అక్షరం మసకేసింది

0
3

[box type=’note’ fontsize=’16’] అబ్బాస్ మేలినమని కన్నడంలో రాసిన కథని ‘అక్షరం మసకేసింది’ అనే పేరిట తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు చందకచర్ల రమేశ బాబు. [/box]

[dropcap]స[/dropcap]గమే మూసిన తలుపులు నింపాదిగా తెరుస్తూ “సార్, లోపలికి రావచ్చా?” అని అడిగింది ప్రజ్ఞ. ఆమె మధురవాణి గుండెను తట్టగా “ఎవరు? లోపలికి రండి” అని లోగొంతుతో పిలిచారు డా. మదన్ మోహన్. ప్రజ్ఞ నెమ్మదిగా లోపలికి వచ్చి “నమస్కారం సార్” అంటూ తన కోమల హస్తాలను జోడించి తన విశాల నయనాలను విప్పారుస్తూ నిలబడింది. ఏదో పెద్ద పుస్తకంలో మునిగిపోయిన డా. మదన్ మోహన్ తన ముక్కు మీది కళ్ళద్దాలను సరిచేసుకుంటూ తల ఎత్తి చూశారు. ఆమె ఎర్రటి పెదవుల పైన తొణుకుతున్న చిరునవ్వుకు వివశుడైన ఆయన “కూర్చో ప్రజ్ఞా” అని తమకు ఎదురుగా ఉన్న కుర్చీని చూపించారు.

ప్రజ్ఞ తన వ్యానిటి బ్యాగ్ నుండి బాక్స్ తీసి డా. మదన్ మోహన్ ఎదురుగా పెట్టింది.

“ఇదేమిటి?”అని అడిగాడాయన.

“స్వీటండీ”

“ఎందుకు?”

“మీరు నా పి.హెచ్.డి గైడ్ కద సార్. ఆ సంతోషానికే” అంటూ ఆమె బాక్స్ తెరిచి ఒక బర్ఫీని ఆయన చేతిలో పెట్టింది.

“నీలాంటి ప్రతిభావంతురాలైన విద్యార్థికి గైడ్‌గా ఉండడం నా అదృష్టం. ఇంతవరకు నా క్రింద పది-పదిహేను విద్యార్థులు – విద్యార్థినులు పి.హెచ్.డి ముగించారు. ప్రస్తుతం ముగ్గురు చేస్తున్నారు. కానీ ఒక్కరైనా నాకు తృప్తినివ్వడం లేదు. నీ సినాప్సిస్ చదివి చాలా సంతోషమయ్యింది. నీ ఇంటర్వ్యూలో కూడా నువ్వు ఈ సబ్జెక్ట్ గురించి చాలా బాగా మాట్లాడావు. నీలో మంచి టాలెంట్ ఉంది. అందుకే అభినందిస్తున్నాను.” అన్నారు.

“సార్! మీ మాటలు నాలో ఉత్తేజాన్ని నింపుతున్నాయి.”

“నీ థీసిస్ ఒక అద్భుతమైన గ్రంథం కావడంలో సందేహం లేదు.”

“థ్యాంక్యూ సార్. ముందు స్వీట్ తినండి” అంటూ గుర్తు చేసింది ప్రజ్ఞ.

“ఎస్. ఎస్. నువ్వు కూడా తీస్కో” అంటూ ఒక బర్ఫీని ఆమె చేతిలో పెట్టారు డా. మదన్ మోహన్.

***

విశ్వవిద్యాలయంలోని సమాజ శాస్త్రం విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న డా. మదన్ మోహన్ గారికి ఇప్పుడు 51 సంవత్సరాల వయస్సు. మిసమిసలాడే బలమైన దేహం, రింగులు తిరిగిన జుట్టు, గుండ్రటి మొహం, సన్నని మీసాలు, కోరికతో చూసే కళ్ళు ఇవన్నీ డా. మదన్ మోహన్ గారి బాహ్య వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే లక్షణాలైతే, ఆయన అంతరంగ వ్యక్తిత్వం ఒక పట్టాన అంతు పట్టనిది. ఎన్నో సుడులు తిరిగేది, నిగూఢమైనది.

తన సబ్జెక్ట్ పైన అతనికున్న పట్టు అంతంత మాత్రమే అయినా అతడి మాటకారితనం చాల పేరుగాంచింది. ఆయనను భారతీయ సమాజపు శ్రేయోభిలాషి అనే లాగా ప్రతిబింబించింది. ఏదైనా ప్రశ్నలు ఎదురించేటప్పుడు అతడి ఆ మాటకారి తనమే పరమావధికి వెళ్ళి, అనవసరమైన విషయాలను వెలికి తెచ్చి వెకిలి నవ్వులు నవ్వుతుంది. స్వార్థపు మైదానంలో క్రీడించే ఆయన మనస్సు, చవకబారు కుయుక్తులలో నైపుణ్యతను సాధించింది. దాని ఫలితంగా డా. మదన్ మోహన్ విశ్వవిద్యాలయం యొక్క సిండికేట్, సెనేట్, అకడమిక్ కౌన్సిల్ సభ్యుడుగానూ, విద్యార్థుల శ్రేయోభిలాషిగా, ప్రచార శాఖ కార్యదర్శిగా, స్నాతకోత్తర కేంద్రం యొక్క దర్శకుడిగా, పరీక్షల డివిజన్ కోఆర్డినేటర్‌గా ఇలా అనేక పదవులు చేపట్టారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వర్క్‌షాపులలో, శిబిరాలలో ఉపన్యాసాలిచ్చారు. పేపర్లు ప్రెజెంట్ చేశారు. పెద్దవారి నీడను ఆశ్రయించడం, అధికారుల అడుగులకు మడుగులొత్తడం, ఎప్పుడూ రాజకీయ నాయకులతో భుజాలు రాసుకోవడం చేస్తూ విశ్వవిద్యాలయం లోపలా, బయటా చాలా పేరున్న మనిషిగా చెలామణి అవుతున్నారు. అలాగని ఆయన అందరికీ ప్రీతిపాత్రుడేమీ కాదు. ఆయనకు ఆప్తులకంటే శత్రువులే ఎక్కువ. కానీ ముల్లును ముల్లుతోనే తీయగలిగే వాడు కాబట్టి ఆయన గ్రహగతులు బాగున్నట్టే లెక్క. కానీ ఈ దానవుడు ఇంకెన్నాళ్ళు ఇలా చెలరేగగలడు? ఆయన ఆటలు కట్టే రోజు తొందరలో వస్తుందని ఆయన వలన అన్యాయానికి గురైన కొందరు ఆశపడుతుంటే, చేతకానివారు మాత్రం ఆయనకు నమస్కారం పెడుతూనో, మస్కా కొడుతూనో ఆయనతో సత్సంబంధాలు కాపాడుకుంటున్నారు.

***

అందమైన లతలా ఉన్న ప్రజ్ఞకు చదువు పైన మక్కువ ఎక్కువ. ఊర్ధ్వముఖ తపన ఆమెది. సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పార్ట్ టైమ్ లెక్చరర్‌గా పనిచేస్తూనే పి.హెచ్.డి చేయాలన్న కోరిక అమెది. డా. మదన్ మోహన్ గారి పేరు ఆమెకు ముందే తెలుసు. కానీ అతడే తనకు గైడ్‌గా ఉంటాడని కలగనలేదామె. ఇలా జరగడం తన అదృష్టంగా భావించి, ప్రొఫెసర్ పైన అత్యంత ఆదరాభిమానాలతో నడుచుకోసాగింది.

ప్రజ్ఞ తన ఎదురుగా కూర్చుని సోషియాలజీ గురించి చర్చించేటప్పుడు డా. మదన్ మోహన్ చాలా ఉల్లాసంగా ఉంటూ, అప్పుడప్పుడు ధ్యాన స్థితికి వెళ్ళేవాడు. ఎప్పుడైనా వాతావరణం గంభీరంగా తయారయిందని అనిపిస్తే, “పద ప్రజ్ఞా. ఒక కప్పు కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం” అంటూ దాన్ని తేలిక చేసేవాడు. అలంటి సమయాల్లో వారిద్దరి మధ్య వైయక్తిక విషయాలు చర్చకు వచ్చేవి.

ప్రజ్ఞ ఒక తెరచిన పుస్తకంలా ఉండేది. తను దాసరి కుటుంబానికి చెందినదనీ, తమ పూర్వీకులు పగటి వేషాలతో పొట్ట నింపుకునే వారనీ, క్రమేణా వీధి నాటకాలలోనూ, నాటకాలలోనూ తమ కళను ప్రదర్శించేవారనీ ఆమె చెప్పుకుంది. తన నాన్నమ్మ రంగూ బాయి, రంగభూమిపైనే తన ఆయుష్షంతా ధారపోసిందనీ, తనను కూడా వేదిక పైన ఆమెలాగ పేరుగాంచాలని ఆశించేదనీ చెప్పి నవ్వింది.

“బహుశా నీ అందం చూసి ఆమె అలా అనుండొచ్చు” అన్నారు డా. మదన్ మోహన్.

“మీరన్నది కరెక్టే సార్. నా అందం, లావణ్యం రంగభూమికి సరిగ్గా అతుకుతాయని నన్ను సంగీతం, నాట్యం నేర్చుకోవడానికి వేసింది”

“మీ నాన్నమ్మ మాట కూడా కరెక్టే. నువ్వు రంగభూమికేమైనా వచ్చుంటే ఒక అద్భుతమైన కళాకారిణిగా వెలిగేదానివి. సందేహం లేదు.”

“నాకైతే దాని పైన ఆసక్తి లేదు సార్. మా అమ్మానాన్నలకు కూడా అది ఇష్టం లేదు. బాగా చదువుకుని, గౌరవంగా బ్రతుకుతూ, సమాజానికి ఏదైనా సేవ చేయాలని నా ఆశయం. ”

“నువ్వు ఎన్నుకున్న ఉద్దేశం చాలా అభినందించదగ్గది. అయినా మనిషికి కులం ముఖ్యం కాదు. మనస్సు, గురి ముఖ్యం. మొహమాటం, ఆత్మన్యూనతా భావం వీటి నుండి బయటికి వచ్చిన మనిషి దేన్నైనా సాధించగలుగుతాడు.” అంటూ డా. మదన్ మోహన్ ప్రజ్ఞలో ఉన్న తపనకు నీరుపోశారు.

***

ప్రజ్ఞ తన పరిశోధనకు విషయంగా “భారతీయ సమాజంలోని వేశ్యా సమస్య: ఒక అధ్యయనం” ఎన్నుకుంది. “పరిశోధనకు ఈ విషయాన్ని ఎందుకు ఎన్నుకున్నావు?” అని అడిగారు డా.మదన్ మోహన్.

ఆమె చాలా నమ్మకంగా చెప్పసాగింది “మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే అతి ఉదాత్తమైనది కదా సార్? ఈ సంస్కృతి మహిళలను చాలా గౌరవంగా చూస్తుంది. ఆమెను ఒక దైవీ శక్తిగా నెత్తిన పెట్టుకుంది. కానీ ఇదంతా భ్రమ అనేటట్టు మహిళలను శోషణ చేయడం, ఆమెను వేశ్యను చేసి నీచంగా చూడడం ఒక విరుద్ధమైన విషయమే కదా. అంతస్తులను బట్టి మహిళలకు మర్యాదనివ్వడం సమంజసం కాదు. ఇలాంటి సమాజస్థితి మనకు దేవుడు నిర్దేశించాడా లేక మన మనుషులమే చేసుకున్నదా? మతానిదా లేక అజ్ఞానానిదా? ఈ వేశ్యా సమస్య మన సమాజానికి ఒక మచ్చగా మిగిలిపోతూ ఉంది సార్” ప్రజ్ఞ చాలా ఉద్వేగంతో చెప్పసాగింది.

“కానీ ఈ వేశ్యావాటికలు ఇప్పటివి కావు కదా” అన్నారు డా. మదన్ మోహన్.

“అలా అని ఈ ప్రపంచం ఉన్నంత వరకూ ఉండాలా సార్?”

“నా మాటలకు అర్థం అది కాదు. రాజులు, సామంతులు, జమీందార్లు వేశ్యలతో సంబంధాలు పెట్టుకునేవారు. తెలుసా?”

“అయితే మీ ఉద్దేశంలో వేశ్య అంటే ఎవరు సార్? ఒక మహిళ వేశ్యగా జన్మిస్తుందా?”

“వేశ్యా కులంలో పుట్టడం వలన వేశ్య అవుతుంది.”

“అంటే వేశ్య కూతురు వేశ్య అయి తీరాల్సిందేనా సార్?”

“అలాగని కాదు. అప్పటి కాలంలో వేశ్యలకు మంచి గౌరవం ఉండేది. వారు సంగీతం, నృత్యాలలో ఆరితేరినవారుగా ఉండేవారు. అంతే కాదు. రాజులు వారిని తమ గూఢచారులుగా ఉపయోగించుకునేవారు. తమ పగ తీర్చుకోవడానికి విషకన్యలుగా కూడా ఉపయోగించుకున్న సందర్భాలున్నాయి.”

“గౌరవం అంటే ఏమిటి సార్? ఆడి, పాడి, రసికులను ఆనందింపజేయడం, వారి విషయ లాలసలను తీర్చడం అంతేనా సార్? ఏ రాజైనా వారిని తమ పట్టపురాణిగా కూర్చోబెట్టుకున్న దాఖలాలున్నాయా? అంతఃపురంలో ఉంచి వారికొక గౌరవాన్నిచ్చారా? వారిని ప్రేమించారా? తమ భోగాలకు వాడుకుని, అదనుకు తగ్గట్టు ఉపయోగించుకుని వారి అందాన్ని, వయస్సును కొల్లగొట్టి, వారి వ్యక్తిత్వాన్ని చంపేసేవారు కదా!”

“వికసించిన పువ్వు అందం చూడడానికీ, మహిళ యొక్క సౌందర్యం అనుభవించడానికి అని వారి అభిమతం.”

“ఇది మాత్రం మగవాడి స్వార్థం సార్. తన అధికార మదంతో పూవు పరిమళాన్ని గ్రోలి, ఆడదాని అందాన్ని పీల్చేసే అహం అది. సౌందర్యారాధన అనేది ఒక ముసుగు అంతే. మగవాడు ఆ ముసుగు వేసుకుని అందాన్ని కొల్లగొడతాడు. ఇది అకస్మాత్తుగా జరిగింది కూడా కాదు సార్. ఒక ప్రణాళికాబద్ధంగా ముగ్ధురాలైన ఆడదాని పైన జరిగిన క్రౌర్యం. నీచమైన ప్రవృత్తి. అప్పుడు వారు పడిన కష్టం ఇప్పటికీ అమాయకులైన ఆడవాళ్ళు అనుభవించాల్సి వస్తోంది. రాజుల ఏలిక ముగిసి, ప్రజాస్వామ్యం వచ్చాకనైనా ఈ వేశ్యా వృత్తి అంతరించాలి కదా. ఊహు. ఇంకా ప్రబలిపోతోంది. మరి ఇది సిగ్గు పడాల్సిన సంగతే కదా సార్!” ఆమె మాటల్లో ఎంత ఆవేశం, ఆవేదన ఉన్నా ప్రజ్ఞ నిగ్రహం తోనే మాట్లాడ్తోంది అని గ్రహించారు డా. మదన్ మోహన్.

“రాజుల కాలంలో, గెలిచిన రాజు ఓడిపోయిన రాజు వద్దనుండి ఆడవాళ్ళని నజరానాగా పొందేవాడు సార్. కొందరు యుద్ధం జరిగేటప్పుడు బందీలుగా దొరికేవారు. వారంతా వేశ్యలుగా మారేవారు. దైవభీతి, అంధ విశ్వాసాలు, పరంపరాగతంగా వచ్చే సంప్రదాయాలు అనుకుంటూ దేవదాసీలుగా జీవితం వెళ్ళబుచ్చేవాళ్ళు. ఇప్పటికీ సార్, క్రిందిస్థాయి ఆడవాళ్ళు, పేద కుటుంబాల ఆడవాళ్ళు వేశ్యలుగా మారుతున్నారు. ఎందుకంటే వారికి పొట్ట గడవడం లేదు. మేరా భారత్ మహాన్ అని ఉత్తినే అరిస్తే సరిపోదు సార్. ఇంతమంది ఆడవాళ్ళు అసహాయక స్థితిలో తమ శరీరాలను అమ్ముకుని బ్రతుకుతుంటే మనం మహాన్ ఎలా అవుతాం సార్? మగవాడి కామ పిపాస అనే అగ్నిలో పడి శలభాల్లా మండి మాడిపోయే ఆడవాళ్ళ నరక సదృశ జీవితం ఒక సామాజిక సమస్య అని తేటతెల్లంగా కనిపిస్తుంది.”

డా. మదన్ మోహన్ ఆమె మాటల్ని జాగ్రత్తగా వింటూ, ఆమె ఆవేశంలోని అందాల్ని కళ్ళతో త్రాగుతున్నారు.

***

“రావయ్యా దొరా రా! ఇప్పుడు నేను గుర్తుకొచ్చినట్టుంది. ఒక ఫోన్ లేదు. లెటర్ లేదు. రెండు రోజుల్లో వస్తానని వెళ్ళినవాడివి. రెండు నెలలైనా ఉలకవు పలకవు. పి.హెచ్.డి చేసే మొహమేనా నీది? మొదట నక్క వినయాలు ప్రదర్శించడం, తరువాత తలబిరుసు చూపడం. రెండు సంవత్సరాలయ్యింది నువ్వు ఒక చాప్టర్ రాసి. రెండో చాప్టర్ గురించి ఒక్క మాట లేదు. రిసర్చ్ అంటే ఏమనుకున్నావు నువ్వు?” డా. మదన్ మోహన్ అరుస్తున్నారు. ప్రజ్ఞ లోపలికి రాబోయి, లోపల జరుగుతున్న ముచ్చటను చూసి మళ్ళీ వెనక్కి అడుగులు వేసింది.

“లేదు సార్. మా నాన్నకు అస్సలు పానం బావుండలేదు. దవాఖానకు ఏసినం సార్. పైసల్ గురించి ఆడికీ ఈడికీ ఉరకాల్సొచ్చింది సార్. నాన్నను మల్లీ ఊరికి తోల్కపోయినాక వద్దామంటే కాలేజీల మస్తు పనుండె సార్. అందుకోసం…..” తన పల్లె యాసలో వినయంగా చెపుతున్నాడు బసవణ్ణెప్ప.

అతడి ఆందోళనతో కూడిన మాటలని ఖాతరు చేయలేదు డా. మదన్ మోహన్. “తప్పుచెయ్యడం. మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి వెయ్యి అబద్ధాలు. ఇందులో చాలా తెలివే ఉంది నీకు. కానీ బాధ్యత గుర్తు లేదు. చదువు పైన ఆసక్తి లేదు. పోనీ స్వంత ఆలోచనలైనా ఉన్నాయా పి.హెచ్ డి కి. అదీ లేదు. ఏదేదో రాసి తీసుకురావడం. నా నెత్తిన పడెయ్యడం. నా బుర్ర తినడం.” డా. మదన్ మోహన్ ఇంకా తీవ్ర స్థాయిలోనే అరుస్తున్నారు.

“సార్. ఈసారికి తప్పు కాయండి సార్. ఇంక మీద మీరు చెప్పిన టైంకి వచ్చి సీరియస్‌గా పని చేస్త సార్. ఇదొక్క సారి కడుపుల ఏస్కొండి సార్.” బసవణ్ణెప్ప బ్రతిమిలాడాడు.

“డాక్టర్ పదవి అంటే బజార్లో దొరికే సామాను అనుకున్నావా? డాక్టర్ అవ్వాలని ఆశేమో కొండంత. దాని గురించిన ప్రయత్నం మాత్రం శూన్యాతి శూన్యం. నేనెవరునుకున్నావు డా. మదన్ మోహన్‌ని. నేనెంత చండశాసనుణ్ణో ఈ యూనివర్సిటీ క్యాంపస్ లోనే కాదు చుట్టు పట్ల అందరికీ తెలుసు. నా దగ్గర సోమరిపోతులకు అవకాశం లేదు. పని… పని… నాకు పనిచేసే వాళ్ళు కావాలి. దగుల్బాజీతనం నాకు సరిపడదు. ఎవరి ఒత్తిడికీ నేను లొంగను. నిజాయితీగా పని చేసేవాళ్ళకే నా దగ్గర ఫలితం ఉంటుంది…. ” బసవణ్ణెప్ప యొక్క మౌనాన్ని దురుపయోగ పరచుకుంటూ ఘీంకరిస్తూనే ఉన్నారు డా. మదన్ మోహన్.

బసవణ్ణెప్ప ఒక పేద రైతు కొడుకు. ముప్ఫై సంవత్సరాల వయసు. సిటీలోని రెండు, మూడు కాలేజీల్లో పార్ట్ టైం లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. పి.హెచ్.డి చేసుకుంటే పర్మనెంటు అవుతుందని ఆశ. అతడి కాలేజ్ ప్రిన్సిపాల్ ఒకాయన డా.మదన్ మోహన్‌ని బ్రతిమాలి అతడికి గైడ్‌గా ఉండడానికి అంగీకరింప చేశారు. బసవణ్ణెప్ప స్వతహాగా బుద్ధిశాలి కుర్రాడే. మంచివాడు కూడా. గైడ్ చూపే ఇలాంటి కోపతాపాలను నిభాయించే మెళకువ కలవాడే.

“నేను అప్పట్నుండి అరుస్తున్నాను. స్తంభం మాదిరిగా అలా నిలబడే ఉన్నావేం?”కనుబొమలు ఎగరేస్తూ అన్నారు డా. మదన్ మోహన్.

“సార్. పగలూ రాత్రీ కూసుని రెండో చాప్టర్ రాస్త సార్.”

“మరే! నువ్వు రాసిందంతా దిద్దుకుంటూ కూర్చుంటాను నేను. నాకంత టైం లేదు. నాకూ ఇల్లూ, వాకిలీ, పెళ్ళాం, పిల్లలూ ఉన్నారు.” అంటున్న ఆయన మాటలను మధ్యలో తుంచేస్తూ “సార్” అన్నాడు బసవణ్ణెప్ప. “ఏమిటి” అన్నట్టు చూశాడాయన.

“సార్. ఊరినుండి వచ్చేప్పుడు మా అమ్మ పప్పు దినుసులు, వెన్న పంపింది. మేడమ్ గారికని కమ్మని నెయ్యితో చేసిన సున్నుండలు పంపింది సార్.” అని చెప్పి నించున్నాడు.

డా. మదన్ మోహన్ గారి గొంతు మారి పోయింది. “సరే సరే. ఈ రోజు నేను కారు తేలేదు. బైక్ ఉంది. అవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చెయ్యి. అన్నట్టు వెళ్ళేటప్పుడు కొన్ని కూరగాయలు పట్టుకెళ్ళు” అంటూ వంద నోటు తీశారు.

“కూరగాయలు నేను తీసుకెల్తా లెండి సార్” అంటూ బసవణ్ణెప్ప అనేసరికి ఆ వందనోటును మళ్ళీ జేబులోకి చేర్చాడు.

బసవణ్ణెప్ప తలుపు తీయగానే లోపలికి వచ్చింది ప్రజ్ఞ. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఆమెను లోనికి రమ్మన్న డా. మదన్ మోహన్ వారిద్దరికీ పరస్పరం పరిచయం చేశారు. బసవణ్ణెప్ప ప్రజ్ఞకు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు.

***

మంచం పైన పడుకుని ఆలోచిస్తున్న ప్రజ్ఞకు ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు రాసాగింది. బసవణ్ణెప్ప వినమ్ర స్వభావానికి బదులుగా నిప్పురవ్వలా ఎగసిపడుతున్న డా. మదన్ మోహన్, ఉన్నట్టుండి ఎలా మంచుగడ్డలా చల్లబడిపోయారో తలచుకుంటే ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకి. బసవణ్ణెప్ప విన్నపానికి కరగని ఆయన, అతడు తమ ఊరినుండి తెచ్చిన పప్పు దినుసులు, వెన్న, సున్నుండల విషయం వినగానే కరగిపోయిన వైనం యొక్క లోతుల గురించి ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకుంది.

ప్రజ్ఞ చురుకుదనం గమనిస్తే ఆమె నిర్ణీత గడువుకంటే ముందుగానే తన థీసిస్ రాసి ముగిస్తుందని అనిపించేది. ఆమె సమయబద్ధంగా తన చదువును కొనసాగించడమే దానికి నిదర్శనం. ఆమె చలాకీ స్వభావం, హాయి కలిగించే మాటల తీరు, మనస్సులోని బాధలను తీసివేసే ఆమె నిర్మలమైన నవ్వు అందర్నీ ఆకట్టుకోసాగాయి. బసవణ్ణెప్ప అలాగే ఇంకో రిసర్చ్ స్కాలర్ చెలువరాజు ఆమెకు పరిచయమైనప్పటినుండి ఆమెను “సిస్టర్…. సిస్టర్” అని పిలుస్తూ ఆమెకు అండగా ఉంటూ, ఆమె భావనలను పంచుకోసాగారు. ఆమె ఫీల్డ్ వర్క్‌లో సహాయ పడసాగారు.

డా. మదన్ మోహాన్ వారిద్దరికీ తలమునిగేటంత పనులను అప్పజెప్పేవారు. చెలువరాజునైతే ఇంటి నౌకరు కంటె హీనంగా చూసేవారు. పాతిక సంవత్సరాల అందగాడైన చెలువరాజు ఆ పనులనన్నింటినీ ధన్యతా భావంతో చేసేవాడు. పల్లెటూరి అమాయకత్వం, పేదరికం అతడిని ఇలాంటి వాటికి లొంగదీసింది. డా. మదన్ మోహన్ ఊరికంతటికీ రాజయినప్పటికీ, వాళ్ళావిడకి మాత్రం జోరూ కా గులామే. ఆయన భార్య మనోహరి ఎప్పుడు నవ్వుతూ వస్తుందో, ఎప్పుడు కాళికావతారం దాలుస్తుందో అంతుబట్టేది కాదు.

ఆగర్భ శ్రీమంతుల ఒక్కతే అమ్మాయి కావడం మూలాన, ఆమె ఒంటినిండా బంగారం దిగేసుకుని, మహిళా సంఘం మీటింగులు, సమాజ సేవ అని సమయం గడిపేది. ఇద్దరు పిల్లలు కాన్వెంట్‌లో చదివేవారు. వారిద్దరినీ స్కూలుకు దింపడం, మళ్ళీ తీసుకు రావడం చెలువరాజు డ్యూటీ. అతడినుండి ప్రతి పనినీ చేయించుకుంటున్న మనోహరి, అతడిని వరాండా దాటి లోపనికి రానిచ్చేది కాదు. చెలువరాజు దలితుడు. అతడు లోపలికి వస్తే తాము కులభ్రష్టులమవుతామని ఆమె భ్రమ. కానీ ఎవరు తెచ్చినా, వారు తీసుకొచ్చే వస్తువులు, పదార్థాలు మాత్రం ఆశ పడే తీసుకునేది.

డా. మదన్ మోహన్ ఆమెను పెళ్ళి చేసుకున్నారు అనే కంటే, వరకట్నంగా నగదు, బంగారం పోసి ఆమె అతడిని కొన్నది అనడమే సబబు. కాబట్టి, ఆయన తన భార్యకు ‘దమ్ము’ లేని పతిగా, ఎలాగో ఆమెను నిభాయించుకుంటూ వస్తున్నారు. అతడికి ఎక్కడలేని కామవాంఛ. ఆమె ఏమో సహకరించదు. ఆ కారణంగా డా. మదన్ మోహన్ తన స్త్రీ వ్యామోహాన్ని, తమ వ్యక్తిత్వానికి ఏ మాత్రం కళంకం అంటకుండా తీర్చుకోసాగారు. ఆయన వద్ద పి.హెచ్.డి చేస్తున్న మోనికాతో ఆయన ఆప్త సంబంధాన్ని పెట్టుకున్నారు.

వయస్సు ముప్ఫై అయిదు దాటినా మిసమిసలాడే యవ్వనం, కైపెక్కించే చూపులు, చక్కెర పలుకుల్లాంటి మాటలు, ఆహ్లాదకరమైన నవ్వు, అన్నిటినీ తేలికగా తీసుకునే నిర్లక్ష స్వభావంతో ఉన్న మోనికాను డా. మదన్ మోహన్ చాలా ఇష్టపడి గైడ్ చేసేవారు.

స్వతహాగా మోనికాకు పి.హెచ్.డి చేసే కోరికేం లేదు. బయటి రాష్ట్రం నుండి వచ్చిన అమె ఒక ప్రైవేట్ కళాశాలలో సమాజ శాస్త్ర విభాగపు ముఖ్యస్తురాలుగా ఉండేది. ఆ కళాశాల యాజమాన్యం వారు ఆమెను ఖాళీ అయిన ప్రిన్సిపాల్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆమె అనుభవం, విద్యార్హతల కంటే ఆమె జాతి, లావణ్యం, ఉత్సాహం, ఆమె వ్యవహరించే తీరు తమ కళాశాలకు ఉపయోగకరమవుతాయని వారి అంచనా. ఇతర సీనియర్ ప్రొఫెసర్‌లు వీరితో పోట్లాడలేక తమ సమ్మతిని లిఖితపూర్వకంగా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఇక ఆ పదవికి కావలసిన విద్యార్హత అయిన పి.హెచ్.డి చేసి తీరాల్సిన అవసరం వచ్చి పడింది మోనికాకు. యాజమాన్యం వారే బలవంతంగా ఆమెను డా. మదన్ మోహన్ గారి వద్దకు పంపారు. ఆమె నుండి అన్ని రకాల సౌలభ్యాలు అందుతాయని తమకు అనిపించిన తర్వాత డా. మదన్ మోహన్ గారు ఆమె పి.హెచ్.డి థీసిస్‌ను కూడ తామే వ్రాసిపెట్టే సంపూర్ణ బాధ్యతను నెత్తిన వేసుకున్నారు.

తీరిక దొరికినప్పుడల్లా మోనికా, డా. మదన్ మోహన్ గారి దగ్గరికి వచ్చేది. వారాల కొలది వారిద్దరు యునివర్సిటి గెస్ట్ హౌస్ లోనో, లేదా ఎప్పుడైనా లాడ్జ్‌ల లోనో ఉండిపోయే అలవాటు చేసుకున్నారు. వారిద్దరి మధ్య జరిగే చర్చలు వారి విషయానికి సంబంధించినవా లేక వైయక్తికమా అన్న రహస్యం వారుంటున్న గది నాలుగు గోడలకు మాత్రమే తెలిసేది. డా. మదన్ మోహన్ గారు మాత్రం మోనికా థీసిస్ వ్రాయడానికి శ్రమ పడేవారు. లేదా బసవణ్ణెప్పను కానీ, చెలువరాజును కానీ కూర్చోపెట్టుకుని వ్రాయించే హడావుడిలో ఉండేవారు.

***

మాటి మాటికీ డా. మదన్ మోహన్ మోనికాని గుర్తు చేసుకునేవారు. ఆమె స్వభావం, వ్యక్తిత్వం గురించి పొగిడేవారు. ఒక్కసారి మాత్రం ఆమెను ప్రజ్ఞ చూడ్డం జరిగింది. డా. మదన్ మోహన్ కావించిన పరస్పర పరిచయం తరువాత మోనికా స్నేహజీవి అనిపించింది ప్రజ్ఞకు. కాని ఆమెది విచ్చలవిడి ప్రవృత్తి అని తెలిసిపోయింది. డా. మదన్ మోహన్ తో ఆమె చనువు కొంచెం అతిగానే అనిపించింది.

ఆ రోజంతా మోనికా ప్రజ్ఞతోపాటే గడిపింది. ఇద్దరూ కాంటీన్‌కి కలిసే వెళ్ళారు. తమ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆనందించారు. ప్రజ్ఞ లోని గాంభీర్యాన్ని ఇష్టపడింది మోనికా. కానీ తన చదువు గురించి మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. ప్రజ్ఞ కుతూహలం పట్టలేక అడిగినదానికి “సార్ ఉన్నారుగా. అంతా ఆయనకే తెలుసు” అంటూ నవ్వుతూ తేల్చేసింది. తరువాత ఆమె ప్రజ్ఞకు కనిపించలేదు.

బసవణ్ణెప్ప, చెలువరాజు శ్రద్ధతో వ్రాసి తీసుకొచ్చిన వ్యాసాలను ఏ మాత్రం పట్టించుకోని డా. మదన్ మోహన్, మోనికా వ్యాసాన్ని మాత్రం పూర్తి చేసే పనిలో మునిగి ఉండేవారు. ఇతరుల బరువును తాము మోస్తున్నట్టు అనిపించేది బసవణ్ణెప్ప, చెలువరాజులకు. వ్రాసి వ్రాసి అలసిపోతున్న ఇద్దరికీ అసలు పి.హెచ్.డి జోలికి వచ్చిందే తప్పన్నట్టుగా అనిపించినా, వాళ్ల భవిష్యత్తు వారిని వెక్కిరించేది. డా. మదన్ మోహన్ గారిని గైడ్‌గా అంగీకరించినప్పుడే తాము రోట్లో తలకాయ పెట్టినట్టయింది. ఇక రోకటి పోటుకు భయపడితే ఎలా? అనుకున్నారు. విశ్వవిద్యాలయాలలో అధ్యయనం చేయడానికి తమకు తెలివి అయినా ఉండాలి, లేకపోతే తాము ఆడదైనా అయ్యుండాలి అని తమ మనస్సును సమాధానపరచుకునే వారు.

***

ఇటీవల ప్రతి రోజూ ఇబ్బందిగానే అనిపించసాగింది ప్రజ్ఞకు. డా. మదన్ మోహన్ గారి ముఖ కవళికలు తన నుండి ఏదో కోరుతున్నట్టుగానూ లేదా ఏదో అర్థం చేసుకోమని అంటున్నట్టుగానూ అనిపించసాగాయి. వేటగాడి కుయుక్తి వేషం మార్చుకుని వచ్చినట్టుండేది. ఇదంతా గమనించి కూడా గమనించనట్టున్న ప్రజ్ఞ ధోరణి డా. మదన్ మోహన్ గారి సంయమనాన్ని పటాపంచలు చేసి ఉన్మాదానికి ప్రచోదిస్తున్నట్టు అనిపించసాగింది.

చర్చించాల్సిన విషయాలను ప్రక్కన పెట్టి, అనవసరమైన వాటిని ప్రస్తావించడం, అప్పుడప్పుడు చేతుల్ని, ఒంటిని తాకడం, కాఫి టిపిన్‌లకు బలవంతం చెయ్యడం, రాత్రి డిన్నరుకు పిలవడం, కార్లో కూర్చోమని బలవంతం చెయ్యడం లాంటి డా. మదన్ మోహన్ గారి కుయుక్తుల నుండి ఎలాగో తప్పించుకుంటున్న ప్రజ్ఞ ఈ విషయాన్ని బసవణ్ణెప్ప, చెలువరాజులతో ప్రస్తావించింది. బసవణ్ణెప్ప “సిస్టర్, జాగ్రత్త” అని మాత్రమే అన్నాడు. చెలువరాజు మాత్రం “ఈయన రంగేళీ రాజా సిస్టర్. అమాయకపు ఆడపిల్లలు ఈయనకి బలౌతారు” అంటూ కొన్ని ప్రకరణాలను వివరంగా చెప్పి డా. మదన్ మోహన్ గారి చపల చిత్తాన్ని నగ్న పరచాడు. దాంతరువాత ప్రజ్ఞ అతడితో ఉండే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండసాగింది.

ఆ రోజు “నిన్న రాత్రి నువ్వు వ్రాసిన క్రొత్త ఛాప్టర్ చదివాను. క్రొత్త వెలుగులు కనిపించాయి. వేశ్యావాటికలు ఎంత న్యాయసమ్మతం కాకపోయినా, వాటిని సమూలంగా నాశనం చేయాలి అనే నీ వాదం నాకెందుకో అపరిపక్వమైన ఆలోచనగా అనిపిస్తుంది. ఒక ఆడది వేశ్యావృత్తిని చేపట్టడానికి పురుషుడే కారణమనడం కేవలం ఒక వైపు అభిప్రాయం. అది పురుష ద్వేషం అని కూడా అనిపిస్తుంది. ఆడది కూడా సగం సహకరిస్తుంది కనుక ఆమె కూడా సగం అపరాధి అని వ్రాసుంటే బాగుండేది.” అంటూ చర్చ ప్రారంభించారు డా. మదన్ మోహన్.

“సార్. నేను ప్రతి వేశ్యనూ అమాయకురాలు, మూర్ఖురాలు అని భావిస్తాను. వారంతా తుమ్మెద రొదలకు వశమయినవారు. ఉత్త పొట్టకూటికే కాదు. ప్రేమ, ఆప్యాయతల కోసం కూడా మకరందం లాంటి తమ మనస్సును, తనువును ధారపోసినవారు. శలభాలై నిప్పుకు ముద్దిచ్చి తమ జీవితాన్ని కాల్చుకున్నవారు. వారు ఎప్పటికీ అపరాధులు కారు సార్. వారు శోషితులు,మగవాడి లైంగిక దౌర్జన్యానికి బలయినవారు. ” ప్రజ్ఞ తన వాదం మీద గట్టిగా నిలబడింది.

“ఎంతో మంది ఆడవాళ్ళు తమ ఒళ్ళమ్ముకుని జీవితం గడపడం అన్నది అంతే వాస్తవం కదా!”

“మరి బ్రతకడానికి వేరే దారులు లేకపోతే ఇలాగే అవుతుంది సార్. కానీ ఇలా ఆడది ఒళ్ళమ్ముకోవడం న్యాయసమ్మతం కాదు మన దేశంలో. మోసగాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు ఒళ్ళమ్ముకోవడం తప్పనిసరి, ఆమె హక్కు అని వాదిస్తారు. వెలుగుల ద్వారం మూసేసి ఆమెను చీకట్లో మగ్గనిస్తారు. వారంతా ఆమె సంపాయించిన ఆ పాపపు కూడు తినేవారు సార్. వేశ్యావృత్తిలో ఉన్నఒక్క ఆడదానికైనా ఆత్మ విశ్వాసం నింపి, ఆమెని క్రొత్త జీవితంలోకి తీసుకు వెళ్ళే మగవాళ్ళు ఈ సమాజంలో ఎంత మంది ఉన్నారు మీరే చెప్పండి సార్. ఆమెను ఎర్ర దీపం క్రిందే మగ్గనిస్తారు తప్ప ఆమెకు పచ్చ దీపం చూపరు.”

“వేశ్యా వృత్తిలో ఉన్నవాళ్ళకు అక్కడి నుండి బయటికి రావాలన్న తపన ఉండాలి. లేకపోతే వాళ్ళ ఉద్ధరించడం అనేది కలలోని మాట.”

“ఒక వేశ్య మారేదేమీ కష్టం కాదు సార్. ఆమె మనస్సును మార్చివేసే కరుణామయుల అవసరం ఉంది మన సమాజానికి. ఏసు ప్రభువు యొక్క కనికరం వలన మేరి మ్యాక్డలిన్ వేశ్యావృత్తిని వదలి రాలేదా? బుద్ధుడి కరుణ వల్లనే ఆమ్రపాలి వేశ్యావృత్తి నుండి సన్మార్గం వైపు వచ్చింది. ఏసు, బుద్ధుడి వంటి మానవత్వం ఉన్న పురుషులే ఉంటే భూమి పైన ఒక వేశ్యకూడా ఉండదు సార్. వేశ్యా వృత్తి తాలూకు అవశేషం కూడా ఉండదు.”

“ఆదర్శం వల్లించే ఈ మాటలు వినడానికే బావుంటాయి. వాస్తవంగా చాలా కష్టం. వేశ్యా సమస్య అంత తొందరగా సమసిపోయే సమస్య కాదు. ఇలా నేను నెగెటివ్‌గా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. ఏది ఏమైనా ఈ సమస్యా పరిహారానికి నువ్వు ఏం సూచిస్తావో అని ఆసక్తిగా ఉంది” అంటూ చర్చకు శుభం పలికారు డా. మదన్ మోహన్. కొన్ని సిడిలు ఇస్తూ “ఇంట్లో ఈ సిడిలు చూడు. నీ పరిశోధనకు క్రొత్త సూచనలు దొరకొచ్చు.” అన్నారు. ఉత్సవ్, కోఠి, మండి, కళ్యాణ మండపం లాంటి వేశ్యా సమస్యల గురించి తీసిన సిడిలను జాగ్రత్తగా తన వ్యానిటీ బ్యాగ్‌లో వేసుకుని వెళ్ళింది ప్రజ్ఞ.

***

మోనికా వాచాలత్వం, ప్రజ్ఞ గాంభీర్యం డా. మదన్ మోహన్‌లో కుతూహలాన్ని రేకెత్తించాయి. మోనికాది శ్రమపడకుండా విరిసిన పువ్వులాంటి స్వభావం. ఆ పరిమళాన్ని ఎవరైనా ఆస్వాదించవచ్చు. కాని ప్రజ్ఞ గాంభీర్యం అలాకాదు. గుట్టుగా, సవాలు విసిరేలా ఉంటుంది. అలాంటి గాంభీర్యాన్ని ఛేదించి, తనదిగా చేసుకుంటే కలిగే పరమ సుఖం, గెలుపు డా. మదన్ మోహన్ గారిని ఊరిస్తూనే ఉంది. ప్రజ్ఞ తన ఆ గాంభీర్యం తోనే ఆయనను చికాకు పెట్టసాగింది. ఆయన మనస్సు కూడా ఒక్కసారైనా ఆమె సంయోగం కోసం, ఆయన వ్యక్తిత్వపు సరిహద్దులను దాటి ఆతర పడసాగింది. దానిని ప్రచోదించే, ప్రేరేపించే క్రియలను ఆయన నయంగానే చేయసాగారు కూడా.

తన భార్య, మనోహరి, ఆమె చెల్లెలి పెళ్ళికోసం ఒక నెల్లాళ్ళు ఊరెళ్ళడం ఒక మంచి అవకాశంగా తోచింది డా. మదన్ మోహన్‌కు. తనకేదో థీసిస్ పని చాలా ఉండడం వలన ఒక నెల పాటు తన వద్దకు రాకూడదని బసవణ్ణెప్పకు గట్టిగా శాసించారు. చెలువరాజుకు డబ్బులిచ్చి ఊరికెళ్ళి రమ్మని పంపించారు. రోజంతా ప్రజ్ఞ తనతోనే ఉండేటట్టు, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ కూడా తనతోనే తినేట్టు ప్లాన్ సిద్దపరచ సాగారు డా. మదన్ మోహన్.

ఇదేం తెలియని ప్రజ్ఞ, ఆయన ఫోన్ రాగానే ఆయన చేంబర్‌కి వడివడిగా వచ్చి చేరింది. ఆయన మంచి మూడ్‌లో ఉన్నట్టు కనిపించారు. రాగానే నవ్వుతూ ఆమెను కుర్చీలో కూర్చోమన్నారు. తను వ్రాసి తెచ్చిన కాయితాల కట్టను ఆయన ముందుంచి “ఇది నేను వ్రాసిన కొత్త ఛాప్టర్ సార్. దీని గురించి మనం చర్చించాలి” అనింది ప్రజ్ఞ.

“ఈ రోజు నేను నీ కోసమే ఫ్రీ చేసుకున్నాను. నిదానంగా చర్చిద్దాం. అన్నట్టు, నేనిచ్చిన సిడిలు చూశావా” అని అడిగారు డా. మదన్ మోహన్.

“చూశాను సార్. బాగున్నాయి. చాలా థ్యాంక్స్.”

“థ్యాంక్స్ ఎందుకు?”

“ఆ చిత్రాలు నేను ఇంతవరకు చూడలేదు. మీరా అవకాశం కల్పించారు. నా పి.హెచ్.డి అధ్యయనానికి చాల ఉపయోగపడ్డాయి అవి.” సంతోషం వ్యక్త పరచింది ప్రజ్ఞ.

డా. మదన్ మోహన్ ఆమె మొహాన్ని సూక్ష్మంగా అవలోకించారు. ఆ సినిమాలలో కనిపించే అశ్లీలత తాలూకు పరిణామం ఆమె మొహంలో ఏదైనా కనిపిస్తుందేమో అని తెలుసుకునే కుతూహలం ఆయనకి. తన మనస్సులోని కోరిక యొక్క పూర్వసిద్ధత కోసమే ఆయన ఆ సిడిలు ప్రజ్ఞకు ఇవ్వడం జరిగింది. కాని ఆమె మొహంలోని నిర్లిప్తత ఆయన ఉత్సాహాన్ని క్రుంగదీసింది. అలా ఓటమిని ఒప్పుకుంటే ఆయన డా. మదన్ మోహన్ ఎందుకవుతారు?

ఆమె వ్రాసి తెచ్చిన క్రొత్త ఛాప్టర్ పేజీలను తిప్పుతూ, తన మనసులోని కుయుక్తికి సంతోషపడిపోతూ, ప్రజ్ఞను కొంత తన గాంభీర్యం తోనూ, కొంత తన మాటలతోనూ తమ వైపు తిప్పుకోసాగారు. “నీ అక్షరాలు చాల ముద్దుగా ఉంటాయి ప్రజ్ఞా” అన్నారాయన ముందుగా. ప్రజ్ఞ మొహంలో మందహాసం తొణికింది. “నీ నవ్వు గులాబీ విరిసినట్టు” అన్న మెచ్చుకోలు ఆయన నాభినుండి బయలుదేరి స్వరపేటిక వరకు వచ్చి ఆగిపోయింది. ఉన్నట్టుండి తమ చిన్నప్పటి, కాలేజి రోజుల జ్ఞాపకాలను కథలుగా చెప్పి, ఒక రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టించారు అక్కడ. తన వాచీ చూసుకున్న ప్రజ్ఞ “సార్. మీ భోజనం సమయమయ్యింది. ఇక నేను వస్తాను” అంటూ లేచే ప్రయత్నం చేసింది. “మనిద్దరం క్యాంటీన్ కి వెళ్దాం పద” అన్నారు డా. మదన్ మోహన్. ప్రజ్ఞ నిరాకరించింది. “సార్. నేను ఇక్కడికి వచ్చేటప్పుడే తినేసి వచ్చాను” అన్నది. తన మొదటి ప్లాన్ నిష్ఫలం కాగా. “సరే. అయితే ఒక కండిషన్. రాత్రి డిన్నర్ కి నువ్వు కంపెనీ ఇవ్వాలి.” అన్నారు డా. మదన్ మోహన్.

“ఎందుకు సార్? మేడం గారు ఊళ్ళో లేరా?”

“ఆమె చెల్లెలి పెళ్ళి. ఒక నెల పాటు ఊరెళ్ళింది.”

“కానీ నాకు డిన్నర్ గిన్నర్ వద్దు సార్. మీ ఆహ్వానానికి థ్యాంక్స్.” అంటూ తన వ్యానిటీ బాగ్‌ను భుజానికి తగిలించుకుంది ప్రజ్ఞ.

“ఇంటికేనా? నువ్వు రాసుకొచ్చిన ఛాప్టర్ గురించి మరి కొంత సేపు చర్చిద్దాం. నేను కాంటీన్‌లో ఏదైనా టిఫిన్ చేస్తాను. నువ్వు కాఫీ త్రాగుదువు గానీ వెళ్దాం” బలవంత పెట్టారు డా. మదన్ మోహన్.

“మీరు నిదానంగా చదవండి సార్. ఇంకో రోజు చర్చిద్దాం” అంది ప్రజ్ఞ.

“కొద్దిగా కూర్చో. కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి.” అంటూ లేచి ఆమె చెయ్యి పట్టుకున్నారాయన. కొంత ఇబ్బందిగా అనిపించినా “పర్సనల్ ఏమిటి సార్” అన్నది ప్రజ్ఞ.

“ముందుగా కూర్చోనైనా కూర్చో.” అంటూ అమె భుజం పైన చేయ్యి వేసి కూర్చో పెట్టారు.

తనకు నచ్చక పోయినా కూర్చుంది ప్రజ్ఞ.

ఒక పుస్తకాన్ని ఆమె చేతిలో పెడుతూ “ఇందులో ఒక చిన్న ఉత్తరం ఉంది. అందులో నా మనస్సులోని మాటలున్నాయి. నువ్వు చదవాలి. ఇది చాలా వ్యక్తిగత విషయం. నోటితో చెప్పలేను” అని చెప్పేసి గమ్మునయిపోయారు డా. మదన్ మోహన్.

పుస్తకం పేజీ తీసి, ఆ ఉత్తరం చదివింది ప్రజ్ఞ.

“ప్రజ్ఞా, నువ్వు శారీరికంగా కానీ, మనసారా కానీ సంపూర్ణమైన స్త్రీవి. నేను నీమీద మనసు పడ్డాను. నువ్వు నా ఊపిరిలో ఊపిరివవ్వాలి. నా జీవితానికి ఆలంబన కావాలి. నేను ఎల్లప్పటికీ నీ దాసాను దాసుడిని. – డా. మదన్ మోహన్.”

అందులోని ఒక్కొక్క అక్షరం కూడ నిప్పు రవ్వలా ప్రజ్ఞను దహించసాగింది. డా. మదన్ మోహన్ ఆమెను చదవనిచ్చే విధంగా తల వంచుకు కూర్చున్నారు. తన వ్యానిటీ బ్యాగ్ నుండి నీళ్ళ బాటిల్‌ని తీసి అందులోని నీళ్ళని నింపాదిగా గుటకరించి తనలోని కోపం కొంత నియంత్రణలోకి వచ్చిందని అనిపించాక

“ఇవి ఏ సినిమావో, నాటకానివో డైలాగుల మాదిరి ఉన్నాయి కదా సార్” అంది. ఆమె ప్రశ్న డా. మదన్ మోహన్‌ను తికమక పెట్టింది.

కానీ వెంటనే తమాయించుకుని “ఇవి నా హృదయం నుండి వచ్చిన మాటలు ప్రజ్ఞా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు టూ మచ్” అంటూ నిస్సంకోచంగా తమ అభిప్రాయాన్నితెలిపారు.

“ఏంటి సార్. మరీ కుర్రాడిలా మాట్లాడుతున్నారు? మీ వయస్సుకు, వ్యక్తిత్వానికీ శోభనిచ్చేవా సార్ ఈ మాటలు? సార్. మీ మీద నేను చాలా గౌరవం పెట్టుకుని ఇక్కడికి వచ్చాను. అక్షరం అంటే వెలుగు సార్. దాన్ని మీరు మాకు పంచుతారని మిమ్మల్ని నమ్ముకుని వచ్చే విద్యార్థులం మేమంతా. కానీ అక్షరాల్ని మీరు వ్యభిచారపు పనులకు ఉపయోగించుకోవడం అన్యాయం అనిపించట్లేదా సార్ మీకు? గురు శిష్యుల సంబంధం ఎంత పవిత్రమైంది మీకు తెలుసు కదా? దాన్ని మైల పరుస్తున్నారు మీరు. మీలాంటి అక్షరాలు తెలిసిన వారు రాక్షసులైతే, ఈ ప్రపంచం గతి ఏంటి సార్?” ప్రజ్ఞ మాటల్లో ఆక్రోశం లేదు, ఉత్త ఆవేదన కనిపించింది. ఆమె ఒక్కొక్క మాట కూడా పదునైన సూదిలా డా. మదన్ మోహన్ గుండెలో గుచ్చుకోసాగింది.

ప్రజ్ఞ దగ్గరనుండి ఇటువంటు ప్రతిక్రియను నిరీక్షించలేదాయన. ఇంతకు ముందు తన వద్ద రీసర్చ్ కని వచ్చిన రీటా, భామ లను కూడా ఆయన ఇలాంటి మాటలతోనే బుట్టలో వేసుకున్నారు. శాలిని, దుర్గ తమంతట తామే చనువు చూపించి, తన కోరిక తీర్చి డాక్టరేట్ తీసుకుని వెళ్ళారు. మోనికా విషయం సరే సరి. ఈ అమ్మాయి తనకు నీతి పాఠాలు చెబుతోంది! ఎక్కడ తప్పు జరిగింది? తన అంచనా తప్పేమో? లేదా ఈమె గాంభీర్యం, ధైర్యం ముందు తను దుర్బలుడయ్యాడా? డా. మదన్ మోహన్ తన ముందు ప్రశ్నలను పరచుకుని కూర్చున్నారు.

“అక్షరం రాక్షసంగా మారడం, తల్లిపాలే విషంగా మారడం ఒక్కటే సార్! నా దేహాన్ని భోగ వస్తువుగా ఎరవేసి పి.హెచ్.డి సర్టిఫికేట్ తీసుకోవాలసిన అవసరం లేదు సార్ నాకు. నేను డాక్టరేట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా బ్రతుకు నేను బ్రతకగలననే నమ్మకం ఉంది నాకు. మీ దగ్గరకు విద్యార్థి విద్యార్థినులు తమ సబ్జెక్ట్ లోని క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి వస్తారు. క్రొత్త విషయాల పరిశోధన కొరకు వస్తారు. మీ మార్గదర్శనం వారికొక ఆశ్రయం కల్పించాలి. శోధన అంటే శోషణ కాదు సార్. బ్రతుకుకొక అన్వేషణా మార్గం అంటారు. మీ వ్యసనాల గురించి ఇంతవరకూ విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను. మీరు నైతికంగా ఎంత దిగజారారు అనడానికి నా దగ్గర ఇప్పుడు సాక్షాలున్నాయి. వాటిని ఉపకులపతి గారికి, మాధ్యమాల వారికి ఇచ్చి, విద్యార్థులను గుమిగూడ్చి మిమ్మల్ని బజారుకీడ్చవచ్చు. కానీ మిమ్మల్ని అవమానించే, ప్రపాతానికి తోసే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే మీరొక మనిషి, పశువు కాదు. ఆత్మవిమర్శ చేసుకునే తెలివి మీ దగ్గర ఉంది. ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు సార్. ఎందుకంటే రేపటినుండి నేను ఇక్కడికి రాను. కానీ నా రిక్వెస్ట్ ఏమిటంటే పాపం, ఆ బసవణ్ణెప్ప, చెలువరాజులు కష్టాల్లో ఉన్నారు. వారిద్దరినీ ఒడ్డుకు వెయ్యండి.” అంటూ టేబల్ పైనున్న తన వ్రాతప్రతిని తీసుకుని వ్యానిటీ బ్యాగ్‌లో పెట్టుకుని బయలుదేరింది ప్రజ్ఞ.

మొహం చాటు చేసుకుని కూర్చున్న డా. మదన్ మోహన్ తటాలున లేచి, ఆమె ఎదురుగా వచ్చి నిల్చున్నారు. వణుకుతున్నారు ఆయన. మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా, ఆయన నోటినుంచి మాట రావడం లేదు. తన పదవిని, వ్యక్తిత్వాన్నీ మరచిపోయినట్టుగా ఆయన ప్రజ్ఞ పాదాలకు నమస్కరించారు. ఆమె వెంటనే “సార్. మీరు పెద్దవారు. ఇలా చేయరాదు” అంటూ తన పాదాలు వెనక్కు తీసుకుంది.

***

కన్నడ మూలం: అబ్బాస్ మేలినమని

తెలుగు అనువాదం: చందకచర్ల రమేశ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here