[box type=’note’ fontsize=’16’] ‘నా బాల్యం కతలు’ అంటూ తన చిన్ననాటి ముచ్చట్లను అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ. [/box]
11. మా అత్త వైదిగ రగస్యం
[dropcap]మా[/dropcap] అత్తకు నాటు వైదిగం బాగా తెలుసు. మా అత్త, వాళ్లత్త దగ్గిరినుండి వైదిగం నేర్సుకునిందంట. వాళ్లత్త సచ్చిపోయిన తర్వాత మా అత్త ఇప్పుడు దాన్ని కొనసాగిస్తా ఉండాది.
మా తాతోళ్ల ఇంటికి పక్కిల్లే మా అత్తోళ్ళ ఇల్లు. తెల్లార్తో ఆరో గంటకంతా మా అత్తోళ్ల ఇంటి ముందర ఒక మంద ఆండోళ్లు కూసోనుండేటోళ్లు. ఏడ్సే బిడ్డల్ని ఎత్తుకోని మా అత్తోళ్ల తిన్నెమీంద, మెట్లకాడ, మురిక్కాలవ పక్కన, రోడ్డుమింద కూసోని మా అత్త కోసరం ఎదురుసూస్తా ఉండేటోళ్లు.
కడుపుబ్బరంతో బాధపడే బిడ్డలు, మెడ నిలవక ఏడ్సేటోళ్లు, పచ్చకామెర్లతో సన్నబడ్డళ్లు, బేదుల్తో బెంబేలెత్తిపోయి నోళ్లు, వాంతులతో తల వాల్చేసినోళ్లు, తల్లిపాలు తాగలేనోళ్లు… ఇట్టా ఏందేందో అవస్తలతో ఉండే బిడ్డల్ని ఎత్తకొచ్చేటోళ్లు.
సంటి బిడ్డలతో పాటు… ఒకోపారి నెలలు నిండిన గర్భవతులు, బిడ్డల్లేనోళ్లు, ఇంకా ఏందేందో సమస్యలో ఉండే ఆండోళ్లంతా కూడా మా అత్త దగ్గిర వైదిగం చెయ్యించుకునేటందుకు వొచ్చేటోళ్లు..
కొంచేపటికి మా అత్త, వైదిగం కోసమని కాంచి పెట్టిన ‘మాదాయిందం, బేదాయిందం, బేదిమాతర్లు, వాయువు మాతర్లు, కారం ఉంటలు…’ ఇట్టాంటి సట్లు (ముంతలు) అన్నింటిన్నీ తెచ్చి తిన్నెమింద పెట్టేది.
మా అత్త వాళ్లకు వైదిగం జేసేటప్పుడు మాలాంటి పిలకాయిలెవురైనా అక్కడుంటే కసురుకుని దూరంగా పొయ్ ఆడుకోమని తరిమేసేది. అట్టా ఆమె తిట్లకు ఎక్కువగా బలయ్యేది నేనే. ఆమె ఇంటి బయటికొచ్చి మందు ముంతలు తిన్నెమీంద ఒగొటొకటిగా పెడతా ఉండేటప్పుడే నేను రెడ్డిగుంట కల్లకు మళ్లేసేవోణ్ణి.
ఆ సమయంలో తప్పనిచ్చి మిగతా సమయాల్లో ఆమె మాతో బాగానే మసులుకునేది.
అదేపనిగా ఏడస్తా ఉండే బిడ్డల్ని దగ్గరకు తీసుకుని రొండు సెవులూ పట్టి లాగేది. కాళ్లమీంద బోర్లా పండుకోబెట్టుకుని ఎన్నెముక మీంద బూడిద రాసి, పేగులు ఎత్తేది. ఆ సమయంలో బిడ్డలు ‘ఓ అని’ ఏడస్తా ఉన్నా వాళ్లను లెక్కజేసేది కాదు.
రోగం ఏందో నిర్ధారించుకున్నాక వాళ్లకు మందులిచ్చేది. వాళ్లు వొచ్చేటప్పుడే సిన్నసిన్న బాటిళ్లు కూడా తెచ్చుకోవాల.
దాన్లోకి ఒక గెంటికి ఇంత దుడ్డు అని… బేదాయిందం, మాదాయిందం పోసిచ్చేది. బాటిళ్లు తెచ్చుకోనోళ్లకు బాటిళ్లను తనే ఇచ్చి, బాటిల్‌కి ఇంత అని వసూలు జేసేది.
అట్టా తెల్లార్లో ఆరోగంటకు మొదలైన వైదిగం తొమ్మిది గంటల దాకా కొనసాగేది. ఇంకెవురూ రారు అని నిర్ధారించుకున్నేక ఆ మందు సట్లన్నింటినీ తీసకెళ్లి లోపల పెట్టి గుడ్డతో మూసిపెట్టి సుట్టూ దారంతో గెట్టిగా కట్టేది.
ఆపైన ఎవురు వైదిగానికొచ్చినా సాయంకాలం రమ్మని పంపించేసేది.
అట్టా సంపాదించిన దుడ్డును ఇంటి కర్సులకు ఉపయోగించేది మా అత్త. మేళం లేనప్పుడు మా మామ, మా అత్తను అప్పుగా దుడ్డును అడగటం నేను చానాసార్లు సూసుండాను. కానీ మా అత్త మా మామకే కాదు, నాబోటి పిలకాయలకు కూడా సిల్లిగవ్వ ఇదిల్చేది కాదు. మహా పిసినారిది.
వైదిగానికి మందయిపోతే, సాయంకాలాల్లో తనే బజారుకెల్లి తనకాడున్న దుడ్డుతో కావల్సినయన్నీ కొనక్కొచ్చుకునేది.
అట్టా ఒకసారి ఆమె సాయంకాలం బజారుకెల్లిన సమయంలో… నేను వాళ్లింటి కాడికి పోతిని.
అప్పుడు మా అత్త కూతురు పుస్ప పెళ్లో కూసోని సామాన్లు కడగతా ఉండాది.
అది నాకంటే రొండు సమ్మచ్చరాలే పెద్దది. నన్ను జూసిందే పండ్లంతా జూపిస్తా సిన్నగా నవ్వింది.
“ఏరా బాలా ఇట్టొచ్చినావు?” అని అడిగింది.
“రా పుస్పా… ఆట్లాడుకుందాము.” అని పిలిసినాను.
“అమ్మో, మా అమ్మ జూస్తే సంపేత్తాది.” అనింది వాళ్లమ్మకు బయపడతా.
“మీ అమ్మ యాడుండాది. బజారుకు పొయ్యుండాది కదా?” అన్నాను దానికి దైర్నాన్నిస్తా.
“ఇదో, ఈడ బోకులు సూస్తివా, ఎన్నుండాదో. అన్నీ కడగాల. మాయమ్మ వొచ్చేలోపల కడిగేయకపోతే ఇంగ నా కత అంతే! రత్తం కారేలా తొడ బెల్లం పెట్టేస్తాది.” అనింది.
“నువ్వెప్పుడూ ఇంతే, ఎప్పుడు పిల్సినా ఆటాడేదానికి రావు. పో నీతో మాట్లాడను.” అంటిని కోపంగా.
“నువ్వు మొగపిల్లోడివి. నీకు పన్లూ గిన్లూ ఏమీ ఉండవు. మా ఆండోళ్లకు ఎన్ని పన్లుంటాయో నీకేం తెలుసూ?”
“మా మొగోళ్లకు కూడా పన్లుంటాయమ్మా. మేమేం ఉత్తినే ఊర్లు తిరగతా ఉండావనుకోనుండావా ఎట్టా?” అంటిని.
“అబ్బో పన్లు…”అంటా ఎగతాళి సేసింది పుస్ప.
“పుస్పా పుస్పా నీకాడ అర్ధణా ఉంటే ఈమే. అంగిట్లో ఏమన్నా కొనుక్కోని తింటా!” అని ఉన్నట్టుండి అడిగినా.
“నాకాడ దుడ్డు ఏడుంటాది, మా అమ్మ నాకిస్తే కదా?”
“పోనీ, నీకాడ ఏదైనా తినేదానికుంటే ఈమే.” అని మళ్లీ అడిగినా.
“నాకాడ ఏమీలే. రా ఇంట్లో ఏమైనా తినేదానికి ఉందేమో సూస్తాం..” అంటా తడి సేతుల్ని పావడకు తుడుసుకుంటా పైకి లేసింది. లోపల డబ్బాల్లో ఏమైనా తినేదానికి ఉందేమోనని వెతుకులాడతా ఉండాది పుస్ప.
ఈలోపల నేను ఆడే ఉండే దొంతలకాడికి పొయ్, ఒక్కో దొంతిని పైకెత్తి లోపలేమైనా తినేదానికి ఉందేమోనని తొంగి తొంగి సూస్తా ఉండాను. కానీ చానా మటుకు అన్నీ ఖాళీగానే కనిపించింది.
ఒక దొంతిలో నాకు ఒక పెద్ద ఏంచిన సెనిగింజ కనబడింది. పుస్పకు తెలీకుండా దాన్ని తీసి ఠకామని నా జోబులో ఏసుకుంటిని. కానీ అది సూడనే సూసేసింది. “ఒరేయ్, ఏందిరా జోబీలో ఏసుకున్నావ్?” అని సూటిగా అడిగింది.
“ఏంది లేదు మే…” అన్నాను దబాయిస్తా.
“నువ్వు ఏందో జోబీలో ఏసుకునింది నేను జూసినాళ్లే. అదేందో తీసి సూపీ…” అనింది మళ్లా.
నేను ఆ గింజను బయిటికి తీసి సూపిస్తిని.
“అదెందుకు రా నీకు? దాన్ని దాంట్లోనే ఏసేయ్…” అనింది.
“ఆ పాపం…” అని సటుక్కున దాన్ని నోట్లో ఏసుకుని కసకసా నమిలేసి మింగేస్తిని.
“ఒరేయ్, ఒరేయ్… ఎందుకురా దాన్ని తిన్నావ్? అది తినకూడదు రా…”
“ఏం తింటే?” అన్నాను మొండిగా.
“ఏమనుకోనుండావు దాన్ని. అది నేపాలం గింజె. మా అమ్మ వైదిగంలోకి వాడే మందు గింజ.”
“మేయ్, అట్టయితే ఈ ఇసయం మీ అమ్మకు సెప్పొద్దు. నన్ను తిడ్తాది.”
“సెప్పను కానీ, నీకే ఏమౌతుందో ఏమోనని నాకు బయ్యింగా ఉంది రా.” అనింది బిత్తకరకపోతా.
“ఏం, పేనం పోతుందా?” అని నేనూ అనుమానంగానే అడిగినాను.
“ఛ, ఛ… అట్టాంటిది ఏమీ జరగదు లే!” అని దైర్నమిచ్చింది పుస్ప. దాంతో నేను ఆ ఇసయాన్ని మర్సిపోయి, రెడ్డిగుంటకాడి కెళ్లి ఆటల్లో మునిగిపోతిని.
ఒక అర్ధగంట అయ్యింటింది. ఒంట్లో ఒకమాదిరిగా అనిపించింది. కడుపులో తిప్పినట్టుగా అనిపించి ఆపాట్నే కడుపులో నుండి తన్నకొచ్చి తిన్నదంతా కక్కుకున్నాను. అంతేగాదు, బయిటికీ (రెంటికీ) పొయ్యొస్తిని.
ఇంకో అయిదు నిమిసాలు అయ్యింటుంది. మళ్లా కక్కుకుంటిని. మళ్లా రెంటికి పోతిని. ఆ పైన కండ్లు తిరిగినట్టుగా అనిపించి ఇల్లొచ్చి చేరిపోతిని. నడవలో గోడవారగా ముడుచుకుని పండుకున్నాను. నాకు తెలియకుండానే నా నిక్కరంతా పాడైపోయింది. ఒకటికి రెండుసార్లు వాక్ వాక్ మంటూ కక్కుకున్నాను.
ఒంట్లో సత్తవ లేక నీరసంతో లెయ్యిలేకపోయినాను.
“ఏందిరా ఈ యేళప్పుడు పండుకోనుండావు” అంటా నా దగ్గరకొచ్చి ఎంటనే ముక్కు మూసుకునింది మా పెద్దమ్మ.
“ఒరేయ్ నా బట్టా… దొడ్డికొస్తే లేసి బయటికి పోవచ్చు గదరా” అంటా నన్ను తిట్టి నాకేసి చూసి అదిరిపడింది.
“ఓర్నాయనో, బిడ్డకేమైందిరా దేముడో?…” అంటా కండ్లు తేలేసిన నన్ను జూసి ఏడుపెత్తుకొనింది.
“యోవ్, యాడుండావు నువ్వు, ఇట్ట రాయా. వొచ్చి బిడ్డకేమైందో సూడూ…” అంటా గెట్టిగా అరిసింది.
యాడున్నాడో మా పెదనాయిన ఆపాట్నే పరుగెత్తుకుంటా వొచ్చినాడు. నన్ను జూసి ఆయినా బయపడిపోయినాడు.
మా పెద్దమ్మ ఆగిర్తానికి సుట్టుపక్కలుండే వొళ్లంతా పరుగెత్తుకుంటా వొచ్చి నా సుట్టూ మూగినారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి సెప్తా ఉండారు. అదంటున్నారు, ఇదంటున్నారు. నా సెవికి ఏమీ ఆనటం లేదు. నిక్కరు పాటికి నిక్కరు తడిసి పోతా ఉండాది. వాంతులేమో ఆగటం లేదు.
నాకు వాంతులూ బేదులు పట్టుకునిందని తేల్సినారు.
ఇంతలో మా అత్త రానే వొచ్చింది.
అప్పిటికే పుస్పా దగ్గర నిండి ఇసయమంతా తెలుసుకున్నట్టుంది.
నాగరాజును పిలిచి వాడికేదో చెప్పింది. వాడు రెడ్డిగుంటకేసి గబగబా పరిగెత్తినాడు.
ఈలోపు నేను ఏసుకున్న నిక్కరూ, సొక్కాయి ఇప్పేసి పెళ్లోకి తీసకపోయి పక్కన ఏసేసింది. బిత్తలగా ఉన్న నా ఒంటికి ఒక తువ్వాలును కట్టింది మా పెద్దమ్మ. ఇంతలో… నాగరాజు పరుగెత్తుకుంటా వొచ్చి, మా అత్త సేతికి ఏందో ఆకులో మడిసి తెచ్చిచ్చినాడు. కాసేపటికంతా ఒక గళాసు నీళ్లల్లో దాన్ని కలిపి నాకు తాగించే పనిలో పడింది మా అత్త.
ఒక్క గుక్కకే నాకు ఒకలాగా అనిపించి నోట్లోంచి ఊసేసినాను. మళ్లీ తెరిస్తే ఒట్టు. నోరు గెట్టిగా మూసుకున్నాను. కానీ బలింతంగా నాసేత తాగించేందుకు అందురూ నా సేతులూ కాళ్లూ పట్టుకునారు.
నేను నోరు తెరవనే లేదు. తలకాయను అట్టా ఇట్టా తిప్పసాగినాను.
“నా బట్టా నీకిట్టా కాదు” అని మా యత్త నా తలను గెట్టిగా పట్టుకొమ్మని సెప్పి నా ముక్కును గెట్టిగా మూసేసింది.
దాంతో నాకు ఊపిరాడక నేను నోరు తెరిసేసినాను. అంతే, గళాసులో ఉండేదాన్నంతా బలింతంగా కొంచిం కొంచింగా నా నోట్లోకి పోసేసింది మా అత్త.
కొంచేపటికంతా తెపరాయించుకున్నాను. వాంతులూ బేదులూ తగ్గినాయి. ఆ రోజు నా పానం గట్టెక్కింది.
మేళానికి పోయిన మా తాత తిరిగొచ్చి ఇసయం తెలుసుకుని నన్ను దగ్గరకు తీసుకుని, “ఒరేయ్ మనవడా, నీకేమన్నా అయ్యింటే నేనేమైపోయి ఉండాలిరా. నేనూ సచ్చుందును. దీనికంతటికీ ఆ పుస్పానే కారణం.” అంటా పుస్పాను నానా తిట్లూ తిట్టిపోసినాడు. మా తాత అంటే మా అత్తకు బయ్యిం. ఎదురు నిలబడి మాట్టాడే ధైర్నం లేదు. అందుకే ఆయన తన కూతుర్ని అన్ని తిట్లు తిడతా ఉన్నా మా అత్త ఏమీ మాట్టాకండా గొమ్మున ఉండిపోయింది.
ఇది జరిగిన మూడోదినం… నేను నాగరాజుతో కలిసి ఏదో ఆటల్లోపడి గెట్టిగెట్టిగా అరస్తా ఉంటే… “ఆ నా బట్టకు నోరు సూడు ఎంతుండాదో? మూడు దినాలకు ముందర దాని… నీళ్లే కనక తాగించక పొయ్యుంటే ఏమయ్యుండేటోడో?…” అంటా నా సేవలకు ఇనీ ఇనబడనట్టుగా ఏందో అనింది మా అత్త.
దాంతో నేను ఆమె కాడికి పరుగెత్తుకుంటా పొయ్యి, “అత్తా, ఆ దినం నాకు తాగించిన మందు పేరేమిటత్తా? ఆ నీళ్లల్లో ఏం కలిపిచ్చినావత్తా నాకు?” అని అడిగితిని ఆత్రంగా. నా ఎనకే నాగరాజు కూడా పరుగెత్తుకుంటా వొచ్చి నా పక్కన నిలబడినాడు. వాడూ, మాఅత్తా ఒగరి మొగాలు ఒగరు సూసుకుని ముసిముసిగా నవ్వుకోసాగినారు. నాకేమీ అర్థం గాలేదు. వాళ్లేదో దాస్తా ఉండారని నాకర్థమైంది. “అత్తా, అత్తా, సెప్పత్తా. ఆ దినం నాకేం కలిపిచ్చినావత్తా?” అని మళ్లా అడిగితిని.
“వూహూ. మందు పేరు సెప్పకూడదు. అది రగస్యం, బయిటికి సెబితే అది ఎవురికీ పనిజేయదు.” అనింది అత్త.
ఆరోజు మందు తెచ్చిచ్చినోడు నాగరాజు. వాణ్ణి అడిగితే సెప్పతాడని “నువ్వయినా సెప్పరా నాగరాజా…” అని వాణ్ణి బతిమాలితిని. వాడు మా అత్తకల్లా జూసి, ఆమె సైగతో నోరు తెరవలేదు. మళ్లా మళ్లా వాణ్ణి సెప్పమని బతిమాలితిని.
“సెప్పొద్దురా నాగరాజా, నువ్వేం తెచ్చిచ్చినావో వాడికి సెప్పనే చెప్పొద్దురా…” అంటా ముసిముసిగా నవ్వింది అత్త.
వాడూ సెప్పకుండా నన్ను జూసి నవ్వసాగినాడు. దాంతో నేను మూతి ముడుచుకుని వాళ్లను కోపంగా సూడసాగినాను.
కొంచేపయినాంక మా అత్త…. “ఒరే, నాగరాజా బాలడు మొగం జూడ్రా, ఎట్టుండాదో? ముచ్చుకోతి ముడ్డిలాగా ఎర్రంగా.” అని పకపకమంటూ నవ్వి, “రగస్యం సెప్పకపోతే అన్నం గూడా తినేటట్టు లేడొరే. సెప్పకపోతే అన్నం తినడు. సెపితే అన్నం దిగదు. ఏం సావొచ్చి పడింది రా నాకు…” అని మళ్లా నవ్వి, “ఆ రగస్యం ఏందో బాలడికి సెప్పెయ్యరా, నాగరాజా…” అనింది నవ్వతానే.
నేను కండ్లు తెరుసుకుని నాగరాజుకేసి ఆచ్చెర్యంగా జూస్తా, “సెప్పరా…” అని తొందర పెడితిని.
వాడు నవ్వటం ఆపి, “ఆ దినం నేను పెద్దమ్మకు తెచ్చిచ్చింది… ఎనుము పేడ…” అన్నాడు మళ్లా పండ్లు జూపిస్తా.
అంతే! ఆ మాటతో నాకు మళ్లీ కడుపుతో దేవినట్టయ్యి వాంతొచ్చేంత పనైంది.
నా మొగం జూసి మళ్లీ వాళ్లిద్దరూ పడీ పడీ నవ్వుకోసాగినారు.
(మళ్ళీ కలుద్దాం)