[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]ఈ[/dropcap]సారి అమెరికా నుండొచ్చాకా, క్రిష్ణకాంత్ మీద బెంగా, జెట్‌లాగ్ కలిసి వారం రోజులు పడకేసా. అస్సలు లేవాలనే అనిపించలేదు! మా పెద్దబ్బాయి అశ్విన్ ఆట పట్టించేవాడు, ‘వాడు కేంపస్ సెలెక్షన్ వచ్చి హుండైలో జాబ్ చేస్తున్నప్పుడూ – జుబ్లీహిల్స్‌లో నీ పనులు చూసుకుని, వాడ్ని పికప్ చేసుకుని ఇంటికి తెచ్చేసేదానివి! చివరకి మాస్టర్స్‌కి వెళ్ళినా, స్వయంగా దింపి, వాడి కేంపస్, క్లాస్ రూమ్ చూసి, వచ్చినా ఇంకా దిగులేనా? అస్సలు నీకెప్పుడూ వాడు చిన్నపిల్లాడేనా?’ అని. అశ్విన్ వెళ్ళినప్పుడూ ఇలాగే బెంగపడ్డాను, వాడికేం తెలుసు!
వచ్చిన రెండో రోజునే సుశీల కోడలు, లక్ష్మీభారతికి ఫోన్ చేసి, వచ్చి నాతో పాటు తెచ్చిన సామాన్లు తీసుకెళ్ళమని చెప్పాను. ఆమె మొహమాటంగా, తర్వాత సుశీలతో ఫోన్ చేయించింది. “నేనొక హేండ్ బ్యాగ్ కూడా పంపాను, అది రాలేదు ఆంటీ!” అని.
అప్పుడు నాకు మూర్తి ఇంట్లో ఫ్రంట్ రూంలో ఆ బ్యాగ్ చూసి, అది రాజీది అనుకుని వదిలి పెట్టి వచ్చేయడం గుర్తొచ్చింది. ఉస్సూరుమన్నాను.. ఎంత ప్రేమతో కొందో పిల్ల పాపం, తన ఫ్రెండ్ కోసం…
మూర్తికి ఫోన్ చేసి అది ఎలాగైనా క్రిష్ణకి పంపమని, వాడు కొరియర్ చేస్తాడనీ చెప్పాను. “అలాగేనండీ” అన్నాడు. లక్ష్మీభారతికి “తెప్పిస్తాను, సారీ అమ్మా” అని చెప్పాను. కానీ మూర్తి అశ్రద్ధ చేసాడు. పంపించలేదు. కొన్నాళ్ళు మెయిల్స్ ద్వారా అడిగాను. తర్వాత క్రిష్ణకి చెప్తే, “మమ్మీ అక్కడే కొనేసి ఇచ్చేయ్యి, సతాయించకు మూర్తి గారిని” అన్నాడు.
తర్వాత భారతి సీమంతం వచ్చింది. అదే కలర్ బ్యాగ్ కొని ప్రెజెంట్ చేసాను. దానికి సమానం అవదు అనుకోండీ.
నా జీవితంలో అందరూ మంచివాళ్ళే, ఫ్రెండ్లీగా వుండేవాళ్ళే కలుస్తారు, చాలా సరదగా గడిచిపోయిందీ అనుకోకండి! కొన్నిసార్లు పంటికిందకి రాయిలా వచ్చే మహానుభావులూ కొందరొచ్చారు!
నేను ‘మధుమాసం’ సినిమా రాయకముందు, ‘రేపల్లెలో రాధ’ తర్వాత, బాబాయ్ లాంటి ఓ పెద్దమనిషి, “అమెరికా నుండి ఓ డాక్టరు గారు సినిమా తీస్తానని ఇండియా వచ్చారు. కోడి రామకృష్ణగారు డైరక్ట్ చేస్తారు. ఓ సారి గ్రీన్ పార్క్ కొచ్చి కథ చెప్పి వెళ్ళు” అన్నారు.
‘రేపల్లెలో రాధ’ సినిమా జరిగేటప్పుడు రచయిత్రిగా నిర్మాత ఎం.ఆర్.వి. ప్రసాద్ గారు కాని, డైరక్టర్ శరత్ గారు కానీ నాకు బోలెడు గౌరవం ఇచ్చేవారు. ఎంతో సరదాగా షూటింగ్‍లో పాల్గొనేదాన్ని. నాకు సినిమా వాళ్ళంటే అందరూ అనుకున్నట్లు భయపడే పరిస్థితేం రాలేదు! పైగా మా అమ్మ పక్కనే వుండేది.
మొదటిసారి గ్రీన్ పార్క్ హోటల్‍కి వెళ్ళినప్పుడు డైరక్టర్ కోడి రామకృష్ణ గారిని కలుస్తున్నాం అని, మంచి బొకే కొని, నేను మంచి చేనేత చీర కట్టుకుని, మా వారితో వెళ్ళాను.
అక్కడో నిర్మాత గారిని కలిసాను… పేర్లు ఎందుకు లెండి… మమ్మల్ని చూసి “మీరేనా రమణీ గారు?” అన్నారు ఆయన. పరిచయం చేసుకున్నాం, టిఫిన్స్ అవీ అయ్యాకా, డైరక్టర్ గారొచ్చారు. ఆయనకి బొకే ఇచ్చాం.
కోడి రామకృష్ణ గారిని కలవడం అదే ఫస్ట్ టైం. ఆయనని ఎవరు కలిసినా, బూస్ట్ తాగినట్టు వుంటుంది, అంత ఉత్సాహం నింపి పంపించేవారు. ఇది నేనే కాదు, ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు. చాలా సరదా మనిషి! అప్పుడు ఆయన ఒక దేశభక్తి సినిమా చేస్తున్నారు. ఈ అమెరికా డాక్టరు గారు నిర్మాతగా చెయ్యాలని ప్రిపేర్ అయి వున్నారు. అప్పటికే దగ్గర దగ్గర వంద సినిమాలు డైరక్ట్ చేసారు. నేను చెప్పిన కథ ఆయనకి పెద్దగా ఎక్కలేదు! జొన్నవిత్తుల గారినీ, పూసల గారినీ కూడా ఆరోజు గ్రీన్ పార్క్ హోటల్‍లో కలిసాను. పూసల గారు మాటలు, జొన్నవిత్తుల గారు పాటలు రాసేవారు కోడి రామకృష్ణగారికి. అప్పట్లో డైరక్టర్ గారితో నాకంత మంచి పరిచయం అవలేదు, కానీ 2011లో రామానాయుడు గారి స్టూడియోలో ఒక సబ్జెక్ట్ కోసం మాకు రెగ్యులర్ సిట్టింగ్స్ కొన్ని నెలలు జరిగాయి… ఎప్పుడూ “మీ స్టూడియోలో మీకు పని చేసిన అందరి డైరక్టర్స్ ఫొటోలూ వున్నాయి, నాది లేకపోవడం లోపంగా వుంది, మీతో సినిమా చేసే పోవాలనుంది సార్” అనేవారు నాయుడిగారితో. ‘మొగుడే రెండో ప్రియుడు’ అనే నా నవల కోడి రామకృష్ణ గారి డైరక్షన్‍లో ఆల్‍మోస్ట్ ఫైనలైజ్ అయింది. నా దురదృష్టం, అర్జున్ (జెంటిల్‌మేన్ హీరో)తో మెడ్రాస్ విజయాలో షూటింగ్ చేయడానికి వెళ్తే, ఆయనకి స్ట్రోక్ వచ్చింది హార్ట్‌కీ. పెరాల్సిస్ కూడా. టీవీలో చూసి నేను చాలా బాధపడ్డాను. దేవుడికి పూజలు కూడా చేసాను. ఆయన అప్పుడప్పుడూ నెలలు నెలలు అన్నం మానేసేవారు మొక్కుకుని! అమ్మవారికి తీవ్రంగా పూజలు చేసేవారు! మొండి మనిషి… మళ్ళీ కోలుకుని, హాండ్ స్టిక్‍తో తప్పటడుగులు వేయడం మొదలుపెట్టారు. మా ఇద్దరికీ చాలా స్నేహం కలిసి, నేను ఆయన్ని అపోలో హైదర్‍గుడాలో న్యూరోసర్జన్, మా డాక్టర్ మిత్రులు ఆర్.టి.ఎస్. నాయక్ గారి దగ్గరకి తీసుకెళ్ళి వైద్యం చేయించేదాన్ని! అల్లు అరవింద్ గారికి తీవ్రమైన నడుం నెప్పి అన్నప్పుడూ, డాక్టర్ నాయక్ గారినీ, ఆయన అసిస్టెంట్ ఉదయనీ ఇంటికి తీసుకెళ్ళి చూపించాను. అప్పుడు తండ్రి ఆరోగ్యం గురించి బన్నీ పడిన తాపత్రయం చూసి, డాక్టర్ గారు ఎంతో ముచ్చట పడ్డారు కూడా. తర్వాత డాక్టరు గారి దగ్గరకి వాళ్ళు ఇద్దరూ చాలా సార్లు వెళ్ళారు. నాకు కోడి రామకృష్ణ గారి ఫోన్ కనీసం వారంలో మూడు సార్లు వచ్చేది! మా అమ్మతో, మా వదినతో కూడా మాట్లాడేవారు. కానీ మొదటిసారి గ్రీన్ పార్క్‌కి వెళ్ళి కలిసినప్పుడు, ఫ్రెండ్‍షిప్ అవలేదు.
ఈ నిర్మాత పెద్దాయన. అప్పుడింకా నేను కొత్త, చిన్న వయసులో వున్నాను. ఆయన తలంతా నెరిసి కనిపించేసరికి, మా నాన్నగారి వయసేమో అనుకుని, అలాగే భావించి, మొదట్లో ఆయన ప్రవర్తన వేరుగా వుందని నేను గమనించలేదు!
“పద్మారావు నగర్‍లో ఓ ఇల్లు చూసుకున్నాను. ఎంత కాలం గ్రీన్ పార్క్‌లో వుంటానూ? అస్సలు ప్రైవసీ లేకుండా పోతోందీ. ఓసారి రా… మనం ఇద్దరం వెళ్ళి చూసొద్దాం, నీకు నచ్చితే అడ్వాన్స్ ఇచ్చేద్దాం” అన్నాడు.
అప్పుడూ నాకు బల్బ్ వెలగలేదు! “నేనెందుకు? ఊళ్ళో మీ చెల్లెలు గారున్నారు?” అన్నాను. “అబ్బా! నీకు నచ్చితే చాలు! వాళ్ళందరికీ ఆ ఎడ్రెస్ చెప్పను. నా తల తినేస్తున్నారు” అన్నాడు. నేను వెళ్ళలేదు.
ఆడిషన్స్ ప్రారంభం అయ్యాయి, హీరోయిన్స్ కోసం. “ఆ అమ్మాయి బాలేదు, మాట వినేట్టు లేదు… ఈ అమ్మాయి అయినా మాట వింటుందా?” ఇలా అడిగేవాడు ఈ నిర్మాత. నాకు అర్థమయ్యేది కాదు!
ఒకరోజు ఒక చిన్న అమ్మాయి, పదహారు, పదిహేడు ఏళ్ళు ఉంటాయోమో! ఏపిల్ పండులా వుంది, వాళ్ళ నాన్నతో వచ్చింది. సర్దార్జీ గారి అమ్మాయి. ఆడిషన్స్ అయ్యాకా, ఈ నిర్మాత నన్ను లోపలికి పిలిచి “ఎర్రగా… భలే వుంది కదూ! కొరుక్కు తినాలనిపించేట్టు… కానీ ఆ తండ్రి పడనిచ్చేట్టు లేడు… హీరోయిన్‍గా పెట్టుకుందాం అంటే!” అన్నాడు. నాకెందుకో ఈ ముసలాడు, మనవరాలి వయసుండే పిల్లని కొరుక్కు తినాలనిపించింది, అనడం నచ్చలేదు. ఆ తర్వాత ఒకటొకటీ, ఆయన మాటలూ, చేతలూ తలుచుకుని, ముసలాడికి మదపిచ్చిలా వుందని అర్థమైంది. ఆ తర్వాత అమ్మతో చెప్తే, “చండీయాగంకి తీసుకెళ్ళావు చూడు! అప్పుడు చూపులన్నీ నీకేసి, అదో రకంగా వున్నాయి… నేనే చెప్దాం అనుకున్నాను, నువ్వే అన్నావు… హోటల్‌కి గానీ, ఇంటికి కానీ ప్రభాకర్ పక్కన లేనిదే వెళ్ళకు” అంది. ప్రతీసారి అమ్మని తీసుకెళ్తూనే వున్నాను అప్పటికీ! ఇంతకీ ఆ ఎర్రటి ఆపిల్ పండు లాంటి పిల్ల ఈయనని ఇంకో రెండు సార్లు కలిసాకా, ఈయన సినిమాలో చెయ్యనందిట… ఆ పిల్ల ఛార్మీ! ఆ విషయం బాధపడిపోతూ నాకు ఫోన్ చేసాడు. అప్పట్లో లాండ్ లైన్ మాది! “ఇంకోసారి నాకూ ఫోన్ చెయ్యకండి… నేనూ మీ సినిమాకి రాయను” అని చెప్పా! మీద చేతులెయ్యడం, తాకడం చెయ్యకపోయినా, ఇలా ద్వంద్వార్థాలతో మాట్లాడే ప్రబుద్ధులు నాకు కొత్తేం కాదు! కానీ మొదట్లోనే కత్తిరించి పారేస్తాను.
(సశేషం)