[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]
[dropcap]బ[/dropcap]దిరి చరిత్ర అద్భుతమైనది. అసలు బదిరికా వనమే పరమ సుందరము. అందుకే ఆ అలంకార ప్రియుడు అక్కడ వెలిశాడు. దానినంతా కేదారఖండమంటారు. కేదార ఖండములో, నర నారాయణ పర్వతాల మధ్య, వెలసిన తపోభూమి బదరి. ఆ క్షేత్రాన్ని నారద క్షేత్రం అని కూడా అంటారు. అంటే నారదులవారు అక్కడ ఆరు నెలలు వుండి స్వయంగా నారాయణ సేవ చేసుకుంటారుట.
నరనారాయణ పర్వతాలకు వున్న చరిత్ర చాలా రమ్యమైనది. పూర్వం సహస్ర కవచుడన్న రాక్షసుడు బ్రహ్మ వరమున ప్రజలను పీడిస్తున్న తరుణములో, నారాయణుడు ఆ అందమైన క్షేత్రాన మొట్టమొదట కాలు పెట్టాడు. ఆయన మొదట కాలు పెట్టిన చోటును చరణపాదుకలంటారు. అక్కడ పాద ముద్రలు వుంటాయి ఇప్పటికీ. అక్కడ నారాయణుడు తన నుంచి వెలుపడిన నరునకు నారాయణ మంత్రం ఉపదేశించాడు. వారిరువురు ఒకరు సహస్ర కవచునితో యుద్దం చేస్తున్న రోజున, మరొకరు తపమొనర్చారుట. అలా 999 కవచాలు ఊడాయి. అప్పుడు సహస్ర కవచుడు భయంతో శరణ మేడాడు. నారాయణుడు సహస్ర కవచునకు మరు జన్మలో సహజ కవచముతో జన్మించమని, కానీ నరుని చేతులోనే మరణం కలదని వరమొసంగాడుట. ఆ వర ప్రభావమున ఆ అసురుడు కర్ణునిగా జన్మించి అర్జునుని చేత మరణించాడుట.
ఆ నర నారాయణ పర్వతాలను మనం చూడవచ్చు. ఆ రెండు అందమైన పర్వతాల మధ్య వున్న లోయలో బదిరి వున్నది. కోవెలలో నరనారాయణ విగ్రహాలు పూజలందుకుంటూ కూడా చూడవచ్చు.
కేదార ఖండమున నారాయణుడు వెలసిన తీరుపై చక్కటి కథనాలు వున్నాయి. అందమైన ఆ బదిరికా వనము ఈశ్వరుడు పార్వతితో కలసి క్రీడించు వనము. సౌందర్యము ఓలలాడుతూ వుండే ఆ వనముపై నారాయణునికి ప్రీతి కలిగినది. ఆయన బాలుని వేషమున శివ పార్వతుల కళ్ళబడి, పార్వతి వద్ద ఆ ప్రాంతము వరముగా పొందాడు. ఆ ప్రాంతములో జపతపాదులకు అంత విలువెందుకంటే నారాయణుడు అక్కడే తపస్సు చేశాడు కాబట్టి. కోవెలలో ఆయన పద్మాసనములో జపం చేస్తూ వుండే ఆ సాలిగ్రామము మనకు అమితాశర్యమును, ఆనందమును కలిగిస్తుంది. మనము ఉదయము అభిషేకమునకు కనుక వెళ్ళగలిగితే, నిజరూప దర్శనము చూడగలము. అచ్చటి అర్చకులు సర్వం వివరిస్తూ చూపెడతారు కూడా.
సత్యయుగ కాలమునాటిదని చెప్పే ఆ నారాయణ విగ్రహము మధ్యలో కొంతకాలము బౌద్ధులు బుద్ధునిదని కొలిచారు. కాదని వాదించిన వారిని చంపి సాలిగ్రామాన్ని అలకనందలో పడవేసి వెళ్ళిపోయారు. 5వ శతాబ్దికి చెందిన శంకరభగవత్పాదుల వారు అక్కడ తపస్సు చేస్తుంటే ఆయనకు నారాయణుడు తన ఉనికిని చెప్పి బయటకు తీసి ప్రతిష్ఠింపమని ఆదేశిస్తాడు. శంకరాచార్యులవారు నారదకుండములో మునిగి (అలకనందను ఆ ప్రాంతమున నారద కుండమంటారు. నీరు మంచులా చల్లగా వుండి మనం తాకితే కొంకర్లు తిరుగుతాము) వెతికి ఆ సాలిగ్రామమును తీసి పునఃప్రతిష్ఠించారు.
కేరళ నంబూద్రిలు మాత్రమే సేవ చెయ్యాలని నిర్దేశించారు. కారణము ఆయన ఆనాడే జాతీయభావము కలిగించటానికి. భారతావని అంతా ఒక్కటే అన్న భావము రావటానికి.
అక్కడి రావల్జీకి (అర్చకులకు) చాలా నియమాలు వున్నాయి. వారు బ్రహ్మచర్య వ్రతమాచరించాలి. ఆరు నెలలు ఎచ్చటికి వెళ్ళరాదు. ఆ బ్రహ్మచారి తప్ప అన్యులు నారాయణ విగ్రహాన్ని తాకరాదు. అందుకే పూజారి నారాయణ సేవలో వున్నంత కాలము వివాహము చేసుకోరు. తమ తరువాత మరో పూజారిని నియమించి కేరళ వెళ్ళి పెళ్ళి చేసుకు వుండిపోతారు. ఇప్పుడు మనము చూస్తున్న గుడిని అచ్చటి దర్వాడ రాజులు కట్టినదే.
హిమాలయ యోగులెందరికో బదిరికావనము నిత్యనివాసము. ఆ యోగులు సూక్ష్మ రూపమున ఇప్పటికీ యోగ తపము చేస్తూ అన్యులకు కనపడక వుంటారు. వారి కృపకోరి తపించు నరమానవులకు మాత్రమే వారి దర్శనము లభిస్తుంది. మహావతారు బాబాజీ క్రియ యోగ గురువులు. వారి ఆశ్రమము బదిరికి ఆవల వుందని చెబుతారు. పూజ్య శ్రీ కుర్తాళం స్వామివారు చెప్పిన సిద్ధాశ్రమం కూడా బదిరికి ఆవల వున్నదట, హిమ పర్వత మంచులలో. మనకర్థం కాని ఆధ్యాత్మికతలో పరాకాష్ఠకు చెందిన రహస్యాలు బదిరికావనము లోనే నిక్షిప్తమై వున్నాయి. అందుకే బదిరి అంత పవిత్రంగా ఒప్పాడుతుంది.
ఆరు నెలలు దేవతలచే కొలవబడు ఆ క్షేత్రం దీపావళి రోజున మూసివేస్తారు. ఆ మూసి వేసే ముందు వెలిగించిన దీపం తిరిగి ఏప్రిల్‌లో తలుపులు తీసినప్పపడు కూడా వెలుగుతూనే వుండటం అక్కడి మరో వింత. ఆ జ్యోతి దర్శనము కోరి భక్తులు వేలలో దర్శిస్తారు.
బదిరినాథ్ యాత్ర సామాన్యంగా మనవారు మే, జూన్, జులై లలో వెడతారు. ఆగష్టులో యాత్రలు వుండవు. ఎడతెరని వానల వలన హిమాలయాలలో రహదారులు మూసుకుపోయి బాగుపరచలేని విధంగా వుంటాయి. వరసగా రెండు రోజులు వాన పడితే బదిరికి జ్యోషిమఠంకి మధ్య దారి మూసుకుపోతుంది. తిరిగి సెప్టెంబరులో యాత్ర పునః ప్రారంభమవుతుంది.
చలి వచ్చెయ్యటం వలన మన వాళ్ళు ఆ సమయంలో యాత్రకు రారని నాకు అక్కడి వారు చెప్పారు.
***
బ్రహ్మకపాలము
“నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః.
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తేనమః.” రుద్రమంత్రం 1
అర్థం: ఓ రుద్రుఁడా! నీ కోపమునకు నమస్కారము. నీ కోపము నా బాహ్యాంతశ్శత్రువులపైన ప్రవర్తించును గాక. (నన్ను బాహ్యాంతశ్సత్రుహీనునిగా చేయుదువు గాక అని భావము) అంతే కాదు. నీ బాణమునకు, ధనుస్సునకు ధనుర్బాణ సహితములైన నీ బాహువులకు ఇదే నా నమస్కారము.
బదిరిలో అలకనంద వడ్డున అలా నడుస్తూ పోతూ వుంటే బ్రహ్మ కపాలమన్న బోర్డు కనపడింది. అది అక్కడ వుందని నాకు తెలియనే తెలియదు. చాలా ఆశ్చర్యము వేసింది. నేను ఆ బ్రహ్మకపాలము గురించి చిన్నప్పుడు చదివాను.
బ్రహ్మకపాలం గురించిన కథ ఈ విధంగా సాగుతుంది. పూర్వం బ్రహ్మ గారికి ఐదు తలలుండేవిట. ఏదో విషయములో ఆయన రుద్రునితో విభేదించటం, మహాదేవుడు తన చిటికనవేలుతో తల కొట్టెయ్యటం జరిగాయి. తెగిన తల రుద్రునికి గోరుకు అంటుకుపోయింది. బ్రహ్మ హత్యా దోషము తోడైయ్యింది. బ్రహ్మగారి తల కపాలంలా కూడా మారింది. రుద్రుడు ఆ కపాలంతో బిక్ష చెయ్యటం కూడా చేసాడుట. ఆయనకు ఆ విధంగా కపాలముతో బిక్షచేసిన ‘ఆది బిక్షువు’ అని పేరు కూడా పొందాడు.
ఆయన ఏమి చేసినా గోరుకు అంటిన కపాలము పూడిపడింది కాదు. నారాయణుని సలహా ప్రకారం బదిరి ఆవల అలకనందలో మునిగిన వెంటనే ఆయన చేతికంటిన కపాలం వూడటం, రుద్రుడు సంతోషపడటం జరిగింది. ఆనాటి నుంచి ఆ ప్రదేశం పరమ పావనమైనదిగా మారిందిట. అందుకే ఆ ప్రదేశాన్ని ‘బ్రహ్మకపాలం’ అంటారు.
బ్రహ్మ కపాలం బదిరికి ‘మనాకి’ మధ్యన అలకనందా నదిపై వున్న ఘాటు.
ఆ ప్రదేశములో పిండప్రదానము చేస్తే పితృదేవతలకు శాశ్వత స్వర్గ ప్రాప్తి అంటారు. అటు తర్వాత వారికి ప్రతి సంవత్సరము చేసే తద్దినము చెయ్యకూడదని చెబుతారు. స్వర్గంలో శాశ్వత స్థానములో వున్న పితృదేవతలను మళ్ళీ పిలిచి పొరపాటు చెయ్యకూడదని అలాగంటారు.
బదిరినాథ్‌కు వెళ్ళిన వారు తప్పక ఆచరించే ఈ సంప్రదాయము అది. వారు ఆ ఘూటుకు వెళ్ళి పెద్దలకు తర్పణములిస్తారు.
నేను చదివిన దాని బట్టి బ్రహ్మకపాలం ఎక్కడో హిమాలయాలలో నదీ జన్మస్థానంలో వుంది. నేను అంత లోపలి హిమాలయాలకు వెళ్ళానని అక్కడ చూచేంత వరకూ అర్థం కాలేదు.
నిజానికి నేనక్కడకు వెళ్ళానన్న విషయము అవగతమవగానే ఆనందం కలిగింది.
బదిరి నారాయణ అనుజ్ఞ లేనిదే ఎవ్వరూ అక్కడదాక వెళ్ళలేరు అన్నది నిజము. అమ్మను,నాన్నాగారిని కోల్పోయిన దురదృష్టం నన్ను వెన్నంటే వుంది. అక్కడకు వెళ్ళాను కాబట్టి అమ్మ నాన్నగార్లకు ఏమైనా చెయ్యాలన్ని అనిపించింది. అందుకే నే వెళ్ళిన రెండోనాడే నేను బ్రహ్మకపాలం వరకూ నడచుకు వెళ్ళి అక్కడి ఈ తతంగం చేస్తున్న బ్రాహ్మణులను అడిగాను. వారు నేను స్త్రీని కాబట్టి నాకర్హత లేదని, పురుష సంతానమే అది చెయ్యాలని, పురుష సంతానము లేని చోట అల్లుడు చెయ్యవచ్చని, కాబట్టి నే చెయ్యగలిగినది లేదని ఖరాకండిగా చెప్పారు. నేను కొంత ఎక్కువ డబ్బులిద్దామనే ప్రయత్నం కూడా అక్కడి వారు పట్టించుకోలేదు. అలా నేను బ్రహ్మకపాలమెళ్ళినా అమ్మా, నాన్నగార్లకు ఏమీ చెయ్యలేకపోయాననే విషాదము నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
(సశేషం)