[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.
~
మరుసటి రోజు నుంచే ప్రారంభమయ్యాయి క్లాసులు.
***
“ప్రసాద్, నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఇంగ్లీష్‌ని ఒక సబ్జెక్ట్ లాగా నేర్చుకుంటే, మనకు అందులో లోతుపాతులు తెలియవచ్చు. అంతే గానీ మనకు ఆ భాషలో మాట్లాడగలిగే సామర్థ్యం రాదు, మనం చిన్నప్పటి నుంచి చేసిన పొరపాటు అదే.
మనమెంత సేపున్నా ఇంగ్లిష్‌ని ఒక సబ్జెక్ట్ లాగా నేర్చుకునే ప్రయత్నం చేశామే తప్పనిచ్చి, ఇంగ్లీష్ ని ఒక ‘కమ్యూనికేటివ్ టూల్’గా ఉపయోగించే ప్రయత్నం మనం చేయలేదు; అందువల్ల మనకు ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఒంటబట్టలేదు.”
“నీవు చెప్పేది నాకు పూర్తిగా అర్థం కాలేదు” అన్నాడు ప్రసాద్
“నీకు అర్థం అయ్యేలా చెపుతాను, ఏ భాష అయినా మనం ఎందుకు ఉపయోగిస్తాము? మన మనసులో ఏముందో ఎదుటివారి అర్థం అయ్యేలా చెప్పే దానికి మనం భాషని ఉపయోగిస్తాము. మనం చెప్పదలచుకున్న విషయాన్ని ఎదుటివారికి అందజేయటమే కమ్యూనికేషన్ అంటే. మనం ఏమి చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాన్ని ఎంత క్లియర్‌గా చెప్పగలుగుతామో, మనం అంత చక్కగా కమ్యూనికేట్ చేస్తున్నాము అని అర్థం అన్నమాట.
మనకు స్కూళ్ళలో, కాలేజీల్లో ఈ విషయం మీద శ్రద్ధ చూపకుండా ఎంతసేపున్నా, వ్యాకరణ సూత్రాలు బట్టీ పట్టించటం, పరీక్షల కోసం మనల్ని తయారు చేయటం, మార్కులు తెప్పించటం మీద ఏకాగ్రత చూపటం చేశారే గానీ మనచేత మాట్లాడింప చేసే ప్రయత్నం జరగలేదు.
ఇంగ్లీష్ లాంగ్వేజి టీచింగ్ మొత్తం, పరీక్షలు, మార్కులు, పర్సంటేజి, ర్యాంకులు ఇలా సాగింది తప్పనిచ్చి మనతో మాట్లాడించటం జరగలేదు.”
“నిజమే” ఒప్పుకున్నాడు ప్రసాద్.
“రాయల్ లో నేను నేను నేర్చుకున్న మెదటి అంశం అదే” చెప్పాడు రాజు.
మనం మాతృభాషని ఎలా నేర్చుకున్నాం?
మనం మాతృభాషని ఎలా నేర్చుకున్నాం, ఒక సారి గుర్తుకు తెచ్చుకో. ఎవరైనా సరే పసిపిల్లలుగా వున్నప్పుడూ తమ చుట్టుప్రక్కల అందరూ మాట్లాడే భాష ఏదైతే వుందో అది వింటూ పెరుగుతారు.
ఇప్పుడు నేను చెప్పబోతున్న అంశం చాలా ముఖ్యమైనది. మనం మాతృభాషని ఎలా నేర్చుకున్నాము?
మనం మన మెదడును ఒక సూపర్ కంప్యూటర్‌తో పోల్చుకుంటే, మనం పుట్టినప్పుడు మన మెదడులో ఎటువంటి సాఫ్ట్‌వేర్ లోడ్ అయి ఉండదు. కేవలం మెదడు బేసిక్ ఆపరేటింగ్ సిస్టంతో పని చేయటానికి సిద్ధంగా ఉంటుంది అంతే.
ఇప్పుడు మనం అందులోకి ఏ సాఫ్ట్‌వేర్ (అంటే భాష అన్నమాట) లోడ్ చేస్తే ఆ భాషలో మాట్లాడటానికి సిద్ధపడి పోతుంది. దానినే మనం మాతృభాష అని చెప్పుకోవచ్చు.
ఒక పసిపిల్లాడు జన్మించిన వెంబడే తన చుట్టు ప్రక్కల అందరు మాట్లాడే భాషని వింటూ పెరుగుతాడు. పుట్టిన వెంబడే పసిపిల్లాడు చదవలేడు, వ్రాయలేడు, మాట్లాడలేడు, కానీ ఖచ్చితంగా వినగలడు.
ఇంకా లోతుగా వెళితే పసిపిల్లాడు, పుట్టక ముందు నుంచే తల్లి గర్భంలో ఉండగానే వినికిడి ప్రారంభం అవుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పసిపిల్లాడు బయట అందరూ మాట్లాడుకునే మాటలు లోపల్నుంచి వింటూ ఉంటాడు.
జన్మించిన తర్వాత అదే భాషని వింటూ పెరుగుతాడు. పుట్టింది మొదలు వింటూ పెరిగి, మొదటి సారిగా ఏదో తమకు తోచిన పదాలు ‘అమ్‍మ్మ’ , ‘అక్‍క్క’, ‘నాన్‍న్న’ ఇలా ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు.
సహజంగానే వారి తలితండ్రులు ఆనందపడి పోయి వారిని మరింత మాట్లాడేలా ప్రోత్సహిస్తారు. ఈ ప్రొత్సాహంతో పిల్లలు మరింత ఉత్సాహంగా కొత్త కొత్త మాటలు నేర్చుకుని వాటిని మరల మరల పలుకుతూ వుంటారు. దాదాపు మూడేండ్ల వయసు వచ్చేసరికి ఇలా వారు తమ మాతృభాషలో అన్ని భావాల్ని తెలియజేసే స్థితికి వచ్చేస్తారు. అన్ని భావాల్ని ఎలాంటి తప్పులూ లేకుండా వ్యక్త పరచగలరు.
ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే, వారికి అప్పటికి చదవటం రాదు, వ్రాయటం రాదు. అయినా మాతృభాషలో సరయిన విధంగా మాట్లాడగలుగుతున్నారు.
ఆపై స్కూలుకు వెళ్ళి వ్రాయటం, చదవటం నేర్చుకుంటున్నారు. అంటే ఏమిటి అర్థం? చదవటం, వ్రాయటం రాక ముందే మాట్లాడటం అనే శక్తి వారికి వచ్చేసింది.
నీవు గమనించే వుంటావు, నిరక్షరాస్యులు సైతం తమ మాతృభాషలో సులభంగా మాట్లాడగలుగుతున్నారు కద. ఒక భాషలో మాట్లాడగలగటం అన్నది చాలా సులభమైన ప్రక్రియ. దురదృష్ట వశాత్తు మన విద్యా విధానం దాన్ని అనవసరంగా కాంప్లికేటెడ్‌గా మార్చేసింది.
ఉదాహరణకి చెప్పాలంటే, ఎవరయినా అమెరికా వాడికో, తమిళ వ్యక్తికో, కన్నడ వ్యక్తికో తెలుగు మాట్లాడటం నేర్పించాలనుకుందాం (అంటే స్పోకెన్ తెలుగు).”
“అప్పుడు నీవు వాడికి తెలుగు మాట్లాడటం ఎక్కడి నుండి మొదలెడతావు?” సూటిగా అడిగాడు రాజు
“ఏముంది సింపుల్. వాడితో చిన్న చిన్న మాటలు మాట్లాడటం మొదలెడతాను. వాడితో అవి తిరిగి చెప్పమని ప్రోత్సహిస్తాను” బదులిచ్చాడు ప్రసాద్.
“వెరీ గుడ్. అదే సరి అయిన పద్ధతి. అలా మాట్లాడిస్తు, వాడికి టీవిలో చిన్న చిన్న ఉపన్యాసాలు వినిపించటం, చిన్న డిబేట్లు మొదలయినవి చూపిస్తు, పదాలు నేర్పిస్తూ అవి పలికే విధానం నేరిపిస్తు, తగినంత గ్రామర్ నేర్పిస్తూ మాట్లాడటంలో శిక్షణ ఇస్తాము. అంతే కద” తిరిగి ప్రశ్నించాడు రాజు.
“అవును” రాజుతో పూర్తిగా ఏకీభవిస్తూ తలపంకించాడు ప్రసాద్.
“నేను ఇంకో రకంగా నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఎవరయినా అమెరికా వాడికో, తమిళ వ్యక్తికో, కన్నడ వ్యక్తికో తెలుగు మాట్లాడటం నేర్పించాలనుకుందాం (అంటే స్పోకెన్ తెలుగు).
అప్పుడు వాడికి బేసిక్ తెలుగు గ్రామర్ అంటే అ, ఆ,ఇ,ఈ లు, సంధులు,సమాసాలు, గుణసంధి, సవర్ణదీర్ఘ సంధీ, మొదలయినవి చందస్సు, అలంకార శాస్త్రం, అచ్చులు, హల్లులు నేర్పించి తెలుగులో మాట్లాడమని వత్తిడి చేస్తాను. అప్పుడు అతను తెలుగులో మాట్లాడగలడా?” ప్రశ్నించాడు రాజు
“చచ్చినా మాట్లాడలేడు. అంతే కాదు. వాడికి తెలుగు అంటే ఒక విధమైన విరక్తి, భయం కలుగుతాయి” నవ్వుతూ చెప్పాడు ప్రసాద్.
“ఒకసారి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచించు. ఒక వేరే భాష వ్యక్తికి తెలుగులో మాట్లాడేలా ట్రెయినింగ్ ఇవ్వాలంటే నువ్వయితే ఏమి చేస్తావు?”
సాలోచనగా వింటున్నాడు రాజు. విన్నతర్వాత చెప్పసాగాడు ఉత్సాహంగా.
“నేనిందాకే చెప్పినట్టు అతనితో తెలుగులో మాత్రమే మాట్లాడతాను. అతనికి చిన్న చిన్న పదాలు చెప్పించి అవి వాడే విధానం నేర్పిస్తాను. అతనితో చిన్న చిన్న వాక్యాలు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నా మిత్రులను కూడా అతనితో కేవలం తెలుగులోనే మాట్లాడమని ప్రోత్సహిస్తాను. దీనితో అతనికి జంకు పోయి, తెలుగు పట్ల ఒక విధమైన ఆసక్తి ఏర్పడుతుంది. భయం పోయి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు”
“కరెక్టు. ఒక వ్యక్తి వేరే భాష మాట్లాడటం నేర్చుకోవాలంటే ఏమీ చేయాలి? ఆ భాష బాగా మాట్లాడే వారితో మెలగాలి, వారు మాట్లాడే మాటలు వినాలి, విని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న మాటలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తేనే కదా మాట్లాడగలడు. ఏమంటావు?” అడిగాడు ప్రసాద్.
నిజమేనన్నట్టు తలూపాడు రాజు.
“రాజు, నీవు ఇటీవల మీ దూరపు చుట్టాలని చూడాలని కర్ణాటకలోని షిమోగా వెళ్ళి ఒక నెల రోజులు వుండి వచ్చావుగా. అక్కడి వారికి తెలుగు అర్థమవుతుందా? నీవెలా మేనేజ్ చేశావు?”
“భలేవాడివే. అది కర్ణాటకలో పూర్తిగా లోపలి ప్రాంతం, తెలుగు రాష్ట్రాలతో సరిహద్దులు చాలా దూరంలో ఉంటాయి వారికి. అక్కడ తెలుగు అస్సలు అర్థం కాదు, అక్కడి వారికి అస్సలు తెలుగు రాదు. నేనే తిప్పలు పడి కన్నడం నేర్చుకుని మేనేజ్ చేసే వాడిని. నేనున్నది ఒక నెల రోజులే అయినా సుమారుగా నాకు ఆ భాష మీద పట్టు వచ్చింది. అయినా ఎందుకలా అడిగావు?”
“మనం వేరే భాషలో మాట్లాడాలి అంటే ఆ భాషను వింటూ ఉండాలి, విని మాట్లాడే ప్రయత్నం చేయాలి, అప్పుడే మనకు ఆ భాషలో మాట్లాడటం వస్తుంది.”
“స్పోకెన్ ఇంగ్లీష్‌కి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్‌లో కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నారు. ఇంగ్లీష్ నేర్చుకుంటుంటే ఒక ఉత్సాహం, ఉల్లాసం కలుగుతుంది. అక్కడ ఇలాంటి ప్రాక్టికల్ అవగాహనతో కూడిన రీసెర్చి బేస్డ్ మోడ్యూల్ రూపుదిద్దారు అక్కడ. అది క్లాసు అనటానికి వీలు లేదు. దాన్ని వర్క్ షాప్ అని అనవచ్చు, నూటికి నూరు శాతం ‘ఎక్ప్సీరియెన్షియల్ లెర్నింగ్’ వల్ల నా టీంలో ప్రతి ఒక్కరికి విజయం లభించింది.
మన కాలేజిలో, స్కూల్స్‌లో, ఇంగ్లీష్‌ని ఒక సబ్జెక్ట్ లాగా బోధిస్తూ, మాట్లాడమని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇదేలాగ వుంటుందంటే ఒక అమెరికా వాడికి సంధులు, సమాసాలు చెప్పించి తెలుగులో మాట్లాడమని ఒత్తిడి చేసినట్టు వుంటుంది.
ఇక ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే, సాధారణంగా ఏ స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్స్టిట్యూట్‌ని తీసుకున్నా అక్కడ వుండే ఫాకల్టీ ఎవరు? ఏదో ఒక కాలేజిలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పని చేసే వ్యక్తికి ఇంగ్లీష్ గ్రామర్ బాగా వచ్చని చెప్పి ఆయన్ని తీసుకుని వచ్చి శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఆయనకి ఎంతసేపూ గ్రామర్ చెప్పించటం, షేక్స్‌పియర్ డ్రామాలు ఎక్స్‌ప్లెయిన్ చేయటం, పరీక్షలలో మార్కులు ఎలా తెచ్చుకోవటం అనే అంశాలు చెప్పించగలడే గానీ, పిల్లల చేత కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నేర్పించగల సామర్థ్యం వుండే అవకాశాలు తక్కువ.
ఒకరిద్దరు ఇంగ్లీష్ లెక్చరర్లు కమ్యూనికేటివ్ స్పోకెన్ ఇంగ్లీష్‌లో శిక్షణ ఇవ్వగలిగిన నేర్పును కలిగివుంటే వుండవచ్చు అక్కడక్కడ. అది కేవలం వారి వ్యక్తిగత ఆసక్తి వల్ల వారికి అలవడిన నైపుణ్యమే తప్పనిచ్చి, ఇంగ్లీష్ లెక్చరర్ అయినంత మాత్రాన స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ ఇవ్వగలరు అన్న గ్యారంటి ఏమీ లేదు.
ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే, నేను ఎక్కడైతే చేరి సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ నేర్చుకున్నానో, అక్కడ నాతో చదువుకున్న సహ విద్యార్థులు చాలా మంది ఏదో ఒక కాలేజిలో ఇంగ్లీష్ లెక్చరర్లుగా పని చేస్తున్నవారే. అంటే ఇంగ్లీష్ గ్రామర్ వచ్చి ఎమ్మే ఇంగ్లీష్ పట్టా వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇంగ్లీష్‌లో మాట్లాడటం రాదు.
మన ఇంజినీరింగ్ కాలేజీలోనే మనం చూశాం. ఇంగ్లీష్ లెక్చరర్ గారికి గ్రామర్ తెలుసే గాని, ఆయనే ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోయేవారు.”
“అంటే నీ ఉద్దేశంలో గ్రామర్ అవసరం లేదంటావా?” సందేహంగా అడిగాడు ప్రసాద్.
“గ్రామర్ లేకుండా ఏ భాషా నేర్చుకోవటం అసాధ్యం. కానీ గ్రామర్ నేర్పించే విధానంలోనే తేడా వస్తోంది. బ్రిటిష్ విద్యావేత్త లార్డ్ మెకాలే ఒక కుతంత్రంతో మార్చి ఏడవ తేది 1835 లో ఇంగ్లీష్ విద్యావిధానాన్ని మన భారతదేశంలో ప్రవేశ పెట్టాడు.
అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్‌ని కన్విన్స్ చేసి ఈ ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారు. అప్పుడు మన దేశంలో సంస్కృతం, పెర్షియన్ భాషలు ప్రధాన బోధనా భాషలుగా వుండేవి.
మెకాలే లక్ష్యం ఏమిటంటే:
- మన దేశ ప్రజలలో ఆత్మన్యూనత (ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్) పెంచటం
- మన సంస్కృతిని మనమే అసహ్యించుకునేలాగా చేయటం
- మనకు ఇంగ్లీష్ అర్థం అవ్వాలి కాని ధారాళంగా మాట్లాడటం రాకూడదు. మనల్ని మనం కించ పరచుకుంటూ, ఇంగ్లీష్ వారిని దైవ స్వరూపులుగా భావించుకోవాలి. ఇంగ్లీష్‌ని దేవ భాష స్థాయిలో మనం భావించాలి.
ఆ ప్రకారం తీసుకుంటే మెకాలె సఫలీకృతుడయ్యాడని చెప్పచ్చు.
మనం ఇంగ్లీష్‌లో మాట్లాడగలగాలి అంటే మనం ఇంగ్లీష్‌ని నేర్చుకునే విధానంలోనే వేరే పద్ధతి అవలంభించాలి.
ఆ మహత్తర అవకాశం నాకు రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్‌లో లభించింది.
***
ఒక్క ప్రసాద్‍కే కాకుండా ఓ పాతిక మందిని పోగేసి, రాజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పటం ప్రారంభించాడు, ఉచితంగా. క్లాసులు హుషారుగా ప్రారంభమయిపోయాయి.
రాజు ఇంట్లోనే డ్రాయింగ్ రూంలో క్లాసులు. ఓ పాతిక ప్లాస్టిక్ కుర్చీలు వేసి ఓ క్లాసు రూం వాతావరణం సృష్టించేశాడు రాజు. ఒక్క ప్రసాద్‍ని మాత్రమే కాక తమ కాలేజీలోని పాత క్లాసుమేట్స్ ఓ అయిదు మందిని, కాంపౌండ్‍లో వున్న ఓ పది మంది ఇంజినీరింగ్ కుర్రాళ్ళని కూడా ఇన్వైట్ చేశాడు.
ఒక చిన్న వైట్ బోర్డ్, మార్కర్స్‌తో ఓ క్లాసు రూం వాతావరణమే తయారై పోయింది. అందర్నీ ఉత్సాహపరుస్తూ ‘గుడ్ మార్నింగ్’ అంటూ క్లాసు మొదలెట్టాడు.
“మీ అందరీకీ ఇంగ్లీష్‍లో అనర్ఘళంగా మాట్లాడాలనుందా” మెదటి ప్రశ్న సంధించాడు. అందరూ ముక్తకంఠంతో ‘ఎస్’ అని సమాధానం చెప్పారు.
“అనర్ఘళంగా మాత్రమే కాక, ఇంగ్లీషే మీ మాతృభాషేమోనన్నంత సునాయాసంగా మాట్లాడాలనుందా?”
అందరూ ముక్తకంఠంతో మరోసారి ‘ఎస్’ అని అరిచి చెప్పారు.