయి. పంజాబీ కథలు 3, హిందీ కథలు 7, ఉర్దూ కథలు 4, భారతీయాంగ్ల కథలు 3, గుజరాతీ కథలు 10, ఒడియా కథలు 2, బెంగాలీ కథలు 6, మరాఠీ కథ 1, మళయాళీ కథలు 6, రష్యన్ కథ 1, నేపాలీ కథ 1, ఆంగ్ల కథలు 2, తమిళ కథలు 2, దక్షిణాఫ్రికా కథ 1, మైథిలీ కథ 1, రాజస్థానీ కథ 1 ఉన్నాయి.
ఇన్ని భాషల అనువాదాలైనా, తెలుగు కథలు చదువుతున్నట్టే ఉంటాయి. పరేశ్ గారి శైలి పరాయి భాష కథ చదువుతున్నట్టు అనిపించనీయదు. దేశీయ భాషల అనువాదమైనా, విదేశీ భాషల అనువాదమైనా – ఈ చక్కని కథలు అనువాదంలోకి అందంగా ఒదిగాయి. ఇందులోని కొన్ని కథల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
***
ఒక ఉన్నతాధికారి వేసుకున్న చొక్కా లాంటిదే తాను గతంలో వేసుకునేవాణ్ణని ఆయనతో ఒక రిక్షాతను అంటాడు. మరిప్పుడు రిక్షా ఎందుకు తొక్కుతున్నాడో హిందీ కథ ‘నల్లదొర’ చెబుతుంది.
మాంసాహారిగా మారిన ఓ కంచర గాడిద ఓ విపత్కర పరిస్థితులలో బరువులు మోస్తున్న గాడిదలపై దాడి చేసి వాటి మాంసాన్ని తినసాగింది, అది ఎందుకు ప్రకృతి స్వాభావికం అయిందో ‘సంస్కారం’ కథలో చదవవచ్చు.
తన దృష్టిలో తన తండ్రి ఇమేజ్ తగ్గిపోయిన విషయం ఆయనకి తెలియకూడదనుకున్న ఓ కూతురు ఏం చేసిందో ‘పూసల గొలుసు’ అనే ఉర్దూ కథ ద్వారా తెలుస్తుంది.
ఎడమ చెయ్యి, కుడి చెవి పోయిన వ్యక్తి ఏం చేశాడో ‘దొంగతనం’ అనే ఉర్దూ కథలో చదవచ్చు. పైకి హాస్యంగా అనిపించినా, జాగ్రత్త చదివితే కథలోని వ్యంగ్యం పాఠకులకి స్ఫురిస్తుంది.
ఓ చిత్రకారుడి ప్రతిభకీ, నిస్సహాయతా అద్దం పట్టిన కథ ‘కళాసేవ’. చదివాకా మనసు ఆర్ద్రమవుతుంది. ‘మేకలు’ కథ పాఠకులను గత కాలంలోకి తీసుకువెళ్ళి, ఆనాటి గ్రామీణ జీవనాన్ని మరోసారి గుర్తుకుతెస్తుంది.
తనని తాను ఉన్నతుడిగా భావించుకునే ఓ వ్యక్తికి కలగని ఆలోచన ఓ మామూలు మనిషికి కలిగిన వైనం ‘జాగృతి’ కథలో చదవచ్చు.
కొడుకు చెందుతూన్న అనుభూతి తండ్రికి ఎందుకు కలగట్లేదో ‘అనుబంధం’ కథ చెబుతుంది. పర్యావరణంపై గౌరవాన్ని పెంచే కథ ఇది.
మొగ్గను పువ్వుగా వికసించడానికి కావలసినంత సమయం యిచ్చినట్టే పిల్లలు ప్రతీదీ నేర్చుకోవడానికి కూడా తల్లిదండ్రులు సమయం ఇవ్వాలని చెప్పే కథ ‘గంగిగోవు’. జీవితపు క్షణం క్షణం రసమయం ఎలా చేసుకోవాలో ఈ కథ చెబుతుంది.
తిరగలితో విసరిన జొన్నలతో చేసిన రొట్టెలను తినాలనుకున్న మామగారిని కోడలు మోసం చేస్తే ఆయన చేసిన పనికి కోడలికి జ్ఞానోదయం ఎలా అయిందో ‘తిరగలి’ కథ చెబుతుంది.
మనసు కిటికీ తెరిచి ఉంచితే, విశ్వదర్శనమౌతుందని ‘కిటికీ’ కథ చెబుతుంది. గుజరాతీ భాషలో అనువాదకులే ఈ కథ రాయడం విశేషం. భావోద్వేగాలని రేకెత్తించే కథ.
చూపు కనపడని బాలుడి అంతరంగాన్ని ఆవిష్కరించిన ‘దృష్టి’ కథ చదవితే మనసు భారమవుతుంది. పెరిగి పెద్దయి పెళ్లి చేసుకున్నాక అతనికొచ్చిన కొత్త దృష్టి ఏమిటో ఈ కథ చెబుతుంది.
మనిషి మనసు బతికి ఉండడానికి తగిన సాధనం కనిపెట్టాల్సిన అవసరాన్ని ‘ఆవిష్కారం’ కథ చెబుతుంది.
‘విందు’ కథ ఎవరికి వారు చదువుకోవలసిందే. ఆ కథలోని వేదనామయ స్పర్శను వ్యక్తిగతంగా అనుభవించాల్సిందే.
కొందరు జీవితాలలో చేసే ప్రతి పనిలోను స్వార్థం, లంచం నిండి ఉంటాయని చెప్పే బంగ్లా కథ ‘లంచం’.
తనకెదురైన విపత్కర పరిస్థితుల వల్ల మాటలాడడానికి ఇష్టపడని బాలిక గురించి ‘భాష’ కథలో చదవవచ్చు. మనసుతో మాట్లాడే శక్తి వున్న ఆ పాపకి మాటలు నేర్పించడానికి ప్రయత్నిస్తే ఏం జరిగిందో తెలుసుకోవడం విషాదం.
క్రూరుడైన దొంగ తన తప్పు తెలుసుకుని మంచివాడిగా మారితే అతనికి ఎదురైన అనుభవాలు ఎలాంటివో ‘అంతరం’ కథ చెబుతుంది.
ఓ నిజజీవిత గాథ విన్నాకా, మనసు భారమై, తాను రాసేదంతా కృతకమని గ్రహించిన ఓ రచయిత గురించి ‘గడియారం’ కథ చెబుతుంది.
ఓ శవం బతికివున్నదో, చనిపోయినదో ఎలా తెలుసుకోవాలో అద్భుతంగా చెప్పిన రష్యన్ కథ ‘తేనెటీగలు’.
పట్నంలో బతకడానికి కావల్సిన స్మార్ట్‌నెస్ కాకుండా – నిజమైన స్మార్ట్‌నెస్ అంటే ఏమిటో నేపాలీ కథ ‘పట్నం’ వివరిస్తుంది.
~
ఇతర భాషలలో వైవిధ్యభరితంగా, విభిన్న ఇతివృత్తాలలో సుప్రసిద్ధులైన రచయిత(త్రు)లు అల్లిన ఈ కథలను తెలుగులో చదవడం మంచి అనుభవం.
***
వరదగుడి
(అనువాద కథలు)
అనువాదం: పరేశ్ దోశీ
ప్రచురణ: ఛాయ రిసోర్స్ సెంటర్, హైదరాబాద్
పుటలు: 353
వెల: ₹200/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు